28, జులై 2023, శుక్రవారం

నడక దారిలో --31

నడక దారిలో -- 31 వీర్రాజు గారికి తనని తాను ఉత్సాహం పరచుకోటానికి తన పుస్తకాలు ప్రచురించుకోవటం ఒక అలవాటు.అందుకని నా లోకి నేను ముడుచుకు పోవటం చూసి నా కథలను పుస్తకంగా వేయాలని తలపెట్టారు. నా పేరు ఎవరు ప్రస్తావించారో కాని ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వాళ్ళు మచిలీపట్నంలో నిర్వహించాలని పూనుకున్న రచయిత్రుల మహాసభల్లో కవిసమ్మేళనంలో పాల్గొనమని ఉత్తరం వచ్చింది.నాకు చాలా ఆశ్చర్యం,ఆనందం కలిగించింది.కానీ బాబును తీసుకుని ఎలా వెళ్ళాలి అనేదే పెద్దప్రశ్న. మచిలీపట్నం వాస్తవ్యులు వీర్రాజు గారికి మంచిమిత్రుడైన గుత్తికొండ సుబ్బారావు గారు తమ స్పందన సాహితీసమాఖ్య కూడా ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ తో కలిసి నిర్వహిస్తుందని తెలియజేసి, కుటుంబ సమేతంగా రమ్మనీ,మిగతావిషయాలు నేను చూసుకుంటానని అన్నారు. ఉత్సాహంగా అందరం బయలుదేరాము.సుబ్బారావుగారు మమ్మల్ని రిసీవ్ చేసుకొని హొటల్ రూమ్ లో దించారు.బాబుకు ఒళ్ళు శుభ్రంచేసి పాలు తాగించి పల్లవిని కూడా తయారుచేసాను.నేనున్నపుడే వీర్రాజు గారిని కూడా రిఫ్రెష్ అవ్వమన్నాను.తర్వాత తొందరగా తయారయ్యాను.అంతలో సుబ్బారావు గారు వచ్చి సభలు జరిగే వేదికకు తీసుకువెళ్ళారు.అప్పుడే ప్రారంభసభ మొదలైంది.జస్టిస్ అమరేశ్వరి ప్రారంభించారు.దేవులపల్లి రామానుజరావు గారు పుస్తకప్రదర్శన ప్రారంభించారు. నేను చిన్నప్పటినుండి చదువుకున్న రచయిత్రులు వసఉంధరఆదఏవఇ, కె.రామలక్ష్మీ,లత,ద్వివేదుల విశాలాక్షి,ఆనందారామం,ఐవీఎస్ అచ్యుత వల్లీ ఇలా ఎందరో ఉన్న ఆ సభామందిరంలో నేను కూడా ప్రత్యేక ఆహ్వానితురాలిగా కూర్చున్నాను.ఒక ఉద్వేగం నన్ను ఆవరించింది.సాహిత్య అకాడమీ చైర్మన్ బెజవాడ గోపాలరెడ్డి గారు వచ్చేసరికి రచయిత్రులు అందరూ ఆయన దగ్గరకు వెళ్ళి పలకరిస్తున్నారు.నేను కుర్చీకి అతుక్కుపోయినట్లు కదలలేదు.రచయిత్రులనూ పలకరించలేదు.నాకున్నమొగమాటం,చొచ్చుకుపోయే స్వభావం లేకపోవటం ఒకకారణమైతే గత కొంతకాలంగా నాలో నేను కృంగి పోతున్న మానసిక స్థితిలో ఉన్నానేమో ఒక్కదాన్నే అలా ముడుచుకుపోయి కూర్చున్నాను. రెండవసమావేశంలో నేటికథ- తీరుతెన్నులు గురించి వసుంధరాదేవీ,ఆనందరామం మొదలైన రచయిత్రులు ప్రసంగాలు చేసారు. సాయంత్రం నాలుగింటికి నన్ను తిరిగి రూమ్ కు దిగబెట్టారు .సుబ్బారావు గారు వీర్రాజు గారితో సభల విశేషాలు చెప్పి మాకు భోజనం ఏర్పాటు చేసి వెళ్ళారు. భోజనం చేసాక పడుకుందామని పక్కమీద ఒరిగే సరికి బాబు కెవ్వున ఏడ్చి ఎప్పటిలాగే నీలమేఘ శ్యాముడు కావటమే కాకుండా ఒళ్ళంతా వేడిగా కాల్చినట్లుగా టెంపరేచర్ పెరిగి,వాంతులు చేసుకోసాగాడు.ఏంచేయటానికీ తోచక సుబ్బారావు గారికి కబురు పెట్టాము.రెండురోజులుగా సభలనిర్వహణలో అలసిపోయి కూడా పరుగున వచ్చి ఆ అర్థరాత్రి డాక్టరుదగ్గరకు తీసుకువెళ్ళటానికి సాయం చేసారు. ఎలా అయితేనేం డాక్టరు మందు పడ్డాక పిల్లాడు మర్నాడు ఉదయానికి తేరుకున్నాడు.మేము కూడా కుదుట పడ్డాము. మర్నాడు సభలకు నాకు వెళ్ళాలనిపించలేదు.నేను వెళ్ళాక మళ్ళీ బాబు ఇబ్బంది పెడతాడేమోనని ఒకవిధంగా నిర్వేదం ఆవరించి రూమ్ లోనే ఉండిపోయాను.వీర్రాజుగారు ఒకసారి వెళ్ళివస్తానని ఒక సదస్సుకు హాజరయ్యారు. మూడోరోజు ముగింపు సభలకు ముందు కవిసమ్మేళనం అన్నారు.మూడోరోజు వీర్రాజు గారు తాను బాబును చూసుకుంటానని నన్ను పంపించారు. కవిసమ్మేళనం ప్రారంభించారు.వేదిక మీద ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ,నాయని కృష్ణకుమారి, యశోదా రెడ్డి,లక్ష్మీరమణ,సి.వేదవతి,శారదా అశోక వర్ధన్,కుసుమారామారావు,చిరంజీవినీకుమారితో బాటు నేను ఆసీనురాలినై " పల్లకీ దిగిరా" అనే కవిత చదివాను.అప్పటికే లబ్దప్రతిష్టులైన వారితో కలిసి వేదిక పంచుకోవడం కవిత్వం చదవటం నాకు గొప్ప ఉత్సాహాన్ని ఇచ్చింది. అప్పటికి కవయిత్రుల కవితలలో ఇంకా అభ్యుదయ భావాలు అంతగా చోటు చేసుకోలేదు.అందుచేత నా కవిత ఆ వేదికపై కొత్తదనాన్ని ఇచ్చిందని అధ్యక్షురాలు ప్రశంసించారు. మనసంతా హర్షాతిరేకాలుతో నిండి ఉప్పొంగిపోతున్న నన్ను గుత్తికొండ సుబ్బారావు గారు తిరిగి హోటలు రూముకి దింపారు.అప్పటికే వీర్రాజుగారు బాబుకి పాలు పట్టి నిద్రపుచ్చారు.ఏడేళ్ళ పల్లవి బాబు తాలూకు సామానులు సర్ది తాను కూడా మరోవైపు బాబు పక్కనే పడుకొని జోకొడుతోంది. రచయిత్రులమహాసభలకు వెళ్ళి వచ్చాక ఒకింత ఉత్సాహం కలిగింది.అప్పటికే నాకథల్ని రంగు వెలిసిన బొమ్మ పేరుతో సంపుటిగా వేద్దామని సమకూర్చు కున్నాము. కాని కవిత్వసమ్మేళనంకి వెళ్ళి తిరిగి వచ్చాక వీర్రాజు గారు"కథలు తర్వాత వేద్దాము.ముందు కవితా సంపుటిని వేద్దాము.కథలు కన్నా కవిత్వం కే తొందరగా గుర్తింపు వస్తుంది.నీకు వీలున్నప్పుడల్లా నీకవితల్ని ఫేయిర్ చెయ్యి."అన్నారు. బాబు పడుకున్నప్పుడు కవితల్ని ఫెయిర్ చేసేదాన్ని. మొదటి పుస్తకం కనుక ముందుమాట ఎవరిచేతనైనా రాయించుకుంటే బాగుంటుంది అని అనుకున్నాము.కుందుర్తి చేతరాయించాలా,శివారెడ్డి చేత రాయిస్తే బాగుంటుందా అని ఆలోచించి అప్పటికే నాలుగు కవితా సంపుటాలు వచ్చి,కుందుర్తి స్థాపించిన ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు అందుకొని ప్రజాస్వామ్య కవిగా కవితారంగంలో ఒక స్వంత ముద్రతో దూసుకుపోతున్న కవి ఆయన.అందుకని శివారెడ్డి గారిచేతే ముందుమాట రాయిస్తే బాగుంటుందనుకున్నాము. ఎట్టకేలకు కె.శివారెడ్డిగారి ముందుమాటతో నా మొదటి కవితాసంపుటి " ఆకలినృత్యం " వెలువడింది.రెండు రకాల ముఖచిత్రాలతో పుస్తకం వచ్చింది.ఒకటి ఎర్రని హేండ్ మేడ్ పేపరు మీద పసుపురంగులో పుస్తకానికి క్రాస్ గా అందమైన వీర్రాజు గారి ముద్రతో ఉన్న అక్షరాలు,మరొకటి కిందనుండి పైకి ఇంద్రధనుస్సులా రంగులహేలతో ఉన్న అట్టమీద శీర్షికతో ముద్దొచ్చేలా ఉన్న నా తొలి సంపుటిని ప్రేమతో వీర్రాజు గారికే అంకితం చేసాను. యువకవులను ప్రోత్సహించేందుకు కుందుర్తి ఆంజనేయులు గారు ఒక ఉద్యమంలా పనిచేసారు.1967 నుండి ఫ్రీవర్స్ ఫ్రంట్ పేరిట తొలిరోజుల్లో 116 రూపాయల చొప్పున ఆ ఏడాది వచ్చిన కవితాసంపుటిని ఎంపికచేసి ఆ కవికి మనియార్డరు చేసేవారు కుందుర్తి గారు.మొదటి పురస్కారం వీర్రాజు గారి కొడిగట్టిన సూర్యుడు కి తీసుకున్నారు. 1980 సంవత్సరానికి దేవీప్రియ రాసిన " అమ్మ చెట్టు" కు ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు ఇస్తున్నట్లు ప్రకటించటమే కాకుండా ద్వితీయ స్థానంలో అమ్మంగి వేణుగోపాల్ - మిణుగురుని పేర్కొన్నారు. ఆ ఏడాది వచ్చిన కవితాసంపుటాలలో ఉత్తమమైనవిగా శీలా సుభద్రాదేవి -" ఆకలి నృత్యం"; గుంటూరు శేషేంద్ర శర్మ -సముద్రం నా పేరు; విహారి-చలనం; శశికాంత్ శాతకర్ణి-చంద్రజ్యోతి.అని పేర్కొంటూ పేపర్లలో ప్రకటన ఇవ్వటమే కాకుండా నాకు కుందుర్తి సంతకంతో లేఖ రావటం అపరిమితమైన ఆనందం కలిగించింది. 1983 కుందుర్తి గారి మరణానంతరం వారి కుమారుడు సత్యమూర్తి తండ్రి ప్రారంభించిన ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డులు కొనసాగించాలని సంకల్పించుకుని వీర్రాజు గారిని సంప్రదించి తనకు చేదోడువాదోడుగా ఉండమని కోరారు. వీర్రాజు గారు ఫ్రీవర్స్ ఫ్రంట్ పగ్గాలు చేతిలోకి తీసుకోక ముందే కుందుర్తి గారు అందించిన ఈ గుర్తింపు నాకు మరువలేని అపురూప జ్ణాపకం. బాబు తరుచూ అనారోగ్యానికి గురౌతున్నాడు.ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియని పరిస్థితి. హాస్పిటల్స్ కి , డాక్టర్లు దగ్గరకు తిరగటం,ఒకవైపు వీర్రాజు గారి ఆఫీసు వాళ్ళు ఇస్తున్న మెమోలు,ఎంతో ముచ్చటపడి స్వంతంగా పెట్టిన వికాస్ వలన తలెత్తుతున్న సమస్యలు,అంతకంతకు దిగజారుతున్న ఆర్థిక పరిస్థితులూ మా ఇద్దరినీ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.ఇక చివరికి పెట్టిన అయిదేళ్ళ సెలవు పూర్తికాగానే తిరిగి యథావిధిగా సమాచారశాఖ లో చేరటానికి నిర్ణయించుకున్నారు. రాంకోఠీలో మేమున్న ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయమని ఒత్తిడి చేస్తుండటంతో తెలిసిన వారందరికీ ఇల్లు చూడమని వీర్రాజు గారు చెప్పారు. ఈలోగా పెద్దమరిది సీతాఫలమండీలో ఇల్లు చూసుకొని వెళ్ళిపోయాడు.అతను మూడోసారి మరో అమ్మాయికీ తండ్రి కూడా అయ్యాడు వీర్రాజు గారికి మాకుటుంబానికీ ఆత్మీయ మిత్రులైన రామడుగు రాధాకృష్ణ మూర్తి గారు కొత్తనల్లకుంటలో .ఫీవర్ హాస్పిటల్ పక్కగల్లీలో ఇల్లు చూసారు.పెద్దకాంపౌండులో RCC రూఫ్ తో అద్దెల కోసం రెండుమూడు పోర్షన్ లు ఉన్నాయి.ఇంటివాళ్ళు అక్కడే ఒక పెద్దింటి లో ఉంటారు. సరే ఇంక సామానులు పేక్ చేయటం మొదలెట్టాము.మా పెద్దమరిది రామకృష్ణా,కుటుంబమిత్రుడు వీర్రాజు గారికి సోదరసమానుడైన మల్లేషు కాక యువకవులు కూడా ఒకరిద్దరు సహకరించారు. సామాన్లు లారీకి వేస్తున్నసమయంలో వీధి గుమ్మం లో అలికిడికి బయటకు వచ్చాను.ఇద్దరు కోయదొరలు భిక్షం కోసం అడుగుతున్నారు.నన్ను చూడగానే " అమ్మ మాయమ్మ అంటూ ఒకసారి పొగడటమే కాకుండా "అమ్మా మాయమ్మ లచ్చిమి తల్లె ఏడేళ్ళు గా పీడిస్తున్న ఏలిన్నాటి శని ఇకనుంచి నిన్ను వదలిపోతుందమ్మ "అని నన్ను పట్టుకున్నారు.ఈలోగా వీర్రాజు గారు ఇద్దరికీ చెరో అర్థరూపాయి చేతిలో పెట్టి పంపించేసారు. కోటికలల్ని మూటకట్టుకుని ఇష్టంగా ఈ ఇంట్లో అడుగు పెట్టాను. నలుగురిలో ఉన్నా కూడా తనకి తాను కల్పించుకున్న ఏకాంతంలో కుంచె,కలంపట్టి తపోదీక్షలో ఉండే ఆయనలో చలనం కలిగించిన దాన్నే అయినా కానీ దేహసంతృప్తి మాత్రమే జీవితం కాదు గదా. ఆనందకర అనుభూతులకన్నా,క్షణక్షణం అంతకంతకూ కుంగదీసి నన్ను నాలోకి ముడుచుకు పోయేలా చేసిన అనుభవాలనే చవిచూపించిందీ ఇల్లు. కలమో,కుంచెనో పట్టుకొని ఇహపరాలను మర్చిపోయి తపోదీక్షలో మునిగిపోయే ఆ తపస్వే కాదు,నా వైపే చూస్తున్న పసిపిల్లలు కూడా నన్ను అల్లుకొని ఉన్నారు. ఒక్కొక్కప్పుడు జీవితంపట్ల విరక్తి కలిగిన పరిస్థితుల్లో నన్నూ,చిన్నక్కనూ తన రెక్కలకింద పొదువుకొని కాపాడిన అమ్మ గుర్తుకు వచ్చేది. లోపలికి వచ్చి పల్లవిని, బాబుని ఒళ్ళోకి తీసుకుని కోయదొరల మాటలు తలచుకొని పేలవంగా నవ్వుకున్నాను.

3, జులై 2023, సోమవారం

సంచిక లో కస్తూరి మురళీకృష్ణ గారు చేసినముఖాముఖి

1)Kasturi murali k: నది ప్రయాణం పుస్తకం తయారుచేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? జ) కొందరు సాహితీవేత్తలు పోయినప్పుడు పత్రికలూ,మీడియా, సామాజిక మాధ్యమాల్లో వారి ప్రతిభని ప్రశంసిస్తూ,సాన్నిహిత్యాలనీ వెల్లడిస్తూ వచ్చే వ్యాసాల్ని చదివినప్పుడు "మనకి శిష్య ప్రశిష్యులూ లేరు,హోదాలు అధికారాలు లేవు,ఎవరితోనూ లేని ప్రేమని ఒలకబోస్తూ మాట్లాడే చాతుర్యం లేదు కనుక మనం పోయినప్పుడు పత్రికల్లో ఏమూలో చిన్న వార్త వస్తుందేమో" అని గత కొంతకాలంగా వీర్రాజు గారు అంటుండేవారు. అటువంటిది ఆయన పోయాక ప్రతీ ప్రింటెడ్, అంతర్జాల పత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో,సందేశాలతో పుంఖానుపుంఖాలుగా ఆత్మీయంగా వ్యాసాలు వచ్చేసరికి ఈయనకి ఇంత ఫాలోయింగ్ ఉందా అని నేనూ,మా అమ్మాయి విస్తుపోయాము. నాకు ఆత్మలు,మరోలోకం పట్ల నమ్మకాలు లేవు కానీ ఇంతమంది తనగురించి ఆర్తిగా రాస్తారని ఆయనకు ముందే తెలుస్తే ఎంత బాగుండును అని మనసులో అనుకొన్నాను. యాభై ఏళ్ళకు పైగా అక్షరాలతో కలగలిసి మేమిద్దరం జీవించాము.ఈ నాడు నా మనసులోనే,నా ఆలోచనల్లోనే ఆయన ఉన్నారని అనుకుంటున్నాను.పుస్తక ప్రచురణ అంటే పులకరించి పోయే వీర్రాజు గారికి ఆయన గురించి వచ్చిన ఆత్మీయ వ్యాసాలన్నీ కలిపి వేసే సంకలనం కన్నా మేము అందించే గొప్ప నివాళి ఇంకేమిటి ఉంటుంది.అందుకే నదిలా గుంభనంగా, నదిలా ఆత్మీయంగా ఉంటూ, గోదావరిని ప్రేమించే,గోదావరి పరిసరాలను పదేపదే తలుచుకునే వీర్రాజు గారి కోసం ఇవన్నింటినీ కలిపి నదిప్రయాణంగా నిక్షిప్తం చేయటానికి పూనుకున్నాను 2)Kasturi murali k: పుస్తకం తయారీలో మీ అనుభవాలు? జ) ఆయన పోయిన రోజునుండి ప్రచురితమైన వన్నీ ఎవరో ఒకరు నాకు వాట్సాప్ ద్వారా పంపుతునే ఉన్నారు.వాటినన్నింటినీ ఎప్పటికప్పుడు భద్రపరచుకున్నాను.తర్వాతర్వాత కూడా ఆ పది పన్నెండు రోజుల్లో ఫేస్బుక్ ల్లో దొరుకుతూనే ఉన్నాయి.అందువల్ల ఒక పద్ధతిలో వాటిని సమకూర్చటంతో అనేకసార్లు డీటీపి ఆయన్ని సంప్రదించవలసి వచ్చింది.అంతేకాకుండా వీర్రాజు గారి తోబుట్టువులలో మిగిలిన ఒకేఒక్క తమ్ముడిచేతా,వీర్రాజు గారి బాల్యమిత్రుడిచేతా వారి జ్ణాపకాలు రాయించి చేర్చటం అవసరం అని భావించి రాయమని కోరాను.అంతేకాక మా అమ్మాయి,మనవరాలు ఆయన గురించి తమ మనసులోని మాటని చెప్పుకోదగ్గ సందర్భం ఇదొక్కటే.అందుకే వారినీ రాయమన్నాను.కుందుర్తి ఆంజనేయులు గారి కుటుంబం మాకు అత్యంత సన్నిహితులు.వారి మనవరాలు కుందుర్తి కవిత మా ఇంట్లో పిల్లలాగే బాల్యం నుండీ తిరిగింది.అందుకే ఆ అమ్మాయిని రాయమని అడిగాను.అంతే తప్ప నాకై నేను సాహిత్య లోకంలో ఎవరినీ రాయమని కోరలేదు.అన్నీ ఏదో ఒక మాధ్యమంలో అందరూ వీర్రాజు గారిపై తమ అభిమానాన్ని,ఆత్మీయతను వెల్లడిస్తూ స్వచ్ఛందంగానే రాసారు. 3) Kasturi murali k: వ్యాసాల ఎంపికలో పాటించిన ప్రామాణికాలేమిటి? జ) నిడివి ప్రామాణికంగానే వచ్చిన నివాళి వ్యాసాలను తీసుకున్నాను.చిన్నచిన్న సందేశాలను తీసుకోలేదు. వరుసక్రమంలో కూడా సమగ్రంగా ఉన్న వ్యాసాలను,తర్వాత చిత్రలేఖనం మీదా, సంపాదకీయాలు,సందేశాలు,కుటుంబ సభ్యులు రాసినవిగా కూర్చాను. 4) Kasturi murali k: నిర్మొహమాటంగా చెప్పండి, వీర్రాజుగారు సాహిత్య ప్రపంచానికి ఎంతో సేవ చేశారు. ఎంతమందికో పలు రూపాల సహాయం చేశారు. అజాత శత్రువువారు. అత్యంత గౌరవనీయులు. కానీ, వారికి లభించాల్సినంత గుర్తింపు లభించిందంటారా? లభించకపోతే ఎందుకని లభించలేదు?లభిస్తే ఎలా? జ) నిజమే వీర్రాజు గారు తన ఆరోగ్యాన్ని,తన కుటుంబాన్ని కూడా ఒకదశలో పట్టించుకోకుండా ( బహుశా కుటుంబాన్ని నేను చూసుకుంటాననే ధైర్యం తోటి కావచ్చు) మిత్రుల కోసం ,కేవలం పరిచయస్తులకోసం కూడా సమయాన్ని ,ధనాన్ని వెచ్చించిన రోజులు ఉన్నాయి.ఆయన మంచితనాన్ని,స్నేహధర్మాన్నీ చేతకానితనం గా పరిగణించి ఎక్సప్లాయిట్ చేసినవారూ ఉన్నారు.అవన్నీ నేను గానీ ఆయన గానీ ఏనాడూ పట్టించుకోలేదు. కానీ సాహిత్య వ్యాసాలలో వీర్రాజు గారి కాంట్రిబ్యూషన్ ఉన్న సందర్భాల్లో కూడా ఆయనని పట్టించుకోనప్పుడు,ఆయన సాహిత్యాన్ని ప్రస్థావించని సమయాల్లో నైరాశ్యంలో మునిగిపోయే వారు. తర్వాత్తర్వాత సాహితీవేత్తలు చిత్రకారుడిగా,చిత్రకారులు సాహితీ వేత్తగా భావించటం వలన రావలసినంత గుర్తింపు తనకి రాలేదని పలు సందర్భాల్లో వెల్లడించారు. అంతేకాక కాలం మారిపోతున్న సందర్భాల్లో, ప్రాతినిధ్యాలు మారుతున్న సందర్భాల్లో ఏ వ్యక్తివలన ప్రయోజనం ఉంటుందో,ఎవరివల్ల అవార్డులు,గుర్తింపులు వస్తాయో వారి చుట్టూ ప్రపంచం తిరిగే రోజులివి. డిజిటల్ ముఖచిత్రాలు మొదలు కావటం తో వీరితో ముఖచిత్రాలు వేయించుకోటానికీ రావాల్సిన అవసరం తీరింది. మా వలన ఏ ప్రయోజనం లేనప్పుడు దూరం కావటం సహజమే కదా? అందులోనూ మేము ఇద్దరం కూడా చొచ్చుకుపోయి పరిచయాలు,స్నేహాలు పెంచుకోలేని మొగమాటస్తులం.అందుకే మేము మా మానాన రాసుకుంటూ ఉండటమే గానీ అవార్డులకోసం,గుర్తింపులు కోసం ఏనాడూ పాకులాడ లేదు. రచనలన్నీ పుస్తకం రూపంలో ఉంటే మా సాహిత్య సృజనని ఎవరో ఒకరు ,ఎప్పడో అప్పుడు మనసుకు హత్తుకోకపోరు అనే ఆశావహ దృక్పథం మాది. 5)Kasturi murali k: ఈ సంకలనంలో వున్న వ్యాసాలు వీర్రాజుగారి సాహిత్య వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా ప్రతిబింబించాయా? ఈ వ్యాసాలు స్పృశించని పార్శ్వాలేమిటి? జ) నదిప్రయాణం లోని వ్యాసాలు కేవలం వారి మరణానంతరం వీర్రాజు గారి స్మరణలో రాసినవి కనుక వీటిలో ఎక్కువగా ఆయన వ్యక్తిత్వం,స్నేహధర్మం,మంచితనం,అభిమానం తెలియజేసేవి లాగానే ఉండటం సహజం.వీటిలో సాహిత్య వివేచన ఉంటుందని ఆశించనవసరం లేదనుకుంటాను. సాహిత్యం,చిత్రలేఖనం గురించి స్పర్శించడం మాత్రమే జరిగింది. అయితే ఒకప్పుడు కడియాల రామ్మోహన్ రాయ్,వడలిమందేశ్వరరావు,కోవెల సంపత్కుమారాచార్య,ఆంవత్స సోమసుందర్ గారి వంటి విమర్శకులు ఎవరిదైనా పుస్తకం అందుకోగానే వాళ్ళకు నచ్చితే ఆ కవి పెద్దవాడైనా, యువకవులే ఐనా చక్కటి వ్యాసం రాసి పత్రికలకు పంపేవారు. ఆ విధంగా వీర్రాజు గారి తొలి రచనల నుండి ప్రచురితం అయిన వ్యాసాలను, సుదీర్ఘ సమీక్షలనూ సుమారు డెబ్భైకి పైగా ఏర్చికూర్చి డా.నాళేశ్వరం శంకరంగారి సంపాదకత్వం లో 2007 లో " శీలావీర్రాజు కలంచిత్రాలు" పేరిట సంకలనం వచ్చింది.అందులో వీర్రాజు గారి సాహిత్య విశ్లేషణ సంపూర్ణంగా వచ్చింది. అదే విధంగా నా రచనలపై కూడా ప్రచురితమైన నలభై రెండు వ్యాసాలను, సుదీర్ఘ సమీక్షలనూ " గీటురాయి పై అక్షరదర్శనం" పేరిట 2016 లో వీర్రాజు గారు సంకలనం చేసారు. 6)Kasturi murali k: నిజానికి ఈ సంకలనంలో యాభై నాలుగుపైగా వ్యాసాలున్నా, అనేకం శ్రద్ధాంజలి సమర్పించినవవటంతో వాటి పరిధి పరిమితమయిందనిపిస్తుందన్న విమర్శకు మీ స్పందన ఏమిటి? జ) కొంత వరకూ పై ప్రశ్నకు సమాధానమే దీనికి వర్తిస్తుంది. మీరు అన్నట్లు ఆత్మీయులు, స్నేహితులు, బంధువుల శ్రద్ధాంజలికి పరిమితం అయినదే.ఆయన అనుకున్నట్లు కుల మత ప్రాంతీయవివక్షతలతో అందరూ దూరమయ్యారు అని గత కొంతకాలంగా గా బాధపడిన వీర్రాజు గారికి "మిమ్మల్ని ఎవరు దూరం చేసుకోలేదు సుమా" అని ఇప్పుడు నా ఆలోచనల్లో, నాలో ఉన్న వీర్రాజు గారికి ఉపశమనం గా అందించిన ఆత్మీయ నివాళే ఈ నదిప్రయాణం. 7)Kasturi murali k: ఈ పుస్తకం ద్వారా మీరు అనుకున్న లక్ష్యం నెరవేరిందా? మీ లక్ష్యం ఏమిటి? జ) వీర్రాజు గారు సంపూర్ణ జీవితాన్ని తాను ఎలా జీవించాలని అనుకున్నారో అదే విధంగా జీవించారు. తాను చిత్రకళా అభ్యసించిన జన్మస్థలం రాజమహేంద్రవరంలోని దామెర్ల రామారావు కళానికేతన్ కి తన జీవితకాలంలో వేసిన డెభ్భై ఎనిమిది తైలవర్ణ చిత్రాలను మార్చి 2022లోనే చిత్రకళాభిమానులకోసం అంకితం చేసి, గోదావరి నదిని,పోలవరం పరిసర ప్రాంతాలను కళ్ళనిండా నింపుకొని తర్వాత రెండు నెలలకే సంతృప్తి గా నిష్క్రమించారు. . వీర్రాజు గారి ప్రథమ వర్థంతి సమావేశానికి కేవలం ఫోను ద్వారా పంపిన నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన సుమారు రెండువందలమంది ఆత్మీయుల సమక్షంలో ఈ పుస్తకావిష్కరణలని ఒక సెలబ్రేషన్స్ గా జరపాలని నిశ్చయించుకొన్న నా లక్ష్యం నెరవేరింది. 8)Kasturi murali k: శీలావీర్రాజు గారు ఎప్పుడూ సన్మానాలు, ఆర్భాటాల జోలికి వెళ్ళలేదు. నిశ్శబ్దంగా తన పని చేసుకుంటూ వెళ్ళారు. వారి నిష్క్రమణ తరువాత సాహిత్య ప్రపంచం స్పందన గురించి మీ స్పందన? జ) నాలుగవ ప్రశ్న జవాబే దీనికి సరిపోతుందను కుంటాను. 9)Kasturi murali k: ఇటీవలి కాలంలో ఒక సాహిత్యవేత్త మరణం తరువాత అతని స్మృతిని సజీవంగా వుంచే బాధ్యత సాహిత్య ప్రపంచంకాక, ఆ సాహిత్యవేత్త కుటుంబ సభ్యులే నిర్వహించాల్సివస్తోంది. ఉదాహరణకు ఘండికోట బ్రహ్మాజీరావుగారు.పురాణం సుబ్రహ్మణ్య శర్మ, పురాణం శ్రీనివాస శాస్త్రి తదితరులు. శీలా వీర్రాజు గారి మరణం తరువాత కూడా ఆయన స్మృతి సజీవంగా వుంచే బాధ్యత మీరే స్వీకరించాల్సివస్తోంది. ఇలాంటి పరిస్తితి ఎందుకని నెలకొంటున్నదంటారు? ఈ పరిస్థితి మారి, సాహితీవేత్త స్మృతిని సాహిత్య ప్రపంచమే సజీవంగా నిలిపే పరిస్థితులు నెలకొనాలంటే ఎంచేయాలంటారు? జ) ఎందరో ప్రముఖ సాహితీవేత్తలు మరణించాక వారు కుటుంబ సభ్యులకు సాహిత్య వాసనలు లేకపోతే నెలలోపునే వాళ్ళపుస్తకాలు,ముమెంటోలు తూకానికి అమ్మేయడం కూడా చూస్తునే ఉన్నాము. కుటుంబ సభ్యులకు సాహిత్యం పట్ల అభిరుచి,గౌరవం ఉన్నప్పుడు ఆ సాహితీస్మృతి ఆ యింట సజీవంగా ఉంటుంది.ఎవరి పుస్తకాలు వాళ్ళే మోసుకు తిరగాల్సి వస్తోన్న ఈ రోజుల్లో సాహిత్య ప్రపంచాన్ని ఆశించటం వ్యర్థమేనేమో. నిజానికి సాహితీవేత్తల స్మృతిని,శతజయంతులనూ నిర్వహించి, మోనోగ్రాఫ్ లు రాయించి వారిని సజీవంగా ఉంచగలిగేది కేంద్ర,రాష్ట్ర సాహిత్య అకాడమీలు.అయితే అవన్నీ కమిటీసభ్యుల ఇష్టాయిష్టాల మీద ఆధారపడి జరుగుతాయి. 10)Kasturi murali k: ఒక కవిగా మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి? జ) మొదటినుంచీ నా సాహిత్య సృజన విస్తృతంగా నే సాగుతోంది.చాలా ఎక్కువగా చదువుతాను.అలాగే యాభై ఏళ్ళుగా రాస్తూనే ఉన్నాను.గత అయిదారు ఏళ్ళుగా ఇంచుమించు ప్రతీనెలా ఏదో ఒక రచన ప్రచురితమౌతూనేఉంది.రెండున్నర సంవత్సరాలుగా నెచ్చెలి అంతర్జాల పత్రికలో నా ఆత్మకథ రాస్తున్నాను. ఓ నాలుగు పుస్తకాలు ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయి.వీలు వెంట ప్రచురించుకోవాలి. నా ఆలోచన అలసిపోలేదు,నేనూ అలసిపోలేదు,నా కలం అలసి పోలేదు.కొనసాగుతూనే ఉంటుంది. 11)Kasturi murali k: శీలావీర్రాజుగారి రచనలను సజీవంగా నిలిపే ప్రయత్నాలేమైనా చేస్తున్నారా? జ) వీర్రాజు గారు ఉన్నప్పుడే వారి రచనలన్నీ గ్రంథరూపంలోకి వచ్చాయి. ఆయన వేసిన తైలవర్ణ చిత్రాలు కుంచె ముద్రలు,చిత్రకారీయం పేరిట రెండుసంపుటాలుగా వచ్చాయి.లేపాక్షి శిల్పాల స్కెచ్ లు శిల్పరేఖ పేరుతో ప్రచురించారు. వారి చిత్రలేఖనం మీద ప్రముఖులు రాసిన వ్యాసాలు ప్రచురించటానికి రెడీగా ఉన్నాయి.అవి గాక వీర్రాజు గారు వెయ్యికి పైగా ముఖచిత్రాలు వేసారు వాటిని పుస్తకం గా వేయాలని ఉంది.అవి కలర్స్ లోనే వేయాలి కనుక ఆర్థికంగా భారమే కానీ వీలువెంట వేసే ప్రయత్నం చేస్తాను. 12)Kasturi Murali Krishna:ఆయన రచనల గురించి విశ్లేషణలు చేయించి ప్రచురించటం, జ)పైన అయిదవ ప్రశ్నలో తెలియజేసాను 13) అవార్డులివ్వటం లాంటివి...... జ) వీర్రాజు గారు ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డులు నడిపిన రీతిలో ప్రతిష్టాత్మకంగా ఇవ్వాలని ఉంది.ఏప్రక్రియకు,ఏరంగానికి ఇవ్వాలి అనేది ఇంకా నిర్ణయం కాలేదు. ఈలోగా రాజమహేంద్రవరంలోని చిత్రకళానికేతన్ లో సాయంత్రం పూట పిల్లలు వచ్చి నేర్చుకోవటం చూసాను.అందుకని వాళ్ళని ప్రోత్సహించేందుకు ప్రతీ ఏడాదీ పోటీ పెట్టి మా కుటుంబసభ్యుల పర్యవేక్షణలో బహుమతులు ఇవ్వటానికి నిర్ణయించుకున్నాము. 14)Kasturi murali k: ఈ సంకలనంలోని వ్యాసాల్లో మీకు వ్యక్తిగతంగా నచ్చినవ్యాసం ఏమిటి? జ) సగం వరకూ వ్యాసాలు బాగున్నాయి.అయిదారు వ్యాసాలు నాకు బాగా నచ్చాయి.కొన్నివ్యాసాలు బయోడేటా ఆధారంగానే రాసినట్లు ఉండటంతో విషయం చర్వితచర్వణంగా ఉన్నాయి. అయితే మీరు ఒక్కటే చెప్పమన్నారు కనుక నందిని సిధారెడ్డిగారి వ్యాసం చాలాబాగుంది.

జీవించాలంటే.....

~~ జీవించాలంటే.....~~ జీవితాలకేం ప్రయాణిస్తూనే ఉంటాయ్ ఒక్కోసారి సెకెన్ల ముల్లులా పరుగులుతీస్తాయ్ మరోసారి నిమిషాలముల్లుతో పాటు ఆచితూచి అడుగులు వేస్తూ గంటలముల్లుతో బధ్ధకంగా సోమరిగా కదులుతూ కాలంతో పాటూ నడుస్తూనే ఉంటాయి. ఈ మనసే పరమదుర్మార్గపుది జ్ణాపకాలపుట్టని నిరంతరమూ తవ్వుతూ జీవితం ముంగిట్లో ఆశలచెట్టు మొదల్నే సారవంతం చేస్తున్నానంటుంది కానీ కాసిని చిరునవ్వు పువ్వుల్ని ఎప్పుడో గానీ పెదాలమీద అలంకరించదు జీవితంతో చేయి చేయి కలిపి ఈ మనసు నడవకుండా నడక దారంతా ముళ్ళు రాలుస్తూ సాల్వడార్ కరిగిపోతున్న కాలం గురించి కథలు కథలు గా చెప్పి నిరుత్సాహపు పొరల్ని కళ్ళ మీద పరిచి చెలమల్ని అద్దుతుంది ఎప్పుడో ఒకప్పుడు సమయం చూసి ఈ దుర్మార్గపు మనసుని ఒడుపుగా బంధించాలి ఆలోచనల్ని ఎగిరిపోనీయకుండా పిడికిట పట్టి మనసులో ఒంపి పెంపుడు పిల్లిని చేసి మనవెనకే తిప్పుతూ పక్కదార్లు పట్టనీకుండాచేయాలి ఇక ఆ తర్వాత జీవితంతో చేతులు కలిపి నడవాల్సిందే తప్పదు గాక తప్పదు. (ప్రజాశక్తి సాహిత్య పేజీ 3/7/23)