28, డిసెంబర్ 2024, శనివారం
నడక దారిలో -47
నడక దారిలో --47
స్కూల్ తెరిచిన రోజు యథావిధిగా స్కూలుకు వెళ్ళాను. అప్పట్లో లేండ్ లైన్లు ఫోన్లే కనుక కబుర్లన్నీ స్కూల్స్ తెరిచినప్పుడే.బాగా ఆత్మీయ మిత్రులు మాత్రమే అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళం.
వచ్చిన రోజే మా హెచ్చెమ్ " సుభద్రా నీకు ఇన్కమ్ టాక్స్ అయిదువేల పైన పడింది.నేను కట్టేసాను.నువ్వు నాకు ఇవ్వాలి" అంది.
నాకు వచ్చే జీతం కనీసం పదిహేను వేలు కూడా లేదు.ఎప్పుడు టాక్స్ బ్రాకెట్ లోకి రానిది ఈ సారి రావటమేంటి . ఆశ్చర్యం వేసింది అదే అడిగాను.అంతే కాక ఎల్ ఐసీ కట్టిన రసీదులు కూడా ఇచ్చాను కదా.అని అన్నాను.
" అమెరికా వెళ్ళొచ్చావు కదా.విదేశాలకు వెళ్ళిన వాళ్ళకి పడుతుంది" వెటకారం పెదాలు చివర మెరుస్తుంది .కంఠంలో అసూయ కూడా కదిలింది.ఆమె తప్ప మరెవ్వరూ వెళ్ళటం భరించలేనితనానికి ఆశ్చర్యం కాదు అసహ్యం కలిగింది.నేనేమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాను.
మాటిమాటికీ తాను కట్టిన ఇన్కమ్ టాక్స్ గుర్తు చేస్తుండటంతో అయిదు వేలు తీసుకెళ్ళి ఆమెకు ఇచ్చేసి బ్రాహ్మణికి దానం చేసాను అనుకున్నాను.
నాకు బదులుగా నేను స్కూల్లో చేర్చిన కల్పనని నేనే జీతం ఇస్తూ మరికొన్నాళ్ళు కంటిన్యూ చేసాను.
మూడేళ్ళ క్రితం చనిపోయిన పెద్ద మరిది రెండవ కూతురు మళయాళీనాయర్ల అబ్బాయిని ప్రేమించానని చెప్పటంతో పెళ్ళిఏర్పాట్లు మొదలయ్యాయి.అమ్మాయికి పెళ్ళి బట్టలు, కొద్దిపాటి బంగారం,పెళ్ళి భోజనాల ఖర్చు మేము భరించేలా నిర్ణయించుకున్నాము.మళయాళీ పద్ధతిలోనే పెళ్ళి జరిగింది.నా తరపున పెద్దక్క వాళ్ళూ వచ్చారు.ఒక బాధ్యత తీరినట్లే.సర్వే ఆఫ్ ఇండియాలో పెద్దమ్మాయికి ఇంకా వాళ్ళ నాన్న వుద్యోగం సేంక్షన్ కాలేదు.మూడో అమ్మాయిని మల్కాజిగిరి లోని కస్తూర్బా కాలేజీలో బీకాంలో నేనే దగ్గరుండి చేర్పించాను.
వీర్రాజు గారు వచన కవిత్వం లో రాస్తున్న ఆత్మకథను పూర్తిచేసి "పడుగు పేకలమధ్య జీవితం " పేరుతో పుస్తకం వేసారు.డా.భార్గవీరావు,ఆమె సహోద్యోగి డా.పోపూరి జయలక్ష్మి గారూ ఇద్దరూ కలిసి నా " యుద్ధం ఒక గుండె కోత" ను ఇంగ్లీష్ లోకి అనువదించడానికి పూనుకున్నారు.ఏవైనా సందేహాలు వేస్తే ఫోన్ లో నివృత్తి చేసుకొని మరీ చేయటం మొదలెట్టారు.
పల్లవి మామగారికి ఆంజియో ప్లాష్టీ ఆపరేషన్ చేయించుకొవాలని హైదరాబాద్ వచ్చారు. భార్యాభర్తలు ఇద్దరూ మా ఇంట్లోనే దిగారు.ఆయన చెల్లెలు ఏ.ఎస్ రావు నగర్లో వుంటుంది.కానీ నిమ్స్ కి వెళ్ళటానికి మా ఇల్లైతే వీలుగా వుంటుందని వచ్చారు.
ముందు చెకప్ కోసం వాళ్ళిద్దరితో వీర్రాజు గారు వెళ్ళారు.మర్నాడు నిమ్స్ లో జాయిన్ అవుతే అన్ని టెస్టులకు చేయాలన్నారు.వాళ్ళిద్దర్నీ వీర్రాజు గారు చేర్పించి వచ్చారు. ఆపరేషన్ రోజు నేను కూడా స్కూల్ కి సెలవు పెట్టి వెళ్ళాను.
తర్వాత వారంరోజులు. హాస్పిటల్ లోనే వున్నారు.రోజూ సాయంత్రం వీర్రాజుగారితో పాటూ నేనూ వెళ్ళే దాన్ని.అప్పట్లో హాస్పిటల్ లో రోగికి గానీ,సహాయకులకు గానీ భోజనం సదుపాయాలు వుండేవి కాదు.అందువలన ఉదయం కూడా వీర్రాజు గారు టిఫిన్ తీసుకుని వెళ్ళేవారు.తర్వాత వారానికి రివ్యూ చెకప్ కి రమ్మనటంతో మళ్ళీ మా ఇంటికే వచ్చి చెకప్ అయ్యాక చెల్లెలింటికి వెళ్ళి అక్కడ కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకుని విజయనగరం వెళ్ళిపోయారు.దాంతో వాళ్ళు ఉన్నన్ని రోజులూ తీరిక లేనట్లు అయ్యింది.
అప్పట్లోనే పల్లవి వాళ్ళు ఇక్కడ ఫ్లాట్ కొనబోతున్నట్లు తెలిసి ఇక్కడెందుకు కొనటం అని విసుక్కున్నారు.అది గమనించి వీర్రాజుగారు కూడా మనమే ఇక్కడ కొనిపించుతున్నామని పల్లవి మామగారు భావిస్తున్నారు ఏమో అని బాధ పడ్డారు.
నా ప్రమోషన్ పేపర్లు పంపారు కానీ ఫైల్ సమగ్రంగా లేదనో ఏవో ఆటంకాలు కలిగిస్తున్నట్లు తెలిసింది.స్కూల్లో కూడా నాకు పోటీగా కొత్తగా జాయిన్ అయిన సోషల్ సార్ నీ,నా స్నేహితురాలు ఉమారాణీని ఆ పోష్టు తమకు రావాలని నాపైకి ఎగసిన తోయడానికి మా హెచ్చెమ్ ప్రయత్నం చేస్తూనే వుంది.కాని నేను అందులో తలదూర్చ కుండా నాపనేదో నేను మౌనంగా చేసుకుంటూ పోయేదాన్ని.
వీర్రాజు గారూ,బాలాజీ ప్రెస్ బాల ప్రసాద్ పల్లవి వాళ్ళ కోసం సరూర్ నగర్ లో కొన్న అపార్ట్మెంట్ లో పాలరాతి ఫ్లోరింగ్ వుడ్ వర్క్ దగ్గరుండి పర్యవేక్షించే వారు.మెయిన్ ద్వారం తలుపును తీసేసి మా ఇంటికి చేసిన సిద్ధిరాములుతో కార్వింగ్ చేయించడానికి ఇచ్చారు.అక్కడ తీసేసినా తలుపును కూడా ఆ తర్వాత కార్వింగ్ చేయించి పల్లవి మామగారికి పంపించారు.
ఒక రోజు పేపర్ చదువుతుంటే ఒక వార్త ఆకర్షించింది.ఒక ఎన్నారై తన తండ్రి స్థిరఆస్తి డిస్ప్యూట్ లోకి వెళ్ళటంతో న్యాయ బద్ధంగా ప్రయత్నాలు చేసినా పని జరగలేదు.దాంతో ఒత్తిడికి గురై డైరెక్ట్ గా సి.ఎమ్ పేషీకి మెయిల్ చేసాడట.తన సమస్య పరిష్కరించ బడిందని చెప్తూ టెక్నో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడుని అభివర్ణిస్తూ ధన్యవాదాలు చెప్పాడు.అంతే కాదు ఆ వార్తలో సి.ఎమ్ పేషీ మెయిల్ ఐడి కూడా వుంది.
వెంటనే అది నోట్ చేసుకున్నాను.
ఆ రాత్రి కంప్యూటర్ తెరిచి నేను గత ఏడాది గా ప్రతీ మూడునెలలకూ మా స్కూల్ కరెస్పాండెంట్ దగ్గరనుండి విద్యాశాఖాధికారులందరికీ రిజిస్టర్ పోష్టులో పంపించే ఉత్తరాన్ని జాగ్రత్తగా టైప్ చేసి,అంతకు ముందు ఎవరెవరికి పంపించే దాన్నో వారి వివరాలు కూడా త్రూప్రోపర్ ఛానల్ గా (ఆ ఆఫీస్ మెయిల్ ఐడీ లు తెలియదు కనుక)ఆ ఉత్తరం కింద రాసి సి.ఎం పేషీ మెయిల్ ఐడీకి పంపించాను.ఈ విషయం వీర్రాజుగారికి మాత్రమే చెప్పాను.
ఆ మర్నాడు స్కూల్ నుంచి వచ్చాక పల్లవికి ఎప్పటిలా ఒక మెయిల్ రాయాలని నా మెయిల్ బాక్స్ తెరిచాను. ఆశ్చర్యం!! సి.ఎం.పేషీ నుండి నా మెయిల్ ను త్రూ ప్రోపర్ ఛానల్ అని నేను క్రింద ఇచ్చిన వాళ్ళు అందరికీ నా మెయిల్ ఫార్వర్డ్ చేసామని సమాధానం నాకు వచ్చింది.వీర్రాజుగారికి చెప్తే ఆయన కూడా ఆశ్చర్యపోయారు.పదిపన్నెండేళ్ళక్రితమే వీర్రాజు గారు రిటైర్ అయిపోయారు.ప్రభుత్వాలు రెండుసార్లు మారాయి.పేషీలో ఎవరితోటి పరిచయాలు పెంచుకునే తత్వంలేని వీర్రాజుగారికి తెలిసిన వాళ్ళూ లేరు.అటువంటిది ఇంత తక్షణ స్పందన ఆశ్చర్యం కలిగించింది.
తర్వాత వారం లోపునే నాకు స్కూల్ అసిస్టెంట్ గా ప్రమోషన్ చేసినట్లు ఆర్డర్లు వచ్చాయి.అవి చూసి మా హెచ్చెమ్ ముఖం మాడిపోయింది.మొత్తంమీద నా మౌనపోరాటంతో ఇరవై ఏళ్ళ తర్వాత స్కూల్ అసిస్టెంట్ గా ప్రమోట్ అయ్యాను.నా సర్వీస్ బుక్ లో నమోదుచేసి మళ్ళా అప్రూవల్ కి పంపాల్సి వుంది.
నాకు ప్రమోషన్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఒక వారం రోజులకీ అనుకుంటాను.నేను స్కూల్ కి వచ్చేసరికి మా హెచ్చెమ్,మా క్లర్క్ ఇద్దరూ రూమ్ లో చర్చలో వున్నారు.సాధారణంగా ఆఫీస్ స్టాప్ కొంచెం ఆలస్యంగా వస్తారు.ఈరోజు తొందరగా వచ్చాడేమిటి అనుకున్నాను.ఎటెండెన్స్ రిజిస్టర్ లో సంతకం చేసి ప్రార్థనకి అసెంబ్లీలో పిల్లలు వెనుక నిలబడ్డాను.
హెచ్చెమ్ నా పక్కనే నిలబడి నాతో గుసగుసగా " ఇప్పుడు విద్యాశాఖ,సి.ఎం.పేషీ నుండి ఎవరో వస్తున్నారట.బహుశా సోషల్ అసిస్టెంట్ పోష్టులో మేథ్స్ అసిస్టెంట్ గా ఎందుకు ప్రమోట్ చేసారని ఇంటరాగేషన్ కి చేస్తున్నారేమో ? " నాతో అని సర్కాస్టిక్ గా నవ్వింది.అసెంబ్లీ జరుగుతున్నప్పుడు మాట్లాడటం ఎందుకని నేను మౌనంగా వూరుకుని ప్రేయర్ కాగానే రిజిస్టర్ తీసుకుని పదోతరగతి క్లాసులోకి ఎప్పటిలాగే వెళ్ళిపోయాను.
పాఠం చెప్తుంటే నన్ను అర్జంట్ గా రమ్మని ఆయా వచ్చింది.చెప్తున్న పాఠం తొందరగా ముగించి అభ్యాసంలో లెక్క చేయమని చెప్పి హెచ్చెమ్ రూమ్ వైపు వెళ్ళాను.ఒక ఆయన అప్పుడే అందులోంచి బయటకు వచ్చి గేటు వైపు వెళ్ళిపోయాడు.
నేను లోపల అడుగు పెట్టేసరికి మాహెచ్చెమ్ ముఖం ఏడ్చినట్లు జేవురించి వుంది.క్లర్క్ " సుభద్రా టీచర్ వచ్చారు మేడం అడగండి" అన్నాడు.
కందగడ్డలాంటి ముఖంతో నావైపు చూడకుండానే జీరబోయిన గొంతుకతో "మీరే అడగండి " అంది.
నేను ప్రశ్నార్థకంగా చూసాను.
మా క్లర్క్ " మీకు స్కూల్ అసిస్టెంట్ గా ప్రమోట్ చేయలేదని మీరు సి.ఎం. పేషీకి కంప్లైంట్ ఇచ్చారా?"అని అడిగాడు.
అవునన్నాను.
"మీకు ప్రమోషన్ వచ్చిందికదా ఎందుకు కంప్లైంట్ చేసారు" అని తిరిగి అడిగాడు..
"ఎప్పటి నుండో నాకు రావలసిన పోష్టు కావాలని పెండింగ్ పెట్టారు.ప్రమోషన్ రాకముందే నాకు బాధ కలిగి పేషీకి మెయిల్ రాసాను"అన్నాను.నేను ఇంకా ఆశ్చర్యం నుండి తేరుకోకుండానే.
" పోష్టుకి మిమ్మల్ని ప్రమోట్ చేసారా లేదో తెలుసుకోవడానికి సి.ఎం పేషీ నుండి ఇందాక వచ్చారు." అన్నాడాయన.
" మీకు ప్రమోషన్ ఆర్డరు వచ్చినట్లు లెటర్ రాసి ఇవ్వండి " అని నా చేత రాయించుకుని తీసుకున్నాడు..అంతే సేపూ మా హెచ్చెమ్ కందగడ్డలా జేవురించిన ముఖంతో నావైపు కొర కొరా చూస్తూనేవుంది.
రూమ్ లోంచి బయటకు వచ్చిన నాకు హాయిగా పాడుకుంటూ గాలిలో తేలిపోయినట్లుంది.
ఇదంతా కలానిజమా అనుకున్నాను.నిజంగా సి.ఎం.పేషీలో పనులు ఇంత ఆఘమేఘాల మీద జరుగుతాయా?
ఎక్కడో మారుమూల ఒక టీచర్ మెయిల్ చేయడంతోనే సమస్య తీర్చారా? అది జరిగిందోలేదో అని చెకింగ్ కి కూడా రావటం ఏమిటీ?నా విషయంలో జరిగిన విధానం చూస్తె నిజంగా ఈయన టెక్ ముఖ్యమంత్రి అని నమ్మకం కలిగింది.ఈ విషయం ఇంటికి వెళ్ళాక వీర్రాజు గారితో చెప్తే ఆయనకి కూడా ఆశ్చర్యపోయారు.
అయితే అంతటితో నాకు స్కూల్ లో సమస్య తీరిందనుకోటానికి లేదు.నేను ఎవరితోనైనా మాట్లాడుతోంటే ఆ వైపుగా మా హెచ్చెమ్ వస్తే " జాగ్రత్తగా మాట్లాడండి.లేకపోతే సుభద్ర సి.ఎం.పేషీకి కంప్లైంట్ ఇచ్చేస్తుంది" అని ఎత్తు పొడవటం కూడా ఎక్కువైంది.
దానికి తోడూ రెడ్డీ ఫౌండేషన్ వారి పెత్తనం స్కూలు లో ఎక్కువైపోయింది.వాళ్ళ ఎదురుగా తనను గొప్పగా ప్రదర్శించు కోవటం,నాలాంటి కొందరు టీచర్లను చులకన చేసి మాట్లాడటం చేస్తుండేది హెచ్చెమ్.మా అందరికీ కోపం వచ్చేది.ఈమె హెచ్చెమ్ అయ్యాక డీయీవో ఆఫీసులలోనూ, రెడ్డీ ఫౌండేషన్ వంటి స్వచ్ఛంధ సంస్థలవారి దగ్గరా స్కూలునీ, స్కూల్ టీచర్లునీ గౌరవించకపోతే వాళ్ళందరి దగ్గరా చులకన అయిపోవటమే కాక మరింత కాళ్ళకింద తొక్కేసే ప్రమాదం ఉంటుందనే ఇంగిత జ్ఞానం లేక పోతే ఎట్లా?
దాంతో నేను ఎక్కువగా ఎవరితోనూ కల్పించుకొని మాట్లాడకుండా నా పనేదో చేసుకోవటం చేసేదాన్ని.ఇంటికి వచ్చాక కూడా ఇవేవీ వీర్రాజుగారితో కూడా చెప్పడం మానేయటం వలన ఇంట్లో పనులు పూర్తి అయ్యాక చదువుకోవటంలో,రాసుకోవటమో చేసుకునే దాన్ని.అప్పట్లో రాసిన నా కవితలలో కూడా ఆ ప్రభావం వుందేమో అనిపిస్తుంది.ముఖ్యంగా ఏకాంత సమూహాలూ,అంతర్ముఖీన నది మొదలైన కవితలు అటువంటివే.
కవితలన్నీ ఫెయిర్ చేసి పుస్తకం చేసుకోవటానికి వీలుగా పొందుపరిచాను.చదువుకోవటం రాసుకోవటంలోనే నాకు మానసికంగా విశ్రాంతి దొరుకుతుంది.
పాపని తీసుకుని వచ్చి ఓ మూడు నెలలు ఉంటాననీ,పాప రెండవ పుట్టిన రోజు ఇక్కడే చేయాలనుకుంటున్నామని అప్పటికి అజయ్ వస్తాడనీ తర్వాత కలిసి తిరిగి వెళ్తామనీ పల్లవి ఫోన్ చేసింది.ఎట్లాగూ వీళ్ళు వచ్చినప్పుడు పల్లవి వాళ్ళు కొనుక్కున్న ఇల్లు గృహప్రవేశం కూడా చేసుకుంటే బాగుంటుంది అని మేము అనుకున్నాము.ఇల్లు కూడా దాదాపు తయారైపోయింది.
పల్లవి వాళ్ళు వచ్చినప్పుడు,గృహప్రవేశానికి అవసరమౌతాయని సెలవులు పెట్టకుండా జాగ్రత్తగా వాడుకోసాగాను.
పల్లవీ,పాపాయి ఆషీ వచ్చేసరికి మళ్ళా ఇల్లు సందడిగా మారింది.చంటిపాప కేరింతలు ఇంట్లో సీతాకోకల్లా ఎగిరాయి.బుడిబుడి అడుగులతో కాలి మువ్వలు కిలకిల్లాడాయి.ఇల్లంతా వెలుగులు నిండాయి.
బంధువులు , స్నేహితులు పిల్లల్ని చూడటానికి రావటంతో తీరిక లేకుండా అయింది.
పల్లవి వున్నప్పుడే నా "ఏకాంత సమూహాలు" కవితా సంపుటి ఆవిష్కరణ కార్యక్రమం కూడా అనుకున్నందున పుస్తకప్రచురణ పనిలో వీర్రాజుగారు మునిగిపోయారు.మృణాలినిచే నా పుస్తకాన్ని పరిచయం చేసేటట్లుగా నిర్ణయించి పుస్తకావిష్కరణ నిర్వహించాము.ఆ పుస్తకాన్ని పల్లవికి,అనుపల్లవైన ఆశ్లేషకూ అంకితం చేసాను.
నవంబర్లో కార్తీక పౌర్ణమి రోజు గృహప్రవేశం అనుకోవటం వలన ఆరోజు బంధువులూ,దగ్గరి మిత్రులతో కానిచ్చేసి, మర్నాడు ఆషి రెండవ పుట్టినరోజున అందరికీ పార్టీ ఏర్పాటు చేసాము.పల్లవి అత్తగారూ,మామగారూ,వారి బంధువులు కూడా వచ్చారు.వచ్చిన దగ్గర నుండి వాళ్ళు కొడుకు సంపాదన అంతా మేము ఖర్చుపెట్టించేస్తున్నామనేమో చాలా సీరియస్ గా వున్నారు.అది మమ్మల్ని బాధ పెట్టింది.ఈ కార్యక్రమం అయిన మర్నాడు వాళ్ళు ఏ.ఎస్.రావు నగర్ లోని చెల్లెలింటికి వెళ్ళిపోయారు.
మరో రెండు రోజులు తర్వాత పల్లవీ అజయ్ కూడా వాళ్ళింటికి వెళ్ళి అక్కడి నుండే తిరుపతికి వెళ్ళి,విజయనగరం వెళ్తామని చెప్పారు.తిరిగి నాలుగైదు రోజులకు వచ్చి హైదరాబాద్ నుండే ఫ్లైట్ కి వెళ్తామన్నారు.
విజయనగరం వెళ్ళేరోజు వాళ్ళందరికీ టిఫిన్ చేసి స్టేషనుకు తీసుకు వస్తానని చెప్పాను.
తీరా ఆ రోజు నవంబర్ 14.బాలలదినోత్సవం.నేను సెలవు పెట్టాలనుకుంటే మా హెచ్చెమ్ తనకి ఒంట్లో బాగాలేదని అసిస్టెంట్ హెచ్చెమ్ విజయలక్ష్మీ మీరూ సెలబ్రేషన్స్ చేయమని ఫోన్ చేసింది. నేనూ సెలవు పెట్టాలనుకుంటున్నానని చెప్తే విజయలక్ష్మికి అప్పగించి మీరు తొందరగా వెళ్ళిపోండి.అంది.ఇక తప్పదని స్కూల్ కి వెళ్ళాను.తీరా విజయలక్ష్మి కూడా సెలవులో వుందని ముందురోజు ప్లాన్ వేసుకొని నన్ను ఇరికించారని తెలిసింది.
హెచ్చెమ్ రూమ్ తాళాలు లేవు.అటెండర్ ని హెచ్చెమ్ ఇంటికి పంపించి ప్రోగ్రాం మొదలుపెట్టే సరికి ఆలస్యం అయింది.డాన్సులు నేర్చుకొని వచ్చిన పిల్లల్ని నిరుత్సాహ పరచలేను.నేను ఇక్కడ మధ్యలో వదిలి వెళ్ళలేను.ప్రోగ్రాం పూర్తి చేసాం ఇంటికి వెళ్ళి టిఫిన్స్ తయారుచేసి స్టేషన్ కి వెళ్ళాలి.ఒక వైపు హెచ్చెమ్ చేసిన కుట్ర వీటితో నాకు టెన్షన్ పెరిగిపోయింది.పిల్లల్నీ, టీచర్లను పంపి గదులకు తాళాలు వేసుకొని ఆటో తీసుకుని ఇంటికి వెళ్ళేసరికి రెండు దాటింది.గబగబా భోజనం చేసి చపాతీలు,కూరా చేసి పేక్ చేసుకుని ఇద్దరం స్టేషన్కు బయలుదేరి పల్లవి వాళ్ళకు అందించాము.
ఆ రోజంతా శారీరకంగా, మానసికంగా అలసి పోయానేమో రాత్రి తొందరగా పడుకున్నాను.
నడక దారిలో -46
నడక దారిలో -46
ఇంట్లోకి వెళ్ళి కాళ్ళూ చేతులూ కడుక్కొని పల్లవికి పుట్టిన అనుపల్లవి పాపాయిని ఎత్తుకున్నాను.తొందరపడి ముందే లోకం లోకి వచ్చిందేమో చాలా సన్నగా వుంది.ఇంట్లో చంటిపిల్లల్ని ఎత్తుకుని చాలా కాలమైంది కదా అపురూపంగా అనిపించింది.ఎంతయినా అసలు కంటే కొసరు ముద్దు అంటారు కదా.
అక్కడ పుట్టిన వెంటనే బర్త్ సర్టిఫికేట్ లో పేరు చెప్పాలట.ఇంకా మేము పేరు ఆలోచించటం పూర్తికాకుండానే పుట్టేసిందికదా.అందుకని జన్మనక్షత్రాన్ని బట్టి ఆశ్లేష అని రాయించేసారు.మేమంతా ఆషీ అని పిలుచుకోసాగాము
రాత్రి భోజనానికి ఆ స్టౌలూ, వంటిల్లూ అంతా కొత్తగా వున్నా,పల్లవికి కొంచెం సాయం చేసాను.మేము రాగానే పల్లవి అత్తగారు ఇంక తమ బాధ్యత అయిపోయిందనుకున్నారేమో వాళ్ళు గదిలోకి వెళ్ళిపోయారు.
రాత్రి అత్తగారు వాళ్ళకోసం చేసినప్పుడే పల్లవి రెండు చపాతీలనూ,కొంచెం కూర టప్పరువేర్ టిఫిన్ బాక్స్ లో సర్ది ఫ్రిజ్ లో పెడుతుంటే 'ఎందుకు' అని అడిగాను."ఉదయం ఆరుకే నేను బస్ పట్టుకొని ఆఫీస్ కి వెళ్ళాలి కదా" అంది.
నాకు గుండె ఝల్లుమంది.మోకాలు మునిగేలా మంచు కురుస్తున్న వేళ పచ్చి పురటాలు వెళ్తుందా అని కళ్ళు చెమ్మగిల్లాయి."ఆపీసులో జాయిన్ అయిపోయావా " అన్నాను."ఆషీని చూసేందుకు వాళ్ళు ఉన్నారు కదా జాయిన్ అయిపోమన్నారు "
అంది.
మర్నాడు ఉదయమే లేచి రెండు మూడు లేయర్లుగా చలికోట్లు వేసుకొని ఆ చలిలో పల్లవి వెళ్తుంటే కింద వరకూ తనతో పాటూ వెళ్ళేదాన్ని.ఇండియాలో మూడునెలల వరకూ మంచం దిగకుండా బాలింతలను తల్లులు అపురూపంగా చూసుకుంటారు.నాకు జరగలేదు సరే ఈ పిల్లకూడా ఇలా కష్టపడుతోందే అని దుఃఖం వచ్చింది.
అంతకన్నా నన్ను బాధించిన విషయం పల్లవి తనతో పాటూ ఒక కిట్ తీసుకు వెళ్ళేది.ఆఫీసులో స్పెషల్ గా రూమ్స్ ఉంటాయట.అక్కడ తన పాలు పంపుచేసి బాటిల్స్ నింపి ఐస్ బాక్స్ లో ఉంచి తీసుకు వస్తుంది.నింపిన బాటిల్స్ ఫ్రిజ్ లో వుంచి ఖాళీ బాటిల్స్ మర్నాడు తీసుకు వెళ్తుంది.బాటిల్స్ ని వేడి నీటి కొళాయి కింద పెడితే గడ్డకట్టిన పాలు కరుగుతాయి.అవి ఆషీకి పట్టాలి.ఇది అక్కడి వాళ్ళకు సహజమే కావచ్చు.కానీ నాకు గుండె చెరువైంది.
తర్వాత్తర్వాత రాత్రి వండినవి కాకుండా నేను ఉదయమే లేచి పల్లవికి టిఫిన్ తయారు చేసి ఇచ్చేదాన్ని.
అజయ్ బెంచ్ మీద ఉన్నాడు.మరో వుద్యోగం వేటలో వున్నాడు.అందువల్ల పల్లవికి వుద్యోగం తప్పని సరైంది.పల్లవి అత్తగారు " మీరు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఇక్కడే వుండిపోయి మనవరాల్నీ ,వీళ్ళనీ చూసుకోవచ్చుకదా " అంది.
నాకు కోపం,బాధా కలిగినా సమాధానం చెప్పలేదు.
రెండుమూడు కుటుంబాలను పిలిచి భోగీ పండుగకి పాపాయికి భోగీపళ్ళు పోసాము.
పండుగ వెళ్ళాక అజయ్ అమ్మా నాన్నా కూతురు దగ్గరకు వెళ్ళిపోయారు.
నాకు కంప్యూటర్ మీద తెలుగు న్యూస్ పేపర్లు ఓపెన్ చేసి చదువుకోవటం నేర్పింది పల్లవి.వంటపనీ,పాపాయి స్నానం,పానం పూర్తయ్యాక పడుకోబెట్టేదాన్ని.ఆషీ లేచేలోపున పేపర్లు చదివి వీర్రాజుగారికి విశేషాలు వినిపించే దాన్ని.పల్లవి దగ్గర కూడా కుట్టు మిషను వుంది.అందుకని అప్పుడప్పుడు చిన్నచిన్న ఫ్రాకులు కుట్టే దాన్ని.
ఆషీ అల్లరేమీ చేసేది కాదు.కబుర్లు చెబుతుంటే హాయిగా నవ్వులు ఒలకబోస్తూ చక్కగా ఆడుకునేది.రాత్రిపూట కూడా అల్లరి లేకుండా నిద్రపోయేది.కానీ ఏపాటి శబ్దం వచ్చినా ఉలికి పడటం ఎక్కువగా వుండేది.ఆఖరుకు ఎక్కడో వంటింట్లో కుక్కర్ విజిల్ వేసినా ఉలిక్కిపడి ఏడ్చేది.అందుకని ఆ సమయంలో దగ్గరగా వుండి చూసుకోవాల్సి వచ్చేది.
పల్లవి వచ్చేసరికి నాలుగు అయ్యేది.పాపాయి పనులతో సమయం గడిచిపోతుండేది.అవసరం అయినప్పుడు పాపకి స్నానం చేయించేటప్పుడో,పాలుపట్టటానికో ,ఇతరపనుల్లో సాయం చేసినా వీర్రాజుగారికి బోలెడు ఖాళీ సమయం దొరకడంతో వచన కవిత్వం లో ఆత్మకథ రాయటం మొదలెట్టారు.
వీకెండులో కూరలూ ,వెచ్చాలు తీసుకు రావటానికి అందరం బయలుదేరే వాళ్ళం.అప్పట్లో ఇండియాలో దొరికే కూరలూ,పళ్ళూ అక్కడ అంతగా దొరికేవి కాదు.
ఇండియా నుండి శంకరం,పొనుగోటి కృష్ణారెడ్డి,ఉమా నుండీ ఉత్తరాలు వస్తూ వుండేవి.ఒకరోజు శంకరం ఉత్తరం ద్వారా మాడభూషి రంగాచార్యులుగారు మాసివ్ హార్ట్ ఎటాక్ తో చనిపోయినట్లు తెలిసి చాలా బాధపడ్డాము.
నేను ఇక్కడికి వచ్చేటప్పుడు అయిదు సీల్డ్ కవర్లు శంకరంకి ఇచ్చి ఒక నెల పోయాక విద్యాశాఖ వారందరికీ రిజిస్టర్ పోస్టు చేయమని చెప్పాను.
శంకరం నిర్వహించే చలం జయంతికి జరిపే 'చలం జీవజలం'సభ సమయంలో ప్రెస్ క్లబ్ బాత్ రూంలో కరపత్రాలకట్టలు ఉన్నాయట.నీలిమేఘాల కవయిత్రులందరిమీదా అశ్లీల పదజాలంతో ఏమేమిటో రాసిన ఆ కరపత్రాలు సాహిత్య రంగంలో పెను సంచలనం సృష్టించాయని పేపర్ వలన తెలిసింది.ఎవరు రాసారో ప్రింట్ చేసినదెవరో నిజానిజాలు తెలియలేదు.మేము ఇంత దూరంలో వుండి పోవటం వలన ఈ విషయాలన్నీ చూచాయగా మాత్రమే తెలిసాయి.ఏదేమైనా ధైర్యంగా ముందు నడుస్తున్న స్త్రీలను పడగొట్టాలంటే తీసుకునే అస్త్రం వ్యక్తిత్వహననమే కదా.ఇక్కడా అదే జరిగి వుండాలి అనుకున్నాము.
నేను వీలున్నప్పుడు చదువుదామని కథల పుస్తకం తెచ్చుకున్నాను కానీ ఆషీ ఉంగా ఉంగా
కబుర్లతోనే సమయం గడిచిపోయింది.
ఒకరోజు పల్లవి ఆఫీస్ నుండి వచ్చే సమయంలో మంచు తుఫాను పట్టుకుంది.రోడ్డంతా మంచుతో నిండి పోవటంతో బస్ ఇంటి వరకూ రావటానికి వీలులేక దూరంగా ఆగిపోయింది.నాకు ఫోన్ చేసి వేడివేడిగా టీ చేసి రెడీగా ఉంచమని చెప్పింది.మంచులో కాళ్ళుకూరుకుపోతుంటే పైన మంచు కురుస్తుంటే అలాగే సాధ్యమైనంత వేగంగా నడవటానికి ప్రయత్నించి ఇల్లు చేరింది.పల్లవి ఇల్లు చేరే వరకూ గుండె పిడికిట్లో పెట్టుకున్నాను.రాగానే వేడి టీ కప్పు తీసుకుని స్టౌ దగ్గర వళ్ళు వెచ్చ చేసుకుంది.ఇల్లంతా కేబుల్ హీటర్లతో వెచ్చగా వున్నా తట్టుకోలేకపోయింది. టీ తాగేక వణుకు తగ్గింది.మంచులోంచి రాగానే ముట్టుకుంటే స్టాటిక్ వల్ల షాక్ కొడుతుంది.అందుకని బట్టలవీ మార్చుకొన్నాకే పల్లవికి ఆషీని ఎత్తుకోవాల్సి వచ్చేది.
అదీగాక అక్కడ టోర్నెడోలు ఎక్కువట.ఆఫీసుల్లో, స్కూల్లో టోర్నెడోలు వేస్తే తీసుకోవాల్సిన తక్షణచర్యల ట్రైనింగ్ కూడా ఉంటుంది.అందుకని సైరన్ తరుచూ వినిపించేది.
వెళ్ళిన కొత్తలో మంచు కురవటం చూస్తుంటే సరదాగా వుండేది.రానురానూ బయటకు వెళ్ళేందుకు కుదరక ఇంట్లో అలా నాలుగు గోడల మధ్య వుండటం విసుగుగా వుండేది.వారాంతంలో అవసరమైన వెచ్చాలకోసం మాల్స్ కి వెళ్ళటం వుండేది.రోజూ ఉద్యోగం,మీటింగులు వెళ్ళటం అలవాటు వలన కాళ్ళు కట్టేసినట్లే వుండేది.
తెలుగు విశ్వవిద్యాలయంలో రచయిత్రుల మహాసభలు జరిగాయట.ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ విశ్వవిద్యాలయంలో విలీనం కాక ముందు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ద్వారా బహుశా నాలుగేళ్ళకోసారనుకుంటాను అఖిలభారత తెలుగు రచయిత్రుల మహాసభలు నిర్వహించేది. ఇప్పుడు వైస్ ఛాన్సలర్ అయిన
డా.ఎన్.గోపీగారు మళ్ళా ఆ వరవడిని ప్రారంభిస్తే మంచిదే.కానీ నేనే ఆ సభల్ని మిస్ అయ్యానని బాధ కలిగింది.
అప్పట్లో అక్కడ టీవిలో తెలుగు ఛానెల్స్ వచ్చేవి కావు.అందుకని పల్లవి వాళ్ళు దగ్గర వున్న సినీమాల వీడియో కేసెట్స్ గానీ,లేదా టీవిలో ఇంగ్లీష్ సినిమాలు గానీ ఖాళీ సమయాల్లో చూసేవాళ్ళం.లేదా పల్లవి దగ్గర వున్న లలిత సంగీతం ఆడియోలు పెట్టుకునే వాళ్ళం.అవైతే అక్కడ కూచునే వినక్కరలేదు కదా.ఆషీ పనులు చేస్తూనే రావు బాలసరస్వతి, సాలూరి రాజేశ్వరరావు పాటలు వింటూ పాడుకునే దాన్ని.పల్లవికి జోలపాడినట్లుగానే ఆషీని నిద్రపుచ్చుతూ ఎన్నో పాటలు పాడేదాన్ని.
అజయ్ కి అట్లాంటాలో ఉద్యోగం వచ్చింది.
అజయ్ అక్కడకు వెళ్ళి జాయిన్ అయ్యాడు.ఇల్లు దొరికిన తర్వాత మేమంతా వెళ్ళటానికి నిర్ణయం అయ్యింది . అంతవరకూ వుద్యోగంలో చేయాలని పల్లవి నిర్ణయించుకుంది.అంతే కాకుండా పాపం నాకు బాగా అలవాటైపోయింది.మేము వచ్చి నాలుగు నెలలు కావస్తోంది.అందుకని ఆషీకి స్నానం చేయించటం,ఇతర పనుల్నీ అలవాటు చేసుకోవటానికి ముందుగానే మానేస్తానని చెప్పింది.
ఇక్కడ అద్దె యింట్లో వున్నప్పుడు ఇల్లు, సామాన్లు ఎలా వున్నాయో అలాగే ఓనర్లకు అప్పగించాలంట.ఏవైనా పాడౌతే వాటికి బదులుగా కొత్తవి అమర్చాలి.ఆఖరుకు బాత్ రూంలతో సహా.
అందుకని వారాంతాల్లో అజయ్ వచ్చినప్పుడు ఇల్లు క్లీనింగ్ లు,ఏవి కొత్తవి అమర్చాలోనని చెకింగ్ లు మొదలెట్టారు.
అజయ్ ఏ వారం అయినా రాకపోతే ఆషీని చూసుకోమని వీర్రాజుగారికి అప్పగించి ,పల్లవీ,నేనూ మాల్స్ కి వెళ్ళేవాళ్ళం.
అజయ్ కి ఇల్లు దొరికిందట.అట్లాంటాకి వెళ్ళాలి కనుక పల్లవి వుద్యోగం మానేసింది.నా సహాయంతో ఆషీ పనులన్నీ పల్లవే చూసుకోవటంతో నాకు కొంచెం తీరిక దొరికింది.
మూవర్స్ & పేకింగ్ వారిని పిలిచారు.బలిష్టంగా వుండి అతి సులభంగా ఎంతో బరువున్న పెద్ద సోఫాల్ని ఫేక్ చేసి మోసుకుని తీసుకు వెళ్తున్న నల్లజాతి వారిని చూస్తుంటే ఆశ్చర్య పోయాను.సామానంతా వెళ్ళిపోయింది.మర్నాడు ఫ్లైట్ కి మేము వెళ్ళాల్సి వుంది.
అనుకోకుండా మా స్కూల్ లో నా సహోద్యోగిగా పనిచేసి పదవి విరమణ చేసిన లెక్కలటీచర్ ఇందిర కుమారిగారి నుండి ఫోన్.మినియాపొలీస్ లోనే వున్న ఆమె చిన్న కుమారుడి ఇంటికి వచ్చారట.నన్ను,పల్లవినీ చూడాలని వుందనీ,ఒక గంటలో మా ఇంటికి వస్తామని ఫోన్ చేసారు.తప్పక రమ్మని ఇంటి లోకేషన్ చెప్పి ఆహ్వానించాము.
అన్నట్టుగానే గంటలో వారబ్బాయి కుటుంబంతో కలిసి వచ్చారు.అందరూ మాతో కలిసిపోయి కబుర్లు చెప్పారు.నేను స్కూల్లో చేరినప్పటి నుండీ ఇందిరాటీచర్ నాతో స్నేహంగా ఒక పెద్దక్కలా వుండేవారు.ఆవిడ రిటైర్ అయ్యాక ఆ పోస్టులో నాకు ప్రమోషన్ ఇవ్వలేదని తెలిసి బాధ పడ్డారు.మినియాపొలిస్ లోని మంచువర్షాలకీ,చలికీ,ఇంటిలోనే వుండాల్సిన పరిస్థితి గురించి చాలా సేపు మాట్లాడారు.వాళ్ళు ఇక్కడికి వచ్చి నాలుగు రోజులే అయిందని ,చలికి తట్టుకోవటం కష్టంగా వుంది అన్నారు.ఓగంట వుండి వెళ్ళారు.అట్లాంటా వెళ్ళాక సర్దుకున్నాక ఫోన్ చేస్తానని వాళ్ళ అబ్బాయి నెంబర్ తీసుకున్నాను.
మర్నాడు ఫ్లైట్ కి అట్లాంటా బయలుదేరాము.అయితే ఫ్లైట్ బయలుదేరినప్పుడు, లాండింగ్ సమయంలో ఆ. శబ్దానికి ఆషీ ఒకటే ఏడుపు మొదలెట్టింది.ఈపిల్లకి శబ్దాలు వింటే ఇంత బెదురేమిటో అనుకున్నాము.పెరిగిన తర్వాత తగ్గుతుందేమో అనుకున్నాము.అట్లాంటాలో వీళ్ళ ఇంటికి దగ్గరలోనే పైలట్ ట్రైనింగ్ సెంటర్ ఉండటంతో మాటిమాటికీ విమానాల లాండింగ్, ఫ్లైయింగ్ శబ్దాలు వినిపించుతూ వుండేవి.
కొన్నాళ్ళు అయితే ఆ శబ్దాలు వినీ వినీ ఆషీ అలవాటు పడితే ఏడుపు తగ్గుతుందేమో అనుకున్నాము.
అట్లాంటాలో వాతావరణం ఇండియాలో లాగే వుండటంతో సాయంత్రం పూట పల్లవీ,నేనూ ఆషీని తీసుకోని అక్కడే బయట తిరిగే వాళ్ళం.
ఓ వారం రోజులయ్యాక ఇందిరా టీచర్ తో మాట్లాడాలని ఫోన్ చేసాను.ఒక షాకింగ్ న్యూస్.ఆ రోజే చర్చ్ కి వెళ్ళొచ్చిన తర్వాత లంచ్ కాగానే పడుకుని నిద్రలోనే మాసివ్ హార్ట్ ఎటాక్ వచ్చిందట.చలికి తట్టుకోవటం కష్టంగా ఉంది అన్నారు.ఆరునెలలు పిల్లలతో ఉండాలని వచ్చిన ఆమె ఇలా లోకం నుండే వెళ్లిపోయారని తెలిసి చాలా దుఃఖం కలిగింది.
అట్లాంటాలో నీటి లోపల వుండే జార్జియా అక్వేరియం ఒక వారాంతం వెళ్ళి చూసాము.చాలా రకాల పెద్ద పెద్ద చేపలు మనపై నుండి ఈదుకుంటూ పోతుంటే చూడటం అద్భుతంగా అనిపించింది .మరో వారాంతంలో జార్జియా స్టోన్ మౌంటెన్ పార్క్ కి వెళ్ళాము.మౌంటెన్ గోడ మీద నలుగురు నాయకుల ముఖాలు చెక్కివున్నాయి.నాకు మాత్రం ఇండియాలోని గుడుల లోని శిల్ప సౌందర్యం దగ్గర ఇది ఏముంది అనిపించింది.చాలామంది అమెరికన్లు ఫోల్డింగ్ కుర్చీలు,తినటానికి రకరకాల పదార్థాలతో వచ్చారు.మేము కాసేపు వుండి వచ్చేసాము.
ఆషీకి అయిదోనెలరాగానే ఒక రోజు అన్నప్రాసన కూడా చేసాము.కొద్దికొద్దిగా ఘన పదార్థాలు తినటం అలవాటు చేయటం ప్రారంభించాము.
మేము వచ్చి అయిదు నెలలు దాటింది.స్కూల్ తెరిచే సమయానికి ఇండియా వెళ్ళేలా నిర్ణయించుకున్నారు.అందుకని అక్కడి వాళ్ళకు చిన్న చిన్న కానుకలు కానుకలు కొనాల్సి వుంది.
మేము బయలుదేరేటప్పుడు బయట వరండా తాళాలు పక్కవాళ్ళకి ఇచ్చాము. పనిఆమెకి అప్పుడప్పుడు వచ్చి మొక్కలకి నీళ్ళు వేయమని చెప్పాము.అందుకని అయిదునెలలకీ ఆమెకి జీతం డబ్బు కూడా ఇచ్చేసాము.
ఆదివారం అయితే శంకరంగారు తాను వెళ్ళి ఇల్లు శుభ్రం చేయిస్తానని అన్నారు.కానీ.ఆమె రాలేదట.శంకరంగారే వెళ్ళినప్పుడు మొక్కలకు నీళ్ళు పోసారట.మెము వచ్చే ముందు కూడా పాపం ఆయనే కొంత శుభ్రం చేసారని తెలిసి మేము బాధపడ్డాము.
మేము బయలుదేరే రోజు వచ్చింది.అసలు కంటే కొసరు ముద్దు అన్నట్లు ఆషీతో అనుబంధం పెరిగి వదిలిపెట్టి వెళ్ళటం కష్టంగా అనిపించింది.పల్లవికి జాగ్రత్తలు చెప్పి ఫ్లైట్ ఎక్కటానికి ఎయిర్ పోర్ట్ లోకి వెళ్ళిపోయాము.
మొత్తంమీద ఎలాగైతేనేం మా అమెరికా ప్రయాణం పూర్తిచేసుకుని ఇండియాకు తిరిగి వచ్చాం.ఎయిర్ పోర్ట్ కి కృష్ణారెడ్డిగారూ, శంకరంగారూ వచ్చారు.క్షేమంగా ఇంటికి చేరాము.వరండాలోని మా మొక్కల్ని చూసుకున్నాము.మూడునెలలుగా ఎండాకాలమే కావటంతో నీళ్ళు వేసినా దిగులు ముఖంతో వున్నాయనిపించింది.రెండురోజులు వరసగా నా చేతులతో నీళ్ళు పడేసరికి నన్ను చూసి నవ్వుతూ పలకరించి కళకళలాడాయి.ఆ దృశ్యం నాచే 'నిరీక్షణల కొసం చివర' అనే కవిత రాయించింది.
స్కూల్ తెరిచేలోగా ఇల్లంతా సర్దుకుని ఒక కొలిక్కి తీసుకువచ్చాక వీర్రాజు గారూ ,నేనూ అక్కడి కబుర్లు చెప్పుకుంటూ ".వాళ్ళిద్దరూ బాగానే వున్నారు.ఆషీ కొంచెం పెరిగాక పల్లవికూడా వుద్యోగం చేస్తే ఆర్థికంగా పుంజుకుంటారు.ఇక్కడకు వస్తారో అక్కడే స్థిరపడతారో.కాని ఇక్కడ ఇల్లు ఏదైనా కొంటామన్నారు.ఇంక మనం ఏమీ పల్లవి కోసం డబ్బు దాచాల్సిన పనిలేదు.ఇంకా పల్లవి గురించి ఆలోచించక్కరలేదు.మనం మనపుస్తకాలు వేసుకుంటూ మనకోసమే మనం బతకొచ్చు."
అని తృప్తిగా వూపిరి పీల్చుకున్నాము.
నడక దారిలో -45
నడక దారిలో -45
డా.భార్గవీరావు ఒకసారి మాయింటికి వచ్చినప్పుడు 'వందమంది రచయిత్రుల వందకథలను సంకలనం చేయాలనుకుంటున్నాను ' అన్నారు.సరే ముగ్గురం కూర్చొని జాబితా తయారు చేసాం.అయితే కనీసం ఒక సంపుటి అయినా వచ్చిన రచయిత్రులను తీసుకుంటే బాగుంటుందని వీర్రాజుగారు అన్నారు.ఆ రకంగా కొందరి పేర్లు తొలగించాం.వందకన్నా ఎక్కువ పేర్లువున్నాయి.భార్గవిరావు " వారందరికీ వుత్తరాలు రాస్తాను.స్పందించిన వారి కథలు మాత్రమే తీసుకుంటాను.చనిపోయిన వారి కథల్ని మనమే ఎంపిక చేద్దాం" అన్నారు.ఆ పని మొదలైంది.ఆమె మమ్మల్ని ఒక్కరినే కాక చాలా మందిని సంప్రదించింది.దాంతో మొగమాటాలకి లోబడి ఒక్క కథ రాసిన వారివి కూడా ఆమె తీసుకున్నారు.అది మాకు నచ్చకపోయినా మౌనంగా వూరుకున్నాము.భార్గవీరావు సంపాదకత్వంగానే వందమంది రచయిత్రుల వందకథలతో "నూరేళ్ళ పంట" సంకలనం మిళిందీప్రకాశన్ వాళ్ళ ద్వారా వెలువడింది.
నూరేళ్ళపంటకి మంచి గుర్తింపు రావటంతో అదేవిధంగా వందమంది కవయిత్రుల సంకలనం మన ఇద్దరం కలిసి వేద్దాం అంది భార్గవీరావు.మొల్లదగ్గరనుండి మొదలు పెడదాం అంటే సరే అన్నాను.కవయిత్రుల జాబితా తయారుచేసి వాళ్ళందరికీ ఉత్తరాలు రాసి వాళ్ళ కవితా సంపుటాలను పంపించమని కోరాము.అయితే కొందరు కవయిత్రులు వారే తప్ప ఇతరులు కవయిత్రులూ,కథకులు కానేకారని భావించి కవిత ఇవ్వటానికి నిరాకరించారు.ఒకరిద్దరు ఇవ్వనన్నంతలో ఆగదు కదా.
కవితా సంపుటాలు చదివి అంతకుముందు సంకలనాలలో రాని మంచి కవితలను ఎంపిక కోసం చదవటం నాకు ఆనందం కలిగించింది.అనుకున్నట్లుగా వందమంది కవయిత్రులు కవితా సంకలనం " ముద్ర" ను కూడా మిళిందీ ప్రకాశన్ వారే ప్రచురించారు.మేము ముందుమాటలో కొందరు వాళ్ళ కవితలను చేర్చటానికి ఇష్టపడలేదనే మాటల్ని స్పష్టంగా రాసినా సమీక్షలు రాసిన వారు ఒకరిద్దరు ఎత్తి చూపటం భార్గవీరావుకు ఆగ్రహం తెప్పించింది.
" చిన్నన్నయ్యకి గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఏర్పడ్డాయనీ,ఆపరేషన్ చేయించుకుంటున్నాడనీ,నీకు హిస్ట్రెక్టమి జరిగినప్పుడు సత్యవతి సాయానికి వచ్చింది కనుక నువ్వు వాళ్ళకి సాయం వస్తే బాగుంటుందని " మా పెద్దక్క ఉత్తరం రాసింది.నాకు సంక్రాంతి సెలవులే కనుక రిజర్వేషన్ చేయించుకుని విజయనగరం వెళ్ళాను.నాతో వాళ్ళు సంబంధం తెంచుకున్నా గానీ నేను రావటం ఆశ్చర్యం కలిగింది.నాతో ఎక్కువ మాట్లాడకపోయినా ఆపరేషను అయ్యేవరకూ సాయంగా వుండి తిరిగి వచ్చేసాను.
అప్పట్లో జాతీయ ఛానెల్లో చాలా మంచి ధారావాహికలు రావటంతో ఎంతో అలసిపోయినా సరే చూడటం అలవాటైంది.అమరావతికథలుకూడా హిందీలో నాటకాలుగా వచ్చేవి.అలాగే ఒక సంచలనాత్మక సుదీర్ఘ ధారావాహికగా మొట్టమొదటగా సులోచనారాణి రాసిన "రుతురాగాలు" సప్తగిరి ఛానెల్లో టెలీకాష్ట్ అయ్యేది నేను కాలేజీలో చదువుతున్న రోజుల్లో యద్దనపూడి సీరియల్ యువతరానికీ,మహిళాపాఠకులకూ ఎంత క్రేజ్ కలిగించిందో అంత క్రేజ్ రుతురాగాలు కూడా కలిగించిందనే చెప్పాలి.బిందునాయుడు,మంజునాయుడు దీనిని గొప్పగా తీసారు.సాయంత్రం నాలుగున్నర కల్లా అందర్నీ టీవీ ముందుకు తీసుకువచ్చిన మొట్టమొదటి తెలుగు టీవీ సీరియల్ గా చెప్పుకోవచ్చు.కానీ దానిని తర్వాత్తర్వాత మరీ సాగదీసి విసుగెత్తించారు.
నాకు తొందరగా బస్సు దొరికితే సీరియల్ టైముకు అందుకునే దాన్ని. దాని తర్వాత ఇక పుంఖానుపుంఖాలుగా వాళ్ళవి వస్తూనే వున్నాయి.
ఇంక మా స్కూల్ లో
ఎయిడెడ్ స్కూల్లో సీనియారిటీని బట్టి అందులో ప్రమోషన్ ఇవ్వాలి.అంతకుముందు లెక్కలు పోస్టులో సోషల్ టీచర్కి ఇచ్చారు ఆమె హెచ్చెమ్ గా ప్రమోట్ కావటంతో ఖాళీ అయ్యింది.నన్ను అందులో నింపాలి.కానీ ఆమె నాకు ప్రమోషన్ ఇవ్వటం ఇష్టంలేక దానిని అలా ఖాళీగానే వుంచి నా జూనియర్స్ నింపాలన్నట్లుచూసింది.ఇంక నాకు విపరీతమైన కోపం వచ్చి ఎమ్మె, ఎమ్మెస్సీ పీజీ సర్టిఫికెట్లు జిరాక్స్ కాపీలు చించి ఆమెపై విసిరేసి అరిచాను.
నా ఆవేశాన్నీ,కోపాన్నీ,ఆవేదననీ పట్టలేక వీర్రాజుగారితో చెప్పాలంటే ఉద్యోగం మానేయమంటారు.అందుకని చెప్పలేదు.క్లాసులు తీసుకోవటం మానేస్తే పిల్లలు నష్టపోతారు.అందుకని పాఠాలు మాత్రం మానేయకుండా ఏంచేయాలో అనే ఆలోచనలో పడ్డాను.
నేను స్కూలు లో జాయిన్ అయిన దగ్గర నుండి జరిగిన పరిణామాల్ని,వివక్షతలతో నాకు ప్రమోషన్ ఇవ్వని విషయాల్ని కూలంకుషంగా ఉత్తరం రాసి అయిదు కాపీలను సంబంధిత అధికారులకు రిజిస్టర్ పోష్టులో మూడు నెలలకు ఒకసారి పోష్టు చేయసాగాను.మన ప్రభుత్వఆఫీసుల సంగతి తెలిసినా పంపిపుతూనే ఉన్నాను. అవి బుట్టదాఖలు అవుతూ వచ్చాయి.అయినా నేను మౌనపోరాటం మలా సాధించాలని చూసాను.
పల్లవి న్యూజెర్సీ నుండి వచ్చేసి మినియాపోలిస్ లోనే ఉద్యోగంలో చేరింది.కాని అక్కడ నిత్యమూ మంచు కురుస్తుంది.అదీగాక టార్నిడోలు కూడా తరుచూ వస్తుంటాయట.
అందుకని నేను పల్లవికి మెయిల్ ద్వారా రోజూ కాంటాక్ట్ లో ఉండాలని నేర్చుకోవటానికి దగ్గర లోని కంప్యూటర్ సెంటర్ లో చేరాను.స్కూలు నుంచి వచ్చి ఆరింటికి వెళ్ళేదాన్ని .అయితే నేర్పించే ముస్లింకుర్రాడికి తెలుగు రాదు, ఇంగ్లీష్ కూడా వచ్చినట్లు లేదు.నాకు ఉర్దూ రాదు.ఇంగ్లీషు పెద్దగా రాదు.ఆ అబ్బాయి ఉర్దూ తప్ప మాట్లాడటం లేదు.దాంతో నెలరోజులు ఎలాగో పూర్తిచేసి మానేసాను.ఆ నెలరోజుల్లో కంప్యూటర్ ఆపరేట్ చేయటం ,PPT లు తయారుచేయటం,కాస్తంత ఎక్సెల్ సీటు నింపడం తప్ప మరేమీ రాలేదు.
భారవి ద్వారా ఒక కంప్యూటర్ కొనుక్కున్నాను.అంతకుముందు పక్కింట్లో ఉండే రఘు నాకు rediff mail ఐడీ చేసి మెయిల్ ఎలా ఇవ్వాలో ,ఎలా ఓపెన్ చేసి చూడాలో నేర్పాడు.ఎప్పుడైనా మర్చిపోతానేమోనని ఒక పుస్తకంలో అన్నీ రాసి చెప్పాడు.
అంతలో ఒక శుభవార్త.నేను అమ్మమ్మను కాబోతున్నానని.నేను సంతోషంతో పొంగి పోయాను.అయితే అమెరికా ప్రయాణం తప్పదు అనుకున్నాము.పల్లవి అత్తగారూవాళ్ళూ ముందుగా వెళ్తామనీ పల్లవి డెలివరీ అయిన తర్వాత మమ్మల్ని రమ్మన్నారు.తర్వాత వాళ్ళ అమ్మాయి డెలివరీ టైమ్ కి అక్కడికి వెళ్ళిపోతామన్నారు.ఏ ఆడపిల్లకైనా తల్లి కాబోతున్న సమయంలో తల్లి పక్కనే వుండాలనుకుంటుంది.నాకు కూడా పల్లవిని గర్భంతో ఉండగా దగ్గర వుండటం, తనకి ఇష్టమైనవి,తినాలనుకున్నవీ చేసి పెట్టాలనే కోరిక తీరలేదు. నేను ఆసమయంలో అనుభవించిన వెలితి పల్లవికి రాకూడదనుకున్నాను.కానీ నాకు నచ్చక పోయినా అదే నిర్ణయం అయ్యింది.
మాకు పాస్పోర్టులు కూడా లేవు.ముందు ఆ ప్రోసెసింగ్ మొదలు పెట్టాము.అంతేకాక డిపార్ట్మెంట్ నుండి నాకు ఆరునెలలు సెలవులకి అంగీకారంకి ప్రయత్నించాలి.
డిసెంబర్ మొదటి వారంలో డెలివరీ కావచ్చని అంచనాతో అజయ్ వాళ్ళ అమ్మా నాన్న నవంబర్ మొదటివారంలో వెళ్ళి రెండు నెలలు ఉండి మేము జనవరిలోనో ఫిబ్రవరి లోనో వస్తే వాళ్ళ
అమ్మాయి దగ్గరకు వెళ్ళాలని నిర్ణయం అయ్యింది.
ప్రతీరోజూ కంప్యూటర్ మెయిల్ చెక్ చేసుకొని పల్లవికి రెండు ముక్కలు రాసే దాన్ని.పల్లవిని కూడా అలానే ఎలా ఉన్నది రాయమనేదాన్ని.
ఆరోజు ఎప్పటిలాగే స్కూలు నుండి వచ్చాక మెయిల్ చూస్తే ఆరోజు హాస్పిటల్ కి చెకప్ కి వెళ్తున్నానని వచ్చాక ఏ విషయమూ మెయిల్ చేస్తానని పల్లవి మెయిల్ పెట్టింది.కంప్యూటర్ ఆఫ్ చేసేసాను.
త్యాగరాజగానసభలో ఏదో సాహిత్య సమావేశం వుందని,నేనూ పక్కింట్లోనే వున్న పోలాప్రగడ రాజ్యలక్ష్మి గారూ వెళ్దామనుకున్నాము.
ఆరుగంటలకు తయారై ఆటో పిలవాలనుకున్నాము.అయితే కరెంట్ పోయింది.ఎప్పటికీ రావటంలేదు.చిక్కడపల్లి ప్రెస్ కి వెళ్ళిన వీర్రాజుగారు అప్పుడే వచ్చి చిక్కడపల్లి అంతా కరెంట్ పోయింది. గ్రిడ్ లోనే సమస్య వచ్చిందని ఎప్పటికి వస్తుందో తెలియదని అంటున్నారనీ చెప్పారు.ఇంక ఈ చీకట్లో వెళ్ళటం ఎందుకని మేము వెళ్ళే కార్యక్రమం మానుకున్నాము.
సరిగ్గా ఎనిమిదిన్నరకి కరెంటు వచ్చింది.టీవీ ఆన్ చేసాము అమెరికాలో ఉగ్రదాడి అని బ్రేకింగ్ న్యూస్ వస్తోంది.ముందు మాకేమీ అర్థం కాలేదు.వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంటటవర్లు కూలిపోవడం,పెంటగన్ పై దాడీ టీవీలో చూపిస్తుంటే గుండెల్లోంచి వణుకు మొదలయ్యింది. కంప్యూటర్ తెరిచి పల్లవి మెయిల్ చూడాలనుకుంటే సర్వర్ డౌన్ అయ్యి రావటం లేదు.
అంతలో స్నేహితులనుండి ఫోన్లు రావటం మొదలయ్యాయి. "ఉగ్రదాడి గురించి మాట్లాడుతూ పల్లవి వాళ్ళు బాగున్నారా " అని ,అలాగే అక్కడవున్న వాళ్ళ పిల్లలు గురించి క్షేమ సమాచారాలు తెలియజేసారు.క్రింద ఇంటి సరోజినీ గారూ,యజ్ణప్రభ గారూ ఫోన్ చేసి వాళ్ళ పిల్లలు సంగతి చెప్పి పల్లవి గురించి అడిగారు.
అందరి కంఠాల్లో భయం.గుండెల్లో దుఃఖం .పల్లవి నుండి ఫోన్ వస్తుందేమోనని ఒళ్ళంతా చెవులు చేసుకుని ఫోన్ దగ్గరే కూర్చున్నాం.అంతలో ఫోన్ వచ్చింది.హాస్పటల్ కి వెళ్ళి వచ్చానని బాగానే వున్నామని,తమకేమీ ఇబ్బంది లేదని చెప్పాక గుండెలనిండా ఊపిరి తీసుకున్నాం.కానీ ..కానీ... ఆందోళన తగ్గలేదు.దేశదేశాలనుండి చదువులూ,ఉద్యోగాలకూ యువతరం అమెరికాకు తరలిపోతోంది.అప్పులు చేసి మరీ తల్లిదండ్రులు ఆశతో పంపుతున్నారు.ఎంతమందికి గుండెకోత అయ్యిందో కదా అనిపించింది.
మరి కొన్ని రోజులకే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా అమెరికా ఆఫ్ఘన్ యుధ్ధం మొదలైంది.
నాలోని ఆందోళననీ,ఆవేదననీ ఓ కవితగా రాసి వీర్రాజు గారికి చూపించాను.చాలా బాగా రాసావనీ,మరికొంత పెంచి దీర్ఘ కవితగా రాయగలవేమో చూడమని వీర్రాజు గారు అన్నారు.
అంతే యుద్ధమూలాలు అన్వేషించటమేకాక, మత విద్వేషాలు యుద్ధానికెలా దోహదమౌతాయో, ఎన్ని కుటుంబాలు, సంక్షోభాలలో ఇరుక్కుంటాయో, యుద్ధ పరిణామాల నేపథ్యంలో ఎందరు తల్లులు గర్భశోకంలో గుండెకోతను అనుభవిస్తారో,చరిత్ర లోతుల్లోకి వెళ్ళి వీటన్నిటికీ నా దృష్టి కోణంలో కార్యకారణాలను "యుద్ధం ఒక గుండె కోత"ని దీర్ఘ కవిత అక్షరీకరించాను.ఆ వెంటనే పుస్తక రూపంలోకి తీసుకు వచ్చి నాగభైరవ కోటేశ్వరరావు గారి అధ్యక్షతన,అద్దేపల్లి రామమోహనరావు గారు వక్తగా పుస్తకావిష్కరణ జరిపాము.
వడలి మందేశ్వరరావు,కోవెల సంపత్కుమారాచార్య,ఆంవత్స సోమసుందర్ గార్లు నా పుస్తకం అందుకోగానే సుదీర్ఘ వ్యాసాలను రాసారు.అనేకమంది ప్రముఖుల ప్రసంశలు ఆ పుస్తకానికి లభించాయి.
అమెరికాలోని దాడులు,యుద్ధం ఇవన్నీ పల్లవికి సబ్ కాన్సాస్ లో ఆందోళన కలిగించాయి ఓ రోజున అకస్మాత్తుగా ఏడవనెలలోనే నొప్పులు రావటంతో హాస్పిటల్ లో జాయిన్ అయింది.నెలరోజులకు పైనే ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది.డిస్ఛార్జి అయి ఇంటికి వచ్చి ఓ వారం రోజుల ఆఫీసుకు వెళ్ళేసరికి మళ్ళా అదే సమస్య రావటంతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యేది.
రెక్కలు కట్టుకుని నాకు వెళ్ళాలనిపించింది.కానీ ఎలా?
పాస్పోర్టులు వచ్చేసాయి వీసాకి ప్రోసెసింగ్ మొదలెట్టాము.జనవరిలో వెళ్తే వేసవి సెలవులు కలిసొస్తాయని ప్లాన్ చేసాను.డిసెంబర్ కి నేను పోర్షన్ పూర్తి చేసేస్తే పిల్లలకి రివిజన్ చేయిస్తే చాలు అనుకున్నాను.కానీ హెచ్చెమ్ గా వున్న ఉషా " నీవి ఇంపార్టెంట్ సబ్జెక్టులు నీకు బదులుగా ఎవరినైనా ఎంపాయెంట్ చేస్తేనే లీవ్ సెంక్షన్ చేస్తానని చైర్మన్ గారు అన్నారు"అని అంది.నిజానికి అవి ఆమె మాటలే.అంతకు ముందు ఆమె కూడా ఆరేసినెలలు సెలవు పెట్టి వెళ్ళింది.అప్పుడు లేని నిబంధన నాకు పెట్టింది.
ఏమి చేయాలో అనే ఆలోచనలో స్త్రీ సంఘటన లక్ష్మి కలిసినప్పుడు మాటలు సందర్భంలో అన్నాను.లక్ష్మి చెల్లెలు కల్పన ప్రస్తుతం ఖాళీగా వుందని ఆమెని పంపుతానంది.పెద్దసమస్య తీరింది.
మొత్తంమీద నాకు దారి సుగమం అయ్యింది.
పల్లవి అత్త,మామలు నవంబరు మొదటి వారంలో వెళ్ళారు. అనుకోకుండా ఒకరోజు వుదయమే పల్లవికి డెలివరీ అయ్యిందనీ,పాపాయి పుట్టిందని ఫోన్ వచ్చింది.మా ప్రయాణం తేదీ ఇంకా రెండునెలలు వుంది ఈ లోపునే తొందరపడి పాపాయి పుట్టేసింది అనుకున్నాము.
అప్పుడే నాకు ఎరియర్స్ అందటంతో పాపకీ,పల్లవికీ బంగారు గొలుసులు ,ఇంకా కావలసిన వస్తువులు కొన్నాను.
మా ప్రయాణానికి సామాను సర్దుకోవడం ఇవన్నింటికీ రఘు,శంకరం,పొనుగోటి కృష్ణారెడ్డి సహకరించారు.అప్పుడప్పుడు వచ్చి ఇల్లు చూసుకుంటామని, మొక్కలకు నీళ్ళు పోయటం ,పని అమ్మాయితో ఇల్లు శుభ్రం చేయించటం చేయిస్తామని చెప్పారు.
సెప్టెంబర్ 11 సంఘటన జరిగి ఎన్నో రోజులు కాలేదు కనుక ఎయిర్ పోర్ట్ ల్లో తనీఖీలు ఎక్కువగా వుండటం వలన రఘు చెకిన్ అయ్యే వరకూ కూడా లోపలికి రావటానికి కుదరలేదు.లాంజ్ లో కూర్చున్నప్పుడు చంటి పిల్లాడిని ఎత్తుకున్న ఒక అమ్మాయి మమ్మల్ని చూసి తాను కూడా మినియాపొలిస్ కే వస్తున్నట్లు తెలియజేసి తనకి కూడా మా సహాయం కోరింది.మాకు కూడా సహకరించింది.
కలలో కూడా ఊహించని విధంగా తొలిసారి విమానం ఎక్కాము.తీరా ఎక్కినా వెంటనే ఏదో సమస్యవచ్చి ఆగి పోయి ఆలస్యంగా బయలుదేరింది.హైదరాబాద్ లో ఆలస్యం కావటంతో లండన్ లో కనెక్టెడ్ ఫ్లైట్ వెళ్ళిపోయింది.దాంతో లండన్ లో ఆ రాత్రికి హొటల్ రూమ్స్ కి పంపారు.పక్క రూమ్ లోనే ఆ అమ్మాయి కూడా వుండటంతో డిన్నర్ కి తీసుకు వెళ్ళింది.బఫే కావటంతో ఏవి తినదగినవో తెలియకపోతే ఆ అమ్మాయే తీసి ఇచ్చింది.పేరు తెలియని ఆ పధార్థాలేవీ తినలేక తిన్నామనిపించాము.
ఉదయమే లేచి తయారయ్యాము.ఆ అమ్మాయి తను స్నానం చేసేంతవరకూ బాబుని మాకు అప్పగించింది.
హొటలు నుండి బస్సులో ఎయిర్ పోర్ట్ కి తీసుకువెళ్ళి ఫ్లైట్ ఎక్కించారు.ఎలా అయితేనేం మిన్నియాపోలిస్ ఎయిర్ పోర్ట్ లో దిగాం.మా సూట్ కేసులు కూడ తీసుకోటానికి కూడా ఆ అమ్మాయి సాయం చేసింది.ఆ అమ్మాయి సాయంగా వుండటం మాకు ఇబ్బంది కలగలేదు. కానీ అడుగడుగునా మాకు చెకింగులు అవుతూనే వున్నాయి.అదే పెద్ద ఇబ్బందిగా మారింది.
ముందురోజు రావాల్సిన వాళ్ళం రాకపోయేసరికి పల్లవీ,అజయ్ కంగారు పడ్డారు.తర్వాత వాళ్ళకి విషయం తెలిసింది.అజయ్ , వాళ్ళ నాన్నగారు ఎయిర్ పోర్ట్ కి వచ్చారు.
ఎయిర్ పోర్ట్ నుండి కారులో ఎక్కే సరికే చిలికి వణుకు పుట్టింది.రోడ్లపక్కనంతా మంచు కుప్పలు.ఎట్టకేలకు పల్లవి ఇల్లు చేరాము.
-- శీలా సుభద్రాదేవి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)