28, జూన్ 2022, మంగళవారం

మర కవిత

 ~ మర ~


నేను ఎప్పుడు ఇలా మారిపోయాను

అప్పట్లో చినుకులు పడుతుంటే

వానా వానా వల్లప్ప అని తిరిగి

అరచేతులు చాచి దోసిలి నింపుకుని.

ఎగరేస్తే ముత్యాలై వాకిట్లో దొర్లేవి

నాలికతో అందుకునే చాతకపక్షిని అయ్యేదాన్ని

మరి

ఎప్పుడు ఇలా మారిపోయానో


అప్పట్లో వెన్నెల డాబా నిండా కురుస్తుంటే

చాపమీద వెల్లకిలా పడుకుని

చెవిలో గుసగుసలు చెప్తున్న

గాలి సందేశాన్ని వింటూ

మనసులో రేగే మధురోహలతో

రెప్పల మాటున కలల్ని దాచుకునేదాన్ని

మరి

ఇప్పుడుపొరలు కప్పుకున్న కంటిపాప

ఎప్పుడు ఇలా తడి ఎరుగని

పొడి చూపుగా మారిపోయిందో!


అప్పట్లో పెరటి లోని సన్నజాజి పందిరి

అకస్మాత్తుగా తీగని జార్చి పూలకొనగోటితో

అటుగా వచ్చినప్పుడు నా బుగ్గని మీటితే

మంచు బిందువు చెంపలకి

కెంపు ములాము పూసేది

మరి

ఇప్పుడు బీటలు వారిన బీడై

ఎప్పుడు ఇలా మారిపోయానో


చైత్రమాస వసంతాగమనంలో

ఏ రెమ్మచాటు నో దాగిన కోయిల

నిరంతరాయంగా కుహూమంటూ పిలుస్తుంటే

గొంతు కలిపి ఎన్ని రాగాలు

మలయమారుతం తో పాటూ

పరిసరాల్ని సంగీతమయం చేసేదాన్నో

మరి

ఇప్పుడేంటి గొంతునిండా కరకు ముళ్ళు

రాగాల్ని ముక్కలుగా కోసేస్తున్నాయి.


కాలయంత్రమా

నువ్వెంత కఠినాత్ముడివి

బాధ్యతల పళ్ళసంకెళ్ళు తగిలించి

నీ చక్రాల మధ్య ఇరికించి

నన్ను నుజ్జునుజ్జు ను చేసి

నీలాగే స్పందన లేని యంత్రాన్ని చేసావు. 

(విశాలాక్షి జూన్2022)


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి