17, డిసెంబర్ 2013, మంగళవారం

new




అక్షరప్రవాహం



నాకు వూహతెలిసి

అమ్మానాన్న నాచేత అక్షరాల్ని దిద్దించిన వైనం గుర్తులేదు

పక్షి పిల్లలనోట్లో ఆహారాన్ని కూరినట్లు

నా నోట్లో అక్షరాల్ని మొదట ఎవరు నింపారో నేనెరగను

నాలుగక్షరం ముక్కల్ని నేర్చుకునే రాతుందోలేదోనని

అమ్మ వాపోవటమైతే తెలుసు

నాటి నుండి నెను ఏరుకుంటూనే వున్నాను

ఆ ప్రయత్నం లో

అక్షరమ్ముక్కలు నింపిన నా నాల్గు పట్టాలూ

కడుపాకల్నైతే తీరుస్తున్నాయ్ కానీ

మెదడాకలే తీరటం లేదు

కనిపించిన అక్షరమ్ముక్కనల్లా మింగుతునే వున్నాను

నా కడుపునిందా అక్షరమ్ముక్కలెఏ

నాకు అక్షరాలు కాలక్షేపం బఠాణీలు కావు

తాపీగా తౄప్తిగా మెదడుతో నమిలినమిలి మరీ భోంచేస్తాను

అజీర్తి చేసినటైతే మధ్యలోనే మానేస్తాను

ఒక్కోసారి నేనెరిగిన అక్షరాలే కొత్తతొడుగులు ధరిస్తాయ్

కొత్త అర్ధాలు పూసుకుంటాయ్ మింగుడుపడబోమని బెదిరిస్తాయ్

పట్టుదలే పదునుగాగల మెదడు ఊరుకోదు కదా

మరోసారి మరోసారి ఇంకా.....ఇంకా

నమిలి నమిలి మరీ మింగుతాను

సారాన్ని రక్తంలో కలుపుకుంటాను

మంచి ఆహారాక్షరాన్ని భోంచేసినప్పుడు

శరీరం నిండా అక్షరాలే ప్రవహిస్తాయి

హౄదయం నిండా ఆరోగ్యం స్పందిస్తుంది

మెదడు పొరలు మరింత పదునెక్కుతాయి

కణకణమూ ఆనందంగా సంచరిస్తాయి

అటువంటప్పుడు నేను

నిలువెల్లా అర్ధవంతమైన అక్షరప్రవాహమై

కలం లోంచి జారి పోతాను

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి