21, అక్టోబర్ 2025, మంగళవారం

సామాజిక సంబంధాల దృశ్యాలే జయంతి కథలు

~సామాజిక సంబంధాల దృశ్యాలే జయంతి కథలు ~ కథ కేవలం కాలక్షేపానికి చదువుకునేలా మాత్రం ఉండకూడదు. కథానిక పుట్టిన గతవందేళ్ళకాలంలో ప్రముఖులకథల్ని పరిశీలిస్తే సింహభాగం కథలన్నీ ఆయాకాలపు సమాజం యొక్క తీరుతెన్నుల్నీ, జీవనవిధానాల్నీ ప్రతిబింబించేవి గానే ఉన్నాయి. కాలక్రమేణా సమాజంలో వచ్చే మార్పుల్ని,ప్రజలజీవనవిధానాల్నీ,మనిషి మనస్తత్వంలో మారిపోతోన్న స్వార్థాన్నీ,అహంకారాల్నీ అన్నింటినీ ఆయాకాలాలలో వచ్చే సాహిత్యం ఎప్పటికప్పుడు ఒడిసి పట్టి చూపింది. జయంతి రాసిన అటువంటి కథలన్నీ ఎక్కువగా సంభాషణాత్మకంగానే నడుస్తాయి.కథాగమనంలో ఎక్కడా ఉపన్యాసాలు,నీతి బోధలు,సాగతీతలూ ఉండవు.తీసుకున్న అంశాన్ని చెప్పదలచుకున్న విధంగా సంభాషణలతోనే నడపటం వలన పాఠకులకు ఉత్సుకతతో సెలయేటి ప్రవాహంగా కథనం సాగుతుంది. ఒకప్పుడు కథకులు చాలా పెద్ద కథలు సుమారుగా పదిహేను పేజీలకు పైగా నవలికలే అనిపించేలా ఉండేవి.రానురాను పత్రికలు పెద్దకథలు ప్రచురించేందుకు ఇష్టపడక పోవటం,ప్రింటులో రెండు పేజీలు మించని కథల్ని ఆహ్వానించటం ,పదాల నియమం విధించటం వలన కథలపరిమాణం తగ్గిపోయింది. ఆ ప్రభావం జయంతి కథలపై కూడా పడింది. మంచి కథకు ఉండవలసిన లక్షణాలు క్లుప్తత, అనుభూతి ఐక్యత,సంఘర్షణ,నిర్మాణం సౌష్టవం అని నిర్వచించారు ప్రముఖ విమర్శకులు. ఇందులో కొన్ని కథలు కథాంశం రీత్యా పెద్దకాన్వాసు కలిగినవి.వాటిని కుదించే ప్రయత్నంలో అకస్మాత్తుగా దృశ్యం ,సంఘటన మారిపోవడం జరిగింది.ఒకచిన్న పరిధిలో జీవితాన్ని చిత్రించే క్రమంలో హటాత్తుగా పరిమితికి లోబడి కథను ముగించినట్లుగా కొన్ని కథలు ఉన్నాయి. సరోగసీ కథాంశంతో ఇటీవల చాలా కథలు వస్తున్నాయి.జయంతి రాసిన "మాతృస్పర్శ" కథాంశం పోలికతో సుమారు ఇరవై ఏళ్ళ క్రితం ఒక సినిమా కూడా వచ్చింది.అంతమాత్రాన ఇది కాపీ అనటానికి వీల్లేదు.జయంతి కథను ఎత్తుగడ దగ్గర నుంచి సమర్థవంతంగా తనదైన శైలితో కథ ఆసాంతం ఆర్ద్రంగా నడిపించి చివరకు ఆశావహ దృక్పథంతో ముగించడం అభినందనీయం. కథలు చాలా వరకూ గ్రామీణ ఉత్పత్తి కులాలకు చెందిన కథలు కావటం వలన వృత్తి పనులకు సంబంధించిన వివరాలను కథాక్రమంలో తెలియజేసింది రచయిత్రి. కొడిగట్టిన దీపం,కబ్జా కథలు రెండూ ఇంచుమించుగా కథాంశంతో సారూప్యంగా ఉండి కుటుంబసంబంధాలు ఏవిధంగా ఆర్ధిక ప్రాతిపదికన ఛిద్రమైపోతున్నయో దృశ్యమానం చేసాయి.ఈ రచయిత్రి చాలా కథల్లో మానవ సంబంధాలు విచ్చిన్నం కావటాన్నే అక్షరీకరించటం గమనార్హం. ఇద్దరు పిల్లలతల్లి శ్రీనిథి భర్త మరణానంతరం వ్యాపారాన్ని, పిల్లల్ని అభివృద్ధి లోకి తేవటానికి తన యవ్వన జీవితాన్ని వదులుకున్న శ్రీనిథికి పెద్ద చదువులలో ఉన్న పిల్లలు పెళ్ళి చేయాలనుకోవడం కథాంశం.కథగా చదవటానికి సరళ సంభాషణలతో హాయిగా ఉంది.అయితే నిజజీవితంలో అది ఎంతవరకూ ఆచరణ సాధ్యం అనిపించింది. వృద్ధాశ్రమం నేపథ్యంలో రాసిన మరో మార్గం,కరోనా సంక్షోభం నేపధ్యంలో రాసిన రెండు కథలు చక్కని సరళ సంభాషణలతో బాగున్నాయి. పేద కుటుంబాల్లో ఆడపిల్లలు చదువులు ఆగిపోవటం అనేది సర్వసాధారణం. ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేయాలనే కలని సాకారం చేసుకోవాలంటే వారికి బలమైన ఆకాంక్ష మాత్రమే వుంటే సరిపోదు.ఎటువంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకొని నిలవగలిగే ఆత్మస్థైర్యం కూడా వుండాలి.అదిగో అటువంటి ఆత్మస్థైర్యం గల నైమిష కథే నింగికి మొలిచిన రెక్కలు. ఇంచుమించుగా సందర్భాలూ,సన్నివేశాలూ వెరైటీగా జీవితంలో ఎదురీది అనుకున్న స్థాయికి వచ్చిన ప్రశాంతి ( ప్రశ్నాపత్రం),నవీన( తోడు వీడి వెళ్ళాక) పాత్రల్ని చిత్రించింది రచయిత్రి. నవలలుగా రాయదగినంత కథాంశాన్ని కుదించి రాసిన కథలు కొన్ని వున్నాయి అటువంటి వాటిలో ' ఎండమావి 'కథ వొకటి.రచయిత్రి వీలు వెంట తాను రాసిన కథనే తిరిగి రాసి నవలగా మార్చవచ్చును. మంచి కథాంశాల్ని స్వీకరించి అవసరమైన చోట్ల పాత్రకు అనుగుణమైన ప్రాంతీయభాషతో కూడిన సంభాషణలతో మంచి పఠనీయతతో కథల్ని రాస్తోంది జయంతి.చాలా కథల్లో సాధికారత కలిగిన స్త్రీ పాత్రలు కూడా వుండటం రచయిత్రి యొక్క అభ్యుదయభావాలు, దృక్కోణం వ్యక్తం అవుతున్నాయి. కథానిర్మాణంలో మరికాస్త జాగరూకత ఉండాలని నా భావన.అందుకు సమకాలీన కథాసాహిత్యాన్ని మాత్రమే కాక పాతతరం ప్రముఖుల రచనల్ని బాగా చదవాల్సిన అవసరం ఉంది. కథానిర్మాణంలో తనదైన గొంతు బలంగా రచయిత్రి వినిపించగల్గినప్పుడు ఆ కథ ప్రయోజనం సిద్ధిస్తుంది.చాలా కథల్లో జయంతి బలంగా చెప్పటం తెలుస్తోంది. మరిన్ని మంచి రచనలతో సంపుటాలు వెలువరించాలని అభిలషిస్తూ జయంతి వెలువరించిన కథాసంపుటి "శర్వమ్మ మరణం"కథాసంపుటిని నా మనసారా స్వాగతిస్తూ అభినందనలు తెలియజేస్తున్నాను.