27, మే 2024, సోమవారం
నడక దారిలో -39
నడక దారిలో -39
1990 నుంచి 96 వరకూ దేశంలో రాష్ట్రంలో, ఇంట్లో, నా జీవితంలో జరిగిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు.
మండల్ కమీషన్ సూచనలు అమలు చేయాలనుకోవటంతో విద్యార్థుల ఆందోళనలను తట్టుకోలేక 1990 డిసెంబర్‌లో ప్రధానమంత్రి వీపీ సింగ్ రాజీనామా చేయాల్సి వచ్చింది. 1991 లో సార్వత్రిక ఎన్నికల ప్రచారం కోసం వెళ్ళిన రాజీవ్ గాంధీ పెరుంబుదూర్ లో మే 21వ తేదీన హత్యకు గురికావడం ఒక పెద్ద సంచలనం.దేశం అంతా దిగ్భ్రాంతి చెందింది.అంతేకాదు వారసత్వరాజకీయాల్లో ఎవరు ప్రధాన మంత్రి అవుతారనేది చర్చల్లోకి ఉధృతంగా వచ్చింది.సోనియా వేస్తే విదేశీవనిత అనేది అస్త్రంగా కాంగ్రెసేతర పక్షాలు పదును పెట్టుకున్నాయి.
సానుభూతి వలన కావచ్చు ఉమ్మడి ఫ్రంట్ పై ప్రజలకు నమ్మకం సడలటం వలన కావచ్చు తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.రాజీవ్ గాంధీ పోవటంతో సోనియా పార్టీలోకి వచ్చినా మొదటిసారి ఒక తెలుగువాడైన పీవీ నరసింహారావుగారిని ప్రధానమంత్రి గా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ సందర్భంలో సోనియా గాంధీ నిర్ణయం అభినందించాయి ఇతర పక్షాలు.
ఒకరోజు నా సహోద్యోగి, రచయిత్రి అయిన గంటి వెంకటరమణ దూరవిద్య ద్వారా ఎమ్మే ఇంగ్లీష్ పరీక్ష కట్టాలని అప్లికేషన్ తెచ్చుకోటానికి ఓయూకి వెళ్దాం రమ్మంటే ఆమెతో పాటూ వెళ్ళాను.ఆమె లోపలికి వెళ్తే అక్కడ బైట పెట్టిన సబ్జెక్టుల బోర్డులను పరిశీలిస్తూ ఒక దగ్గర నా చూపు ఆగిపోయింది.ఒక్కసారి నాకళ్ళు వెలిగాయి.నా చిన్నప్పటి నాకల కళ్ళముందుకు వచ్చి నిల్చుంది.
డిగ్రీలో గణితంలో అరవై శాతం మార్కులు వచ్చినవారికి దూరవిద్య ద్వారా కొత్తగా ఎమ్మెస్సీ గణితం చదివే అవకాశం ఆ ఏడాది నుంచి ప్రారంభం అని ఉంది.గభాలున నేనుకూడా లోపలికి వెళ్ళి డబ్బు కట్టి అప్లికేషన్ తీసుకున్నాను.
ఇంటికి వచ్చాక వీర్రాజుగారికి సంబరంగా చూపించాను."తెలుగైతే ఎలాగో చదివేసావు.కానీ ఉద్యోగం చేస్తూ గణితం చదవటం కష్టం కదా" అన్నారు."పరవాలేదు చదువుతాను" అని నిబ్బరంగా అన్నాను.
అప్లికేషన్ నింపి సబ్మిట్ చేసి విశ్వవిద్యాలయం ఇచ్చిన పుస్తకాలు తీసుకున్నాను.అంతేకాకుండా ప్రతీ సెలవురోజునా ఉదయం 9గం.నుండి 5గం.వరకూ యూనివర్సిటీలోనే ప్రొఫెసర్ లు క్లాసులు తీసుకుంటారని తెలిసింది. నాకల నెరవేరబోతుందికదా అని ఒకవైపు సంతోషంగా ఉన్నా ఇన్నేళ్ళ తర్వాత చదవగలనా అని భయం కూడా కలిగింది.
వారానికి ఆరురోజులు స్కూలుకు, ఆదివారం,రెండో శనివారం యూనివర్సిటీకి క్లాసులకు వెళ్ళేదాన్ని.అలాగే పండుగరోజు తప్ప దసరా, సంక్రాంతి సెలవుల్లో కూడా క్లాసులు జరిగేవి.మా క్లాసులు యూనివర్సిటీ మేధ్స్ డిపార్ట్మెంట్ దగ్గర క్లాసురూముల్లో జరిగేవి.ఓకోసారి ఓయూ భవనంలో కూడా జరిగేవి.ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు యూనివర్సిటీ ముందు నుండి వెళ్తున్నప్పుడు ఎప్పటికైనా ఇందులో అడుగు పెట్టగలనా అనుకునేదాన్ని.ఇప్పుడు ఆ తరగతి గదుల్లో కూర్చుని చదువుకోవటం భలే సంతోషం కలిగింది.
నాతోటి విద్యార్థులలో చాలావరకూ అప్పుడే డిగ్రీ పూర్తిచేసి ఇందులో చేరిన వాళ్ళే. అతి తక్కువ మంది మాత్రమే నాలాగా పది పదిహేనేళ్ళ విరామం తర్వాత చదువుతున్నవారు.వాళ్ళలోకూడా ఎక్కువమంది టీచర్లుగా ఉద్యోగం చేస్తున్న వారే.ఓ నలుగురైదుగురు నాతో బియ్యీడీ చేసినవారు కూడా ఉండటం నాకు కొంత ఊరట కలిగింది.
పాఠ్యాంశాలు నేను డిగ్రీలో బేసిక్స్ కూడా చదివినవి కొన్ని ఉండేసరికి యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన స్టడీ మెటీరియల్స్ మాత్రమే కాకుండా కొన్ని స్టాండర్డ్ పుస్తకాలు కొనుక్కొని మొదటినుంచీ నేర్చుకున్నాను.
ఒక తపస్సులా ఎలాగైనా ఈ డిగ్రీ సాధించాలనే నా పట్టుదలే నన్ను అంత శ్రమ పడేలా చేసింది.ప్రతి నిముషాన్నీ అత్యంత విలువైనదిగా ఒడిసిపట్టుకుని ఉపయోగించుకున్నాను.
ఇప్పుడు ఆ తరగతి గదుల్లో కూర్చుని చదువుకోవటం భలే సంతోషం కలిగింది.
నాతోటి విద్యార్థులలో చాలావరకూ అప్పుడే డిగ్రీ పూర్తిచేసి ఇందులో చేరిన వాళ్ళే. అతి తక్కువ మంది మాత్రమే నాలాగా పది పదిహేనేళ్ళ విరామం తర్వాత చదువుతున్నవారు.వాళ్ళలోకూడా ఎక్కువమంది టీచర్లుగా ఉద్యోగం చేస్తున్న వారే.ఓ నలుగురైదుగురు నాతో బియ్యీడీ చేసినవారు కూడా ఉండటం నాకు కొంత ఊరట కలిగింది.
పాఠ్యాంశాలు నేను డిగ్రీలో బేసిక్స్ కూడా చదివినవి కొన్ని ఉండేసరికి యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన స్టడీ మెటీరియల్స్ మాత్రమే కాకుండా కొన్ని స్టాండర్డ్ పుస్తకాలు కొనుక్కొని మొదటినుంచీ నేర్చుకున్నాను.
ఒక తపస్సులా ఎలాగైనా ఈ డిగ్రీ సాధించాలనే నా పట్టుదలే నన్ను అంత శ్రమ పడేలా చేసింది.ప్రతి నిముషాన్నీ అత్యంత విలువైనదిగా ఒడిసిపట్టుకుని ఉపయోగించుకున్నాను.
అప్పుడే మా ప్రధానోపాధ్యాయులు పదవీవిరమణ తీసుకోవటంతో వేరే ఆమె ఆ పదవిలోకి వచ్చింది.ఆమెని రబ్బర్ స్టాంప్ గా చేసి అంతకుముందు నాకెంతో మంచి స్నేహితురాలిగా భ్రమ కల్పించిన టీచరే చక్రం తిప్పటం మొదలైంది.
స్కూల్లో అవినీతి, అక్రమాలు కొద్దికొద్దిగా చోటు చేసుకోవటం మొదలైంది.నేను ఎమ్మెస్సీ చేస్తున్నానని తెలిసి అసూయ కొందరిలో మొలకెత్తింది.దాంతో నాకు స్కూల్ లో కూడా పని ఒత్తిడి పెరిగింది.నాపరీక్షలు స్కూల్ ఆఖరి పనిదినాలు గానీ, స్కూల్ తెరిచిన రోజు కానీ రావటంతో నాకు క్యాజువల్ లీవులు ఉన్నా వేతనకోతతోనే సెలవు ఇచ్చేవారు.నేను కోపాన్ని నిగ్రహించుకొని ఊరుకునేదాన్ని.ఎందుకంటే ఆవేశం నా పరీక్ష మీద పడకూడదని పట్టించుకునే దాన్ని కాదు.
మరో పెద్ద సంచలనం అప్పటికే రగులుతున్న బాబ్రీ మసీదు వివాదం ముగింపుకి చేరుకుంది.రథయాత్రచేసిన కరసేవకులు ఎందరెందరో ఒక వరదలా పోటెత్తుతున్నారనే వార్తలు హైదరాబాద్ ని రగులుతోన్న అగ్నిపర్వతంగా మార్చాయి.ఒకరోజు స్కూల్ విడిచి మాఇంటికి పోయే 131 బస్ ఎక్కాను.కాని ఛాదర్ ఘాట్ దగ్గరకు వచ్చేసరికి అప్పటికే బస్ లో కూడా అందరూ గందరగోళంగా మాట్లాడుకుంటున్నా పట్టించుకోకుండా మా స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాను.నల్గొండ చౌరాస్తా దాటగానే బస్ ఆపేసారు.పోలీసులు " తొందరగా ఇళ్ళకు వెళ్ళండి.కర్ఫ్యూ పెడుతున్నారు"అంటూ హెచ్చరిస్తున్నారు .ఇంక అక్కడ నుండి భయం గుప్పెట్లో గుండెను పట్టుకొని అంతదూరాన్నీ పరుగులాంటి నడకతో ఇల్లు చేరాను.అంత దూరం ఎలానడిచానో తెలియదు.మా ప్రాంతం అంతా కర్ఫ్యూ నీడలోకి వెళ్ళిపోయింది. ఆ మర్నాడే నిమిషాల్లో అంత పెద్ద బాబ్రీ మసీదు నేలమట్టమైంది. వారసత్వ సంపద కావల్సిన ఏఆలయమైనా నిలువునా నేలమట్టం కావటం బాధే కదా అందుకే హృదయాన్ని కలచివేసింది.
మా ప్రాంతం చాలా కాలమే కర్ఫ్యూనీడ లోనే ఉంది.
తర్వాత సంచలనం ఆ రోజు వినాయక నిమజ్జనం.బాబ్రీమసీదు కూల్చివేత నేపధ్యంలో ఎలా జరుగుతుందో అని అందరం భయపడ్డాం.హమ్మయ్యా ప్రశాంతంగా జరిగింది అనుకుని నిద్రపోయాము.తెల్లవారుఝామున అకస్మాత్తుగా కిటికి తలుపులు కొట్టుకున్న శబ్దమే కాక పడుకున్న మంచం కదిలిపోయినట్లై ఉలిక్కిపడి లేచాము.అదే1993 లాతూర్ భూకంపం, సెప్టెంబరు 30 ఉదయం నాలుగింటికి సంభవించింది. మహారాష్ట్ర ఈ భూకంపానికి ప్రధాన ప్రాంతమనీ,ఈ భూకంపం ముఖ్యంగా లాతూర్, ఒసామాబాద్ లో ప్రధాన కేంద్రంగా యేర్పడిందనీ, భూకంపంలో 52 గ్రామాలకు పైగా పూర్తిగా నాశనం అయ్యాయనీ ఉదయం వార్తల్లో తెలిసింది.భూకంప దృశ్యాలు,వార్తాపత్రికల్లోనూ, దూరదర్శన్ లోనూ చూసి భయకంపితులను అయ్యాము.
ఒక భూకంపం దేశాన్ని ఇంతగా అతలాకుతలం చేస్తుందన్నది అప్పుడే తెలిసింది.దూరదర్శన్ ఆ సందర్భంగా అక్షరదర్శనం పేరిట కవిసమ్మేళనం ఏర్పాటు చేసారు.బాపురెడ్డిగారి అధ్యక్షతన నేను, శిలాలోలిత,ఎన్.అరుణ,మరొక కవీ పాల్గొన్నాం.నేను దూరదర్శన్ లో ఇచ్చిన మొదటి కార్యక్రమం అది."వేకువవీలునామా "అనే పెద్ద కవితను చదివాను.
వీర్రాజుగారికి సహోద్యోగి, మిత్రులు రచయిత అయిన గోపాలచక్రవర్తి గారు అనారోగ్యం గా ఉన్నారనీ ఆయనను గౌరవించాలనే ఆలోచన వీర్రాజుగారికి కలిగింది . నాకవితాసంపుటి తెగిన పేగు, వీర్రాజు గారి కవితా సంపుటి ఎర్రడబ్బా రైలు రెండింటినీ కలిపి గోపాల చక్రవర్తి గారి అధ్యక్షతన ఆవిష్కరణ సమావేశం ఏర్పాటు చేయాలనుకున్నారు.జనవరి రెండో తేదీన తిలక్ రోడ్డు లోనిసారస్వత పరిషత్తులో ఉపన్యాసాలు లేకుండా గోపాలచక్రవర్తి గారు నాలుగు మాటలు మాగురించి చెప్పి పుస్తకాలు ఆవిష్కరించటం, తర్వాత మేమిద్దరం మా సంపుటి లోని కవితలు పదేసి చదవటంతో ముగిసింది.ఆ ముందురోజే చాసో చనిపోవటంతో ముందుగా చాసోకు గౌరవపురస్సరంగా స్మరించుకొని సభ ప్రారంభించాము. విభిన్నంగా ఏర్పాటు చేసిన సభకు చాలామంది సాహితీమిత్రులు కుతూహలంతో వచ్చారు. విభిన్నమైన మా పుస్తకావిష్కరణని అన్ని పత్రికలూ ప్రశంసిస్తూ రాసాయి.అంతకు ముందు రెండు సంపుటాలు వచ్చినా ఆవిష్కరణలు పెట్టుకోకపోవటం వలన కావచ్చు నన్ను చాలా మంది కవయిత్రిగా గుర్తించలేదు.తెగినపేగు పుస్తకం నన్ను సంపూర్ణంగా కవయిత్రిగా చేసిందని నా నమ్మకం.
ఎందుకో గానీ ఒకరోజు రాత్రి వీర్రాజు గారు తన పెద్దతమ్ముడు కృష్ణ గురించి నాతో చాల సేపు మాట్లాడారు."రాజమండ్రి ఇల్లు అమ్మిన తనవాటా డబ్బుతో దర్జాలకు పోయి ఖర్చు పెట్టేసాడు.అంతేకాక మళ్ళా అప్పులు చేసాడు.అప్పులవాళ్ళు ఇంటి మీదకు రాగానే గోలకావటం జరిగింది.ఆ తర్వాత కుటుంబం అంతా చావాలని అన్నంలో విషం కలుపుకుని ఏడుస్తుంటే ఇంటివాళ్ళు చూసి మాకు ఫోన్ చేసారు.దాంతో గాభరాగా వీర్రాజుగారు స్నేహితుడిని తీసుకొని కృష్ణ ఇంటికి పరుగెత్తారు.మళ్ళా ఇంట్లోని కొన్ని అనవసరంగా కొన్న సామాన్లు అమ్మి కొంత, వీర్రాజుగారు డబ్బు కలిపి కొన్ని అప్పులు తీర్చటం జరిగింది.ఆ సందర్భంలోనే తోటికోడలుకి కోటీ హాస్పిటల్లో ఉదయంపూట అవుట్ పేషెంట్ వింగ్ లో ఉద్యోగంవేయించారు.కానీ పిల్లలతో చేయలేనని రెండురోజులకే మానేసింది.కుట్టు మిషన్ కొని ఇస్తాము.నేర్చుకుని కుడితే వేణ్ణీళ్ళకు చన్నీళ్ళు గా ఉంటుంది అంటే కళ్ళప్రోబ్లం కుట్టలేనంది." ఇవన్నీ నాలుగేళ్ళ క్రితం జరిగిన ఈ విషయాల్నే మళ్ళా మళ్ళా తలంచుకున్నారు.
"సుభద్రా కృష్ణ పిల్లల బాధ్యత మనమే చూసుకుంటూ చదివించుదాం." అన్నారు ఆ రాత్రి.
'ఇంతకుముందు కూడా ఫీజులు మనమే కడుతున్నాం కదా' మనసులోనే అనుకుని," అలాగే చూసుకుందాం ఇంక పడుకోండి అవన్నీ ఇప్పుడెందుకు ఆలోచించటం" అని నిద్రకి ఉపక్రమించాను.
ఆయన ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారేమో తెలియదు.అలసిఉన్నానేమో నేను మాత్రం నిద్రపోయాను.
మర్నాడు యథావిధిగా పనులు చేసుకుని స్కూలుకు వెళ్ళిపోయాను.సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు నాతో పాటు నా సహోద్యోగి స్నేహితురాలు గంటి వెంకటరమణ ఏదో పనిమీద మా ఇంటికి వచ్చింది.
వీర్రాజు గారు కొంచెం ముభావంగా ఉంటే ఏమి అలా ఉన్నారని అడిగాను."చెష్ట్ లో కొంచెం చురుక్ చురుక్ మంటుంది"అన్నారు.
పైన ఇంట్లో ఉన్న పంజాబీ కుర్రాడు డాక్టర్ అతనిని పిలుస్తే బిపి చూసాడు 'నార్మల్ గానే ఉంది.బహుశా గేస్ వలన అయ్యుంటుంది 'అన్నాడు.
గంటి వెంకటరమణ "మా తమ్ముడు నిమ్స్ లో డాక్టర్ ఒకసారి అక్కడికి వెళ్దాం . చూపించు కోవచ్చు " అంది.
సరే అని నేను,ఆయనా, వెంకటరమణ బయలుదేరాము.ఆటో కోసం చూస్తుంటే వీర్రాజు గారు రోడ్డు మీదైతే చాలా దొరుకుతాయంటూ
నడక సాగించారు.రోడ్డు మీద వరకూ వెళ్ళి ఆటో ఎక్కి నిమ్స్ కి వెళ్ళాం.
వెళ్ళగానే గంటి వెంకటరమణ గారి తమ్ముడిని కలిసాము .వెంటనే కార్డియాలజిష్టు వచ్చి హడావుడి చేసి వీర్రాజుగారిని బెడ్ మీద పడుకోమని ఒక వైపు బీపీ,మరోవైపు ఈకో టెస్ట్ చేయటం మొదలుపెట్టారు.అసలే వీర్రాజుగారికి హాస్పిటల్ కి వెళ్తేనే బీపీ పెరుగుతుంది.డాక్టర్ల హడావుడికి మరింత పెరిగింది.దాంతో డాక్టర్లు గాభరా పెట్టి అర్జెంటుగా జాయిన్ అయిపోవాలన్నారు.అప్పటికి సెల్ ఫోన్లు లేవు.అక్కడ ఫోన్ నుండి పల్లవికి ఫోన్ చేసి కావలసిన వస్తువులు,తీసుకుని రమ్మని, వారాలు కృష్ణమూర్తి గారికి,శంకరంకు ఫోన్ చేసి తెలియజేయమన్నాను.వాళ్ళు ఆశారాజు గారిని కూడా తీసుకొని హుటాహుటిన నిమ్స్ కి వచ్చేసారు.
ప్రస్తుతానికి హాస్పిటల్ లో రూం ఇచ్చి బీపీ తగ్గటానికి ఇంజెక్షన్ చేసి మర్నాడు ఇతర పరీక్షలు చేస్తామన్నారు.శంకరంగారూ, ఆశారాజు గారు రాత్రికి మేము ఉంటాం మీరు వెళ్ళిపోయి ఉదయం రమ్మన్నారు.పల్లవీ,నేను ఇంటికి వచ్చేసాం.ఉదయమే తయారై పల్లవిని కాలేజీకి పంపి , గోపీగారికి ఫోన్ చేసి విషయం తెలియజేసి నేను హాస్పిటల్ కి వెళ్ళాను.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి