31, మార్చి 2024, ఆదివారం
ఫ్రీవర్స్ ఫ్రంట్ సమూహం సంపుటి
తొలినాటి ఫ్రీవర్స్ ఫ్రంట్ అడుగు జాడల్లో.......
"ఏ భాషలోనైనా ప్రతి మాటకు ఒక అంతఃసౌందర్యం ,అంతఃసంగీతం వుంటుంది.దానిని గుర్తెరిగి ఒకమాటకు ముందు వెనకాల అనువైన మాటలు కూర్చుకోవటమే కవి పని.
భాష అనేక పరిమితులను విధిస్తుంది.కవిత్వం బాగుండాలంటే దాని పరిమితులకు,షరతులకు లోబడవలసిందే.లేకుంటే అర్థస్ఫురణ వుండదు.కవిత అనిపించుకోడానికి వచనంలోలేని లయ వుండాల్సిందే.లేనిచోట వెంటనే పట్టిస్తుంది.ఫ్రీవర్స్ రచన అసిధారావ్రతం.ఛందస్సు తీసివేయడం వల్ల స్వేచ్ఛ కలిగి సౌలభ్యం కలిగిందని ఊహించుకునే వారు వెర్రి వాళ్ళు" తన వ్యాసం(1967)లో అంటారు కుందుర్తి .
ఆరోజుల్లో కుందుర్తిగారు కవిత్వం రాసుకుంటూ కూర్చోకుండా దాన్ని ప్రచారం చేసి వేగవంతం చేసేందుకు ఊరూరా తిరుగుతూ కవితోత్సాహం ఉన్న యువకులకు వెన్నుతడుతూ,పీఠికలు రాస్తూ వచనకవిత్వ రచనలు ప్రోత్సాహం కోసం విస్తృత ప్రచారం చేసారు.అంతటితో వూరుకోకుండా బహుమతులు ఇస్తుంటే మరింత ఉత్సాహాన్ని ప్రోది చేయొచ్చనే సంకల్పంతో 1967లో ప్రారంభించినవి ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డులు.
కుందుర్తి గారు నిష్క్రమణ అనంతరం కుందుర్తిగారి కుటుంబసభ్యుల సహకారంతో శీలావీర్రాజుగారు విజయవంతంగా యాభై పురస్కారాలు పూర్తి చేసి ఇంక చాలు అంటూ ఆయనా నిష్క్రమించారు.
యాభై ఏళ్ళుగా కవులంతా ఫ్రీవర్స్ ఫ్రంట్ అనేది ఒక వైబ్రేషన్ గా భావించి, ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు తమపుస్తకానికి ఎప్పుడు వస్తుందా అని కలలు కనే వారు అనేమాట అతిశయోక్తి ఎంతమాత్రమూ కాదు.
ఫ్రీవర్స్ ఫ్రంట్ 49,50వ అవార్డులు ఇచ్చే సందర్భంలో కరోనా కాలంలో ఫ్రీవర్స్ ఫ్రంట్ వాట్సాప్ సమూహం ప్రారంభించాము.
కుందుర్తి గారి శతజయంతి సంవత్సరం కనుక 16-12-2022 వరకూ కొనసాగించి ముగించేయాలనుకున్నాము.కానీ కవిత్వం కోసం ప్రత్యేకంగా ఉన్న సమూహంగా కొనసాగిస్తేనే బాగుంటుందన్న కవి మిత్రులు అందరి అభిలాషను గౌరవించి కొనసాగిస్తున్నాము.
జనవరి 2023 లో సుధామగారు ప్రతీనెల కవితల పోటీ నిర్వహించి 500/- చొప్పున కుందుర్తి స్మారక బహుమతి, శీలా వీర్రాజు స్మారక బహుమతి గా ఇస్తే కవులకు మరింత ప్రోత్సాహకరంగా ఉండటమే కాకుండా కుందుర్తి, శీలా వీర్రాజుగార్ల స్ఫూర్తిని కొనసాగించినట్లుగా ఉంటుందని అనటమేకాకుండా ,వారే స్వయంగా ఇవ్వటం మొదలు పెట్టారు.సుధామగారి సలహా ఫ్రీవర్స్ ఫ్రంట్ వాట్సాప్ సమూహం శిరసావహించి,వారికి కృతజ్ఞతలు అర్పించి,ఆ తర్వాత నుంచి మంచి కవిత్వం రావటానికి ఉత్ప్రేరకంగా మేము బహుమతులు ఇవ్వటానికి నిర్ణయించుకుని కొనసాగించాము.మంచి సలహా ఇచ్చిన సుధామగారికి ఈ సందర్భంగా ఫ్రీవర్స్ ఫ్రంట్ వాట్సాప్ సమూహం తరపున మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
ఏడాది గడిచాక బహుమతి పొందిన కవితల్ని పుస్తకరూపంలో తీసుకురమ్మని కూడా సుధామ గారు ఇచ్చిన సలహాయే.ఈ విషయంలో నేను ముందు కొంత వెనకడుగు వేసాను.
కుందుర్తి ఆంజనేయులుగారు తన జీవితకాలం పట్టుకొని తిరిగిన వచనకవిత్వ పతాకని అందుకుని నడిచిన కవులతరాలు గడిచాయి.కానీ తాతగారి స్ఫూర్తిని అందిపుచ్చుకున్న కుందుర్తి కవిత ఫ్రీవర్స్ ఫ్రంట్ ప్రచురణల పేరిట ఫ్రీవర్స్ ఫ్రంట్ వాట్సాప్ సమూహ 2023 పోటీ కవితలను పుస్తకంగా వేయటానికి ఉత్సాహంగా ముందుకు వచ్చింది.
అందుకు కుందుర్తి కవితకు ప్రేమపూర్వక ఆలింగనాలు.
సంవత్సరం పాటు ఉత్సాహంగా కవితల పోటీలో పాల్గొన్న వారికి, బహుమతులు పొందిన వారికి మనసారా అభినందనలు.
పుస్తకప్రచురణలో సహకరించిన అనిల్ డ్యానీ కి ధన్యవాదాలు.
-- శీలా సుభద్రాదేవి
ఫ్రీవర్స్ ఫ్రంట్ వాట్సాప్ సమూహం
హైదరాబాద్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి