8, సెప్టెంబర్ 2024, ఆదివారం
నడక దారిలో -44
నడక దారిలో -44
వేసవి సెలవుల్లోనే వీర్రాజుగారి అరవయ్యేళ్ళ పుట్టిన రోజు వచ్చింది.అప్పటికి నాకు ఆపరేషన్ అయ్యి నెల కూడా దాటలేదు.అందుకని హడావుడి ఏమీ చేయకుండా వీర్రాజుగారి బాల్యమిత్రుడు సత్యనారాయణగారి కుటుంబం,కుటుంబమిత్రులు శంకరంగారి కుటుంబం, వీర్రాజుగారి తమ్ముళ్ళ కుటుంబాల్ని సాయంత్రం పిలిచి ఉపాహారాలతో జరిపాం.పక్కింటిలోని పోలాప్రగడ దంపతులు కూడా వచ్చారు.అంతకుముందు ప్రక్కఇంటిలో వుండే విఠల్ రావుగారి కుటుంబం వచ్చారు వాళ్ళ అబ్బాయి రఘు కేక్ తీసుకొచ్చి వీర్రాజుగారిచే కట్ చేయించాడు.పల్లవి అట్ట మీద 60 అనే సంఖ్యని ఎంబ్రాయిడరీ తో ఫోటో ఫ్రేమ్ చేసి మా ఫొటోలను అందులో పెట్టి పోష్టు ద్వారా పంపింది.వీర్రాజుగారు అది చూసి మురిసిపోయి అందరికీ చూపించేవారు.
మా పెద్దక్కకు ఈ మధ్య ఒంట్లో బాగుండటం లేదని తెలిసింది.నేను కొంత కంగారు పడ్డాను.విజయనగరం వెళ్తే బాగుణ్ణు అని అనుకున్నాను.కానీ చిన్నక్క తనఉత్తరంలో 'వైద్యం మొదలైందని కాస్త నెమ్మదిగా ఆరోగ్యం కుదుట పడుతోంద'ని రాసాక మరి ఆలోచన మానుకున్నాను.
స్కూల్ తెరిచే నాటికి ఆపరేషనై మూడు నెలలు దాటటంతో కొంత కోలుకున్నాను.మళ్ళా పనుల్లో పడ్డాను.
పెద్దమరిది చనిపోయాక ఆ కుటుంబ బాధ్యతలు నాకు మరీ పెరిగాయి.పెద్దమ్మాయి ఏదో ప్రైవేటు ఉద్యోగం చేస్తుంది.సర్వే ఆఫ్ ఇండియాలో సర్వీసులో వుండగానే అతను పోయినందుకు కారుణ్య నియామకంగా ఆ అమ్మాయికి అందులో ఉద్యోగం కోసం అందులో పనిచేస్తున్న తెలిసిన వారికి చెప్పాము.రెండో అమ్మాయి ఇంటర్ పూర్తిచేసి మా స్కూల్ కి దగ్గరగా విద్యానగర్ లోని ప్రైవేటు డిగ్రీ కాలేజీలో చేరింది.ప్రతీ నెలా నేను వెళ్ళి ఫీజు కట్టి వచ్చేదాన్ని.
ఇక రాజకీయాలు దగ్గరకు వస్తే--
ఈసారి 1998లో లోక్‌సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఇతరపార్టీలతో కల్సి జాతీయ ప్రజాతంత్ర కూటమి (NDA)గా అటల్ బిహారీ వాజపేయి ప్రధాన మంత్రిగా ఉంటున్నప్పుడే జయలలిత ఎన్.డి.ఏ.కి మద్దతును ఉపసంహరించుకోవటంతో లోక్‌సభలో వాజ్‌పేయి ప్రభుత్వం ఒకే ఒక్క ఓటు తేడాతో ఆశ్చర్యకరంగా విశ్వాసం కోల్పోయి ప్రభుత్వం కుప్పకూలింది.
కానీ కేంద్రంలో భాజపా ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన మరో సంచలనఆవిష్కరణగా చెప్పుకోవాల్సిన విశేషం 1998లో రాజస్థాన్ లోని పోఖ్రాన్లో 5 అణుపరీక్షలు జరిపి భారతదేశానికి అనధికార అణు హోదా ప్రతిపత్తిని కల్పించటం. అంతేకాకుండా కార్గిల్ పోరాటంలో పాకిస్తాన్ పై పైచేయి సాధించింది. మంచుపర్వతాలలో కూడా శక్తివంచన లేకుండా పోరాడే శక్తి భారత్ కు ఉందని నిరూపించింది. ఇవన్నీ అప్పటి వాజ్ పేయి ప్రభుత్వానికి కలిసివచ్చిన సంఘటనలే అని చెప్పాలి.
అయినా1999 లో తిరిగి ఎన్.డి.ఏ. కూటమి తిరిగి గెలవటంతో వాజ్‌పేయి ముచ్చటగా మూడో సారి ప్రధాన మంత్రి అయ్యారు. ఈ సారి మాత్రం ఎన్.డి.ఏ. సంకీర్ణ ప్రభుత్వం పూర్తి కాలం అధికారంలో కొనసాగింది.
మా కుటుంబమిత్రులు కె.కె.మీనన్ గారు సరోగసీ అంశంతో చాలా పరిశోధనాత్మకంగా రాసిన క్రతువు నవల పుస్తకంగా ప్రచురించారు.దానిని తన స్వంత వూరు రామరాజులంక గ్రామంలో ఆవిష్కరణ చేయతలపెట్టారు.ఆ సభలో పాల్గొనటానికి జ్వాలాముఖిగారూ,నాళేశ్వరం శంకరంగారూ, వీర్రాజుగారూ,నేనూ, మీనన్ గారితో పాటూ బయలుదేరాం.రైలు ఎక్కి సఖినేటిపల్లి లో దిగి అక్కడి పడవ ఎక్కి ఆ గ్రామం చేరాము.ఆ రోజే పుస్తకావిష్కరణ జరిగింది.జ్వాలాముఖిగారూ,శంకరంగారూ క్రతువు పుస్తకం గురించి కూలంకుషంగా జనరంజకంగా ప్రసంగించారు.వీర్రాజుగారు ఆవిష్కర్త కనుక ఎప్పటిలాగే మాట్లాడారు.ఆ కార్యక్రమం అనంతరం బస్సెక్కి శంకరగుప్తం బయలుదేరాం.శంకరగుప్తంలో కథక్ మిత్ర పేరుతో కథలు రాసే వేమూరి నరసింహారావుగారి ఇల్లు చేరేసరికే సాయంత్రం అయ్యింది.వేమూరి నరసింహారావుగారి శ్రీమతి ప్రేమతో తయారుచేసిన స్వీటు,మసాలా కాజూ తిని లంకలోనితోటలూచూడటానికీ, తర్వాత సముద్రంవొడ్డుకీ బయలుదేరాం.
లంకగ్రామమైన శంకరగుప్తం ఇరవై ఏళ్ళక్రితం నా వివాహం అయిన కొత్తలో అన్ని రకాల ప్రయాణసాధనాలు ఎక్కి వెళ్ళాల్సి వచ్చింది.ఇప్పుడు ONGC కోసం కొత్తగా తోటలమధ్య తారు రోడ్డు పడింది. కరెంట్ కూడా వచ్చింది.వూరుకూడా మార్పు చెందింది.పొలాలన్నీ చేపల చెరువులు అయిపోయాయి.సముద్రం ఒడ్డుకు వెళ్ళేసరికి ఎక్కడా కూర్చునేందుకు వీలులేకుండా అపరిశుభ్రంగా వుంది.భరించలేని కంపు.అసంతృప్తిగా ఇక ఇంటికి తిరుగుముఖం పట్టాం.
రాత్రి జీడిపప్పు కూర మొదలైన వాటితో మంచిభోజనం చేసి,కాసేపు కబుర్లు చెప్పుకున్నాక మేమంతా కొబ్బరి చెట్లు కిందనే హాయిగా పడుకుంటాం అని అంటే మడత మంచాలు వేసారు.
అయితే శంకరం తప్ప జ్వాలాముఖిగారూ,మీనన్ గారూ ,మేమిద్దరం దోమలకీ,వేడికీ రాత్రంతా జాగారం చేసాం.రెండ్రోజులు ఉందామనుకున్నవాళ్ళం కాస్తా మధ్యాహ్నం భోజనం కాగానే కొవ్వూరులో వున్న మా అక్క కూతురు శ్రీదేవి ఇంటికి హూటాహుటిని బయలుదేరి వెళ్ళిపోయాము.రాత్రిభోజనంచేసి కూలర్,ఫేనూ ఉండేసరికి అందరం మత్తుగా నిద్ర పోయాము.నగరసౌకర్యాలకు మేము ఎంత అలవాటు పడిపోయామో అర్థం అయ్యింది.
ఈ అనుభవం ఆధారంగా అక్కడినుండి వచ్చిన వెంటనే " మార్పు వెనుక మనిషి" కథ రాసాను.ఈకథ బ్రౌన్ అకాడమి వాళ్ళు నిర్వహించిన కథల పోటీలో బహుమతి పొందింది. ఆ కథకి ఇంగ్లీషులో కూడా అనువాదం జరిగి సంకలనంలో చేరింది.బ్రౌన్ అకాడమీ వాళ్ళుకూడా బహుమతి కథలు పేరిట సంకలనంగా వేసారు.
ఇంకో విశేషం ఏమంటే తిరుపతి వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ మొదటి సెమిస్టర్ తెలుగులో మార్పు వెనుక మనిషి కథని పాఠ్యాంశంగా చేర్చారు.
నా అయిదో కవితా సంపుటి ఒప్పులకుప్ప పుస్తకం ఆ ఏడాది ప్రచురించాము.నిర్మలానందగారి అధ్యక్షతన, కాత్యాయనీ విద్మహేగారు వక్తగా పుస్తక పరిచయం చేసేలా పుస్తకావిష్కరణ ఏర్పాటు చేసాము. అమ్మాయి పల్లవి ఇక్కడ ఉంటుండగానే పుస్తకావిష్కరణ జరిగింది.కాత్యాయనీ విద్మహే పుస్తకాన్ని గురించి చాలా బాగా మాట్లాడటమే కాక అందులోని శేషవస్త్రం,పడుగూపేక కవితలను ప్రత్యేకించి చాలా ఇష్టపడ్డారు.అందుకనే ఆ తర్వాత కాకతీయ యూనివర్సిటీ ఎమ్మే వాళ్ళకు పడుగూ పేక కవితను పాఠ్యాంశంగా పెట్టేలా చేసారు.కొన్నాళ్ళు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీవారికి కూడా పాఠ్యాంశంగా ఉంది.పలుమార్లు ప్రసంగాలలో కూడా కాత్యాయనీ విద్మహే నా కవిత 'పడుగూ పేక' ని ప్రస్తావించుతూ వుంటారు.
పల్లవి రావటంతో మళ్ళీ ఇంట్లో సందడి వచ్చింది.డిసెంబర్ కనుక నేను దాచుకున్న సెలవులను అప్పుడప్పుడు పెట్టాను.ఇంతకాలం పల్లవి డిపెండెంట్ వీసాతోనే వుంది.త్వరలో తన వీసా మారితే వుద్యోగంలో చేరుతానని చెప్పింది .
అయితే అప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో
సహస్రాబ్ది ప్రారంభానికి దారితీసిన
Y2K సమస్య 1990ల చివరనుండే ప్రధాన చర్చనీయాంశంగా ఉండేది. సామాజిక మాధ్యమాలు, వార్తాపత్రికలు ఈ విషయం గురించి చాలా చర్చిస్తూ వుండేవి. రెండు-అంకెల సంవత్సరాలను ఎదుర్కొంటున్న ప్రోగ్రామ్‌లు 1900 మరియు 2000 తేదీల మధ్య తేడాను గుర్తించలేవని కొన్ని సమయాల్లో భయంకరమైన హెచ్చరికలు జనంలో సంచలనం కలిగించాయి.
2000 సంవత్సరాన్ని 1900 నుండి వేరు చేయలేని విధంగా తేదీలను సరిగ్గా గుర్తించలేక పోవటంవలన కంప్యూటర్ సిస్టమ్‌ల అసమర్థత వలన కంప్యూటర్ ఆధారిత పరిశ్రమలు ప్రపంచవ్యాప్తంగా కుదేలై పోతాయని ప్రపంచవ్యాప్తంగా అంతటా ప్రచారం ముమ్మరమైంది.
Y2K , 2000 సంవత్సరం తర్వాత తేదీల కోసం క్యాలెండర్ డేటా యొక్క ఫార్మాటింగ్ గురించి పేపర్ల నిండా వ్యాసాలు వచ్చాయి. చాలా మందికి "Y2K భయం" గురించి తెలిసింది.
బ్యాంకులలో డబ్బు Y2K సమస్య వలన డ్రాచేయటం కష్టం అని మరోవైపు పుకార్లతో కొందరు బ్యాంకుల నుండి సొమ్ము డ్రా చేసుకోవటం కూడా మొదలెట్టారు.అయితే మొత్తం మీద ప్రశాంతంగా ఏమాత్రం సంచలనం లేకుండానే కొత్త మిలేనియంలోకి ఉత్సాహంగా అడుగు పెట్టాం.
అజయ్ కూడా వచ్చాక అతనితో పాటు పల్లవి విజయనగరం వెళ్ళి తిరిగి ఇద్దరూ కలిసి యూఎస్ వెళ్ళిపోయారు.మళ్ళీ మా గూటిలో మేమిద్దరం మిగిలి పోయాం.
పల్లవి యూఎస్ వెళ్ళాక న్యూజెర్సీలో కొన్ని నెలల ట్రైనింగ్ అనంతరం అక్కడే కొంతకాలం ఉద్యోగం చేసింది.ఆ తదనంతరం చికాగోకి వెళ్ళింది.వారాంతంలో మినియాపోలీస్ కి వెళ్ళి మళ్ళా సోమవారం చికాగో వెళ్ళేది.ఒక్కోసారి వారాంతంలో ఎక్కడికైనా ట్రిప్ వెళ్ళేవారు.ఆటువంటప్పుడు మాకు ఫోన్ చేసే సమయాలు మారిపోతుండేవి.
మినియాపోలీస్ సంవత్సరానికి పది నెలలు మంచుకురిసే ప్రాంతం.అందువలన వెళ్ళటానికి ఫ్లైట్ ఎక్కినా అది లాండ్ కావటానికి వాతావరణం అనుకూలించకపోవటం వలన వెనక్కి వెళ్ళిపోవటం కూడా జరిగేదని పల్లవి చెప్తుంటే కొంతభాగం కలిగేది. చదువులకో,ఉద్యోగాలకో అక్కడకు వెళ్ళి పిల్లలు సుఖపడుతున్నదేమిటీ? కేవలం డాలర్ల వెనుక పరుగులేనా అనిపించింది.ఉద్యోగాలూ శాస్వతం కాదు ఎప్పుడు అకస్మాత్తుగా పింక్ స్లిప్ ఇస్తారో తెలియదు.అంతటి అభద్రతాభావంతో పిల్లలు అక్కడ బతుకుతున్నారు.గ్రీన్ కార్డుగానీ,సిటిజన్ షిప్ గానీ వచ్చేవరకూ అభద్రతతోనే బతకాలనేది మాకు తెలియవచ్చింది.
పల్లవీ,అజయ్ వచ్చినప్పుడు ఏదో సందర్భంలో " సడెన్ గా ఇండియా వచ్చేయాల్సి వస్తే కనీసం ఇక్కడ ఒక ఇల్లూ, మరో వుద్యోగం దొరికే వరకూ సంవత్సరం పాటూ బ్రతకటానికి బేంక్ బేలన్స్ ఉండాలి అత్తయ్యగారు " అన్నాడు అజయ్.
అందుకని ఏదైనా ఒక అపార్ట్మెంట్ ఉంటే కొంటాము చూడమని చెప్పారు అజయ్,పల్లవీ. ఎలాగూ వుద్యోగం చేస్తుంది కనుక పల్లవి డబ్బుతో కొంటామన్నారు.మంచి ప్రాంతంలో అపార్ట్మెంట్ ఉంటే చూడమని మేమూ కొంతమంది మిత్రులకి చెప్పాము.
ఢిల్లీ తెలుగు అసోసియేషన్ వాళ్ళు వీర్రాజు గారికి అవార్డు ఇస్తున్నామని ఫోను చేసారు.గిరీశం పేరుతో కథలు రాసే ఆర్. విద్యాసాగరరావు గారు,రామవరపు గణేశ్వరరావుగారూ అందులో సభ్యులు.ఆర్ విద్యాసాగరరావు గారు అప్పట్లో కేంద్రజలసంస్థ లో ఉద్యోగం చేసేవారు.తెలంగాణా ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ సలహాదారుగా పనిచేసారు.వీర్రాజుగారితో పాటూ నన్ను కూడా ఆహ్వానించటంతో ఇద్దరం బయలుదేరాము.మొదటిసారి దేశరాజధానిలో అడుగు పెట్టటం కొంత ఉద్వేగం కలిగింది.
ఆర్.విద్యాసాగరరావు గారు హైదరాబాద్ లో వున్నప్పుడు వీర్రాజుగారికి మిత్రులే.అప్పట్లో కొత్తగా కథలు రాస్తున్న గిరీశం( విద్యాసాగరరావు)కథ,నాదీ,చిన్నన్నయ్య మొదలగు
ఒక పదిహేను మంది కథలతో దీపిక అనే సంకలనం కూడా వీర్రాజు గారు కథా సాహితి పబ్లిషింగ్ పేరుతో ప్రచురించారు.అప్పట్లో ఆ పేరుతో మిత్రుల కథల పుస్తకాలు ప్రచురించేవారు.
భండారు దత్తాత్రేయ అధ్వర్యంలో ఆంధ్రా భవన్ లోనే పురస్కారం సమావేశం జరిగింది.తర్వాత ఒక రోజంతా గాంధీ సమాధి, ఎర్రకోట, తాజ్ మహల్ , కుతుబ్ మీనార్ ,బిర్లా టెంపుల్ మొదలైనవి చూసాము.నా జీవితంలో తాజ్ మహల్ చూడగలనా అనుకున్నాను.చాలా ఆనందం కలిగింది.
మాది ఆర్టీసీ హైస్కూల్ కావటాన వాళ్ళు మా స్కూల్ విద్యార్థుల విజ్ఞాన యాత్రల కోసం ఇంచుమించుగా ప్రతీ ఏడాదీ రెండు బస్సులు,నలుగురు డ్రైవర్లతో ఉచితంగా ఇచ్చేవారు.ఆ విధంగా దక్షిణ ప్రాంతాలను చాలా వరకూ నేను చూడగలిగాను.కాని ఉత్తరాది ప్రాంతాలేవీ చూడలేదు.అనుకోకుండా ఢిల్లీ చూడటం
చాలా సంతోషమనిపించింది .
సాహిత్య చిత్రకళా సవ్యసాచి - శివరావు సుబ్బలక్ష్మి
~ సాహిత్య చిత్రకళా సవ్యసాచి -శివరాజు సుబ్బలక్ష్మి ~
'ఇంట్లోని స్త్రీల సంభాషణల ద్వారా భాషలోని సొబగులు అర్ధం చేసుకోవచ్చు' అవి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారి మాటలు.
ఈ మాటలు గుర్తు వచ్చినప్పుడు శివరావు సుబ్బలక్ష్మిగారు గుర్తుకు రాకుండా ఉండరు.
పన్నెండో ఏట శివరాజు వేంకట సుబ్బారావు (బుచ్చిబాబు) చిటికెనవేలు పట్టుకొని సంసార బంధంలోకి వచ్చిన సుబ్బలక్ష్మిగారు… కథకుడు, చిత్రకారుడు అయిన బుచ్చిబాబు భార్యగా మాత్రమే ఒదిగిపోలేదు. బుచ్చిబాబుగారి రెండు చేతుల్లోని కలాన్ని, కుంచెని కూడాతన చేతిలోకి తీసుకున్నారు. ‘కావ్య సుందరి కథ, ఒడ్డుకు చేరిన కెరటం, మనోవ్యాధికి మందుంది, మగతజీవి చివరి చూపు, శివరాజు సుబ్బలక్ష్మి కథలు అనే అయిదు కథా సంపుటాలు, అదృష్ట రేఖ, నీలంగేటు అయ్యగారు, తీర్పు (తరుణ మాసపత్రికలో సీరియల్) నవలలు రాసి తనకంటూ సాహిత్య రంగంలో ఒక ముద్రని సాధించుకున్నారు.
బుచ్చిబాబు గారు కొన్నాళ్ళు అనంతపురం కాలేజీలో ఆంగ్లోపన్యాసకులుగా పనిచేసే రోజుల్లో అదే కాలేజీలో భౌతిక శాస్త్రం బోధించే మా పెదనాన్న కొడుకు లక్ష్మణరావుగారి కుటుంబం ఇరుగు పొరుగు ఇంట్లో ఉండేవారు. వారి స్నేహాన్ని గురించి ఇటీవల ‘పాలపిట్ట’ సాహిత్య మాసపత్రికలో సుబ్బలక్ష్మిగారు రాసిన ‘జ్ఞాపకాలు’లో తెలిపారు. సుబ్బలక్ష్మిగారు బుచ్చిబాబు గారు వెళ్ళిపోయిన తర్వాత హైదరాబాద్‌లో తమ్ముడి ఇంట్లో ఉన్నప్పుడు 1970లలో లక్ష్మణరావు అన్నయ్య కుటుంబంతో తొలిసారి ఆమెని కలిసాను. ఆ తర్వాత ఆమెను మా దంపతులం పలుమార్లు కలవటం జరిగింది. బెంగుళూరు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆమె తరుచూ ఫోన్ల ద్వారా అనేక కబుర్లు చెప్పేవారు.పురస్కారాలు అందుకునే సందర్భంలో హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఆమె ఫోన్ చేసి పిలవటంతో ఆమె బస చేసిన హోటల్‌కి వెళ్ళి కలిసేవాళ్ళం.
" ఈ కథలు ఒక స్త్రీ మాత్రమే రాయగలదు అనిపించడం శివరాజు సుబ్బలక్ష్మి కథల్లో విశిష్టత "అంటారు పింగళి లక్ష్మీకాంతం గారు.
సుబ్బలక్ష్మిగారి తండ్రి ప్రముఖ గాంధేయవాది ద్రోణంరాజు సూర్య ప్రకాశ రావుగారు అందువలన ఆమెరచనలలో చాలా వరకూ గాంధేయవాద సిద్ధాంతాలు గమనించవచ్చు. ఆమె కథల్లో స్వాతంత్రానికి పూర్వపు సాంప్రదాయ సంస్కృతులే గాక, స్వాతంత్రానంతర పరిణామాలకు గురైన సమాజ పోకడలనూ ప్రతి బింబిస్తాయి.
సుబ్బలక్ష్మిగారి రచనల్లో ముఖ్యంగా స్వాతంత్రానికి పూర్వము, తర్వాత ఆంధ్రా ప్రాంతంలో కుటుంబ వాతావరణం, స్త్రీల మానసిక చిత్రణలు జాగ్రత్తగా పరిశీలిస్తే ఆనాటి సమాజంలో స్త్రీ జీవనచరిత్ర పరిణామక్రమం నిత్యనూతనంగా భాసిస్తూ అభ్యుదయ పథం వైపు పయనించే విధానం తెలుస్తుంది. ఆ రకంగా తెలుగు గ్రామీణ మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబాలలో మహిళల జీవితం గోచరిస్తుంది.
సుబ్బలక్ష్మిగారి కథల్లో స్త్రీలు ఒకసారి నిర్లిప్తంగాను, మరికొన్నిచోట్ల స్థిరచిత్తం కలవారిగానూ కనిపిస్తారు - పాఠకులకు మాత్రం మధ్యతరగతి యువతులుగానే ఆమె పాత్రలు పరిచయం అవుతారు.
పెళ్ళంటే తెలియని వయసులో బాల్యవివాహాల వలన ఎదుర్కొన్న సమస్యల్ని, అమాయకులైన అమ్మాయిలు మూర్ఖపు అత్తగార్లతో అత్తింట పడిన ఆరళ్ళు, మొదటి భార్య చనిపోతే రెండవ భార్యగా వెళ్ళిన అమ్మాయిల మనోభావనలు, మొదటి భార్య పిల్లల అగచాట్లు, ఆర్థిక స్వాతంత్య్రం లేని భార్యలు, ఆడబిడ్డల పెత్తనాలు, అక్క పోతే ఇష్టం లేకపోయినా బావని పెళ్ళాడవలసిన పరిస్థితులు… ఇలా సుబ్బలక్ష్మి గారి సుదీర్ఘ జీవనయానంలో పరిశీలించిన సుమారు యాభై ఏళ్ళనాటి మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబాలలోని స్త్రీ జీవిత చిత్రణలే సుబ్బలక్ష్మి గారి కథలు.
'బుచ్చిబాబు కథలలోలా నా రచనల్లో వర్ణనలు ఎక్కువగా ఉండవ'ని సుబ్బలక్ష్మిగారు చెప్పుకున్నా కథల్లోని ప్రకృతి దృశ్యాల్ని వర్ణించే విధానం చదివినప్పుడు సుబ్బలక్ష్మిగారికి ప్రకృతి పట్ల ఆరాధన కన్పిస్తుంది. అదే వారి చిత్రకళలో దర్శనమిస్తుంది.
మంచు వీడిన కొండ, ఒడ్డుకు చేరిన ఒంటి కెరటం, మూతపడని కన్ను, మరుగుపడిన ఆత్మీయత… ఇలా సుబ్బలక్ష్మిగారి కథల శీర్షికలు ప్రత్యేకంగా కవితాత్మకంగా ఉంటాయి. శీర్షికలోనే కాక కథలో కూడా ”చినుకులు చిటపటలాడుతూ ఒక్కసారిగా సైన్యంలా నేలపైకి ఉరికాయి” వంటి కవిత్వ పంక్తులు కూడా మెరిపిస్తాయి. వీరి కథలలో చాలావరకూ యాభై-అరవై ఏళ్ళనాటి పల్లె జీవితాలు, గ్రామీణ వాతావరణం ఎక్కువగా ప్రతిబింబిస్తుంటాయి. పచ్చని నేలపై నుండి వీచే గాలుల సవ్వడులు, కొబ్బరాకుల మధ్యనుండి వినిపించే చిరుగాలి గలగలలూ, గూడుబండి ప్రయాణాలు మొదలైనవన్నీ గ్రామీణ దారుల పంక్తుల్లో పాఠకులు వీక్షించవచ్చు.
”కర్త-కర్మ-పూర్తి చేసిన కథ”లో రామచంద్రయ్య కూతుళ్ళకు గుడి దగ్గర స్వామీజీ తానిచ్చే తావీదు కట్టుకుంటే గొప్ప దశ వస్తుందనీ, రాజకుమారుడు వచ్చి ఎత్తుకుపోతాడనీ చెప్పేసరికి వాళ్ళిద్దరూ ఎప్పుడు తమ కల సాకారమౌతుందా అని కలల్లో తేలిపోయే క్రమంలో తమ చేతి గాజులు పోయినది కూడా గమనించరు. రామచంద్రయ్య తనలాగే స్వామీజీ అవుతాడని చెప్పేసరికి బలహీన మనస్కుడైన రామచంద్రయ్య ఇల్లు వదిలిపోతాడు. తర్వాత అనేక మలుపులతో కథ సుఖాంతం చేస్తారు. కానీ కల్లబొల్లి కట్టుకథలు చెప్పి అమాయకులకు వెర్రిమోహాల్ని కల్పించే దొంగస్వాముల గుట్టురట్టు చేసి, వ్యామోహాల పర్యవసానాల్ని కథంతా హాస్యంగా చెప్పే పద్ధతి రచయిత్రి మన ఎదుట కూర్చొని చెప్పేలా ఉంటాయి.
"మొండి మనసుల నీడలేని ఎడారి సుడిగాలిలో కూలిపోయిన భవనం అక్క జీవితం. శూన్యంలో వెలిగించిన ప్రమిదలా ఎంతకాలం నిలవ గలనో!!" అనుకుంది పార్వతి. శిల్పపరంగా, కథనపరంగా, వర్ణనల పరంగా ప్రత్యేకంగా చెప్పదగిన కథ - మట్టిగోడల మధ్య గడ్డిపోచ .మట్టిగోడల మధ్య గడ్డిపోచ’ కథలో అక్క మరణానంతరం బావని పెళ్ళి చేసుకున్న పార్వతి జీవితం, కాలం వేసిన ఎగుడుదిగుడు బండలపైన జీవితంగా రచయిత్రి అభివర్ణిస్తారు.
"కథలు చెప్పేగౌరి " కథలో గౌరిని ఏమాత్రం స్పందన తెలియని బండరాయిలాంటి వాడికి ఇచ్చి పెళ్ళి చేస్తారు. అతని తల్లి అటువంటిదే. చివరికి గౌరి జీవితంలో గిరి అనే బంధువు వెలుగులు నింపినట్లుగా ముగిస్తారు రచయిత్రి.
”ఆడవాళ్ళ పెట్టెలో” ప్రయాణం కూడా సుబ్బలక్ష్మిగారి సున్నితమైన హాస్యం కన్పిస్తుంది. ”నల్ల మబ్బులు” అనే కథలో డాక్టర్ భార్య సుశీల, తాను చనిపోతే భర్త అభిమానించే సుధని పెళ్ళి చేసుకుంటాడన్న అపోహతో కృశించి జబ్బు తెచ్చుకుని మరణానికి ముందు తన స్నేహితురాలికి రాసే ఉత్తరంలో భర్త, సుధ కోసం పడే తపన గురించి రాస్తుంది. ఆ ఉత్తరాన్ని తిరిగి సుశీలకు పంపుతూ ఆ స్నేహితురాలు భరోసా కల్పిస్తూ రాసిన ఉత్తరం సుశీల చనిపోయాక భర్తకి అందుతుంది. సుశీల స్నేహితురాలు ఉత్తరం లో రాసిన మాటలు రచయిత్రి ఆధునిక భావాలకు సూచనగా ఉంటాయి.
పోస్టు చేయని ఉత్తరం కథలో - ఇందిర భర్త పట్నంలో ఉద్యోగం చేస్తూ ఇంటికి డబ్బు పంపుతుంటాడు. ఇందిర సంసార బాధ్యతలు చేపడుతుంది. భర్త పట్ణంలో ఎవరినో పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాననీ ,అందుకు ఆమెతో కలిసి ఉండటానికి ఇందిర కూడా సమ్మతించాలని ఉత్తరం రాస్తాడు .ఉత్తరం చదివి ఇందిర భరించలేక ఆత్మహత్య చేసుకుంటుంది. నిజానికి ఆత్మహత్య పరిష్కారం కాదు. కానీ ఆనాటి చదువులేని, ఆర్థిక స్వావలంబన లేని స్త్రీలకు అదే పరిష్కారం కావటం దౌర్భాగ్యం .
'కాపురం' అనేకథలో పెళ్ళంటే తెలియని వయస్సులో జానకిని గంగిరెద్దులా అలంకరించి, పెళ్లిచేసి పెద్ద కోడలిగా ఉమ్మడి కుటుంబంపాలు చేయడం,అక్కడ చాకిరిచేసి, అవమానాలు పడుతూ, పుస్తెలగొలుసుతో సహా సమస్తమూ ఆ కుటుంబానికే ధారపోసి దుఃఖంతో స్నేహితురాలి యింటికి వెళ్తుంది జానకి. చివరిలో ఆమె భర్తకి జ్ఞానోదయమై జానకి మీద ప్రేమకలిగి అక్కున చేర్చుకుంటాడని సుఖాంతం చేస్తారు.
'తెల్లవారింది' కథలో మల్లికాంబ, 'మగతజీవి చివరిచూపు' కథలో కాంతమ్మ రెండో పెళ్ళి తీసుకొని అగచాట్లు పడిన మహిళలు
ఒడ్డుకు చేరిన కెరటం కథలో ఆశమ్మ తన అన్నగారి పిల్లల్ని, ఇతర స్వలాభం ఆశించక పెంచుతే ఆ పిల్లలు కాస్తా పెరిగి అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత ఆమెని నిర్లక్ష్యం చేస్తారు .అయినాసరే తాను కర్తవ్యపాలన చేసానని తృప్తి పడుతుంది.నిజానికి కన్నపిల్లలే పెద్దయ్యాక తల్లిదండ్రుల్ని పట్టించుకోని వారు కూడా ఉంటారు.
సుబ్బలక్ష్మిగారు కథలు రాసేనాటికి సమాజంలో ఆడపిల్లలకి బాల్యవివాహాలు చేసి, రజస్వల కాగానే అత్తగారింటికి అమ్మాయిని పంపించేసి పుట్టింటివాళ్ళు బాధ్యత తీరిందని చేతులు దులిపేసుకునే వాళ్ళు. ఎందుకంటే
ఆనాడు మధ్యతరగతి జీవులలో అధిక సంతానం, ఉమ్మడికుటుంబాలు, ఆర్థికఇబ్బందులు కూడా కారణమే. ఒక్కొక్క సందర్భంలో పిచ్చాసుపత్రిపాలు కావటం, పుట్టినింటా ఆసరా లేక, దైర్యం లేని, చదువులేని, ఆర్థిక స్వావలంబనలేని చావైనా రేవైనా వితంతువులైనా అత్తింట్లోనే పడి ఉండాల్సిన పరిస్థితి.ఇలా ఆనాటి ఆడవాళ్ల జీవితాలు ఏ విధంగా నిరాశలో కూరుకు పోయేవో ఇవన్నీ సుబ్బలక్ష్మిగారి పలు కథలలో దృశ్యమానమౌతుంటాయి.
జలసూత్రం రుక్మిణీనాధశాస్త్రిగారు ఒకసందర్భంలో 'సుబ్బలక్ష్మిగారి కథలన్ని మనసులోంచి వచ్చిన కథలు'గా అభివర్ణించారు అంతేకాదు " బుచ్చిబాబు నవల కన్నా నాకు సుబ్బలక్ష్మి కథలే నచ్చుతాయి' అని అన్నారని సుబ్బలక్ష్మిగారు నవ్వుతూ చెప్తారు.
మరో రచయిత్రి అద్దేపల్లి వివేకానందాదేవిగారు "సుబ్బలక్ష్మిగారి ముంజేతి కంకణం కథ తన వదినగారి జీవితాన్ని పోలి ఉందని" చెప్పారట. అంతేకాక ఆ కథలోని సహజత్వాన్ని అభినందించారుట.
మనుషుల మానసిక స్వభావాల పరిశీలనకు వీరి కథలు - కావ్యసుందరి కథ, మనో వ్యాధికి మందుంది, మగత జీవి చివరి చూపు,
ఒడ్డుకు చేరిన కెరటం - చక్కని ఉదాహరణలు .అందుకే కథ చదువుతున్నంతసేపు సహజసిద్ధంగా కళ్ళముందు ఆసంఘటనలు జరుగుతున్నట్లుగానే ఉంటాయి.
అరవై సంవత్సరాల కాలంలో సుబ్బలక్ష్మి రాసిన కథల నుండి ఎంపికచేసిన కథల్ని వేదగిరి కమ్యునికేషన్స్ వారు 1998 లో బుచ్చిబాబు స్మారక కథాకదంబం పేరిట ' మనోవ్యాధికి మందుంది " శీర్షికన పుస్తకంగా ప్రచురించారు .
అయిదు కథాసంకలనాలూ,మూడు నవలలు సుబ్బలక్ష్మి గారి సాహిత్య ఖాతాలో వున్నాయి. అయితే తరుణ మాసపత్రికలో సీరియల్ గా వచ్చిన "తీర్పు" నవల మాత్రం అందుబాటులో లేదు.
సుబ్బలక్ష్మి గారికి పేరు తెచ్చిన నవల - " నీలంగేటు అయ్యగారు " ఎమెస్కో వారు ఈ నవల గురించి " మేము నాగరీకులం మాదే నాగరికత అనుకొనే వాళ్ళ బతుకుల్లో చీకటి, చీకట్లో బతుకుతున్నాననుకొనే పొన్ని కళ్ళద్వారా చూపించే కొత్త పద్ధతి ఈనవల" అని అన్నారు.
నవల ప్రారంభంలోనే " నీలంరంగు గేటులోంచి గుత్తులు గుత్తులుగా పూసిన తెల్ల గులాబీలు గుబురుగా చూడ ముచ్చటగా కనిపించి దారిన పోయేవారిని క్షణమైనా నిలబెడుతుంది "అంటూ రాయటంలో రచయిత్రి భావుకత్వమేకాక ఆమెలోని చిత్రకారిణి కూడా బయటపడుతుంది.
పనిమనిషి పొన్ని దృష్టికోణంలో రాసిన ఈనవల పొన్ని కూడా తెల్లగులాబీలాగే ప్రత్యేకత సంతరించుకొన్న వ్యక్తి.'ఆ వీథిలో సగం ఇళ్ళు తనవేనంటుంది' పొన్ని.తనదీ అని చెప్పుకోగల ఆత్మస్థైర్యంఉంది పొన్నికి అంటారు సుబ్బలక్ష్మి .
సమాజమంతటా పాశ్చాత్యధోరణులు వ్యాపించి విస్తరిస్తున్నకాలంలో మిడిమిడిజ్ఞానం, అవగాహనాలేమి వలన నాగరికత వ్యామోహంలో కృత్రిమ విలువలకు,పోకడలకు లోనైన పాత్రల్ని ఈ నవలలో రచయిత్రి అక్షరీకరించారు.
గృహిణులు తమఅనుభవాలు, అనుభూతులు, అభిప్రాయాలు అన్నీ తమ అంతరంగలోతుల్లోనికి విసిరేసి జీవించవలసిన అనివార్యతని "అదృష్టరేఖ" నవలలో చిత్రీకరించారు.అంతేకాకుండా ఆ చిన్న జీవితంలోనే తాము సాధించిన విజయాల్ని, ఆనందాల్ని తలపోసుకొని సంతృప్తిని పొందే మధ్యతరగతి స్త్రీల జీవనవిషాదాలు ఒక అంతర్లీన స్రవంతిగా ఈనవల చూపిస్తుంది.
సుబ్బలక్ష్మి కథలైనా, నవలైనా మధ్యతరగతి మహిళల జీవితాల చుట్టూనే ఉంటాయి అనుకున్నాం కదా! జీవితచిత్రణలే కాక ఆ సమస్యలను వారు ఎదుర్కొన్న విధానం కూడా కొన్ని కథలతో చాలా చక్కగా వివరిస్తారు.సమస్యను సున్నితంగా పరిష్కరించుకొన్న విధానం తెలియజేస్తారు.
బుచ్చిబాబుగారూ, సుబ్బలక్ష్మిగారూ ప్రకృతి దృశ్యాల కోసం తరుచూ గ్రామాలకు వెళ్ళేవారట. ఆ దృశ్యాలన్నీ కళ్ళలో మనసులోనూ భద్రపరచుకొని ఇద్దరూ చిత్రాలు వేసేవారట. బుచ్చిబాబు గారు, సుబ్బలక్ష్మి గారు ఇద్దరూ ఎక్కువగా ప్రకృతిదృశాలే వేయటం విశేషం.అయితే బుచ్చిబాబుగారు వేసే చిత్రాలు యూరోపియన్ చిత్రకళా శైలి అయితే సుబ్బలక్ష్మిగారిది దేశీయమైన శైలి.
ఈ అద్భుతమైన ప్రకృతి దృశ్యాలే కాక దేవికారాణి. ఇందిరా గాంధీ వంటి కొందరు ప్రముఖుల పోర్ట్రైటులనూ సుబ్బలక్ష్మి గారు సజీవంగా చిత్రించారు.
2015లో ' Nature in Thoughts' పేరుతో బుచ్చిబాబు గారు వేసిన 177 వర్ణచిత్రాల్నీ, సుబ్బలక్ష్మి గారి 140 వర్ణచిత్రాలను కలిపి విలువైన పుస్తకాన్ని వెలువరించారు .
బుచ్చిబాబు గారు దూరమై అనేక సంవత్సరాలు గడచినా వారి దాంపత్య జీవితంలోని అనేక జ్ణాపకాలు ఆమె మనసుపొరలలో భద్రంగా ఉన్నాయి.
శివరాజు సుబ్బలక్ష్మి బుచ్చిబాబుతో గడిపిన ముప్ఫయేళ్ళ జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, నాటి విశేషాల్ని చినుకు పత్రికలో పాతిక భాగాలుగా రాసారు. వాటిని ఖుచ్చిబాబు శత జయంతి సందర్భంగా విశాలాంధ్ర ప్రచురణ సంస్థ " మా జ్ఞాపకాలు " గా ప్రచురించింది . ఇవి కేవలం వారి జ్ఞాపకాలే కావు. ఆంధ్రదేశంలో జరిగిన అనేక పరిణామాల పరామర్శగా చెప్పుకోవచ్చు.
సుబ్బలక్ష్మి గారిది అద్భుతమైన జ్ఞాపకశక్తి. సుబ్బలక్ష్మిగారితో మాట్లాడుతున్నపుడు ఆమె రాసిన కథ గురించి ప్రస్తావిస్తే ఆ కథ గురించే కాక దాని నేపధ్యాన్ని కూడా ఒక కథలాచెప్పటం ఒక ప్రత్యేకత.
80 ఏళ్ళ వయసుదాటినతర్వాత కూడా సుబ్బలక్ష్మి గారు చిత్రాలు వేయటం మానలేదంటే వారి కార్యదీక్షకు దర్పణం.
టీవీలో వార్తలు వింటూ దానికి దగ్గరగా గల తన జ్ఞాపకాలో, తాను చూసిన సంఘటనల్నో గుర్తు తెచ్చుకొని అక్కడే ఒక కాగితం మీద ఒక కథలా రాసేస్తుంటారని వీరి దత్త పుత్రుడు సుబ్బారావుగారు చెప్తారు.
సుబ్బలక్ష్మిగారిని కలిసి మాట్లాడు తుంటే ఎవరికైనా మంచి ఉత్సాహం కలుగు తుంది. ఆవిడ మాటలు వింటుంటే మనం కూడా గొప్ప ఎనర్జీని పొందిన అనుభూతిని పొందుతాము.
అరవైఏళ్ళు దాటేసరికి నీరసం పడిపోయి ఇంక జీవితం పూర్తై పోయిందని చతికిల పడిపోయే వారికి సుబ్బలక్ష్మిగారి లాంటి వారిగురించి తెలియ చేయాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ జీవితాన్ని ఎలా రంగులమయంగా చైతన్యవంతంగా చేసుకోవచ్చో తెలుస్తుంది .
శివరాజు సుబ్బలక్ష్మిగారు రచయిత్రి గానూ,చిత్రకారిణిగానూ తన జీవితకాలమంతటినీ సృజనాత్మకంగా పరిపూర్ణతను చేకూర్చుకున్న చైతన్యశీలి.
ఆవరణాన్నంతటినీ పరిమళభరితం చేసే పండుసంపంగిలాంటి సుబ్బలక్ష్మిగారు శతవసంతానికి నాలుగేళ్ళతక్కువలో భౌతికంగా దూరమైనా ఆమెను తెలిసినవారికి, కలిసినవారికి ఆమె చేతిలో చేయేసి నవ్వుతూకబుర్లు చెప్పటం
కళ్ళలో మెదులుతూనే ఉంటుంది.
1, సెప్టెంబర్ 2024, ఆదివారం
లక్ష్యశుద్దిగల కథకుడు- కె.కె.మీనన్
లక్ష్యశుద్ధి, నిజాయితీ గల కథకుడు
సాహిత్య రంగంలో కేవలం కృషి మాత్రమే కాకుండా హెూదా, కులం, మతం, వర్గం, చొచ్చుకుపోయే స్వభావం, శిష్య-ప్రతి శిష్యుల బలగం వంటివి రచయిత అంచలంచెలుగా ఎదిగిపోవడానికి సహాయ పడతాయని కొందరిని చూస్తుంటే అనిపిస్తుంది. మరి కొందరు కేవలం నిబద్ధతతో, గుర్తింపు కోసం ఆశించకుండా, తమను కలవరపెట్టిన దృశ్యాలకు సాహిత్య రూపం ఇచ్చే వరకు తమను వెంటాడిన సంక్షోభ సంఘటనలు, వాటి పరిష్కారాలను, సమర్థవంతమైన శైలీ విన్యాసంతో, రచనా రూపంగా అల్లుకుంటూ ఉండిపోతారు. ఒక్కొక్కప్పుడు అటువంటి వారు, తమ సమకాలీనులలో గుర్తింపు పొందినా, పొందక పోయినా, ఎప్పుడో ఒకప్పుడు తాము అందించిన సాహిత్యం ద్వారానే గుర్తింపుకు నోచుకుంటారు. అటువంటి కథా రచయితలలో స్వర్గీయ మీనన్ ఒకరు.
కె.కె.మీనన్ అనగానే ఈయన ఎవరో మలయాళీ అని చాలా మంది అనుకునే ప్రమాదం వుంది. కానీ, ఆయన స్వచ్ఛమైన తెలుగువాడు. 'కృష్ణమూర్తి' జన్మ నామంతో మొదలై కె రూపాంతరం చెందిన వాడు ఆయన హైదరాబాద్ లోని అకౌంటెంట్ జనరల్ ఆఫీసులో ఉన్నతోద్యోగంలో ఉంటూ 'రంజని' అనే సాహిత్య సంస్థకు అధ్యక్షుడిగా ఎంతో మందికి పలు సాహిత్య సమావేశాలలో అవకాశం కల్పిస్తూ అనేక మంచి సాహిత్య కార్యక్రమాలను నిర్వహించారాయన. అదే సమయంలో అంటే 1973 నుండి 1998 వరకూ అనేక కథలు రాశాడు. కానీ ఆయన రాసిన కథలన్నీ పుస్తక రూపం లోనికి రాలేదు. కొన్ని ఎంపిక చేసిన కథలతో మాత్రమే కేవలం 'ఇది స్ట్రీకింగ్ కాదు', 'పులికూడు' అనే రెండు కథా సంపుటాలు మాత్రమే వెలువరించారు.
అనువాద కథలకు సంబంధించి అవి
పుస్తక రూపం చూడకుండానే కాలగర్భంలో కలిసి పోయాయి. ఇవి కాక మీనన్ గారు. " ప్రభువు" అనే నవలలు కూడా ప్రచురించారు. ఇందులో 'బాకీ బతుకులు' నవల 'స్వాతి' మాసపత్రిక అనుబంధ నవలగా ఇప్పటి విశాలాంధ్ర ప్రచురణాలయం వారు పుస్తకంగా ముద్రించారు. క్రతువు నవల మాత్రం ఆంధ్రప్రభ వారపత్రికలో అప్పటి సంపాదకులు వాకాటి పాండురంగారావు గారి సంపాదకత్వంలో సీరియల్ గా ప్రచురితమైంది. ఈ నవలను ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో శ్రీ జీడిగుంట రామ చంద్రమూర్తి నాటకీకరణం చేయగా, సీరియల్ నాటకంగా ప్రసారం అయ్యింది. నవల మాత్రం భాషలోకి అనువదించండి. ప్రముఖాల ప్రతులు
మీనన్ గారు తన మూలాలను మాత్రం మరచిపోలేదు. పుట్టి పెరిగిన కోన గ్రామీణ (నిండి-రామరాజులంక) వాతావరణం అక్కడి గ్రామాలలో బడుగు బలహీనవర్గాలపై ధనాధిపతులు, భూకామందులు జరిపే రాష్టీకం, అక్కడ నెలకొని వున్న ఆర్థిక అసమానతలే కాక, కుల వివక్షకు బలి అయ్యే ఆర్థికజీవన విధ్వంసాలు, రచయితను వెంటాడుతుండడం వల్ల మీనన్ కథలలో అవన్నీ దృశ్యమానమయ్యాయి, మహా నగర జీవితంలో స్థిరపడినా బాల్యం నుండి హృదయంపై ముద్ర పడిన దృశ్యాలు, రచయితగా మీనన్ గారిని స్థిరంగా ఉండనీయ లేదు. అయనను వెంటాడిన దృశ్యాల నుండి పారిపోకుండా, వాటిని అక్షరాలలో పొదిగి వాస్తవాంశాలను కథలుగా మార్చే క్రమంలో సాహిత్య విలువలకు ఏమాత్రం భంగం కలగకుండా సాధ్యమైనంతవరకు గ్రామీణ విధ్వంసాల నేపథ్యం పాఠకుడి గుండెల్ని తట్టేలా చేశాడు రచయిత. అందుకుగాను ఆయన కధనశైలి ఎంతగానో తోడ్పడింది. గ్రామీణ జీవనం పట్ల, సమస్యలపట్ల, ఖచ్చితమైన అవగాహన రచయితకు వుంది. అందుకే లక్ష్యశుద్దితో తాను పాఠకుడికి చెప్పడమే గాక, తన పాఠకుడికి, గాఢానుభూతిని కలిగించి మమేకమయ్యే విధంగా, కళారూపాన్నీ శిల్పించగల నేర్పు రచయిత మీసన్ గారిలో వుంది.
గ్రామాలలో గ్రామాధికారులు-రైతుకూలీల పట్లా, కడ జాతులవారు పట్లా ప్రదర్శించే అలసత్వం వృరూపుతూ మర్కోక్క పేద- బడుగు వర్గాలు, తమ కలల్ని సాకారం చేసుకునేందుకు స్వంత, జీవితాల్ని సైతం, త్యాగం చేసి, వెట్టిచాకిరి చేస్తున్నా, కనికరించని గ్రామపెద్దల దౌర్జన్యాన్ని బలంగా తన రచనలలో చెప్పాడు రచయిత.
బాల్యంనుండీ అణిగి మణిగి మౌనంగా వున్నా ఇలాకూడా బతకనీయని, దుర్భర పరిస్థితుల్ని సాధికారంగా వివరించాడు. రచయిత.
ఉద్యోగరీత్యా భాగ్యనగరం లో (హైదరాబాద్) స్థిరపడినప్పటికీ
అందుకే ఈ రచయితకు జీవితంపట్ల, సమాజం పట్టా ఖచ్చితమైన అభిప్రాయాలున్నాయి. తన అభిప్రాయాల్ని వెల్లడించడంలో ఈ రచయిత, ధనుగునూ, పులుముడూ దరిచేరనీయడు, దోపిడీ వ్యవస్థను, బట్టబయలు చేసేందుకు, ఒక లక్ష్యశుద్ధితో రాస్తున్నారు" అని కాళీపట్నం రామారావు మాస్టారు ప్రశంసించారు మీనన్ గారిని.
మీనన్ కథలు సంభాషణాత్మకంగా ఉండడం వల్లనూ, క్లుప్తంగా రాయడంవల్లనూ, కథాంశాన్ని చెప్పదలచుకున్న విషయాన్నీ, సాగతీత లేకుండా, సుస్పష్టంగా చెప్పే ధోరణి వల్ల పాఠకుడికి, తేలికగా అర్ధం అవుతూనే సాంద్రత కలిగి ఉండడం వీరి కథల ప్రత్యేకత. అందుకే కథ చదివిన పాఠకుడు కూడా గొప్ప అనుభూతిని చెందడమే కాదు. స్పందిస్తారు కూడా!..
కథను చాలావరకు సంభాషణలతోనే, నడపడంవలన పాత్రల ముఖతా చెప్పేచోట, ఆయా సంభాషణలే పాత్రల స్వరూప స్వభావాల్ని తమలోని సంఘర్షణల్ని వ్యక్తపరుస్తాయి. తిరుగుబాటు ధోరణిని, సూటిగా, పదునైన పదాలతో, పాత్రోచితమైన మాండలీకంలో ప్రకటిస్తాయి. అంతమాత్రమేగాక, కథని నాటకీకరణ చేయాలనుకునేవారికి, చాలా సులభతరంగా కూడా ఉంటాయి మీనన్ కథలు,
మీనన్ గారి కథల్లో విశదంగా, విస్తారంగా వున్న పెద్దకత- పులికూడు. ఆయన కథలు అన్నీ ఇంచుమించు పదిపేజీలకు మించనివి. కానీ ఈకథ-పదిహేనుపేజీలు వుంది. కథాంశాన్ని బట్టి తప్పనిసరిగా పెద్దదిగా చేయాల్సిన కధ ఇది. ప్రపంచీకరణ వల్ల వచ్చిన జీవనవిధానం లోని మార్పులు, మానవస్వభావాలు, మారిపోతున్న సంబంధాలు కథలో అంతర ప్రవాహాలుగా ఉంటాయి.
ఒ.ఎన్.జి.సి. వలన కోనసీమ తీరప్రాంతాలలో వచ్చిన నగరీకరణ ఈ కథలో ప్రధాన వివరణగా ఉంటుంది. గోదావరి నది దాటేందుకు, ఉపయోగించే ఫంటు, ఇప్పుడు సరంగు నడపనవసరము లేకుండా, ఇంజను సహాయంతో, నడపటం నాయకుడిని ఆశ్చర్యపరుస్తుంది. సరంగు ఇంజను స్టార్ట్ చేసి, హాయిగా కూర్చోడం చూసి, సాంకేతిక ప్రగతి మనిషిని ఎంత సోమరిని చేస్తుంది' అనుకుంటారు.
నా యాంత్రీకరణ మానవ జీవితంలో ఒక భాగం ఐన నేపథ్యంలో మనిషి సుఖపడినట్టా? లేక సోమరితనంతో, లెక్కలేనన్ని రోగాలను తెచ్చుకుని, కృత్రిమంగా తగ్గించుకోవాల్సిన పరిస్థితిని ఎదుర్కోవాలా?
చమురు బావుల వలన డబ్బు సంపాదించిన వారి పిల్లలు, మోటారు సైకిళ్ళ తిరుగుళ్ళు, ఆడపిల్లల వెంట వడబాణు, ప్రకృతి విధ్వంసం, మానవ సంబంధాలు చిద్రం కావడం, కథంతా చెప్పి చెప్పకుండా పరుచుకుంటాయి. పక్షళ్ళు నిజంగా అభివృద్ధి చెందాయా?" అని పాత్ర ద్వారా సందేహించినా, ఇది వాపే గాని బలుపు కాదేమోననే ఆలోచనను పాఠకుడికి కలిగిస్తారు రచయిత.
మీనన్ గారి సమీప బంధువు, సోదరుడు, స్వర్గీయ కోనేటి మోహనరావు గారు, మన స్వతంత్రభారత మొదటి పార్లమెంటులో కమ్యూనిస్ట్ పార్టీ పక్షాన సభ్యుడు. అందువల్ల ఇంటికి అనేకమంది పార్టీ సాయకుల రాకపోకలు, చర్చలు, చిన్ననాటి నుండి రచయితపై ఆనాడు భావజాల ప్రభావం పడడానికి అనుకూలించిందని చెప్పాలి. అందుకే వీరి కథలన్నింటా సింహభాగం ఆ భావజాల సువాసనలే వెనంటుతు
మీనన్ భూకామందుల భూదాహానికి, అధికారాలకీ, అహంభావానికి బలి ఐన రైతు కూలీ కుటుంబాలు, బడుగు బలహీనవర్గాల జీవన విధ్వంసాలు, అన్నది ప్రభావంతో చైతన్య వంతులైన యువతరం హక్కుల పోరాటం చేయడం తిరుగుబాట
గ్రామీణ జీవనం పట్ల, సమస్యలపట్ల ఖచ్చితమైన అవగాహన రచయిత .B. మీనన్ కు పది అందుకే లక్ష్మశతో పాఠకుడికి వివరించ దలచుకున్నదేమిలో చాలా స్పష్టంగా చెప్పడమే గార, తన పాఠకుడికి గాఢాని కలిగించి మమేకమయ్యేవిధంగా, కథారూపాన్నీ శిల్పించగల నేర్పు నదయిన గారలో వుంది.
బావుటాలు ఎగర వేయటం, ఒక్కోసారి ఆయా పోరాటాల్లో బలికావటం వంటి అంశాలే ప్రధానంగా ఉంటాయి. కొన్ని కథల్లో సామాన్య కుటుంబ గాథలుగా చెప్పదగిన - వెన్నెల్లో తాజ్మహల్, వెలిగించని దీపాలు, వారది, ఇది స్త్రీకింగ్ కాదు, మౌనరాగం- వంటి కథలు వున్నా వాటిలో కూడా చర్చల ద్వారా, సంభాషణల ద్వారా రచయితకు గల హేతువాద దృక్పథం వ్యక్తం కావటం విశేషం!
'వెన్నెల్లో తాజ్ మహల్' కథలో షాజహాన్ ప్రేమికుడు కానేకాదని స్వార్థంతో తుచ్ఛమైన కోర్కెల కోసం వైద్య సలహాని విస్మరించి, ముంతాజ్ ను ఒత్తిడికి గురి చేసి వర్ద్నాలుగో నలో ఆమె మరణించడానికి, అతడే కారకుడని విమర్శనా పూర్వక చర్చతో తాజ్ మహల్ ప్రేమ చిహ్నం కాదంటూ తేలుస్తారు రచయిత.
బడుగు వర్గాల ప్రజలు తనుపై దాడులను భరించలేక సహనం కోల్పోయిన పరిస్థితుల్లో తిరుగుబాటు చేయడం చాలా కథలలో ముక్తాయింపుగా చెబుతారు రచయిత.
ఒక కథలో "తిరుగుబాటు అనేది ఉపన్యాసాలకీ, సిద్దాంత చర్చలకీ వచ్చి పడేది కాదు. వచ్చినా ఎక్కువకాలం నిలిచేది కాదు. దేనికైనా పరిస్థితులు పరిపక్వము కావాలి" అని ఒక పాత్ర చేత చెప్పించిన రచయిత, పరిస్థితులు పరిపక్వము అన క్రమం కూడా. మూలకథ గా తెలియజేస్తారు.
బానిస మనస్తత్వం, సవారం గల పాత్రలు సైతం ఏవిధంగా తిరుగుబాటుకు సిద్ధం కావలసి వచ్చిందో కూడా చిన్న కథల్లోనే పొండు పరచి కళాత్మకం చేయటం లో రచయిత శైలీ నిర్మాణ పద్ధతికి మచ్చు తునకలుగా ఈ కథలు ఉంటాయి.
ఒక వ్యక్తి తిరుగుబాటు చేసాడంటే ఆ వ్యక్తి పై ఎన్ని రకాల వైవిధ్య భరితమైన ఒత్తకు కారణభూతమౌతున్నాయో మీసన్ గారి కథలనుండి తెలుసుకోవచ్చును. అందుకు ప్రత్యేకంగా ఏ ఒక్క కథనో ఎంచుకోవలసిన అవసరం లేదు. ఈ కిటుకు కథలన్నీ చదివితేనే తన పరిశీల
తన పరిశీలనలోని అంశాల్ని తన గ్రామీణ నేపథ్యాన్ని, పల్లెల్ని విషతుల్యం చేసే కుల- వర్గ విలక్షల్ని అక్కడ రాజ్యమేలే సమా తీరుతెన్నుల్ని- ఇలా రచయితను వెంటాడి ఉక్కిరి బిక్కిరి చేసిన అనేకానేక సంఘటనలని, వృశ్యాల్ని తాను సమ్మిన సిద్ధాంతాలకు జోడించి విజాయితీగా, నిష్కర్షగా శిల్ప విన్యాసంతో శక్తివంతంగా పాఠకులు కు తన కథలను - నవలలను అందించిన రచయిత కె. మీసెన్ అభినందనీయుడు.
ప్రచార లోపం వల్ల ఈ రచయిత విస్తృత కథకుడిగా, నవలా కారుడిగా సాహిత్య చరిత్రలో మరుగున పడిపోకుండా చూసుకోవలసిన గురుతర బాధ్యత పాఠకులపైనా తోటి రచయితల పైనా ఉందనడంలో ఎలాంటి సందేహమూ లేదు.
(శ్రీ కె. కె. మీనన్ వర్ధంతి -సృజన క్రాంతి)
చాగంటి తులసి రచనల్లో రంగులూ రాగాలూ-
~ చాగంటి తులసి రచనల్లో రంగులూరాగాలూ~
విజయనగరం అనగానే గంటస్తంభం గుర్తొచ్చినట్లు,
మధురవాణో,గిరీశమో ఎదురైనట్లు,నోట్లోచుట్టతో దీర్ఘంగా చూస్తున్న చాసో కనబడినట్లు ఆలోచనల్లోకి ముఖం నిండా ప్రసరించే నవ్వుతో చాగంటి తులసి కూడా వస్తుంది.
ఆమె కొన్నిరచనలు సరదాగా చదువుకునేలా సాధారణ పాఠకుడికి అనిపిస్తాయేమో కాని లోతుగా పరిశీలించినప్పుడు ప్రతీదీ విభిన్నకోణంలో ఆలోచింపజేస్తాయి.
'రంగంటే ఇష్టం" పేరిట సాహితి చింతనలు అనే టాగ్ లైన్ తో ఓనలభై వ్యాసాలతో సంపుటి వెలయించారు తులసి. అందులో తొమ్మిది గురజాడ సాహిత్య చింతనలే. గురుజాడ కవిత్వం గురించి గురజాడ కార్యకారణ సంబంధ జ్ఞానంతో హేతుబద్ధతతో ప్రజల బతుకు గురించి ఆలోచించి జీవిత వాస్తవికతను అవగాహన చేసు కున్నాడంటారు రచయిత్రి. గురజాడ సమకాలీన భారతీయ కథకుల గురించి చెప్పారు. పూర్ణమ్మ కథని ఎత్తుకున్న దగ్గరనుండి. ముగింపు వరకూ ఏకోన్ముఖంగా అనుకున్న అంశాన్ని తీసుకు వెళ్ళడం వలన పూర్ణమ్మ కథాకావ్యాన్ని విశిష్టమైనదిగా ఆలోచన కలిగేటట్లు చేసాడంటారు రచయిత్రి . గురజాడ ప్రతిభావంతుడు కాబట్టి ఆధునిక కధానికా ప్రక్రియను ఆరంభిస్తూనే వాస్తురీత్యా, శిల్ప రీత్యా పరాకాష్ఠకు చేరుకునేలా రాయగలిగాడంటారు. ఆధునిక కావ్యాలైన తృణకంకణం, రామిరెడ్డిగారి నల్లజారమ్మకథ, అబ్బూరివారి మల్లికాంబ, నారాయణబాబు దేశమాత, శ్రీశ్రీ భిక్షువర్షీయసి వంటి అనేక స్త్రీపాత్రలలో గురుజాడ జాడవుందని రచయిత్రి సోదాహరణంగా వివరించారు. కన్యాశుల్కంలో 'ఎత్తడం' పేకాట గురించి, సమాజంలో ఆ ఆట కొనసాగింపు ఆ ఆటకి చెందినవిషయాలన్నీ తెలియజేసారు. తరతమ భేదాలున్నప్పటికీ నిరసనగానో, ధిక్కారంగానో, చాకచక్యంగానో, బుద్ధి కుశలతగానో, చదువూ సంస్కారాల మేళవింపు వలన వచ్చిన తెలివిడిగానో. నిస్సహాయతలోని ఎదురుదాడిగానో, బతుకునేర్పిన విజ్ఞతతో అణిగి మణిగి ఉంటున్నట్టే ఉంటూ సాఫల్యం చేసుకునే కార్యసాధకులుగా గురజాడ రచనలలో స్త్రీల స్వభావాలు ఉంటాయని ఒక పేరా లో గురజాడ సాహిత్యమంతటినీతెలియజేస్తూ ఈ వ్యాసాల్లో విశ్లేషించటం విశేషం.
కారా, చాసో, పతంజలి, రావిశాస్త్రి, ఉప్పల లక్ష్మణరావు ,నారాయణబాబు, రామలక్ష్మి రచనల గురించే కాక అనేక మంది భారతీయ రచయిత్రుల సాహిత్య విశ్లేషణలను సుమారు 350 పేజీల యీ గ్రంథంలో ఆనందంగా చదువుకోవచ్చు .
విశిష్ట చిత్రకారిణి అయిన మహాదేవివర్మ కవితలను అనువదించి , మహాదేవివర్మ వేసిన వర్ణ చిత్రాలతో పాటుగా తెలుగు సాహితీ లోకానికి చాగంటి తులసి పుస్తకంగా వేసారు.
గొప్పదైన ఆత్మ సౌందర్యం, దయాగుణం కల్గిన, సంస్కర్త అయిన మహాదేవివర్మ కవిత్వంలోని మూలభావాల సౌందర్యాన్ని తెలుగులోకి అనువదించటంలో సాఫల్యత సాధించింది తులసి అని డా. బాల గాలిసౌరిరెడ్డి గారు ప్రశంసించారు.తన ముందు మాటలో 'మూలంలోని పదసంయోజనాన్ని అది ఎక్కడెక్కడ సంస్కృత సమంగా ఉందో దాన్నంతా జాగ్రత్తగా అనువదించటంలో సాధారణంగా చాలా అనువాదాలలో కనిపించే శ్రవణ నిష్టూరుత్వం కని పించలేద'నీ ప్రశంసించారు వాడ్రేవు చిన వీరభద్రుడు. అంతేకాక ఒక కవయిత్రి తన కన్నీటితో తుడిచిన వేదన మరకను ఎంతో సున్నితంగా సాహిత్యపిపాసులకు ప్రేమతో అందించారని అన్నారు.
అనువాదం చేయటమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. మరో భాషలోని కథనైనా కవితనైనా తెలుగు లోనికి అనువాదం చేసేటప్పుడు మూలరచయిత అంతరంగాన్నే కాక మూల రచనలోని ఎసెన్స్ ను కూడా ఆకళింపు చేసుకొని భావస్పోరకంగా అనువదించడం నిజానికి కత్తిమీద సామే.అది చాగంటి తులసి సునాయాసంగా చేయగలరనేది ఆమె ఒరియా భాష నుండి తెలుగు లోనికి అనువదించిన కథలే తార్కాణం.
మహాదేవి వర్మ మూలకవితలను, ఆ వెంటనే తన అనువాదాన్ని రెండింటినీ ప్రచురించి పుస్తకంగా వేశారు చాగంటి తులసి ."మహా కవయిత్రి మహాదేవి వర్మ గీతాలు పేరిట వున్న తెలుగు అనువాద కవితలు కూడా తేలికైన అచ్చతెలుగు పదబంధాలతో వుంటాయి.
"బ్రద్దలు కొట్టు క్షితిజాన్ని
అవలోకిస్తాను నేనూ
అవతలవైపు ఏముందో!
ఎందుకని నన్ను చుట్టబెట్టి
బంధిస్తోంది ప్రాచీరమై
నాశ్వాస ఈవేళ " అంటూ స్వీయకవితలేనేమో అనేలా అనువాదం చేసి తెలుగు పాఠకులకు పరిచయం చేశారు.
ఇంక కథలు దగ్గరకు వస్తే స్త్రీవాదం యింకా వేళ్ళూనక ముందే వచ్చిన 'యాష్ ట్రే (1976) 'కథలో స్త్రీని ఆత్మ గౌరవం , ఉన్నత వ్యక్తిత్వానికి కు అద్దం పడుతూ, సమాజంలో ఆలోచనలో కొత్తగా మార్పుచెందుతోన్న స్త్రీ పాత్రగా మలిచారు.ఈ కథ అనేక సంకలనాలు లో చేరటమే కాకుండా అనేక భాషల్లోకీ అనువాదమైంది.
సమాజం వలయంలో ఇమడలేని వ్యక్తుల బాధ్యతారాహిత్యం, పలాయనబుద్ధిని ‘వలయం‘ కథ చెబుతుంది. మానవసంబంధాల మధ్య డబ్బునిర్వహిస్తున్న పాత్రను విమర్శనాత్మకంగా అనేక కథలలో స్పష్టం చేశారు.ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో స్త్రీ పురుషుల మధ్య ఆర్థిక సంబంధాల పెత్తనాన్ని స్త్రీ పురుష అసమానత్వాన్ని ,ఆడపిల్లల పెంపకం, చదువు, ఉద్యోగం, పెళ్ళి, ప్రవర్తన మొదలైన అంశాలలో మధ్యతరగతి ఆర్థిక , సామాజిక పరిస్థితుల ప్రభావం, దానిని ధిక్కరించడానికి స్త్రీలు చేసే పోరాటాలు చిన్న దేవేరి,యాష్ ట్రే, వలయం కథలలో గమనించవచ్చు.
అమాయకపు ఆడవాళ్లపై జరిగే మగాళ్ళ దాష్టీకాన్నీ,దానికి వంత పాడే కొందరు ఆడవాళ్ళపాత్రనీ ' ఆడదాయికి నోరుండాల్సిందే', శరణ్యం కథలలో రచయిత్రి అక్షరీకరించారు.
ఇవన్నీ ఒక ఎత్తైతే ఇటీవల అయిదారు నెలలు క్రితం వరకూ యీ మాట అంతర్జాలంలో రాస్తున్న ఊహల ఊట పేరిట అందించిన బాల్య జ్ణాపకాలు ఇంద్రధనుస్సు మీద విహరించేంత ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.ఉత్తరాంధ్ర మాండలికసొబగునీ,సుమారు అరవై ఏళ్ళక్రితం ఇళ్ళల్లో వాడిన వస్తు పరిచయం,ఆటలూ,పాటలూ బ్రాహ్మణ కుటుంబాలలోని వ్యావహారిక పెదాలతో కూడిన కబుర్లనీ చదువుతో న్న పాఠకులు కూడా బాల్యపు తొడుగులోనికి దూరిపోయి తులసితో చేయి కలిపి తిరిగిన అనుభూతిని కలిగిస్తాయి.
చివరగా "బతుకు గతుకుల్లో గట్టి దెబ్బ తగిలి నప్పుడు అవి కరిగి బయటకు తేలతాయి. నమ్మిన వాళ్లకు దేవుడు ఒక ఆసరా. ‘‘నాకు నేనే ఆసరా, నాకు నేనే బలం’’ అనుకుంటే, మనసును స్వాధీనపరచుకోగలిగితే, కార్యకారణ సంబంధాలను హేతుబద్ధతతో వివేచించగలిగితే దారి స్పష్టమ వుతుంది." అనే చాగంటి తులసి నవల,కథా, అనువాదం , వ్యాసం యిలా ఏ రచన చేసినా ఆమెదైన శైలీ, దృక్పథం వెల్లడౌతుంది.
(ఈమాట - సెప్టెంబర్ 2023)
చిలకలంచు జరీకోక-నవలాసమీక్ష
~ బడుగు జీవుల కష్టసుఖాల కలనేత -
చిలకలంచు జరీకోక~
ఒక చీర కొనాలని షాపుకి వెళ్తే ముందు చీరలో పడుగు, పేకల నేత చీరంతా ఒకే తీరుగానే వుందా లేకపోతే కొన్ని చోట్ల జాడలు జాడలుగా వచ్చిందా అని పరిశీలిస్తాం. తర్వాత నూలు నాణ్యతను గమనిస్తాం. దుకాణదారుడు చెప్పిన నాణ్యతగల నూలుతోనే చీర నేయబడిందా అని చూస్తాం. ఆ తర్వాతే రంగునూ, రంగుల మేళవింపునూ, డిజైన్ నేయటంలోని పనితనాన్నీ, కొంగులోని అందాల్నీ పట్టి పట్టి చూస్తాం. మనం అనుకుంటున్నట్లుగా ఉండి, ధర సంతృప్తి కలిగిన పిమ్మట చీరని కొనుక్కుంటాం.
అట్లాగే 'చిలకలంచు జరీకోక' మన ముందు పరచి ఒక్కొక్క పొరనే విప్పి చూపుతూ, నూలులోని రకాలు మొదలుకొని, చీర నేయటంలోని కష్టనష్టాల్నీ, గుంతలో కూర్చున చిరుగుపాతలు ధరించి జనం కోసం తన సర్వశక్తులూ సమకూర్చుకొని నేస్తున్న నేతన్నల పనికౌశలాన్నీ, బడుగు శ్రామికుల జీవితాల్లోని చీకటి కోణాల్నీ, కులవృత్తినే నమ్ముకొని ఆర్థిక విధ్వంసాల నడుమ జీవితాన్ని భారంగా వెళ్ళబుచ్చుతోన్న నేత కార్మికుని వెతలను, నేతపరిశ్రమ తీరుతెన్నులను పండు వలచి చూపిన తీరులో యర్రమిల్లి విజయలక్ష్మి తన 'చిలకలంచు జరీకోక'లో చక్కని కథనాన్ని మన ముందు పరిచారు.
నవల ఆసాంతం ప్రధానంగా నేత కుటుంబంలోని పలు జీవనకోణాల్ని తెరిచి చూపటంతో పాటూ, నేత పరిశ్రమలో వాడే నూలు రకాలూ, ఏ రకం నూలుతో ఏ రకం వస్త్రాలు నేస్తారో వంటి సూక్ష్మవిషయాల్ని సైతం తెలిపారు. నేత కొరకు వాడే అనేకానేక పనిముట్లు తయారీలో పాలుపంచుకునే ఇతర ఉత్పత్తి కులాల సహకారం, నేతలో రకాలు, చీరాలనుండి పోచంపల్లి వరకూ మారే విభిన్న నేత డిజైన్ల వివరాలూ, ఆ డిజైన్లు నేయటంలోని సులువు, బులువులు -ఇలా నేత పరిశ్రమ యావత్తూ దారం వడికిన దగ్గరనుండి రాట్నానికి చుట్టటం, 'సరి' పోయటం, పోగులకు గంజి పట్టించే విధానం, ఆసు పోయటం, మగ్గానికి
అమర్చటం, మగ్గంపై చీరగా మారేందుకు గల వివిధ దశలనూ; ఆ క్రమంలో మొత్తం కుటుంబసభ్యులందరూ సామూహికంగా పనిలో పాలుపంచుకోవలసిన పరిస్థితులనూ సవివరంగా, పరిశోధనాత్మకంగా రచయిత్రి సోదాహరణంగా పాఠకుడికి బోధిస్తున్నట్లుగా నడుస్తుందీ నవల.
రచయిత్రి నేత పరిశ్రమ గురించే చెప్తున్నారని పాఠకుడికి అనిపించే సమయానికి చటుక్కున కథలోకి లాక్కొచ్చేస్తారు విజయలక్ష్మి.
నవల సగం వరకూ నేతపరిశ్రమలోని కష్టనష్టాల్నీ, తీరుతెన్నుల్నీ వివరిస్తూ వచ్చిన రచయిత్రి సమయానుకూలంగా ఆర్ధికప్రాతిపదికను బడుగు జీవుల జీవన విధ్వంసాలను ఎన్నింటినో సంఘటనాత్మకంగా కళ్ళముందు దృశ్యమానం చేశారు.
ఆడపిల్లలను రజస్వలానంతరం ఆగిపోయే చదువులు, మగపిల్లాడిని తమలా కాకుండా ఉద్యోగస్తుడిగా చూడాలనుకునే తల్లులు, తమ కలల్ని సాకారం చేసుకోలేని అసహాయత, ఆడపిల్లల పెళ్ళికి కట్నకానుకలు సమకూర్చుకోలేక తల్లిదండ్రులు పడే తాపత్రయం, తల తాకట్టు పెట్టి పెళ్ళి చేసినా ఆగని వరకట్న వేధింపులు, ఆడపిల్లను కన్నందుకు ఎదుర్కొనే నిరసనలు, వరకట్న వేధింపులు, ఆడపిల్లను కన్నందుకు ఎదుర్కొనే నిరసనలు, వరకట్న హత్య, కన్న తల్లిదండ్రుల వృద్ధాప్యం సమస్యలు, ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా తల్లిదండ్రుల్ని కూడా అన్నదమ్ములు పంచుకోవాల్సి రావటం - ఇలా సమకాలీన సామాజిక సమస్యలనెన్నింటినో నవలలో విడమరచి చూపటంలో రచయిత్రికి సామాజిక సమస్యల పట్లగల అవగాహన, సామాజిక బాధ్యత వ్యక్తమౌతుంది.
ముందు సాదాసీదాగా మొదలైన కథనం, సంఘటనలూ మందగమనంతో నడచిన కథ చివరికి వచ్చేసరికి వేగం పుంజుకొని నేత కార్మికుడి జీవనయానంలో సుడులు తిరిగిన పాఠకుడి గుండె ద్రవించేలా రాశారు రచయిత్రి.
విక్టోరియా రాణికి అగ్గిపెట్టెలో చీరని బహూకరించే నైపుణ్యంగల చేనేత కళ, ఆ నేత కార్మికులకు రోజు రోజుకూ ప్రోత్సాహం కొరవడి పాలకుల నిర్లక్ష్యం, యాంత్రీకరణల మధ్య, మధ్య దళారుల కపటత్వంతో ఎంత భారంగా మారిందో అర్థమయ్యేలా రాయటంలో రచయిత్రి నేర్పు కనిపిస్తుంది.
వృత్తిపనివారల జీవితాలపై తెలుగు సాహిత్యంలో కవిత్వం ఎక్కువగా వచ్చింది. కథలు కూడా కొన్ని వచ్చాయి. కానీ మొత్తంగా ఒక వృత్తి నేపథ్యంలో సాగిన నవలలు తక్కువగానే వున్నాయి. నేత కార్మిక జీవనంపై ఇంతకుముందు పోరంకి దక్షిణామూర్తి, వనం నరసింహారావు, మంథా భానుమతిగారు రాసిన నవలలు నాకు తెలిసినంతవరకూ గ్రంథరూపంలో వచ్చాయి. ఆ కోవలోనిదే యర్రమిల్లి విజయలక్ష్మిగారి 'చిలకలంచు జరీకోక' నవల.
ఉత్పత్తి కులాలలో కవయిత్రులు ఎక్కువమందే వున్నారు. కానీ నవలలు రాసే రచయిత్రులు వేళ్ళమీద లెక్కపెట్టే అంతమంది మాత్రమే ఉండటం వల్ల కావచ్చు, ఆయా అంశాలపై రాసే సాహసం చేసినవారు లేరు. అటువంటిది ఉత్పత్తి కులానికి చెందకపోయినా యర్రమిల్లి విజయలక్ష్మిగారు ఎంతో సన్నిహితంగా ఆ పరిసరాలలో అత్యధిక సంఖ్యాకులైన నేత కుటుంబాలను దగ్గరగా చూడటం, సునిశితంగా వారి జీవనవిధానం పరిశీలించినట్లుగా నవల చదివిన పాఠకుడికీ అర్ధమౌతుంది.
ఒక మంచి అంశాన్ని నవలకు ఎంచుకోవటం ఒక ఎత్తైతే, దాన్ని ప్రతిభా వంతంగానూ, అంశాన్ని బలంగానూ చెప్పటానికి తగినరీతిలో సంఘటనల అల్లికనీ, సంభాషణల సమకూర్పునీ బట్టి రచయితా, రచయిత్రుల రచనా సామర్థ్యం తెలుస్తుంది. ఆ రకంగానే యర్రమిల్లి విజయలక్ష్మి కష్టసాధ్యమైన అంశాన్ని స్వీకరించి, ఒక వృత్తిని గూర్చిన అనేకానేక విషయాంశాలు గుదిగుచ్చి పరిశోధనాత్మక నవలగా ఈ 'చిలకలంచు జరీకోక'ను కలనేతగా నేసి మనకి అందించారు.ఒకనాడు 'ఆంధ్రప్రదేశ్' ఉగాది నవలల పోటీలో బహుమతి అందుకోవటంలోనే ఈ నవలకు రాణింపు వచ్చినట్లయింది.
గత యాభై ఏళ్ళకు పైగానే రచనారంగంలో వుంటూ విజయలక్ష్మిగారు అనేక నవలలు, కథలు, వ్యాసాలు రాసి గ్రంథాలుగా వెలువరించారు. నేతవృత్తి గురించి నాకు తెలిసినదాని కంటే మరింత పరిచయం ఈ నవలద్వారా నాకు అందింది. సామాజిక బాధ్యతతో పరిశోధనాత్మక నవలగా 'చిలకలంచు జరీకోక'ను అందించారు యర్రమిల్లి విజయలక్ష్మిగారు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)