24, ఫిబ్రవరి 2025, సోమవారం
నడక దారిలో -49
నడక దారిలో -49
నాలుగు రోజుల తర్వాత స్కూల్ కి వెళ్ళాను.టీచర్లందరి పరామర్శలతో మళ్ళా మనసు భారమైంది.కానీ తప్పదు. మళ్ళీ రొటీన్ లో పడ్డాను.
కృష్ణారెడ్డిగారి అమ్మాయి నందూ కూడా ఆషీ వయసే కావటం వలన సెలవురోజుల్లో అప్పుడప్పుడు కలవటం కలిసి జూ పార్క్ కో, ఎన్టీఆర్ గార్డెన్స్ కో వెళ్ళే వాళ్ళం.పల్లవీ,ఆషీ మామూలు కావటానికి ఇలా వెళ్ళటం బాగుందనిపించింది.
ముద్దు మాటలతో ,నవ్వులతో చిలిపిఅల్లరితో ఇల్లంతా నింపుతున్న ఆషీయే ఇప్పుడు మా అందరి మనసు గాయాలకు మందుగా మారింది.
స్కూల్ లో క్రిస్టియన్లు కాక సాయిబాబా భక్తులు,బ్రహ్మకుమారీలు కూడా వున్నారు.వాళ్ళు మొదటినుంచీ వాళ్ళ విశ్వాసాల్ని నాకు ఎక్కించాలని చూసేవారు .కానీ వినే దాన్ని తప్ప ఏమీ అనేదాన్ని కాదు.ఇప్పుడూ వాళ్ళు 'మీకు జీవితంలో ఇలా దెబ్బలు తగిలినప్పుడైనా దేవుడికి మొరపెట్టుకోవాలని అనిపించలేదా' అని అడుగుతుండేవారు.
కనిపించని దేవుడిని కన్నా మనిషినీ,నియమ బద్ధమైన పనినీ నమ్ముతాను.కళ్ళముందు కనిపించే మనుషులే మోసం చెస్తే కనిపించని దేవుడిని అడిగేదేముంది మనసులోనే అనుకున్నాను.జూన్ లో ఆషీని ప్రీస్కూల్ లో చేర్చేస్తే పల్లవి మళ్ళీ వుద్యోగం వెతుక్కోవచ్చు . వుద్యోగంలో బిజీ అయితే మళ్ళా పల్లవి మనుషుల్లో పడుతుంది అనేది మా ఆలోచన.
మళ్ళీ పెళ్ళి ప్రయత్నం చేస్తే బాగుండునని నాకు మనసులో బలంగా వుంది.కానీ పల్లవికి ఎవరు చెప్తే బాగుంటుంది.నాకు రాత్రీ పగలూ అదే ఆలోచన.కృష్ణారెడ్డి భార్యతో మాట్లాడాను.కానీ ఆవిడ పల్లవితో ఆ విషయం ఎందుకో ప్రస్తావించటం లేదు.సెలవుల్లో రంజనా వచ్చింది.ఒకరోజు పల్లవిని కదిపిందిట."మీ అమ్మ ఒంటరిగా మీ ఇద్దరినీ పెంచలేదా? అలాగే నేనూ పెంచుతాను"అని పల్లవి సమాధానం చెప్పిందనీ నేను ఇంకేమి మాట్లాడలేకపోయాను పిన్నీ' అని చెప్పింది రంజన.అప్పటికీ "అప్పుడు పరిస్థితులు వేరు.ఇప్పుడు అలా ఒంటరిగా బతకటం కష్టం అనికూడా నచ్చజెప్పబోయాను.ముఖం సీరియస్ గా పెట్టుకునే సరికి నేను ఇంకా పొడిగించలేకపోయాను" అని చెప్పింది.
ఇక నేనే ఒకరోజు పల్లవితో మాట్లాడాను " మేమున్నంతవరకూ పర్వాలేదు.నీకూ ఒక తోడు వుండాలి కదా" అన్నాను.
" ఒకసారి ఇలా అయ్యింది.నాకు ఆడపిల్ల వుంది.ఎటువంటి వాళ్ళు వస్తారో. మళ్ళీ నేను రిస్క్ తీసుకోలేను.ఇక ఈ విషయం నా ముందు తీసుకు రావద్దు" పల్లవి స్పష్టంగా అనే సరికి మరి నేనేమీ మాట్లాడలేకపోయాను.
ఎంత మామూలుగా తిరుగుతున్నా సన్యాసినిలా ఏ ఆసక్తులూ లేకుండా తిరుగుతున్న పల్లవిని చూస్తూంటే నాకు బాధ కలుగుతోంది.ఏదైనా వుద్యోగంలో చేరితే బాగుండునని అనుకున్నాం.
ఆ వేసవిలో జనరల్ ఎలక్షన్స్ వచ్చాయి.నాకు ప్రిసైడింగ్ ఆఫీసర్ గా ఎలక్షన్ డ్యూటీ పడింది.ఎలక్షన్ సామగ్రి అంతా తీసుకుని అంతా పోలింగ్ బూత్ వున్న స్టేషన్లకు బయలుదేరాం.మా పోలింగ్ స్టేషన్ ఉస్మానియా హాస్పిటల్ పక్క గల్లీలోని కూర్మగుడాలో ఒక భూత్ బంగ్లాలా వున్న చోట వుంది.పైన టాప్ కూడా కూలిపోయేలా వుంది.నేనూ ఒక పోలింగ్ ఆఫీసర్ తప్ప అందరూ మగవాళ్ళే . అంతకుముందు ఎలక్షన్స్ అప్పుడు అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ మీరు ఇంటికి వెళ్ళిపోయి ఆరింటిలోపున వచ్చేయండి అంటూ సహకరించే వాళ్ళు.కానీ ఈసారి అసిస్టెంట్స్ గా వచ్చిన డి.ఆర్.డి.వో ఉద్యోగులు ఒప్పుకోలేదు.నేను ఇంటికి వచ్చేస్తానేమోనని వీర్రాజు గారు మా ఇంటి పక్కనే వున్న ఆటో తీసుకుని వచ్చారు.మరినేను రావటానికి కుదరదని చెప్తే వెళ్ళిపోయారు.సామగ్రి అంతా సర్దుకున్నాక అక్కడ ఆ మురికి కూపంలో ఎలా చిన్న కునుకు తీయాలా అని ఆలోచిస్తుంటే ఆ ప్రక్కనే హాస్పిటల్ రోగుల అటెండర్స్ కోసం రూములు వున్నాయి అక్కడ పడుకోమని తీసుకువెళ్ళారు.దుప్పటికూడాలేని రేకు మంచంమీద దోమలదాడిలో నేనూ,పోలింగ్ ఆఫీసర్ గా వున్న అమ్మాయి కాసేపు నడుమువాల్చి చీకటితోనే లేచి స్నానంచేసి పోలింగ్ స్టేషన్ కి వెళ్ళిపోయాము.ఆరింటికల్లా మళ్ళా ఆటోలో వీర్రాజు గారు నాకోసం టిఫిన్, మధ్యాహ్నానికి పెరుగన్నం ఇచ్చి వెళ్ళిపోయారు.
ఎలక్షన్ మొదలైంది.చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టిన జన్మభూమి మొదలైన అనేక కార్యక్రమాలతో తాను అవిశ్రాంతంగా పనిచేయడమే కాక వుద్యోగస్తులందరిని పరిగెత్తించటం నచ్చకపోవటం ఒక కారణమైతే ,వైఎస్ఆర్ చేసిన పాదయాత్ర ప్రభావం మరొక కారణం కావటంతో పోలింగ్ ఏకపక్షంగా సాగటం తెలుస్తూనే వుంది.అంతేకాక అప్పటికే ప్రత్యేక తెలంగాణ సాధన లక్ష్యంగా కేసిఆర్ నాయకత్వంలో ఏర్పడిన తెలంగాణా రాష్ట్ర సమితి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది.ఎలక్షన్స్ ఏకపక్షంగా సాగటానికి ఇవన్నీ కారణాలే.
పాతబస్తీ ఏరియా కావటం వలన వచ్చిన వాళ్ళే పదేపదే మరో చీటీ తీసుకొచ్చి ఓట్లు వేస్తూనే వున్నారు.నేను మొదట్లో అభ్యంతరం పెట్టాను.కానీ నా అసిస్టెంట్స్ నన్ను జోక్యం గలుగ చేసుకోవద్దని,ఈ ఏరియాలో వూరుకోవటమే మంచిదన్నారు.పోలింగ్ ఏజెంట్లు కూడా కలగచేసుకోక పోవటంతో మౌనమే శరణ్యం అయ్యింది.మాపోలింగ్ బూత్ లో వున్న వారందరికీ చికెన్ బిర్యానీలు కూడా వచ్చాయి.నేను మట్టుకు వీర్రాజుగారు తెచ్చి ఇచ్చిన పెరుగన్నమే తిన్నాను.
బహుశా చాలా పోలింగ్ బూత్ లు ఇలాగే వుండి వుంటాయనుకున్నాము. పోలింగ్ ముగిసిన తర్వాత ఆ సామగ్రి అంతా అప్పగించి,మా రెమ్యునరేషన్ తీసుకుని బయటకు వచ్చేసరికి రాత్రి పన్నెండు కావచ్చింది.అక్కడే దిల్ షుక్ నగర్ వైపు వచ్చే సహోద్యోగి కలిసింది.ఎలక్షన్ రోజు కనుక రోడ్లు అంతా లైట్లతో పట్టపగలులా వుంది.అదృష్టవశాత్తు మా వైపు వెళ్ళే బస్ కనిపించే సరికి పరిగెత్తి ఎక్కేసాము.నేను టీవీ టవర్ దగ్గర దిగి ఆస్మాన్ ఘడ్ దగ్గర ఎత్తు ఎక్కి నడుచుకుంటూ ఈసురోమంటూ ఇల్లు చేరాను.కానీ అర్థరాత్రి నుండి రోడ్డుమీద నడుచుకుంటూ వచ్చామంటే గాంధీగారు చెప్పినట్లు స్వాతంత్ర్యం వచ్చేసినట్లే అనుకొని నవ్వుకున్నాను.
అనుకున్నట్లే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో,దేశంలో కొలువు తీరింది.కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న టీ.ఆర్ ఎస్ నుండి రాష్ట్రంలో కొందరికి మంత్రిపదవి వచ్చింది.అలాగే కెసిఆర్ కూడా కేంద్రమంత్రి అయ్యారు.అప్పటికే తెలంగాణా రాష్ట్ర సాధన కోసం గత నాలుగేళ్ళుగా చురుకుగా ఉద్యమస్థాయిలో కృషిచేసిన టిఆర్ఎస్ కేంద్రపాలనలో భాగస్వామ్యం పొందటంతో తెలంగాణా వాసులకు ఉత్సాహం కలిగింది.
డా.భార్గవీరావు తనకి తెలిసిన సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్చార్ గా పనిచేస్తున్న అతని ఈ మెయిల్ ఐడీ ఇచ్చి పల్లవిని రెజ్యూమె పంపమని చెప్పారు.పల్లవి పంపిన రెజ్యూమ్ ను అతను రెండుమూడు కంపెనీలకు ఫార్వర్డ్ చేసాడట.వెంటనే పల్లవికి ఇంటర్వ్యూకి పిలుపు వచ్చింది.
పల్లవికి అపాయెంట్మెంట్ ఆర్డర్ ఇచ్చేసారు కానీ పూనాలో మూడు వారాలు ట్రైనింగ్ కు వెళ్ళాలన్నారు.ఆషీని మా దగ్గర వదిలి వెళ్తే వుంటుందో లేదోనని పల్లవి ఆలోచించింది.మా దగ్గర అలవాటైంది కనుక పర్వాలేదు వెళ్ళమని ప్రోత్సహించాము.అంతగా అయితే మధ్యలో వారాంతంలో ఫ్లైటులో ఒకసారి వద్దువులే అన్నాము.పల్లవి వెళ్ళింది.నాకు వేసవి సెలవులే కనుక ఆషీని చూసుకోవటానికి కూడా ఇబ్బంది కలగలేదు.మూడువారాలని చెప్పినా ఒక వారానికే తిరిగి పల్లవిని పంపించేస్తే మాదాపూర్ ఐటీటవర్లోని దిశా సాఫ్ట్వేర్ కంపెనీ ఆఫీసులో జాయినయ్యింది.
వేసవి తర్వాత స్కూల్స్ తెరిచినప్పుడు టీవీ టవర్ దగ్గర బోధివృక్ష్ అనే కిండర్ గార్టెన్ లో ఆషీని జాయిన్ చేసాము.అది మధ్యాహ్నం ఒకటిన్నర వరకే కానీ బేబీ కేర్ కూడా వుండటం వలన నాలుగు వరకూ అక్కడే వుండేలా మాట్లాడేము.మధ్యాహ్నం లంచ్ చేసాక కొంత సేపు అక్కడ పడుకొని లేచిన తర్వాత అక్కడ పిల్లలతో ఆషీ ఆడుకునేది.
ఉదయం వంట పూర్తిచేసుకుని పల్లవి,నేను లంచ్ బాక్స్ తయారు చేసుకునే వాళ్ళం.ఆషీకి కూడా లంచ్ బాగ్ సిద్ధం చేసి
ఎనిమిదిన్నరకి ఆటోలో నేను,పల్లవీ బయలుదేరి పల్లవిని కోఠీలో డ్రాప్ చేసి నేను స్కూలుకి వెళ్ళిపోయేదాన్ని.నేను ఆటోని రెగ్యులర్ గా మాట్లాడుకోవటంతో కొంత ఒత్తిడి తగ్గింది.
వీర్రాజుగారు తొమ్మిదిన్నరకి ఆషీని బోధి వృక్ష్ లో దింపి వచ్చేవారు.సాయంత్రం నేను స్కూలు నుండీ వస్తూ ఆషీని తీసుకు వచ్చేదాన్ని .నాకు ఆలస్యం అవుతుందనుకున్నప్పుడు వీర్రాజుగారే తీసుకు వచ్చేవారు.
ఇప్పుడు ఒకరితో ఒకరికి ఫోన్ ద్వారా కనెక్షన్ వుండటానికని పల్లవి నాకు ఒక ఫోన్ కొని ఇచ్చింది.అందువలన కొంత కాంటాక్ట్ చేసుకోవటం సులువు అయ్యింది.
మా హెచ్చెమ్ ఉషా రిటైర్ అయిపోయింది.ఆమె తర్వాత సైన్స్ టీచర్ విజయలక్ష్మి హెచ్చెమ్ అయింది.అయితే ఆమె పదవీకాలం పదినెలలు కూడా పూర్తిగా లేదు.అయితే ఇంతవరకూ స్కూల్ కరెస్పాండెంట్ అయిన రామారావుగారూ,సెక్రటరీగా మా పాత హెచ్చెమ్ మిసెస్.థామస్ ఉండేవారు.ఇప్పుడు సెక్రటరీని మార్చాలని రామారావుగారిని బహుశా ఉషా ప్రభావితం చేసినట్లుంది.
రామారావుగారు స్కూల్ సెక్రటరీగా ఎంపిక చేయటం గురించి సంప్రదించటానికి సీనియర్ టీచర్లను ఓ నలుగురితో మాట్లాడాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆఫీసుకి రమ్మని ఆహ్వానించారు.మేమంతా స్కూల్ అయిపోయాక వెళ్ళాము.అందరం ఒకే మాటమీద మా స్కూల్ స్థాపించిన నాయుడమ్మగారి అమ్మాయి విజయలక్ష్మి గారిని సెక్రటరీగా చేస్తే తన తల్లి మొదలుపెట్టిన స్కూల్ కనుక బాధ్యతగా మంచిచెడ్డలు చూసుకుంటారు అని చెప్పాము.రామారావుగారు మామాటని అంగీకరించడంతో విజయలక్ష్మిగారినే మా స్కూల్ సెక్రటరీగా ఎంపిక చేసారు.మరొక విశేషం ఏమిటంటే విజయలక్ష్మిగారు సురవరం సుధాకరరెడ్డిగారి భార్య .ఆమెకూడా మహిళా శిశు సంక్షేమం కోసం సిపిఐ తరపున సమాజసేవ చేస్తున్న వ్యక్తి.ఆమె సెక్రటరీ అయ్యాక స్కూల్ కి వచ్చి పరిస్థితులు గమనించారు.
పల్లవి ,ఆషీని తీసుకుని క్రిస్టమస్ సెలవుల్లో విజయనగరం వెళ్ళటానికి డిసెంబర్ 24 సాయంత్రానికి టికెట్లు తీసుకుంది.అయితే తీవ్రమైన తుఫాను హెచ్చరికలు, వర్షం వలన వెళ్ళటం గురించి ఆలోచనలో పడింది.దానికి తోడు కొన్ని ట్రైన్లు కేన్సిల్ అయ్యాయి.ఇక వద్దులే అక్కడ చిక్కుకుంటే మళ్ళా ఆఫీస్ కు వెళ్ళటం కష్టం.అందులోనూ కొత్తగా చేరిన వుద్యోగం అని ప్రయాణం కేన్సిల్ చేసుకుంది.అది మంచిదైంది.
డిసెంబర్26న ఎప్పుడూ కనీ వినని రీతిలో 30 మీ ఎత్తు వరకు అలలతో కూడిన భారీ సునామీ ఏర్పడి సముద్రం చుట్టుపక్కల తీరాల వెంబడి ఉన్న గ్రామాలను నాశనం చేసింది, చరిత్రలో అత్యంత ఘోరమైన ప్రకృతి వైపరీత్యాలలో ఒకటిగా గుర్తించబడింది .ఇది ఆసియాలోనే ఇప్పటివరకు నమోదైన అత్యంత శక్తివంతమైన భూకంపం, 21వ శతాబ్దంలో 1900లో ప్రారంభమైనప్పటి నుండి ప్రపంచంలో ఇప్పటివరకు నమోదైన మూడవ అత్యంత శక్తివంతమైన భూకంపమనీ మాధ్యమాలన్నింటిలో వస్తున్న వార్తలను చదివి పల్లవి వాళ్ళు ప్రయాణం కేన్సిల్ చేసుకోవటం మంచిదైందని వూపిరి పీల్చుకున్నాం.
ఆంధ్రప్రదేశ్‌లోని చాలా గ్రామాలు ధ్వంసమయ్యాయి. కృష్ణా జిల్లా మంగినపూడి , మచిలీపట్టణం బీచ్‌లో సునామీ బీభత్సం సృష్టించిందిట.అదేసమయంలో చిన్నక్క కొడుకు కళ్యాణ్ సైనిక స్కూల్ పనిమీద ఉప్పాడ వెళ్ళాడట.సునామీ రావటానికి ముందు ఉప్పాడ బీచికి కూతురుతో వెళ్ళి సముద్రం అలలు ముందుకు వచ్చేస్తున్నాయని అందరూ పరుగులు పెడుతుంటే పరిగెత్తి వెనక్కి వచ్చేసామనీ, రెండు రోజుల తర్వాత మళ్ళా వెళ్తే ఆ ప్రాంతం బీభత్సంగా వుందనీ ప్రత్యక్షంగా చూసిన సునామీ అనుభవాన్ని చెప్పేసరికి ఒకింత భయం కలిగినా ప్రమాదం తప్పినందుకు వూపిరి పీల్చుకున్నాం.
సునామీ బీభత్సం గురించిన వార్తలు దూరదర్శన్ లో చూస్తుంటే 1977 లో వచ్చిన దివిసీమ వుప్పెన గుర్తు వచ్చింది.అప్పట్లో దృశ్య మాధ్యమాలు లేనందున రేడియో వార్తలు, వార్తా పత్రికలే తెలియజేసేవి.తర్వాతెప్పుడో కమల్ హాసన్ దశావతారాలు సినీమాలో ఈనాటి సునామీని చిత్రంలో సందర్భోచితంగా చిత్రించారు.
ఇంక స్కూల్ లో టీచర్స్ ఒక్కొక్కరే రిటైర్ అయిపోవటంతో హైస్కూల్ కి అందులోను పదోతరగతికి సబ్జెక్టు టీచర్లు సరిగా లేకుండా అయింది.
ఒకసారి కొత్తగా కోచింగ్ సెంటర్ ప్రారంభించిన ఆయన వచ్చి హైస్కూల్ పిల్లల్ని చేర్పించడానికి పిల్లలతో మాట్లాడతానని వచ్చాడు.
ఆయనతో మా స్కూల్ పిల్లలు బోలెడు డబ్బుతో కోచింగ్ లో చేరగలిగే వాళ్ళు కాదని చెప్పాము.ఎక్కువమందిని చేర్పిస్తే ఫీజు కన్సెషన్ ఇస్తానని చెప్పటంతో కొంతమంది టీచర్లు కలిసి ఆలోచించాము.ముగ్గురు నలుగురు టీచర్లు కలిసి ఒక పదిమంది ఫీజు కట్టలేని వారికి కట్టాలని నిర్ణయించాము.దాంతో సరియైన సబ్జెక్ట్ టీచర్ లేకపోయినా మరికొందరైనా పాసవుతారనే భరోసా కలిగింది.విద్యార్థులు రెగ్యులర్ గా హాజరు కాకపోతే స్కూల్ కి వచ్చి తెలియజేయమని చెప్పాము.
స్కూల్ లో ఉషతర్వాత హెచ్చెమ్ గా ప్రమోషన్ వచ్చిన విజయలక్ష్మికి కేవలం పదినెలలే
సర్వీసు వుంది .దాంతో తన సెలవులను వాడుకోవటంతో తర్వాత క్యూలో వున్న నాకు బాధ్యత పెరిగింది .
ఆర్టీసీ యాజమాన్యం బిల్డింగ్ పాతబడిందని తమకి అప్పగించమని మాటిమాటికీ వుత్తరాలు పంపుతున్నారు.తాము డబ్బు సేకరించి బిల్డింగ్ కట్టించామని అందువలన దానిపై హక్కు మా స్కూల్ యాజమాన్యానికి చెందిన ఎంప్లాయీస్ యూనియన్ వారిదని వాదన.ఈ రెండింటి మధ్య మా స్కూల్ నలిగి పోవటం జరుగుతోంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి