28, జులై 2024, ఆదివారం
కె.కె.మీనన్ చేసిన మహాక్రతువు
~ కె.కె.మీనన్ చేసిన మహా " క్రతువు " ~ "ప్రయోగశాల దగ్గర నిలబడి తన వెనక వున్నా విజ్ఞానాన్ని గురించి అవగాహన వుండి, రాగల సమాధానాలకు సమాజంపై ఉండగల ప్రభావాన్ని వాస్తవికంగా ఊహించి సాహిత్యరూపం ఇవ్వడం వైజ్ఞానిక నవలాకారుడి పని. ఇక్కడ రెండు ముఖ్యమైన విషయాలు ఒకటి సమకాలీన విజ్ఞాన శాస్త్రాన్ని గురించి స్థూలంగానైనా సమగ్రమైన పరిజ్ఞానం వుండటం, రెండవది రాబోయే వైజ్ఞానిక పరిణామం వాస్తవికంగా వూహించడం. ఊహతప్పకుండా వుంటుంది కానీ అది వాస్తవికంగా వుండాలి "అంటారు ఒకసందర్భంలో కె బాలగోపాల్. తెలుగులో వైజ్ఞానిక కథలూ,నవలలూ రాసిన వాళ్ళే తక్కువ. కొందరు రాసినా అది కేవలం ఊహపై ఆధారిత రచనలుగానే భావించవచ్చు . అయితే కానేటి కృష్ణ మీనన్ ( కె కె మీనన్) రాసిన 'క్రతువు'నవల కొంత భిన్నమైనది. ఎందుకంటే కథాక్రమంలో రచయిత ప్రస్థావించిన అనేక అంశాలు కథాకాలానికి చాలా నవీనమైనవి. అంతేకాక తర్వాతి కాలంలో ముఖ్యంగా భారతదేశంలో కూడా వైద్యశాస్త్రంలో అభివృద్ధి చెంది సమాజంలో అత్యవసరమైనదిగానూ, అతి సామాన్య అంశంగానూకాలక్రమేణా పరిణామం చెందినదిగా మారటం కాకతాళీయం కావచ్చు. గణాంక శాఖలో అంకెలతో ఆడుకునే కె. కె. మీనన్ ఇంత కూలంకుషంగా పరిశోధనాత్మకంగా అనేక వివరాలను సేకరించి నిజమైన వైద్య శాస్త్రజ్ఞుడే అని పాఠకులకు అనిపించేలా రాయటం ప్రశంసనీయం. ఆంధ్రప్రభ వారపత్రికలో వైజ్ఞానిక సీరియల్ నవలగా ‘క్రతువు’ ను పత్రిక సంపాదకులు వాకాటి పాండురంగారావుగారు ఎంపిక చేసినప్పుడే సరోగసీ మీద వచ్చిన ఈ నవల సంచలనం కలిగించింది. ఇక కథలోకి వస్తే దివిసీమ ఉప్పెనలో తల్లిదండ్రులను, సోదరినీ కోల్పోయిన ప్రమీల ఎమ్మెస్సీ చదువు కారణంగా విశాఖ విశ్వవిద్యాలయం హాస్టల్ లో ఉన్న కారణాన ప్రాణాలు దక్కించుకుంటుంది.అనుకోని పరిస్థితులలో ఒంటరికావటం కొంత నిర్వేదానికి గురౌతుంది. ఒకసారి వార్తాపత్రికలో 'అద్దెకు గర్బం కావాలి 'అనే ప్రకటనచూసి, కొంత కుతూహలంతోను, తనకోసం బాధపడేవారు లేరు కదా అనే ఆలోచనతోనూ బొంబాయి వెళ్ళటానికి నిర్ణయించుకుంటుంది. గర్భంతో ఉన్న భార్య ప్రమాదంలో చని పోవటంతో భాగ్యవంతుడైన రమేష్ తనభార్య గర్భంలోని పిండాన్ని ప్రముఖ గైనకాలజిస్ట్ సహాయంతో శీతలీకరించి వారసుడికోసం తపన పడటం,తదనంతరం ప్రమీల ద్వారా వారసుడినే కాక అనేక మలుపులతో కథ సాగి ప్రమీలనే భార్యగా స్వీకరించడం ఇదే కథ-- విశాఖ సముద్రాన్ని హాస్టల్ గది కిటికీ నుండి వీడియో తీసినట్లుగా వర్ణించటంతో నవల మొదలు పెట్టటంలో కొంత ఔచిత్యం కనిపిస్తుంది. కథానాయిక కొండంత మనోబలం కలది, గుండెల్లో లోపల ఎంత చీకటి వున్నా బయటకి నవ్వుతూ తిరిగే ప్రమీల హృదయం సముద్రమంత లోతూ, గాంభీర్యం కలదిగా నవల ఆశాంతం చిత్రించారు రచయిత. అండాలను సేకరించి ఫలదీకరణం చేసే శాస్త్రజ్ఞుడు గోవిందరావు పరిశోధనలను పాఠకుడు కూడా ఆ వెనకే నిలబడి చూస్తున్నంతగా అనుభూతి చెందుతారు. 1996లోనే మొదటి క్లోనింగు గొర్రెపిల్ల డాలీని ఉత్పత్తి చేసిన స్కాట్లాండు ప్రయోగ శాలలోనే ఉన్నట్లు చదువుతూ చదువుతూ పాఠకులూ కలగంటారు.జన్యుపరిశోధనల పట్ల గోవిందరావుకి గల అంకితభావానికి అచ్చెరువొందుతారు. ముందు ఎలుకలమీదా,తర్వాత పశుసంవర్థకశాలలో పనిచేసి రెట్టించిన వుత్సాహంతో మానవ అండాలను కూడా ప్రయోగశాలలోనే ఫలదీకరణం చేయబూనిన గోవిందరావుతో పాటే ఆ ప్రయోగాలనూ పాఠకులూ ఆసక్తికరంగా తెలుసుకుంటారు. 1978లో మొదటి టెస్టు ట్యూబ్ బేబీ అవతరణ చాలామందికి గుర్తుండే ఉంటుంది.ఈ విషయం ఆరోజుల్లో పెద్దసంచలనం. పేట్రిక్ స్టెప్టో అనే శాస్త్రజ్ఞుడు గోవిందరావూ, మూబ్ ఎడ్వర్డ్ అనే బ్రిటీష్ గైనకాలజిష్టు డా.ఇందిరానే నేమో అనిపించేలా కథనం సాగుతుంది .అదేవిధంగా లెప్రో స్కోపు వాడకం కూడా కథా కాలంనాటికి కొత్తే. ఆ విషయాలన్నీ చాలా వివరంగా చర్చించారు రచయిత. ఇదేవిధంగా ప్రమీలను తమ పరిశోధనకు తీసుకొని డా.ఇందిరా, డా.గోవిందరావు కలసి చేసిన, సాధించిన టెస్టు ట్యూబ్ బేబీ కధే ఈ "క్రతువు" అనే వైజ్ఞానిక నవల. ఈ యజ్ఞం చేసినది డా. ఇందిర అనే గైనకాలజిప్టు, డా. గోవిందరావు అనే జన్యు సైంటిస్టు అయితే చేయించినది మాత్రం కె.కె.మీనన్ అనే రచయితే. సాధారణంగా ఇటువంటి సైంటిఫిక్ నవలలను పాఠకులను రంజింపజేసేలా రాయటం అంటే రచయితకు కత్తి మీద సామే. గ్రహాంతర వాసులు,గ్రహాంతర యుద్ధాలు వంటి వాటిని ఆసక్తి కరంగా రాయొచ్చునేమో.ఎందుకంటే అవన్నీ వూహాజనితాలే కనక. కానీ వైద్య శాస్త్రానికి సంబంధించిన వాటిని కథాంశాలుగా తీసుకుని రాయలంటే శాస్త్ర విజ్ఞానం ముఖ్యంగా అవసరం, వాస్తవికతకు దూరంగా ఉండకూడదు. కనుకనే మీనన్ గారు బ్రిటీష్ గ్రంథాలయానికి వెళ్ళి, అంతకుముందు జరిగిన జన్యుపరిశోధనల గురించి, అప్పటికే బ్రిటన్ లో జరిగిన టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రయోగం గురించి తనకు కావలసిన సమచారాన్ని అంతట్నీ సేకరించి, అవసరమైన చోట్ల డాక్టర్ల సలహాలను స్వీకరించి ఒక వైద్యశాస్త్ర పరిశోధనాత్మకగ్రంథంలా తీసుకు రావటానికి మీనన్ గారు కూడా ఒక యజ్ఞం చేసే వుంటారు . ఇందులో సామాన్య పాఠకులకు ఆసక్తి కలగటానికి కావచ్చు ఆస్తిపరుడైన రమేష్ కు వారసుడు జన్మిస్తే తమకు ఆస్తి దక్కే అవకాశం పోతుందని కొందరు దాయాదులు సినిమా ఫక్కీలో బెదిరింపులకు పాల్పడటం , కొంత డ్రామా అనంతరం వాళ్ళ కుట్ర బయటపడి పోలీసులకు చిక్కటం కథలో చొప్పించారు రచయిత. కానీ అది నవల ప్రయోజనాన్ని ఏమీ దెబ్బతీయదు. డా. గోవిందరావు చేసిన, చేస్తున్న ఆయా పరిశోధనలోని అంశాల వారీగా క్రమపద్ధతిలో వివరించినా అది డా. ఇందిరతో గానీ, ప్రమీలతో గానీ సంభాషణా రూపకంగా చెప్పటం వలన రచయిత తనకు తెలిసినదంతా పాఠంగానో ఉపన్యాసం గానో చెప్పాడనే భావన పాఠకులకు రాదు. పాఠకులు కూడా ఆ పరిశోధనలో మమేకం అయ్యేలా ఆసక్తి కలిగించేలా చెప్పటంలో రచయిత విజయవంతమయ్యారని ఖచ్చితంగా చెప్పవచ్చును. ఈనవలలో మరొక ఉపకథ డా. ఇందిర జీవితానికి సంబంధించినది. దీనిని కూడా రచయిత సమయోచితంగానే ప్రస్తావించి చివరకు సుఖాంతం చేస్తారు. ప్రమీల గర్భధారణ సమయంలోనూ, ప్రసవానంతరంలోను ఆమె మానసికస్థితిని, స్త్రీసహజమైన స్పందనలను మీనన్ గారు ప్రతిభావంతంగా అక్షరీకరించారు. అందుకే " హింసా, సెక్సు,అనవసరమైన రొమాన్స్ మొదలైనవి చొప్పించ కుండా ఒక రచన చేయటమేకాక, సాహిత్యంలో క్వాలిటీకీ, పాపులారిటీకీ సమన్వయం చేయగల నైపుణ్యం రచయితకి ఉంద"ని మధురాంతకం రాజారాంగారు కె.కె.మీనన్ ని ప్రశంసించారు. తన ప్రయోగంలో తల్లిగా మారిన ప్రమీలను ఇష్టపడిన గోవిందరావుని మృదువుగా తిరస్కరించిన ప్రమీల వ్యక్తిత్వాన్ని, తన జీవితాన్ని ఎలా మలచుకోవాలో, జీవితాంతం సుఖమూ శాంతినీ ,ఆనందాన్ని గౌరవప్రదంగా ఎలా పొందాలో తెలిసిన వ్యక్తిగా తీర్చిన తీరు అభినందించ దగినది. అందుకే 'అటు విజ్ఞానం, ఇటు జీవితం - ఈరెండు భిన్న ధృవాల మధ్య అద్భుతమైన సృజనా చాతుర్యపు సేతువు ఈనవల. క్రతువు ఈ దశాబ్దపు చెప్పుకోదగిన నవలల్లో ఒకటి అని తెలుగు వారందరూ గర్వంగా చాట వచ్చును "అంటారు వాకాటి పాండురంగారావు తన ముందుమాటలో. ఇన్ని ప్రత్యేకతలు కలిగినది కనుకే తెలుగు సాహిత్యంలోని సైన్స్ ఫిక్షన్ విభాగంలో పి.హెచ్.డి చేసేవారికి ఈ "క్రతువు" నవల సూచించబడింది. ఆనాటి ఆకాశవాణి (హైదరాబాద్) సీనియర్ ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ శ్రీమతి సరోజా నిర్మలగారు ‘క్రతువు’నవలను ప్రముఖ రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి జీడిగుంట రామచంద్రమూర్తి గారిచే నాటకీకరణం చేయించి ధారావాహికగా ఆకాశవాణిలో ప్రసారం చేశారు. 2014 లో ప్రముఖ అనువాదకులు జి. పరమేశ్వర్ గారు క్రతువు నవలను హిందీలోకి అనువదించారు. టెస్ట్ ట్యూబ్ బేబీల గురించి పాఠకుల్లో అంతగా అవగాహన లేని రోజుల్లో వెలుగు చూసిన క్రతువు నవల తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి సరోగసీ మీద వచ్చిన రచనగా చెప్పుకోవాలి.
13, జులై 2024, శనివారం
నడక దారిలో -43
నడక దారిలో -43
ఒకరోజు చిన్నన్నయ్య ఫోన్ చేసి ఒక సంబంధం గురించి చెప్పాడు.పెద్దనాన్న మనవడు ప్రకాశరావు మా అన్నయ్య స్నేహితులు.వాళ్ళకి బంధువులు,మానాన్న వుంటారు ధర్మవరానికి చెందినవారు.అయితే ఉద్యోగరీత్యా భిలైలో ఉంటూ ఇప్పుడు విజయనగరం వచ్చి స్థిరపడ్డారు.వాళ్ళ రెండో అబ్బాయి.రూర్ఖెలాస్టీల్ ఫాక్టరీ లో పనిచేస్తున్నాడని చెప్పేడు.
అన్నయ్యకి తెలిసిన వాళ్ళు కదా పరవాలేదనుకున్నాము.పల్లవి ఫొటో జాతకం పంపమని,ఆ అబ్బాయి ఫొటో కూడా పంపారు.ఫొటో చూసి మెము కొంచెం అసంతృప్తి చెందారు.కానీ మా మరిది చూసి "అందరికీ ఏవో వంకలు చెప్తుంటే ఎలా? బాగానే ఉన్నాడు.మంచి వుద్యోగం" అనేసరికి నిజమేలే ఇక్కడే ఉంటారు.అనుకున్నాము.
అబ్బాయి వాళ్ళ అత్త హైదరాబాద్ లోనే ఉంటుందట.ఒకరోజు సాయంత్రం వస్తున్నానని ఫోన్ చేసి వచ్చేసాడు.మేము కాసేపు మాట్లాడి కాఫీ తీసుకు రావటానికి వంకతో లోపలికి వచ్చాను.పల్లవితో కాసేపు మాట్లాడాడు.
తర్వాత అతను యూఎస్ రావటానికి ఇష్టమేనా అని అడిగాడట.పల్లవి తనకి ఇష్టం లేదందిట."ఒక్కతే అమ్మాయివనా?అక్కడ కొన్నాళ్ళు వుండి తిరిగి వచ్చేద్దాం.ప్రస్థుతం నేను వుద్యోగం మానేసాను.యూఎస్ వెళ్ళే ప్రయత్నాల్లో ఉన్నాను " అన్నాడని చెప్పింది.మళ్ళా మేము ఆలోచనలో పడ్డాం.పల్లవిని" నీకు ఇష్టమేనా " అని అడుగుతే మీ ఇద్దరికి నచ్చుతే నాకేమీ అభ్యంతరం లేదు అంది.
కానీ వీర్రాజు గారికి కొంత అసంతృప్తి గానే వుంది.కానీ రోజూ ఏ విషయమూ చెప్పమని అబ్బాయి మేనమామ నుండి ఫోన్లు.వీర్రాజు గారు ఏదో ఒకటి చెప్పాలన్నట్లుగా " మాకు కట్నాలు అవీ ఇవ్వటం ఇష్టం లేదు.ఆ విషయం వాళ్ళకి చెప్పండి"అన్నారు.మరో రెండురోజులకు "కట్నకానుకల ఆశ లేదనీ,అమ్మాయికి బంగారంకూడా మీ ఇష్టమే మాకేమీ అభ్యంతరాలు లేవని " అబ్బాయి తండ్రి నుండి పెద్ద ఉత్తరం వచ్చింది.
మళ్ళీ వాళ్ళ నుండి ఫోను వస్తే " మేము సింపుల్ గా సభావివాహం చేసుకున్నాము.మాది కమ్యూనిస్టు ఐడియాలజీ" అన్నారు.దీనికి మాత్రం వాళ్ళు అభ్యంతరం చెప్పారు."మా పెద్దబ్బాయి వర్ణాంతర వివాహం చేసుకున్నాడు.వాళ్ళు సింగపూర్ లో ఉన్నారు.చిన్నబ్బాయికి సాంప్రదాయంగా చెయ్యాలనిమాకోరిక.దీనికి అంగీకరించమని " అన్నారు.ఆలోచించి చెప్తానని వీర్రాజుగారు అని పెట్టేసారు.
ఓ వారం పదిరోజులపాటు ఇంకేమీ మాటలు లేవు.అయితే మా చిన్నన్నయ్య ఫోన్ చేసి " వాళ్ళు పల్లవిని చూస్తామంటున్నారు.ఒక రెండు రోజులకి విజయనగరం రండి.ముఖాముఖీ మాట్లాడితే ఏదో ఒకటి నిర్ణయానికి రావచ్చు" అన్నాడు.
సరే నని విజయనగరానికి ప్రయాణం కట్టారు.
మా పెద్దక్క నీ,పెద్దన్నయ్యనీ కూడా పిలిచారు.అబ్బాయి రాలేదు కానీ అతని తండ్రి అన్నదమ్ములంతా వచ్చేసారు.ఆడవాళ్ళం అందరంలోపల గదిలోనూ, ముందు గదిలో మగవాళ్ళంతా కూర్చుని మాట్లాడుకుంటున్నారు.వీర్రాజుగారు అసలే ఖచ్చితంగా మాట్లాడలేరు.ఏం మాట్లాడుతారో నాని నాకు ఒకవైపు భయంగా అనిపించింది.వాళ్ళవాళ్ళంతా పెళ్ళి నిశ్చయం అయిపోయినట్లే మాట్లాడుతున్నారు.కాసేపటికి నన్ను పిలిచారు.అబ్బాయి వచ్చేనెలలో యూఎస్ వెళ్ళిపోవాలనీ,పదిరోజుల్లో ఉన్న ముహూర్తానికి పెళ్ళి అని చెప్పారు.ఇంత ఆఘమెఘాలమీద ఎలా చేస్తాము.నాకు అయోమయంగా అయింది.
వాళ్ళంతా వెళ్ళాక నేను ఎస్టీడి బూత్ కి వెళ్ళి కింద యింట్లో వుండే యజ్ణప్రభ గారికి ఫోన్ చేసి విషయం చెప్పాను.తన సంగీతం విద్యార్థి అనే కాక ఆవిడకి పల్లవి అంటే చాలా ప్రేమ.ఆమె చాలా సంబరపడి తాను సహాయసహకారాలు అందిస్తానని భరోసా ఇచ్చారు.
తిరిగి హైదరాబాద్ రాగానే ఇంటికి కలర్స్ వేయటంతో మొదలుపెట్టి పెళ్ళిపనులు ప్రారంభించాము.
యజ్ణప్రభగారు తన ఇంట్లో పెళ్ళి లాగే మూడురోజులకు కేటరింగ్ అతనిని మాట్లాడారు.బాలప్రసాద్ మారేజ్ హాలు,అలంకరణ బుక్ చేయటం మొదలైనవాటిలో సహకరించాడు.ఈ విధంగా బంధువులు అందరి సమక్షంలో అనుకున్న కన్నా వైభవంగా పల్లవి పెళ్ళి జరిగింది.అజయ్ తో " పల్లవి తనకేంకావాలో మనసు విప్పి చెప్పదు.కనిపెట్టి చూసుకో" కళ్ళనీళ్ళతో చెప్పాను.
మూడురోజుల తర్వాత పల్లవీ,అజయ్ విజయనగరం వెళ్ళిపోయారు.
తర్వాత పదిహేను రోజులకే అజయ్ ప్రయాణం ఈ లోగా మేనేజ్ సర్టిఫికెట్ తీసుకోవటం,పాస్ పోర్ట్ కి అప్లై చేయటం చేసారు.
అజయ్ తల్లిదండ్రులు,పల్లవీ మేమూ కూడా అజయ్ కి సెండాఫ్ చేయటానికి బొంబాయి వెళ్ళాము.
మళ్ళా వెంటవెంటనే ప్రోసెసింగ్ మొదలై పల్లవికి కూడా వీసా వచ్చేసింది.ఫ్లైట్ టికెట్ కొనటం మొదలైనవన్నీ మా ఇంటి పక్కనే వున్న పల్లవి స్నేహాతురాలు సుధావాళ్ళ అన్న సీతా ట్రావెల్స్ లో వుద్యోగం కావటం వలన రఘునే చూసుకున్నాడు.ఆ అబ్బాయి మా యింట్లో పిల్లాడిలా సహకరించాడు.
ఎప్పుడూ వంటరిగా విజయనగరం కూడా పంపలేదు.ఇప్పడు ఏకంగా సప్తసముద్రాలుదాటి ఖంఢాంతర ప్రయాణానికి సిద్ధం అవుతోంది. హైదరాబాద్ నుండే పల్లవి ఫ్లైట్.రఘూ కూడా అక్కడ పని చేయటం వలన పల్లవితో పాటూ లోపలికి వెల్లి చెకిన్ అయ్యేవరకూ ఉండి వచ్చాడు.
సెండాఫ్ ఇవ్వటానికి ఎయిర్ పోర్ట్ కి వెళ్ళాము.ఇప్పటిలా ఆరోజుల్లో సెక్యూరిటీ ఎక్కువగా ఉండేది కాదు.అందుచేత లాంజ్ వరకూ వెళ్ళాము.
పల్లవి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా ఒంటరినై పోయినట్లు అయ్యింది.ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిసి వెళ్ళటం మనసులో మాటలు ఒకరికొకరం చెప్పుకోవటం స్నేహితుల్లా వుండేవాళ్ళం.
పల్లవి యూఎస్ చేరిన తర్వాత తన ప్రయాణం అనుభవాన్ని సుదీర్ఘంగా ఉత్తరం రాసింది.ఉత్తరాలు రాసినా అవి ఖండాంతరాలు దాటి గమ్యం చేరుకోవటానికి చాలా రోజుల పెట్టేది.అప్పటికి సెల్ ఫోన్లు లేవు ఐ.ఎస్.డీ సౌకర్యం వుంటేనే మాట్లాడుకోవాలి.అందుచేత పల్లవి వాళ్ళు ఫోన్ చేసే వరకూ ఆగాల్సిందే.లేదా ఎస్టీడీ బూత్ కో, కంప్యూటర్ సెంటర్ కో వెళ్ళి మాట్లాడాలి.ప్రతీ ఆదివారం ఉదయమే తొందరగా లేచి తయారై ఫోన్ కోసం ఎదురు చూడటం ఒక ప్రధాన కార్యక్రమం.
అప్పట్లోనే నేను రాసిన పడమటి గాలి అనే కవిత ప్రచురణ అయ్యింది.ఆ కవిత పెద్ద సంచలనం.అమెరికాలో పిల్లలున్నవాళ్ళు చాలా మంది ఆ కవితను జిరాక్స్ చేయించుకున్నామని చెప్పటం నాకు భలే సంతోషం కలిగించింది.ఒక కవిత అంతమందికి అనుసంధానం కావటం కన్నా కవికి కావాల్సిందేమిటి?
నాకు మెనోపాజ్ సమస్యలు రానురాను ఎక్కువ అవుతున్నాయి.ముఖ్యంగా రక్తస్రావం ప్రతీ నెలా 15-20 రోజులు కావటంతో నీరసం ,తరుచు కళ్ళు తిరిగి పడిపోవటం జరుగుతుంది.ఇంటి దగ్గర్లో వున్న ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు వాడుతున్నా తగ్గటం లేదు.
దీనికితోడు పెద్దమరిది తీవ్ర అనారోగ్యం పాలు అయ్యాడు. కొన్నాళ్ళు కామినేనిలో చేర్చారు.కానీ ఫలితం ఏమీలేదు.అన్నిరకాలపరీక్షలూ చేయగా కేన్సర్ అని మూడునెలల కన్నా జీవించటం కష్టమని తెలిసింది.వీర్రాజు గారు రోజు విడిచి రోజైనా వెళ్ళి చూసి వస్తున్నారు.ఒక్కొక్కప్పుడు స్కూల్ నుండే అలా సీతాఫలమండీ వెళ్ళి నేనూ చూసి వస్తున్నాను. ఒకవైపు నా శారీరక ఇబ్బంది, మరోవైపు తమ్ముడి గురించి డీలా పడిపోతున్న వీర్రాజు గారు,స్కూలులో వత్తిడి వీటితో సతమతమై పోతున్నాను.
ఒకరోజు స్కూల్ నుండి వచ్చి స్నానం చేసి కాఫీ తాగుతున్నాను.మా మరిది పోయిన వార్త ఫోనులో.వెంటనే ఆఘమేఘాల మీద ఇద్దరం వెళ్ళాం. కేన్సర్ పేషెంట్ ,అంతేకాక ఒళ్ళంతా అనేక అనారోగ్యాలతో పాడైంది.వెంటనే కార్యక్రమం చేయకుండా మర్నాటికి వాయిదా వేసారు.రాత్రంతా జంగమోళ్ళుకాబోలు వైనాలువైనాలుగా వర్ణిస్తూ ఏడుపు పాటలు,మధ్యలో తాగుడు,ఆ పరిసరాలన్నీ కంపుతోనూ, అపరిశుభ్రతతోనూ నిండి పోయింది.అదిగాక మరిది శరీరం నుండి కలుషరక్తం నవరంధ్రాలు నుండీ వెలువడుతుంది.నేను అక్కడ వుండలేని పరిస్థితి.కానీ తప్పలేదు.మాతోటికోడలు పుట్టింటి వాళ్ళు వచ్చాక అంత్యక్రియలు మొదలయ్యాయి.వీర్రాజుగారే చేసారు.ఆ పదిరోజులూ మొత్తం ఖర్చు అంతా మేమే పెట్టుకున్నాం.దశదిన కార్యక్రమంలో చేసేవి నాకు నచ్చక పోయినా మౌనంవహించకతప్పలేదు.
చిన్నన్నయ్య పెద్దకొడుకు భార్గవ సివిల్స్ కి ప్రిపేర్ కావటానికి వచ్చాడు.క్రితం సారి విజయనగరం వెళ్ళినప్పుడే అన్నయ్య చెప్పాడు "పరీక్షలు కాగానే నీదగ్గర కు భార్గవి పంపించేస్తాను.ఏంచేయాలనుకుంటున్నాడో కొంచెం కనిపెట్టి చూసుకో "అని. అయితే రోజంతా పుస్తకాలు చదువుతున్నాడు కానీ సివిల్స్ కి పనికొచ్చే వి చదువుతున్నట్లు అనిపించలేదు.కొన్ని రోజులు దిల్ సుఖ్ నగర్లో ఏదో కోచింగ్ సెంటర్ లో ఫేకల్టీగా జాయిన్ అయ్యానని చెప్పాడు.నేను టిఫిన్, కూరా పప్పు చేసి నా మట్టుకు అన్నం వండుకునే దాన్ని.వీర్రాజుగారు తర్వాత వాళ్ళిద్దరికీ అన్నం వండేవారు.పదింటికి టీ కూడా ఇద్దరికీ చేసేవారు.నేను సాయంత్రం స్కూల్ నుండి వచ్చేసరికి ఒక్కొక్కసారి టీ కప్పులు మంచం దగ్గర పుస్తకాలు షెల్ఫ్ మీద ఈగలువాలుతూ ఎండిపోయి వుండేవి.డైనింగ్ టేబుల్ మీద కూడా ఎక్కడివక్కడే వుండేవి.వీర్రాజగారికి భోజనం అయ్యాక మిగిలినవి ఫ్రిజ్ లో పెట్టేసేవారు.భార్గవకి అలవాటు లేక వదిలేసే వాడు.అలసిపోయి వచ్చిన నాకు చికాకూ,కోపం వచ్చేసేది.ఆ పిల్లాడిని అనలేక ఆయనపైనే వెళ్ళగక్కేదాన్ని.
" సివిల్స్ కి ప్రిపరేషన్ అన్నాడుకదా వివేకానందుడు, రామకృష్ణ పుస్తకాలు చదువుతున్నాడు.ఒకసారి వాణ్ణి మందలించు " అన్నారు ఒకసారి.
"అనకుండా ఆయన మంచివాడనిపించుకోవాలి.అని నేను చెడ్డదాన్ననిపించుకోవాలా" అని మనసులో అనుకుని వూరుకున్నాను.
ఆ తర్వాత్తర్వాత నాకు మానసికంగా కూడా ఒత్తిడి,కోపం పెరిగి అవి అణచుకోవటంతో రక్తస్రావం ఎక్కువగా వుండేది.ఇక నా ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సివచ్చింది.ఇంటికి దగ్గర్లోనే ఉన్న జయనర్సింగ్ హోం లో చూపించుకున్నాను.చాలా పరీక్షలు చేసి హిస్టరెక్టమీ చేయించుకోవాలన్నారు.
అయితే కనీసం ఒకనెల అయినా బరువులవి ఎత్తకూడదు.ఏంచేయాలో అర్థం కాలేదు.వెంటనే పెద్దక్క తాను సాయం వస్తానని చెప్పింది.ఆమెతో పాటూ చిన్నక్క,మా చిన్న ఆడపడుచు కూడా వచ్చారు.
మేజర్ ఆపరేషన్ కావటం వలన జనరల్ అనస్థీషియా ఇచ్చారు.ఎందువలనో ఆపరేషన్ తర్వాత సాయంత్రానికి కూడా స్పృహ లోకిరాలేదు.అంతేకాక బీపీ పెరిగి పోయింది.దాంతో అనెస్థీషియన్ కంగారు పడి మెలకువ తేవటానికి ప్రయత్నాలు చేయగా అప్పటికి మామూలుగా తెవిలోకి వచ్చాను.వారంరోజులకి డిస్చార్జ్ చేసారు
పెద్దక్క కూతురు శ్రీదేవి కూడా వచ్చి రెండు లరోజు లు సాయంగా వుంది.నేను ఇంటికి వచ్చాక నాలుగైదు రోజులకి అందరూ వెళ్ళిపోయారు.
సివిల్స్ పరీక్ష అని పేపర్లో చూసాను.కానీ భార్గవి పరీక్ష రాయటానికి వెళ్ళలేదు.ఏవో పుస్తకాలు చదువుతూ కూర్చున్నాడు.నేను భరించలేక పరీక్ష గురించి అడిగాను.విద్యావ్యవస్థ గురించి కామెంట్ చేసాడు.ఆ ఏడాదే నోబుల్ ప్రైజ్ పొందిన అమార్త్యసేన్ గురించి అతను ఎన్నాళ్ళు ఖాళీగా వుండి తర్వాత ఈ స్థాయికి చేరాడో చెప్పాడు.
" వాళ్ళ సంగతి సరే మీ నాన్న ఏ స్థాయినుంచి ఎదిగి ఎంత కష్టపడి మిమ్మల్ని ఇంత మంచి చదువు చెప్పించాడో గుర్తుంచుకో .ముందు మీ నాన్న మీద ఆధారపడకుండా కొంతకాలం బ్రతకటానికి సరిపడా సంపాదించి, తర్వాత నువ్వు ఏం చేయాలనుకున్నావో అది చేసుకో " కొంచెం సీరియస్ గానే అన్నాను.
ఏమనుకున్నాడో సాయంత్రం తన సామాను తీసుకుని వెళ్ళిపోయాడు.అయితే ఇంట్లో ఏం చెప్పాడో తెలియదు.అప్పటినుండి చిన్నన్నయ్య నుండి ఉత్తరాలు ఆగిపోయాయి.నేను రాసినా సమాధానం లేదు.వీర్రాజుగారు రాసినా సమాధానం లేదు.ఇంక ఊరుకోలేక నేను వివరంగా అన్ని విషయాలూ రాసి' పిల్లల బాగు కోరుకునే టీచర్ని.నాకు పల్లవి ఎంతో వాడూ అంతే. అందుకే పరీక్ష రాయటానికి వచ్చినవాడు పక్కదారి పడుతున్నాడేమోనని మందలించాను.మన్నించు.'
అని వుత్తరం రాసాను.దానికి కూడా సమాధానం లేదు. నాకు మనసు చాలా నొచ్చుకుంది.
వీర్రాజు గారి సాయంతో యథావిధిగా పనులు చేసుకున్నాను.పెట్టిన నెలరోజుల సెలవు పూర్తి చేసుకుని లాస్ట్ వర్కింగ్ రోజు తిరిగి స్కూలుకి వెళ్ళాను.తర్వాత ఎలాగూ వేసవిసెలవులే కనుక నేను రెస్ట్ తీసుకోవచ్చును.
7, జులై 2024, ఆదివారం
నవ్వుల పువ్వుల తోటగా యాత్రనవల
~ నవ్వుల పువ్వుల తోట యాత్ర నవల~
"ఏదయినా చదివితే, అది మనకో చక్కని అనుభవం కావాలి. మనసు వికసించాలి. కొంచెం సేపు పుస్తకం మూసి 'మ్యూజింగ్స్' లోకి -పోగలగాలి. బలవంతాన రెక్కపట్టుకు చదివించాల్సి వస్తే ఆ రచన ఏదయినా కావచ్చు గాని మంచి ఫిక్షన్ మాత్రం కాజాలదు."
-- పురాణం సుబ్రహ్మణ్య శర్మ
విజయనగరం గుర్తొస్తే చాగంటి సోమయాజులు నోట్లో చుట్టతో కళ్ళముందుకు వచ్చేస్తారు.చాసో కథ గుర్తొస్తే ఆయన 1942 లో రాసిన మొదటి కథ " చిన్నాజీ"మనసులో మెదులుతుంది. చిన్నాజీతో పాటు చాగంటి తులసి బామ్మ రూపాయితోనో, యాష్ ట్రే తోనో తలంపులోకి కదలి వచ్చేస్తుంది.
అలా అలా 1978లో రాసిన యాత్ర నవల పునర్ముద్రణ పొంది నా చేతిలోకి వచ్చింది. చదివితే ఈ నవలలో ఏముంది? నిజానికి ఏమీ లేదు.పాపా, బాబూ మాటిమాటికీ గెంతుతూ నవ్వుతూ చేసే అల్లరి వుంది. సీతమ్మగారి కుటుంబంలో కొడుకూ,కోడలూ, వచ్చే స్నేహితులు ఒకర్నొకరు ఆట పట్టిస్తూ నవ్వుకొంటూ సీతమ్మ గారితో కలసి చేసే సందడి వుంది. అంతే కదా అనుకుంటే మాత్రం అంతే. కానీ అంతుపట్టని మూడు తరాల కుటుంబగాథలో మొదటితరం సీతమ్మగారి అభ్యదయ దృక్పథం ఉంది. తరాల అంతరాల భేదాన్ని వదిలి పెట్టి తర్వాతి తరం వారి ఆలోచనల్లోను, ఆచరణలోనూ అవసరమైన వాటిని అంది పుచ్చుకొని వారితో పాటూ నడవగలిగితే ఇల్లొక నవ్వుల పువ్వుల తోటగా మారి ఒక ప్రశాంత నిలయం అవుతుందనే పాఠం వుంది.
కలకత్తాలోని కొడుకూ, కోడలుతో అభిప్రాయ భేదాలతో వాళ్ళతో కలిసి వుండలేక అమ్మన్న యాత్రకు పోతానని, ఒరిస్సాలోని కటకంలో వున్న బాల్యస్నేహితురాలైన సీతమ్మ ఇంటికి రావటంలో నవల మొదలౌతుంది .
యాభై అరవై ఏళ్ళనాటి స్తోత్రీయ బ్రాహ్మణ కుటుంబంలోకి వెళ్ళి మడీ. తడి, కుంపటి మీద వండుకోవటం, వితంతువులు తమకోసం మడిగా సొజ్జనో, ఉప్పుడుపిండినో చేసుకొని తినటం మొదలైనవన్నీ విశ్వనాధ సినీమానో, బాపూసినిమానో చూస్తున్నట్లుగా దృశ్యాలు దృశ్యాలుగా సాగుతాయి. సాంప్రదాయ బ్రాహ్మణ పుటుక పుట్టి బొత్తిగా మడీదడీ వదిలేయడమే కాక ఇంకా ఆవిషయం గొప్పగా చెప్పుకుంటుంది' విసుగ్గా అనుకుంటుంది సీతమ్మను చూస్తూ అమ్మన్న. మర్నాడు తనకోసం వంటింట్లో కుంపట్లు చూసి ఊపిరి పీల్చుకుంటుంది.
అమ్మన్న చేసిన ములక్కాడల కూర, సీతమ్మ కొడుకు కృష్ణ స్నేహితులు,ఒరియా వాళ్ళు వచ్చి వట్టి కూరనే నాక్కుంటూ తినటం చూసి ఆశ్చర్యపోతుంది.
పుట్టింట సదాచారం గల సీతమ్మ 'నా మడి దేవుడికి రెండు పూలు పెట్టేంతవరకే' అంటే ఏమనలేక వూరుకుంటుంది అమ్మన్న.
జగన్నాధుడికి ఇష్టం లేకపోతే పూరీ వెళ్ళినా దర్శనం కాదు అన్న పొరుగింటిరమణమ్మ మాటల్ని తీసి పారేస్తుంది సీతమ్మ. రమణమ్మను సమర్థించిన అమ్మన్నతో " మన బుద్ధీ మన మనస్సూ మనల్ని తైతక్కలాడిస్తుంది . మనం చేసే ప్రతీపనిని ఆ కనిపించని వాడికి అంట గట్టి లబోదిబో మనటం అలవాటైంది ' అని సీతమ్మచేత పలికించటం సీతమ్మ కమ్యూనిస్టని రమణమ్మ వేళాకోళం చేయడంతో మొదలైన సీతమ్మ పాత్ర ఈ నవలలో ఆధునాతనంగా స్నేహం, మంచితనం,సహనం, సౌహార్థం నింపుకున్నదిగా తన తర్వాతి తరం వారి ఆలోచనల్లోని, ఆచరణల్లోని మంచిని గ్రహించి ముందడుగు వేసే వ్యక్తిగా తీర్చిదిద్దారు రచయిత్రి. కటకం నుండి పూరీ, భువనేశ్వర్ అన్నింటినీ అమ్మన్నగారిని తీసుకూవెళ్తూ పాఠకులకి కూడా అన్ని ప్రాంతాలను పరిచయం చేసారు రచయిత్రి తులసి. లింగరాజ టెంపుల్ లో లింగం లేకుండా పాన వట్టమే ఉండటాన్నీ, ధవళగిరిలో బుద్ధుని జన్మ వృత్తాంతాన్ని,పాలరాతి పగోడాలో శిల్పరూపంలో చూపిస్తారు.
`మానింది మందు, బతికింది వూరు " అన్నారు. సంసారమే సంసారం, వచ్చే కెరటం, పోయే కెరటం, శివునాజ్ణ లేనిదే చీమైనా కుట్టదని,, పెళ్ళికెల్తూ పిల్లిని చంక పెట్టుకు వెళ్లినట్లు అంటూ కథా సందర్భంలో అనేక సామెతల్ని పాఠకులకు గుర్తుచేస్తుంది . 'బాలీజాత్ర' విశేషాల్ని వివరిస్తూ కార్తిక పున్నమి ఉదయం మహానదిలో స్నానం చేయించినట్లూ పాఠకులచేత కూడా దీపాల్ని వెలిగించి కాగితపు పడవలో వదిలినట్లూ, బామ్మగార్లతో పాటూ జెయింట్ వీల్ ఎక్కినట్లూ అనుభూతి పొందుతారు చదువుతో న్న పాఠకులు.
చిట్టచివరికి పూరీ వెళ్ళి అందరూ కలసి పెళ్ళిపెద్దలై మిత్రా, రత్నంలకు వివాహం జరిపిస్తారు. తెలుగు బ్రాహ్మల పిల్లరత్నం, బ్రాహ్మణేతరుడైన ఓఢ్రులపిల్లవాడితో చేయబోయే కాపురం తలచుకొని అమ్మన్న దిగులు పడుతుంది.
" బతుకంటేనే సద్దుకోవడం. నీకోసం నేనూ
, నాకోసం నువ్వు సద్దుకుంటేనే బతుకు సరిగ్గా వెళ్తుంది, పెళ్లి చేసుకుంటే సద్దుకు బతకడం ఎలాగో తెలుస్తుంది. పట్టుపడుతుంది. ఒకళ్ల కోసం తన కిష్టమైనది వదులు కోవడం, ఒకళ్ళ కోసం ఒకళ్ళు తమకయిష్టమైనవి అలవర్చుకోవడం ఎలాగో తెలుస్తుంది. పెళ్ళిముడి తో ఈ పాఠం మొదల వుతుంది - మొగుడూ పెళ్ళాలకి ఒకరికోసం ఒకరు సద్దుకుపోడం రాలేదూ ఆ ముడి కాస్తా సడులుతుంది. కాపరం చెడుతుంది విడిపోయేవరకూ వస్తుంది" కొత్తగా పెళ్ళయిన వాళ్ళకి చెప్పాల్సిన గీతోపదేశంలా సీతమ్మ చేత
ఉపదేశించారు.
నిజమే జీవితమంతా మన చుట్టూ ఉండే బంధువులూ, తోబుట్టువులూ,స్నేహితులూ అందరితో సద్దుకుపోతుంటేనే ప్రశాంతంగా ఉంటుంది అనే విషయం అమ్మన్నకు అర్థం అవుతుంది.
"తన యాత్ర అసలు సిసలు యాత్ర ..
యీయాత్ర తీర్థయాత్రే" అని తెలిసి తిరిగి తన కొడుకు దగ్గరికి కలకత్తా వెళ్ళటానికి సిద్ధం కావటంతో ఈ చిన్న నవలను పూర్తి చేసారు తులసి.
ఈ నవల పూర్తి చేసే సరికి పాఠకులు కూడా ఒరియా ప్రాంతానికి వెళ్ళి అక్కడి వారితో చిరుసంభాషణ చేయగలిగేటంతటి భాషని నేర్చుకోగలరు .
" ఇదేముంది ఒక సామాజిక వర్గానికి చెందిన ఆచారాలూ, సాంప్రదాయాలూ వివరించి, వాళ్ళకి మాత్రమే చెందిన రచన "అని నాలిక చప్పరించేసిన వారికి చెప్పేదేం లేదు.
ఈ సందర్భంలో పోరంకి దక్షిణామూర్తి గారన్న మాటల్నీ గుర్తు తెచ్చుకోవాలి."పరిణామమన్నది సాహిత్యంలోనూ, సిద్ధాంతవాదాల్లోనూ వచ్చినంత తొందరగా సమాజంలో రాదు. సమాజ సమష్టిలో కనిపించేటంత తొందరగా వ్యక్తి జీవనంలోనూ రాకపోవచ్చు. పరిణామాన్ని ఆపలేమని తెలిసి కూడా పాతకాలపు ఆలోచనల్నీ ఆచారాల్నీ పట్టుకు పాకులాడేవాళ్లు ఉంటూనే ఉంటారు. అలాంటి వాళ్లలో పరివర్తన రావడానికి అనుభవమే గుణపాఠం నేర్పాలి తప్ప లెక్చర్లు పని చెయ్యవు "
కానీ ఏజాతి, మత, కులాలకు చెందిన వారైనా తరానికీ తరానికే మారే జీవన విధానాలను,అంతరాలనూ వైవిధ్యాలను అర్థం చేసుకోవటమెలాగో తెలియజేస్తుంది. వారిమధ్య అంతరాల వలన కుటుంబాలలో జరిగే విధ్వంశాలను పట్టింపులను తొలగించుకొని ఆనందమయమైన ప్రశాంత జీవితాన్ని ఎలా గడపొచ్చో తెలియచెప్పేది చాగంటి తులసి రాసిన యాత్రనవల.
అందుకే "ఈకథ ఎప్పుడో దాదాపు 40 ఏళ్ళ కిందట చదివాను. ఈనాటికీ గుర్తుంది. ఇందులో 'జీవితం' ఉంది. 'విమర్శ' ఉంది. 'ఆదర్శం' ఉంది. తులసి రాసిన 'యాత్ర' నాకు గుర్తొస్తూ ఉంటుంది.'అంటారు రంగనాయకమ్మ.
5, జులై 2024, శుక్రవారం
రంగు వెలిసిన సిత్రాలు -13
13వ భాగం
కానీ
నాయకులంతా
ఒక్క విషయం గుర్తుంచుకోక తప్పదు
గుండెలకు సర్జరీలు చేసి
ఎన్ని ఆశల్ని గుప్పించినా
ఎన్నెన్ని పథకాల శుధ్ధరక్తాన్ని
నరాలగుండా ఎక్కించుతామన్నా
ఒక్క సిట్టింగ్ డయాలసిస్ తో
కొత్తతేజస్సు నింపుతామన్నా
రెప్పల్ని ఎత్తి పెట్టి కళ్ళనిండా
కోటికోటి కలల్ని రచించినా
చెవుల్లో జోరీగలై ఝుమ్మంటూ
వేనవేల వాగ్దానాల్ని రెపరెపలాడించినా
హోలు మొత్తంగా
ఓటరుదేవుళ్ళను భుజాలపై ఎత్తుకుని
ఊరూ వాడా ఊరేగించినా
ప్రజలెప్పుడూ వెర్రి వాళ్ళు కానే కారని
గత అనుభవాలు చెప్పకనే చెప్తూనే ఉన్నాయ్
జనం ఆలోచనలు మెదడు పొరల్లో
గుసగుసలాడుతూ కదుల్తూనే ఉంటాయ్
వాళ్ళ ఎంపికలు మనసుపేటికల్లో
భద్రంగా సీలు చేయబడే ఉంటాయ్
ఒకోసారి ఒక ఆశ తాత్కాలిక చలనమై
అలలా హృదయాన్ని తాకినా
ఒక్కక్షణం మనసు సంచలించినా
తొలినిర్ణయం మాత్రం సుస్థిరమే
దాన్ని పెళ్ళగించాలనుకోవటం అజ్ణానమే
మళ్ళీమళ్ళీ బతుకు చిత్రాన్ని
తెలివిగల ఓటరెప్పుడూ
వెలిసి పోనివ్వడు సుమా
ఇది సత్యం ఇదే నిత్యసత్యం.
-- సమాప్తం-
రంగు వెలిసిన సిత్రాలు -12
12 వ భాగం
నగరమంతా వెలుగు పొదరిల్లు అయ్యింది
ఊరూ వాడా రంగులచిత్రమౌతోంది
రోడ్లపై తేలుతూ కదిలే వాహనాలు
కోలాటాలు కోలాహలాలు
గుంపులో చిందు నృత్యాలు
అరిగి పోయిన శబ్దపేటికలనుండి
ఎగిరే పాటల పావురాలు
మళ్ళా చరిత్ర పునరావృతం ఔతుందేమోనన్న
స్పృహలేని సంబరాల్లో జనం!
భ్రమావరణంలో నాయకులు!!
అంతకుముందు పదవుల పీఠాల్ని
అలంకరించిందీ వారే కదా
నాటి మెరుపులకు అంటుకున్న మరకల్ని
కప్పిపుచ్చే గురివిందలూ వారే కదా
ఏం ఒరగబెట్టారని ఏ ఒక్క ఓటరైనా
ప్రశ్నను సంధిస్తే
ఏ కండువాలో ముఖం దాచుకోవాలో మరి!
కానీ
నల్లనోటు రెపరెపల్తో
మందునీళ్ళ మంత్రజలం చెల్లి
కలికానికైనా కనిపించని కపటప్రేమను
గ్రాఫిక్ పథకాలతో ప్రదర్శిస్తే
వెర్రి బాగుల ఓటర్లు మాత్రం
క్షణభంగురమైన ఆశల నీటిబుడగల్లో
భవిష్యత్తును కలగంటూ
రంగులప్రపంచంలో
మునుగీతలు కొడ్తుంటారు
అదే కదా వారి ధీమా
రంగు వెలిసిన సిత్రాలు -11
11 వ భాగం
నోటినిండా బురదని పుక్కిట పట్టి
మాటల దుర్గంధాన్ని జనం మీదుగా
తుంపర్లు తుంపర్లు గా వెదజల్లుతూ
రోడ్డు పక్కనే మురికిగుంటల్లో
దొర్లి దొర్లి పొర్లి పొర్లి
గుమ్మాల ముందుకొచ్చి
ఒళ్ళు దులపరించు కొన్నట్లు
కాలుష్య పూరిత చెరువుల్లో
ముంచి తీసిన బట్టల్ని
రోడ్డెక్కి ఒక్క ఉదుటున దులిపినట్లు
బహిరంగస్తలాలన్నీ బహిర్భూములైనట్లు
బారికేడ్ల ముళ్ళకంచెల మధ్య
జనసమూహాల్ని బంధించి
ఊరూరా సేకరించిన దుమ్మునంతటినీ
నాలుకచేటల్తో చెరిగి చెరిగి
ప్రతిపక్షాలపై ఎత్తి పోస్తుంటే
ఊరూవాడా కాలుష్యమౌతున్నాయ్
శివార్లలో మైదానాల్లో
ఎగిరెగిరి పడ్తున్న శబ్దాల్ని
ఛానళ్ళు పోటీ పడి
ఇళ్ళనిండా విరజిమ్ముతున్నాయ్
ఏ తెల్లవారు ఝామునో
నిర్వికారంగా నిర్వేదంగా
ఎప్పటికీ బాగుపడని బతుకుల్ని
చెత్త బుట్టలో మోసుకు తిరిగే మహిళలు
యథావిధిగా రోడ్లని ఊడ్చుతూ
చెత్తకుండీలు నింపుతూ
ఎవరొచ్చినా మనబతుకులు మనవేనని
తమ కాంట్రాక్టు ఉద్యోగాలు కుక్కతోక లేనని
ఛిద్రమైన ఆశలతో
ఎండిపోయిన పెదాల్ని విరుస్తూ
కుళ్ళి కంపుకొడ్తున్న తిట్లనీ
గల్లీ గల్లీల్లోకీ ప్రవహిస్తూ వచ్చిన
దుర్భాషా దుర్గంధాల్నీ
ఆనవాలైనా కనబడకుండా
నిర్వికార నిరామయముఖాలతో
గంపలకెత్తి పోసే దృశ్యాలు
రహదారుల నిండా
ఎన్నో ఎన్నెన్నో
ఎన్ని'కల'లో
రంగు వెలిసిన సిత్రాలు -10
10 వ భాగం
పతాకాలన్నీ పక్షులై
ఆవరణంతా రెపరెపలాడుతుండగా
ఎవరి దేశభక్తి ఎంతో
గుండెలమీద చెయ్యేసుకోకుండానే
కీర్తించగలిగేదీ ఇప్పుడే
ఎదుటివాడి మతోన్మాదాన్నో
పక్కవాడి కులగజ్జినో
సాధ్యమైనంతగా గోకి ఫొటోలు తీసి
జూమ్ చేసి చూపేది ఇప్పుడే
తిన్నింటి వాసాల్తో సహా
లెక్కలన్నీ తేల్చేసుకునేదీ ఇప్పుడు కాక మరెప్పుడు?
వరుస సభలూ సమావేశాల్తో
జయధ్వానాలు పిట్టల్లా ఎగురుతూ
మైదానాలన్ని తిరునాళ్ళైపోతున్నాయ్
రహదార్లు సైతం వేదికలౌతున్నాయ్
చౌరస్తాలు జాతర్ల కూడళ్ళౌతున్నాయ్
పనుల మీద రోడ్డెక్కిన వారికే గానీ
రణోత్సాహంలో ఊగిపోతున్న వారికేం ఇబ్బంది?
అత్యవసర ప్రాణాపాయంలో ఉన్నవారికి
ప్రాణసంకటం గానీ
ఉత్సవవిగ్రహాలకి చెలగాటమేకదా
ఓటర్ల మనసులో మెదిలే విచికిత్స
చిన్నదైతే కావచ్చు
కరివేపాకులా విసిరేసేదైతే కాదు
రాజకీయ చదరంగంలో చెక్ పెట్టేది
ఎప్పుడైనా చివరికి ఓటర్లే
అందుకే మరి
రోజురోజుకీ కుంగికృశించిపోతున్న తల్లికి
నరాల్లోని పాతరక్తాన్ని తోడి పారేసి
దేశభక్తి డయాలసిస్ తో
స్వచ్ఛమైన కొత్తరక్తాన్ని నింపుతామనో
చర్మంపై తేలిన నరాలనదుల్ని అనుసంధానం చేసి
పచ్చని వృక్షచర్మంతో ప్లాస్టిక్ సర్జరీ చేసి నవయవ్వనవతిగా తీర్చుతామనో
ఎండి నెర్రెలు విచ్చిన పొట్టకు
పంచభక్ష్య పరమాన్నాలందిస్తామనో
పంచప్రణాళికల విత్తనాల్ని
హారాలుగా వేసుకు తిరుగుతూ
ధూపంలా ఎగిరే జనం స్వప్నాల్ని
ఆశీర్వాదాలుగా మార్చుకుంటూ
కరుణార్ద్ర హృదయులై
అపర ప్రేమ స్వరూపులై
వీథివీథినా వాడవాడలా పావనం చేస్తూ
ఎదురుచూడని స్వాముల దర్శనభాగ్యానికి
పులకితులైన జనాన్ని
చిరునవ్వుల చిద్విలాసాలతో
నమస్కారాల చిరునవ్వులతో
కరస్పర్శల చక్కిలిగింతలతో
శిరశ్చుంబన ఆశీర్వచనాలతో
మరింతగా మోహపరవశుల్ని చేస్తూ
రోజురోజుకూ బలుపు పెంచుకుంటూ
ఊరూవాడా బాటా పేటా
పాదయాత్రలే పాదయాత్రలు!!!
-- శీలా సుభద్రాదేవి
రంగు వెలిసిన సిత్రాలు -8,9
దీర్ఘకవిత
8.వ.భాగం
సంకల్పితం కావచ్చు
అసంకల్పితమైనా కావచ్చు
ఏ పార్టీ ఎవరి ఓట్లను చీల్చుతుందో
ఏవేవి కూటములు కట్టి
ఉమ్మడి కుంపట్లు రాజేస్తాయో
ఏవేవి సొంతంగా చలికాచుకుంటూ
ప్రభుత్వ వంటల్ని వండి వార్చాలనుకుంటున్నాయో
ఏ ఆలింగనం మేలు కలిగిస్తుందో
దేన్ని దగ్గరకు తీస్తే
ధృతరాష్ట్ర కౌగిలి అవుతుందో
ప్రతిజండాకీ భయమే
అతుకులబొంతగా అన్నింటినీ కలిపి కుట్టి
జండాగా ఎగరేస్తే
ఏ వ్యతిరేకగాలో బలంగా వీస్తే
కుట్లను తెంపి ఎన్ని పీలికలు చేస్తుందో
ఏమిటో అన్నీ అనుమానాలే
చేతులు కలిపి మానవహారాల్ని కడుతున్నా
ఏ అంగీ కింద ఏ చురకత్తి దాగుందో
దొంగచూపుల సిసికెమేరాల నిత్యపహారాలే!
ఇప్పుడిక
నాయకమ్మన్యుల ఇళ్ళల్లోని కళ్ళన్నీ
వత్తులు వేసుకుని వెలిగే దీపాలౌతుంటాయి
వెన్నుపూస లోతుల్లోంచి చలిపాము
సర్రున పాకినట్లు జలదరింపులు
బయటికి డాంబికాల మాటల్తో
ప్రజలపై వరాలజల్లులు కురిపిస్తున్నా
ఏమూలో మనసులో తేలుకొండిలా
ఓటర్ల మీద అనుమానపు త్రాచు
భయం ఉండుండి పడగవిప్పుతూనే ఉంది
దుర్భిణీ వేసుకు వెతుకుతున్నా
చీకటి మూలాల మాటున
గూడుపుఠాణీ అనుమానాలే
భజనపరులు చుట్టూ చేరి
జయనామ జపాలు చేస్తున్నా
ఎక్కడో ఏమూలో
తేలుకొండిలా లేస్తున్న భయం భయం!!
9వ.భాగం
బలుపో వాపో
బయట పడని ఎదుటివాడి కదనోత్సాహం
కత్తిలా గుండెల్లో దిగుతూనే ఉంటుంది
అనుమాన భూతం ఆవహించిన కళ్ళకు
వాళ్ళనీడే వాళ్ళను భయపెడుతోంది
చలువ గదిలో కూర్చున్నా
నుదుటిమీద చెమటచుక్కలు మొలుస్తుంటాయ్
అయినా తప్పదు మరి
పెదాలపైపూత నవ్వులు
ఛాలెంజులూ పందేలు
మీసాల మెలివేతలూ
తొడకొట్టుడు పంతాలు
తమతమ గజబలాల ప్రదర్శనలు
అశ్వాలతో కవాతులూ
చదరంగం బల్లమీదే కాదు
ప్రాపు కోరే వందిమాగధ సౌరంభాలతో
ఎవరికివారు ఎన్నికల కదనరంగాన్ని
కబ్జా చేసే సవాలక్ష ప్రయత్నాలు
ఎన్నికల్లో తప్పదు కాక తప్పదు కదా
సామాన్యులకు మాత్రం
ఎదురుచూసి ఎదురు చూసి
కంటిదీపం కొడిగడ్తుంటే
పగిలిన స్వప్నాలను చిరుగులకొంగులో
మూటకట్టుకోక తప్పటం లేదు
ఎంత జాగ్రత్తగా కట్టాలనుకున్నా
రాలిపోతున్న స్వప్నశకలాలు
గుండెల్ని ఛిద్రం చేస్తున్నా ఏదో చిగురాశ
రేపో మాపో పేదల్ని అక్కున చేర్చుకునే
దయార్ద్ర మారాజు అందలం ఎక్కుతాడని
కళ్ళదీపాల్ని ఆశలతో ఎగదోస్తూ
ఇంటినిండా వెలుగులు పరిచి
ఆరిపోకుండా నమ్మకాన్ని అడ్డుగా చేర్చి
ఏరోజు కారోజు
ఛిద్రమౌతున్న కలల్ని కూడగట్టుకుంటూ
అవసరమైనప్పుడు జైకొడుతూ
భద్రజీవితాల్ని కలగంటూ.....కలగంటూ...
మాన్యులు కాని సామాన్యులు!
రంగు వెలిసిన సిత్రాలు -5,6,7
5.వభాగం
ఎక్కడ చూసినా గోడలే !
మనిషికీ మనిషికీ మధ్య
కులాలకీ మతాలకీ నడుమ
ఎక్కడికక్కడ నల్లతుమ్మ చెట్లలా
మొలుస్తున్న నిలువెత్తు గోడలు!
ఏమానవతావాదో,సమతావాదో
అడ్డుగోడల్ని నేలమట్టం చేయబోతే
వారినే నిర్దాక్షిణ్యంగా పడగొట్టి
వారిపైనే సరికొత్త గోడ మొలిపించి
ఆ గోడలపైనే కాచుక్కూచున్న పిల్లులై
నలుదిక్కులా చూపులసెర్చి లైట్లు ప్రసరిస్తూ
గోడలపైనే పహారా కాస్తూ
ఏనాయకుడో ఎరగా విదిలించే పదవికోసం
రెప్పవాల్చకుండా పరిశీలిస్తూ
అవసరం వస్తేనో అవకాశం చిక్కితేనో
పక్కవాడి పై దాడి చేసైనా హస్తగతం చేసుకోవాలని
అందుబాటులో ఉన్న వాడిని నిచ్చెన చేసుకుని
దూకాల్సిన శుభగఢియ కోసం
నిరీక్షిస్తూ.... నిరీక్షిస్తూ... నిరీక్షిస్తూనే
కళ్ళపై వాల్తున్న కునికిపాటుని విసిరికొడ్తూ
కాలాన్ని కరిగిస్తున్నారు ఛోటా మోటా లీడర్లు
• *. *. *
6.వ.భాగం
ఈనాడు
రాజకీయ అనిశ్చితి అక్కర్లేదు
విధాన నిర్ణయాలు వెదజల్లితే చాలు
వైఫల్యాల్నిన అంగీకరించటమంటే
కండువాకి వేలాడటమే కదా
కోరి కోరి మెడపై కత్తి ఎందుకు పెట్టుకుంటారు
భ్రమలో నైనా ఆశావాదులు గానే ఉండాలి
అందుకే సభలో ధ్వనించే జేజేలనూ
శృతిలేకున్నా అపస్వరాలు ధ్వనించినా
గుండెల్లో దాచుకుని మురవక తప్పదు
పవనాలు ఎటునుంచి వీస్తేనేం
శరీరాన్ని చల్లగా తాకుతే చాలు
దాడి కట్టిన వందిమాగధుల కోలాహలం
చేదు నిజాన్ని మింగనివ్వదు కదా
ఇప్పుడు
ఎన్నికలంటే ప్రజాభిప్రాయం కాదు కదా
గెలుపోటములు నిర్ణయించేది చేతికంటిన తడే
ఎంత నోట్లధార కురిపిస్తే అంత బలగం
నిజాయితీ ఎప్పుడో మనసు ముడుచుకుని
మూడుకోతులతో పాటూ నాల్గో కోతైకూర్చుంది
జనాదరణ ఉందనేది నీటిరాతే
చెయ్యి తడవకపోతే
బాలెట్ బాక్సులు నోరెళ్ళబెట్టాల్సిందే
స్థానబలిమి ఉందని విర్రవీగితే
కాళ్ళకింద నేల జారుడుబండే
ఎంత కుమ్మరిస్తే అంతా దిగుబడి
ఎంత వరద పారిస్తే అంతా రాబడి
అభ్యర్థుల మేధస్సుతో పనిలేదు
వేలిముద్రలగాడైనా పర్లేదు
సిగ్గుఎగ్గుల్ని దులిపేసుకుంటే చాలు
ఓటర్లనాడి పట్టగల్గితే బాగు
• *. *
7 వ భాగం
అసమ్మతుల అలకలు తీర్చడం ఒక ఎత్తు
పక్కపక్షం వాడిరెక్కలు తెగ్గొట్టి తేగల్గటం మరో ఎత్తు
గుర్రం మీద కూర్చుని గడకర్రకు ఎరకట్టినట్లు
ఓటర్లను బూత్ ల లోనికి
పరిగెత్తించే కుయుక్తులు ఇంకో ఎత్తు
ఇదికూడా అంత తేలిగ్గా అయ్యే పని కాదుకదా
ప్రజలముందు వెలిగించే ఉపన్యాసమతాబులు
ఉత్సాహాన్నిపెంచికాంతిపుంజాలై కురవాలి కదా
రేప్పొద్దున గద్దెక్కితే అవే పులకింత పూలవ్వాలి
పాదాలకింద నిప్పు కణికలు కాకూడదు కదా
వెచ్చించిన దానికి లెక్కాపత్రాలు లేకపోవచ్చు
కానీ
అందలం ఎక్కాక
అధికారం చిక్కాక
అంతకు ఎన్నింతలు రాబట్టొచ్చో
దానికి మాత్రం ఖచ్చితంగా
పద్దుల్ని రచించుకొనే ఉంటారు
ప్రస్తుతం జనహృదయాకాశంలో
ఆశల గాలిపటాలు ఎంతెత్తు ఎగరెయ్యాలా అని
ఎంతమందిని వాగ్ధానాల మాంజాలతో
కట్టి బంధించి గలమా అని
గొర్రెపాటి తమ బందెలదొడ్లో
ఏ పధకాలతో బంధించాలా అని
రెప్ప వాలని చీకటి మాటున
ఎన్ని మంతనాలో!
ఎన్ని వలలో!!
• *. *
రంగు వెలిసిన సిత్రాలు -4
రంగువెలసిన చిత్రం(ఓట్ల పండుగ పదనిసలు)
4 వ భాగం
కొత్తరంగుల తురాయిని
నెత్తిన మొలిపించుకుని
వాహనాలన్నీ కొత్తపెళ్ళికొడుకులై కులుకు తున్నాయి
వాహనచోదకులూ పదాతి దళాలు
జండాధారులై
కళ్ళనిండా కాంతులు వెలిగించుకుని
రంగులపతాకాలనీడల్లో సేదతీరుతున్నారు
అయిదేళ్ళకోసారికాకుండా
ప్రతి ఏడాది పండగకోసం కలలు కంటూ
ఆలోచనలనిండా ఆశలపందిళ్ళు వేస్తూ
ఆలుబిడ్డల కళ్ళల్లో మతాబూలు పూయిస్తున్నారు
రోజంతా గొంతులు ఎలుగురాసిపోయేలా
రోడ్లనిండా జయజయాధ్వానాల్ని
పూలజల్లులుగా కురిపించి
సూర్యుడితోపాటు రోడ్లని కొలుస్తున్నారు
పగలంతా రాజకీయ ఆవేశాలతో రగిలి రగిలి
వేడెక్కిపోయిన గుండెల్ని చల్లబరిచేటందుకై
చేతిలో పడిన పైసల్ని
మత్తుదుకాణాల్లో కుదువపెట్టి
కళ్ళల్లో దీపాల్ని వెలిగించుకుని కాచుకున్న భార్యాబిడ్డలకు
ఎప్పటిలాగే జోగుతూవచ్చి మొండిచెయ్యి విసిరేస్తున్నారు
ఎన్నికలపండగలో నిరంతరదృశ్యం ఇదే ఇదే!
కొందరు భూతదయామయులు తెల్లారేసరికి
జొన్న లో నూకలో చేతిసంచిలో నింపుకొని పావురాలకు దాణా పెట్టేందుకు బయలెల్లినట్లు భుజాలకు మేనిఫెస్టోల సంచిని వేలాడేసి
వందిమాగధుల సహితులై వీధివీధీ తిరిగి
వాగ్ధానాలు దాణాల్ని దారిపొడవునా చల్లుతూ
మేతకోసం వెతికే అవసరం లేక
ఎగరటం మర్చిపోయి
అంతస్తుల కిటికీల సందులోనో
ఆలయగోపురాల గూళ్ళల్లోనో తప్ప
పచ్చని చెట్లకొమ్మల గుబురుల్లో
వెచ్చని గూడు కట్టుకోవటం చాతకాక
జోగుతోన్న పావురాలైన జనాల్ని
ఇంకా ఇంకా
ఎదగడం చేతకాని వాళ్ళని చేసి
అవసరంలేని రాయితీలతో
మాటలమంత్రజలం చల్లుతున్నారు
రోజురోజుకూ బలం పుంజుకుంటూ
అనుయాయుల నీరాజనాలతో పరవశులౌతూ
ఆత్మస్తుతి,పరనిందలతో నిర్భీతిగా నిర్లజ్జగా
రెట్టించిన ఉత్సాహంతో కందిరీగలరొదలా
ఆవరణంతా శబ్దకాలుష్యంతో నింపుతున్నారు
ఎక్కిన పీఠం కదలకూడదనో
ఎక్కాల్సిన సింహాసనం అందుకోడానికో
ఏదైతేనేం
రెచ్చిపోతున్న పదవీ కాంక్షతో
ఊరిస్తున్న ఎన్నికలతో
వాతావరణమంతా పొగలాగ కమ్మి
ఆకాశమంతా ఎగురుతోన్న వాగ్ధానాలే వాగ్ధానాలు!
అవి ఆహ్లాదపరిచే సీతాకోకచిలుకలో
కుట్టిచంపే కందిరీగలో
అర్ధంకాని అయోమయంలో కూడా
జనసమూహం గుండెల్లో కలలేకలలు!!
• *. *
1, జులై 2024, సోమవారం
యల్లాప్రగడ సీతాకుమారి అభ్యుదయకథలు
యల్లాప్రగడ సీతాకుమారి అభ్యుదయకథలు ~
దేశంలో వచ్చిన ఉద్యమాలు కావచ్చు, సాహిత్యోద్యమాలు కావచ్చు కారణాలేమైనా కొందరు రచయిత్రులు విస్మృతులుగా మిగిలి పోతారు.అటువంటివారిలో స్త్రీజన సేవకురాలే కాక గుర్తించదగిన రచయిత్రి యల్లాప్రగడ సీతాకుమారి.
యల్లాప్రగడ సీతాకుమారి అనగానే స్త్రీ విద్యా, వితంతు వివాహం, మహిళా స్వాతంత్ర్యం మొదలైన వాటిగురించి కృషిచేసిన సామాజిక సంస్కర్తగానో,శాసన సభ్యురాలిగానో గుర్తిస్తారు తప్ప రెండు నాటికలు,కవితా ఖండికలు సంపుటి,నేను- మా బాపు పుస్తకం , గోల్కొండ పత్రికలో సమకాలీన మహిళా సమస్యలపై రాసిన రచనలూ కాక అద్భుతమైన కథలు రాసిన రచయిత్రి అనే విషయం గుర్తురాదు.
1911 న బాపట్లలో జన్మించిన యెల్లాప్రగడ సీతాకుమారి సర్వోదయ కార్యకర్త ఐన వి.ఎల్. నారాయణరావుతో వివాహానంతరం హైదరాబాదు లోనే ఆమె జీవితం తెలంగాణా సాంస్కృతిక ఉద్యమాలతో మమేకమైంది.
ఇవికాక 1968లో సీతాకుమారి సంకలనం చేసిన "మందారమాల" అనే వ్యాససంపుటి విశ్వవిద్యాలయ విద్యార్థులకు పఠనీయగ్రంథంగా ఉండేదనే విషయం అసలే తెలియదు.
సీతాకుమారి రాసిన ఓ ఎనిమిది కథలు గురించి వివరంగా తెలుసుకుందాం.
1. కులమా?-ప్రేమా? (1-4-1933 ఆంధ్రపత్రిక )
శంపాలతా, మీర్జా ఎమ్మెస్సీ ఆఖరు సంవత్సరం చదువుతున్న విద్యార్థులు. కథంతా శంపాలత పాత్రగా ఉత్తమ పురుష లో సాగుతుంది.
జాతీయోద్యమ ప్రభావం వలన కావచ్చు కథలో కులమత ప్రస్తావనకన్నా భారతీయతే ముఖ్యంగా కనిపిస్తుంది.
ఒక సందర్భంలో శంపాలత,మీర్జాల మధ్య విగ్రహారాధన గురించిన చర్చలో 'మసీదులో నియమిత సమయంలో నమాజు చేస్తారెందుక'ని శంపా ప్రశ్నిస్తుంది.'పనీపాటా లేనివాళ్ళు మతాల గురించి వెక్కిరిస్తూ కూర్చుంటారు.మంచి ఆదర్శాలు ఏ మతంలో ఉన్నా స్వీకరించాలి' అంటాడు మీర్జా.
విభిన్న మతాలకు చెందిన వారైనా ఒకరి మనోభావాలను కించపరచని సంయమనం కథలో స్పష్టీకరించటం ఉంటుంది.
బ్రాహ్మణులలో చిన్నప్పుడు వివాహం చేస్తారు కదా నువ్వెందుకు వివాహం చేసుకోక చదువుకుంటున్నావ'న్న మీర్జా ప్రశ్నకు 'పురాణాలలో కూడా స్త్రీలు చదువుకున్నారు.నేను చదువుకున్నంతమాత్రాన నా మతం ఏమీ అయిపోదం'టుంది శంపా.శంపా పాత్రని అభ్యుదయ భావాలతో చిత్రీకరించింది రచయిత్రి
టెన్నిస్ గురించిన మీర్జా ప్రశ్నకు పురాణాలలో బంగారు బంతితో ఆడే కందుక ఖేలనం గురించి చెప్పటంలో శంపా పురాణేతిహాసాలు బాగా చదువుకుందని తెలుస్తోంది.
శంపా అనేక సందర్భాల్లో మతాంతర,కులాంతర వివాహాల గురించి పురాణం, ఇతిహాసాలలోంచి ఉదాహరణలు చెప్తుంది.శంపా ప్రాచీన సాహిత్యం బాగా చదవటమే కాక అందులోని మంచిని గ్రహించి జీవితానికి అన్వయించుకుంటుందనేది తెలుస్తుంది.
శంపాలత తండ్రి అడ్వకేట్,తల్లి గృహిణి ఐనా మంచి చదువరి. మీర్జా తండ్రి ఉస్మాన్ ఝా డాక్టర్.ఇద్దరి తండ్రులు కార్పొరేషన్ సభ్యులు కావటాన పరిచయస్తులు.
శంపాలత తండ్రి విదేశాలు తిరిగి వచ్చినవాడు కనుక వారి కుటుంబం చాంధసులు కాదు కానీ మతవిశ్వాసాలపట్ల గౌరవం ఉంది.తల్లికి ఆడవాళ్ళు బ్రహ్మచారిణులుగా ఉండటం ఇష్టం.
శంపా వాళ్ళింట్లో మీర్జా భోజనం చేయటం ఆ కాలంలో కూడా శంపా కుటుంబంలో మతవివక్ష లేక పోవటాన్ని సూచిస్తుంది.
శంపాలత,మీర్జాలు ఆకర్షితులౌతున్నారని తెలిసి శంపాతండ్రి ఉస్మాన్ ఝా దగ్గరకు వెళ్ళి పిల్లల వివాహ ప్రస్థావన తేవటం శంపాకుటుంబంలోని ఆధునిక భావజాలాన్ని రచయిత్రి వ్యక్తీకరించింది.
తండ్రి సంబంధాలు చూసాడని మీర్జా కంగారు పడుతుంటే తండ్రిని వప్పించమని శంపా చెప్పినా. మీర్జా తండ్రికి ఎదురుచెప్పలేని పిరికివాడుగా ఉస్మాన్ ఝా ఒప్పుకోక పోవటంతో తండ్రి కోరికమేరకు మీర్జా వేరే అమ్మాయిని వివాహం చేసుకున్నాడనీ,మీర్జా పాత్ర చిత్రణ చదువుతుంటే రచయిత్రి పై శరత్ దేవదాసు ప్రభావం ఉందేమో అనిపించింది.
శంపాలత ఇంగ్లాండ్ వెళ్ళి డాక్టర్ ఆఫ్ సైన్స్ పరిశోధన చేసి మూడేళ్ల తర్వాత వచ్చి తల్లిద్వారా
మీర్జా భార్య తనభర్త నిరాదరణ భరించలేక ఆత్మహత్య చేసుకుందనీ, మీర్జా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసి ఒకరోజు మీర్జా ఇంటికి వెళ్తుంది.
జీవకళ లేని మీర్జాని చూసి తల్లడిల్లి అతని ఒడిలో వాలిపోతుంది శంపాలత. ఆమెని చూసి ఉద్వేగంతో మీర్జా కళ్ళుమూస్తాడని సినిమాటిక్ గా ఆ పాత్రని ముగించారు.
తల్లి కోరిక ననుసరించి శంపాలత బ్రహ్మచారిణి గా ఉండి తండ్రి ఏర్పాటు చేసిన హిందూముస్లిం లీగ్ పార్టీలో జాతి కుల మత భేదాలు లేని జాతీయోద్యమ స్ఫూర్తి తో హిందూముస్లిం ఐకమత్యానికి పాటుపడుతుంది అంటూ ఆనాటి జాతీయోద్యమ ప్రభావంతో ముగించింది రచయిత్రి.
మొత్తంగా కథ చదువుతున్పంతసేపూ ఎనభై ఏళ్ళ క్రితం రాసిన ఈ కథ ఎంతో ఆధునికంగా రాయటమే కాకుండా శంపా పాత్రని ఎంత అభ్యుదయ భావాలతో తీర్చిందో రచయిత్రి యల్లాప్రగడ సీతాకుమారి అని ఆశ్చర్యం కలుగుతుంది.
2. హాస్పిటల్లో( 1-11-1937 గృహలక్ష్మి)
హాస్పిటల్లో విజిటర్స్ రావటానికి కేటాయించిన గంట సమయంలో ఒక స్త్రీ మనోవేదనను చిత్రించిన కథ.
అది స్త్రీల ఆస్పత్రి.బాలెంతల్ని చూడటానికి విజిటర్స్ రావటంతో కథమొదలౌతుంది.ఒక్క విజిటర్ కూడా తనకోసం లేని దౌర్భాగ్యురాలు. తన జీవితాన్ని దృశ్యాలు దృశ్యాలుగా ఆలోచించుకుంటుంది.చిన్నప్పుడే తల్లి చనిపోవడాన్ని, పన్నెండేళ్ళు ప్రాయంలో ఆమెని ఒక పిచ్చివాడికి ఇచ్చి పెళ్ళిచేసి,ఆ పిచ్చివాడి యవ్వనవతి ఐన చెల్లెల్ని అరవై ఏళ్ళ తన తండ్రి పెళ్ళిచేసుకోవడం, తర్వాత ఆ పిన్ని మరొకరితో వెళ్ళిపోవడం గుర్తు తెచ్చుకుంటుంది.ఆమె ఆ పిచ్చివాడితో బాధలుపడలేక విడాకులకు ప్రయత్నించి,బయటపడి చదువుకోవడం మరో దృశ్యం.తర్వాత ఆమె చదువుకు సాయంచేసిన వ్యక్తిని ప్రేమించటం, గర్భందాల్చిన తర్వాత అతను పెళ్ళికి భయపడటం మరొక దృశ్యంగా ఉత్తమ పురుష లో తనకథ మననం చేసుకుంటుంది.
మళ్ళా ప్రస్థుత కాలానికి వచ్చి ఇప్పుడు పుట్టిన పాపని ఎలా పెంచాలని విచారిస్తుంటే సిస్టర్ వచ్చి ఏడుస్తున్నపాపకి పాలు ఇమ్మని ఆమె ఒడికి పాపని అందిస్తుంది.
ఆ పసిపాప సంపెంగ పువ్వులాంటి చిట్టి నోటితో పాలకోసం తడుముకుని అందుకోవటం, ఆమె జీవితంలో అదే ఆనందమయ దివ్య క్షణం అంటూ ఆమె మనోవేదన స్వగతం ముగిస్తుంది .అంతలో విజిటర్స్ వెళ్ళపొమ్మని క్లోజింగ్ బెల్ తో కథ ముగిస్తుంది రచయిత్రి.
ఈ కథలో సీతాకుమారి వెల్లడించిన అభిప్రాయాలు అధునాతనంగా ఉంటాయి.పిచ్చివాడికి విడాకులిచ్చి తిరిగి పెళ్ళిచేసుకోవాలనుకోవటాన్ని తండ్రి అప్రతిష్ట గా భావిస్తాడు.కానీ ఆ తండ్రి వృద్దాప్యంలో కన్నెపిల్లని పెళ్ళి చేసుకుంటే సంఘం వెలివేయదా అని ఆ పాత్ర ప్రశ్నిస్తుంది.
ఆడముండని డబ్బు ఖర్చుపెట్టి చదివిస్తానా అనే తండ్రి తన కొడుకుని మాత్రం గుంటూరులో ఉంచి నెలనెలా డబ్బు పంపుతాడు,ఆ కొడుకు చదువుకు బదులు సంకటాలుతెచ్చుకున్నాడనీ అవి వదలటానికి రెండెకరాలుతరలిపోయాయని వ్యంగ్యంగా రచయిత్రి చెప్పటంలో ఆనాటి ఆడపిల్లల చదువు పట్ల గల వివక్ష ని వ్యక్తీకరించింది.
ఆమె పాత్ర స్వగతం లో - " సంఘదురాచారాలకు సరియైన కష్టం జీవినులు,వ్యర్థజీవినులు ఇంకా ఎంతమంది వున్నారో? ఈ దేశంలో యీ బాల్యవివాహాలు,వృద్ధవివాహాలూ,యీ ఎదురువివాహాలూ యింతలో మనల్ని వదిలిపెట్టేలాలేవు "అని ఒకసారి అనుకుంటుంది.
" నాలుగేళ్ల కిందట డైవోర్స్ బిల్లు కావాలనీ,వద్దనీ శాసనసభలో కొట్టుకున్నారు' అని చెప్తూ రచయిత్రి వ్యంగ్యంగా సభలో జరిగే ప్రహసనాల్ని బట్టబయలు చేస్తుంది.సీతాకుమారి నిజామాబాద్ జిల్లా బాన్స్ వాడ నియోజక వర్గం నుంచి 1957లో ఆంధ్రప్రదేశ్ శాసన సభకు ఏకగ్రీవంగా ఎన్నికైన శాసనసభ్యురాలు కావటం వలన స్త్రీసభ్యులు చాలా మంది శాసనసభలో వున్నాకానీ వాళ్ళేమీ చెప్పరు.ఎందుకంటే సౌఖ్యంగా వున్న జీవితాలు గల స్త్రీలు వాళ్ళు. వారేమీ డైవోర్స్ బిల్లు కావాలనో,వద్దనో చర్చ చేయరు.ముందు స్వరాజ్యం వస్తే తర్వాత చూసుకోవచ్చని చర్చని దాట వేస్తారు.అని విమర్శించ గలిగింది.
విదేశాల్లో వధూవరులకు డాక్టరు సర్టిఫికెట్ వుంటే గానీ పెళ్ళి చేయరనీ,మనదేశంలో మాత్రం భార్యాభర్తల జీవితాల్ని కర్మ సిద్ధాంతం తోనూ వాళ్ళు రాతలతోనూ,గీతలతోను ముడిపెట్టేస్తారని రచయిత్రి తన మనసులో మాటని పాత్ర స్వగతం లో చెప్పిస్తారు.
కథలోని స్త్రీపాత్రదౌర్భాగ్య స్థితికి సమాజంలో స్త్రీలే ఎటువంటి సలహాలు యిస్తారో రచయిత్రి ఎలా వివరిస్తారంటే --
రామా కృష్ణా అనుకుంటూ పడివుండు- ముసలమ్మనీతిబోధ
సేవా సంస్థలో చేరి సంఘసేవ చేయు - సంస్కర్త
బతికి ఎవర్ని వుద్ధరించను ఎందులోనన్నా పడి చావు- ఒక తల్లి సలహా
మా యింట్లో వుండి మాకు వండి పెట్టి నీ కడుపు నింపుకో - రోగిష్టి యిల్లాలు.
ఇవి చదువుతుంటే సమాజంలో మానవ స్వభావాలు ఆలోచనలూ ఇప్పటికీ ఇలాగే వున్నాయనే అనిపిస్తుంది.
కథా,కథజరిగిన సమయం చిన్నదిగానే వున్నా కథలో చర్చించినవీ,ఆలోచించవలసినవీ అనంతంగా వున్నాయి.
హైదరాబాద్ లో సీతాకుమారిగారు స్త్రీల కోసం "ఆంధ్ర సోదరీ సమాజము" స్థాపించారు.చిక్కడపల్లిలో ‘’ప్రమదావనం ‘’లో అనాధలకు, వితంతువులకు, భర్తలు వదిలేసిన భార్యలకు ఆశ్రయం కల్పించి ఆదుకొన్నారు.
అంతేకాక నిజాం నిరంకుశ పాలనలో ‘’అక్కి రెడ్డి పల్లి ‘’ గ్రామం లో జరిగిన స్త్రీల అత్యాచారాలపై విచారణ జరిపేసంఘం లో సభ్యురాలయ్యారు .అత్యాచారం జరిగిన అన్ని ప్రాంతాల్లోనూ పర్యటించి స్త్రీలకు అండగా నిలిచారు సీతాకుమారి.బహుశా ఆమె పరిశీలనలోకి సంఘటనే కథగా మలిచి వుంటారు.
3.ఉత్తరాలు (గృహలక్ష్మి 01-04-1938)
ఈ కథ చదివిన పాఠకుల హృదయాలను తాకేలా ఉంటుంది. శతాబ్దాల క్రితం నాటి ప్రేమికుల ఉత్తరాలు చదవటం అబ్బురం కదా! ఆనాడే అంత ఆలోచనాత్మకంగా రాసిన ఆ ఉత్తరాలు పాఠకుల ఆలోచనల్ని కూడా రగిలిస్తాయి.
ఉత్తమపురుషలలోనే సాగిన ఈ కథలో ప్రకృతి ఆరాధకుడైన ఒకవ్యక్తి వసంతరుతువులో ఒక గుట్టమీద గతశతాబ్దంలో స్నేహితుడి తాతగారు నిర్మించిన మనోహరమైన దివ్యభవనంలో కొన్నిరోజులు గడిపి ఆ ప్రకృతి సౌందర్యంలో మమేకమౌదామని వస్తాడు .
ఎన్నో గదులున్న ఆ భవనంలో స్నేహితుడు ఒక్కోసారి ఒక్కో గదిలో అతనికి వసతి ఏర్పాటు చేస్తాడు. ఆ ఏడాది 'ఆన్ట్ రోజు' గదిని యిస్తాడు
అతను ఆ గదిలో ప్రవేశించగానే నిలువెత్తు అందమైన ఆన్ట్ రోజ్' -తైలవర్ణచిత్రం చూసి ప్రాచీన సాధ్వీశిరోమణిలను గుర్తుకు తెచ్చుకుంటాడు.
ఆరాత్రి నిద్రపట్టక ఉత్తరమైనా రాసుకుందామని గోడలోపల డెస్క్ తెరచి కాగితం, కలం కోసం వెతుక్కుంటాడు. అక్కడ పాడైపోయిన ఈక కలం కనిపిస్తుంది. డెస్క్ మూసేయబోతే లోపలికి బంగారు సూది వంటి తాళం చెవి కనిపిస్తుంది. ఉత్సాహంగా డెస్క్ ని పరిశీలిస్తే ఒక రంధ్రం కనిపించి అందులో చెవి పెట్టగానే రహస్య సొరుగు తెరుచుకుంటుంది.
అందులో పసుపుపచ్చ, గులాబీరంగుల ఉత్తరాలకట్టలు విలువైన పట్టుగుడ్డముక్కలో చుట్ట బడి ఉంటాయి.
ఆశ్చర్యంగా అందులోని కొన్ని ఉత్తరాలు తీసి చదువుతాడు.
ఒక ఉత్తరంలో --నువ్వుకోరినట్లు నీవురాసిన ఉత్తరాల్ని నీకు పంపిస్తున్నాను. నీభయం అవి బయట పడతాయనా సిగ్గుపడుతున్నావా. నేను అతి జాగ్రత్తగా దాచుకుంటాను ఎప్పుడైతే మనం ప్రేమించటానికి ఒప్పుకున్నామో అప్పుడు మధురసంగీతంలా,మలయానిలంలా మృదువుగా తాకే ఆప్రేమని మాటలుగా, వ్రాతలుగా ఒప్పుకోవాలి.
నీ భయం నాకు అర్థం అవుతుంది. వాటిని కాల్చి బూడిద చేయాలనే భీరుత్వం తెలుసు.నీ ప్రశాంత జీవనాన్ని ఆశిస్తూ వేదనతో పంపిస్తున్నాను" అని ప్రేమికుడు రాస్తాడు.
రెండవ ఉత్తరం --మిత్రమా నీవు నన్ను అర్థం చేసుకోలేదు.నేను నిన్ను ప్రేమించినందుకు విచారించను "అంటూ ఆక్ట్ రోజ్ రాసిన ఉత్తరంలోని వాక్యాలు ఆమె ఆంతర్యాన్ని,చింతనాత్మక వ్యక్తిత్వాన్ని వెల్లడిచేస్తాయి.
ప్రతీమనిషికి మరణం అనివార్యం. ఎవరూ నా రహస్యసారుగు కనుక్కోలేరు. నామరణానంతరం కనుక్కున్నా మరణించిన వారి ప్రేమలేఖల్ని
పురుషుడు కాల్చి బూడిద చేస్తాడు.అదే భార్య వున్నప్పుడైతే ఆమెని, ఆమె ప్రేమించిన వానికై పగ సాధిస్తారు.అదేపురుష హృదయం . అని ఈసందర్భంలో పురుషుల మానసిక దౌర్బల్యాన్ని
వెల్లడించింది రచయిత్రి.
"ఏ స్త్రీకి అయినా తనని ఆరాధించే ప్రియులు రాసిన ప్రేమలేఖలు తమ సౌందర్యానికి, ఠీవికీ , చాకచక్యానికీ,ఆకర్షణకీ యోగ్యతా పత్రాలు. అందుకే వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటుంది." అని ఆక్ట్ రోజ్ ముగిస్తుంది.
ఆ వుత్తరాలు చదివిన తర్వాత అతనికి ఫొటో లోని ఆక్ట్ రోజ్ ముఖం స్వార్థం,కపటం, ద్వంద్వత్వం గోచరించాయి అని రచయిత్రి ముగించటంలో పురుషులమనసులోని ద్వంద్వ వైఖరినీ, మనస్తత్వాన్ని స్పష్టపరిచింది.
4.కలిసి జీవించుదాం: (యువ 01-07-1963)
రిపబ్లిక్ డే ఉత్సవాల సందర్భంగా అరుణాదేవి ఉపన్యాసాన్ని మదన్ బాబు వినటంతో కథ మొదలౌతుంది. అరుణ తండ్రి, మదన్ బాబు తండ్రి సహాధ్యాయులు.కానీ అరుణ తండ్రి జాతీయోద్యమంలో పాల్గొని, సమాజం పట్ల అంకిత భావం కలవాడు.అవేభావాల్ని పుణికి పుచ్చు కొన్న అరుణ వివాహం చేసుకోకుండా సమాజసేవకు అంకితం మౌతుంది. మదన్ తండ్రి వ్యాపారం చేసి ధనం సంపాదిస్తాడు. మదవ్ ధనంతో పాటూ పేరు కూడా పొందటానికి లలిత కళా మందిరాన్ని స్థాపించుతాడు.
మదన్ కు మేధావులైన స్త్రీలంటే చిన్న చూపు. అరుణని తన లలిత కళాభవనంకి తీసుకెళ్ళి తనగొప్పతనాన్ని ప్రదర్శించబోతాడు మదన్ లలిత కళా సంఘంలో నృత్యమందిరం,గాన మందిరం,చూసాక చిత్ర కళామందిరానికి వెళ్తారు. అక్కడ సౌందర్య ప్రధానమైనవి కాక సమాజానికి సందేశమిచ్చే చిత్రాలు చూసిన అరుణ అవి వేసిన కృష్ణ భూషణ్ తో ఆత్మీయంగా మాట్లాడుతుంది. తర్వాత కూడా అరుణ మరోసారి కృష్ణభూషణ్ ని కలవటానికి వెళ్ళి, గానమందిరం ఇంచార్జి శచీదేవి గానాన్ని వింటుంది. అంత ప్రతిభ కలిగిన గాయకురాలిని ఉపయోగించుకోవటం వీరికి తెలియదు అనుకుంటుంది
మదన్ తన లలిత కళా సంఘం అభివృద్ధికి తనతో చేయికలపమని అరుణని కోరటం, అరుణ "ఈనాటి పరిస్థితుల్లో దేశం మీద ప్రత్యేక బాధ్యతలున్నాయి గదా! " అంటూ ఆ సంఘానికి జాతీయ కళా కేంద్రంగా పేరు మార్చి మదన్ తో కలిసి పనిచేయటానికి అంగీకరిస్తుంది. చివరిలో శచిని 'శంకరా భరణాన్ని కట్టి పెట్టి దేశ భక్తి గీతం పాడమని ' మదన్ అనటంలో కథని ముగిస్తుంది రచయిత్రి.
ఇందులో ఆనాటి జాతీయోద్యమానంతర పరిస్థితులు, జాతీయ భావాలు కలవారి ఆలోచనలు స్పష్టమాతాయి. ఏ కళగానీ అది దేశానికి ఉపయోగ కరంగా ఉండాలనే స్ఫూర్తిని రగిలిస్తాయి.
చిత్రకళ, సంగీత, నృత్యం, కవిత్వమూ ఈ కళలన్నింటి ద్వారా ప్రజల్లో జాతీయ భావాలను ప్రజ్వలింప జేసి కళ కళ కోసంకాదనీ, దేశం కోసం అనే నినాదాన్ని ఈకథలో రచయిత్రి వ్యక్తీకరించింది.
రవివర్మ, బాపిరాజు చిత్రాలలోని భావ కుశలత కృష్ణ భూషణ్ చిత్రాల్లో ఉన్నాయని, అయితే రాజులకోసమూ, జమిందార్ల కోసమూ కాకుండా సజీవమైన గ్రామీణ జీవితాల్ని, పచ్చని గ్రామాల్ని,శ్రమ జీవితపు విలువల్నీ ప్రదర్శించినపుడు ప్రజాజీవితానికి దగ్గరౌతాయనే అభిప్రాయం పాత్రల ద్వారా వెలిబుచ్చటం రచయిత్రికి సమాజం పట్ల, కళల పట్లా గల స్పష్టమైన అంకిత భావం తెలుస్తోంది.సమాజసేవచేసే మహిళల పట్ల,చదువుకున్న మహిళల పట్ల సమాజంలో కొందరు పురుషులమనోభావాలను మదన్ ద్వారా వ్యక్తపరిచారు రచయిత్రి.
కథలో సున్నితమైన ప్రేమ భావనలను ధృఢమైన జాతీయభావంతో నడపటం గమనించ వలసిన అంశం.
5.వెన్నెల్లో : ( గృహలక్ష్మి 01-10-1938)
అవ్వేళ ఆశ్వయుజ పౌర్ణమి అంటూ మొదలై వెన్నెలలోని ప్రకృతి సౌందర్యాన్ని కథలో అంచెలంచెలుగా వర్ణనాత్మకంగా నడపటంలో రచయిత్రి వర్ణనాత్మక శైలి ఈ కథలో స్పష్టంగా తెలుస్తుంది .
వెన్నెలను ఆస్వాదిస్తూ ఉన్న యువజంటలో విద్యావంతురాలైన విజయలక్ష్మి ధనవంతుల గారాబుబిడ్డ. విశ్వనాధం లా చదివి తదనంతరం ఏమి చేయాలని ఆలోచిస్తున్నవాడు.
వెన్నెల విహారానంతరం చాలా రాత్రి అయిపోవటంలో తిరుగు ప్రయాణంలో వివాహప్రస్తావన తెస్తాడు విశ్వనాధం.
'తొందరపడి పెళ్ళి చేసుకున్న దంపతులెందరో అభిప్రాయబేధాలతో, అవిశ్వాసాలతో, అంతః కలహాలతో అసహ్యంగా రోజులు గడుపుతున్నారు. పెళ్ళయ్యాక మగవారు భార్యపై నిరాదరణ చూపటం ప్రారంభిస్తారని ఎన్ని కథల్లోనో చదివాం " విజయ అంటూనే కారునడుపుతుంది. విశ్వనాథం తన ప్రేమని విజయ సందేహిస్తున్నందుకు బాధ పడతాడు
అంతలో కారుకి ప్రమాదం జరిగి టాపులేని కారులో ప్రయాణిస్తున్న విజయ ఎగిరిపడటంతో చెయ్యి దెబ్బతినటం విశ్వనాధం చిన్నగాయలతో బతికిబయటపడి ఆమెను హాస్పటల్ లో చేర్చుతాడు.
మెలకువ వచ్చిన విజయ తనకు సేవచేస్తున్న విశ్వనాధం ఈ పరిస్థితుల్లోనూ ఇప్పటికీ తనకు తోడుగా ఉంటున్నందుకు విశ్వనాధంకి దగ్గరౌతుంది. ఈ కథలో కథాంశం తక్కువే అయినా వెన్నెల సౌందర్యవర్ణనతో మొదలుపెట్టి కారుతో పాటూ చంద్రుడినీ పయనింపచేసి ముగింపు కూడా చంద్రుడు సంతృప్తిగా పడమర వైపు దిగిపోవడంతో ముగించటం రచయిత్రి రసహృదయం తెలుపుతూ మనోజ్ఞమైన ప్రేమకథగా తీర్చింది
' శరన్నవరాత్రి వెన్నెల ఏడాదికొక్కసారి దొరుకుతుంది. కానీ ఇంట్లోనే మురిగి పోయే ఆడవాళ్ళు దీనిని అనుభవించలేరు' అని ఒక సందర్భంలో రచయిత్రి వ్యక్తపరిచినప్పుడు స్త్రీల చాకిరిపట్ల రచయిత్రికి గల వేదన తెలుస్తుంది -
'అసలీ వెన్నెల ముందు ఎలక్ట్రిక్ షాక్ లా బాధ కలిగిస్తుంది సురాపానంలా మత్తెక్కిస్తుంది. చివరికి వీణా గానంలాగ మనసుని కరిగించేస్తుంది' కథంతా వెన్నెల గురించే నడిపిన ఈ కథలో రచయిత్రి రసాస్వాదనలో పాఠకులూ మునిగిపోతారు.
6.పునిస్త్రీపునర్వివాహం :( గృహలక్ష్మి 4-12-1937)
ఈ కథ రచయిత్రి ఉత్తమపురుషలో రాసింది .
సుధ,మధు సహాధ్యాయులు సుధా డాక్టరు పరీక్షకి చదువుతుంది.సుధకి ఆమెతండ్రి డాక్టరీ చదువుతోన్న విధూశేఖరంకి ఇచ్చి పెళ్ళిచేస్తాడు
కట్నం రెండువేలు సమయానికి సమకూరనందున పొలం అమ్మి ఇస్తానని మధుతండ్రి చెప్తాడు. కానీ మధుకి ఆస్తి లేదని తెలిసి పెళ్ళివారు కోపంతో హైదరాబాద్ వెళ్ళిపోతారు.
దాంతో పుట్టింట్లో ఉండి పోయిన మధు ఒకబాలికా పాఠశాలలో ఉద్యోగంలో చేరి తల్లితండ్రితో కలిసి ఉంటుంది.
సుధా డాక్టరీ పూర్తి చేసి విధూని చేసుకుందని తెలిసి
మధు బాధపడుతుంది.కానీ సుధతో తను వివాహం చేసుకోబోతున్నట్లు చెప్పేసరికి సుధ "నీకు పెళ్ళయ్యిందిగా " అనిప్రశ్నిస్తుంది.
మధు అప్పుడు జరిగిన విషయం అంతా తెలియజేస్తుంది .
"విధు మంచివాడే. నువ్వు పునర్వివాహం చేసుకునేందుకు విధూ నుండి నీకు అనుమతి పత్రం తెస్తానం"టుంది సుధ .
ఒకరోజు ముగ్గురు కలుసుకోవటం విధుశేఖరం నుండి అనుమతి పత్రం తీసుకొని భగీరధని మధువివాహం చేసుకుంటుంది. పత్రికలన్నీ
'పునిస్త్రీ పునర్వివాహాన్ని చేసుకున్న ప్రథమ ఆంధ్రస్త్రీ "అనీ వారిది ఆదర్శ వివాహంగా రాస్తాయి.
ఈ కథలో ధనవంతుల ఆడపిల్లలకే చదువు అందుబాటులో ఉంటుంది.కానీ మధ్యతరగతి ఆడపిల్లల వివాహ సమస్య ,కట్నాల వలన కుటుంబాలు ఛిద్రం అయిపోతున్న పరిస్థితిని తెలియ జేస్తుంది రచయిత్రి. పెళ్ళయిన మగవాడికి సమాజంలో మరో పెళ్ళికి అభ్యంతరం లేకపోవటం,పక్షపాతపు సంఘం 'ఫలాని వాళ్ళు అమ్మాయిని మగడు వదిలి పెట్టిపోయాడని వేలెత్తి చూపుతోందనేది కథలో ప్రస్తావించారు. భర్తలచే తిరస్కరింపబడిన అభాగినులు ఆత్మహత్యలకైనా పాల్పడతారు లేదా ఆ భర్త దగ్గరే దాసిలా ఉండాలనుకుంటారనేది కథాక్రమంలో రచయిత్రి వివరించటం ఆనాటి మహిళలపట్ల సమాజానికి గల వివక్ష వ్యక్త మౌతుంది.
7.ఈ రాథేనా (భారతి 01-07-1938)
రచయిత అయిన రాజారావు అఖిలాంధ్ర కథక సమ్మేళనానికి కథ రాయటానికి తన యింటి ముందు గ్రౌండులోకూర్చుంటాడు. అతని ముందు ఒక అమ్మాయి దుఃఖిస్తూ నిలబడుతుంది . ఆమెని ప్రశ్నిస్తే తనను ఒక ముసలివాని కిచ్చి పెళ్లి చేస్తున్నారని పారిపోయివచ్చాననీ, కొంతకాలం ఆశ్రయం కోరుతుంది.
ఆమెని తీసుకుని కాచిగూడాలో బండెక్కి షాద్ నగర్ తీసుకెళ్ళి ఇల్లుచూసి ఆమెను ఉంచి అవసర మైన వస్తువులు కొని యిస్తాడు . ఇద్దరి మాటా మంతీలలో రాజారావు "తనకి వివాహం కాలేదని,మేనమామ కూతుర్ని చేసుకోడం ఇష్టం లేక చదువు కున్న అమ్మాయికోసం చూస్తున్నాననీ " చెప్తాడు.
ఆమె తన పేరు రాధ అని చెప్పి రాజారావుని కూడా సాయంగా ఉండమంటుంది . రెండు మూడు రోజులు కలిసి కబుర్లు కలబోసుకున్నాక రాజారావు వివాహం ప్రసక్తి తీసుకువస్తాడు. తీరా ఆమె తన మేనమామ కూతురు రాధేనని తెలిసి సంభ్రమపడతాడు. ఇది సినీమాటిక్ గా ఉన్నా కథ నడిపిన తీరు, రాధ తన బావమనసును మార్చి,తన వ్యక్తిత్వాన్ని తీర్చుకున్న విధానం, చాలా సహజంగా కథ నడుస్తుంది .
8.ఆ వీణేనా (ఆంధ్రకేసరి 1940)
జ్యోతి,ప్రసాదం అన్యోన్యదంపతులు. జ్యోతి వీణానాదంతో పరవశిస్తూ అయిదేళ్ళు గడిచి పోతాయి.అనుకోని పరిస్థితులవల్ల మశూచి సోకి జ్యోతి అంధురాలై పోతుంది. బంధు మిత్రుల ప్రోద్బలంతో జ్యోతిని పుట్టింట్లో వదిలిపెట్టి తిరిగి పెళ్ళి చేసుకుంటాడు ప్రసాదం.
జ్యోతి తన దురవస్థకు కునారిల్లుతూ అంధురాలైనా తన వీణా, తన పాట తనను వదల లేదని తెలుసు కొని వాటితో బాధని మరుస్తుంది. ఆమె గానము, వీణానాదం ఆకర్షించి అనేకమంది నేర్చుకోవడానికి వస్తారు. తర్వాత ఆమె సంగీతవిద్య ఆకాశవాణి ద్వారా ప్రసారమై రాష్ట్రం అంతటానే కాక దేశం నలుమూలల నుండి ఆమెకు ఆహ్వానాలు వస్తుంటాయి-
ఏ అభిరుచి లేని పద్మని పెళ్లిచేసుకున్న ప్రసాదం ఒకరోజు రేడియోలో ఆమె వీణానాదం విని పశ్చాత్తాపం పొందుతాడు.
ఇదంతా మామూలు కథే. అయితే సీతాకుమారి ఈ కథాగమనంలో భర్తలచే విడిచివేయబడిన మహిళల గురించి, నిరాధారమైన జీవితం గడపవలసిన పరిస్థితుల గురించి, సమాజంలో అనాకారిగా మారిన స్త్రీలపై చూపే వివక్షని, మానవ మనస్తత్వాల్ని, మగవారి స్వార్థపుటాలోచనల్నీ బట్టబయలు చేసి చూపింది. ఈ కథలోని భాష ఒకింత శిష్టవ్యవహారికంలో రాసింది.
మొత్తంగా సీతాకుమారి కథలను తరచి చూస్తే కథానాయికలు విద్యావంతులు, సమాజంపట్ల, మానవ మనస్తత్వాలపట్ల, కుటుంబ జీవనం, పట్ల స్పష్టమైన అభిప్రాయంగల వారిగా అక్షరీకరించారు రచయిత్రి. అంతే కాక కథలన్నీ అభ్యుదయ దృక్పథం కలిగినవిగా ఉండడం స్పష్టమౌతుంది. కథలలో సమకాలీన పరిస్థితులు, సమాజం తీరు తెన్నుల గూర్చిన చర్చలు అర్థవంతంగా ఉంటాయి.ప్రతీకథనీ చక్కని ప్రకృతి వర్ణనలతో ప్రారంభించటం ఒక విశేషం.
ధైర్యవంతులు ఆనాటి సమాజానికి ఎంతో అవసరమని తన కథల్లో రచయిత్రి తెలిపారు. కథలన్నీ కూడా స్త్రీ అభ్యుదయాన్ని కాంక్షించేవే. సీతాకుమారి కథలన్నీ పూర్తిగా ప్రామాణిక భాషలో సాగాయి.
అధునాతన కథాంశాలతో సుమారు ఎనభై ఏళ్ళ కిందటే చక్కని కథలు రాసిన యల్లాప్రగడ సీతాకుమారి తెలుగు కథారచయిత్రిగా ఎన్నదగినది.
అధునాతన, అభ్యుదయ భావాలు,సంస్కరణ దృష్టి కలిగిన రచయిత్రి సీతాకుమారి. డెబ్భై అయిదు సంవత్సరాలు జీవించిన యల్లాప్రగడ సీతాకుమారిగారు 2-1-1986న మరణించారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)