31, డిసెంబర్ 2022, శనివారం
కథలపోటీలో సంపుటాలు
1. 2001లో భార్గవి రావు నూరు మంది రచయిత్రులకథలతో నూరేళ్ళపంటవేసేటప్పుడు కొంత కష్టపడవలసి వచ్చింది.
2.ఆరోజుల్లో రచయిత్రులు రచయితలకు తీసిపోకుండా కథాంశాలు ఎన్నుకొని రాసినవారు ఉండేవారు.
3.ఇటీవల సమాజం లోని లోతులకు వెళ్ళి పాఠకులు ఊహించలేని కొత్త కొత్త అంశాలను తీసుకుని కథలు రాస్తున్నారు.
4.రచయిత్రుల సంఖ్య కూడా బాగా పెరిగింది ఇప్పుడు సంకలనం చేయాలంటే సులభంగా రెండు వందలకు పైగా మంచి రచయిత్రుల కథలను సంకలనం చేసేయవచ్చు.
5.దానికి ఉదాహరణే శాంతినారాయణ గారి పురస్కార ప్రకటనకు వచ్చిన పుస్తకాలు.అరవైనాలుగు పుస్తకాల్లో పాతతరం రచయిత్రులు అతి తక్కువ మంది.ఇంతమంది గత పదిపదిహేనుఏళ్ళుగా రాస్తున్న వారే అధికం అది సంతోషించ వలసిన విషయం.
కథలురాయాలంటే కథలవర్కషాపు పెట్టి నేర్పించనక్కరలేదు.పుట్టినదగ్గరనుంచి ఎదుర్కొన్న అనుభవాలూ,అవమానాలూ మూలాలు మర్చిపోని వాళ్ళ కథని రాసేలా చేస్తుంది.
6. పంపిన పుస్తకాలు చదివి ఏపుస్తకాన్ని ఎంపిక చేయాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది.కథాంశం,భాషా, రచనా విధానం, ముగింపు వీటిని పరిగణలోనికి తీసుకుని పదేపదే చదవాల్సివచ్చింది.
7.పురస్కారం అందుకున్నఎండపల్లి భారతి శ్రామిక మహిళల దృష్టికోణం నుంచి బలంగా రాసిన కథలు. ఈ కథలు బతుకీత లో మునుగీతలు కొడుతున్నవాళ్ళు తప్ప ఒడ్డును కూర్చున్న వాళ్ళు రాయలేని కథలు. భారతి కథలు ఉత్తమ పురుష లోనే రాసిన కథలు కావటాన ఆమెనడిచే ముళ్ళదారుల్లోకి మనల్ని చెయ్యిపట్టుకొని కథ వెంట లాక్కెళ్ళతుంది .ఆ తర్వాత చెయ్యి వదిలినా,పుస్తకం మూసినా ఆ దుఃఖాలు మనల్ని వదలవు.
8.పల్లె జీవితంలో మమేకమయి పోయి వాటినే తన కథా నేపథ్యాలుగా మన ముందుకు తెచ్చింది.
కథలన్నీ చిత్తూరు యాసలో సాగుతూ మన ముందు కొత్త జీవితాలను పరిచయం చేస్తాయి. ఏ కథకు తగ్గట్టు ఆయా పాత్రల్ని చిత్రించటం పుస్తకంలో మరో ప్రత్యేక ఆకర్షణ.
వాస్తవ జీవితానికి దగ్గరగా ఉన్న కథ చదివగానే జీవమున్న కథఅని అనుకోవడమే కాక మనల్ని వెంటాడుతాయి అలాంటి కథలు ఒకేసారి చదివితే
అవే ఎండ్లపల్లి భారతి ఎదురీత కథలు.
9.పద్దం అనసూయ చప్పుడు కథలన్నీ కోయ జీవితాన్ని ఆవిష్కరించినవే. అందులోనూ మృత్యువు నేపథ్యంలోనివి. మృత్యువు నేపథ్యంలోనే సాగిన ఈ కథలు చదువుతుంటే కోయ జీవితం అడవి నుంచి దూరమై ఆధునిక పోకడలకు బలైపోయిన అస్థిత్వాన్ని కోల్పోతున్న సందర్భాన్ని తెలిపే ఈ నాలుగు కథలు సంస్కృతి, ఆచారాలు, పధ్ధతులు కనుమరుగైపోతున్న తీరుకు రచయిత్రి ఘర్షణ పడుతుందో అనిపిస్తుంది. ఓకే అంశాన్ని నాలుగు దృక్కోణంలో రాసిన ఈ నాలుగు కథల్లో కోయల ఆత్మ మనకు దర్శనమిస్తుంది. అందులోనూ స్త్రీహృదయం తో చెప్పిన కథలు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి