28, జూన్ 2022, మంగళవారం

మర కవిత

 ~ మర ~


నేను ఎప్పుడు ఇలా మారిపోయాను

అప్పట్లో చినుకులు పడుతుంటే

వానా వానా వల్లప్ప అని తిరిగి

అరచేతులు చాచి దోసిలి నింపుకుని.

ఎగరేస్తే ముత్యాలై వాకిట్లో దొర్లేవి

నాలికతో అందుకునే చాతకపక్షిని అయ్యేదాన్ని

మరి

ఎప్పుడు ఇలా మారిపోయానో


అప్పట్లో వెన్నెల డాబా నిండా కురుస్తుంటే

చాపమీద వెల్లకిలా పడుకుని

చెవిలో గుసగుసలు చెప్తున్న

గాలి సందేశాన్ని వింటూ

మనసులో రేగే మధురోహలతో

రెప్పల మాటున కలల్ని దాచుకునేదాన్ని

మరి

ఇప్పుడుపొరలు కప్పుకున్న కంటిపాప

ఎప్పుడు ఇలా తడి ఎరుగని

పొడి చూపుగా మారిపోయిందో!


అప్పట్లో పెరటి లోని సన్నజాజి పందిరి

అకస్మాత్తుగా తీగని జార్చి పూలకొనగోటితో

అటుగా వచ్చినప్పుడు నా బుగ్గని మీటితే

మంచు బిందువు చెంపలకి

కెంపు ములాము పూసేది

మరి

ఇప్పుడు బీటలు వారిన బీడై

ఎప్పుడు ఇలా మారిపోయానో


చైత్రమాస వసంతాగమనంలో

ఏ రెమ్మచాటు నో దాగిన కోయిల

నిరంతరాయంగా కుహూమంటూ పిలుస్తుంటే

గొంతు కలిపి ఎన్ని రాగాలు

మలయమారుతం తో పాటూ

పరిసరాల్ని సంగీతమయం చేసేదాన్నో

మరి

ఇప్పుడేంటి గొంతునిండా కరకు ముళ్ళు

రాగాల్ని ముక్కలుగా కోసేస్తున్నాయి.


కాలయంత్రమా

నువ్వెంత కఠినాత్ముడివి

బాధ్యతల పళ్ళసంకెళ్ళు తగిలించి

నీ చక్రాల మధ్య ఇరికించి

నన్ను నుజ్జునుజ్జు ను చేసి

నీలాగే స్పందన లేని యంత్రాన్ని చేసావు. 

(విశాలాక్షి జూన్2022)


యుధ్ధం

~~ యుధ్ధం ~~

అవును
నేను యుద్ధం చేస్తున్నాను
ఇప్పుడే కాదు
తొలిసారి అమ్మ పొట్టలోంచి
వచ్చినప్పటినుంచే మొదలైంది
అందుకే కదా ఏడుస్తూనే వచ్చాను.

అవును
నేను యుద్ధం చేస్తూనే ఉన్నాను
అన్నయ్యకి వేసిన మీగడ పెరుగు కోసమో
సెకెండ్ హేండ్ పుస్తకాలు వద్దనో
వెలిసి పోయిన అక్కకి బిగువైన ప్రాక్ తొడగననో
నాదైన నల్లని పలక కావాలనో
కొంగు చాటున దుఃఖాన్ని దాచుకున్న అమ్మతో
చేస్తున్నది యుద్ధం అని తెలియకుండానే చేసాను.

నేను యుద్ధం చేస్తూనే ఉన్నాను
అక్షరాలు ఏరుకునే క్రమంలో
నేనంటే ఏమిటో తెలుసుకోటానికో
నాకాళ్ళు బలంగా నేలమీద నిలబడటానికో
నాచేతులు పైకిసాగి ఆత్మవిశ్వాసాన్ని పతాకగా ఎగరేయటానికో
ఇంటా బయటా
వయసుతోనో మనసుతోనో
నాతో నేను నిత్యం యుద్ధం చేస్తూనే ఉన్నాను.

ఆశ్చర్యం
నా అడుగుజాడలు నా ఒక్కదానివే కావు
అడుగులో అడుగు కలుపుతూ
కవాతుగా వేనవేల పాదాలు నావెనకే
సగం ఆకాశాన్ని వెలిగిస్తున్న పతాకాలు
అయినా ఇప్పుడు కూడా
సమాజంతోనో సంప్రదాయాలతోనో
మాకోసం మేము
నిత్యమూ  యుద్ధం చేయక తప్పటం లేదు
ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో?
(పాలపిట్ట జూన్2022)

19, జూన్ 2022, ఆదివారం

 నడక దారిలో --17

        సంక్రాంతి మూడు రోజులూ కొంగ్రొత్త సంబరాలతో హృదయానికి రెక్కలు తొడిగి భవిష్యత్తు మీద కొత్త ఆశల్ని ప్రోది చేస్తూ వెళ్ళింది.

            ఇంట్లో పెళ్ళి సందడి మొదలయ్యింది.అద్దెఇల్లే అయినా సున్నాలు వేయించారు.ద్వారబంధాలకు వార్నీషు రంగులు వేయించారు.గుమ్మాలకు రంగుల వార్నీషులతో నేను డిజైన్లు వేసాను.నాపెళ్ళికి ఇంటి అలంకరణలు నేనే చేసుకున్నాను.

          వీర్రాజు గారు సంక్రాంతికి వచ్చినప్పుడు తెచ్చిన గోరింటాకుపొడితో రెండు చేతులకూ గోరింటాకు పలుచగా కలిపి చీపురుపుల్లతో డిజైన్లు పెట్టుకున్నాను.నేను హైస్కూల్ లో చదివే రోజుల్లో రాజీ వాళ్ళనాన్న హైదరాబాద్ నుండి తెచ్చారని చిన్న గోరింటాకు పొడి పేకెట్ నాకూ, కుమారీకీ ఇస్తే ఎలా పెట్టుకోవాలో తెలియక ముద్దగా కలిపి దాన్ని చందమామ పెట్టుకున్నది గుర్తువచ్చి నవ్వుకున్నాను.ఆ రోజుల్లో మెహంది పొడి హైదరాబాద్ లో మాత్రమే దొరికేది. 

           చిన్నక్కకు చంటిపిల్లాడు.పెద్దక్క వాళ్ళు కొత్తగా అనంతపురం బదిలీ కావటంతో సామానుతో,పిల్లలతో మరోఊరు చేరటం కొత్తింట్లో సర్దుకోవటం ఈ హడావుడి వలన ముందుగా రాలేకపోతున్నాననీ,తర్వాత నాతో హైదరాబాద్ వస్తాననీ అంది పెద్దక్కయ్య.నీపెళ్ళికి ఏర్పాట్లూ, ఆలోచనలూ నువ్వే చేసుకోవాల్సి వచ్చింది.ఇంట్లో ఇవన్నీ పట్టించుకునే శ్రధ్ధ లేనివాళ్ళు కావటంవలన నీకు నువ్వే పెళ్ళిపెద్దవి కావాల్సివచ్చింది.నిన్ను తప్పు పట్టని విధంగా జాగ్రత్తగా మసలుకో.సమయానికి నేనూ రాలేక పోతున్నానుఅని రాసింది.

          సభావివాహమే కనుక కట్నాలూ,కానుకలూ,పెళ్ళిఖర్చులూ పెద్దగా లేవు.వీర్కిరాజుగారి ఉంగరం చేయించారు.బట్టలు ఆయన వద్దన్నారు,కానీ ఒక జత తీసారు. అమ్మ ఎప్పటిదో ముక్కలుగా తెగిన గొలుసును నేను డిగ్రీలో చేరినప్పుడు చిన్న ఆఠీన్ షేపులోని సేండ్ స్టోన్ లాకెట్ తో సన్నని గొలుసు చేయించింది.అది చేయగా మిగులు ముక్కలుతో ఇప్పుడు ఒక తాళి చేయించింది.అత్త మూడుపేటల చంద్రహారాన్ని నాకు ,చిన్న ఆడపడుచుకు చెరిసగంగా రెండు నెక్లెసులుచేయించమని వీర్రాజు గారు ఇచ్చారు.నాకు నెక్లెస్ వద్దని దానితో ఒక చైను,ఒకజత సన్నని గాజులు చేయించు కున్నాను . అంతేకాకుండా తమ తరఫున ఒక తాళి చేయించమని అన్నయ్య కు డబ్బు పంపించారు.

           అందువల్ల నాకు కొనాల్సినవి లేవు కానీ అన్నయ్యవాళ్ళకు పెళ్ళి రోజు విందు భోజనం ఖర్చు మాత్రం తప్పలేదు.

          మా ఇల్లు చిన్నది కనుక తోటలో లక్ష్మీరావు మామయ్య ఇల్లు పెళ్ళికి వేదిక అయ్యింది.

          వీర్రాజు గారు పెళ్ళికార్డులు ప్రింట్ చేయించి పంపారు.కాలేజీలో కొందరులెక్చరర్లకు,నా మిత్రులకు ఇచ్చాను.నా బాల్యస్నేహితుడు దూర్వాసరావుకు,లతకు పోస్ట్ చేసాను.మా లెక్చరర్లు అందరూ అభినందనలు తెలిపారు.చదువుమానవద్దని సలహా ఇచ్చారు.

          చూస్తూ చూస్తూనే ఫిబ్రవరి 13 వచ్చేసింది.హైదరాబాద్ నుండి వీర్రాజు గారి కుటుంబం, మిత్రులు ఆరోజు సాయంత్రానికి వచ్చేసారు.    

       మగవారిని మా ఇంట్లో ఉండమని ఆడవాళ్ళం అందరం తోటలోని మామయ్య ఇంటికి వచ్చేసాము.

       ఆ రాత్రి అంతా ఒక విధమైన ఉద్వేగంతో ఆ రాత్రి రెప్ప వాలని రాత్రే అయ్యింది.

        పద్నాలుగు ఉదయమే తలకి స్నానం చేసి అక్కయ్య ఇచ్చిన ఆరణి సిల్క్ చీర కట్టుకున్నాను.అంతలోనే నా స్నేహితురాళ్ళు అందరూ వచ్చేసారు.మా ఇద్దరినీ కుర్చీల్లో కూర్చోబెట్టి కాళ్ళకు పారాణి ,కళ్యాణతిలకం పెట్టమని సభా వివాహం కదా అని మానేయొద్దని ఎవరో పెద్దవాళ్ళు చెప్పారు.

               అది కూడా యథాప్రకారం చేసారు.కొత్తచీర,చుట్టూ జనసమూహం.నాకు ఊపిరి ఆడనట్టై అక్కడే టేబుల్ మీద ఉన్న టేబుల్ ఫాన్ ప్లగ్ కి పెట్టబోయాను.చేతికి పట్టిన చెమట వల్లనేమో ఒక్కసారి ఝిగ్గున షాక్ కొట్టింది.కళ్ళు బైర్లు కమ్మి తూలేను.ఇదేమిటి ఈ శుభవేళ ఇలా జరిగింది అని కలవర పడ్డాను.నా స్నేహితులు చేస్తున్న వేళాకోళాలు చెవిలోకి వెళ్ళలేదు.కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగాయి.

       అపశకునాలు ,ఛాదస్తాలూ ఇలాంటి వాటిపై నాకు నమ్మకం లేకపోయినా నా మనసంతా కలత పడింది.ఈ శుభసమయంలో ఇలా జరగటం ఎందుకో కొద్దిసేపు నా భవిష్యత్తు మీద భయం కలిగింది. ఎవరికి చెప్పుకోలేని దిగులు కమ్మింది.పక్కనే కూర్చున్న ఆయన ఇవేవీ గమనించనే లేదు.అంతలోనే మనసును స్వాధీనం లోకి తెచ్చుకున్నాను.

     నా డాబా మీద షామియానా వేసారు.నాసహాధ్యాయులు,నా లెక్చరర్లు సీతాలక్ష్మి గారూ,చాగంటి కృష్ణకుమారి గారు,ఉమాకుమారిగారూ,పంకజగారూ, విజయలక్ష్మి గారు వచ్చారు.

       వివాహానికి అక్కయ్య ఇచ్చిన చీర మార్చుకుని వీర్రాజు గారు తెచ్చిన నేరేడు పండు రంగు జరీ అంచు తో ఉన్న తెల్లని కంచి పట్టుచీర కట్టుకున్నాను.ఆ చీర చూసి మా కాలేజీ మిత్రులు "ఏమిటి సుభద్రా రోజూ కాలేజీకి కట్టుకుంటూనే ఉంటాం. పెళ్ళికి కూడా తెల్లచీరేనా వేరే రంగుల్లో కొనిపించుకోలేకపోయావా" అన్నారు.అంతలో డాబామీద ఏర్పాటు చేసిన వివాహ వేదికకు మమ్మల్ని తీసుకువెళ్ళారు.మా లెక్చరర్లు”ఇంకా పురోహితులు రాలేదు.వేదికమీద ఏర్పాట్లు లేవు.ముహూర్తం దగ్గర పడింది కదా” అక్కయ్యని అడిగారట.బాజాలూ, భజంత్రీలు,మంత్రాలు, పురోహితులు, కట్నాలు,కానుకలూ లేవండి.వాళ్ళిద్దరి కోరిక మేరకు ఇలా జరుగుతుంది,” అని చెప్పేసరికి ఆశ్చర్యపోయారు.

      విజయనగరంలోని ప్రముఖ సాహితీవేత్త, బహుభాషావేత్త,మాకుటుంబానికి అత్యంత సన్నిహితులైన రోణంకి అప్పలస్వామి గారు ముందుగా పెళ్ళీ దాని పూర్వోత్తరాలు వివరించిన తర్వాత వారి ఆధ్వర్యంలో బంధుమిత్రుల కరతాళ ధ్వనులతో మాఇద్దరిచేతా దండలు మార్పించారు.అమ్మ చేయించినదే కాక అత్తవారి తరపున చేయించిన తాళి కలిపి సూత్రధారణ కూడా జరిగింది.

       వీర్రాజు గారి మిత్రులు కథక్ మిత్ర పేరుతో కథలు రాసే వేమూరి నరసింహారావు రెండు బంగారు ఉంగరాలు బహుమతిగా తీసుకువచ్చి ఒకరివేలుకు ఒకరిచేత ధరింపజేయించారు.మిత్రబృందం, బంధువుల కోలాహలం మధ్య మా వివాహం జరిగింది.నా సహచరుడు నామీద నమ్మకం ఉంచి,నా ఆలోచనలనూ,ఆచరణనూ గౌరవిస్తారని నమ్మి అపారమైన నమ్మకంతో,భరోసాతో నేను ధైర్యంగా తీసుకున్న నానిర్ణయం సరియైనదే అని మనస్ఫూర్తిగా విశ్వసించాను.

        ఇంతకాలం మా అభిరుచులు,ఆలోచనలూ,ఆశలూ కలబోసుకున్న మేమిద్దరం నాకెంతో ఇష్టమైన విశాఖ సంపంగి పరిమళాలను మనసునిండా నింపుకుంటూ ఆ రాత్రి ఏకశరీరులమయ్యాము.

     ఆ సాయంత్రమే చాలామంది మిత్రులు, బంధువులు,మరుదులూ, ఆడబడుచులూ తిరుగు ప్రయాణం కట్టారు.

      మూడురోజుల తర్వాత మేమిద్దరం,అక్కయ్య,అన్నయ్యలతో కలిసి హైదరాబాద్ బయలుదేరాం.   

        ఆరోజుల్లో విజయనగరం నుంచి హైదరాబాద్ కు హౌరా సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ ప్రయాణం ఇరవైనాలుగు గంటలూ పట్టేది.ఉదయం విజయనగరం నుండి బయ లుదేరితే మర్నాడు ఉదయం కి హైదరాబాద్ లో దిగేవారం.

       హైదరాబాద్ లో అందరం కలిసి చూడాల్సిన ప్రదేశాలన్నీ తిరిగాము.హైదరాబాద్ అనగానే గుర్తొచ్చే చార్మీనార్ పైవరకూ ఎక్కి అక్కడినుండి ఊరును చూడటం ఎంతబాగుందో!నౌబత్ పహాడ్ పైన ఏర్పాటు చేసిన టెలీస్కోపులో ఆకాశంలోని నక్షత్రాలను చూసి ఆకాశాన్ని అందుకున్నంతగా సంబరపడిపోయాను.సాలార్జంగ్ మ్యూజియం లోని కళాఖండాలు కళ్ళువిప్పార్చుకు చూసాను.అలసిసొలసి గోల్కొండ కోట పైవరకూ చేరి ఎందరు స్త్రీలు ఈ జనానాలో మగ్గిపోయారో అని బాధగా అనుకున్నాను.నెహ్రూజూలాజికల్ పార్క్ లో జంతువులను చూస్తూ పసిపిల్లనైపోయాను. 

         ఊళ్ళు తిరగటం,అక్కడి విశేషాలు , విహారస్థలాలు చూడటం నాకెంతో ఇష్టం,కాని విజయనగరం దాటి ఇంతకాలం ఏవీ చూడలేదు.అందుకే పగలంతా తిరిగి అలసిపోయినా సంతోషంతో మనసు నిండిపోయింది.మా ఇల్లు రెండే రూములు,చుట్టాలు వలన మాకు పడక పక్కనే ఉన్న స్వాతిపత్రిక ఆఫీస్ లో ఏర్పాటు చేసారు.ఆ గది రోడ్డు వైపు మడిగి లా ఉండి చెక్క తలుపులు ఉండేవి. వాటిని ఆఫీసు వాళ్ళే తాళాలువేసుకునేవారు.మాఇంటి గుమ్మం ఎదురుగా మరో ద్వారం ఉండేది. ఆ తాళాలు మాకు ఇచ్చారు. 

        రాత్రి నవారుమంచం పక్కా తీసుకొనివెళ్ళి పడుకున్నాం.మా మనసులు కలవటానికి కారణమైనది స్వాతి మాసపత్రిక అయితే మా తొలిరాత్రులకు వేదిక అదే స్వాతి ఆఫీసు కావటం ఒక తీపిజ్ణాపకం.

           ఆదివారం రోజున సాహితీ మిత్రులు అందరికి విందు ఏర్పాటు చేసారు.దిగంబరకవులైనజ్వాలాముఖి, నగ్నముని,నిఖిలేశ్వర్, వరవరరావు గార్లు వచ్చారు.శివారెడ్డి, కుందుర్తి గారు మొదలైన సాహితీ మిత్రులు,యువభారతి సభ్యులు శ్రీపతి,ఆనందారామం తదితర రచయితలూ స్వాతి బలరాం,వేమూరి గోపాలకృష్ణ మొదలైన వారంతా వచ్చారు.కుటుంబమిత్రులు శిష్ట్లా శకుంతల, రామడుగు రాధాకృష్ణ మూర్తి ఇలా అంతా సాహితీ బంధువులే వచ్చారు.ఎవరో "మీరు లలితగీతాలు పాడుతారటకదా" అని నాచేత పాటపాడించుకున్నారు.

         తర్వాత రోజు అక్కయ్య వాళ్ళు అట్నుంచి అటే అనంతపురం వెళ్ళిపోయారు.ఆ మర్నాడు సాయంత్రం నేనూ అన్నయ్య విజయనగరం కి తిరుగు ప్రయాణం కట్టాము. అంతవరకూ,అమ్మా అన్నయ్యలతోడి బంధం.కొత్తగా ఏర్పడిన బంధమే అయినా వీర్రాజు గారిని వదలివెళ్తున్నందుకు కళ్ళనీళ్ళు పర్యంతం అయ్యాను.ఆయనాఅంతే.వివాహబంధం అంతచిత్రమైనదా అనుకున్నాను.

         అప్పటికే పదిరోజులు పైన కాలేజీకి డుమ్మా కొట్టాను కనుక మరి విశ్రాంతి తీసుకుందామని అనుకోకుండా కాలేజీకి వెళ్ళిపోయాను.నా క్లాస్ మేట్స్ అందరూ నన్ను చుట్టేసి పెళ్ళికబుర్లూ, హైదరాబాద్ లో నేను తిరిగిన స్థలాలు గురించి అడిగారు.మా లెక్చరర్లు అందరూ నావివాహవిధానాన్ని ప్రశంసించారు.యువతరం ఈవిధంగా ఆలోచిస్తే వరకట్నం మనసమాజంలో ఇంతసమస్యగా మారేది కాదు అన్నారా.నాకు క్లాసుకు వచ్చే లెక్చరర్లు లో ముగ్గురు అవివాహితలే.

. పదిరోజులుగా జరిగిన పాఠాలనోట్స్ ఉష దగ్గర తీసుకుని కాపీచేసుకున్నాను.

         1971 మార్చి 27న అప్పటి భారతదేశ ప్రధానమంత్రి అయిన ఇందిరా గాంధీ బంగ్లాదేశ్ స్వాతంత్ర్యపోరాటానికి పూర్తి మద్దతు తెలిపి బంగ్లా శరణార్థులకోసం భారత సరిహద్దులను తెరిపించారు. పలురాష్ట్రాల్లోనికి ప్రవేశించిన శరణార్థులకు అవసరమయిన సౌకర్యాలు కలిపించడానికి వేలకోట్ల రూపాయలు ఖర్చు పెట్టసాగింది భారత ప్రభుత్వం.ఒకవైపు యుద్ధపరిస్థితులుతో కొంత ఆర్ధిక సంక్షోభం ఏర్పడింది.అన్నీ ధరలు పెరిగాయి.

      ఆ క్రమంలో తపాలా శాఖ కూడా కవర్ల ధర పెంచేసింది.తపాలాశాఖని పోషిస్తున్నది మేమే కదా అని నవ్వుకున్నాను.

         యథాప్రకారం వారానికి ఒకనాడు శుక్రవారం సాయంత్రానికి హైదరాబాద్ నుండి పావురం ఎగిరివచ్చి తీపి కబుర్లు మోసుకొస్తూనేఉంది.అలాగే విజయనగరం నుండి హైదరాబాద్ కూ ముచ్చట్లు మూటకట్టి తీసుకువెళుతూనే ఉంది.


 


మాతృ దినోత్సవం

       మాతృ దినోత్సవం 


ఈరోజు

 ఎక్కడచూసినా అమ్మలచిత్రాలూ

 కవిత్వంగా మారిన అమ్మలూ

 

అక్షరకథనాల్లోంచి అమ్మలూ

 కాసింత సేపు రంగులపెట్టి ముందుకు చేరాను

 ఒకదాని తర్వాత మరొకటి అమ్మమీద చిత్రాలే

దాని నోరుమూసి కళ్ళుమూసుకున్నాను

ఎక్కడో తరంగాలు తరంగాలుగా 

గాలి లోనుంచి అమ్మ ప్రేమో

అమ్మ మీద ప్రేమో వైనాలువైనాలుగా

రాగం తీగలు సాగుతూ చెవిసోకింది..


సామాజిక మాధ్యమాలన్నీ

అమ్మపాలరుచిని ఆస్వాదిస్తున్నాయ్

సరే నేనూ ఓ ఫోటో పెట్టేద్దాం అనుకున్నా

ప్ఛ్.చిత్రం

ఒక్కటంటే ఒక్క చిత్రం కూడా దొరకలేదు

అమ్మ ఉన్న ఒకట్రెండు ఫొటోల్లో చూద్దామా అంటే

 మా ఇద్దరిమధ్యా మరికొందరు

 ఏంచేయను.

 దిగులుగా ఒకసారి అద్దంలోకి తొంగిచూసాను

 అదే దిగులు ముఖంతో అమ్మ

అంతలో

అమ్మా అని పిలుపు

వెనక్కి తిరిగి చూస్తే నాముఖంతో అమ్మాయి

ఆ వెనుకే అమ్మాయి ముఖంతో పాపాయి.

ఇంకా ఫొటో అక్కర్లేదు

దిగులూ అక్కర్లేదు.

ముగ్గురమ్మలూ ఇంట్లోనే ఉంటే

ఇంకా అమ్మకోసం వెతుకులాట ఎందుకు

మూడువందల అరవై అయిదు రోజులూ

మా ఇంట మాతృదినోత్సవాలే.