3, డిసెంబర్ 2013, మంగళవారం

prayaaNam






ప్రయాణం





అంతుచిక్కనిదీ అర్ధం కానిదీ

ఏదో మనసు లో ప్రవేసించింది

కూర్చోనీయదూ నిలబడనీయదూ

నిద్రపోదామంటే రెప్పవాలదు

ఎలా ఐనా అంతుచూడాలనే ప్రయత్నం లో

నాకునేను సమయాన్ని మిగుల్చుకొని

కాలం కాగడాన్ని వెలిగించుకొని

ప్రయాణాన్ని ప్రారంభించాను

ఎక్కడా ఏఅలికిడీ లేదనుకొన్నాను

ఎందుకంటే ధ్యానంలో వున్నాను కదా

కానీ ఎక్కడో ఏమూలో

గందరగోళాలు వినిపిస్తూనే వున్నాయ్



ఇక లాభం లేదనుకొని

నాలోకి నేను ప్రవేసించాను

మౌనగుహల్లోకి తోసుకొంటూ తోసుకొంటూ

ముందుకే సాగుతోన్న నావెనకనే

నిశ్శబ్దపుతలుపుల్ని తడుతోన్నట్లు గా

మెత్తగా మంద్రం గా నా అడుగులసవ్వళ్ళే

కొంత సేపయ్యాక అనుమానం కలిగింది

నేను ప్రవేసిస్తున్నది నాలోకి నేనేనా?

ఏమో!

వెతుకుతున్నది నాలోని తాత్వికతనా?

చింతనకు దూరమౌతోన్న తాత్వికతనా?

ఏ మధనం మనసులోదా ఆలోచనలదా?

నిల్లువెల్లా కవ్వం చిలికినట్లూ కుదుపు



శోధిస్తున్నదాని కోసమైనా

సాధిస్తున్న దానికోసమైనా

నిశ్శబ్దాన్ని పూసుకొని నాచుట్టూ నేనై

పరిభ్రమిస్తున్న బొంగరాన్నై

తిరుగుతూ...... తిరుగుతూ..

నేలపైనే అక్షరాల్ని రాస్తూ.... రాస్తూ...రాస్తూ...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి