నేను అమ్మ పొట్టలో ఉన్నప్పుడు మా ఇంట్లో మా చిన్నాన్న టీబీ జబ్బుతో బాధపడి చనిపోయాడట.మరణించిన సమయం మంచిది కాదని ఇల్లు విడిచి సూర్యారావు మామయ్యా ఇంట్లో ఆరునెలలు ఉన్నారట.అక్కడే నేను పుట్టానని అమ్మ చెప్పేది.తర్వాత మళ్ళీ ఆశపువీథి ఇంటికి వచ్చేసాము. ఆవిధంగానేను మరీ చిన్నగా ఉన్నప్పుడు విజయనగరం లోని ఆశపువీథిలోనే రోణంకి అప్పలస్వామి గారి పొరుగింటి లో ఉండే వాళ్ళము.
నేను రోణంకి గారి గురించి నేను పెద్దగా అయిన తర్వాతే చాలా తెలుసు కున్నాను. ఆయన బహుభాషా వేత్త.ఆరు విదేశీ భాషల్లో సైతం అనువాదాలు చేయడమే కాకుండా కవిత్వం రాసేటంతటి గొప్ప పండితులు.కేంద్ర సాహిత్య అకాడమీ తరుపున మాకియవల్లీ ప్రిన్స్ రాజనీతి గ్రంధాన్ని ఇటాలియన్ భాష నుండి ఆంధ్రీకరించారు.మన ప్రాచీన ప్రబంధాలలో సొంపయిన పద్యాలు ఎన్నిటినో బహురమ్యంగా రోణంకి వారు ఆంగ్లీకరించారు. వీరి ఆంగ్ల రచనలు “SONGS AND LYRICS, INDIAN LOVE POEMS” అనే రెండు సంపుటాలుగా వెలువడ్డాయి. స్థానిక మహారాజా కళాశాలలో ఆంగ్ల ఆచార్యులు గా పని చేసారు. ఆరుద్ర, శ్రీశ్రీ, నారాయణబాబులకు స్పూర్తి ఇచ్చినవారు.
- మానేపల్లి, చిత్రభాను, మోహనప్రసాద్, చాగంటి తులసి – మొ||వారి పుస్తకాలకు ముందుమాటలు రాశారు. ఆరుద్ర తన తొలి కావ్యం -‘త్వమేవాహం’నూ, మానేపల్లి తన తొలి కవితా సంపుటినీ రోణంకి వారికి అంకితం చేసారు.
- రోణంకి వారింటికి ఆనాటి ప్రముఖ కవులూ,రచయితలు అందరి రాకపోకలు ఉండేవట.వారందరూ సాహిత్య చర్చలూ, సాహిత్య గోష్టులూ జరిపేవారని విన్నాను.అల్లసాని పెద్దన, భట్టుమూర్తి,క్షేత్రయ్య మొదలూ శ్రీశ్రీ, నారాయణబాబు కవితల్నే కాక చావలి బంగారమ్మ , చాసో రచనల్ని సైతం ఆంగ్లం లోకి అనువాదం చేసినవి కూడా దేశవిదేశీి పత్రికల్లో ప్రచురితమయ్యాయి.ఇలా ఎన్నో ఆసక్తి కరమైన విషయాలు కర్ణాకర్ణిగా విన్నాను. వారి గురించి చెబుతుంటే అదో పెద్ద వ్యాసం ఔతుంది.
ఆరోజుల్లో పోలియో ప్రభావం ఎంత ఎక్కువ గా ఉండేదో అనేది రోణంకి వారి కుటుంబం చూస్తే తెలుస్తుంది.అప్పలస్వామి గారి చెల్లెలు బాలవితంతువు వీరింట్లోనే ఉండేది ఆమె,అప్పల స్వామి గారి పిల్లలు ముగ్గురు పోలియో బాధితులు.
- నా తోబుట్టువులు అందరకూ కూడా రోణంకి వారింటిలోని సమ వయస్కులైన పిల్లలతో మంచి స్నేహం ఉండేది.వారి ఆఖరు అబ్బాయి నా క్లాసుమేట్ అయిన రోణంకి నారాయణరావు నాకన్న కాస్త చిన్నవాడు కావటం మొగపిల్లాడు కావటం వలన వారి నాలుగో అమ్మాయి, అతని కన్నా పెద్దదైన లలిత తో నాకు స్నేహం .
- లలిత అప్పట్లో డాన్స్ నేర్చుకునేదనుకుంటాను. సాయంత్రం నేను వాళ్ళింటికి లలితతో ఆడుకోవటానికి వెళ్ళినప్పుడు డాబా మీద లలిత డేన్స్ ముద్రలు నేర్పించేది. ఒక్కొక్కరోజు లలితా వాళ్ళ అమ్మా,మేనత్తా నన్ను పాటలు పాడమనేవారు.పెద్దక్కయ్య దగ్గర నేర్చుకున్న పాటలు,ఆ రోజులనాటి సినీమా పాటలూ పాడేదాన్ని.ఒకరోజు అలా పాటలు పాడుతుంటే అప్పుడే వచ్చిన రోణంకి వారు ” ఏం పిల్లా నీకు పుత్తడి బొమ్మా పూర్ణమ్మ పాట వచ్చా?” అన్నారు. నేర్చుకుని ఈ సారి వచ్చినప్పుడు పాడతానన్నాను.ఆ తర్వాత పంతంగా నేర్చుకుని మరీ పాడితే ఆయన మెచ్చుకుంటూ తలపంకించటం మరువలేని జ్ణాపకం.తర్వాత మాత్రం మళ్ళీ ఏం పాడమంటారో అని ఆయనకు కనపడకుండా దాక్కుంటూ డాబా పైకి పరిగెత్తే దాన్ని.
-
రోణంకి అప్పలస్వామి గారు అంత విద్యావంతులు.మేథావి అయినా ఇతరభాష పండితులతో అనర్గళంగా మాట్లాడినా తెలుగు లో మాట్లాడినప్పుడు అచ్చమైన శ్రీకాకుళం పల్లె మాండలికం లోనే మాట్లాడేవారు.అదీ మర్చిపోలేను.వారికి వారి ప్రాంత మాండలికం పైన ఎంత మమకారం ఉందో తలచుకున్నప్పుడల్లా గుర్తు వస్తూనే ఉంటుంది.అందుకే పదవీ విరమణ అనంతరం వారి స్వగ్రామం టెక్కలి వెళ్ళి స్థిరపడ్డారు.
నేటి తరానికి ఆయనెవరో తెలియక పోయినా, ముంజేతిలో చేతికర్ర వేలాడ దీసి, దొర టోపీ పెట్టుకొని తిరిగే రోణంకి అప్పలస్వామి గారు టెక్కలిని అంతర్జాతీయ సాహితీ ప్రపంచానికి పరిచయం చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. అందుకే వారి మరణానంతరం టెక్కలిలో వారి విగ్రహాన్ని కూడా స్థాపించి వారిని గౌరవించుకున్నారు అక్కడి ప్రజలు.
నేను హైస్కూల్లో చదువుతున్న రోజుల్లో ఒక సారి వాళ్ళింటికి వెళ్ళినప్పుడు.అప్పలస్వామి గారి చిన్న తమ్ముడు లక్ష్మణ రావు అనే ఆయన జర్మనీ నుంచి వచ్చాడని లలిత చెప్పింది.లోపలి గదిలోకి వెళ్ళి ఒక షర్ట్ తీసుకొచ్చి ” చిన్నా ( నన్ను చిన్న అని పిలిచేవారు)ఇది చూడు.ఎంత బాగుందో.చిన్నాయన జర్మనీ నుండి తెచ్చాడు .ఈ చొక్కాని ఉతికి ఆరేసేయటమే.నిముషంలో ఆరిపోతుంది.ఇస్త్రీ కూడా అక్కర్లేదు తెలుసా.దీనిని వాష్ ఎండ్ వేర్ అంటారట.”అబ్బురంగా చూపించింది.నేను కళ్ళు పెద్దవి చేసుకుని ఆశ్చర్యంగా చూసాను.ఆ రోజుల్లో చేనేత తప్ప మరొకటి ఎరుగని రోజులు.పేదవారు, మధ్యతరగత వారు చీటీ గుడ్డలు అని ముతకబట్ట తానులుగా వచ్చేది దానినే కొని పిల్లలకు లంగాలు కుట్టించేవారు.నైలాన్ మధ్యతరగతి వారికి తెలియని రోజులవి.
రోణంకివారి భార్య మహాలక్ష్మీ గారూ మా అమ్మ స్నేహితులు.సినీమాలకు కూడా కలిసి వెళ్ళేవారు.వారివెంట నేనూ,లలితబయలు దేరేవారం. మేము వారి పొరుగిల్లు ఖాళీ చేసినా నేను పెద్దయ్యేవరకూ ఆ కుటుంబంతో స్నేహాలు కొనసాగాయి.. వీర్రాజు గారి తో నా వివాహం రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యం లోనే చప్పట్ల తాళాలతో సభావివాహం గా జరిగింది.
- నేను వివాహానంతరం హైదరాబాద్ వచ్చేక ఆ కుటుంబం తో కాంటాక్ట్ ఆగిపోయింది. .రోణంకి నారాయణరావు ఆంధ్రా యూనివర్సిటీ మెడికల్ కాలేజీ లో ప్రొఫెసర్ గా చేసారని విన్నాను.అతని దగ్గరకే డాక్టర్ సలహాకి వెళ్ళే మా పెదనాన్న కొడుకుని మా గురించి క్షేమసమాచారం కనుక్కునే వాడని చెప్పేవారు.నారాయణరావు పెళ్ళి చేసుకోలేదనీ ఇటీవలే చనిపోయాడని తెలిసి చాలా బాధపడ్డాను.
పదేళ్ళ తర్వాత నేను ఎమ్మే తెలుగు చేసినప్పుడు ఫైనల్ పరీక్ష కోసం వెళ్ళినప్పుడు లలిత కూడా పరీక్ష రాయటానికి వచ్చింది.కొత్తగూడెంలో స్కూలు లో టీచర్ గా పని చేస్తున్నట్లు చెప్పింది.అడ్రస్ ఇస్తే ఒకటి రెండు ఉత్తరాలు మా మధ్య నడిచాయి.తర్వాత మెంటల్లీ డిజేబుల్ అయిన మా అబ్బాయి చనిపోవటం .నేను కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళి నన్ను నేను సముదాయించుకునే దిశలో బియ్యీడీ ఎంట్రెన్స్ రాసి మళ్ళా చదువులోపడటం,ఉద్యోగం, సాహిత్యం వీటితో లలితకు దూరమయ్యాను.అంతే మళ్ళీ కలవలేదు.
- విజయనగరం వెళ్ళినప్పుడో, శ్రీకాకుళం జిల్లా కు చెందినవారు కలిసినప్పుడో రోణంకి కుటుంబం వారెవరైనా తెలుసేమోనని అడుగుతుంటాను.
- అంతటి నిరాడంబర మేథావి కుటుంబంతో మాకున్న ఆత్మీయబంధం మరువరానిది.
కానీ ఇది రాసిన అనంతరం అనుకోకుండా అప్పలస్వామి గారి మనవరాలు అంతర్జాలంలో నేను రాసినది చదివి తన గురించి తెలిపింది.వెంటనే ఆమెను సంప్రదించి లలిత చిరునామా తెలుసుకొని ఫోన్ ద్వారా కలిసాను.ఇప్పుడు లలిత,ఆమెకన్నా పెద్దవాళ్ళైన శారదా, కళావతి ని కూడా ముఖాముఖి కలుసుకో లేక పోయినా ఫోను ద్వారా స్నేహం కొనసాగటం సంతోషం కలిగించింది. నన్ను