16, జనవరి 2023, సోమవారం
నడక దారిలో -22
నడక దారిలో --22.
డిసెంబర్ 20 వతేదీన మా పెద్ద ఆడబడుచు కుటుంబం ఎల్.టీ.సీ మీద నెలరోజుల సెలవులతో భువనేశ్వర్ నుండి హైదరాబాద్ వస్తుంటే అమ్మ నా డెలివరీ కోసం వారితో బాటూ హైదరాబాద్ వచ్చింది.
అప్పట్లోనే మా పెదనాన్న కొడుకు లక్ష్మణ రావు విద్యాశాఖ లో అధికారిగా పదోన్నతి పొంది హైదరాబాద్ కి కుటుంబం తో వచ్చాడు.మల్లేపల్లిలో ఇల్లు తీసుకున్నారు.బుచ్చిబాబుగారు వివాహానంతరం అనంతపురం లో ఉన్నప్పుడు బుచ్చిబాబు గారూ,వీళ్ళు ఇరుగుపొరుగు ఇళ్ళల్లో ఉండేవారట.ఒకసారి లక్ష్మణరావుగారి కుటుంబంతో కలిసి శివరాజు సుబ్బలక్ష్మిగారి ఇంటికి మేము వెళ్ళాము.సుబ్బలక్ష్మిగారు నా చెయ్యి పట్టుకొని వదలలేదు.ఎందుకో గానీ సుబ్బలక్ష్మి గారి స్పర్శ,ఆమె ఆత్మీయత నా అలసిన హృదయానికి ఎంతో ఉపశమనం కలిగించింది. అప్పటినుండి వారితో గత నలభై ఏళ్ళకు పైగా ఆమె చివరి రోజులు వరకూ మా దంపతులకు ఆత్మీయ స్నేహబంధం ఏర్పడింది.మల్లాపురం లో అబ్బాయి తో బాటు ఉన్నప్పుడు కూడా వెళ్ళి కలిసే వాళ్ళం.బెంగుళూరు వెళ్ళిపోయాక కూడా సుబ్బలక్ష్మి గారు తరుచూ ఫోన్ చేసి మాట్లాడేవారు. హైదరాబాద్ వచ్చినప్పుడు ముందుగా ఫోన్ చేయటం వలన తప్పక ఆమె ఉండే హొటల్ కి వెళ్ళి కొంతసేపు గడిపి వచ్చేవాళ్ళం.తొంభైఏళ్ళ వయసులో కూడా పెయింటింగ్ లు వేస్తూ సుబ్బలక్ష్మిగారు నిరాశకు తావివ్వకుండా జీవితాన్ని,కాలాన్ని రంగులమయం చేసుకొంటూ గడపటం ఇప్పటి తరం నేర్చుకోవాలి.
తరుచూ లక్ష్మణరావు గారి కుటుంబం మా ఇంటికి వస్తుండే వారు.అప్పడప్పుడు మా వాళ్ళు వెళ్ళేవారు.వాళ్ళేకాకుండా మామరుదుల మిత్రులూ మా వారి మిత్రులు,మా ఆడబడుచు కుటుంబం ఇంతమందితో మా యింట్లో సత్రంలా వంటలూ వార్పులూ జరిగేవి.మాపెద్దమరిదికి ఆ ప్రాంతంలోనే ఒక సంబంధం కుదరటంతో వాళ్ళు కూడా తరచూ రావటం మా మరిది వెళ్ళటం జరుగుతుండేవి.ఆ అమ్మాయి ,మామరిది పెళ్ళయిన వాళ్ళలాగా సినీమాలూ ,షికార్లకు వెళ్ళేవారు.మాకు వెనుకబడి తప్పనిసరిగా వచ్చే మా యింట్లో వాళ్ళు ఆ జంటని హాయిగా వెళ్ళనివ్వటం ఆశ్చర్యంగానే కాక ఒకింత అసూయ కూడా కలిగేది.
మా అమ్మ ఇది చూసి గాభరా పడేది.'ఎప్పుడూ పొయ్యదగ్గరికి రాని చిన్నపాపాయి(నేనే ) ఇంత సంసారాన్ని ఎలా మోస్తుందా' అని దిగులు పడేది.
"పురిటికి విజయనగరం తీసుకు వెళ్ళాల్సింది.ఇక్కడ మంచి డాక్టర్ ఉన్నారు అని వీర్రాజు ఒప్పుకోలేదు.ఇన్ని రకాల మనస్తత్వాలు కలిగిన మనుషులు మధ్య నువ్వెలా బతుకుతున్నావో" అమ్మ ఒకింత బాధతో ఆశ్చర్యపోయింది.@
మాటిమాటికీ మా ఆడబడుచులు నడుమునొప్పి,తలనొప్పని పడకేస్తే నాచేత పనంతా చేయించలేక అమ్మే చేసేది.అది నాకు చాలా బాధ కలిగించేది.
సంక్రాంతి రోజు కూడా అదే పరిస్థితి.ఆ రోజు చనిపోయిన పెద్దలకు పూజచేసి అక్కడ వండిన అన్ని వంటకాలు పెడతారు.ఆడబడుచులకు ఆటంకం రావటంతో అమ్మా,నేనూ చేయాల్సి వచ్చింది.పొంగడాలు,గారెలూ సరిగాకుదరలేదు.'ఇటువంటి వాటిపై నమ్మకం లేకుండా చేయటం వలన కుదరలేదా? లేకపోతే నాచేతివంట వాళ్ళపెద్దలకి తినటం ఇష్టంలేక కుదరలేదా? 'నాలో నేను నవ్వుకున్నాను.
హైదరాబాద్ లో తెలంగాణ ఉద్యమం కాస్త చల్లారింది.కానీ ముల్కీ నిబంధనలకు ఆందోళన పడటం వలన ఆంధ్రా ప్రాంతంలో ఉద్యమం తీవ్రంగానే సాగుతోంది. జనవరి17న జైఆంధ్రా ఉద్యమకారులను, ఆనందగజపతిగారినీ, మరో ముగ్గురు కాలేజీ లెక్చరర్ లనూ అరెస్టు చేశారని వార్తాపత్రిక లో వచ్చింది..జనవరి 16న గుంటూరులో కాల్పులలో 12 మంది చనిపోయారుట.ఇక సెపరేటు కాక తప్పదు అని అందరూ భావించారు.
ఒకరోజు పొద్దున్నే వీర్రాజు గారు "బాబు కాకుండా పాపాయి పుట్టినట్లు ఈ రోజు కల వచ్చింది.నువ్వు అన్నట్లుగా పల్లవే మన ప్రేమలతకు చిగురిస్తుందేమో" అన్నారు.నేను ముసిముసిగా నవ్వాను
మాయింటికి వచ్చిన రత్నం " మీకు పుట్టే పాపాయి ఆంధ్రా పాపా, తెలంగాణా పాపా" అని అడిగింది.పుట్టేలోపున విభజన జరుగుతే ఎక్కడ పాపగా పెరుగుతుందో తెలుస్తుంది అని మనసులో అనుకుంటూనే నవ్వి " తెలుగు పాపాయి" అన్నాను.
జనవరి 20 న గుంటూరులో పోలీసుల కాల్పుల్లో 12మంది చనిపోయారని పేపర్లో చదివి వీర్రాజు" రాష్ట్రం విడిపోక తప్పదేమో.బహుశా విజయవాడకి బదిలీ అవుతుందేమో" అంటూ "అలా ఐతే మనతో బాటు కృష్ణుని మనతో తీసుకువెళ్దాం "అనేసరికి స్వర్గానికి వెళ్ళినా సవతి పోరు తప్పకపోవటమంటే ఇదేనేమో అనుకున్నాను.
ప్రధాని ఇందిరా గాంధీతో తెలంగాణ, ఆంధ్రా కాంగ్రెస్ నాయకులు సంపద్రింపులు మొదలయ్యాయి. ఉద్యమం ఆగిపోయింది. 18 న ముఖ్యమంత్రి పీ.వీ.నరసింహారావు రాజీనామా చేయటంతో విధించిన రాష్ట్రపతి పాలన మరొక ఆరు నెలలు కొనసాగించారు.
ఎన్జీవో స్ట్రైక్ వలన వీర్రాజు గారికి జీతంలేదు.కానీ అనుకోకుండా యువభారతి వారి ముఖచిత్రాలకు డబ్బు ఇచ్చారు.అంతకు ముందు తెలుగు అకాడమీ వారికి వేసిన వాటికీ,ప్రభుత్వం సావనీర్లకు వేసిన వాటికీ డబ్బు అందటంతో కొంత ఊపిరి పీల్చుకున్నాము.
తొమ్మిదో నెల వచ్చేసింది.అమ్మని తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తే" నువ్వు అసలు బరువు పెరగలేదు. పొట్టలో బిడ్డ పెరగటం లేదు. తినటం లేదా "అని కోప్పడింది.ఇంటి నిండా జనం.అలవికాని ఆర్ధిక భారం.దీనికి సమాధానం ఎక్కడ వెతుక్కోవాలి.మౌనం వహించాను.'కనటానికైనా నీకు బలం వుంటుందా' అని అమ్మ కళ్ళల్లో నీళ్ళు.
"నువ్వు ఫేషనబుల్ గా ఫ్రాక్స్ కుడతావటకదా "పెద్దాడబడుచు అనే సరికి పొంగి పోయి అమ్మ మందలిస్తున్నా వినకుండా సంక్రాంతికి తొమ్మిది నెలల గర్భంతో పిల్లలిద్దరికీ ఫ్రాకులు కుట్టాను.
సంక్రాంతి వెళ్ళిన నాలుగు రోజులకి ఆడబడుచు కుటుంబం తిరుగు ప్రయాణం కట్టారు.కానీ వీర్రాజు "సుభద్రకు మరో రెండురోజుల్లో డెలివరీ డేట్ అని డాక్టరు అంది కదా మరో వారంరోజుల సెలవు పొడిగించండి" అనటంతో తప్పనిసరి పరిస్థితుల్లో సెలవు పొడిగించారు.
తెల్లవారుజామున నాలుగు గంటలకు మెలకువ వచ్చింది ఎందుకో అనుమానం వచ్చింది.చూసుకుంటే రక్తస్రావం అవుతుంది.అమ్మని లేపాను.అప్పటికప్పుడు అమ్మ వేడినీళ్ళతో స్నానం చేయించింది పెద్దవాంతి అయ్యి నొప్పులు ప్రారంభం అయ్యాయి.కానీ ఇంట్లో ఎవ్వరూ హడావిడీ చూసైనా లేవలేదు.అమ్మ,నేను వీర్రాజు హాస్పిటల్ కి వెళ్ళాం.వెంటనే జాయిన్
చేసుకున్నారు.ఒకవైపు వాంతులు, మరోవైపు నొప్పులు భరించలేక ఏడ్చేసాను.మూడునిమిషాల సుఖం కోసం ఇంత యాతన అనుభవిస్తున్నానే అనిపించింది.
డాక్టర్ దేవయానీ డంగోరియా దేవదూతలా నిర్మలమైన చిరునవ్వుతో ఆత్మీయంగా మాట్లాడుతూ ఓదార్చింది.నిజానికి ఆమెని చూస్తుంటేనే సగం రోగాలు తగ్గిపోతాయనేలా ఆమె ఉంటుంది.
పగలంతా బాధ పడుతూనే ఉన్నాను. సాయంత్రం మందుకొనాలని వీర్రాజు బయటకు వెళ్ళారు.అకస్మాత్తుగా కరెంటు పోయింది.అంతలో నొప్పులు తీవ్రం కావటంతో నన్ను లేబర్ రూం లోకి తీసుకు వెళ్ళారు.అయ్యో ఆయన్ని చూడలేదు.నేను తిరిగి బయటకు వస్తానా అని భయంవేసింది.
నేను రూం లోకి వెళ్ళగానే కరెంట్ వచ్చింది.
అంతలో నాతో నేను చేస్తున్న పోరాటం పూర్తిఅయ్యింది.ఎండిన పెదాలమీద చిరునవ్వు చిగిరించింది.
"అంతగా మురిసి పోతున్నావు.పాప కావాలనుకుంటున్నావా?బాబు అనుకున్నావా?"అంది డాక్టర్.
"ఎవరైనా పర్వాలేదు డాక్టర్.కానీ పాపాయి పుట్టాలని కోరుకున్నాను" అన్నాను.
డాక్టర్ నవ్వి "నీ కోరికే తీరిందిలే" అన్నారు.
ఓ గంట తర్వాత రూంకి చేర్చారు.వీర్రాజు ముఖం నిండా ఆదుర్దా కదులుతోంది.నన్ను చూడగానే ముఖం వెలిగింది."నువ్వు కోరుకున్నట్లు పల్లవే పుట్టింది" అన్నారునవ్వుతూ.
నాముఖం మీద గర్వవీచిక మెరిసింది.
' నేను అమ్మనైపోయాను.ఇంక మరిన్ని అనుభూతులు,మరిన్ని బాధ్యతలు అవన్నింటికీ నాకు మనోబలం కావాలి' కళ్ళుమూసుకుని మనసును కూడగట్టుకున్నాను.
ఏమి తిన్నా ఇమడకపోవటంతో నీరసంగా పడుకున్నాను.
మర్నాడు ఆడబడుచులు పాపని చూడటానికి హాస్పిటల్ కి వచ్చి "పాప నల్లగానే ఉంది" అని నొక్కి వక్కాణించారు. నేనేమీ మాట్లాడలేదు.
అంతలో డాక్టర్ రౌండ్స్ కి వచ్చి " ఏమంటుంది నీ లిటిల్ బేబీ"అని నవ్వుతూ పలకరించారు.బరువుబాగా తక్కువగా ఉంది, తర్వాత పెరుగుతుంది.భయపడకు"అన్నారు.
. 'హమ్మయ్య ' అని నిట్టూర్చాను.
హాస్పిటల్ లో ఉన్నన్ని రోజులు హాస్పిటల్లో వాళ్ళిచ్చిన బట్టలే పాపాయికి వేయాలి.ఇంటికి వచ్చాక వేయాలంటే రెడీ మేడ్ బట్టలు కొనాలంటే అంత ఖరీదు పెట్టలేము.అందుకని తెల్లని గ్లాస్కోబట్ట కొని పెద్దాడబడుచుని చిన్నజుబ్బాలు కుట్టమంటే నాకు చాతకాదుఅంది.బట్టకొని తెమ్మని వీర్రాజు తో చెప్పి అమ్మా, నేను హాస్పిటల్ మంచం మీదే పాప కోసం చేత్తోనే జుబ్బాలు కుట్టాము.
నేను ఇంటికి రాగానే ఆడబడుచు వాళ్ళు వెళ్ళిపోయారు.పురిటి స్నానం కాగానే యథావిధిగా ఇంటిపనులు మొదలెట్టాను.పాపకి స్నానం చేయించటానికి ఒక అవ్వని కుదుర్చుకున్నాను
పాపని ఉయ్యాలలో వేసి వేడుకచేయాలని ముచ్చట పడ్డారు వీర్రాజు గారు.ఇరవై ఒకటోరోజున ఎక్కడినుండో ఉయ్యాల తెచ్చి మిత్రులను పిలిచి పార్టీ ఇచ్చాము.'ఎస్.పి.బాలసుబ్రమణ్యం కూతురు పేరు పల్లవి. మళ్ళీ మీపాపే పల్లవి' అని అందరూ అనేసరికి సంతోషంతో పల్లవిని ముద్దులాడేను.
పాపకి నెలనిండక ముందే విజయనగరంలో పెద్దన్నయ్య భార్య వదిన అమ్మని పంపించేయమని ఉత్తరం రాసింది.
అమ్మ నన్ను పాపని తీసుకు వెళ్తానంది.కానీ ఇప్పుడిప్పుడే ఈ ఇంట్లో నాస్థానాన్ని పదిలపరచుకుంటున్నాను.అందులోనూ పెళ్ళికాకముందే కాబోయే తోటి కోడలు మాటిమాటికీ వచ్చి పెత్తనం చేస్తోంది.ఈ పరిస్థితి లో రానని అమ్మతో చెప్పాను.
అమ్మ మరేమీ అనలేక పలు జాగ్రత్తలు చెప్పింది.వీర్రాజు అమ్మని విజయనగరంలో దించి వచ్చారు.
నడక దారిలో -21
నడక దారిలో --21
అంతకుముందు చుట్టపు చూపులా వచ్చి రెండు మూడు నెలలు మాత్రమే వచ్చిపోవటం వలన పూర్తిగా నా యిల్లు అనిపించేది కాదు.ఇప్పుడు పూర్తి హక్కులతో నాయిల్లు,నాకుటుంబం అనుకుంటూ కళ్ళనిండా కోటి కలలతో హైదరాబాద్ లోని ఇంట్లోకి అడుగు పెట్టాను.
జూన్ నెలనుండీ కుటుంబ బాధ్యతలు పూర్తిగా తీసుకున్నాను.ముగ్గురు అన్నదమ్ములు ఇచ్చిన డబ్బుతోని నెలంతా గడపటానికి బడ్జెట్ ప్లానింగ్ తో అన్నీ డైరిలో రాయటం మొదలుపెట్టాను.
జూన్ ఫస్ట్ కి నాకథకి వచ్చిన రెమ్యునరేషన్ లో సగం 10 రూ.నా తొలి సంపాదన గా సంబరంగా అమ్మకి mo చేసాను.
ఒక రోజు ఆఫీస్ నుండి రాగానే "ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త హౌసింగ్ స్కీమ్.HRaని అయిదుసంవత్సరాలు వదులుకుంటే తర్వాత పదహారువేలఖరీదుచేసే ఇల్లు వస్తుందంట తర్వాత కొంత వాయిదా పద్ధతిని నెలనెలా కట్టాలిట.అయితేముందుగా నాలుగు వేలు కట్టాలిట. కాని సత్యవతి పెళ్ళి ఉంది,నీ డెలివరీ ఖర్చు ఉంది.కానీ మధుని రెండువేలు సర్దమంటాను.తర్వాత తీర్చేయవచ్చు" ఎంతో సంబరంగా అన్నారు.కానీ మా పెద్దాడబడుచు భర్త "అంతా ఫిక్సెడ్ లోనే ఉంది, డబ్బు లేద "నేసరికి వీర్రాజు చిన్నబుచ్చుకున్నారు.డబ్బుకొరత వలన అప్లికేషన్ కూడా పెట్టలేదు.అలా సొంత ఇంటి కల మొదటిసారి చెదిరి పోయింది.
వంటగదిలోకి ఆనుకొని ఉన్న రెండు రేకుల గదులు అద్దెకి తీసుకున్నాము.అందులో ఒకటి బెడ్ రూం గా,రెండోది వీర్రాజు ఆఫీస్ రూం గా చేసుకున్నాం.
అయితే స్వంత పడకగది సరదా తీరకుండానే వీర్రాజు మిత్రులు కథక్ మిత్ర పేరుకథలు రాసే వేమూరు నరసింహారావు భార్యతో కలిసివచ్చి మా ఇంట్లో వారంరోజులు ఉన్నారు.తిరిగి మళ్ళీ మాకు వంటిల్లే గతి అయ్యిందీ.
కథక్ మిత్ర వాళ్ళకి నగరంలో చూడదగిన ప్రదేశాలు రోజూ తీసుకు వెళ్ళి చూపించాం.అయితే నాకు వాంతులు అవుతుండటంతో నీరసపడి ఉండటాన తిరిగి తిరిగి వచ్చాక వంటపనులుచేయటం బాధకలిగేది.ఒక్కొక్కసారి చిరాకుగా ఉండేది.అయినా ముఖంమీద చిరునవ్వు చెదరకుండా పనులు చేసేదాన్ని.వాళ్ళు వెళ్ళాక ఊపిరి పీల్చు కున్నాము.
ఉండుండి వాంతులు అవుతుండటంతో, నీరసంతో లేవలేకపోవటంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళాను.
రక్తపరీక్ష, మరికొన్ని పరీక్షలు చేసి రక్తంచాలా తక్కువగా ఉందనీ, ప్రోటీన్లు ఉన్న ఆహారం బాగా తీసుకోవాలని చెప్పి,నేను తల్లిని కాబోతున్నట్లు తెలిపారు.
ఆరాత్రి ఆయన నేను ఎన్నో కబుర్లు చెప్పుకున్నాము.మొదట బాబు ఐతే బాగుంటుందని ఆయన అన్నారు.కానీ నేను పాప అయితే రకరకాల దుస్తులు వేసి ముచ్చట తీర్చుకోవచ్చుఅని నేనూ వాదించుకున్నాం . ఆఖరుకు నాతో ఏకీభవించారు.అంతే కాదు పాప పేరు పల్లవి అని నేను డిక్లేర్ చేసాను.పల్లవి పేరు చాలా బాగుంది అని అన్నారు.ఉదయమే అమ్మకు ఉత్తరం రాసాను.
అమ్మ జాగ్రత్తలు చెపుతూ సమాధానం రాసింది.
నాకు మరింత సంతోషకరమైన విషయం నా చిన్ననాటి స్నేహితులు,జానకీ, కుమారీ నాకు దగ్గరలోనే ఉండటం.మరీ చిన్నప్పటి స్నేహితురాలు లత కూడా ఇక్కడే ఉండటం వలన తరచు ఎవరో ఒకరితో రాకపోకలు ఉండటంవలన మనసు తీరా ముచ్చట్లు చెప్పుకోవటానికి అవకాశం దొరికింది.
మేము ఉన్న కాంపౌండులో రత్నం వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవటం మరొక వెసులుబాటు.ఆ ఇంట్లోకి స్వాతి బలరాంగారి మిత్రుడు అద్దెకి దిగారు. అతనూ,భార్యలలిత మాత్రమే ఉండేవారు.లలిత కూడా నా వయసుదే కావటాన మేము మంచి మిత్రులం అయ్యాము.
ఇంట్లో చూస్తే యథాప్రకారమే.ఆయన తనబొమ్మలూ, మిత్రులు,సభలూ, సాహిత్యం తో బిజీ.పగలంతా కనిపించేవారుకాదు.రాత్రి కాసేపు కబుర్లు, తర్వాత అలసిపోయి నిద్రపోయే వారు.
ఒక్కోసారి ఆదివారం మాయింట్లో సాహిత్య సమావేశాలు జరిగేవి.కుందుర్తిగారు ఇతరకవులూ,కథకులూ వచ్చే వారు.వాళ్ళుకొత్తగా రాసిన కథో,కవితో చదివి,చర్చించుకునే వారు.నేను వారితో కలిసి కూర్చోలేకపోయినా,టీలో, టిఫిన్ లో అందిస్తూ వినేదాన్ని.అది నాకు ఎంతో సంభ్రమం గా ఉండేది.నా అభిప్రాయం కూడా పంచుకోవాలనిపించేది.
సమాజం తీరుతెన్నులు,సంఘర్షణలు పట్ల ఒకింత ఆవేశం, ఆక్రోశం కలగలిపి లయాత్మకంగా కవిత్వం చదివే విధానం నన్ను ఆకర్షించింది.పగలు ఖాళీలేకపోయినా ఏరాత్రి పూటో కవితా సంపుటి తీసి చదివేదాన్ని.విజయనగరంలో చదువుకునేటప్పుడు రాసినవే తప్ప మళ్ళా ఒక్క అక్షరం పేపరు మీద పెట్టలేక పోతున్నానని దుఃఖం వచ్చేది.
పెళ్ళి అయ్యాక ఇద్దరం చదివిన వాటిగురించి సాహిత్య చర్చలు చేసుకోవచ్చు అనుకుంటే ఇద్దరం కలిసి కూర్చుని మాట్లాడటానికే సమయం లేకుండా పోయిందని ఉసూరుమనిపించింది.
ఆ ఏడాది భారత స్వాతంత్ర్యరజతోత్సవం కావటంతో హైదరాబాద్ లోని ముఖ్యమైన భవనాలని దీపాలతో భలేగా అలంకరించారు.చీకటిపడిన తర్వాత చూడటానికి వెళ్ళాం.ఆ దీపకాంతులు మా జీవితం నిండా కూడా వెలగాలని ఆశించాను.
మళ్ళా అశనిపాతంలా నా పరీక్షా ఫలితాలు తెలిసాయి.నేను భయపడుతున్నట్లుగానే ఫిజిక్స్ లో ఫెయిల్ అయ్యాను.నిజానికి కెమిస్ట్రీ గురించి భయపడ్డాను కానీ అందులో బాగా వచ్చాయి,లెక్కలు సరేసరి మంచి మార్కులు వచ్చాయి.మా ఫిజిక్స్ ప్రాక్టికల్స్ సమయంలో " పెళ్ళైయ్యాక నీ చదువుమీద శ్రధ్ధ తగ్గిపోయింది.అందుకే వివాహం విద్యనాశాయః అన్నారు పెద్దలు" అంటూ ఫిజిక్స్ చెప్పే సీతాకుమారి గారు మందలించటం గుర్తు వచ్చింది.అప్పట్లో థియరీ లో ఫెయిల్ ఐనా, ప్రాక్టికల్స్ ఫెయిల్ ఐనా మొత్తం రాయాల్సిందే.చదువుకోవాలనీ, ఉద్యోగం చేయాలనీ నేను కన్ని కలలు నిలువునా కూలిపోయాయి.ఇంట్లో పరిస్థితులు చూస్తుంటే నా ఆశలకు నీళ్ళు వదులుకోవల్సిందే.నాకు చదువు మీద ఉత్సాహం తగ్గిపోయింది.
"పరీక్షకు తిరిగి వెళ్ళేటట్లైతే మా తమ్ముడుకి పైసలు ఇచ్చి చలాన్ కట్టమను" అన్నారు.అసలే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నానేమో కోపం వచ్చి "పెళ్ళాం పనులు కూడా మీరు చెయ్యలేనప్పుడు పెళ్ళి చేసుకోవటం ఎందుకు?"అనబోయి మౌనం వహించాను.ఏమనుకున్నారో మళ్ళా తానే కట్టారు.కానీ ఏంలాభం పుస్తకం మాత్రం ముట్టుకోలేదు.నా చదువు అటక ఎక్కింది.
ప్రత్యేకించి మేమిద్దరమే చేసిన ఒక ప్రయాణం చెప్పుకోవాలి.వీర్రాజుగారి ఆత్మీయ మిత్రుడు కథక్ మిత్ర శంకరగుప్తంలో ఉంటారు.బాలమురళీకృష్ణ పుట్టిన ఊరు.ఆ ప్రయాణం తీరుచెప్పక తప్పదు.సెప్టెంబరు పదమూడున రైలెక్కి పద్నాలుగున ఉదయం పదిగంటలకి నిడదవోలు చేరాము.కథక్ మిత్ర పదకొండు కి స్టేషనుకువస్తే ఒంటిగంటకు మరో రైలెక్కి నరసాపురం చేరాం.అక్కడ రిక్షాలు లేవు. అక్కడ పడవెక్కి సఖినేటి పల్లెలో అనుకుంటా దిగాము.అక్కడనుండి బట్టీలంక వరకూ బస్సు.అయితే మొదటి బస్సు వీర్రాజు ఎక్కగానే కదిలిపోయింది.తర్వాతబస్సులో కథక్ మిత్రా,నేను ఎక్కాము.బస్సులో ఒక ఆమె ఎక్కడ దిగుతారు అని అడిగింది.నాకు తెలియదు అనేసరికి తెల్లబోయింది.ఈలోగా కథక్ మిత్రా,నేను మీరు,మీరు అని ఒకరినొకరం సంభోదించుకుంటూ మాట్లాడుకుంటుంటే మరింత ఆశ్చర్య పోయింది.పల్లెల్లో వారు మాకెందుకని ఊరుకోక అన్ని ఆరాలు తీస్తారని నవ్వుకున్నాను.బట్టేలంక లో బస్సు దిగి అప్పటికే ముందు బస్సెక్కి వచ్చిన వీర్రాజు గారిని కలిసాము.తర్వాత జట్కా లో ప్రయాణంచేసి,తిరిగి పడవలో రక్తకుల్య కాలువ దాటి శంకరగుప్తంలో వాళ్ళ ఇల్లు చేరాము.బాగా అలసిపోయి ఒళ్ళు ఎరగకుండా ఆ రాత్రి నిద్రపోయాను.
మళ్ళా ఇరవై ఏళ్ళకు ప్రజా జీవితంలోని మార్పులతో ఇన్ని వాహనాలు ఎక్కకుండానే తిరిగి ఆ వూరు వెళ్ళాము.ఆ అనుభవంతోనే 1997 లో " మార్పువెనక మనిషి" కథ రాసాను ఆ కథ ఎస్వీ విశ్వవిద్యాలయం డిగ్రీ మొదటి ఏడాది తెలుగు పాఠ్యాంశంగా పెట్టారు.
శంకరగుప్తంలో రెండు మూడురోజులు ఉన్నాక నన్ను విజయనగరం బస్సు ఎక్కించి వీర్రాజు హైదరాబాద్ వెళ్ళిపోయారు.
సెప్టెంబర్ నెలాఖరుకే విజయనగరం వెళ్ళాను.ఆ వారంరోజులైనా పరీక్షకి చదువుకుందామని.ఐతే హఠాత్తుగా మాపెద్దమామయ్య హార్ట్ఎటాక్ వచ్చి చనిపోయారు.మా అమ్మకు పెద్ద ఆసరా ఆయనే.ఆయన అంటే మా అందరికీ చాలా ఇష్టం. బేంకులో పనిచేస్తున్న మామామయ్య ప్రతీ సంక్రాంతికి వంద కొత్తనయాపైసలను పాపిన్స్ పేకెట్ లా చుట్టి పిల్లలందరకూ ఇచ్చేవారు.వాటిని ఎంతో అపురూపంగా మేమంతా వాడుకునే వాళ్ళం.అవన్నీ గుర్తు వచ్చి మనసంతా భారమైంది.
చిన్నక్కకు డెలివరీ సమయం కావటంతో అమ్మ కోరుకొండ వెళ్ళింది.కానీ ఈ విషయం తెలిసి హుటాహుటిన విజయనగరం వచ్చేసింది. ఆ రోజు నాకు పరీక్ష. ఇంట్లో అందరూ మామయ్య ఇంటికి వెళ్ళారు.నేను పరీక్ష కు వెళ్తుంటే ఆ ఇంట్లోంచి బాజాలు వినిపిస్తున్నాయి.నాకు ఇష్టమైన మామయ్యని ఊర్లో ఉండి కూడా చూడలేకపోయాను. దుఃఖోద్వేగంతో పరీక్ష రాయలేక పోయాను.
సెప్టెంబర్ నెలాఖరులో చిన్నక్క కు పాపాయి పుట్టింది.నేను పరీక్ష రాసిన తర్వాత పెద్దక్క తో పాటూ కోరుకొండ వెళ్ళి చూసి వచ్చాను.
అక్టోబర్ 12న అన్నయ్య పెళ్ళి కుదిరింది.అమ్మ కోరుకొండ లో ఉండటంతో పెళ్ళి కోసమని ఇల్లంతా, ముఖ్యంగా అన్నయ్య గదిని శుభ్రంచేసాను.పెళ్ళి టైమ్ కి వీర్రాజు,చిన్నాడబడుచు వచ్చారు విశాఖ రిజిస్ట్రేషన్ ఆఫీసులో పెళ్ళి జరిగింది అనంతరం విజయనగరంలో తోటలో విందు.అదిఅయ్యాక ఆయన తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయారు. అన్నయ్య వాళ్ళు పెద్దాపురం వెళ్ళి తిరిగి వచ్చే వరకూ సత్యవతిని నన్ను ఉండమని అమ్మ అనటంతో ఉండిపోయాము.
అన్నయ్యా,వదినా వచ్చిన తర్వాత నేనూ,మా ఆడపడుచు తిరిగి హైదరాబాద్ కి వచ్చేసాము.
డిసెంబర్ 7 నుంచి సమ్మెనుమొదలుపెట్టారు ఆంధ్ర ఎన్జీవోలు.ఈ సారి చాలా తీవ్రతరంగా జీతం కట్ చేస్తానన్నా చలించలేదు.వీర్రాజుకి ముఖచిత్రాల వలనా,కథలకు వచ్చే రెమ్యునరేషన్ వలనా అంత ఇబ్బంది లేకపోయినా చాలా జాగ్రత్తగా పొదుపుగా ఖర్చు పెట్టాల్సి వచ్చింది.దానికి తోడూ నిరంతరం వచ్చిపోయే బంధుమిత్రులు ఆర్ధికం గానే కాక శారీరకంగా కూడా అతలాకుతలం అయిపోయాం.
మధ్యతరగతి జీవితాల్లోని ఆర్థిక ఆటుపోట్ల వలన కలిగే ఒత్తిడులు కుటుంబ పెద్దగా ఇప్పుడు మరింత అవగాహన కలిగింది.
10, జనవరి 2023, మంగళవారం
భాషా వారధి కోడూరు ప్రభాకరరెడ్డి
,~~ భాషా వారధి కోడూరు ప్రభాకర రెడ్డి గారు ~~
ఆధునిక యుగంలో ఒక భాషలో చెప్పిన విషయాన్ని మరొక భాషలో చెప్పడం అనే ప్రక్రియ "అనువాదం" గా స్థిరపడింది.అనగా పునఃకథనం గా వ్యవహరించవచ్చు. భారతీయ భాషలనుండి, విదేశీ భాషల విశ్వసాహిత్యం నుండి తెలుగులోనికి ఆదాన ప్రదానాలు చాలా కాలంగా జరుగుతూనే ఉన్నాయి. అయితే తెలుగు భాషలోకి అనువాదాలు అయినట్లుగా, తెలుగు నుండి ఇతర భాషలలోని అనువదింపబడిన రచనలు తక్కువ అనే చెప్పక తప్పదు.
అనువాదం అంతసులువైన ప్రక్రియ కాదు.అనువాదాలు రాణించాలంటే అనువాదకునికి ఉభయ భాషా పరిజ్ఞానం తో పాటు జనజీవనవిధానాలూ, సాంస్కృతిక నేపధ్యం,వాతావరణం,ఆచారవ్యవహారాలు కూడా తెలిసిఉండాలి.
మూలరచనను యథాతథంగా తెలుగులోనికి తర్జుమా చేయడం ఒక పద్ధతి కాగా ఆ మూల రచన సారం చెడకుండా అనుసృజన చేయడం ఇంకొక పద్ధతి.
తెలుగు అనువాద సాహిత్యాన్ని స్థూలంగా రెండు భాగాలుగా విభజించవచ్చు. భారతీయ సాహిత్యం నుండి తెలుగుభాషలోనికి అనువాదాలు ఒక భాగం, విదేశీభాషా సాహిత్యం నుండి తెలుగులోనికి అనువాదాలు మరొక భాగం.
ఒకప్పుడు తెలుగునాట పత్రికలు యధేఛ్ఛగా రాజ్యమేలుతున్న కాలంలో అనువాద రచనలతో తెలుగు సాహిత్యం పరిపుష్టమైంది. మనకి పొరుగు భాషలైన తమిళ కన్నడాల నుంచే కాక, బెంగాలీ తదితర భారతీయ భాషలనించీ, ఆంగ్లం, ఫ్రెంచి, రష్యను ఇత్యాది ప్రపంచ భాషలనించీ కూడా తెలుగులోకి సాహిత్యం ప్రవహించి సాహిత్య పాఠకులకు వివిధప్రాంతాల సాహిత్యాన్నీ,సాహితీవేత్తల్నీ పరిచయం చేసింది.
జాక్ లండన్ కథలూ, అలెక్జాండర్ డ్యూమా, మార్క్ ట్వైన్, మాక్సిం గోర్కీల నవలలూ కథలూ ఇవి అసలు తెలుగులోనే రాశారేమో అనిపించేంత సహజంగా మనకి దగ్గిరయ్యాయి. శరచ్చంద్ర ఛటర్జీ,ప్రేమ్ చంద్, బంకించటర్జీ లైతే తెలుగువారేనేమో అన్నంత సాన్నిహిత్యం తెలుగు పాఠకులకు ఏర్పడిపోయింది.
తెలుగువాళ్లు అనువాదాలను ఎప్పుడూ ఆదరించారు,ఆనందిస్తూనే ఉన్నారు. 1950లలోనే ఆంధ్రపత్రిక వీక్లీ ప్రసిద్ధ ఆంగ్ల, ఫ్రెంచ్ నవలలను తెలుగులోకి అనువదింప చేసింది.సోవియట్ లాండ్ ప్రచురణలుగా రష్యన్ రచనలు తెలుగు పాఠకులకు దగ్గరయ్యాయి.
అనువాదాల వలనే సాహిత్యం ఆలంబనగా భిన్న మానవ సమాజానికి దగ్గరవుతుంది.
తమిళంలో శరత్ నవలలు, రవీంద్రుడి నవలలు తప్ప యితర భారతీయ భాషల్లోని రచనలను తమిళులు ఎక్కువగా ఆదరించినట్లులేదు.కానీ తెలుగు వాళ్ల లాగానే కన్నడం వాళ్లు అనువాదాలను ఆమోదిస్తారు. అనువాద కథలే ప్రధానంగా నడిచే ''విపుల'' వంటి తెలుగు పత్రిక కూడా మనకి పలు భాషా రచనల్ని అందుబాటులోకి తెచ్చింది .
ఇంగ్లీషు మన మాతృభాష కాదు కనుక, ఇంగ్లీషు వాళ్లు మన భాష నేర్చుకుని అనువాదాలు చేయాలంటే అది ఎప్పటికోగాని సాధ్యంకాదు ఇంగ్లీషులో ఫిక్షన్ రాసే తెలుగువారు ఆంగ్ల రచనలను తెలుగులోకి అనువాదాలు చేస్తే అవి బాగుంటాయి. ఇంగ్లీషు వచ్చినంత మాత్రాన అనువాదానికి ఉపక్రమిస్తే పఠనీయత వుండదు.
ఇతర భాషల్లో నుంచి అనువాదం చేసేటప్పుడు నుడికారం గురించి, నేటివిటీ గురించి చాలా జాగ్రత్తగా వుండాల్సి ఉంటుంది.అందులోని భావాన్ని గ్రహించి తెలుగువాడైతే ఎలా రాస్తాడు అనుకుని ఆ ధోరణిలో రాయాల్సి ఉంటుంది. అది ఒక కష్టమైన ప్రక్రియ. ఆంగ్లంలో చదవగలిగే విద్యావంతులు పెరగటం వలన తెలుగులో రానురాను అనువాదాలకు ఆదరణ తగ్గింది.
మూలకథాంశం,దాని మూలతత్వం,,పాత్రలస్వభావం వీటినన్నింటినీ,మూలరచనకు భంగం కలగకుండా,మూలరచయిత ఆత్మను పట్టిచూపేలా రాయటం కత్తిమీదసామే. అనేక మంది అనువాదం , అనుసృజన చేసారు.కానీ మూలరచనతో వాటిని పోల్చటానికి వీలు లేకుండా అనువాదకులు జాగ్రత్తలు తీసుకోవాలి.
ప్రభాకర రెడ్డి గారు వృత్తిరీత్యా శిశువైద్యులు.ప్రవృత్తి రీత్యా సాహిత్యోపాసన చేస్తూ అనేక గ్రంథాలు వెలువరించారు. ఆంధ్ర, ఆంగ్ల,హిందీ,సంస్కృతభాష ల్లో నిష్ణాతులు కావటాన అనువాద ప్రక్రియలో, శైలిలో డా.ప్రభాకరరెడ్డిగారు మెచ్చుకోదగిన ప్రతిభ కనబరుస్తున్నారు.
తెలుగు కథల పేర్లు మూల కథల పేర్లకి డైరెక్టు అనువాదాలుగా కాక, కథా వస్తువుని సూచించే విధంగా, సహజంగా, ఆర్ద్రతతో, కొండొకచో చమత్కారంతో పేర్లు పెట్టటంలో రచయిత అభివ్యక్తి తేటతెల్లమౌతోంది. చాలా వరకూ కథనం, సంభాషణలూ సహజమైన భాషలోనే ఉన్నా, అక్కడక్కడా అనువాదకుడు ఆంగ్ల వాక్య నిర్మాణపు మోహంలోకి చిక్కిపోతారు. కాకపోతే, కథా వస్తువులన్నీ సార్వజనీనమైన అనుభవాలే కావటంతో, ప్రత్యేక ప్రాంతీయ విశేషాల్నీ ఆచార వ్యవహారాల్నీ వివరించాల్సిన అదనపు బాధ్యత లేదు అనువాదకుడికి.
తనకి అపరిచితమైన సంస్కృతులనించి వచ్చిన కథలనైతే తర్జుమా చెయ్యటంలో అనువాదకుడు కొంత అధిక పరిశ్రమ చెయ్యాల్సి ఉంది.
అందులోనూ సాహిత్యరంగంలో అనేకమంది కథకులను ప్రభావితం చేసినటువంటి ప్రపంచ సాహిత్యం లో సుస్థిర స్థానం గల ఓ హెన్రీ కథల్ని అనువదించడం ఒక సాహసమే.ఓహెన్రీ కథలోని సామాన్యమైనవిగానే కనిపించే పాత్రలు పాఠకులను ఆకట్టు కుంటాయి.పాత్రలచిత్రణ,చిరుహాస్యం,పఠనీయత, శైలీ విన్యాసం,సరళమైనపదాల రచనా విధానం, ఊహకందని ఆశ్చర్యం గొలిపే మలుపులు, అన్నింటినీ మించి కొసమెరుపుతో కథలన్నీ కథానికా రంగంలో ఉన్నతస్థానాన్ని అలంకరించాయి.అటువంటి ఓహెన్రీ కథల్ని అంతే స్థాయిలో అంతేశ్రథ్థతో తేలికైన సరళ వచనంలో అనువదించారు రెడ్డి గారు.
The last leaf (శేషపత్రం),The Green Door (ఆకుపచ్చ తెలుపు)The Gift of the Magi(క్రిస్మస్ కానుక)వంటి కథలు తెలియని వారు వుండరు.
అదేవిధంగా కీట్స్ కవితల్ని పద్యరూపంలో అనువదించారు.పద్యరచన చేయాలంటే పదాలకూర్పు, అలంకారాలు,రమణీయత,శైలి విషయాల్లో ప్రభాకర రెడ్డి గారు మరింత జాగ్రత్త తీసుకొని రాయటం గమనించవలసిన విషయం.
కీట్స్ తన ఆలోచనలకు అక్షరరూపం కల్పిస్తాడు. ఆ ఆలోచనలనూ అందులోని అనుభూతులూ అందిపుచ్చుకొని ఛందోబద్ధమైన అనుసృజన చేసారు రెడ్డి గారు.
To solitude (ఏకాంతవాసం)కవితలో తన వ్యాకులతని, గ్రామీణ ప్రాంతాలకు పారిపోవాలనే కోరికను,తనతో పాటూ తనని అర్థం చేసుకొనే ఒకతోడుకోసం పడే ఆరాటాన్ని వ్యక్తీకరించారు కీట్స్.
" ఒంటిగా నున్న మాతోడ నున్న యెడల
ఎంతబాగుండునోయి ఏకాంతవాస-"
అంటూ మూలకవి హృదయాన్ని పంచుకున్నారు రెడ్డి గారు.కవిగా కీట్స్ విషయాసక్తిని హృదయంగమమైనదిగా భావించి సరియైన భావచిత్రాలను ఉపయోగించి తనదైన ప్రకృతిసహజశైలిలో అనువదించారు.
ప్రపంచ సాహిత్యంలో దారిదీపం వంటి షేక్స్పియర్ కొరుకుడు పడని బ్రహ్మపదార్థం వంటి "ది సానెట్స్" ను రాసాడు.ఆనాటి ఉత్తమ గ్రంథాలులో ఒకటిగా ప్రముఖులచేత ప్రశంసించ బడిన 154 సానెట్స్ ను చిక్కని భావచిత్రాలతో తెలుగు దేశీఛందస్సు అయినా సీసపద్యాలలో అనుసృజన చేయడమే కాకుండా ప్రతీసానెట్ కీ లఘుటీక జోడించడం సాహసమే కాక అత్యంత ప్రయాసతో కూడిన కార్యం. షేక్స్పియర్ సానెట్స్ ( భావచిత్రాలు) గ్రంథరూపం దాల్చడానికి రెడ్డిగారి సోదరుడు కోడూరు పుల్లారెడ్డి గారి ప్రోత్సాహం మే కారణం అంటారు.
" మరణమందిన వారలు మరుగు పడిన
ఇంపులొల్కు కవితల కీర్తించబడుచు
మరల పుట్టిన యంతటి వరకు నాదు
ఉత్తమకవితల బ్రతికి యుందురోయి" అంటూ కవిత గొప్పదనాన్ని ఒక సానెట్ లో ప్రస్తుతించారు.
ప్రభాకర రెడ్డి గారు అనువాదాలలో అవసరాన్ని బట్టి దేశీయ ఛందస్సు ను ఉపయోగించినా యథాతథంగా మూలరచనలోని పదాల్ని దృష్టిలో వుంచుకుని పదలాలిత్యాన్ని మరుగు పడనీకుండా,అర్థం చెడకుండా ఛందస్సులో బంధించటం అంత సులభమేమీ కాదు.పలుభాషా స్వాధీనత గల ప్రతిభావంతులైన ప్రభాకర రెడ్డి గారి అనువాద గ్రంథాలు చదివిన వారికెవరికైనా వారి భాషా పటిమ అర్థమౌతుంది.
ప్రభాకర్ రెడ్డి గారికి ప్రాచీన ఆంగ్ల సాహిత్యం పైమక్కువ, గౌరవం ఉంది,వాటిని తెలుగు ప్రజలకు అందించాలనే ఆతురతా ఉంది,రెండు భాషలపై అభివ్యక్తి ఉంది ఇన్ని భావాలు మధ్య వారి మనసు పెట్టే ఘోష వారిని ఇన్ని అనువాదాలు చేసేలా చేసింది.
ఆంగ్ల సాహిత్యం లో ఎన్నదగిన రచయితల సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు అందుబాటులోకి తెచ్చిన కోడూరి ప్రభాకర రెడ్డి గారికి తెలుగు సాహితీరంగం పక్షాన నమోవాకాలు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)