26, జూన్ 2025, గురువారం
అసీతినెలబాలుడు విహారి
అశీతి నెలబాలుడు-విహారి
ఒక సాహితీవేత్త జీవితాన్నీ, సాహిత్యాన్నీ పరామర్శించాలంటే వారి సమగ్ర సృజన అధ్యయనం చేయాలి. కానీ విహారి అనే పేరుతో సాహిత్య రంగంలో నమోదు అయిన జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తిగారు చేసిన కృషి అనన్య సామాన్యం, 1962లో 'చుక్కాని' పత్రికలో ప్రచురితమైన 'రాగజ్యోతి' కథతో మొదలుపెట్టి పద్నాలుగు కథా సంపుటాలు వెలువరించారు. ఆరు నవలలు సాహిత్య రంగానికి అందించారు. ప్రముఖుల సాహిత్యం గురించే కాక యువతరం వారిని కూడా వెన్నుతట్టి ప్రోత్సాహం ఇస్తూ సాహిత్య పరామర్శ చేయటం గుర్తించదగినది. గురజాడ మొదలుకొని నేటితరం కథకుల వరకు కుల, మత, ప్రాంత భేదం లేకుండా అన్ని సాహిత్య వాదాలనూ, ఆయా కథకుల కథలన్నింటినీ చదివి సమగ్రమైన వ్యాసాలు రాశారు. నొప్పింపక తానొవ్వక అన్నట్లుగా కథకుని కథలలోని వస్తు రూపాల్ని శైలి శిల్పాలనూ, భాషా విషైక విశేషాలను విశ్లేషిస్తూ సుమారు 300 మంది కథకులపై రాసిన ఈ విశేషవ్యాసాల్ని పదిహేను సంపుటాలుగా ప్రచురించారు. ఇవి ఒక వ్యక్తి చేయలేని ఈ సంపుటాలు విశ్వవిద్యాలయాలలో పరిశోధకులకు ఉపయుక్తంగా ఉన్నాయి.
2013లో 'ఆనాటి కథలు- ఆణిముత్యాలు' శీర్షికతో అపురూపమైన శ్రీపాద, వట్టికోట ఆళ్వారుస్వామి, చలం, కనపర్తి వరలక్ష్మమ్మ మొదలైన ప్రముఖుల ఆణిముత్యం వంటి కథలను వారి గుణ విశేషములను కొత్తతరం: రచయితలకు ఉపయోగపడేలా పరిచయం చేశారు.
సుమారు అరవై ఏళ్లుగా చేస్తున్న సాహిత్య వ్యవసాయంలో 300కు పైగా రాసిన కథలన్నీ కూడా సమాజాన్ని పరిశీలించినవే. చదువు విలువని తెలియజెప్పి 'అక్షరం', రాజకీయ మోహంతో పట్టని వ్యక్తుల కథ 'అమ్మ వెనక చీకటి', 'ఆ తల్లికేం కావాలి' వంటి తల్లి వేదననీ, వాత్సల్యాన్ని, వృద్ధాప్యాన్ని సమస్యల్ని తెరిచి చూపే కథలు, డబ్బు వెనక పరుగులు తీసే పిల్లలు, కథలన్నింటా జీవితాన్ని ప్రవహింప చేసేలా సున్నితమైన భావ ప్రకటన వీరి సొంతం. సరళ సంభాషణలు మానవీయ విలువలు, కుటుంబ, ఆర్ధిక సంబంధాలు ఇలా అపారమైన కథా వాహినిలోని కథల గురించి చెప్పుకుంటే ఒక పుస్తకాన్నే రాయొచ్చు. ఇప్పటికీ కూడా కొత్తవారితో సమానంగా విహారి గారి కలం తాజాగా పోటీలలో కూడా కథలను రాస్తుందంటే విహారి గారి సృజన ఎంత నవనవోష్మంగా ఉందో అర్థమవుతుంది.
మరో ముఖ్య విషయమేమంటే, చాలామంది కథకులలాగా విహారిగారు తన కథలలో సమాజంలోని అవకతవకలపై కత్తి ఝుళిపించరు. చాలా సహనంతో ఒక్కొక్క పొరనే విప్పుతూ సమాజాన్ని చూపుతారు. సమాజంలోని వ్యక్తుల బాధ్యతల్ని ఎత్తి చూపి గుర్తు చేస్తారు. చెప్పదలచుకున్న సిద్ధాంతాల్ని సహృదయంతో పాఠకులు స్వీకరించే పంధాలో ఒప్పిస్తూ కథనీకరించడం వీరి రచనా విధానం, విహారి గారు చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు ఆఖరికి 6500 పద్యాలతో 'శ్రీ పదచిత్ర రామాయణం' రచించి బృహత్ గ్రంథ రూపంలోకి తీసుకువచ్చారు.
విహారి గారి అపార సాహితీ సంపదని విశ్లేషించటం అసాధ్యం, అందువలన నేను కవిత్వానికే పరిమితమై నాకు అత్యంత ప్రీతిపాత్రమైన దీర్ఘ కవిత 'చేవ్రాలు' గూర్చి పరామర్శించే దలిచారు.
విహారి గారు ఇప్పటికీ వెలువరించిన చలనమ్ కలం కన్ను, మనం మనం.. 'మధ్య మా గతి' అనే సంపుటాలు కాక 'చీకటి నాణెం' అనే దీర్ఘ కవిత అంతకుముందు వెలువరించిన కవిత్వ గ్రంథాలు ఇటీవల వెలువరించిన దీర్ఘకవిత చేవ్రాలు, దీనికి టాగ్ లైన్ గా 'వ్యక్తిత్వం' -"వికసనం' అని పేరు పెట్టటంలోనే ఒక ప్రత్యేకత చూపారు.
''గుండె గొంతులోన కొట్లాడినట్లు విహారి గారిని ఒక చోట నిలకడగా కూర్చోనీయకుండా పదేళ్ల మధనంగా బయటపడింది ఈ చేవ్రాలు దీర్ఘకవిత. ఇందులో ప్రవేశిక, ప్రారంభిక, లోనారసి,ఋణరేఖ,వికసనం అని అయిదు అధ్యాయాలుగా విభజించినా, అతిపెద్ద అధ్యాయంగా, ముఖ్యమైనదిగా మూడవది ఉన్నా ఇంకా పాఠకులకు మరింత హృదయంగమంగా ఉండటానికి కావచ్చు.. లేదా పాఠకులు రచనలోకి మమేకం కావాలనే ఉద్దేశ్యం కావచ్చు.. కవి మధ్య మధ్య హెడ్డింగులు పెట్టి సులభ గ్రాహ్యం చేసేరు.
ఒక వ్యక్తి మానసిక వికననం అతడు పెరిగిన వాతావరణంపైనా, ప్రభావితం చేసే మిత్రుల పైనా,చదువు నేర్పిన గురువుల పైనా, చదివిన చదువులపైనా ఆధారపడి ఉంటుంది. ఆ మానవ వికసన సమగ్ర పరిణామ రూపాన్ని 'చేవ్రాలు'లో అక్షరీకరించాడు విహారి గారు.
మొదటి అధ్యాయంలో కవితని ఎత్తుకోవటమే. జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నది' అని మొదలు పెట్టడంతో సమాజంలోని వివిధ కోణాలను చూపించారు. బతుకును ముంజేతి కంకణంగా అభివర్ణిస్తూనే-'ఎవరి బతుకు వారికి/వారే కుట్టించుకున్న వలువ/ఎవరి వేలిముద్ర వారివే' అంటారు. ఎందుకంటే ఒకరి జీవితం మరొకరి చేతిలో ఆటబొమ్మ కాదు అని నిర్ధారిస్తూనే 'ఒకరి జీవితం వేరొకరి చేతిలో తెల్ల కాగితం అంటారు. తెల్ల కాగితం మీద ఎవరికి వారు రాసుకోవాలి కానీ మరొకరి ఆధీనంలో ఉంటే జీవితం ఎట్లా పరిణమిస్తుందో ఊహించుకోవాలనే అభిప్రాయాన్ని కవి ప్రకటిస్తారు..
రెండో ఆధ్యాయం ప్రారంభికలో శిరశోదయమై మాయని ఛేదించుకొని వచ్చిన శిశువుల బుడి బుడి అడుగులు వేయటం, తల్లి గోరు ముద్దలు, చదువుల పరుగుపందేలు,వచ్చీరాని కౌమార ప్రాయంలో వారిపై ప్రభావం చూపించే మాయాజాలాల కారణంగా- మెదడు పంజరంలో కోర్కెల చిలుకలు గుప్త విజ్ఞానంపై మోహం గురించి కవిత్వీకరిస్తూనే 'నడక కాదిది పోరాట జారుడుమెట్లపై ఆట' అంటూ సందిగ్ధప్రాయవు చంచల స్వభావాన్ని అక్షరాలతో గుది గుచ్చారు.
ఇక ముఖ్యమైన పెద్ద అధ్యాయం 'లోనారసి' లో దాని కొనసాగింపు గానే 'గుండె మట్టిని కుల్లగించే/ కోరికల వానపాములు 'గురించి జాగరూకత చెప్తాడు కవి. ఆలోచనాశూన్యులకు ప్రతి అంశాన్ని భూతద్దంలో చూపి భయభ్రాంతులకు లోనుచేసి మానసిక రోగులుగా మార్చే వైనాన్ని విశదీకరిస్తారు కవి. ఆత్మ న్యూనతకి చోటిస్తే గుండె సాగదీయక తప్పని కమ్మెచ్చుతీగ 'అవుతుందంటారు. నడిగ్గా అటువంటప్పుడే-' నిత్యానిత్య వివేకం -వ్యక్తిత్వం'-ని నిలబెడుతుందని ముక్తాయింపునిస్తారు.
'క్రియా శూన్యత గట్టు మీది పిచ్చిమొక్క వరి చేలో కలుపు మొక్క/ అచంచల విశ్వాసం/అదే దారి దీపం' అదే చేతి కర్ర' అంటూ మన భావోద్వేగాలకు మనమే బాధ్యులం అనేది ఉపదేశిస్తారు. కలలు కన వద్దంటారు. ఎందుకంటే అనుకున్నది జరగకపోతే వచ్చే అనర్థాలు తెలియజేస్తారు.
''డాలర్ల రోగగ్రస్తుడికి చికిత్స లేదని ఖచ్చితంగా ప్రకటిస్తారు. ఏ విషయానికి నా వల్ల కాదని వదిలేయొద్దంటారు. అవినీతి మేత, క్షణికోద్రేకం, ఆహం వీటన్నిటి వలన జరిగే కష్టనష్టాలను పంక్తులు పంక్తులుగా బోధిస్తూ మానసిక వికశనం కావాలంటే సందేహం, పరిశీలన, సమాచారం, విశ్లేషణ మనిషికి అత్యవసరం అంటారు కవి విహారి.
నాలుగవ అధ్యాయం నుంచి యవ్వనానికి 'ఋజు రేఖలు లక్ష్య నిర్దేశానికి గమ్యం నీది -నడక నీది- మిట్ట పల్లాలని సహనమే ఏకైక దీవంగా గమనిస్తూ ముందుకు నడవమంటారు. ఈ అధ్యాయం అంతా ఎన్నైన్నో సామెతల్ని కవితాత్మకంగా ఉటంకించుతూ సుబోధకంగా ఆసాంతం సాగుతుంది.
'స్వీయావిష్కరణం/ వేకువ రేకుల స్పాటిక సాధనం!! /గతం గాయాలు సలుపుతాయి/ రాతి మీద ఉలి దెబ్బలు అవి/ అవి నిట్టాడి గూడులు కాకూడదు/రూపాంతరం చెందిన కర్తవ్యాన్నివ్వాలి'- అని ధైర్యాన్ని, అత్మవిశ్వాసాన్ని పురిగొల్పుతాడు కవి.' క్రమశిక్షణ అంటే/ కఠినత్వమూ కాదు, నిరంకుశత్వమూ కాదు అదొక జీవన విధానం' గా చెప్పటమే కాక నిబద్ధత బద్ధకానికి శత్రువుగా చూపుతారు. కార్యదక్షత కట్టుబడి- పెట్టుబడిగా అభివర్ణించుతారు.'నీ బొమ్మని నీవే చిత్రించుకోగలగాలి' అనటంలో ఎవరి వ్యక్తిత్వాన్ని వారి నిర్మించుకోవాలనే సందేశం ఇస్తారు.
'సృజనకు ఆధార భూమికలు-మేధ విలువలు' అని నిర్ధారిస్తూనే నైతికత అంతస్సూత్రం ఎప్పుడూ తెగిపోకుండా కాపాడుకోవలసిన బాధ్యత వ్యక్తిదే అనేది నర్మగర్భంగా తెలియజేస్తారు కవివిహారి.
"మానవ సంబంధాలంటే/మనం మనంగా వుండటం/మానవసంబంధాలంటే / సమాజ సమన్వయ శక్తి!! 'వ్యక్తి''త్వం' వికసనం అంటే ఎత్తుపల్లాలను చూసి ఆ ప్రక్రియ అదే వ్యక్తి నిర్మాణం' అంటారు కవి
అయిదవ అధ్యాయం వికసనం అంటే విశ్వ దీర్ఘ కవితారాగానికి శృతి కూర్చటం అంటూ ముక్తాయింపుగా ఒక వ్యక్తి సంపూర్ణ మానవుడిగా రూపొందటానికి అలవర్చుకోవాల్సిన, జీవితాంతం పాటించవలసిన నిర్మాణ ప్రక్రియల రూపకల్పనలని ముగిస్తారు.
నేటి యువతరానికి వ్యక్తిత్వ వికాసచిత్రాలను దీర్ఘ కవితారూపంలో లక్ష్యాన్ని నిర్దేశిస్తూ, లక్ష్యాన్ని దినచర్యలో భాగంగా చేసుకొని సమయ నిర్దేశాన్ని చుక్కానిగా చేసుకొని ప్రయాణిస్తే రూపెత్తిన మనిషిగా మారగలడనే ఆశయంతో తన చేవ్రాలు' లు వ్యక్తిత్వ వికాస గ్రంథంగా తీర్చారు విహారి గారు.
కేవలం మాటల మనిషిగా, రాతల మనిషిగా కాక తాను ఆచరించి చూపే స్నేహశీలి, సౌజన్య మూర్తి, నిర్విరామ, నిరంతర సృజనశీలి అయిన 'విహారి గారికి ఎనిమిది పదులు దాటిన వయసులోనూ వారి కలం ఇంకా పదునెక్కాలని అభిలషిస్తూ వారికి సహస్రాధిక జన్మదిన శుభాకాంక్షలు
(అక్టోబర్ 15-విహారి గారి 81వ జన్మదినం సందర్భంగా సృజన క్రాంతి ఈ ప్రత్యేక వ్యాసం)
నడక దారిలో -53
నడక దారిలో -53
మా ఇంటికి దగ్గరలోనే ఆస్మాన్ ఘడ్ మీద సాయికృప అపార్ట్ మెంట్స్ లో కొంతకాలంగా కె.రామలక్ష్మిగారూ,వారి అక్క వుంటున్నారని తెలిసింది.వారి క్రింద అపార్ట్మెంట్ లోనే వారి అక్క కూతురు నివాసం వుంటుంది.అందుకని ఆరుద్ర మరణానంతరం మద్రాసు నుంచి వచ్చేసారు.వాసా ప్రభావతి గారితో మొదటి సారి వెళ్ళాను.ఆతర్వాత తరుచూ వెళ్ళేదాన్ని.రామలక్ష్మి గారితో కబుర్లకు కూచుంటే సమయం తెలియదు.ఒక ప్రవాహంలా అనర్గళంగా ఎప్పడెప్పటి అనుభవాలనో చెప్పుకొంటూ పోతారు.మొదట్లో మాట్లాడుతోన్నప్పుడు 'అలా అనేవారు మీ నాన్న' అని చెప్తుంటే అర్థం అయ్యేది కాదు తర్వాత ఆరుద్ర గారని తెలిసింది.చాలా సన్నిహితంగా నాతో మాట్లాడేవారు.నడవటానికి కాళ్ళు సహకరించక పోయినా వుప్పొంగే వుత్సాహంతో వుండటాన ఆమెతో మాట్లాడుతుంటే మనకీ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయనిపించేది.
ఒక సారి వాళ్ళింటికి ఒక పదిహేను మంది రచయిత్రులను ఆహ్వానించి రామలక్ష్మి గారు ఆరుద్ర పుస్తకాన్ని ఆవిష్కరణ చేసారు. వరూధినిగారూ,శాంతసుందరీ,గోవిందరాజుల సీతాదేవి, శారదా అశోక్ వర్థన్,హేమలతా భీమన్న,ముక్తేవిభారతి, కొండవీటి సత్యవతి,కె.బి.లక్ష్మి,పోలాప్రగడ రాజ్యలక్ష్మి మొదలైన వాళ్ళం హాజరయ్యాము.కొంతసేపు ఆరుద్ర లలితా గీతాలు, సినీగీతాలు ఆలపించాము.పుస్తకం ఆవిష్కరించి ఫొటొలు తీసుకొని తర్వాత రామలక్ష్మిగారి మాటలవిందుతో పాటూ వాళ్ళ అక్క కూతురు ఏర్పాటు చేసిన విందు కూడా ఆస్వాదించాము.
రామలక్ష్మి గారి ఇంటి కింద అపార్ట్మెంట్ లో అబాకస్ నేర్పించే టీచర్ వున్నారు.ఆమె దగ్గర ఆషీని అబాకస్ నేర్చుకోవటానికి చేర్చాను.రోజూ ఆషీని తీసుకు వెళ్ళి వాళ్ళింట్లో దిగబెట్టి ఆ క్లాస్ అయ్యేవరకూ నేను ఒక్కొక్కప్పుడు రామలక్ష్మి గారింట్లో కూర్చొని కబుర్లు చెప్పేదాన్ని.ఆషీకి అబాకస్ చాలా నచ్చింది.ఉత్సాహంగా నేర్చుకునేది.
ఆ సందర్భంలో రామలక్ష్మి గారితో నేను తరుచూ కలిసేదాన్ని. అబాకస్ క్లాసు అయ్యేవరకూ రామలక్ష్మిగారి దగ్గరకి వెళ్ళటంతో, ఎన్నెన్ని కబుర్లో చెప్పేవారు. ఒక గంట ఎంత తొందరగా గడచిపోయేదో! ఆమె అనర్గళంగా ఎన్నో విషయాలు చెప్తుంటే సమయం తెలిసేది కాదు.
ఆమె నాకు ఎంతో ఇష్టమైన కవి శ్రీశ్రీ గురించి తాగుబోతుగా చెప్తుంటే బాధకలిగించింది కాని నిజాల్ని ఒప్పుకోవాలి కదా!
ఒకసారి రామలక్ష్మిగారికి పొట్ట ఆపరేషన్ అయ్యిందట. ఆపరేషన్ చేసిన తర్వాత ఆ డాక్టర్ " మీ పొట్టనిండా అక్షరాలే ఉన్నాయని ఆరుద్ర గారు అన్నారు. ఒక్క అక్షరం ముక్కా లేదు మీ పొట్టలో రామలక్ష్మిగారూ'అన్నాడు" అని చెప్తూ నవ్వారు. అదివిన్నాక ఎప్పుడు తలచుకున్నా నవ్వొస్తూ ఉంటుంది
ఆమెకు పత్రికా రంగంలోనూ, సినిమారంగంలో ను, సామాజిక సేవారంగంలోను, సాహిత్య రంగంలోనూ, రాజకీయరంగంలోను ఇలా అనేక అనుభవాలు ఉండటంవలన వాటిల్లోని లొసుగుల్ని విమర్శనాత్మకంగా చెప్పేవారు. ఎదురుగా ఉన్నవారికి కొన్ని విషయాలు నచ్చినా నచ్చకపోయినా ఆమె తన మనసులో మాటను, తన అభిప్రాయాన్ని చెప్పటానికి జంకరు. తనని తానే అందరూ గయ్యాళి నని అంటారని కూడా నవ్వుతూ చెప్పుకుంటారు. నిర్భయంగా ఉన్నది ఉన్నట్లు నిష్కర్షగా చెప్పకమానరు. అందుచేత కొంతమంది ఆమెకు దూరమయ్యారు. నిజానికి వారు రచనలు చేసే ఆకాలంలో ఆయారంగాలలో పురుషాధిక్యత మరింత ఎక్కువ . వాటిని తట్టుకొని నిలదొక్కుకోవాలంటే ధిక్కార స్వరం ఉండక తప్పదేమో.
ప్రతీ ఒక్కరి గురించి అందులోనూ సినీ, సాహిత్య రంగంలో లోని వారి మంచికన్నా వాళ్ళ ప్రవర్తనలోని దుర్గుణాలను వాళ్ళరెండుముఖాలను వేరు చేసి నిర్భయంగా చూపించేవారు. ఆవిడ నెగెటివ్ గానే మాట్లాడుతున్నట్లు అనిపించినా ఆవిడ లోని పాజిటివ్ నెస్ మనం స్పష్టంగా గుర్తించగలం, కదలడానికి కాళ్ళు సహకరించకపోవటంవలన చాలా కాలంగా వీల్ చైర్ కే పరిమితం అయినా అన్నింటికీ ఒకరిపై ఆధారపడాల్సి వచ్చినా సాహిత్యం, సినీరంగం పత్రికలూ వీటి గురించి తప్ప తన శారీరక అసహాయత్వం గురించి గానీ, అనారోగ్యాల గురించి గానీ ఒక్కసారి తలంచరు. ఆ వయసులో కూడా హాస్యంగా, చమత్కారాలతో సానుకూల
దృక్పథంలో మాట్లాడటం వలన ఆమెతో మాట్లాడుతున్నంతసేపూ హాయిగా ఆహ్లాదంగా ఉంటుంది అనేది మాత్రం ఖచ్చితంగా నిజం.
మొత్తంమీద ఆషీ అబాకస్ క్లాసులు రామలక్ష్మి గారితో సాన్నిహిత్యాన్ని పెంచాయి.
ఎందువలనో గుర్తులేదు.కానీ మలకపేట దిల్షుక్ నగర్ ప్రాంతం అంతా కొన్నాళ్ళు కర్ఫ్యూ పెట్టిన తర్వాత సడలింపు ఇచ్చి రాత్రి ఎనిమిది నుండి రాత్రి కర్ఫ్యూ వుంచారు.
ఆరోజు పల్లవి మధ్యాహ్నం కాలేజీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది.సాయంత్రం ఎప్పటిలాగే ఆషీని అబాకస్ క్లాసులో దించి ఏడుగంటలకు వస్తానని ఇంటికి వచ్చేసాను.ఏడుగంటలకు ఇంటినుండి బయలుదేరి వెళ్తుంటే స్ట్రీట్ లైట్లు ఆరిపోయాయి.నేను ఆ చీకట్లో చిన్న స్పీడ్ బ్రేకర్ని చూసుకోక తట్టుకుని పడిపోయాను.కుడిచేతిమీద ఆపుకోవాలనుకోవటంలో చెయ్యి మణికట్టు దగ్గర విరిగింది.బేగ్ లోని ఫోన్ తీసి చెయ్యాలన్నా వీలుకాలేదు.ఎడమచేతితో కుడిచేతికి సపోర్ట్ ఇచ్చి బాధ అణచుకొని ఆషీ దగ్గరకు వెళ్ళాను.
ఆషీకి ఫోన్ ఇచ్చి మా వారికి రింగ్ చేయమని విషయం చెప్పి మా రెగ్యులర్ ఆటో సలీమ్ కి హాస్పిటల్ కి వెళ్ళటానికి ఫోన్ చేయమన్నాను.పల్లవికీ ఫోన్ చేయించాను.
ఆషీ సాయంతో ఇంటికి వెళ్ళి సలీమ్ ఆటోలో మలక్ పేటలోని సుస్రుతా నర్సింగ్ హోం కు వెళ్ళాము.ఈలోగా పల్లవి డైరెక్ట్ గా అక్కడికే వచ్చింది.
కర్ఫ్యూ అని డాక్టర్ వెళ్ళిపోయాడట.ఒకనర్సు,మరొకరిద్దరు అటెండర్లు వున్నారు.అక్కడ రాత్రికి జాయినైపోమనీ,ఉదయం డాక్టరు వచ్చాక చూస్తారని అన్నారు.నాకునొప్పి అంతకంతకూ పెరిగిపోతోంది.
ఈ లోగా ఫోన్ అందుకుని కారు తీసుకుని పొనుగోటి కృష్ణారెడ్డి వచ్చి దిల్షుక్ నగర్ లోని ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరకు వెళ్దామన్నారు.పల్లవినీ ఆషీని ఇంటికి సలీమ్ ఆటోలో వెళ్ళిపోమన్నాము.
ఆర్థోపెడిక్ డాక్టర్ ఎక్స్ రే తీయించాక, మర్నాడు ఆపరేషన్ చేసి వైర్ వేస్తాము.హైబీపీ వుంది కనుక ఇసీజీ తీయించి రిపోర్ట్ తీసుకు రమ్మన్నారు. వెంటనే నొప్పి తగ్గటానికి ఇంజెక్షన్ ఇచ్చారు.అప్పటికే పది దాటింది.కర్ఫ్యూ వలన అంతటా నిర్మానుష్యం.ఏ హాస్పిటల్ లోనూ డాక్టర్లు లేరు.కారులో అలా వెతుక్కుంటూ కనిపించిన ప్రతీ హాస్పిటల్ మెట్టు ఎక్కాము.ఆఖరికి ఒక దగ్గర ఇసీజి చేయించుకోవడానికి కుదిరింది.రిపోర్టు తీసుకుని మళ్ళీ ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తే సన్నని వెదురు బద్దలతో తాత్కాలికంగా కట్టు కట్టేరు.అంతవరకూ వేలాడిపోతోన్న కుడి చేతిని ఎడమ చేత్తో పట్టుకునే వున్నాను.ఇవన్ని అయ్యి ఇంటికి వెళ్ళేసరికి సుమారు పన్నెండు అయ్యింది.కాస్త పెరుగన్నం తిని టాబ్లెట్ వేసుకుని పడుకున్నాను.
" పడిపోయానని ఫోన్ చేస్తే తరుచూ కళ్ళు తిరిగి పడిపోతావు కదా అలాగే అనుకున్నాను.ఇంత దెబ్బ తగిలిందను కోలేదు."అన్నారు బిత్తరపోతూ వీర్రాజుగారు.
మర్నాడు ఉదయమే హాస్పిటల్ కి పల్లవి నేనూ వెళ్ళాము.వీర్రాజుగారు ఆషీని చూసుకోడానికి ఆగిపోయారు.అంతేకాక ఆయనకి హాస్పిటల్ వాతావరణంలో బీపీ పెరిగిపోతుంది.అందుకే ఇంట్లోనే వుండమన్నాం.చేతికి రాడ్ వేసి సమ్మెంటుకట్టు కట్టి ఆరు వారాల తర్వాత రమ్మన్నారు.
పల్లవి రెండు వారాలు సెలవు పెట్టింది.ఆ తర్వాత కూరా పప్పు చేసేస్తే వీర్రాజు గారు కుక్కర్ పెట్టేవారు.నేను మామూలుగా రాసుకోవటం చెయగలనా అని నాకు కొంచెం దిగులు మొదలైంది.పల్లవి కోప్పడుతున్నా ఎడమ చేత్తోటే కొంచెం పనులు సాయం చేయటానికి ప్రయత్నించే దాన్ని. ఎడమ చేత్తో రాయటానికి చూసేదాన్ని.ఆ ప్రయత్నంలోనే ఒక కవిత కూడా రాసాను.
ఆరు వారాల తర్వాత సిమ్మెంటు కట్టు తీసేసినా క్లాత్ తో కట్టు కట్టుకోమని డాక్టర్ చెప్పి గోరు వెచ్చని వేడినీళ్లలో చేతిని పెట్టి వేళ్ళు కదుపుతూ ఎక్సర్సైజులు చేయమన్నారు డాక్టర్.నాకు కుడిచేయి ముఖ్యమైనది కదా చాలా శ్రద్ధగా చేసి తొందరగా నొప్పి తగ్గించుకున్నాను.కానీ ఆ చేత్తో కొద్ది బరువు పట్టుకున్నా నొప్పి పెట్టేది.
2009 అసెంబ్లీ ఎన్నికలు మొదలయ్యాయి.వై ఏస్సార్ కాంగ్రెస్ పార్టీని విజయవంతంగా ముందుకు నడిపించి , అసెంబ్లీలో కాంగ్రెసు 156 సీట్లు గెలుచుకునేలా చేసాడు. వై ఎస్.ఆర్ ముఖ్యమంత్రి గా 20 మే 2009న రెండవసారి ఆంధ్రప్రదేశ్ 15వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.ఈ సారి కూడా టీడీపీ ప్రధాన ప్రతిపక్షంగా మారింది.విద్యార్థులకు రీయింబర్స్మెంట్ ఇవ్వటంతో ఇబ్బడిముబ్బడిగా వెలిసిన ఇంజనీరింగ్ కాలేజీలు కాంగ్రెస్ కు ప్లస్ పాయింట్ అవుతుంది.గ్రామీణ పిల్లలు,బడుగు వర్గాల పిల్లలు వీటివలన వున్నత విద్యకు చేరువయ్యారు.
ఉద్యోగం చేసినంతకాలమే కాక తర్వాత కూడా మా స్కూల్ విద్యార్థులకు మొదటి రేంక్ వచ్చినవారికి ఆగష్టులో నగదు
బహుమతులు ఇవ్వటం నిలిపివేయలేదు.కవర్లలో డబ్బుపెట్టి కొన్ని ఏళ్ళ పాటు అందజేస్తూనే వున్నాను.కానీ ఆ డబ్బు సక్రమంగా నేను కోరిన విధంగా వుపయోగించటం లేదని తెలిసింది.దాంతో నేను రిటైర్ అయిన నాలుగేళ్ళ తర్వాత ఇవ్వటం మానేసాను.
నా రెండో దీర్ఘ కవిత బతుకు పాటలో అస్తిత్వ రాగం" పూర్తి చేసాను. జీవితంలోని వివిధ దశలైన శైశవం,బాల్యం,కౌమారం, యవ్వనం , ప్రౌడత్వం, వృద్ధాప్యం, ముగింపు తో ఏడు చాప్టర్ లుగా విభజించి స్త్రీ జీవితాన్ని సంపూర్ణంగా కవిత్వంలో అక్షరీకరించాను. తొలిసారిగా పల్లవి డిజిటల్ పద్ధతిలో తయారు చేసిన ముఖచిత్రంతో
ఈ పుస్తకం వెలుగులోకి వచ్చింది.
ఈ పుస్తకం ప్రింటింగ్ సమయంలో వీర్రాజు గారికి ఒక ఆలోచన వచ్చింది."ఈ ఏడాది డిసెంబర్ లో నీ అరవై ఏళ్ళు పుట్టినరోజు వస్తుంది కదా అసందర్భంగా ఇప్పటికి వచ్చిన నీ ఎనిమిది కవిత్వం పుస్తకాలూ కలిపి సమగ్ర సంపుటి గా ప్రచురించుతే బాగుంటుంది " అన్నారు.ఖర్చు ఎక్కువే అవుతుందని నేను ఆలోచించాను.
కానీ వీర్రాజు గారు "ఇంతవరకూ ఇలా ఎవరూ సమగ్ర సంపుటాలుగా వేసుకోలేదు.అందులోనూ ఇంత కవిత్వం రాసిన కవయిత్రులూ తక్కువే.వేస్తేనే బాగుంటుంది." అని గట్టిగా నిర్ణయించుకోవడమే కాకుండా నాళేశ్వరం శంకరంగారితో కూడా ప్రస్తావించారు.శంకరంగారు కూడా మంచి ఆలోచన అని ప్రశంసించి ప్రత్యేక సందర్భంగా ఎవరి చేతనైనా ముందుమాట కూడా రాయించండి అన్నారు.
1980 లో వచ్చిన తొలి కవితా సంపుటికి శివారెడ్డిగారితో ముందుమాట రాయించాను.తర్వాత ఏ సంపుటికీ ఎవరిచేతా రాయించ లేదు.శంకరంగారి సూచన అనుసరించి ఎవరిచేత రాయించుదామా అని ఆలోచించి కాత్యాయనీ విద్మహే ఎగిరేగారితో రాయిస్తే బాగుంటుంది అని నిర్ణయించుకున్నాము.
కాత్యాయనీ విద్మహేగారికి ఫోన్ చేసి విషయం చెప్పాము.ఇంకా అయిదారు నెలలు పైనే వుంది కనుక సమయం తీసుకోమని చెప్పాను.ఆమె సంతోషంగా అంగీకరించారు.నా విడివిడి సంపుటాలన్నీ ఆమెకు పంపించాము.
డిటీపీ చేయించటానికి కూడా ఇచ్చాము.పుస్తకం 500 పేజీలు కన్నా ఎక్కువే వచ్చేలా వుంది.
దేశమంతా వినాయక చవితి సంబరాల్లో మునిగింది.ఎప్పుడూ కోలాహాలంగా వైభవంగా జరిగే వినాయక నిమజ్జనోత్సవాలు చాలా గంభీరంగా,భయంభయంగా జరిగాయి.ఆ తర్వాత
చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరగా ఉదయం గం.9.35 నిమిషాలకు హెలికాప్టరుతో సంబంధాలు తెగిపోయాయనే వార్తలు నాలుగురోజులుగా వస్తున్నాయి.ఒకరెండుమూడు రోజుల పాటూ ఆచూకి తెలియలేదు. ముఖ్యమంత్రి ఆచూకీ కోసం గాలించగా 25 గంటల తరువాత సెప్టెంబర్ 2 వ తేదీ 2009 రోజునాటికి ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఆనవాళ్ళు లభించాయి. వై.ఎస్.తో సహా మొత్తం ఐదుగురు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారని నిర్థారించారు.
ఉగ్రదాడేమోనని ఒక్కసారిగా రాష్ట్రమే కాకుండా దేశమంతా వులికిపడింది.కానీ చాలాకాలం అన్ని కోణాల నుండి శోధించి హెలికాప్టర్ లోని యాంత్రిక లోపంగా ప్రకటించారు.రోశయ్యగారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అధిష్టానం ప్రకటించింది.
కాంగ్రెస్ లో జరిగిన అనూహ్య పరిణామాలు తెరాసా నాయకులకు కలిసి వచ్చింది.అప్పటికే చాలా కాలంగా ఏకీకృతం అవుతున్న వారికి బలం పుంజుకోవడానికి ఇది ఒక అవకాశంగా మారింది.
తెరాసా అక్టోబరు 21న సిద్ధిపేటలో ఉద్యోగ గర్జన పేరుతో భారీ సభ నిర్వహించారు.ఉద్యోగులు , విద్యార్థులు,ప్రజలు ఏకమయ్యారు.జయశంకర్, హరగోపాల్, కోదండరాం, చుక్కా రామయ్య, విద్యాసాగరరావు వంటి మేధావులు సంఘటితం కావటం ఉద్యమం వూపు అందుకుంది.
2009 నవంబర్ 29న సిద్ధిపేట కేంద్రంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. ఇది తెలంగాణ ఉద్యమానికి కీలక మలుపై తెలంగాణను నిప్పుల కొలిమిగా మార్చింది.
విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్లపైకి రావటంతో తెలంగాణ వచ్చే వరకూ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉద్యమానికి కేంద్రబిందువు అయ్యింది . ప్రభుత్వం కేసీఆర్‌ను దీక్ష చేయకుండా ప్రభుత్వం అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించింది ఆయన జైల్లోనే దీక్ష కొనసాగించారు. తరవాత నిమ్స్ కి తరలించినా దీక్ష కొనసాగింది.
''తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ చచ్చుడో'' అనే నినాదం ఇచ్చారు కేసీఆర్. తెలంగాణా అంతటా భగ్గుమనడంతో కేంద్రపీఠం కదిలింది.
చిదంబరం తెలంగాణ ప్రకటన
డిసెంబరు 9వ తేదీన కేంద్రం తెలంగాణాకు అనుకూలంగా హోం శాఖ మంత్రి చిదంబరం ప్రకటన చేశారు. ఈ ప్రకటన తరువాత సంబరాలు జరిగాయి. కేసీఆర్ దీక్ష విరమించారు.
నా సమగ్ర కవిత్వం చదివి ఒకరోజు కాత్యాయనీ విద్మహే నాకు ఫోన్ చేసి " మీ కవిత స్త్రీ వాద సంకలనం నీలిమేఘాలులో చేరలేదనుకుంటాను.ఎందుచేత " అని అడిగారు ." బహుశా నేను మితవాద స్త్రీ వాదిగా భావించి చేర్చలేదేమో" అన్నాను.ఆమె సుమారు అరగంటసేపు నాకవిత్వం గురించి నాతో ఫోనులో చర్చించారు.అంతేకాదు సుమారు పదహారు పేజీల సుదీర్ఘ ముందుమాట రాసి అందించటం నాకు చాలా సంతోషం కలిగించింది.
అయితే నా పుట్టిన రోజు నాటికి ప్రచురణ పూర్తికాలేదు.అందుకని ఒక డమ్మీ కాపీ తయారుచేసారు వీర్రాజు గారు.
మా కుటుంబానికి బాగా దగ్గరైన ఆత్మీయ మిత్రులు ఒక పదిహేనుమందిని ఆహ్వానించి మా ఆషీతో పుస్తకాన్ని ఆవిష్కరింపజేసి మా ఇంటికి దగ్గరలోనే ఒక హొటలులో కలిసి భోజనాలు చేసాము.ఆ రకంగా నా షష్ఠిపూర్తి అయింది.
పుస్తకం ప్రింటింగ్ పూర్తయ్యాక బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో గోపీ గారి అధ్యక్షతన రత్నమాల , నాళేశ్వరం శంకరం నా పుస్తకంపై ప్రసంగించగా ఎనిమిది సంపుటాలతో కూడిన నా సమగ్ర కవిత్వ సంపుటి ఆవిష్కృతం అయ్యింది.ఆ విధంగా నాకు వీర్రాజుగారు గొప్ప బహుమతి అందించారు.
-- శీలా సుభద్రాదేవి
13, మే 2025, మంగళవారం
నడక దారిలో -52
నడక దారిలో -52
హైదరాబాద్ నగరంలోనే కాదు దేశమంతటినీ ఉలికి పడేలా చేసిన జంట పేలుళ్ళ సంఘటనలు 2007 ఆగష్టు 25 న జరిగాయి.
కోఠి ప్రాంతంలో మూడు దశాబ్దాలుగా పేరున్న గోకుల్ చాట్ షాపులో సాయంత్రంపూట విపరీతమైన జనం కూడివుంటారు.అక్కడి చాట్,పానీపూరీ వంటి వాటికి చాలా డిమాండ్ వుంది.అటువంటి చోట సాయంత్రం 7:40 ప్రాంతంలో బాగా రద్దీగా ఉన్న సమయంలో గోకుల్ చాట్ సెంటరులో బాంబు పేలింది. పదిమందికి పైనే అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో 23 మందికి పైగా ఆసుపత్రుల్లో మరణించారు. 50 మందికిపైగా గాయపడ్డారు.మా మారింది కూతురు క్లాస్ మేట్ ఎమ్మెస్ కోసం యూఎస్ వెళ్ళటానికి సిద్ధపడుతూ స్నేహితులతో గోకుల్ చాట్ కి వెళ్ళి గాయపడి పద్దెనిమిది యేళ్ళు దాటినా ఇప్పటికీ వీల్ చైర్ కే అంకితమై శారిరకంగానే కాదు మానసికంగా కూడా వైకల్యంతో వున్నాడు.మానవత్వంలేని రాక్షసులు జనసమ్మర్థ ప్రాంతాలలో ఈ విధంగా చేయటం వలన ఎంతమందికి కడుపు కోత అయిందో కదా
అదే సమయంలో సచివాలయానికి ఎదురుగా ఉన్న లుంబినీ పార్కులో బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో మొత్తం 44 మంది ప్రాణాలు కోల్పోగా వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. బాంబుల్లో ఇనుప ముక్కలు వుపయోగించటం వలనే చాలామంది శరీర అవయవాలు కోల్పోయారని తెలిసింది.ఈ సంఘటనలతో ఒక్క సారిగా నగరం భయం గుప్పిట్లోకి వెళ్ళిపోయింది.తలచుకున్నప్పుడల్లా గుండె భారమై పోతుంది.
పల్లవి సాధారణంగా అదేసమయంలో ఇల్లు చేరేది.హైటెక్ సిటీలో బస్సెక్కి లక్డికాపూల్ లో దిగి వనస్థలిపురం బస్ ఎక్కుతుంది.ఇలా ఇంటికి రాగానే ఈ పేలుళ్ళ ఘటన టీవీలో చూసి హమ్మయ్య పిల్ల ఇంటికి చేరిందని వూపిరి తీసుకున్నాం.
మా ఇంట్లో ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది వరకూ రేడియోలోంచి గానీ టేప్ రికార్డర్ లోంచి గానీ పాటలు ఇల్లంతా వ్యాపిస్తూనే వుంటాయి.స్వర్ణకమలం,తాల్ పాటలే కాకుండా ఒక చిన్నపిల్లల ఇంగ్లీష్ పాటలు కేసట్ కూడా వేస్తూ వుంటాం.అవి వేసినప్పుడు ఆషి భలే బాగా ఆపకుండా కేసెట్ పూర్తి అయ్యేవరకూ చక్కగా రిథం కి తగినట్లుగా డాన్స్ చేసేది.
నాకు సరేసరి పల్లవికి కూడా క్లాసికల్ డాన్స్ నేర్పించలేక పోయాము.పల్లవి చదివే స్కూల్ లో కో కరిక్యులర్ యాక్టివిటీ క్రింద డాన్స్ క్లాస్ కూడా వుండేది.పల్లవి భరతనాట్యం తీసుకుందామనుకుంటే అందులో ఎక్కువమంది వున్నారని కథక్ లో చేర్చారు.అదికూడా పల్లవి బాగానే నేర్చుకుంది.పదో తరగతి అయ్యాక వదిలేసింది.
ఆషీ బాగా చేస్తుంది కదా నేర్పించుతే బాగుండును అనుకున్నాను.పల్లవి ఉదయం ఎనిమిదిన్నరకి హైటెక్ సిటీ వుద్యోగానికి వెళ్తే తిరిగి వచ్చేసరికి ఏడో ఎనిమిదో అయ్యేది.అందుచేత నాకూ ఆషీకీ దోస్తానీ పెరిగింది.సూపర్ బజార్ వెళ్ళాలన్నా,కూరలకైనా మేమిద్దరమే.వెళ్ళినప్పుడల్లా నన్ను కబుర్లతో మెప్పించి తనకు కావలసిన రకరకాల పెన్నులు,రకరకాల సెంట్ రబ్బర్లూ కొనిపించుకునేది
ఒక రోజు మోర్ సూపర్ బజార్ వెళ్ళి వస్తుంటే ఎల్.ఐ.సి కాలనీ పార్కులో పిల్లలు డాన్స్ చేస్తుండటం చూసి ఆషీని డాన్స్ నేర్చుకుంటావా అని అడిగాను.నేర్చుకుంటాను అనేసరికి పార్క్ లోకి వెళ్ళాను.
పదిమంది వరకు అన్ని వయసుల పిల్లలకూ ఒక అమ్మాయి డాన్స్ నేర్పుతోంది.ఆషీని చూపించి డాన్స్ లో చేర్చాలనుకుంటున్నట్లు చెప్పాను.వారానికి మూడురోజులు క్లాసులు ఉంటాయనీ తెల్లని పంజాబీ డ్రెస్ వేసుకొని రావాలని చెప్పింది.
సరే నని మర్నాటి సాయంత్రానికి నేను ఇంట్లో వున్న క్లాత్ తో తెల్ల పంజాబీ డ్రెస్ కుట్టేసి రెడీ చేసాను.
ఆషీ స్కూల్ నుంచి రాగానే కొత్త డ్రెస్ వేసుకొని తనకోసం తయారు చేసిన అప్పచ్చులు తిని పాలు తాగిన తర్వాత అయిదు గంటలకు పార్కులో డాన్స్ క్లాస్ కి తీసుకు వెళ్ళాను.దారిపొడవునా హుషారుగా కబుర్లు చెప్తూ నడిచింది.
డాన్స్ టీచర్ తీసుకువచ్చిన పండుతాంబూలం తీసుకుని ముందు చేయాల్సిన వందనం నేర్పింది.తర్వాత హస్తముద్రలూ లాంటి వేవో నేర్పింది.ద్వితీయవిఘ్నం వుండొద్దు రేపు కూడా తీసుకుని రమ్మంది.
మర్నాడు కూడా తీసుకు వెళ్ళాను.డాన్స్ పాఠం అయ్యేవరకూ అక్కడే వుండి తిరిగి రోజూ ఇంటికి వస్తున్నాము.ఒక నెల రోజుల పాటూ ఆసక్తి తో ఆషీ క్లాసు ఇష్టపడింది.ఆ డాన్స్ టీచరు పాఠం కన్నా రోజూ ఎవరినో ఒకరిని తిట్టటం ఎక్కువ.దాంతో ఆషీ డాన్స్ క్లాస్ కి బయలు దేరిన దగ్గర నుండి ఇంటికి తిరిగి వచ్చే వరకూ స్వర్ణకమలంలో భానుప్రియలా ముఖంలో "ఎందుకొచ్చిన డాన్స్ రా బాబూ " అన్నట్లు ఎక్స్ ప్రెషన్స్ పెట్టేది.అప్పటికీ దారిపొడవునా నేను కబుర్లు చెప్తున్నా మూడీగా వుండేది.కావాలని క్లాస్ లో తప్పులుగా చేసేది.
డాన్స్ క్లాస్ మానేస్తావా అని అడిగితే వెళ్తాననే అనేది.అంతలో వినాయకచవితి దగ్గర పడింది.డాన్స్ టీచర్ " మీకు గణపతి మీద ఒక డాన్స్ నేర్పిస్తాను.గణపతి మంటపంలో చేయిస్తాను." అని పిల్లలను అందరినీ ఒక ఆర్డర్ లో నిలబెట్టి పాట తన టేబ్ లో ఆన్ చేసింది. ఎలా చేయాలో నేర్పటం మొదలెట్టింది.
"ఏకదంతాయ వక్రతుండాయ ...." అంటూ మొదలైన శంకర్ మహదేవన్ పాట,ఆ రాగమాధుర్యం అప్పటినుండి ఇప్పటికీ విన్నప్పుడల్లా వెంటాడుతునే వుంటుంది.అంత గొప్పగా వుంటుందా పాట.
సరే మళ్ళా డాన్స్ కి వద్దాం .ఒక బొద్దుగా వున్న అమ్మాయిని గణపతిగా ఎంపిక చేసింది.ఆ పిల్ల మర్నాటి నుంచి రావటం మానేసింది.ఈ డాన్స్ కూడా ఆషీ ఆసక్తిగా చేయటం లేదనిపించింది.
ఆ ప్రోగ్రాం ఎక్కడో అర్థరాత్రి జరుగుతుందంటే మా పాప అంత దూరం రాలేదని చెప్పేసాను.
ఆ తర్వాత నెలరోజులన్నా తిరగలేదు.కెనడాలో వున్న భర్త దగ్గరకు వెళ్ళటానికి వీసా వచ్చిందని ఆ అమ్మాయి డాన్స్ పాఠాలకు మంగళం చెప్పేసింది.
మా ఆషీకి డాన్స్ పాఠాలు తప్పిపోయాయి.ఇప్పటికీ స్వర్ణకమలం సినీమా చూస్తే డాన్స్ క్లాసులోని ఆషీ ముఖం గుర్తువచ్చి నవ్వుకుంటాం.
నేను,మా క్రింద ఇంటిలోని సరోజిని గారూ కలసి రోజూ మా యింటికి దగ్గరలోని పార్క్ లో వాకింగ్ కి వెళ్తాం.ఆషీ కూడా మాతో వచ్చి అక్కడే ఆడుకుంటుంది.పార్కు ఎదురుగా ఒక ఇంట్లో అమ్మాయి కీబోర్డు నేర్పుతుంది తెలిసి ఆషీని నేర్చుకుంటావా అని అడిగి అక్కడ చేర్చాను.
ఆ అమ్మాయి సినీ గాయకుడు హేమచంద్ర బంధువట.పాడుతా తీయగా లో పాల్గొన్నానని చెప్పింది. ఆషీ కోసం కీ బోర్డు పల్లవి కొన్నది.వారానికి మూడు రోజులు ఆషీని వాళ్ళింట్లో దింపి నేను నా వాకింగ్ పూర్తిచేసుకుని తిరిగి ఇంటికి తీసుకు వచ్చేదాన్ని.
కీబోర్డు చాలా ఆసక్తిగా ఆషీ నేర్చుకుంది.సరళీస్వరాలు,జంట స్వరాలు,పిళ్ళారి గీతాలేకాక జనగణమన,హేపీ బర్త్ డే పాట కూడా చక్కగా వాయించటం నేర్చుకుంది.బాగా వాయించటం చూసి పల్లవి సినిమా పాటలకు కీబోర్డ్ నొటేషన్లు ఎవరి దగ్గరో డౌన్ లోడ్ చేసి తీసుకు వస్తే అందులోంచి ' చిన్నిచిన్ని ఆశ ' కూడా నేర్చుకుంది.
ఆషీ కీబోర్డు నేర్చుకుంటుందని తెలిసి కృష్ణారెడ్డిగారు కూడా తన పిల్లలిద్దరికీ కీ బోర్డు కొని క్లాస్ లో చేర్పించారు.
ఆషీ ఆసక్తిగా నేర్చుకుంటుందని సంతోషించే లోగానే కొన్ని నెలలు గడిచాక ఆషీ కీబోర్డునేర్పించే టీచరు భర్తని సాఫ్ట్వేర్ ఉద్యోగం ద్వారా కంపెనీ వాళ్ళు అమెరికాకి పంపుతున్నారట.అతనితో పాటు ఆమె కూడా వెళ్తున్నానని చెప్పటం తో ఆషి సంగీతపాఠాలకీ మంగళం పాడేయాల్సి వచ్చింది.
కానీ తర్వాత కూడా ఆషీ చాలాకాలం కీ బోర్డు ప్రాక్టీస్ చేస్తూనే వుండేది.
మొత్తం మీద ఆషీకి సంగీతం, డాన్స్ నేర్పించాలన్న నా కోరిక మొదట్లోనే గండి కొట్టింది.కానీ పుస్తకం పఠనాభిరుచి మాత్రం రోజురోజుకూ,ఏడాదిఏడాదికీ పెరిగింది.అది సంతోషం.
ఇంకా చదవటం రాక ముందు నిద్రపుచ్చే సమయంలో తప్పని సరిగా నేనో,పల్లవో కథలు చెప్పేవాళ్ళం.ఒకొక్కప్పుడు మేము కథ చదువుతూ చెప్పేవాళ్ళు.చదవటం వచ్చాక ఆషీ చేతే చదివించి వివరించే వాళ్ళం.ఆ అలవాటు ఆషీ నేటికీ మానలేదు.పరీక్షల సమయంలో కూడా తానే ఒకటో రెండో కథలు చదివి నిద్రకి ఉపక్రమించటం ఆషీకి అలవాటైపోయింది.తెలుగు పుస్తకాలు తక్కువే కానీ ఇంగ్లీషులో మాత్రం పెద్దపెద్ద పుస్తకాలు చదివేస్తూవుంటుంది.తన ఫోన్ లో కూడా కొన్ని పుస్తకాలు డౌన్లోడ్ చేసి పెట్టుకుంటుంది.అయితే ఆ వయసు పిల్లలు చదివే రొమాంటిక్ నవలలు కాకుండా కాన్స్పిరసీ నవలలు,చారిత్రక నవలలూ,బయోగ్రఫీలు అటువంటి పుస్తకాలే చదువుతుంది.ఏమైతేనేం పుస్తకాలు చదివే అలవాటు మంచిదే.
ఒకరోజు వార్తాపత్రికలో గుజరాత్ లోని ఆనందనగరం అనే వూరికి పిల్లలు లేని విదేశీ దంపతులు క్యూ కడుతున్నారనీ,సరోగసీ పద్ధతిలో పేద మహిళలను ధనాన్ని ఆశ చూపి ఒప్పిస్తున్నారనే కథనాన్ని చదివి ఒక రాత్రంతా నిద్రపట్టలేదు.అంతకు ముందు పాలమూరు కార్మికులు మధ్యదళారీలను నమ్ముకొని అరబ్ దేశాలకు వెళ్ళి పడరాని కష్టాలు పడుతున్నారనే వార్త చదివి ఎలా అయినా వీరిమీద కథ రాయాలనుకున్నాను.కానీ వివరాలు సేకరించ లేక మానేసాను . ఇప్పుడు అద్దెకు గర్భం విషయం చదివిన తర్వాత ఈ రెండింటినీ కలిపి రాయాలనే ఆలోచన వచ్చి "గోవు మాలచ్చిమి " కథ రాసాను.
అప్పడే అనుకోకుండా బ్రౌన్ అకాడమి నవ్య వార పత్రికతో కలిసి నిర్వహిస్తున్న కథలపోటీ ప్రకటన చూసి పోటీకి కథ పంపించాను.ప్రత్యేక బహుమతి వచ్చింది.
ఈ కథ నవ్య వార పత్రికలో ప్రచురితం అయినప్పుడు చాలా మంచి స్పందన నాకు వచ్చింది.ప్రముఖ రచయిత విహారి గారు ప్రతీ సమావేశంలోనూ ఈ కథ గురించి ప్రస్తావిస్తూ ఈ ఏడాది మేటికథ అని ప్రశంసించేవారు.
బ్రౌన్ అకాడమివారు బహుమతికి ఎంపికైన కథలన్నీ కలిపి "బహుమతి కథలు" పేరిట పుస్తకంగా ప్రచురించారు . కేంద్ర సాహిత్య అకాడమీ వారికి పి.సత్యవతి గారు తన సంపాదకత్వంలో కూర్చిన ఆంగ్లానువాద కథల సంకలనంలో పాపూరి జయలక్ష్మిగారు చేసిన నా గోవు మాలచ్చిమి కథ ఆంగ్లానువాదం కూడా చేర్చారు.
నా మొదటి కథలసంపుటి 1990 లో వచ్చింది.పద్ధెనిమిదేళ్ళ తర్వాత రాసిన కథలన్నీ కలిపి నా రెండవ కథల్ని ఆషీ క్రయాన్స్ తో వేసిన చిత్రాన్ని ముఖచిత్రం గా వేసుకుని కొత్తకథాసంపుటిని రెక్కల చూపు పేరుతో ప్రచురించాము.కానేటి మధుసూదన్ గారూ ,జి.ఎస్.చలం గారూ ఈ పుస్తకావిష్కరణ విజయనగరంలో గానీ,వైజాగ్ లో గానీ పెడతామని అన్నారు.నేను సాధారణంగా ఆవిష్కరణ సభలు పెట్టుకోను.కాని పుట్టిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆవిష్కరణ జరగటం ఒక అనుభూతి కదా.
పెద్దక్కయ్య సంవత్సరీకాలకి ఎలాగూ వెళ్తాం కనుక అప్పుడు ఏర్పాటు చేయమని వీర్రాజు గారు వాళ్ళతో చెప్పారు.
అదేవిధంగా మేము వైజాగ్ రాగానే యూనివర్సిటీ కేంపస్ లోనే రూం కేటాయించారు.ఉత్తరాంధ్ర రచయితలు వచ్చి అక్కడ కలిసారు.
ఆ సాయంత్రం వైజాగ్ లో ఆంధ్రా విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో తెలుగుశాఖాధిపతి సత్యనారాయణ గారి అధ్యక్షతన, తెలుగు ప్రొఫెసర్ డా.సజ్జా మోహనరావుగారు నా "రెక్కల చూపు" కథా సంపుటి ఆవిష్కరణ జరిగింది.వి.ప్రతిమ నా పుస్తకాన్ని పరిచయం చేసింది.ఆవిష్కరణ అద్భుతంగా జరిగింది.
ఆ మర్నాడు వీర్రాజు గారి బాల్యమిత్రుడి ఇంటికి వెళ్ళి సాయంత్రానికి విజయనగరం వెళ్ళిపోయాం.సంవత్సరీకాల కార్యక్రమం అయ్యాక హైదరాబాద్ కి తిరుగు ప్రయాణం కట్టాము.
లేఖిని రచయిత్రులసంస్థ అధ్యక్షురాలు వాసా ప్రభావతి తెలుగు భాషా సాంస్కృతిక శాఖ కె.వి.రమణాచారి గారి సహకారంతో
ఒక రోజు సదస్సు నిర్వహణ తలపెట్టారు.రాష్ట్రేతర రచయిత్రుల్ని కూడా ఆహ్వానించి,వయోధికులైన ఆరుగురు రచయిత్రులను ఘనంగా సత్కరించారు.ఒక సదస్సులో నేను కె.రామలక్ష్మి గారి కథల గురించి ప్రసంగ వ్యాసం చదివాను.
లేఖిని సంస్థ కనుక అందులోని సభ్యులచేతే వాసా ప్రభావతి గారు ప్రసంగ పత్ర సమర్పణ చేయించారు.
కె.రామలక్ష్మి గారు మా ఇంటికి దగ్గరలోనే పది నిమిషాల నడక దూరంలో ఒక అపార్ట్మెంట్ లో తన సోదరితో పాటు వుంటున్నారు.అందువలన తరుచూ కలిసే దాన్ని.నేను ఆమె కథలగురించి వ్యాసం రాసానని తెలిసి చాలా సంతోషించారు.
ఎప్పటినుంచో స్త్రీ జీవితాన్ని పుట్టిన దగ్గర నుండి వృద్ధాప్యం వరకూ చాప్టర్లుగా విడదీసి దీర్ఘకవిత రాయాలనే ఆలోచన వుంది.దానిని రాయటం మొదలు పెట్టాను.శైశవం, బాల్యం, కౌమారం,యవ్వనం, ప్రౌడత్వం,వృద్ధాప్యం, ముగింపుగా ఏడు చాప్టర్లుచేసి రాయటం ప్రారంభించాను.స్త్రీ జీవితంతో పోలుస్తూ విత్తనం మొలకేసిన దగ్గర నుండి మోడుగా కావటం వరకు,సూర్యోదయం నుండి సంధ్యాసమయంవరకూ ప్రతీ చాప్టర్ నీ మొదలు పెడుతూ స్త్రీ జీవితాన్ని సాదృశ్యం చేస్తూ రాస్తున్నాను.బాగానే వస్తోందనిపించింది.
ఒకరోజు ఇద్దరు అమ్మాయిలు ఫోన్ చేసి నా కవితా సంపుటాలమీద ఎమ్.ఫిల్ చేసామని అందుకని కలవాలనుకుంటున్నామని ఇంటి చిరునామా అడిగారు.నాకు భలే ఆశ్చర్యం అంతులేని సంతోషం కలిగింది.తమ రచనలమీద పరిశోధన జరిగిందంటే ఎవరికి మాత్రం ఆనందం కలుగదూ?
మర్నాడు ఆ ఇద్దరూ వచ్చారు.నా యుద్ధం ఒక గుండె కోత దీర్ఘ కవిత మీద కె.భాగ్యలక్ష్మీ,నా మొదటి సంపుటి ఆకలి నృత్యం మీద బి.నాగలక్ష్మి మధుర కామరాజ్ విశ్వవిద్యాలయంలో చేసిన ఎమ్.ఫిల్ పరిశోధనల కాపి తీసుకుని వచ్చి ఇచ్చారు.అది చదివి నా అభిప్రాయం తెలుపుతూ ఒక ఉత్తరం రాసి ఇవ్వమన్నారు.ప్రాచ్యకళాశాలలో లెక్చరర్ పి.జగన్నాథరావుగారు వారికి గైడ్ అని చెప్పారు.
చాలా ఏళ్ళ క్రితం ఏదో సందర్భంలో కేబి లక్ష్మీ నాతో " సదస్సులలో పాత్ర సమర్పణ చేయటానికి అకడమీషియన్లనే తీసుకుంటారు. అందుకే తాను పీహెచ్డీ చేయాలని రిజిస్టర్ చేయించుకున్నానని" చెప్పటమేకాక "నువ్వు కూడా చెయ్యవోయ్" అని సలహా యిచ్చింది.ఆలోచిస్తుంటే లక్ష్మి అన్నది నిజమే అనిపించింది.
అకాడమీలు గానీ,యూనివర్శిటీలు గానీ అకడమీషియన్లకే పత్రసమర్పణ అవకాశాలు కల్పిస్తాయి.
అప్పట్లోనే ఒక రోజు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి పి హెచ్ డి అప్లికేషన్ ఫాం కూడా తెచ్చుకున్నాను.వీర్రాజుగారితో చెప్తే "నీ రచనలమీద పరిశోధనలు చేయగల స్థాయి రచయిత్రిగా ఈ నాడు నువ్వు వున్నావు.నువ్వు చేయటం ఏమిటి" అన్నారు.ఆయన మాట నచ్చక పోయినా,పేరు ముందు డాక్టర్ తగిలించుకోవాలనే కోరిక వున్నా, అప్పటికే ఎమ్మెస్సీ చేయటానికి చాలా శ్రమ పడి వున్నానేమో.మళ్ళా చదువులోకి దిగే సాహసం చేయలేక పోయాను.
ఈ నాడు నా రచనలమీద ఇద్దరు విద్యార్థులు ఇచ్చిన ఎమ్ ఫిల్ పరిశోధన గ్రంథాలు చూస్తుంటే నా మనసు ఉప్పొంగి పోయింది.
- శీలా సుభద్రాదేవి
27, ఏప్రిల్ 2025, ఆదివారం
స్త్రీ లపాలిటి కల్పవృక్షం సామవేదం వెంకట కామేశ్వరి
~ స్త్రీల పాలిటి వైద్య కల్పవృక్షం డా.సామవేదం వెంకట కామేశ్వరి ~
జన్మ రీత్యా మంచి సాంస్కృతిక నేపధ్యం గల కుటుంబంలో 1972 జనవరి 23వ తేదీన వెంకట కామేశ్వరి ఆ ఛాయలన్నిటినీ పిడికిట్లో ఒడిసి పట్టుకునే పాలకొల్లులో కన్నువిప్పింది
కామేశ్వరి పితామహులు డా.సామవేదం సత్యనారాయణగారు పాలకొల్లులో మంచి హస్తవాసి గల వైద్యులుగానే కాక స్థానిక లైన్స్ క్లబ్ లో ప్రతీ నెలా మొదటి ఆదివారం చక్కటి సంగీతకచేరీలు ఏర్పాటు చేసేవారు.అప్పట్లో పోలియో వ్యాధి వ్యాప్తి ఎక్కువగా వుండేది.ఈ వ్యాధిని తొలిదశలోనే గుర్తించి మెరుగైన వైద్యం కోసం రాయవెల్లూరు పంపే ఏర్పాటు చేసేవారు.కామేశ్వరి గారి నాన్నమ్మ ఆ రోజుల్లోనే మహిళా సాధికారతకల వ్యక్తి, మంచి సాహిత్యాభిలాష కలిగినవారు.మొదటి మనవరాలైన కామేశ్వరికి వీరే మొదటగా స్ఫూర్తి అందించిన వారు.
తండ్రి సామవేదం వేంకట సూర్యనారాయణ రసాయన శాస్త్రంలో మాష్టారు పట్టా అందుకున్న తొలిరోజుల్లో రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో లెక్చరర్ గానూ తర్వాత ఎస్.బి.ఐ లో ఆఫీసర్ గా ఉద్యోగం చేసి పదవి విరమణ అయినా కొద్దికాలానికే తీవ్ర గుండెనొప్పికి బలైపోయారు.తల్లి మీనాక్షి పెద్దగా చదువుకోక పోయినా తల్లిదండ్రులు ఇద్దరూ తమ ఆడపిల్లలిద్దరికీ మంచి చదువుల్నే కాక,సాహిత్య పఠనానికి కూడా ప్రోత్సహించిన రెండవ స్ఫూర్తి దాతలు.
పాలకొల్లుకు పద్నాలుగు మైళ్ళ దూరంలోని లంక గ్రామమైన భీమలాపురంలో నివాసితులైన మాతామహులు వేదపండితులు. ఇరవైనాలుగు వేల రామాయణం శ్లోకాలు కంఠోపాఠంగా నేర్చిన ఆధ్యాత్మికురాలు అమ్మమ్మ.వరదకాలంలో ముంపుకు గురైన గ్రామ ప్రజలను ఆదరించి స్వయంగా ఆహారాన్ని అందించిన సహృదయులు.
ఇటువంటి నేపధ్యంలో పెరిగింది కనకే కామేశ్వరి విద్యా, వైద్యం,సమాజం పట్లా అంకితభావం కలిగిన సహృదయురాలు కావటంలో ఆశ్చర్యం లేదు.తర్వాత్తర్వాత ఆమె తన చేయి అందుకున్న డా.వింజమూరి సూర్యప్రకాష్ సాహచర్యంలో కామేశ్వరి మరింత లక్ష్యసాధనకు మునుముందుకు అడుగులు వేసింది..వేస్తూనే వుంది.
కామేశ్వరి వైజాగ్ లోని ఆంధ్రా మెడికల్ కాలేజిలో MBBS చదివినప్పుడే కాలేజీలో ఎనాటమీ లో మొదటిస్థానంలోనూ,మైక్రోబయాలజీలో రెండవ స్థానంలోను రావటం విశేషం.తర్వాత ఉస్మానియా మెడికల్ కాలేజీ ,నయాపూల్ లోని ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్ లో Gynecologicy and obstetrics లో డిప్లొమా చేసారు.
డాక్టర్ ఎస్.వి. కామేశ్వరి తెలంగాణ రాష్ట్ర వైద్య మండలిలో సభ్యత్వం పొందారు.
ఇంకా అప్పటినుండి కామేశ్వరి కార్యరంగంలోకి దూకారు.దేశంలోని అన్ని విపత్తులలోనూ వైద్యసహాయం అందించేందుకు భర్త వింజమూరి సూర్యప్రకాష్ గారితో కలిసి ముందడుగు వేశారు.సునామీ సమయంలో ట్యూబెక్టమీ అయిన మహిళలు మళ్ళా సంతానోత్పత్తికి రీకానలైజేషన్ చేసుకోవటంతో వారిపై అధ్యయనం చేసి అది సరిగా జరగలేదనేది ప్రకటించారు.
డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ సహాయంతో హిస్టరెక్టమీ మీద సీరియస్ గా పనిచేసి 2012లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి రోశయ్యగారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆరోగ్యశ్రీ పథకం నుంచి హిసెరెక్టమీ సేవలను తొలగించటం వీరు చేసిన వైద్యసేవాకృషికి తొలి విజయంగా చెప్పవచ్చు.
ఎందుకంటే భారతదేశంలో ఎంతమందికి హిస్టరెక్టమీ జరిగిందో డేటా లేదు.అవసరం వున్నా లేకపోయినా ఇబ్బడిముబ్బడిగా పేద శ్రామిక వర్గం స్త్రీలకు హిస్టరెక్టమీ చేయటంతో వారు తదనంతరం అనేక విధాలుగా రోగగ్రస్తులు కావటం జరుగుతుందనేది వీరి అధ్యయనంలో బయటకు వచ్చింది.
2013 లో ఢిల్లీలో ఒక NGO సంస్థ ఏర్పాటు చేసిన సమావేశంలో కామేశ్వరిగారు తమ అధ్యయనంలో తెలుసుకున్న ఫలితాలను ప్రదర్శించారు.ఆ తర్వాతే National Family health survey -4 ( NFHS-4)- 2015-16 వారు హిస్టెరెక్టమీ గణాంకాలను నాటికి తయారుచేసారు.
కానీ తర్వాత కూడా ఈ గణాంకాలు పెరుగుతూనే వున్నాయని చింతిస్తారు కామేశ్వరి.
"గర్భసంచి కాపాడుకుందాం సమాజాన్ని బలపరుద్దాం “అనే పుస్తకాన్ని మొదట 2017 సంవత్సరంలో ప్రచురించారు. తెలంగాణా ప్రభుత్వ సహకారంతో 2018 సంవత్సరం జనవరి నుండి ఆగస్టు వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆరోగ్యసిబ్బందికి,ఆశా వర్కర్లకు, మహిళాసమాఖ్య సభ్యులకు,81 గ్రామాలలో 16000 మందికి పైగా స్త్రీలకు పెద్ద ఎత్తున గర్భసంచి ప్రాధాన్యత పై అవగాహన కల్పించారు.అంతే గాక రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక పాఠశాలల్లో, కాలేజీలలో విద్యార్థినులకు గర్భసంచి ప్రాధాన్యత గూర్చి వివరించారు.
డా.కామేశ్వరి స్వభావం ఎప్పటికప్పుడు స్త్రీల ఆరోగ్యసమస్యల్ని పరిశోధనాత్మక దృక్పధంతో నిరంతరం పరిష్కరించటానికే కాకుండా ఆ సమస్యలపట్ల అవగాహన కల్పించి జాగృతం చేయాల్సిన అవసరాన్ని గుర్తించారు.అప్పటినుండి తన దగ్గరకు చికిత్సకోసం వచ్చిన మహిళలను కేవలం చికిత్స చేసి పంపేయటం కాకుండా తల్లిలా అక్కున చేర్చుకుని శారీరకంగానే కాక మానసికంగా, కుటుంబపరంగా తగిన సహకారం అందిస్తున్నారు. వారి ఆరోగ్య సమస్యలనన్నింటినీ నమోదు చేసుకుని ఎక్కువ మందికి అందాలనే వుద్దేశ్యంతో పుస్తకరూపంలో తీసుకు రావటానికి కలంపట్టారు .
సంతానసాఫల్యం గురించి.ఇటీవల కుప్పలు తెప్పలుగా సంతానసాఫల్యకేంద్రాలు వెలుస్తూ , కుటుంబాల్లో పెళ్ళైన ఏడాది నుండీ గర్భం రానందుకు వేలెత్తి చూపటంతో అవమానపాలౌతున్న వారిని ఆకర్షించి మూలకారణాలు అన్వేషించకుండానే చికిత్స మొదలు పెట్టేస్తుండటం, దానితో తదనంతరం ఆర్థికపరమైన ఇబ్బందులేకాక ఆ చిన్నితల్లులు అనేక అనారోగ్యాలకు పాల్పడటం కామేశ్వరిని కలచివేసింది.
"సంతానం కానివారిలో 92 శాతం మందికి చిన్నచిన్న ప్రక్రియలతోనే ప్రాధమిక స్థాయి,మధ్యమస్థాయి క్లినిక్ లోనే ఫలితాలు లభిస్తాయి" అంటారు కామేశ్వరి.
ముఖ్యంగా కొన్నిదిగువ, మధ్యతరగతి కుటుంబాలలో సంతానం కలగకపోవటాన్ని దోషంగా పరిగణిస్తారు.కుటుంబంలోవారంతా ఆ స్త్రీని దోషిగా పనికిరాని వస్తువులా చూస్తారు.అటువంటి పరిస్థితుల్లో ఉన్నవారిని కామేశ్వరి గారు ఆత్మీయంగా అక్కున చేర్చుకుని వారికి తగిన వైద్యం చేసి వారి ఒడిని పసిపాపతో నింపిన సందర్భాలు ఎన్నో.సంతానాభిలాషతో వచ్చిన దంపతులను నాలుగు రకాల కేసులుగా విభజించి తగిన విధంగా అవగాహన కల్పిస్తుంటారు.
అందుకే కామేశ్వరి తనదైన పధ్దతిలో దంపతులను కూర్చోబెట్టుకుని వారిని మానసికంగా, శారీరకంగా తన వైద్యానికి సానుకూలంగా తయారుచేసి వేలసంఖ్యలో దంపతులకు సంతానం కలిగేలా చేసారు.తన అనుభవాలూ తన పరిశోధనలనూ,తన పరిశీలనలనూ అన్ని కోణాల్లో క్రోడీకరించి "మధుమాలతి " అనే పుస్తకాన్ని రాసారు డా.కామేశ్వరి.
గ్రామాలనుండి వచ్చినవారిని,చాలాకాలం తర్వాత గర్భం నిలిచిన వారినీ తమ కేంద్రమైన 'అందరియిల్లు'లో ఆశ్రయం కల్పించి తగిన విశ్రాంతి గా ఉండేలా ఆరోగ్యకర ఆహారం అందజేస్తారు.
"సంతానం కలగని వందమందిలో ముగ్గురికి మాత్రమే సంతానం కలగకుండా చేసే కారణాలను ఐవీఎఫ్ సహాయంతో పరిష్కరించుకోవచ్చు.అంతేకానీ ఏదో వస్తువు కొనుక్కున్నట్లుగా తొందరపాటుతో ఐవిఎఫ్ చేయించుకోటానికి వెళ్ళవద్దు" అంటారు కామేశ్వరి .ఐవీఎఫ్ చేయించుకోవటం అనేది ఒకరి వ్యక్తిగత నిర్ణయంగా కాకూడదు . స్త్రీల గర్భంపై, ఆరోగ్యంపై దాడిగా మారుతోన్న పునరుత్పత్తి సమస్యలపైగాని,అనవసరంగా హిస్టెరెక్టమీ చేసేస్తూ స్త్రీల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుంటున్న దోపిడికేంద్రాలపై రెండు తెలుగు రాష్ట్రాల్లోని గ్రామాల్లో,బస్తీల్లో పర్యటిస్తూ అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.
కామేశ్వరీ, సూర్యప్రకాష్ గార్లు కలిసి చేసే మానవవైద్యసేవే కాక అందరి యిల్లు పేరిట చేస్తున్న సమాజానికి కూడా చేస్తున్న వైద్యాన్ని పరిగణలోకి తీసుకొని first hundred doctors from Andhra medical College గా 2023లో ఆంధ్రా మెడికల్ కాలేజీ శతవార్షికోత్సవాలలో AMC లో సీనియర్ డాక్టరైన శేషు శర్మగారు తన పుస్తకంలో నమోదు చేసారు.ఇది వీరు జీవితంలో సాధించిన మరో గొప్ప గుర్తింపు.
ఉత్తరాలతో మానవ సంబంధాలను ఎలా బలపరచుకోవచ్చో ' art of letter writing 'ని ఒక ఉద్యమం ద్వారా తెలియజేసారు ఈ వైద్య దంపతులు.
అంతటితో ఆగిపోలేదు అన్ని విధాలా రోగగ్రస్తమైపోతున్న సమాజాన్ని ప్రేమా నిజాయితీ అనే వైద్యంతో పునరుజ్జీవింప చేయటానికి నడుం బిగించారు. అందరం మనమందరం అంటూ మందార పూవును చిహ్నంగా ఎంచుకొని వారితో సహకరించే వారినందరిని ఒకే కుటుంబం గా కలుపుకుంటూ సమాజంలో 'అందమైన జీవితాల్ని ' కలగనే స్వాప్నికులు డా.కామేశ్వరీ,డా.సూర్యప్రకాష్ దంపతులు.అందుకే వీరు అందరికీ పూలనూ,పూలమొక్కల్నీ పంచుతారు.
అందరికీ ఆహారం, ఆరోగ్యం, మానసిక వికాసానికి పుస్తకం అందినపుడు సమాజమే మారుతుందన్న విశ్వాసంతో అడుగులు వేస్తారు.
తల్లిదండ్రుల సామాజిక సేవను బాల్యం నుంచి చూస్తూ పెరిగిన కుమార్తె గాయత్రి డాక్టర్ గా, కుమారుడు భరత్ శాస్త్రవేత్తగా విదేశాల్లో తమ రంగాల్లో నైపుణ్యం పొందారు.
డా.సామవేదం వెంకట కామేశ్వరి , డా.వింజమూరి సూర్యప్రకాష్ తో కలిసి తలపెట్టే ప్రతి పనిలో ఒకరి నీడ మరొకరిదిగా ,ఇరువురి అడుగుజాడలు ఒకటిగానే ప్రతీ కార్యక్రమం నిర్వహించటం అపురూపమైనదిగా
ఉంటుంది.
డా.సామవేదం వెంకట కామేశ్వరి గారు అపురూప పురస్కారం అందుకుంటున్న సందర్భంగా మనసారా అభినందనలు తెలియజేస్తున్నాను.
8, ఏప్రిల్ 2025, మంగళవారం
ఆనందమయదేశంలో నేను
ఆనందమయదేశంలో నేను
"పుడమి నెల్ల లవలేశము విడువక తిరగాలి.
అడుగడుగున ఆగి ఆగి అరసి అరసి చూడాలి"
విన్నప్పటి నుండి, చిన్నప్పటి నుండి పాడుకుంటున్నప్పుడల్లా ఇలానే అనుకునేదాన్ని
ఈ విధంగా రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో అన్ని ప్రదేశాలనూ వెళ్ళి చూస్తే ఎంత బాగుంటుందో అని. అదంతా ఎప్పుడైనా వెళ్తానేమోననే ఆశ. తీరా పెళ్ళయ్యి వెళ్ళేలోపున విజయనగరంలో పుట్టిపెరిగిన నేను, విజయనగరం చుట్టుపట్ల ఏప్రాంతం చూడలేదు. ఆఖరికి విశాఖసముద్రాన్ని, బీచిని కూడా నేటికీ చూడలేదు. ఆపక్కగా రోడ్డుమీదుగా వాహనంలో వెళ్తునే చూడటమే తప్ప.
వివాహానంతరం హైదరాబాదు వచ్చాక భువనేశ్వర్ లో వున్న ఆడబడుచు ఇంటి కెళ్ళినపుడు కోణార్క్, తర్వాత మరో పది పదిహేనేళ్ళకి మద్రాస్ చూసాను. కాని ఆ అనుభవాలు రాయనే లేదు..
నేను ఆర్టీసీ హైస్కూలులో ఉపాధ్యాయినిగా చేరిన తర్వాత ఆర్టీసీ యాజమాన్యంగా నడిచే పాఠశాల కనుక ప్రతి ఏడాదీ మా పాఠశాల పిల్లలని టూరుకి తీసుకు వెళ్ళమని రెండు బస్సులు , నలుగురు డ్రైవర్లను ఉచితంగా ఏర్పాటు చేసేవారు.
ఇక అప్పుడు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు స్కూలు పిల్లలతో బాటూ వెళ్ళాను. విద్యార్థులు బాధ్యత వలన చూడటం అయితే చూసాను.ఆ అనుభూతులూ రికార్డు చేసుకోలేదు.
పిరమిడ్ ధ్యాన కేంద్రంలో మంచి మెడిటేటర్ ఐన స్నేహితురాలు ఉమ తరుచూ దేశ విదేశాల్లోని ప్రధానంగా బౌద్ధ కేంద్రాలకు వాళ్ళకు చెందిన టూర్ నిర్వాహకులతో వెళ్తుంటుంది.ఈ సారి ఎప్పుడైనా కుదిరినప్పుడు నేనూ వస్తానన్నంధుకు
మార్చిలో నిర్ణయించిన భూటాన్ పర్యాటనకు పావులు కదిలాయి.
హైదరాబాద్ నుండి కలకత్తాకు ఉమ మా ఇద్దరికీ ఫ్లైట్ టికెట్లు బుక్ చేయించింది.
అయితే నా పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయ్యింది.ఎట్లా అని ప్రశ్నిస్తే ఓటర్ ఐడీఅయినాపర్వాలేదని ట్రావెల్స్ వారన్నారు.అయినా అది కుదరకపోతే నాకు ఇబ్బంది అవుతుందని మా అమ్మాయి పాస్పోర్ట్ రెన్యువల్ కి అప్లై చేసింది. అనుకోకుండా నెలలోనే నాకు పాస్పోర్ట్ కూడా వచ్చేసరికి హాయిగా వూపిరి పీల్చుకున్నాను.
మార్చి మూడు తెల్లవారుజామున మూడు గంటలకు ఉమా నన్ను పికప్ చేసుకోగా ఎయిర్ పోర్ట్ కి బయల్దేరాను.చెన్నైలో దిగి మరో ఫ్లైట్ ఎక్కి మధ్యాహ్నం రెండింటికి బాగ్ డోగ్రా ఎయిర్పోర్ట్ చేరాము.వేర్వేరు ఫ్లైట్ లలో మొత్తం మా బేచ్ నలభయ్యారు మందినీ కలిసాము.అందులో ఇద్దరు పదిపన్నెండేళ్ళ పిల్లలు.అక్కా ఇద్దరుతమ్ముళ్ళు 18-20 ఏళ్ళ వాళ్ళు.మిగతా అందరూ 40-75 మధ్యవయస్కులే.
ఎయిర్పోర్ట్ దగ్గర బస్ ఏర్పాటు చేసి .ఆరుగంటలకు పైగా ప్రయాణం చేసి భూటాన్ బోర్డర్ టౌన్ ఫుట్షిలోంగ్ తీసుకువచ్చారు. Tara phendeyling hotel లో మా బస. ఈ టౌన్ పశ్చిమ బెంగాల్ లోని జైగాం పట్టణాన్ని ఆనుకొని ఉంటుంది. అక్కడికి వచ్చేటప్పటికే కొంచెం చీకటి పడుతూ ఉంది హోటల్ అయితే చాలా నీట్ గా క్లీన్ గా ఉంది. మేము పెద్దవాళ్ళమని మాకు క్రింద రూములే కేటాయించారు.
భూటాన్ కౌన్సిలేట్ సమయం అయిపోవటం వల్ల మా పాస్పోర్ట్ లు చెక్ చేసి మర్నాడు ఉదయం తొమ్మిది గంటలకు వచ్చి స్టాంపింగ్ చేసుకోవాలన్నారు.బోర్డర్లో పాస్పోర్ట్ గాని, మన ఇండియన్ ఓటర్ ఐడి గాని చూపిస్తే సరిపోతుంది.
ఆ కౌన్సిలేట్ లోకి అడుగు పెట్టగానే నాకు కళ్ళు చెదిరాయి.స్థంభాలూ,వాసాలూ,ద్వారాలూ అన్నీ చెక్కతో చేసినవి .వాటికి ఎరుపురంగుపై తెలుపు,పసుపూ,నీలి రంగులతో అందంగా చిత్రాతి చిత్రంగా వేసిన డిజైన్లు చూపుల్ని కట్టి పడేసాయి.వాటిని ఫోటోలో బంధించాలని ఆశతో చీకటిలోనే ఫొటోలుతీసాను.ఆ తర్వాత అన్ని హొటల్స్ లోనూ, దారి పొడవునా ఇళ్ళు గోడలమీదా,ఘాట్ రోడ్డులో గల కొండగోడలమీదా భూటాన్ సాంప్రదాయ చిత్రాలు కనువిందు చేస్తూనే వున్నాయి.అవి భూటానీయుల సాంప్రదాయ కళని నేటికీ కాపాడుకోవటం ఆనందం కలిగించింది.
మా యోగీ ట్రావెల్స్ గణేష్,నవకాంత్ డిన్నర్ కీ ముందు పరిచయ సమావేశం ఏర్పాటు చేసారు.అందరూ పిరమిడ్ ధ్యానం పట్ల ఎలా ఆకర్షితులయ్యారో వారివారి అనుభవాలు తెలియజేసారు.
"నాకు సంగీతం, సాహిత్యం మాత్రమే ఒత్తిడి నుండి విశ్రాంతిని ఇస్తాయి.నేనూ ఉమా నలభై ఏళ్ళుగా స్నేహితులం,సహోద్యోగులం. నేను మెడిటేడర్ని కాదు." అని మాత్రమే చెప్పాను. ఉమా నన్ను కోప్పడి నా గురించి వివరాలన్నీ చెప్పి గూగుల్ లో శీలా సుభద్రాదేవి పేరుతో సెర్చ్ చేస్తే ఈమె గురించి తెలుస్తాయి.నిజానికి సుభద్ర నిత్యమూ ధ్యానంలో వున్నట్లు సంగీతం,సాహిత్యాలతోనే వుంటుంది " అని పరిచయం చేసింది.అందరూ నా విశేషాలు తెలుసుకోవాలని నాతో కబుర్లు చెప్పారు.తర్వాత డిన్నర్ చేసి నిద్రకి వుపక్రమించాము.
ఉదయమే తయారై క్రింద హాల్ కి వెళ్ళేసరికి గణేష్ వేణువుతో భూపాల రాగాన్ని ఆలాపన చేసి తర్వాత అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు కీర్తనలు వాయించాడు.
మంచు తెరలని చీల్చుకుంటూ లేత కిరణాలు భూమి తల్లిని ముద్దాడుతోన్న ఆ చలి వుదయాన
శృతి బద్ధమైన భూపాలరాగాన్ని వింటుంటే పారవశ్యంతో మనసు నిండిపోయింది.అందరూ కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తుంటే నాకు తెలియకుండానే కళ్ళు మూతలుపడి ఆ రాగ జలధిలో ఓలలాడాను.
బ్రేక్ఫాస్ట్ తర్వాత భూటాన్ ఎంబసీ లో అందరివీ స్టాంపింగ్ అయ్యేసరికి పది దాటింది.అందరి స్టాంపింగ్ అయ్యాక ఎంబసీ ఆయన వచ్చి మా నలభై ఆరుమందికీ ఒక్కొక్కరికి భూటాన్ సాంప్రదాయ షాల్ కప్పి భూటాన్ కి స్వాగతించటం ఒక కొత్త సాంప్రదాయంగా, ఆత్మీయంగా అనిపించింది.
ఇక్కడ భూటాన్ కరెన్సీ, ఇండియన్ కరెన్సీ రెండింటి విలువా ఒకటే కావటాన రెండూ నడుస్తాయి. అందుచేత మేము కరెన్సీ మార్చుకోలేదు గానీ నేను దాచుకోటానికని సేకరించుకున్నాను.
మాకు ఏర్పాటు చేసిన మూడు వేనుల్లో నలభై ఆరు ముందే కాక ప్రతీ వేనుకు ఒక గైడ్ ని కేటాయించారు.మా గైడ్ పేరు వాచ్య్సూ అంటే గ్రేట్ రివర్ అని తన పేరుకి అర్థం చెప్పాడు.థింపూలో తన పేరుతో నది వుందని చూపిస్తానని కూడా అన్నాడు.మన దేశంలో నదులపేర్లని ముఖ్యంగా ఆడపిల్లలకే పెడతాం కదా.నాకు ఆశ్చర్యం కలిగింది.
ఆ రాత్రి మా హొటల్ కిటికీలోంచి కనిపిస్తోన్న "వెల్కమ్ థింపూ" అన్న అక్షరాలతో వున్న ఎత్తైన స్వాగతద్వారం ఎంత కళాత్మకంగా వుందో దానిని పగలు వెల్తుర్లోనేకాక రాత్రి దీపాల వెల్తురులో కూడా ఎన్నో ఫొటోలు తీసుకున్నాను.తర్వాత గమనిస్తే ప్రతీ నగరం స్వాగతతోరణాలూ అంత అందంగానే వున్నాయి.భూటానీయులు మంచి కళాహృదయులు అనిపించింది.
హొటల్స్ లో అన్ని రకాల పనులూ చేసే అమ్మాయిలందరూ చాలా అందంగానే కాక చాలా చురుకుగా వున్నారు. ,గైడుల్లా,ఇతరేతర పనులు చేస్తున్న వారందరూ యువకులే.ఇక రోడ్డుమీద ఒక చిన్న కాగితం గాని,ఒక ఆకు గానీ లేకుండా శుభ్రపరుస్తున్న వాళ్ళు కూడా యువకులే.చదువుకుంటున్న పిల్లలే పార్ట్ టైమ్ లో పనులు చేస్తుంటారుట.వాటికి వాళ్ళకు క్రెడిట్ పాయింట్లు వుంటాయని మా గైడ్ చెప్పాడు.
అర్థరాత్రి వరకూ యూట్యూబ్లూ,సినీమాలుచూస్తూ పగలు పొద్దెక్కేదాకా నిద్రపోయే బాధ్యత తెలియని మన పిల్లలు గుర్తు వచ్చారు.
ఎక్కడ చూసినా భూటానీయుల కంటే చూడటానికి వచ్చినవారే ఎక్కువ . భూటాన్ జనాభా మొత్తం కలిపినా ఎనిమిదిన్నర లక్షల కంటే మించరని తెలిసింది.
మరొకటి చిన్నపిల్లల దగ్గరనుండి ప్రజలంతా బయటకు వస్తే వారి సాంప్రదాయ దుస్తులనే ధరించాలట.ఇంట్లో మాత్రమే ఫేంటూ టీషర్ట్ చేసుకుంటామని గైడ్ చెప్పాడు.
విద్యా, వైద్యం వుచితమేనట.మరొకటి మనదేశంలో వీధికి పది రకాల క్లినిక్ లు కనిపిస్తాయి.వారం రోజుల మా ప్రయాణంలో ఎక్కడా మందుల షాపు గానీ,
క్లినిక్స్ గానీ కనిపించలేదు.ఒక దగ్గర మాత్రమే ప్రభుత్వ హాస్పిటల్ కనిపించింది.మరీ సీరియస్ జబ్బులైతే కలకత్తాకి తీసుకు వెళ్తారన్నాడు.
స్వచ్ఛమైన గాలీ,నీరు ఆహ్లాదకరమైన ఆ వాతావరణంలో చాలావరకూ ఆరోగ్యంగా వుంటారేమో.ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా పెద్దలు.అందువల్ల ఆనందంగా కూడా వుంటారనుకుంటాను.అందుకేనేమో భూటాన్ ను ఆనందమయదేశం అంటారు.
థింఫూలో ప్రపంచంలోనే అతిపెద్ద బుద్ధ విగ్రహాలలో ఒకటైన బుద్ధ డోడన్మా మందిరాన్ని సందర్శించాం.
మందిరం లోపల బుద్ధుడు, బుద్ధుడికి చెందిన ముఖ్య అనుయాయుల విగ్రహాలు ఉన్నాయి. మరో ముఖ్య విశేషం అందరం లోపలకి అడుగుపెట్టేసరికి అద్భుత స్వర్ణ దృశ్యం కళ్ళు మిరుమిట్లు గొలిపాయి !!!నాలుగు గోడల చుట్టూ లక్షా పాతిక వేలకు పైగా బుద్ధ విగ్రహాలున్నాయి. బంగారు బొమ్మలకొలువులా చిన్నచిన్న బుద్ధ విగ్రహాలు షోకేసుల్లో అమర్చి ఉంచారు. ఎనిమిది ఇంచుల బుద్ధ విగ్రహాలు లక్షా,పన్నెండు ఇంచ్ ల బుద్ధ విగ్రహాలు పాతికవేలు వున్నాయన్నారు.ఇవి మిరుమిట్లు గొలిపే బంగారుపూత పూసిన కాంస్య విగ్రహాలు. కొందరు అక్కడ విగ్రహం పెడతామని మొక్కుకుంటారట.
ఈ మందిరం పైనగల 177 అడుగులు లేదా 54 మీటర్ల ఎత్తు ఉన్న భారీ బుద్ధ విగ్రహం చాలా దూరం నుండి కనిపిస్తూ హృదయాన్ని పట్టి దగ్గరకు ఆకర్షిస్తుంది.ఈ మందిరం భూటాన్ రాజు జిగ్మే సింగే వాంగ్ చుక్ తన 60వ జన్మదినం సందర్భంగా నిర్మించాలని 2006లో మొదలుపెట్టి 2017నాటికి పూర్తిచేసారట. ప్రపంచంలోనే అతిపెద్ద బౌద్ధ స్తూపాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఈ మహా బౌద్ధాలయం సొబగు ప్రత్యక్షంగా చూడవలసిందే తప్ప వర్ణించడం అసాధ్యం.మందిరం చుట్టూ ఆవరణలో కూడా బంగారురంగు నిలువెత్తు విగ్రహాలు కళ్ళు మిరుమిట్లు గొలిపేలా వున్నాయి.ఒకటి రెండు విగ్రహాల దగ్గర నేనూ ఉమా ఫొటొలు దిగాం.మందిరం చుట్టూ తిరిగి అన్ని విగ్రహాలూ ఫొటో తీసుకోవాలనుకున్నాను.కానీ మా గైడ్ తొందరపెట్టటంతో కొన్నింటిని మాత్రమే గబగబా నడుస్తూ వాటిని వీడియోగా తీసాను.
థింపూ నుంచి బయలుదేరి 17వ శతాబ్దంలో కట్టిన పునాఖ కోటకు వెళ్తూ మధ్యలో ఎత్తైన ప్రదేశం దోచులా పాస్ కి వెళ్ళాము.కొండ దారి ఘాట్ రోడ్డుపై ప్రయాణంలో పరిగెత్తే రోడ్డునూ,భయపెట్టే లోయల్ని కెమేరాలో బంధించాను. అక్కడ చాలా స్తూపాలు కట్టారు. పైన ఎత్తుగా మధ్యలో ఉన్న పెద్ద స్థూపం చుట్టూ మూడు అంతస్తులలో 108 స్తూపాల్ని మూడు లేయర్లలో కట్టారు. దాని గురించి మా గైడ్ చెప్పిన కథనం ఏమిటంటే ఆ ప్రాంతం మీదకి పరాయి ప్రాంతం వారు ఎవరో దండయాత్రకు వచ్చేరనీ,పెద్ద ఎత్తున దాడులు జరిగేయనీ చెప్పాడు. వాళ్ళని ఎదుర్కోవటానికి బుద్ధిష్టు సన్యాసులు పోరాటం చేయగా 108 మంది బౌద్ధ భిక్షువులు చనిపోయారట. వాళ్ళ స్మృతి చిహ్నంగా భూటాన్ రాణి ఈ 108 స్తూపాలు కట్టించిందని గైడ్ వివరించాడు.
అక్కడ నుండి దూరంగా కనిపిస్తోన్నకొండలు హిమాలయాలని చెప్పాడు.ఎత్తైన పర్వతాలనో,విశాల సముద్రాన్ని ఓ చూసినప్పుడే మానవుడు ఎంత అల్పజీవో అర్థమౌతుంది .మబ్బుల మేలి ముసుగు వేసుకున్న అమ్మాయిల్లా ఆ కొండల వరుసలు భలేగా అనిపించాయి.చేతులు చాపి తిరగాలనిపించేంత అందంగా వుంది ఆ ప్రదేశమంతా.అది చాలా ఎత్తైన ప్రదేశం కావటం చేత మేము వేసుకున్న స్వెట్టర్, షాల్ చలిని ఆపలేదు.మాబేగ్స్ వేన్ లో వదిలేసాము.దాంతో నేనూ ఉమా చలికి వణికి పోతూ కొంతదూరంలో కనిపించే ఇల్లు లాంటి ప్రదేశానికి కొందరు వెళ్తుంటే మేమూ వెళ్ళాం.అది ఒక చిన్న కేఫిటేరియా.టీ తాగుతుంటే చలిపోతుంది కాని పర్సులు ఆక్షణంలో మా దగ్గర లేవు.అంతలో అక్కడ మా గ్రూపుకు కోఆర్డినేటర్ గా పని చేస్తున్న సప్న కనిపించి మేము చలికి వణుకుతుండటం చూసి మాకు టీ ఇప్పించింది.ఆ క్షణంలో ఆ అమ్మాయి దేవతలా కనిపించింది.తర్వాత మేము డబ్బు ఇవ్వబోతే "అమ్మ దగ్గర డబ్బు తీసుకోకూడదు" అని అంది.తర్వాత రూమ్ కి వెళ్ళాక మేము తెచ్చుకున్న కరాచీ బిస్కెట్లు పేకెట్ ఆమెకి ఇవ్లబోతే సప్న మొగమాటపడుతుంటే ' అమ్మ ఇచ్చినప్పుడు వద్దనకూడదు' అన్నాము.ఆ అమ్మాయి నవ్వి తీసుకుంది .
పునాఖా కోట మధ్యలో ఉన్న బౌద్ధ మందిరాన్ని చూడడానికి లోపలికి వెళ్ళేసరికి అర్థనిమీలితనేత్రుడైన అతి పెద్ద బుద్ధ విగ్రహం అద్భుతంగా నన్ను ఆకట్టుకుంది.మనం ఎటు నుండి చూసినా మనపైనే శాంతి నిండిన దృక్కులను ప్రసరిస్తున్నట్లుగా వున్నాయి. ఆయనకు రెండువైపులా బౌద్ధ ప్రముఖుల విగ్రహాలు, ఆ విగ్రహాలకు ముందు బుద్ధుని ప్రముఖ శిష్యుల విగ్రహాలు ఉన్నాయి.మా గ్రూపులో అందరూ అక్కడ కూర్చొని కాసేపు ధ్యానం చేసారు.కానీ నేను మాత్రం లోపల ఫొటోలు తీయటం నిషేధం కనుక ఆ సౌందర్యమూర్తిని నా కళ్ళ నిండా నింపుకున్నాను .ఇక గోడలచుట్టూ అద్భుతమైన చిత్రాలు వున్నాయి.అయితే లైటింగ్ ఎక్కువగా లేదు.లైట్ వలన ఆ చిత్రాల రంగులు వెలిసి పోతాయని లైట్లు అమర్చలేదన్నారు గైడ్. మా సెల్ఫోన్ లైట్ లో చూసే ఆ నైపుణ్యానికి మైమరచిపోయాను.ఇక్కడ ప్రతీ మందిరంలోనూ బౌద్ధ రూపాలు రెండు మూడు తలలతో భయంకరంగా కనిపిస్తాయి.అవి మనిషిలో నిక్షిప్తంగా వున్న చెడు ఆలోచనలకు ప్రతిరూపమని గైడ్ అన్నాడు. కోట మధ్యలో ఒక విశాలమైన బోధి వృక్షం ఉంది. ఈ Punakha Gzong అనే కోటను 17వ శతాబ్దంలో నిర్మించారుట.
గైడ్ కోటచరిత్ర గురించి చాలా విషయాలు తెలియజేసాడు పునాఖ -వాంగ్ డ్యూ రెండు నదులు కలిసే చోట భూటాన్ లో రెండో అతిపెద్ద కోటగా నిర్మించారట. దీన్నే మేజెస్టిక్ ఫోర్ట్రెస్ అని అంటారనీ, ఇందులో బుద్ధ అవశేషం భద్రపరచారనీ, దానికోసం టిబెటన్లకి.. భూటానీయులకీ మధ్య చాలా యుద్ధాలు జరిగాయని చెప్పాడు. మొదట్లో ఇదే రాజధానిగా వుండేదనీ,ఈ యుద్ధాల వలన సెక్యూరిటీ దృష్ట్యా రాజధానిని థింఫూకి మార్చారట.
ఇప్పుడు ఈ కోటలో ఎక్కడెక్కడ నుంచో బౌద్ధ గురువులు, భిక్షువులు ఇక్కడికి వచ్చి ఇక్కడ కొంతకాలం ఏకాంత జీవనం సాగిస్తారు. కోట చుట్టూ పై అంతస్తులలో వారికి ప్రత్యేకమైన గదులు ఉన్నాయి.కొందరు పై అంతస్తుకు వెళ్ళబోతుంటే వాళ్ళని గైడ్ మందలించాడు. దగ్గరలో ఏదో ఫెస్టివల్ వుందంట అందుకోసం కొందరు బౌద్ధ భిక్షువులు ప్రాక్టీస్ చేస్తున్న సమూహ నృత్యం కాసేపు అక్కడే కూర్చుని చూసాము.ఆ నృత్యాన్ని వీడియో తీసాను.
ఆ తర్వాత భూటాన్ రాజధాని థెంపు పర్యాటన ముగించుకొని ఆ రాత్రికి మరో నగరం ‘పారో’ చేరాము. పారోలో మరో హోటల్లో వసతి ఏర్పాటైంది.ఆ చలి వాతావరణంలో రెండు రాత్రులు ఉన్నాం.ఒక రాత్రి కేంప్ ఫైర్ ఏర్పాటు చేసి అందరూ వాటి చుట్టూ కేరింతలు కొడుతూ తెలుగు,హింది పాటలకు నృత్యాలు చేసారు.మేమూ వాళ్ళతో కాసేపు అడుగులు కలిపాము.
భూటాన్ జాతీయ జంతువు టాకిన్ ను చూపిస్తామని తీసుకువెళ్ళారు.హిమాలయన్ జంతువు టాకిన్ ముఖం మేకలా వుంటుంది మిగతా శరీరం బర్రెలా వుంటుంది.వాటి సంఖ్య తగ్గిపోతుండటంవలన సంరక్షణ చేస్తున్నారని గైడ్ అన్నాడు.సంరక్షణ స్థలంలో టాకిన్లు పది పదిహేను కన్నా ఎక్కువ లేవు.వీటిని చూడటానికి ఎంట్రెన్స్ ఫీజు మూడు వందలు .దాంతో చాలా మంది విసుక్కున్నారు.ఇక్కడ ప్రతీ టూరిస్ట్ స్థలం దగ్గరా ఎంట్రీ టికెట్ అయిదువందలకు తక్కువ లేదు.భూటాన్ కు ప్రధాన ఆదాయ వనరు టూరిజమే.అదీకాక కొండ,ఘాట్ రోడ్లే కనుక కొన్ని నెలలు మాత్రమే టూరిస్టుల తాకిడి వుంటుంది.
ఇక్కడ చిన్నవిమానాశ్రయం కూడా ఉంది. కానీ ఇది కొండల మధ్య ఉంది కాబట్టి అన్ని ప్రాంతాల నుండీ వచ్చే అవకాశం లేదు కేవలం ఢిల్లీకి మాత్రమే రాకపోకలకు విమానాలు ఉన్నాయిట.
మరో ముఖ్యమైన ప్రదేశం భూటాన్ లో ప్రసిద్ధి చెందిన టైగర్స్ నెస్ట్ మొనాస్టరీ. సుమారు ఐదు కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసి అక్కడికి చేరుకోవాలి. భూటాన్ లో పారో కి 3 వేల మీటర్లు ఎత్తునఈ టైగర్స్ నెస్ట్ మొనాస్టరీ ప్రత్యేక ఆకర్షణ. ఈ బుద్ధిష్టు మొనాస్టరీని 17వ శతాబ్దంలో కట్టారని చెప్తున్నారు.
బౌద్ధ మొనాస్టరీని ఎంత ఇష్టమైనా ఆ పర్వత శ్రేణులను చేరుకోవడం చాలా కష్టమైన ఇష్టమైన పని. భూటాన్ లో అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఆ బౌద్ధ విహారాన్ని చేరుకోవడానికి ట్రెకింగ్ చేయాలి.
నాకు బీపి వుంది.అందుకని అంత ఎత్తు ట్రెక్కింగ్ చేయటానికి సాహసించలేదు.ఉమాకూడా వద్దంది. అందుకనీ ఆ పర్వతం మొదలు వరకూ వెళ్ళి మిగతావారు పైకి ఎక్కడం కనిపించే వరకూ వున్నాము.అక్కడ చెట్లు పొడవుగా ఆకాశాన్ని ముద్దుపెట్టటానికి సాగుతున్నాయా అనిపించేలా వున్నాయి.
అన్ని బౌద్ధ మొనాస్టరీలు కూడా ఎత్తుగా వుండే పెద్దపెద్ద మెట్లు ఎక్కి వెళ్ళాల్సినవే.అవి కూడా ట్రెక్కింగ్ చేసినంత పని అవుతోంది.గైడ్ గానీ,బౌద్దబిక్షువులుగానీ మాకు చేయందించటానికి చూసేవారు.నాకు యోగా, వాకింగ్ అలవాటు మీద బాగానే మెట్లు ఎక్కిదిగేదాన్ని.నా కన్నా చిన్నదే ఐనా ఉమ కొంచెం ఇబ్బంది పడేది.మరొక విశేషం ఇక్కడ హొటల్స్ లో కానీ,ఇళ్ళల్లోగానీ లిఫ్టులు ఉండవట.గైడ్ చెప్పాడు.అంతేకాదు ఉమా వయసు అడిగి " మా అమ్మకి కూడా డెభ్భై ఏళ్ళు.ఇంటిపని పొలం పనీ అన్ని ఆమే చేస్తుంది.మీ లాగే డెభ్భై ఏళ్ళే కదా మేడం" అన్నాడు మా గైడ్.
మేమిద్దరం ఆశ్చర్యపోయాం.అరవై ఏళ్ళు దాటి రిటైర్ కాగానే ఇంకేమీ చేయలేం అన్నట్లు కొందరు చతికిల పడిపోతారు.ఇతను ఎంత కేజువల్ గా అన్నాడు అనుకున్నాం.
తర్వాత ట్రెక్కింగ్ చేయని వారందరినీ ఒకే వేను ఎక్కించి ఒక మ్యూజియంకి తీసుకువెళ్ళారు.అక్కడ అన్ని మ్యూజియం లాగే భూటాన్ చరిత్ర,వస్తువులూ వున్నాయి.
తర్వాత రోజు మమ్మల్ని వాచ్యూ నది ఒడ్డుకు తీసుకు వెళ్ళారు.ఆసక్తి వున్న వాళ్ళంతా రివర్ రాఫ్టింగ్ చేయటానికి వెళ్ళారు.వాళ్ళంతా వచ్చేవరకూ మేము ఆ చుట్టుపట్ల మెల్లగా నడుస్తూ ఫొటోలు తీసుకుంటూ తిరిగాము. నీటి ప్రవాహం చాలా పారదర్శకంగా సూది పడినా కనిపించేలా వుంది. ఆ నీటి ప్రవాహం వలన నున్నగా అయిన తెల్లని గులకరాళ్ళను ఏరుకున్నాము.తర్వాత నది ఒడ్డునే ఏర్పాటు చేసిన చక్కని విందు చేసాక షాపింగ్ కు తీసుకు వెళ్ళారు.
మా ఇంట్లో నాలుగైదు రకాల బుద్ధ విగ్రహాలున్నా సరే జపానీస్ స్టైల్లో వుండే బుద్ధ విగ్రహం దొరుకుతే కొందామని చూసాను.చాలా పెద్దవే తప్ప చిన్నసైజులో దొరకలేదు.పాలరాతి ధ్యాన బుద్ధవిగ్రహం కొన్నాను.మనవరాలికోసం పూసలు దండలు, ష్టోల్,అమ్మాయికి చిన్న పర్స్ తప్ప ఏమీ తీసుకోలేదు.రూంకి వచ్చాక మా సామానులన్ని సర్దేసుకున్నాం.
ఆ మర్నాడు చీకటిలోనే లేచి తయారై పోయాము.మాకు బ్రేక్ఫాస్ట్ గా పుచ్చకాయ ముక్కలూ, బ్రెడ్ ఫేక్ చేసి ప్రతి ఒక్కరికీ ఇచ్చారు.మేమువున్న హొటల్ నుండి ఫర్లాంగు దూరంలో బోర్డర్ వరకు నడిచాము.భూటాన్కి ఆత్మీయంగా బైబై చెప్పి బోర్డరు దాటి ఒక్కసారిగా వుసూరుమన్నాము.గిల్టీగా ఫీలయ్యాను.ఎందుకో తెలుసా బోర్డరు అవతల అద్దంలా పరిశుభ్రమైన అందమైన భూటాన్.
బోర్డరు దాటగానే వరుసగా టిఫిన్ బండ్లూ, వాటి చుట్టూ తింటున్న మనుషులూ,తిని పడేసే పేపరుప్లేట్లలో మిగిలినవాటికోసం కుక్కలూ,పశువులూ అంతా అపరిశుభ్రమైన వాతావరణం.
బిస్కెట్లుతిని ఖాళీకవరు భద్రంగా హేండు బేగులో దాచుకున్న తోటి ప్రయాణికులు బోర్డర్ దాటగానే రోడ్డుపై విసిరేసారు.
మన దేశం పరిశుభ్రంగా ఎప్పడౌతుందో కదా?
అంతకన్నా ముందుగా మనమెప్పుడు శుభ్రత పాటిస్తామో కదా?ఆలోచనలతోనే బస్సులో బాగ్డోగ్రా చేరి హైదరాబాద్ కి వెళ్ళే ఫ్లైట్ ఎక్కాము.
2, ఏప్రిల్ 2025, బుధవారం
నడక దారిలో -51
నడక దారిలో -51
సంక్రాంతి వెళ్ళాక మూడు వారాల సెలవు పూర్తిచేసి స్కూల్ లో జాయిన్ అయిపోయాను.కేటరాక్ట్ అయినా కంటికి స్కూల్ లోనే డ్రాప్స్ వేసుకుంటూ కోర్సు పూర్తిచేసి కొత్త కళ్ళద్దాలు మార్చుకున్నాను.
కానీ అప్పటికే ఎండలు తీవ్రం కావటం , స్కూల్ లో పరీక్షల సమయం దగ్గర కావటం కొంత వత్తిడికి గురౌతూనే వున్నాను. నేను చేర్చిన కల్పన నా క్లాసుల్ని కొన్ని చూసుకోవటం కొంత నయంగానే వుంది.
ఒకరోజు డా.భార్గవీరావు, ఇంద్రగంటి జానకీ బాల,అత్తలూరి విజయలక్ష్మి అప్పుడప్పుడు డి.సుజాతాదేవి ఇంటిదగ్గరగానీ,మా యింట్లో గానీ,ఇలా ఎవరో ఒకరి ఇంట్లో కలుస్తూ వుండేవాళ్ళం.సుజాత అప్పట్లో ఆంధ్ర మహిళా సభ సాక్షరతాభవన్ లో పనిచేస్తూ వుండేది..
సాహిత్యం గురించి మాట్లాడుకోవటమో ,పాటలు పాడుకోవడమో చేస్తుండే వాళ్ళం.
ఒకసారి అందరం కలిసి పాపికొండలకు వెళ్దామా అని అనుకున్నాం.అయితే నాకు కేటరాక్ట్ జరిగి రెండు నెలలే అయ్యింది.ఎండల్లో తిరిగితే కష్టమేమో అని భయపడినా వెళ్ళటానికే నిశ్చయించుకున్నాను.
గౌతమీ ఎక్స్ ప్రెస్ లో రిజర్వేషన్ చేయించుకుని బయలుదేరాము.మేము అయిదుగురమే కాకుండా మాతో నాటకనటుడే కాక లలితకళాతోరణంలో రేడియో,సినీ,నాటక నటనలో శిక్షణతరగతులు నిర్వహించే దీక్షితులుగారి భార్య చిత్రలేఖ కూడా మాతో బయలు దేరారు.చిత్రలేఖ భార్గవీరావుకీ,విజయలక్ష్మికీ మంచి మిత్రులు.అయినా మా అందరితో కలివిడిగా కలిసిపోయారు.మర్నాడు ఉదయమే రాజమండ్రిలో దిగాము. సుజాతాదేవి కూతురు కమల,అల్లుడు డా.మధు రాజమండ్రిలోనే వుంటారు.స్టేషన్ కు వచ్చి మమ్మల్ని పికప్ చేసుకుని వాళ్ళింటికి తీసుకు వెళ్ళారు.
కమల తయారు చేసిన పలహారాలు తిని పాపికొండలుకు బయలుదేరాము.లాంచ్ ఎక్కిన తర్వాత కొంతసేపు గోదావరీ తరంగాలలో మైమరచిపోయాము.నేను తెచ్చిన కెమేరాలో గోదావరి అందాలనే కాక మిత్రులం కూడా చాలా ఫొటోలు తీసుకున్నాం.తర్వాత లాంచ్ లో వున్న వారందరినీ పాటలు పాడమని అడుగుతే చాలామంది పాడారు.నేను కూడా ఒకటి రెండు ఎంకి పాటలు పాడాను.
పేరంటాలు పల్లెలో లాంచ్ దిగాము కానీ కచ్చా దారిలో ఇసుక వలన నడవలేక విజయలక్ష్మి తప్ప మేము పైవరకూ వెళ్ళలేదు.
మధ్యలో మరో చోట ఎందువల్లో లాంచ్ ఆగింది.అక్కడేదో గుడి వుందని చెప్పి అందరూ వెళ్తుంటే మేమూ వెళ్ళాము.గుడిచూసి వస్తోంటే ఇసుకలో పాదాలు దిగబడి మెల్లగా నడుస్తున్నాము.అంతలో లాంచ్ బయలు దేరుతోందని కేకలు వినబడి పరుగు నడకతో అడుగులు వేయలేక పోతుంటే ఒక ఎడ్లబండి అబ్బాయి మా ఆరుగురినీ బండెక్కమని
లాంచ్ వరకూ తీసుకు వెళ్ళాడు.ఎడ్లబండి ఎక్కే సరికి కాళ్ళు నొప్పులు మర్చిపోయి మాకందరికీ హుషారు వచ్చి అంతా కలిసి " పరుగులు తీయాలి.గిత్తలు ఉరకలు వేయాలీ"అంటూ మల్లీశ్వరి లోని పాట అందుకున్నాము.
లాంఛ్ దిగి వస్తున్నప్పుడు ఒక కుటుంబంలో అమ్మాయి నన్ను ఆపి నేను పాడిన ఎంకి పాటల గురించి ప్రస్తావిస్తూ ఆమె నాయని సుబ్బారావుగారి దగ్గర బంధువని చెప్పింది.సుబ్బారావుగారి కుటుంబసభ్యులు ఎంకి పాటల కాపీరైట్ గురించిన తగవులు వలన ఆకాశవాణిలో ఆ పాటలు ప్రసారం కాకుండా ఆపివేయడం జరిగింది.దాంతో ఎంకి పాటలు మరుగున పడిపోయాయి.నాయని సుబ్బారావుగారు విస్మృతులు అయిపోయారనే విషయం మా మాటల్లో మరోసారి ప్రస్తావనకి వచ్చింది.
ఆ రాత్రి కమలా వాళ్ళింట్లో భోజనం చేసాక అక్కడికి నడక దూరంలోనే వున్న గోదావరి ఒడ్డున నిలిచివున్న ఒక పడవలో కూర్చుని ఆ వెన్నెల రాత్రి అందరం చాలా సేపు పాటలు పాడుకున్నాము.
కమలవాళ్ళు హాస్పిటల్ కోసం కొత్తగా తీసుకున్న ఇంటిలో వసతి ఏర్పాటు చేసారు.
మా వసతికి వెళ్ళిన తర్వాత కూడా ఆ పాటల మైకం తీరక పోవటంతో ఒక్కొక్కటే గుర్తుచేసుకుంటూ ఏ రెండుగంటలవరకో పాటలు మా ఆవరణ నిండా ఎగరేస్తూ చివరకు నిద్రలోకి జారుకున్నాం.
అలవాటు ప్రకారం ఉదయమే నాకు మెలకువ రావటంతో నా ఆనందాన్ని కవితగా మార్చాను.
మర్నాడు కారు రెంట్ కి తీసుకుని అందరం రాజమండ్రి,కడియం,బిక్కవోలు మొదలైన చుట్టుపట్ల ప్రదేశాలన్నీ చూసాం.ఆ రాత్రి తిరుగు ముఖం పట్టాం.
రెండురోజులూ ఇంటినీ,బాధ్యతల్నీ ఆలోచనల్లోకి రానీయ కుండా ఆనందంగా గడిపేసాము.ఈ ప్రయాణంతో మా అయిదుగురు మధ్య స్నేహబంధం మరింత గట్టిపడింది.
ఈ ఏడాది ఏడవ తరగతి ,పదోతరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణ బాధ్యత దగ్గర పడింది.రెగ్యులర్ గా సలీమ్ ఆటోని పెట్టుకోవటం వలన నాకు కొంత సమయం కలిసి వస్తోంది.ఎంత ఆలస్యం అయినా స్కూల్ పనులు అయ్యేవరకూ సలీం కని పెట్టుకొనే వుంటున్నాడు.
పరీక్ష ప్రశ్నపత్రాలను పోలీస్ స్టేషన్ లో భద్రపరిచే రోజు చాలా ఆలస్యం అయ్యింది.అలాగే ప్రతీరోజూ స్టేషన్ నుండి పేపర్లు తీసుకుని రావటం ,తిరిగి పరీక్ష పూర్తి అయ్యాక జవాబు పత్రాలు సీల్ చేసి పోస్టాఫీసుకి పంపించటం ఇవన్నింటికీ సలీం ఆటోనే వాడుకున్నాను.లేకపోతే ట్రాన్స్ పోర్ట్ ఖర్చు అని క్లర్కులూ,అటెండరూ ఇచ్చే బిల్లులు తప్పించుకున్నాను.
ఇంకా మేనేజ్మెంట్ గ్రాంట్లను మింగేయటానికి చూసిన రాబందుల ఆట కట్టించి హైస్కూల్ వాటా వసూలు చేసి ఫీజులు కట్టలేని పిల్లల ఫీజులకూ, స్కూల్ కి అవసరమైన వాటిని కొనటానికి వుపయోగించాను.ముఖ్యంగా ప్రాధమిక పాఠశాలని ఎప్పుడైతే హైస్కూల్ నుండి విడదీసి దానికో హెచ్చెమ్ నీ,వాళ్ళ బిల్లులు వేరని విడదీసి పెట్టారో అప్పుడే దానికి వేరు పురుగు సోకి క్రమంగా చీడ పట్టింది.ఇప్పుడు బాగుచేసే పరిస్థితి కనుచూపు మేరలో పరిష్కారం లేకపోయింది.ముఖ్యంగా గత అయిదారు ఏళ్ళలో స్కూల్ ఆర్థికంగా,విద్యావిషయకంగా మొత్తం నాశనమై పోయింది.
నేను హెచ్చెమ్ గా పనిచేసినది పదిహేను నెలలే అయినా ఇంచుమించు రెండు విద్యాసంవత్సరాలు చూసినట్లు అయింది.అకడమిక్ లోనూ, పాఠశాల నిర్వహణలోనూ గమనించినవి చూస్తుంటే ఈ విధంగా ఎన్ని పాఠశాలలు వున్నాయో
అనిపించింది.రిటైర్ అయిన తర్వాత తప్పకుండా ఇస్కూలు కతలు రాయాలి అని అప్పుడే నిర్ణయించుకున్నాను.
మొత్తం మీద నా సర్వీస్ పూర్తి చేసుకున్నాను.నా రిటైర్మెంట్ సందర్భంగా స్కూల్లో అయిదో తరగతి నుండి పదోతరగతి వరకూ విద్యార్థులు అందరికీ కంపాస్ బాక్సులూ, ఒకటి నుంచి నాలుగో తరగతి వరకూ పెన్సిల్ బాక్స్ లో పెన్సిల్,రబ్బర్,షార్పనర్ పెట్టి ఇచ్చాను.మొత్తం స్టూడెంట్సుకి బిస్కెట్ పేకెట్లు పంచాను.
పిల్లలంతా ముఖ్యంగా హైస్కూల్ పిల్లలు పెళ్లి వేదికలా స్టేజి డెకరేషన్ చేసారు.మా కుటుంబమే కాకుండా మా మరుదులూ,ఆడపడుచు కుటుంబాలు కూడా పదవీవిరమణ సమావేశానికి వచ్చారు.నా చిన్నప్పటి స్నేహితురాళ్ళు కృష్ఢకుమారీ,ఉషా కుమారీ కూడా వచ్చారు.పిల్లలు నృత్యాలు చేసారు.తర్వాత నేను ఏర్పాటు చేసిన విందు భోంచేసాము.చాలా గ్రాండుగా అంతా జరిగింది.మా సహాధ్యాయులందరికీ బహుమతులు ఇచ్చాను.
నా తర్వాత ఇన్చార్జి హెచ్చెమ్ అయిన ఉమారాణీకి అన్ని ఫైల్స్ అప్పగించి ఇన్నేళ్ళుగా నాకు ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్నీ ఏర్పడేలా ఆర్థిక స్వావలంబన కలిగించిన పాఠశాలను కళ్ళారా చూసుకొని భారమైన హృదయంతో ఇంటికి వెళ్ళాను.
ఇంకా ఆ తర్వాత పెన్షన్ పేపర్లు సబ్మిట్ చేయటం పనులు మొదలయ్యాయి.అయితే పెన్షన్ సాంక్షన్ అయ్యేటప్పటికి ఎన్నినెలలు పడుతుందో తెలియదు.
నేను ఇంట్లోనే వుంటున్నాను కనుక ఆషీని చూసుకోవటం బాధ్యత నేను తీసుకున్నాను.దాంతో వీర్రాజుగారికి కొంత వెసులుబాటు దొరికింది.అప్పటికే వచనకవిత్వంలో నవల రాయటం మొదలుపెట్టారు.1956 లో ప్రచురితమైన వెలుగుబాటలు అనే నవల వచ్చి అరవై ఏళ్ళు అయిన సందర్భంలో ఆ నవలనే బతుకు బాట పేరుతో వచనకవిత్వంలోనికి రాయటం పూర్తి చేసి ప్రచురించారు. నెలనెలా వెన్నెల పేరిట ప్రతీనెలా సాహిత్యకార్యక్రమాన్ని సి.వీ కృష్ణారావు గారి ఇంట్లో జరుగుతాయి.వారి ఇల్లు మా ఇంటికి దగ్గరే అందుకని వాళ్ళింట్లోనే పుస్తక పరిచయం ఏర్పాటు చేసారు.బతుకుబాట పుస్తకం గురించి వీర్రాజు గారు ప్రస్తావించారు.తర్వాత శంకరంగారితో సహా ఓముగ్గురు పుస్తకం గురించి మాట్లాడారు.
చాలా రోజులుగా పెద్దక్కయ్యకు ఒంట్లో బాగుండటం లేదని తెలిసినా స్కూల్ పని ఒత్తిడి వలన వెళ్ళలేక పోయాను.పదిహేనేళ్ళ క్రితం మొదలైన కేన్సర్ క్రమంగా కీమోథెరపీవలన పూర్తిగా తగ్గిపోయింది.కానీ ఇటీవల మళ్ళా తలెత్తినట్లుంది. అది తెలిసి
ఓసారి విజయనగరం వెళ్ళాలనిపించింది.
ఆమెకు ఈ ఏడాది డెభ్భై ఏళ్ళు నిండుతాయి.అమ్మ తర్వాత ఆమె నాకు పెద్దదిక్కుగా భావించాను.అంతేకాక నేను సాహిత్యరంగంలోకి రావటానికి తొలి అడుగు వేయించింది అక్కయ్యే.
అందుకే అక్కయ్యకి కట్టుకోవటానికి తేలికగా వుంటుంది అని లేత గులాబీ రంగులో లక్నో చీర కొని తీసుకు వెళ్ళి ఇచ్చాను.అక్కయ్య ఎంతో సంబరపడి ఆ రోజు వాళ్ళింటికి వచ్చిన బంధువుకి " మా చెల్లెలు నా పుట్టినరోజుకు కొని తెచ్చింది" అని చూపించింది.అది నాకెంతో సంతోషం కలిగించింది.
తిరిగి హైదరాబాద్ వచ్చేసరికి నా పెన్షన్ సేంక్షన్ అయినట్లు వుత్తరం వచ్చింది.పే & అక్కౌంట్స్
ఆఫీసుకు ఉదయం ఎనిమిది గంటలకు వెళ్ళి ఆర్డర్ తీసుకోవాలని ఉత్తరంలో వుంది.ఆ మర్నాడు వీర్రాజుగారిని సాయం తీసుకుని వెళ్ళాను.ప్రభుత్వ ఆఫీసులో సంగతి తెలిసిందే కదా.పదిగంటలకు ఆఫీస్ అయితే ఎనిమిదికే ఎందుకు వెళ్ళాలన్నారో అర్థం కాలేదు.మెల్లిగా పదిన్నర దాటాక ఒక్కొక్కరే రావటం మొదలైంది.నాకు వచ్చిన ఉత్తరం చూపించి అడుగుతే సంబంధిత ఉద్యోగి సెలవు పెట్టారన్నారు.
మర్నాడు మళ్ళా వెళితే అతను సెలవులో వున్నాడు . ఇన్చార్జిని వేసారు.అతను రావాలన్నారు. వీర్రాజుగారిని రావద్దని చెప్పి తర్వాత రోజు నేనే వెళ్ళాను.
ఎనిమిదింటికి టేబుళ్ళు తుడుస్తున్న అటెండర్ తో " ఎన్ని రోజులు ఇట్లా తిప్పుతారు.స్పష్టంగా చెప్పొచ్చు కదా " అన్నాను.
నిజానికి అప్పటికి నాకు కూడా అర్థం అయ్యింది.
ఆ రోజు సంబంధిత ఉద్యోగి వచ్చాడు.కానీ " మీరు ఈ ఏడాదికి ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ సబ్మిట్ చేస్తేనే అప్రూవల్ వస్తుంది." అని ఒక క్వెరీ వెయ్యబోయాడు.
" నాకు జీతం వచ్చినప్పుడే ఇన్కమ్ టాక్స్ పరిథిలో లేను .పదినెలలై పెన్షన్ లేదు.ఎంత వస్తుందో తెలియదు.ఎలా సబ్మిట్ చేస్తానండీ" అని ప్రశ్నించాను. ఎవరి ద్వారానో డబ్బులు ఇవ్వమని నిస్సిగ్గుగా అడిగించాడు.తప్పదుకదా ఓ వెయ్యి చేతిలో పెడితే కవర్ నా చేతిలోకి వచ్చింది.ఇదీ మన వ్యవస్థ. అది పట్టుకుని బయటకు వచ్చి ఆటో కోసం చూస్తూ ఎదురుగా చూస్తే అవినీతి నిరోధక శాఖ ఆఫీసు బోర్డు కనిపించింది.కానీ నేను అందులోనికి వెళ్ళలేదు.నా పెదాలమీద విషాదపునవ్వు తొంగిచూసింది.
ఆషీ ప్రీస్కూల్ చదువు అయిపోయింది.ఒకటోక్లాస్ లో ఎక్కడా చేర్చటమా అని ఆలోచించి రోజరీ కాన్వెంట్ యాజమాన్యం లో మూడు స్కూల్స్ ఉన్నాయి.అన్నీ మంచివే అని అక్కడ చేర్చాలనుకుంటే సీటు దొరికింది కానీ ట్రాన్స్పోర్ట్ సౌకర్యం లేదన్నారు.అలాగే అరవింద్ స్కూల్ లోనూ అదే సమస్య .ఆషీకి బ్రాంకైటిస్ వుంది.అంతదూరం ఒక్కదాన్ని ఆటోల్లో పంపటం సమస్య.లేదా నేనో వీర్రాజు గారో రోజూ వెళ్ళాలి.అదీ కష్టమే.ఆలోచనలో పడ్డాను.
అంతలో వికాస్ భారతి అనే స్కూల్ గురించి తెలిసింది.అందులో ఒత్తిడి లేకుండా.ప్రత్యేకపద్ధతిలో విద్యావిధానం వుంటుందని తెలిసింది.అది ఇంటికి దగ్గరలో వుంది.పొనుగోటి కృష్ణారెడ్డిగారు కూడా వాళ్ళ పిల్లల్ని అక్కడే చేర్చాలనుకున్నారు.సరే అని ఆషీని కూడా చేర్చాము.మొదట్లో వాళ్ళ వేనులోనే పంపాము.కానీ ఆషీకి అలా నచ్చక పేచీ పెట్టింది.అప్పటి నుండి సలీమ్ ఆటోనే మాట్లాడాము.ముందు ఆషీని స్కూల్లో దింపి తర్వాత పల్లవి అదే ఆటోలో ఆఫీస్ కి వెళ్ళిపోయేది.సాయంత్రం నేను ఆటోలో వెళ్ళి ఆషీని తీసుకు వచ్చేదాన్ని.
కానీ తర్వాతి ఏడాది ఆ స్కూల్ ఇక్కడ నుండి తీసేసి హయత్ నగర్ అవతల ఎక్కడికో మార్చారు.దాంతో మళ్ళా ముందు కేంద్రీయ విద్యాలయలో అనుకొనికూడా వెతికి దగ్గరలోని కేంబ్రిడ్జ్ స్కూల్ లో చేర్చాము.కృష్ణారెడ్డిగారు కూడా అదే స్కూల్లో తన పిల్లల్ని చేర్చారు.
ఓం రోజు అక్కయ్య అకస్మాత్తుగా కింద పడిందని వెంటనే ప్రాణం పోయిందనీ వార్త వచ్చింది.వెంటనే టికెట్ల కోసం ప్రయత్నించినా వెంటనే దొరకలేదు.ఆఖరుకు నేను ఒక్క దాన్నే వెళ్ళాను.దినాలరోజుకు పల్లవీ, వీర్రాజుగారూ వచ్చారు.అన్నయ్యలిద్దరూ అక్కయ్య కర్మకాండలకు పుట్టింటి తరపున చేయాలట.వాళ్ళేమీ పట్టించుకోలేదనేది అక్కయ్య కూతుళ్ళిద్దరినీ వాళ్ళ బంధువర్గం ఎత్తిపొడుపులు
చేసేసరికి అందరూ ముఖాలు మార్చుకున్నారు.దానికి తోడూ పునిస్త్రీగా పోయినందుకు ఏవేవో తంతులు మొదలెట్టారు.అవ్వన్నీ నాకు కొంచెం చికాకు కలిగించాయి.నిజానికి అక్కయ్యకి అవన్నీ నచ్చేవి కాదు.అంతకుముందెప్పుడు అక్కయ్య ఇంట్లో పూజలవీ చేసేవారు కాదు.చిన్నకూతురు తిరుపతిలో పిహెచ్డీ చదివి వచ్చాక ఒక గూట్లో వెంకటేశ్వరుడి విగ్రహం పెట్టి దీపం వెలిగించడం మొదలుపెట్టిందని అక్కయ్య ఒకసారి వెళ్ళినప్పుడు చూపించి నాతో చెప్పింది.
ఎలా అయితేనేం కర్మకాండలన్నీ బతికున్న వారి ఇష్టప్రకారం సంప్రదాయ సిద్ధంగా జరిగాయి.
నాకు ఇష్టం వున్నా లేకున్నా చేయి కలపక తప్పలేదు.
పుట్టిన దగ్గర్నుంచి ఆడవాళ్ళకి జరిపే తంతులన్నీ ఇబ్బంది పెట్టేవే.భర్త పోయినా ఆమెకే ఆమె పోయినా ఆమె దేహానికే.అవి నా మనసులో పెట్టిన కలత తర్వాత నేను రాసిన నీడల చెట్టు నవలలో కూడా అక్షరబద్ధం చేసాను.
- శీలా సుభద్రాదేవి
నడక దారిలో -50
నడక దారిలో -50
ఆషీ ఆటలో భాగంగా కూర్చున్నప్పుడు వెనుక చేరి మెడ చూట్టూ చేతులు వేసి గూగూలు ఆడటం వలనేమో సడన్ గా నాకు స్పాండిలైటిస్ వచ్చింది.ఇంక స్కూల్ లోకూడా పేపర్లూ, పుస్తకాలు దిద్దటం వీటన్నిటితో అంతకంతకూ బాగా ఎక్కువైపోయింది.అల్లోపతీ మందులే కాక ఫిజియోథెరపీ చేయించుకున్నా తగ్గలేదు."మెడకి కాలర్ తప్పని సరిగా పెట్టుకోవాలి అది మీ శరీరంలో ఒక పార్ట్ అనుకోవాల్సిందే "అన్నాడు న్యూరోఫిజీషిన్ .
ఆయుర్వేద నూనెలు రాసుకున్నా ఫలితం లేదు.రాత్రిపూట నిద్ర కూడా పట్టేది కాదు.
హోమియో మందులు బాగా పనిచేస్తాయి అంటే అవి మొదలెట్టాను.స్పాట్ వేల్యుయేషన్ లో ఒక మాష్టారు స్పాండిలైటిస్ కి ఎక్సర్సైజెస్ బాగా పనిచేస్తాయని ఎలా చేయాలో కొన్ని చెప్పారు.ఏది పని చేసిందో కాని మొత్తం మీద నాకు చాలా వరకూ ఉపశమనం కలిగింది.
విజయలక్ష్మి తర్వాత నేను హెచ్చమ్ ను అయ్యాను .నాకూ సర్వీసు తక్కువే ఒకటిన్నర సంవత్సరాలు కూడా లేదు.కానీ నేనున్నన్ని రోజులైనా స్కూల్ కి కొంతైనా చేయాలని నా ఆలోచన.కానీ పురుగు పట్టిన చెట్టుని సంరక్షించడం అంత సులభం కాదని నాకీ అనుభవంలో తెలిసి వచ్చింది.
నా దురదృష్టం కొద్దీ నాకు హెచ్చెమ్ అప్రూవల్ కి డ్రాఫ్టింగ్ అయ్యి కరెస్పాండెంట్, చైర్మన్ ల సంతకాలై డిపార్ట్మెంట్ పంపించాము.కానీ అంతకు ఒక్కరోజు ముందే ఎయిడెడ్ పాఠశాలల్లో రిక్రూట్మెంట్,ప్రమోషన్స్ చేయటానికి వీల్లేదని ప్రభుత్వం స్టే ఇచ్చింది.ఇంకేం చేస్తాను.చేసేది టీచర్ గా,హెచ్చెమ్ గా చాకిరీ మాత్రమే మిగిలింది.ఇన్ఛార్జ్ హెచ్చెమ్ గానే సర్వీసు కొనసాగటమే అయ్యింది.
నేను ఛార్జ్ తీసుకున్న వెంటనే మా స్కూల్ సెక్రటరీ విజయలక్ష్మిగారిని కలిసి స్కూల్ పరిస్థితులు వివరించాను.వీలుంటే స్కూలుకి తరచూ వస్తుంటే బాగుంటుంది అని కూడా చెప్పాను.ఈ ఏడాదికి మాస్కూల్ ప్రారంభమై యాభై ఏళ్ళు అయ్యింది కనుక ఏమైనా కార్యక్రమం చేస్తే బాగుంటుంది అని అన్నాను.అన్నింటికి అంగీకారం తెలియజేసారు.
ఆ ఏడాది ఆగష్టు పదిహేను స్వాతంత్ర్య దినోత్సవం కార్యక్రమానికి మా కరెస్పాండెంట్ రామారావుగారినీ, విజయలక్ష్మిగారినీ ఆహ్వానించాను.నేను స్కూల్ లో చేరినది మొదలూ ఆరో తరగతి నుండి పదోతరగతి వరకూ మొదటి స్థానంలో వచ్చినవారికి అవార్డులుగా పుస్తకాలూ,నగదు ఇస్తున్నాను.ఈసారి ఆ కార్యక్రమం మా స్కూల్ అధిపతుల చేతులమీదుగా ఇప్పించాను.
ఈ కార్యక్రమం విజయలక్ష్మిగారిని కదిలించింది.స్కూల్లో ఎంతమంది విద్యార్థులు వున్నారో వాళ్ళకి ఏడాదికి ఎన్ని నోటు పుస్తకాలు కావాల్సి వుంటాయో వివరంగా డాటా తయారుచేసి తనకు పంపమన్నారు. పిల్లలకు కావలసిన నోటుపుస్తకాలు పంపుతానన్నారు.
టీచర్లను సమావేశపరిచి ఏ తరగతిలో ఎంతమంది పిల్లలున్నారో వాళ్ళకు కావలసిన నోటు పుస్తకాలు ఏవి ఎన్ని కావాలో లిస్ట్ చేసి ఇవ్వమన్నాను.అయితే అన్ని పుస్తకాలు ఎక్కడ ఇస్తారులే అని అయిష్టంగానే జాబితాలు చేసి ఇచ్చారు.ఒక ప్రయత్నం చేయటంలో తప్పేముందని మొత్తం స్కూల్ విద్యార్థులకు కావలసిన నోటు పుస్తకాలు జాబితాను విజయలక్ష్మి గారికి పంపాను.
ఆశ్చర్యంగా ఒక వారంరోజుల్లో ఒక ట్రక్కు నిండా నోటుపుస్తకాలు స్కూలుకు చేరాయి.
ఎంత ఆశ్చర్యం వేసిందో ఆ పుస్తకాలన్నిటినీ సైన్స్ రూముకీ లోపలివైపు వుండే రూములో వేయించాము.ఒకే సారి అన్ని పుస్తకాలూ ఇవ్వకుండా సబ్జెక్టులకు ఒకటి చొప్పున పిల్లలకు ఇచ్చి అది నిండిన వెంటనే ఇంకోటి ఇచ్చేలా నిర్ణయించాను.టీచర్లందరికీ టీచింగ్ నోట్స్ రాసేందుకు పొడుగు పుస్తకం ఇచ్చాను.
టీచర్లకు కూడా నేను కోరగానే పుస్తకాలు రావటం ఆశ్చర్యం కలిగించింది.
ఇక పోతే కొందరు టీచర్లూ, ఆఫీసులో ఇద్దరు రికార్డు అసిస్టెంట్స్ స్కూలుకు చాలా ఆలస్యంగా అంటే తొమ్మిది గంటలకు స్కూల్ అయితే సుమారు గంటా,గంటన్నర ఆలస్యంగా వస్తున్నారు.టీచర్ల కొరత వలన వారికి కూడా చిన్న క్లాసులు ఇవ్వటం తప్పలేదు.అందుకని నెలకు మూడు లేట్లు అయితే ఒక సిఎల్ కట్ చేస్తానన్నాను.అయినా సరే అదే పద్ధతిలో లేటుగా రావటం చేస్తుంటే రెండు నెలలు చూసి కరెస్పాండెంట్ కి కంప్లైంట్ ఇచ్చాను.కానీ వాళ్ళు తీరు మారలేదు.వారి వెనుక మా పాత హెచ్చెమ్ మద్దత్తు వుందని తెలుసు.ఎలా అయినా నా మీద పగతీర్చుకోవాలనే స్కూల్ వదిలినా ఆమె కొంతమందికి చీరలూ,బహుమతులూ ఇచ్చి నాకు వ్యతిరేకంగా పనిచేయిస్తోంది.
అదెలా తెలిసిందంటే- స్కూల్ లో రికార్డు అసిస్టెంట్ ఆష వారానికి మూడురోజులు లేటే వస్తోందని సిఎల్స్ కట్ చేసాను.వెంటనే మరి ఎలా వచ్చారో ముగ్గురు అబ్బాయిలు వచ్చి ఈ టీవీ విలేఖర్లమంటూ ఒక ఐడీ కార్డు చూపించారు.అంత తొందరగా వచ్చారంటే అంతా ప్రీ ప్లాన్ అని అర్థమైంది.అంతలో ఉషా కూడా వచ్చింది.ఈ విషయం ఆమెకు ఎలా తెలిసింది?
అందుకే నేను ఎక్కువ ఆర్గ్యూ చెయ్యకుండా "నెలకు పన్నెండు లేట్లు అయితే సిఎల్ కట్ చేయటం తప్పెలా అవుతుంది." అని ఒకే మాట చెప్పి నా పని నేను చూసుకోసాగాను.
" ఆషాకి క్షమాపణ చెప్పు లేకపోతే పేపర్లో వస్తుంది "అని ఉషా,ఇంకో క్లర్క్ అంటున్నా నేను విననట్లు ఊరుకున్నాను.తర్వాత అంతా వెళ్ళిపోయారు.ఆ తర్వాత తెలిసింది.ఆ వచ్చిన కుర్రాళ్ళలో ఒకడు ఆషా అల్లుడని.
హెచ్చెమ్ గా అయిన తర్వాత స్కూల్లో ఆఫీస్ సిబ్బంది చేసే అనేక అవకతవకలు ఒక్కొక్కటే బయటపడుతున్నాయి.అయితే అంతకుముందు హెచ్చెమ్స్ గమనించి కూడా గొడవలెందుకని నిమ్మకు నీరెత్తినట్లు వూరుకున్నారా? గమనించ లేదా?వాళ్ళకు కూడా అందులో హస్తం వుందా? నాకు అర్థం కాలేదు.నా సర్వీసు ఏడాదిన్నర కూడా లేదు.ఈ పాటి దానికి ఇవన్నీ నెత్తినేసుకుని చెడ్డదాన్ని కావటం ఎందుకని అనిపించింది.విద్యకు సంబంధించిన విషయాలు మీదే దృష్టి పెడితే పిల్లలన్నా బాగుపడతారని అనుకున్నాను.
స్టేషనరీకనీ,జిరాక్సులకనీ, విద్యాశాఖలో అటెండర్లకి ,క్లర్కులకూ ఇవ్వాలనీ రోజూ డబ్బులకోసం బిల్లులు పెడుతూనే వుండే వాళ్ళు ఆఫీసు సిబ్బంది.స్కూల్లో పిల్లలు ఫీజులు కట్టలేదు,కట్టరూ కనుక డబ్బు ఏమీ స్కూల్ ఖాతాలో వుండేదికాదు.దాంతో నా జీతం నీళ్ళ ధారలా ఖర్చు అయిపోతూనే వుండేది.సముద్రంలో వున్నప్పుడు మింగేసే తిమింగలాలతో గడపకతప్పదుకదా.కబంధులకు పట్టుకోవటానికి చేతులూ,మింగటానికి నోరూ,నింపుకోవడానికి పొట్టా వున్నప్పుడు ఎంతా సరిపోదు కదా.
ఇది కాదని బాలాజీ ప్రెస్ బాల ప్రసాద్ ద్వారా తెల్లకాగితాలూ,రూళ్ళ కాగితాలు బండిల్స్ హోల్ సేల్ లో తెప్పించి పెట్టాను.అవే పిల్లలకు మూడునెలల పరీక్షలూ, అర్థసంవత్సర పరీక్షలకూ,సంవత్సరాలైంది పరీక్షలూ కూడా సరిపోయాయి.
ఈ ఏడాది కూడా పదోతరగతి పిల్లలను కొందరిని కోచింగ్ సెంటర్ లో చేర్చాను.రెగ్యులర్ గా క్లాసులకు రాకపోతే స్కూల్ కి వచ్చి తెలియజేయమన్నాను.అంతకుముందు వాళ్ళకు ఫీజులకు సహాయం జేసిన కొందరు టీచర్లు ఈసారి కూడా సహకరించటంతో నేను కొంత వూపిరి పీల్చుకోగలిగాను.
స్కూల్ సమస్యలు గురించి చర్చించటానికి మా జోన్ విద్యాశాఖ అధికారి సమావేశం ఏర్పరచినప్పుడు నేను ,ఉమా హాజరై ముఖ్యంగా పదోతరగతికి సబ్జెక్టు టీచర్ల కొరతగురించి మాట్లాడాము.
ప్రభుత్వం ప్రతీ స్కూల్ లోనూ విద్యార్థులు,టీచర్ల శాతాన్ని నమోదు చేసుకుని మాకు మరికొంతమంది టీచర్లను ఇవ్వటానికి బదులుగా ప్రాధమిక తరగతుల్లో టీచర్లు ఎక్కువగా వున్నారన్న మిషతో రేషనలైజేషన్ పేరుతో ప్రైమరీ టీచర్లైన అలివేలు,జయప్రభని మరో స్కూల్ కి ట్రాన్స్ ఫర్ ఆర్డర్లు పంపారు.దాంతో మళ్ళా వుత్పాతం సంభవించింది.అందులో ఒక టీచరైన అలివేలు ఉషకి ఇన్ఫార్మర్ అని నాకు ఒక అనుమానం వుంది.అందుకు ఆమెని ఎగసిన దోసిందేమో.
జయప్రభని వెనకని పెట్టుకొని అలివేలు వచ్చి నామీద ఆగ్రహంతో తగువుకు దిగింది.నేను ఆ విషయాన్ని పరిష్కరిస్తాను కొంచెం ఓపిక పట్టమని సముదాయించాను.ఉపాధ్యాయసంఘం లోని ఒకరిద్దరు నాయకులతో మాట్లాడాను.అఫ్జల్గంజ్ దగ్గర ప్రభుత్వ పాఠశాల ఆవరణలోనే దీనికి సంబంధించిన అడ్వకేట్ వున్నాడని ,అతన్ని సంప్రదించమని నెంబర్ ఇచ్చారు.మర్నాడు ఉదయమే బయల్దేరి ఆ అడ్వకేట్ ను కలిసాను.ఈ విధంగా రేషనలైజేషన్ బారిన పడిన ఇతర వుపాధ్యాయులనూ కలిపి కోర్టులో పిల్ వేస్తానని ఒక్కొక్కరూ వెయ్యి రూపాయలు ఇవ్వాలి అన్నాడు
మళ్ళా స్కూల్ కి వెళ్ళి వాళ్ళిద్దరికీ తెలియజేసాను.దానికి కూడా " మేమెందుకు ఇవ్వాలి ?
మీరే బాధ్యులు కనుక ఏంచేసి చేస్తారో ఆర్డరు కేన్సిల్ చేయించాల్సిందే " అని వితండవాదం మొదలెట్టారు.ముఖ్యంగా అలివేలు,ఆమె భర్త శ్రీనివాసులు( మా స్కూల్లోనే డ్రిల్లు మాష్టారు)
నేను సగం డబ్బు యిస్తానని చెప్తే అప్పటికి ఎలాగో వాళ్ళిద్దరూ శాంతించారు.బహుశా దీని వెనుక కూడా ఉషాటీచరు వుండే వుంటారు.అలివేలునీ,జయప్రభని తీసుకుని సాయంత్రం అడ్వకేట్ ను కలిసి అవసరమైన జిరాక్సులు ఇచ్చి డబ్బు చెల్లించి వచ్చాము.నేను రెగ్యులర్ ఆటోని పెట్టుకోవటం వలన యీ విధంగా స్కూల్ పనులమీద ప్రతీ దగ్గరకు తిరగటానికి సులభం అయ్యింది.
అయితే ఇప్పుడు ఇంఛార్జి హెచ్చెమ్ గా ఉండటం వలన స్కూల్ పిల్లలూ,టీచర్లూ వెళ్ళాక అన్నీ తాళాలు వేసుకుని ఇంటికి తిరిగి వెళ్ళాల్సి రావటంతో ఆషీని స్కూల్ నుంచి సాయంత్రం ఇంటికి తీసుకు వచ్చేభారం పూర్తిగా వీర్రాజుగారికే అయ్యింది.
ఇక రాష్ట్రంలో అనేక సంచలనాలు.తెలంగాణా వుద్యమం కేసీఆర్ నేతృత్వంలో అంతకంతకూ వూపందుకుంది.నక్సల్ సమస్యపై కేసిఆర్ నేతృత్వంలో MLAలు, MPలు సోనియా గాంధి, ప్రధాని మన్మోహన్‌లను కలిసి చేసిన చర్చలో ముఖ్యమంత్రి తెలంగాణా ఉద్యమంపై చులకనగా చేసిన వ్యాఖ్యలు వలనే కాక నక్సల్స్ సమస్యపై కూడా ఆశించిన స్పందన లభించలేదు. ఇది కేసీఆర్ కి అసంతృప్తి కలిగించింది .
హైదరాబాదులోని చంచల్‌గూడా జైల్లో నిషేధిత విరసం నేతలను కేసిఆర్ కలిసారు. మావోయిస్టులపైన, విరసంపైన నిషేధం ఎత్తివేయిస్తే, మావోయిస్టులను చర్చలకు తాను ఒప్పిస్తామని విరసం నేతలు అన్నారు.
తెలంగాణా వుద్యమాన్ని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ నుండి విడిపోయి పురపాలక ఎన్నికలలో తీవ్రంగా కృషి చేసినా కాంగ్రెసు విజయం సాధించింది. తెలుగుదేశం, తెరాస ఘోరంగా ఓడిపోయాయి.
తీవ్రవాదులతో ప్రత్యక్షంగా చేసిన ప్రభుత్వ చర్చలు అప్పట్లో మరొక సంచలనం.
ఈ సంచలనాలూ, స్కూల్లో నామీద విరుచుకు పడడాలూ సరే. ఇవే కాక ప్రకృతీ నామీద పగ పట్టినట్లు ఆ ఏడాది విపరీతమైన వానలు.ఒక శనివారం రాత్రి పడిన వానకి వరదనీళ్ళు గొప్ప వుధృతితో వచ్చి మా స్కూల్ వెనుకవైపు గేటును బలంగా తాకేసరికి గేటు విరిగిపడి స్కూల్లోకి నీళ్ళు వచ్చేసాయట.గేటుపక్కనే గదిలో వుండే వాచ్ మెన్ ఇంట్లోకి వచ్చేశాయని గగ్గోలు పెడుతూ ఆదివారం వుదయమే ఫోన్ చేసాడు.
నాకు ఏంచేయాలో తోచక ముందు స్కూల్ యాజమాన్యం వారికి తెలియజేసాను.తొందరగా తయారై మా ఆటో సలీమ్ ని పిలిచి స్కూల్ కి వెళ్ళాను.అంత వర్షం కురిసి తెల్లారేటప్పటికి పూర్తిగా తగ్గిపోయింది.అందుచేత స్కూల్ లోకి వచ్చేసిన నీళ్ళు కూడా క్రమంగా తగ్గిపోయాయి.కానీ భద్రత వుండాలి కదా అందుకని కార్పెంటర్ ను పిలిపించి అర్జెంట్ గా గేటు బాగు చేయించాల్సి వచ్చింది.
ఈ వత్తిళ్ళవల్లో ,ఇంకేం కారణం వల్లనో నాకు చూపులో కొంత ఇబ్బంది కలిగింది.ఎడమకంటిచూపు పూర్తిగా తగ్గినట్లు అనిపించింది.మీనన్ గారి అమ్మాయి అపర్ణ కంటి డాక్టరు.ఆమెని కాంటాక్ట్ చేస్తే నన్ను తీసుకు వెళ్ళి హాస్పిటల్లో పరీక్షలు చేయించింది.రెటీనా మీద సన్న రంధ్రాలు వున్నాయనీ,కాటరాక్ట్ కూడా కంటిపాప మధ్యలో వచ్చిందనీ తెలిసింది.సాధూరామ్ కంటి హాస్పిటల్ లో ఒక గుజరాతీ డాక్టర్ చాలా ఫేమస్ సర్జన్ అని అపర్ణ చెప్పింది.అయితే అక్కడ పరీక్షల కోసం ఒకరోజు,ఆపరేషన్ అయిన రోజు అక్కడే వుండాలి.నా దగ్గర ఒకరు ఉండాలంటే ఆషీ చిన్నపిల్ల, వీర్రాజుగారికీ కష్టమే అందుకని పగలు పల్లవో, వీర్రాజుగారో ఉండేలా రాత్రి మాత్రం వీర్రాజు గారి తమ్ముడి కూతురు కవితని వుండమని అడిగాము.ఆమె ఒప్పుకుంది.
కాటరాక్ట్ విజయవంతంగానే జరిగింది.కానీ ఆ రాత్రి వేసుకున్న టాబ్లెట్ ఏదో పడలేదేమో క్రమక్రమంగా పాదాల నుండి తిమ్మిరి ప్రారంభం అయ్యింది.అప్పటికీ కాసేపు కవితని పట్టుకుని నడిచాను.ఎందుకైనా మంచిదని అపర్ణతో ఫోన్ చేసి మాట్లాడాను.ఆమె డాక్టరుతో సంప్రదించితే డాక్టరు వచ్చి ఇంజెక్షన్ చేసారు అప్పటికే నడుము వరకూ తిమ్మిరిగా అయ్యింది.తర్వాత క్రమంగా తగ్గి నిద్రపట్టింది.మర్నాడు ఇంటికి వచ్చేసాను.
ఒక నాలుగు రోజుల తర్వాత సంక్రాంతి సెలవులే కనుక పదిహేను రోజులు విశ్రాంతి వుంటుంది అని అనుకున్నాను.తీరా ఓ పదిరోజులు అయ్యేసరికి ఆర్టీసీ ఎమ్.డీ ఆఫీస్ నుండి మా స్కూల్ బిల్డింగ్ కి సంబంధించి చర్చల సమావేశానికి రమ్మని పిలుపు వచ్చింది.ఆ సమస్య తెగేదికాదు కానీ తప్పనిసరిగా ఆటో చేసుకుని వెళ్ళక తప్పలేదు.
ఎప్పటిలా ఆ చర్చ అక్కడే ఆగింది.నేను ఇంటికి తిరిగి వచ్చేసాను.ఎటొచ్చీ ఎండలో ఆటోలో వెళ్ళి రావటం కాటరాక్ట్ అయిన కంటికి కొంత శ్రమ కలిగించినట్లు అయింది.
-- శీలా సుభద్రాదేవి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)