2, ఏప్రిల్ 2025, బుధవారం

సమాజంలో కౌటుంబిక, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో సరళాదేవి రచనలు

కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంగా పి. సరళాదేవి 'సరళాదేవి రచనలలో ప్రత్యేకమైనదీ, తనదీ అనే దస్తకత్ ఉన్నది. నిండైన తెలుగుదనం ఉన్నది. అనుకరణ ఛాయలకు పోకుండా మౌలికంగా ఆలోచించి చిత్రీకరించే నేర్పు ఉన్నది. నిశితమైన పరిశీలనాసక్తి, కరుణామయమైన హృదయమూ ఉన్నాయి' అంటారు. 'కుంకుమరేఖలు' సంపుటికి రాసిన ముందుమాటలో గోరాశాస్త్రి. యాభయ్యవ దశకంలో సాహిత్యరంగంలోకి అడుగుపెట్టిన రచయిత్రులు కొద్దికాలం మాత్రమే రచనలు చేసి అస్త్ర సన్యాసం చేసినవాళ్ళుకొందరైతే తదనంతర నవలా ప్రభంజనంలో కొట్టుకుపోతూ కీర్తి, సంపదా లభించే ఆకర్షణలతో కథారచనను దూరంపెట్టినవాళ్ళూమరికొందరు. అతి తక్కువమంది ఒకటీ అరా నవలలు రాసినా కథారచనకే కట్టుబడినవారూ ఉన్నారు. అటువంటి వారిలో పి. సరళాదేవి ఒకరు. ఇతర ప్రక్రియలైన కవితలు కొన్ని రాసినా, రెండు నవలికలు రాసినా మూడు కథల పుస్తకాలతో కథారచయిత్రిగానే గుర్తింపబడ్డారు. 1936ఆగష్ట్ 6 వతేదిన విజయనగరంలో జన్మించింది సరళాదేవి.తండ్రి చిరుద్యోగి.అయిదుగురు తోబుట్టువులలో పెద్దదైన సరళాదేవికి స్కూల్ ఫైనల్ కాగానే మేనమామతో వివాహం జరిగింది.పెళ్ళిసమయంలో తలవంచుకుని కూర్చోలేదు నుండి అమ్మలక్కలు బుగ్గలు నొక్కుకోవటం,ఎత్తపొడవటం చూసి కొంత ఆవేశంతో మరింత ఆవేదనతో ఒక రచనగా రాసి ఆంధ్రప్రభ ప్రమదావనంకి పంపగా వెంటనే ప్రచురితమైంది. 1955లో ప్రజాతంత్ర పత్రికలో 'బావ చూపిన బ్రతుకుబాట' కథతో కథానగరంలోకి అడుగుపెట్టి, మాలతీచందూర్ ప్రోత్సాహంతో ప్రమదావనంలో రచనలు చేసారు. డా|| పి. శ్రీదేవి స్నేహప్రభావంతో తెలుగు స్వతంత్రలో 1955 నుండి 60 వరకూ విరివిగా కథలు రాసారు. ప్రముఖ పాత్రికేయుడు గోరాశాస్త్రి ముందుమాటతో తాను ఎంపిక చేసుకున్న కథల్ని 1962లో 'కుంకుమరేఖలు' పేరున సంపుటీకరించారు. మరికొన్ని కథల్ని 'సరళాదేవి కథలు' పేరుతో 1977లో మరొక సంపుటిని తన స్నేహితురాలు డా॥ పి. శ్రీదేవికి అంకితం యిస్తూ తీసుకువచ్చారు. సరళాదేవి మరణానంతరం ఆమె సోదరి ఆమెకు నివాళిగా, ఇంకా సంపుటీకరింపబడని కథల్ని 'మాకుగాదులు లేవు' పేరుతో ప్రచురించారు. కుంకుమరేఖలు సంపుటిలోని కథలు విజయవాడ ఆకాశవాణి ద్వారా ధారావాహికంగా ప్రసారం అయ్యి విశేషాదరణ పొందాయి. 1977లో 'యువ' మాసపత్రికలో 'కొమ్మా-రెమ్మా' పేరున నవలిక ప్రచురితం కాగా దానితోపాటు 'చిగురు' అనే నవలికని కలిపి పుస్తకంగా వెలువరించారు. 'కొమ్మా-బొమ్మా' నవలిక లో కథానాయిక మంగ పిచ్చివాడు ఐనా భర్త పారిపోగా బెంగతో జబ్బు పడి చనిపోయిన తల్లికి,అవకాశవాది అయినా తమ్ముడు,తనపై ఆధారపడిన అక్క పిల్లలు ఇన్ని ఆటుపోట్లు మధ్య ధైర్యంగా చదువుమొదలుపెట్టి టీచరుగా పనిచేస్తూ సహోద్యోగిని పెళ్ళి చేసుకుందామనుకునేసరికి ఆ పాత పిచ్చిభర్తని తీసుకుని ముసలామె రావటంతో మానసిక సంఘర్షణలో నిలదొక్కుకొని తన గమ్యం నిర్ణయించుకొంటుంది. యువ లోనే ప్రచురితమైన "చిగురు"నవలికలో పెద్ద పిల్లలిద్దరికీ పెళ్ళికి చేసిన అప్పులే తీర్చలేకపోతున్న తండ్రి మూడో కూతురు విమలను అయిదుగురు పిల్లలున్న జడపదార్థం లాంటి మూడో పెళ్ళి వాడికి కట్టబెడతాడు.పెద్దకొడుకు డాక్టరీచేసి వితంతువైన సహాధ్యాయిని చేసుకున్నా,అదుపు ఆడ్డూలేక పెద్దకూతురు ఎవరితోనో లేచిపోయినా పట్టించుకోని ఆ భర్తతో ఎలా కలిసి వుందో విమలపాత్రని చిత్రించారు రచయిత్రి. ఈ రెండు నవలలూ ఆనాటి కుటుంబ,ఆర్థిక పరిస్థితుల నేపధ్యంలో స్త్రీ జీవితాలగురించి, వైవాహిక బంధాలగురించి, మానవస్వభావాల గురించి మంచి విశ్లేషణలతో నడుస్తుంది.ఎటువంటి పరిస్థితుల్లోనైనా తట్టుకొని నిలబడేలాగే సరళాదేవి చిత్రించిన స్త్రీ పాత్రలు ఉండటం గమనార్హం. తెలుగు సామెతలు - సాంఘిక చరిత్ర అనే పుస్తకాన్ని 1986లో పరిశోధనాత్మకంగా రాసారు సరళాదేవి.ఇందులో అంశాల వారీగా తెలుగు వారి జీవన విధానములో ముడిపడిన అసంఖ్యాకమైన సామెతలను వివరించారు.మధ్యమధ్య వాటికి చెందిన పౌరాణిక,చారిత్రక అంశాలను కథాత్మకంగా చెప్పటంలో రచయిత్రి కథనశైలి వ్యక్తమౌతుంది. 1956 నుండి 1960 వరకూ స్వాతంత్య్రానంతరకాలం రెండో ప్రపంచ యుద్ధ ప్రభావంనుండి కోలుకోలేని ఆర్థిక సంక్షోభం, దుర్భిక్షం వంటి అనేకానేక కారణాల వలస - మధ్య తరగతి కుటుంబీకులలో ఇంటిపెద్ద మాత్రమే సంపాదించే చిరుద్యోగి కావడం, బహు కుటుంబీకులు కావటం కారణంగా - ఆడపిల్లలకు చదువు, పెళ్ళి వంటివి పెనుభారాలుగా మారాయి. కొద్దిపాటి చదువుకున్న ఆడపిల్లలు అప్పుడప్పుడే తమ గురించి ఆలోచించడం మొదలెట్టిన కాలం, మధ్యతరగతి కుటుంబాలలో అందులోనూ ఉత్పత్తి కులాలలోని ఆడపిల్లలకు -చదువు, ఉద్యోగం అందుబాటులోకి రాలేదు. వరకట్న సమస్య వలన వారి వివాహం పెనుభారంగా మారింది. దిగువ మధ్య తరగతి కుటుంబాలలో ఆడపిల్లలకు ఒంటినిండా బట్టా, తిండికికూడా కష్టమై వారు కోరుకున్న అతి చిన్న కోరికలుకూడా తీర్చుకోలేని పరిస్థితులు. బహుశా అందువలనేకావచ్చు సరళాదేవి కథలుకూడా చాలావరకూ ఆడపిల్లల పెళ్ళిళ్ళు, పెళ్ళిచూపులు, కుటుంబంలో ఆర్థిక పరిస్థితుల్ని పొడుపు మంత్రంతో సమతూకంచేసి ఒక ఒడ్డుకు తీసుకురావడానికి ఎన్నో ఆశలతో మెట్టినింట్లో అడుగుపెట్టిన ఆడపిల్లలు సతమతమవ్వటం వంటి కథాంశాలు కన్పిస్తాయి. 1962లో వచ్చిన మొదటి పుస్తకం కుంకుమరేఖలు'లోని కథలు రచయిత్రి పాతికేళ్ళలోపు వయసులోనే రాసినవి. అందుచేత అందులోని కథలు ఎక్కువగా ఆ వయస్సు మధ్యతరగతి ఆడపిల్లల ఆలోచనలు, ఆత్మాభిమానాలు, ఆశయాలూ, ఆదర్శాలతోసహా ఇంటిని ఉన్నదాంట్లో అప్పులపాలుకాకుండా ఎలా తీర్చిదిద్దు కోవాలనే తపన కొన్ని కథల్లో ఉంటాయి. ఇంటికి అవసరమైనవి సమకూర్చు కోవాలనుకునేవారికి అకస్మాత్తుగా వచ్చే బంధువులు, రోగాలు, రొస్టులూ, ప్రయాణాలు ఆ ఆశని ఆవిరిచేయడం, నిస్పృహతో బొక్కబోర్లాపడకుండా సర్దుకుపోవడం కొన్ని కథల్లో చూడొచ్చు. అయితే సరళాదేవి కథలు అంతటితో ఆగిపోవు. ప్రతిమెట్టుదగ్గరా ఆడపిల్లలు తమ అస్తిత్వం గురించి ఆలోచిస్తూ వెన్నెముక గల వ్యక్తిత్వంతో నిలబడతారు. బాల్యంలో పూలగౌను తండ్రి కొనితెస్తాడనీ, యవ్వనంలో పూలైనా కనీసం భర్త తీసుకొస్తాడేమోననీ, పిల్లలు పెరిగిన తర్వాత కూతురో, కొడుకో, అమ్మా నీకోసం కొన్నా'నని ఇస్తారని జీవితకాలం ఎదురుచూస్తూనే మరణానంతరం పైన కప్పటానికి కొత్తబట్ట తేవడానికి కొడుకు ముందుకొస్తే పరికించలేని అనంతలోకాలకి వెళ్ళిపోయిన దుర్గ కథ 'ఎదురుచూసిన ముహూర్తం'. ఉద్యోగిని అయినప్పుడుకూడా తనకోసం తాను కొనుక్కోలేకపోయిన పరిస్థితులు ఆమెని చుట్టుముడతాయి. బాల్యంలో ఆర్థికాంశాలు తోడైతే, తర్వాత ప్రేమరాహిత్యంతో దుర్గ నిస్పృహతో ముడిపడడం ఈ కథానేపథ్యం. తనవారని అనుకున్నవారు 'నీకోసం తెచ్చాను' అని ఏ చిన్న వస్తువును తెచ్చినా సున్నిత మనస్కురాలైనా స్త్రీ హృదయం ఉప్పొంగిపోతుందనే విషయాన్ని పురుషులే కాదు, తోటి స్త్రీలుకూడా గుర్తించరు. చిన్న విషయంగా అనిపించే పెద్ద విషయాన్ని కథగా మలచటంలో రచయిత్రి చూపిన శిల్పవిన్యాసం పాఠకులను ఆకర్షిస్తుంది. బహుశా అందుకనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కౌమారదశ అంచుల్లో ఉన్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్యాంశంగా ఎంపికచేశారు ఈ కథని. పిల్లల్ని కనటం, పెంచటం తల్లిదండ్రుల బాధ్యత అనీ, పిల్లలు కన్నవాళ్ళ రుణం తీర్చుకోకతప్పదనీ భారతీయ సనాతన ధర్మాలన్నీ ఘోషిస్తుంటాయి. అయితే పిల్లలు తమని కనమని అడగరు, కన్నందుకు పెంచకా తప్పదు. అది బాధ్యత కన్నా తమని వృద్ధాప్యంలో ఆదుకుంటారనే ఆశిస్తారు తల్లిదండ్రులు. పిల్లలకూ, తల్లిదండ్రులకూ, భార్యాభర్తలకూ, అన్నాచెల్లెళ్ళకూ, అక్కాచెల్లెళ్ళకూ, అన్నాతమ్ములకూ మధ్యన ఉన్నది ప్రధానంగా ఆర్థిక సంబంధమే అనేది తెలిసినా ఆ విషయాన్ని బయటపెట్టరు. మానవ సంబంధాలలోని లొసుగులు ఆర్థిక పరమైన విషయాలలోనే బైటపడతాయని చెప్పిన కథ 'వాడికొమ్ములు' (1977). ఇటువంటి అంశాన్ని తీసుకుని రచన చేయడం సాహసమే. 'మొగుడు కావాలా కొడుకు కావాలా అన్న ప్రశ్నని అనేక సినిమాల్లోనూ,పుస్తకాల్లోనూ చూపించి, ఆడది మొగుడ్ని ఎంచుకుంటే ఆదర్శ మహిళత్వమని పొగిడి చప్పట్లు కొడతారు. అదే మగవాడి జీవితంలో తల్లి ఎక్కువా, భార్య ఎక్కువా అనే ప్రశ్నకి భార్య ఎక్కువని ఎంచుకుంటే చప్పట్లు కొట్టరెందుకు?" అంటూ సూటి ప్రశ్నని పాఠకులకు సంధిస్తారు. రచయిత్రి. కొడుకు పెళ్ళి జరిగాక అత్తాకోడళ్ళ మధ్య సయోధ్య కుదరకపోవటానికి మూలకారణం ఈ ప్రశ్నల గురించి ఆలోచించినవాళ్ళకి అర్ధమవుతుంది. దాంపత్య సంబంధాలలోని విచ్ఛిన్నతకు అవకాశం ఉన్న అనేక సమస్యలన్నీ రచయిత్రి తన కథలలో ఎత్తిచూపారు. స్త్రీలకూ, పురుషులకూ సమాజం విధించిన వేర్వేరు లక్షణాలనూ, విధి విధానాలనూ చూపిన రచయిత్రి, వాటివలన వస్తోన్న వివిధ సంఘర్షణలను గ్రహించటం వలన, వాటినే తన కథాంశాలుగా తీసుకుని రాశారు. ముఖ్యంగా చాలా కథలు దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి కుటుంబాల జీవన వైవిధ్యాల్ని ఆనాటి జీవన శైలితో ముడిపెట్టి సరళ సమ్మోహనమైన కథన శిల్పాన్ని ఎంచుకుని కథలు అల్లారు. మూడు పాత్రల స్వగతంగా చెప్పిన కథ 'పేచీ' ఒక మధ్య తరగతి ఆడపిల్ల వివాహం ఆర్థికాంశాలతో ముడిపడి తండ్రీ, భర్తల మధ్య ఎంతగా నలిగిపోయేలా చేస్తుందో తెలుపుతుంది యీ కథ. 'పెళ్ళైన మర్నాడు శాంత వ్యక్తురాలయ్యింది, శారీరకంగా కాదు మానసికంగా, అన్నమాటతో 'స్త్రీ' కథను మొదలుపెట్టి పాఠకుల్ని కథలోకి లాక్కెళ్ళిపోతుంది రచయిత్రి. శాంతకొడుక్కి పెళ్ళయిన మర్నాడు 'శాంత చచ్చిపోయింది, శారీరకంగా కాదు మానసికంగా' అంటూ కథ ముగించటంలో సరళాదేవి కథన విన్యాసం తారాస్థాయికి చేరిందనిపిస్తుంది. ఈ రెండు వాక్యాల నడుమ నడిచిన కథ ఏమిటనేది నిజానికి వివరించి చెప్పకపోయినా ఫర్వాలేదు. మందబుద్ధి అయిన కొడుకును శాంతకు ఇచ్చి పెళ్ళి చేసిన అత్త 'శారీరక సుఖం కోసం నీ ఏర్పాటు నువ్వు చేసుకోవచ్చు' అని సలహా ఇస్తుంది. 'అటువంటి భర్తని మగవాడిని చేసింది శాంత' అంటారు రచయిత్రి. ఇంతకన్నా విడమరిచి చెప్పక్కర్లేదు. తన నేర్పరితనంతోనే పిల్లల్ని కనిపెంచినప్పుడు 'శాంత మాతృమూర్తి అయ్యింది' అంటారు. కథని ఎంతవరకూ చెప్పాలో ఎక్కడ ఆపాలో తెలిసిన రచయిత్రి యీమె. 1957లోనే రాసిన 'గతాగతాలు', 'వక్రించిన కీర్తికాంక్ష' ఇంచుమించుగా ఒకే రకం అంశంతో ఒకదాని సీక్వెల్ ఇంకొకటిగా అనిపిస్తాయి. కొత్తకాపురం పెట్టిన దయపతులు తన ఇంటిచుట్టుపకులు వాళ్ళంతా అంతకుముందు ఆ యింట్లో ఉన్న యిల్లాలు మంచితనం వేనోళ్ళ కీర్తించటాన్ని చూసి, తానుకూడా అలాగే ఉండి మంచిది అనిపించుకోవాలేమో అనే సందిగ్ధంలో పడుతుంది కథానాయిక. రెండో కథలో వాళ్ళింట్లోని బావిలోని నీళ్ళని తొడుకొని పక్కబస్తీవాళ్ళంతా వెళ్తుంటారు.తమ పక్కింటామె బతిమాలించుకొని రెండురోజులకొకసారి, ఉదారంగా ఇచ్చినట్లుగా నీళ్ళని తోడుకోనిస్తుంది. అయినా ఆపక్కింటామెని వాళ్ళంతా పొగుడుతారేమిటనే అర్థంకాని సందిగ్ధత మరో ఇల్లాలికి. మానవ స్వభావాలలోని విభిన్న కోణాల్ని దర్శింపజేసే కథలు ఇవి. 1977లో ప్రచురితమైన 'సరళాదేవి కథలు' సంపుటిలోని కథానాయికలు పరిణతి పొందిన యువతులు. 'మర్రిచెట్టునీడలో' (1969)లో అయిదుగురు అక్కల తర్వాత పుట్టిన వెంకటేశ్వర్లు తల్లీ అక్కల అపేక్షతో ముద్దుగా పెరిగి తనకేం కావాలో కూడా ఆలోచించనివాడు. అటువంటి కుటుంబంలోకి కోడలుగా వచ్చిన పద్మకి, భర్త మర్రిచెట్టు నీడలో పెరిగిన గడ్డిచెట్టుగా కనిపించటమేకాక క్రమేణా తాను కూడా మరో గడ్డిమొక్కగా మారుతున్నానని తెలుసుకుంటుంది. పద్మ సాహచర్యంతో నీడలో ఉన్నంతకాలం ఎదగలేమని తెలుసుకున్న వెంకటేశ్వర్లు ట్రాన్సఫర్కి పెట్టుకోవటంతో కథ ముగుస్తుంది. కథ ఇంతేనా అనుకుంటే అంతే, కానీ కథలో ఉన్న పాత్రల స్వభావం, యుక్తాయుక్త విచక్షణతో ప్రవర్తించే పాత్రల తీరును అర్థం చేసుకున్నప్పుడు సమాజంలోని కుటుంబ కలహాలకు కారణాలు అవగతమవుతాయి.తరతరాలుగా పిల్లల్ని తప్పనిసరిగా సవతితల్లి ప్రేమించదు అనేది జానపద కథల దగ్గరనుండి సామాజిక సాహిత్యంవరకూ శిలాక్షరాలుగా ఉన్నాయి. పుట్టింట్లో తనకంటూ అస్తిత్వం లేకుండా బతికిన కమల నలుగురు పిల్లలున్న వాడిని పెళ్ళిచేసుకుని పిల్లల్ని ప్రేమించి, కుటుంబాన్ని తనకంటూ ఒక ప్రేమైక ప్రపంచంగా చేసుకున్నా, చుట్టూ వున్న సమాజం విషబిందువుల్ని చిలికించి ఆమెకూడా సవతితల్లిగా మారిపోయే పరిస్థితుల్ని కల్పించటాన్ని 'పిన్నిప్రేమ' (1957)గా కథ రూపెత్తింది. ఈ రచయిత్రి రచనలలో పాత్రల్ని దుర్మార్గులుగా చిత్రించరు. అలా అని మంచివాళ్ళనీ చెప్పలేదు. నిత్య జీవితంలో మన చుట్టూ ఉన్న సామాన్య వ్యక్తుల మధ్య, విభిన్న మనస్తత్వాలు, మనోభావనలు కలిగిన మనుషుల మధ్య యువతులు అధైర్యపడి కుమిలిపోక కుటుంబంలోని సమస్యల చిక్కుముళ్ళని చాకచక్యంగా, తెలివిగా, సున్నితంగా మానవ సంబంధాలను తెగిపోకుండా విప్పుకోవటం ఎలాగో ఈ కథలు తెలుపుతాయి. సమాజంలో స్త్రీ పురుషుల మధ్య సాంఘిక జీవితం విధించిన వివక్షతలను అర్థంచేసుకుని ఒక కొత్త ఆలోచనావిధానాన్ని ప్రదర్శిస్తూ ఒక కొత్త చూపుని ఈ కథలు పాఠకులకు అందిస్తాయి. సరళాదేవి రచనలు అతిసామాన్యంగా, మామూలుగా, నిరాడంబరంగా చెప్పుకుపోతున్నట్లే ఉంటాయి. సంభాషణలు మన ఇళ్ళల్లోనో, మన చుట్టూ వున్నవారి మాటల్లాగానో పొరుగింట్లో జరిగిన సంఘటనల్లాగానో ఉంటాయి. కానీ కథల్ని లోతుగా పరిశీలించి చదివితే కథలోని అంతరార్ధం అవగాహనకు వచ్చి, రచయిత్రి రచనలోని లోతులు పాఠకులకు అర్థమవుతాయి. అందుచేత రచయిత్రి కథలు ఎంత సమకాలీనంగా ఉన్నాయో తెలుస్తుంది. బియ్యే చదువుకున్న విద్యావతి తన భర్త చేత తన్నులుతింటూ బతుకుతుంది కానీ విడాకులు తీసుకుని మళ్ళీ పెళ్ళి చేసుకో అంటే- 'విడాకులు ఇస్తే జామ్మని ఖుషీ చేస్తాడు. కలలోనైనా తలవడు, కానీ నేనుమాత్రం అవస్థలు పడాలా? ఎక్కడో ఎందుకు ఆ పడేదేదో ఇక్కడే పడతాను. పెళ్ళంటే బొమ్మలాటా....." అని ఆవేశపడుతుంది 'భిన్నత్వం ఏకత్వం' కథలో జమున. అదే కథలో పల్లెటూరి దిగువ తరగతికి చెందిన అమ్మాయి తన భర్తతో నానా చావుదెబ్బలు తింటుంది. శిశు సంక్షేమశాఖలో ఉపాధి కల్పిస్తాం అని చెప్పినా భర్తని విడిచిపెట్టదు. ఇలా రెండు వర్గాల స్త్రీలను సాదృశ్యంగా చూపుతూ 'ఈ నిర్ణయంతో వీళ్ళు సాధించేదేమిటి? వీళ్ళ ప్రయాణం ఏ దిక్కుకి?' అని ప్రశ్నిస్తూ ప్రశ్నలతోనే నాటి సమాజంలో స్త్రీ పురుష జీవన వైరుధ్యాన్ని సమాధానంగా చూపిస్తారు. రచయిత్రి. కట్నం పుచ్చుకునేవారిని పెళ్ళిచేసుకోనని ప్రతిజ్ఞ చేసి సాధించిన అమ్మాయి కథ ప్రచురించిన పత్రికను మరదలికి అందుబాటులో ఉంచి, ఆమెను జాగృత పరచిన వదిన 'సూత్రకారి'(1958)గా మారుతుంది. మరదలు వసుంధరకు కట్నం తీసుకొని వరుడిని సాధిస్తుంది. పెళ్ళిచూపుల పేరుతో ఆడపిల్లని శల్యపరీక్ష చేయటం తమ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ ఆడపిల్ల అందచందాల్ని, రంగుని, అవకారాలనీ ఎత్తిచూపటం వంటి వాటిని రెండు మూడు కథలలో నిరసిస్తూ తీవ్రంగా ఖండిస్తుంది రచయిత్రి.జీవనస్రవంతి విధానంలో బస్సు ఎక్కిన దగ్గరనుండి తిరిగి దిగేవరకూ డ్రైవరు, కండక్టర్, యువకుడు సంభాషణతో కథంతా నడుస్తుంది. యువకుడి పెళ్ళి సంబంధాల గురించి జరిగిన ఆ సంభాషణలో వివాహ వ్యవస్థ, పెళ్ళిచూపుల ప్రహసనాలూ, ఆడపిల్లలకు పెళ్ళిపట్ల గల మనోభావాలు, యువకుల దృక్కోణాలూ అన్నిటినీ ఇతర ప్రయాణీకులైన ముసలివాళ్ళ మాటల్లో వ్యక్తమయ్యే తరాల అంతరాలూ అన్నింటినీ చర్చకు పెడుతూ నడిచిన 'కళ్యాణ కింకిణి' (1956) కథ అరవై ఏళ్ళ కిందటి వివాహ వ్యవస్థకి సంపూర్ణ నిర్వచనంలా రచించింది సరళాదేవి. చలం, కుటుంబరావుల రచనలను అమితంగా ఇష్టపడే సరళాదేవి, తన కథలలో ఎవరినీ అనుసరించకుండా, తనకంటూ ఒక ప్రత్యేక ముద్రని ఏర్పరచుకుంది. ఏ విషయానికైనా, ఏ సమస్యకైనా మౌలికాంశం ఏమిటన్నది ఆలోచించి ఆ దృశ్యకోణంలోనే కథలను అల్లగలిగే నేర్పును సాధించటమే కాకుండా, అతి సాధారణమైన అచ్చతెనుగు నుడికారంతో కూడిన సంభాషణలతో కథలను రాయటం సరళాదేవి ప్రత్యేకత. అతి సామాన్యమైన కుటుంబ కథే అనిపించే వాటిలోకూడా కుటుంబ ఆవరణను, పరిస్థితులనూ, పాత్రల మనస్తత్వాలనూ నిశితంగా గమనించే పరిశీలనాశక్తి ఈ రచయిత్రి స్వంతం. ఏ రచయితకైనా తాను సృష్టించిన ఎటువంటి పాత్రమీద అయినా అసహనం, ద్వేషం ఉండదు. అంతేగాక ఆ పాత్ర ఎటువంటిదైనా సానుభూతి ఉంటుంది. సమాజంలో కనిపించే అహంకారాలూ, అల్పత్వాలూ, అభిమానాలూ,కుత్సితాలూ లాంటి వివిధ రకాల మానవ దౌర్బల్యాలు సంయమనంతో పరిశీలించటం, కథానుగుణంగా ఆయా పాత్రల ప్రవర్తనలనూ, మనోభావాలనూ కథలలో ప్రస్ఫుటించే దశలోకూడా కరుణార్ధ పూరితంగానే పాత్రలను చిత్రీకరించింది సరళాదేవి. నిజానికి సరళాదేవి కథలలోని పురుష పాత్రలు ఏవీ దుర్మార్గులుగానో, స్త్రీలను అన్యాయం చేసేవారిగానో కనిపించరు. కానీ వివాహ పూర్వవ్యవస్థని కానీ, వివాహ వ్యవస్థని కానీ, కుటుంబ వ్యవస్థనిగానీ కథనం చేసే క్రమంలో స్త్రీలకు ప్రస్ఫుటంగా కనిపించేరీతిలోనే జీవన విధ్వంసంగా లోలోపల జరిగే అన్యాయాలు తెలుస్తుంటాయి. కొన్నింటిలో స్త్రీలు పరిస్థితులకు తలవంచి సర్దుకుపోవటం కనిపిస్తుంది. మరికొన్నింటిలో అమ్మాయిలు తమకు జరుగుతున్న వివక్షతను గ్రహించి ప్రశ్నించి దానిని తెలివిగా సరిచేసుకునే ప్రయత్నంలో సఫలం కావటం ఉంటుంది. జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలకు ఆశ్చర్యపడుతూ, ఒక్కొక్కసారి చిన్నబుచ్చుకుంటూ, ఆవేశపడ్తూ, అయోమయపడుతూ ఉన్న కథానాయికలు తమ అస్థిత్వం నిలుపుకుంటూనే, తమ సమస్యలకు తామే పరిష్కారం దొరకబుచ్చుకుని తమని తాము పునర్నిర్మించుకోవాల్సిన అవసరం తెలుసుకుని, చుట్టూ ఉన్నవారిని నొప్పించకుండా, తాను నొచ్చుకునే పరిస్థితి తెచ్చుకోకుండా ధృఢమైన వ్యక్తిత్వాన్ని సాధించే కథానాయికలుగా 'తొణికిన స్వప్నం'లో కమలం, 'పురుషుడు'లో కృష్ణకుమారి, 'మర్రిచెట్టు నీడ'లో పద్మ, 'కుంకుమరేఖలు' హేమలత, 'తిరిగిన మలుపు'లో జానకి, 'ఇల్లూ ఇల్లాలు'లో శకుంతలా- ఇలా చాలామంది కథలలో, పాఠకులకు పరిచయం అవుతారు. వీరి సమస్యలు వేర్వేరు కావచ్చు. కాని సునిశితంగా, చాకచక్యంగా దిద్దుకునే నేర్పుని ఈ పాత్రలలో మనం చూడవచ్చు. ఇది రచయిత్రి నైపుణ్యానికి నిదర్శనం. అంతకుముందు రాసిన కథలకు భిన్నంగా జీవితానుభవంతో మారిన దృక్పథంతో రాసిన కొన్ని కథలనుకూడా పరిశీలించాల్సి ఉంది. పదవీ విరమణ అనంతరం జీవితం ముగిసిపోయినట్లే అని భావించే భార్యాభర్తలు రామయ్యా, సుందరమ్మల కథ 'నిండా తొంభై ఏళ్ళు బ్రతుకు'.చక్కటి నిర్వచనాలు కథాసందర్భంలో ఆకట్టుకుంటాయి. 'మన వివాహ వ్యవస్థలో పెళ్ళికూతురు ఎంత బొమ్మో పెళ్ళి కొడుకూ అంతే బొమ్మ' అని భిన్నత్వంలో ఏకత్వం కథలో; 'అవమానాలన్నీ ఆడవాళ్ళు ఆవలింతలుగా తీసుకోవాలా' అని దుర్బలుడి వాగ్దానం కథలో, 'ఏ జీవజాలంలోనూ లేని ఆర్థికబంధం, సేవాబంధం, త్యాగబంధం మనుషుల జీవితానందాన్ని తినేస్తుంది అని. వాడి కొమ్ములు కథలో ఆలోచింపజేస్తాయి. "మాకుగాదులులేవు" కథలో పుట్టినరోజు గురించి టీచర్ వ్యాసం రాయమంటే పుట్టినరోజు పండుగని ఎరుగని ఒక పేద విద్యార్థి రాసిన కన్నీటి గాథను చదివి టీచర్ చలించిపోతుంది.ఈ కథని 2024 నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొమ్మిదవ తరగతి తెలుగు వాచకంలో పాఠ్యాంశంగా చేర్చారు. 1956లో డా.పి.శ్రీదేవి రాసిన కాలాతీతవ్యక్తులు తెలుగు స్వతంత్ర లో ధారావాహికంగా వచ్చినప్పుడు సరళాదేవి చదివి ప్రభావితురాలై " కాలాతీత వ్యక్తులు - ఒక ప్రసక్తి" అని సరళాదేవి రాసిన సుదీర్ఘ సమీక్ష ఆ వెంటనే స్వతంత్ర లో ప్రచురితమైంది.కాలాతీతవ్యక్తులు నవలను అనేకసార్లు ముద్రించిన ఎమెస్కో సంస్థ ప్రతిసారీ సరళాదేవి రాసిన ఈ సమీక్ష ను ముందుమాటగా వేస్తోంది. సరళాదేవి రాసిన వ్యాసాలు,కొన్ని కవితలూ స్వతంత్రలో ప్రచురితమయ్యాయి. అందుకే గోరాశాస్త్రి "మొదటిది రచయిత్రి సంస్కృతి, వ్యుత్పత్తి, రెండవది భాషపై వున్న అమోఘమైన స్వాధీనం, మూడవది నిశితమైన మానవ మనస్తత్వ పరిశీలన ముప్పేట జడవలె సమన్వయపరుచుకుని రచనలను అందిస్తున్న సరళాదేవిని అభినందిస్తున్నాను' అంటారు వివాహ వ్యవస్థ స్త్రీ జీవితంతో ఎలా ఆడుకుంటుందో చూపటమే లక్ష్యంగా, స్త్రీ జీవితంలోని ఇతర పార్శ్వాలనుకూడా చిత్రించే సరళాదేవి మరిన్ని రచనలు చేసి వుంటే బాగుండేదని ప్రశంసించారు మృణాళిని. అనేక కారణాలతో 1980 తర్వాత పూర్తిగా సాహిత్యానికి దూరమైనా సాహిత్య చరిత్రలో తనకంటూ ప్రత్యేక ముద్రను సాధించిన రచయిత్రి పి.సరళాదేవి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి