4, జనవరి 2025, శనివారం
విశాఖ హోరు విన్పించే ఎన్నెమ్మకతలు
~విశాఖ సముద్ర హోరు వినిపించే ఎన్నెమ్మ కతలు~
కథానికా సాహిత్యంలో ఖదీర్ బాబు 'దర్గామిట్ట కతలు', సోమరాజు సుశీల 'ఇల్లేరమ్మ కతలు', నామిని 'సినబ్బ కతలు', 'మిట్టూరోడి కతలు' ఈ విధంగా చాలా వచ్చాయి.
నిడదవోలు మాలతి కూడా అదే కోవలోనే ఉత్తమ పురుషలో తన పేరులోని ఎన్.ఎమ్.లను కలిపి 'ఎన్నెమ్మ కతలు'గా తన అనుభవాలు, జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ తన బ్లాగులోనే మొదట్లో 'ఊసుపోక' పేరుతో రాసుకున్న వాటినే ‘ఎన్నెమ్మకతలు' పేరుతో అయిదు సంపుటాలుగా కూర్చుకున్నారు. వీటికి ప్రేరణ పురాణం సుబ్రహ్మణ్యశర్మ 'ఇల్లాలి ముచ్చట్లు', లత 'ఊహాగానం' అంటుంది మాలతి.
సాధారణంగా ఇటువంటివి చాలావరకూ బాల్యజ్ఞాపకాలనో ఆత్మకథలుగానో కాదు, రచయిత్రి తన జీవన ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసుకోవటం.
అందుకే కథాకాలంనాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాహిత్యాంశాలతో ముడిపడ్డ జీవితాన్ని ఉత్తమ పురుషలోనే రాయటం సమంజసంగానే ఉంది. వీటిని కతలుఅన్నా ఎక్కువగా స్కెచ్ లుగా, గల్పికల్లాగా, మ్యూజింగ్సులాగా ఉన్నాయి. కొన్నిమాత్రం పాత్రలతో, సంభాషణలతో కథాత్మకంగా అనిపిస్తాయి.ఎక్కువవాటిలో తారకం, పొన్నమ్మాళ్, సంద్రాలు పాత్రలు కనిపిస్తాయి.
వీటికి ముందుమాట రాసిన ఎస్. నారాయణస్వామి “ఈ కథల్లో అంతర్లీనంగా ఉన్న సామాజిక విలువ ఇంకో ఎత్తు, ఈ ఎన్నెమ్మ కతలు ముఖ్యమైన సోషల్ డాక్యుమెంటరీలు. ఈ కథలు ప్రత్యేకమైన అనుభవ సముదాయానికి సాక్షర సాక్ష్యాలు" అంటారు.
ఇల్లాలు ముచ్చట్లలోలాగే హాస్యం, వ్యంగ్యమే తన కతల్లోకూడా ప్రధాన రసాలైనా కరుణ, సానుభూతి, కథాచితుగా ఎత్తిపొడుపూ, సాహిత్యపరమైన విశ్లేషణాకూడా రాసానంటుంది మాలతి.
అవసరమైనపుడు చక్కని ఆరుద్ర కూనలమ్మ పదాలో, రాయప్రోలువారి గేయమో, సుమతీ శతకమో, భాగవత పద్యమో, పాణినీ పద్యమో ఏదో ఒక ఉటంకింపుని పొదిగి, తాను చెప్పదలచుకున్న అంశానికి బలాన్ని ప్రోదిచేసింది రచయిత్రి.
మొదట్లో ముళ్ళపూడి, రావిశాస్త్రి, మునిమాణిక్యం, భమిడిపాటి, భానుమతి మొదలైన వారి రచనలు ఎక్కువగా చదవటంవలనకూడా ఆ ప్రభావం వల్ల ఆ ధోరణిలో రాసిందని అనుకోవచ్చు.
ఎన్నెమ్మ కతలులో రచయిత్రికి ఎవరిమీదైనాగానీ, ఏ అంశం మీదైనా గానీ ఖచ్చితమైన అభిప్రాయం చెప్పవలసి వచ్చినప్పుడో, ఎదుటివారి అభిప్రాయాన్ని ఖండించవలసి వచ్చినప్పుడో గొంతు పెగలకపోతే సంద్రాలు పాత్ర హఠాత్తుగా ప్రత్యక్షమైపోతుంది. అమెరికా వచ్చినా సంద్రాలు యాస మారదు, తీరుమారదు. కుండబద్దలు కొట్టినట్లు దెబ్బలాడాలన్నా రచయిత్రికి సంద్రాలే దిక్కు
'అక్షరం పరమం పదం'లో సంద్రాలు కథ చెప్తారు రచయిత్రి. సంద్రాలు జాలరి యింట పుట్టిన చిన్నదైనా, చేపలమ్మకుండా కూరగాయలు అమ్ముతుంది. ఒకసారి ఒక దొరబాబు వచ్చి 'అందరూ మనుషులే. అందరిలో గిల్లితే ఒకే రక్తం కారతది. మా మతంలో చేరు. గుడ్డలు పెడతం. వణ్ణం పెడతాం. మాతో సమానంగా కూచోపెడతాం' అంటే ఇంట్లో చెప్పింది. కానీ వాళ్ళత్త నువ్వెళ్ళితే వెళ్ళు. మేం రాం అంటే వెళ్ళిపోయింది సంద్రాలు. కానీ అక్కడా అదే దాసరికం. ఏ రాయైతేనేం పళ్ళూడగొట్టుకోడానికి అని తిరిగి వచ్చేసింది. 'అమ్మని మార్చేసుకోగలమా? మరేయమ్మా మనమ్మ కానేదు' అంటుంది. కానీ తిరిగి వచ్చేసరికి దాని మొగుడు మరొకర్తిని తెచ్చుకున్నాడు దాంతో కనిపించే బస్సెక్కి సింహాచలం సివార్ల జిగినీ సాయిబుని చేరింది సంద్రాలు. కానీ అలా ఖాళీగా కూర్చోవటం ఇష్టంలేక కూరమొక్కలు పెట్టి పెంచి 'నానూ ఓమడిసిన'ని గర్వంగా తలెత్తుకు తిరుగుతుంది.
ఈ కథల్లో సంద్రాలు మతాతీత వ్యక్తిగా, నిజానికి గొప్ప స్త్రీవాదిగా, ఆత్మవిశ్వాసం మెండుగా కలిగిన నిలువెత్తు వ్యక్తిత్వం గల మనిషిగా సజీవమైన పాత్రగా రూపొందింది. మాలతి రచనలన్నీ చదివేసరికి చాలామంది పాఠకుల దృష్టిని ఆకట్టుకుంటుంది. ఒక మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేది కేవలం చదువు మాత్రమేకాదు అనుభవాలే సానపెడతాయి అని సంద్రాలు చేత వ్యక్తపరచిన అభిప్రాయాన్ని తెలియజేస్తుంది ఈ రచయిత్రి.
ఎన్నెమ్మ కతలులో నిజానికి అవి కథలనీ చెప్పలేము. కానీ అవి ఒక అంశం గూర్చి కూలంకషంగా, నిజాయితీగా, నిర్భీతిగా చెప్పే కబుర్లు. ఆ సందర్భంలో తెలుగుభాష గురించి కబుర్లలో అమెరికన్ ఇంగ్లీషు, బ్రిటీష్ ఇంగ్లీషు, ఇండియన్ ఇంగ్లీషే కాక హింగ్లీషు (హిందు+ఇంగ్లీషు), తెంగ్లీషు (తెలుగు+ ఇంగ్లీషు) కూడా కలిపి మాట్లాడటాన్ని ఖండిస్తారు. బ్లాగర్లకు క్షమాపణ చెబుతూనే "తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు, ఉర్దూ కలిసిన సంకర భాష ఎంత ప్రాచుర్యంలోకి వచ్చిందో తెలుసుకోవటానికి బ్లాగులు చాలు' అని విమర్శించారు.
మరో ముఖ్యమైన విషయం చెప్పటం గమనార్హం. మాలతి అమెరికా వచ్చిన కొత్తలో అమెరికా ఇంగ్లీషుని ఇంగ్లీషులోనే అర్ధం చేసుకునే దిశలో తెలుగు మర్చిపోవటం జరుగుతుందని అర్థమై, తెలుగు పుస్తకాలు పట్టి పట్టి చదవవలసి వస్తుందని గ్రహించానని, అప్పుడే ఈ భాషాదాస్యం నుండి విముక్తి కోసం 'తూలిక' బ్లాగు మొదలుపెట్టాననీ, తూలిక ఆవిర్భావానికి ఇదే నిజమైన కారణంగా చెప్పింది.
ఎన్నెమ్మ కతలులోని 'మరో ఏడు, మళ్ళీ ప్రతిజ్ఞలు', 'మధురవాణి కూర్చిన నూతన సంవత్సరాగమనం' -ఇ-పుస్తక సంకలనంలో చోటు చేసుకున్నాయి. 'గుర్రం ఎగరావచ్చు' కతని లలిత అనే మిత్రురాలు 'తెలుగు4కిడ్స్' సైటులో బొమ్మల కథగా రూపొందించగా చాలామందిని ఆకర్షించింది. దాంతో మాలతి మరిన్ని పిల్లల కథల్ని రాసారు.
'సుప్రసన్న వదనం లేక ఏంచూసుకుని ఆ..' అన్న కథలో రచయిత్రి టీవీలో ప్రసారమయ్యే కోర్టు టీవీలోని 'జడ్జి జోడీ' షో చూడటం యిష్టం. అందులో చూపించే వ్యక్తుల మధ్య విచ్ఛిన్నమైపోతున్న మానవ విలువలు, కుటుంబ సంబంధాలు, ఒకరినొకరు దోచుకోవటం చూసి దేశంలో నీతిమంతులే లేరా అని టీవీ చూడటం మానుకుని, వాకింగుకి వెళ్ళినప్పుడు కనిపించే మనుషులను పరిశీలించి 'ఇంకా మామూలు మనుషులు' ఉన్నారని సంతోషిస్తుంది. రకరకాల ఛానల్స్లో వస్తున్న ధారావాహికలు చూస్తున్న వారిలో కలిగించే ప్రభావాలపై సంధించిన ఒక అస్త్రం ఈ కథ. మనం పాజిటివ్ ఆలోచించాలంటే ఒక్కొక్కప్పుడు ఇటువంటి నెగెటివ్ అనుభవాలుకూడా అవసరమేనని చెప్పటానికే కుట్రలు, కుతంత్రాల ధారవాహికలు చూపిస్తారనే ఆలోచన పాఠకులకుకూడా కలిగిస్తుంది రచయిత్రి.
ఒక్కొక్కప్పుడు తాత్వికదృక్పథంతో తనలోకి తాను చూసుకుంటుంది. రచయిత్రి. ఆ సందర్భంలో ప్రశ్న మొదటి భావన అనుకుంటే మార్పుకి మూలం ప్రశ్నే కదా. సుఖదుఃఖాలు, మంచీ చెడూ అంటూ బేరీజు వేసుకోకుండా ఆలోచించలేమా? అని ప్రశ్నించుకుంటుంది. ప్రకృతిలో శూన్యం అసంభవం అయినట్లే మెదడుకూడా శూన్యం భరించలేదు అంటుంది ఒక కథలో. ఆలోచనలు స్వయంభువులని అందుకే ఊపిరి ఉన్నంతవరకూ వస్తూనే ఉంటాయనీ, కనుకనే జపతపాలు చేసేటప్పుడు ఓంకారమో, దేవుని పేరో జపిస్తారనుకుంటాను అని ఒక మ్యూజింగ్ లా కొన్ని రచనలు చేసింది.
ఒక్కోసారి నా సందేహాలకు సమాధానాలు వెతుక్కోడానికే కథ రాస్తానంటుంది. మాలతికి ఛాలెంజ్ కావాలి. అదే తనను నడిపించే శక్తి అంటుంది. ఛాలెంజ్ లేకపోవటమే వృద్ధాప్యం అంటుంది. చదువు, సంసారం, పిల్లల్ని పెంచి లోకంమీద వదిలేయటం, ఉద్యోగ విరమణ అన్నీ అయిపోయాక మరేపనీ లేకపోయాక కలిగే నిరీహే వృద్ధాప్యం అని తన ఎన్నెమ్మ కతలులో ప్రకటిస్తుంది.
మొక్కలైనా, పిల్లలైనా వాటి మానాన వాటిని పెరగనివ్వాలి. పిల్లలుగానీ, మొక్కలుగానీ ఎదుగుతుంటే ఆనందించటమే తన అభిమతంగా
చెప్తుంది.
జీవితాన్ని వెనక్కి తిరిగి చూడటం ఎందుకో చెప్తుంది ఒక కతలో, 'అదొక మధురస్మృతి అని కాదు. మనం ఎక్కడ నుండి వచ్చామో తెలుసుకోవటం కోసం. గతం తెలిస్తే తప్ప భవిష్యత్తు దిద్దుకోలేం. అమెరికానో, రష్యానో, బ్రిటనో గొప్ప చరిత్ర సృష్టించిందనీ; వారి చరిత్ర, సాహిత్యం, సంగీతం తెలుసుకొని ఆనందించే ఉత్సాహంలో మనకీ ఓ చరిత్రా, సంగీతం, సాహిత్యం - ఉన్నాయని గుర్తించక పోవటం శోచనీయం' అంటుంది.
వారంటీల పేరు మీద వదల్చుకునే డబ్బుతిప్పలు మీద హాస్యస్ఫోరకంగా రాసింది. బుద్ధి కర్మానుసారిణీ అన్నట్లు మనసుకి ఏం కావాలో అదే బుద్ధికి డిక్టేటు చేస్తుందంటుంది మరో సందర్భంలో, యాదృచ్ఛికంగా తెలుగు4కిడ్స్ మాలతి సామెత కథను బొమ్మలతో పెట్టేసరికి చిన్నపిల్లల కథలు రాయగల రచయితనయ్యానని గర్వంగా చెప్పుకుంటుంది. దాంతో తెలుగు మాట్లాడే పిల్లలు కనిపించారనీ, తెలుగు నేర్చుకుంటున్నవాళ్ళు కనిపించటంతో తెలుగు కనిపించదని బాధపడటంలో తనదే పొరపాటని నిజాయితీగా ఒప్పుకుంటుంది 'గుర్రం ఎగరావచ్చు' కథలో,
ఈ కాలం పిల్లల దృష్టిలో వస్తా అనగానే వచ్చేయటం, చేస్తా అనగానే చేసేయటం, చెప్తా అనగానే చెప్పేయటం, ఆధునిక లక్షణం కాదు అంటుంది గోడమీద 'రేపు'అని రాసేవాటిలో, రాస్తా అనగానే రాసేయటంకూడా' చేర్చాలేమోనని చివరలో చెణుకు విసురుతుంది.
రేపటి పౌరులు తెలుగు చక్కగా మాట్లాడుతారు, రాస్తారు, చదువుతారు అని నమ్మిన మాలతి తన తెలుగు తూలిక వెబ్సైటులో 'బాలతూలిక'కి కూడా ఒక పేజీ కేటాయించి బాలకథలు రాసింది.
బ్రహ్మదేముడు ఆడదాన్ని తయారుచేసి వంటింట్లో కలలుకంటూ పడి వుండు అని పారేసాడేమోమరి అని స్త్రీవాదిలా ప్రకటిస్తుంది. మాలతి తాను స్త్రీవాదిని కాదని చెప్పుకున్నా అనేక రచనలలో ఆ భావప్రకటన కనిపిస్తుంది.ఈమె అతివాది కాదుకానీ స్త్రీ చైతన్యస్ఫూర్తి కలిగి ఉందని ఖచ్చితంగా చెప్పొచ్చు.
'కలలు-నిజాలు' అనే రచనలో రచయిత్రి కావాలనే కల చిన్నప్పటి నుండి తనలో ఎలా వేళ్ళూనుకుందో వయోక్రమంలోనే కథనం చేసింది. ఇది చాలామంది రచయిత్రులకు అనుభవైకవేద్యమే.
'నవ్వొచ్చినప్పుడు చెప్పు'లో హాస్యం గురించి చాలారకాలుగా వివరించింది. హారర్ సినిమాలు తీసే హిచ్కాక్ ఒక ఇంటర్వ్యూలో 'భయం హాస్యానికి మూలం' అన్నమాట మాలతికి ఆలోచనలు రగిలిస్తాయి. ఇటీవల కోతిచేష్టలు, వెక్కిరింతలూ, బూతుహాస్యంగా మారటాన్ని గురించి చాలా కలవరపడుతుంది.
ఎన్నెమ్మకతలు కొన్ని మ్యూజింగ్స్గా, భావవల్లరిలాగో రాసినా కొన్నింటిలో పాత్రలు ఉంటాయి. డాక్టరు కావచ్చు. మిత్రులు కావచ్చు, ఇరుగు పొరుగు, వాకింగ్ మిత్రులు, ఇలా వచ్చే అనేక పాత్రలే కాకుండా ఎక్కువ వాటిలో- అందులోనూ సాహిత్య చర్చలతో కథనం నడిపినప్పుడు - ఎక్కువగా తారకం, సంద్రాలుతోనే తన మనసులోని అభిప్రాయాలని సంభాషణలు, సంఘర్షణలు, చర్చలు రూపంలో వెల్లడిస్తుంది రచయిత్రి. అందులో సాహిత్యానికి సంబంధించిన చర్చల సారాంశం తెలియజేయవలసిన అవసరం ఉంది.
వ్యక్తులు లేని కుటుంబాలు లేనట్లే, కుటుంబం లేని సమాజం లేదు. రచయిత్రులు కుటుంబ జీవనాన్ని ఎన్నుకున్నారు. ఆ పరిధిలో కుటుంబ సభ్యుల మధ్య వుండే పరస్పర సంబంధాలూ, సంఘర్షణలూ, ఆర్థిక పరిస్థితులు సమకాలీన సమాజంలో అన్యాయాలూ, అక్రమాలూ, మధ్యతరగతి మనస్తత్వాలు, అవకతవకలు, తాత్త్విక చింతనలూ ఆవిష్కృతం చేసారు. అంచేత రచయిత్రుల రచనలు విమర్శించాలంటే కూలంకుషంగా పరిశీలించి, వారు తీసుకున్న వస్తువు ఆవిష్కృతమైందా లేదా అనేది ఒక కతలో అరవయ్యవ దశకంలోని రచయిత్రుల రచనలను విమర్శించే వారి గురించిన చర్చలో రచయిత్రి మాలతి సంభాషణ రూపంలో వెల్లడించింది.
మరో కతలో సాహిత్య ప్రయోజనం మీద నాకట్టే నమ్మకం లేదు. ఒకకథ చదివి మనుషులు మారిపోతారని నాకు తోచదు అంటుంది.
కథ ఎలా ఉండాలనేది తారకంతోనో, సంద్రాలుతోనో చర్చిస్తూ, 'కథలో సామాన్య పాఠకుడిని ఆకట్టుకునే ముఖ్యమైన అంశాలు మూడే - కథావస్తువు, సంఘర్షణ, ముగింపు. ఇతర విషయాలు ఎత్తుగడా, శైలీ, కథాగమనం, రచయిత భాషాపాటవం, ఔచిత్యం, మాండలీకం ఇవన్నీ పాఠకుడు పనిగట్టుకు చూడడు. కానీ అవి బాగులేకపోతే చదవాలనిపించదు. కథ ముగియకుండానే కంచికి వెళ్ళిపోతుంది' అంటుంది.
కథ చదివాక 'అవును సుమా! నా జీవితంలో, లేదా తెలిసిన వారి జీవితంలో ఇలాగే జరిగింది. నాక్కూడా ఇలాంటి ఆలోచనలే వస్తాయి' అని పాఠకుడిచేత అనిపించగలిగితే రచయిత కృషికి సార్ధకత. పాఠకుడు కథతోనో, ఒక పాత్రతోనో తాదాత్మ్యం చెందితే సార్వజనీనతకు అదీ గీటురాయి' అని మాలతి అభిప్రాయం.
ప్రతీతరంలోనూ కొత్తదనం ఉంటుంది. ఏ సాహిత్యమైనా ఆ దేశ కాల పరిస్థితుల మీద ఆధారపడి తనదైన ప్రత్యేక వాతావరణంలో పుట్టి వృద్ధి చెందుతుంది. ఆ దృష్టితో చూసే 1950-60దశకాలలో రచయిత్రులు సృష్టించిన సాహిత్యం ఆనాటి సాంఘిక పరిస్థితులను ప్రతిఫలించటంలో సఫలీకృతమైందని మాలతి నమ్ముతుందని అనిపిస్తుంది.
'ప్రతీ అమెరికను మన సంస్కృతి తెలుసుకోవాలనుకుంటే కేవలం మన చీర కట్టు, ఎర్రబొట్టు, అరేంజి మారేజీలు, కులవ్యవస్థలు మాత్రమే కాదని తెలియాలంటే వాళ్ళు మన కథలు చదవాలి' అని అనుకున్నాను. తెలుగు కథలకి అనువాదాలు వస్తున్నాసరే అమెరికాలో ఇంకా 'తెలుగు' అంటే 'నెవర్ హార్డాఫిట్' అనే వాళ్ళే ఎక్కువ. అంచేత అనువాదాలు చెయ్యాలనే సరదాతో వెబ్సైట్ 'తూలిక' మొదలెట్టాను. తొందరగానే నా సైట్ అందర్నీ ఆకర్షించింది అని చెబుతూనే విదేశాల్లో స్థిరపడిన వారికి, ఇంగ్లీషు అలవాటైపోయిన వాళ్ళకి కూడా నచ్చింది అని సంబరపడుతుంది.
ఇంకో కతలో తారకానికి విమర్శ గురించి వివరిస్తున్న సందర్భంలోవిమర్శకుడికి ఉండవలసిన లక్షణాలు చెబుతుంది. నిష్పాక్షిక దృష్టి గురించీ, కథకి నేపథ్యమైన దేశకాల పరిస్థితుల గురించీ క్షుణ్ణమైన అవగాహన ఉండాలంటుంది.
రచయిత రాసిన ప్రతీ విషయం అతని ప్రత్యక్ష అనుభవమే కానక్కరలేదనీ, కథనం పాఠకుడిని కదలించేలా ఉండటమే కాకుండా, పాఠకుడు కథాంశాన్ని తనకో తెలిసిన మరొకరికో అన్వయించుకోగలిగేలా ఉంటే అది మంచి కథగా రాణిస్తుందనీ, అలా చెప్పగలిగితే ఆ కథ సాఫల్యం చెందినట్లే అని మంచి కథని నిర్వచించింది మరో సందర్భంలో.
ఈ కథల్లో అనేక పిట్టకథలు, ప్రముఖుల ముచ్చట్లు, ఇతిహాసాలలోంచి అవసరం మేరకు ఏరుకొచ్చి రాసిన పద్యాలు, సాహితీ ప్రముఖుల రచనల గురించి, ఛానల్స్లో వచ్చే తెలుగింగ్లీషు భాష గురించి, రచయిత్రులమీదా, ఆడ రచయితల మీదా, రచయిత్రులకు చేసే వీరపూజలమీదా, సంకలనకర్తలమీదా, కథలు రాయటం చాతకాని వారు సంకలనాలు చేసి రచయితగా వాసికెక్కిన వారిమీదా, సంద్రాలు యొక్క ఎనిమిది క్లాసు చదివిన అక్కగారి కథల మీదా, వర్తమాన సాహిత్యరంగంలోని ప్రహసనాలమీదా, పేరు తెచ్చుకోటానికి పడే పాట్లమీదా- ఒకటేమిటి సమస్తమైన విషయాల మీదా, వ్యంగ్యంగానూ, హాస్యంగానూ, అద్భుతంగా సాధికారంగా ఎన్నెమ్మకతలలో తారకం సంద్రాలు మధ్య సంభాషణలతోనే చెప్పింది. చాలావాటిలో 'నేను' పాత్ర మౌనంగానే ఉండిపోతుంది.కొన్ని వ్యాసాలలాగో, మ్యూజింగ్స్గో ఉంటాయికానీ సాహిత్య చర్చలు, అభిప్రాయాలు రచయితలో, విమర్శకులు కాగోరే వాళ్ళకు తెలుసుకోవాల్సిన పాఠ్యాంశాలులాగే ఉంటాయి.
ఉప్పల లక్ష్మణరావుగారి 'అతడు-ఆమె' పుస్తకంలో ఆంగ్లపదం రాకుండా ఆసాంతం విశాఖ యాసలోనే రాయటాన్ని ఒక సందర్భంలో ప్రశంసిస్తుంది. మాలతి.
ఒక రచన ఎలా చదవాలి ఎలా అవగాహన చేసుకోవాలి అనేదికూడా
తన ఎన్నెమ్మ కతల్లో చర్చించింది. మాలతి చదివిన త్రిపుర, నోరి నరసింహశాస్త్రి గారి నారాయణభట్టు, రుద్రమదేవి, కవి సార్వభౌముడి గురించీ చర్చించింది. ధారా, శేషేంద్రశర్మ వ్యాసాలు ఎలా రాస్తారో కూలంకుషంగా చెప్పింది. మనకి కూడా అవి చదవాలనిపించేలా ప్రాచుర్యం పొందిన తెలుగు రచనల గురించి సవివరమైన చర్చని సంభాషణలతోనే నడపటం మాలతి ప్రత్యేకత.
తన బ్లాగులో 'ఊసుపోక' శీర్షికన తన జీవితానుభవాలూ, జ్ఞాపకాలే కాక తన పరిసరాలలో, తన చుట్టూ ఉన్న వాళ్ళలో పరిశీలించిన మానవమనస్తత్వాలు , చదువు, మేధావిత్వం, సాహిత్యం, పాండిత్యం, సంస్కృతి, సంప్రదాయాలు వీటినన్నిటికీ అతీతంగా భిన్న సందర్భాలలో వ్యక్తులు ప్రవర్తించే విధానాలనన్నింటినీ ఒడిసిపట్టి రాసినవే ఈ ఎన్నెమ్మ కతలు.
వీటికి ముందుమాటగా యస్. నారాయణస్వామి "వ్యక్తిగత అనుభవాల్ని శోధించి, మధించి, ఆ మధనంలోంచి జీవిత సత్యమనే అమృతాన్ని ఆవిష్కరించినప్పుడు అది నిజమైన డయాస్పోరా సాహిత్యమౌతుంది. ఇటువంటి సాహిత్యం నివాసులకీ, ప్రవాసులకీ మధ్య వారధిగా ఉపయోగపడుతుంది. ఎన్నెమ్మ కతలకి విశాలమైన జీవితానుభవం ఆవరణ కాగా లోతైన పరిశీలన వీటికి పునాది' అని ప్రశంసించారు.
అంతర్జాల సంచారం చేసేవారికి తప్ప ఇంత విస్తృతంగా సుమారు డెబ్బయి సంవత్సరాల కాలంలో రాసిన నిడదవోలు మాలతి రచనలన్నీ గ్రంథ రూపంలో మాత్రమే చదవగల పాఠకులకు అందుబాటులో లేకపోవటం ఒక లోటే.
విశాఖ అందాలూ సముద్ర హెూరునుకూడా అనుభవిస్తూ, విశాఖ మాండలీక సొబగును ఆనందించాలనుకునే పాఠకులు 'tethulika.wordpress.com
దర్శించాల్సిందే.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి