31, డిసెంబర్ 2022, శనివారం
కథలపోటీలో సంపుటాలు
1. 2001లో భార్గవి రావు నూరు మంది రచయిత్రులకథలతో నూరేళ్ళపంటవేసేటప్పుడు కొంత కష్టపడవలసి వచ్చింది.
2.ఆరోజుల్లో రచయిత్రులు రచయితలకు తీసిపోకుండా కథాంశాలు ఎన్నుకొని రాసినవారు ఉండేవారు.
3.ఇటీవల సమాజం లోని లోతులకు వెళ్ళి పాఠకులు ఊహించలేని కొత్త కొత్త అంశాలను తీసుకుని కథలు రాస్తున్నారు.
4.రచయిత్రుల సంఖ్య కూడా బాగా పెరిగింది ఇప్పుడు సంకలనం చేయాలంటే సులభంగా రెండు వందలకు పైగా మంచి రచయిత్రుల కథలను సంకలనం చేసేయవచ్చు.
5.దానికి ఉదాహరణే శాంతినారాయణ గారి పురస్కార ప్రకటనకు వచ్చిన పుస్తకాలు.అరవైనాలుగు పుస్తకాల్లో పాతతరం రచయిత్రులు అతి తక్కువ మంది.ఇంతమంది గత పదిపదిహేనుఏళ్ళుగా రాస్తున్న వారే అధికం అది సంతోషించ వలసిన విషయం.
కథలురాయాలంటే కథలవర్కషాపు పెట్టి నేర్పించనక్కరలేదు.పుట్టినదగ్గరనుంచి ఎదుర్కొన్న అనుభవాలూ,అవమానాలూ మూలాలు మర్చిపోని వాళ్ళ కథని రాసేలా చేస్తుంది.
6. పంపిన పుస్తకాలు చదివి ఏపుస్తకాన్ని ఎంపిక చేయాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది.కథాంశం,భాషా, రచనా విధానం, ముగింపు వీటిని పరిగణలోనికి తీసుకుని పదేపదే చదవాల్సివచ్చింది.
7.పురస్కారం అందుకున్నఎండపల్లి భారతి శ్రామిక మహిళల దృష్టికోణం నుంచి బలంగా రాసిన కథలు. ఈ కథలు బతుకీత లో మునుగీతలు కొడుతున్నవాళ్ళు తప్ప ఒడ్డును కూర్చున్న వాళ్ళు రాయలేని కథలు. భారతి కథలు ఉత్తమ పురుష లోనే రాసిన కథలు కావటాన ఆమెనడిచే ముళ్ళదారుల్లోకి మనల్ని చెయ్యిపట్టుకొని కథ వెంట లాక్కెళ్ళతుంది .ఆ తర్వాత చెయ్యి వదిలినా,పుస్తకం మూసినా ఆ దుఃఖాలు మనల్ని వదలవు.
8.పల్లె జీవితంలో మమేకమయి పోయి వాటినే తన కథా నేపథ్యాలుగా మన ముందుకు తెచ్చింది.
కథలన్నీ చిత్తూరు యాసలో సాగుతూ మన ముందు కొత్త జీవితాలను పరిచయం చేస్తాయి. ఏ కథకు తగ్గట్టు ఆయా పాత్రల్ని చిత్రించటం పుస్తకంలో మరో ప్రత్యేక ఆకర్షణ.
వాస్తవ జీవితానికి దగ్గరగా ఉన్న కథ చదివగానే జీవమున్న కథఅని అనుకోవడమే కాక మనల్ని వెంటాడుతాయి అలాంటి కథలు ఒకేసారి చదివితే
అవే ఎండ్లపల్లి భారతి ఎదురీత కథలు.
9.పద్దం అనసూయ చప్పుడు కథలన్నీ కోయ జీవితాన్ని ఆవిష్కరించినవే. అందులోనూ మృత్యువు నేపథ్యంలోనివి. మృత్యువు నేపథ్యంలోనే సాగిన ఈ కథలు చదువుతుంటే కోయ జీవితం అడవి నుంచి దూరమై ఆధునిక పోకడలకు బలైపోయిన అస్థిత్వాన్ని కోల్పోతున్న సందర్భాన్ని తెలిపే ఈ నాలుగు కథలు సంస్కృతి, ఆచారాలు, పధ్ధతులు కనుమరుగైపోతున్న తీరుకు రచయిత్రి ఘర్షణ పడుతుందో అనిపిస్తుంది. ఓకే అంశాన్ని నాలుగు దృక్కోణంలో రాసిన ఈ నాలుగు కథల్లో కోయల ఆత్మ మనకు దర్శనమిస్తుంది. అందులోనూ స్త్రీహృదయం తో చెప్పిన కథలు.
నేనున్నాను కనకే
~~ నేనున్నాను కనుకే..."
“ఏమిటి కరుణా మరీ అంత బేలగా ఐపో తున్నావు? పిల్లలన్నాకా ఏదో ఒకటి వస్తునే వుంటాయి కంగారు పడకు నేను అరగంటలో బయలుదేరి వస్తున్నాను” అంటూ ఫోన్ పెట్టేసింది రాధ .
గబగబా వంట పూర్తిచేసి టిఫిన్ ,కూరా అన్నం కారియర్ లో సర్ది తయారై పోయింది .బీరువాలోంచి కొంత డబ్బు తీసి పర్స్ లో పెట్టుకొని ఆఫీసుకి లీవ్ లెటర్ రాసి భర్త రఘు కి ఇచ్చి అతను వెళ్ళేటప్పుడు దార్లో మా ఆఫీస్ లో ఇచ్చేయమని చెప్పి హడావుడి గా బయలుదేరింది .
కరుణావాళ్ళు.రాధా వాళ్ళు చిన్నప్పటినుండీ ఇరుగు పొరుగునే వుండే వాళ్ళు. ఇద్దరు బాల్య స్నేహితులు పెళ్ళిళ్ళు అయ్యేక కూడా ఒకే వూర్లో వుండటంతో వారి స్నేహానికి ఆటంకాలు రాలేదు. కరుణకి ఇద్దరు పిల్లలు పుట్టాక,అన్యోన్యంగా పచ్చగా వుండే ఆమె జీవితం అనుకోని సంఘటనతో చిన్నాభిన్నం అయ్యింది .ఆమె భర్త రోడ్డు ప్రమాదం లొ చనిపోయాడు .అతను పని చేసే ఆఫీస్ లోనే ఆమెకు వుద్యోగం ఇచ్చారు.ఆమె భర్త నా అనే వాళ్ళు లేని అనాధ. కరుణకి దారి తోచలేదు.పిల్లలిని ఒంటరిగా ఎలాపెంచాలి అనే దిగులు తో కృశించి పోతున్న ఆమె గుండెలో జీవం నింపి మామూలు మనిషిని చేయటానికి చాలా ప్రయత్నమే చేయాల్సి వచ్చింది.అంతవరకు ఆసరాగా వుండే కరుణ తల్లిదండ్రులు కూడా కొంతకాలం క్రితమే ఏడాది తేడాతో చనిపోయారు వున్న ఒక్క అన్నా ఎక్కడ ఈమె భారం తనపై పడుతుందో అని అంటి ముట్టనట్లు గానే వుంటాడు . కరుణకు అండగా వుండేదల్లా స్నేహితులే.
ఆటోవాడికి దారిగుర్తులు చెప్తూనే కరుణజీవితం గూర్చి ఆలోచిస్తు వచ్చింది రాధ .గుమ్మంకి దగ్గర గానే బాబుని ఒళ్ళో వేసుకుని కన్నీళ్ళతో కూర్చుని వుంది కరుణ.పాప దిగులుగా తల్లికి చేరబడి కూర్చుని వుంది.రాధకి ఆ దృశ్యం చూసేసరికి గుండెకరిగి నీరై నట్లైంది.
ఆటోని కాసేపు ఆగమని చెప్పి బాబీని రాధ ఎత్తుకుని కరుణని చీర మార్చుకొని బయల్దేరమంది.పాపకి గౌను మార్చి ఫ్లాస్క్ లో పాలునింపి బయల్దేరింది కరుణ.
రాత్రి నుండీ జ్వరం వాంతులతో తోటకూరకాడలా వేలాడి పోతున్నాడు బాబు.
హాస్పటల్ కి వెళ్ళగానే తొందరగానే చేర్చుకుని సెలైన్ బాటెల్ అమర్చారు.సెలైన్ లొనే మందు కూడా చేర్చి ఎక్కించటం మొదలెట్టడం తో వాంతులు క్రమంగా తగ్గినా టెంపరేచర్ మాత్రం ఎక్కువగానే వుంది.
రాధ తను తెచ్చిన టిఫిన్ పాపకి తినిపించి కరుణని కూడా తినమంది.అంత సేపూ బాబు దగ్గర రాధ కూర్చొని వార్డ్ ని అంతా కలయ చూసింది.అది పిల్లల హాస్పటల్ కాక పోవటంతో అన్ని బెడ్లూ పూర్తిగా నిండి .చిన్నపిల్లలు దగ్గరనుండి అన్నివయసుల వాళ్ళూ వున్నారు.
బాబు ముఖాన్ని ఒంటిని మధ్యమధ్య తడిబట్ట తో తుడుస్తూ దగ్గరకూర్చుంది కరుణ.పాపని తీసుకొని బైట వరండాలోకి నడచి అక్కడ కుర్చీలుంటే కూర్చొని పాపతో కబుర్లు చెబుతూ వుంది రాధ. వార్డ్ లోంచి బైటకి వచ్చిన ఒకామె పక్కనే కూర్చొని రాధతో మాట కలిపింది.
ఆమె భర్త కి కామెర్లు తిరగబెట్టటం తో ఆస్పత్రిలో చేర్చారట.ఆవిడకి స్కూల్లో చదువుతోన్న ఇద్దరు ఆడపిల్లలు వున్నారట.భర్త ప్రైవేటు కంపెనీలో వుద్యోగం చేస్తాడట.ఆవిడ విషయాలన్నీ అడగకుండానే ఏకరువు పెట్టిన తర్వాత “బాబుకి ఏమైంది దగ్గరనుండి అన్ని కూపీ లాగటానికి మొదలెట్టింది.
కొంతమంది అనవసర విషయాలతో అతి చనువు తీసుకుని చొచ్చుకు పోవాలని చూస్తారు రాధ ముక్తసరిగా మాట్లాడు తోన్నా ఆవిడ ఒదలటం లేదు.
రాధ సరిగా మాట్లాడక పోయేసరికి పాపని ముద్దులాడి ‘నాన్న ఆఫీస్ కి పోయాడా . పాపా ‘ అంది దానికి పాప అమాయకంగా ”నాన్ననాకు లేడుగా” అంది..
రాధ ఆప బోయే లోగానే
కరుణకి భర్త లేడని తెలియగానే “నేను ముందే అనుకున్నానులే ఈ రోజుల్లో మొగుడు పోయినా టింగురంగడిలా అలంకరించుకుని వుద్యోగాలంటూ వూరేగుతున్నారు…..” అంది.
ఇంకా ఏదేదో అనేదే రాధ ఆమెని కాల్చేసేలా కోపం గా చూసి అక్కడనుండి పాపని తీసుకుని లేచేసరికి ఆపేసింది.
'కరుణ ని రోజంతా సతాయించేలా వుందే ఈవిడ ‘అనుకుంది రాధ .
ఏదో మాటకిమాట అనేయడం సులువే కానీ హాస్పటల్ వాతావరణంలో అలాంటి వాళ్ళతో వాగ్వివాదం అనవసరం
సాయంత్రం వరకూ కరుణతోనే వుండి కావలసినవేవో కొని తీసుకొచ్చి మర్నాడు వుదయమే వస్తానని ధైర్యం చెప్పి పాపని తీసుకొని ఇంటికి వచ్చేసింది రాధ .
ఒక రెండు రోజులకి గాని టెంపరేచర్ నార్మల్ కు రాలేదు.పగలు రాధ కూడా కరుణకు సాయంగా వుంది. బాబు అనారోగ్యం ఒక వంతైతే కరుణకి రెండు బెడ్ల అవతల వున్న ఆమె మరొక బాధగా అయిందట. కరుణ కళ్ళనీళ్ళు పెట్టుకుని చెప్పింది.
వుదయం లేస్తునే కరుణ ముఖం చూడాల్సి వస్తుందని భర్తతో రెండో వైపు ముఖం పెట్టుకోమని దేవుడి ముఖం చూడమని అతని పక్కని దేవుడిపటం ఒకటి పెట్టి పెద్ద గొంతుతో చెప్పిందట.
ఆవిడ పోనీ భర్తతో ప్రేమగా వ్యవహరిస్తుందా అంటే అదీ లేదు.జబ్బుతో వున్న మనిషని చూడకుండా ఏదో ఒకటి సాధిస్తున్నట్లే మాట్లాడుతోంది.వార్డునంతటిని న్యూసెన్స్ చేసి పెడ్తోందట .విసుక్కుంటూచెప్పింది కరుణ.
రాధ తప్పించుకు తిరుగుతోన్నా ఒక్కొక్కప్పుడు ఆవిడకి దొరికి పోక తప్పలేదు. ఒకసారి మాటలలో “పసుపు కుంకుమాలకి దూరమై బతికే కన్నా చావటం మేలు” అంది. రాధ ఆమెని జాలిగా చూసింది.
ఆమెకి నరనరాన్నా స్లో పొయిజన్లా చిన్నప్పటినుండీ సౌభాగ్యవ్రతాలు ప్రవహించి ప్రవహించి శరీరమంతటా, ఆలోచన్లనిండా వ్యాప్తి చెందాయేమో .ఆమె నిజానికి భర్తకన్నా ముత్తైదువుగా వుండటాన్నే ప్రేమిస్తుందేమో. అసలు నిజానికి ఏమైనా సైకిక్ ప్రొబ్లెం వుందేమో అని రాధ మనసులో ఏమూలో సంశయం మొలకెత్తింది.
మూడో రోజు బాబుకి టెంపరేచర్ పూర్తిగా తగ్గిందని ఇంటికి పంపించారు. కరుణ ముఖం బెంగతీరి తేట గా ఐంది
ఓ రెండు వారాలు పోయాక ఒక శనివారం ఫోన్ చేసింది రాధకి కరుణ.
“నా గురించి నాలుగు రోజులు ఆఫీస్ కి సెలవు పెట్టి మరీ శ్రమ తీసుకున్నావు.రేపు మీరుఇద్దరూ మా యింటికి భోజనానికి రండి .అంతకన్నా నీరుణం తీర్చటానికి ఇంకేమీ మీకు చేయాలేను.’ అంది
“ఇప్పుడవన్నీఎందుకు "అన్న రాధ మాటలకు కరుణ ఒప్పుకోక పోయేసరికి ‘ సరేనంటు ‘అంగీకరించింది.
"నువ్వు వెళ్తే ఉదయమే వెళ్ళు మీరిద్దరూ కబుర్లకు దిగితే నాకు తోచదు.నేను భోజనం సమయానికి వస్తాలే ” అన్నాడు రఘు.
మర్నాడు ఉదయమే టిఫిన్ చేసి రఘుని పన్నెండింటికి రమ్మని చెప్పి రాధ కరుణావాళ్ళ యింటికి బయలు దేరింది . ముందు గది లో ఆడుకుంటున్న పిల్లలికి రాధ తను తెచ్చిన మిఠాయిలు పళ్ళు ఇచ్చి పలకరించి లోపలికి నడిచింది.
కరుణ ఎదురై పలకరించింది కాని ఆ నవ్వులో జీవం లేదు.
“ఏమిటోయ్ అలా వున్నావు.ఒంట్లో బాగు లేదా ఇటువంటప్పుడు ఈ భోజనాలవీ పెట్టుకోక పోతే ఏవైంది “ఆతృత గా అడిగింది రాధ
కరుణ జీవం లేని నవ్వు నవ్వి పక్కనే టేబుల్ మీది వార్తా పత్రిక తీసి చూపించింది .
“భర్త మరణానికి తట్టుకోలేక ప్రాణత్యాగం చేసిన సతీమతల్లి”
పెద్ద అక్షరాలతో వున్న వార్త !!ఆత్రుతగా చదివింది రాధ “కామెర్లతో కొంతకాలంగా వైద్యం చేయించుకుంటున్న భర్త అకస్మాత్తుగా అపస్మారకం లోకి వెళ్లి కన్నుమూసిన మరుక్షణం అతని భార్య ఆ వియోగం తట్టుకోలేక అదే హాస్పటల్ పై అంతస్తు నుండి కిందకి దూకి భర్తని చేరుకుంది.. “అని దాన్లో వివరాలతో బాటు రాయబడివుంది . కరుణ వెక్కిళ్ళు వినిపించి చటుక్కున పేపర్ అవతల విసిరి తలెత్తింది రాధ. కరుణ మోకాళ్ళలో తల దూర్చి కుమిలి కుమిలి ఏడుస్తోంది. .
ఏమిటి కరుణ “మందలింపుగా అంది .
“నే నెంత మొండిదాన్ని అంతగా ప్రేమించిన భర్త పోయినా ఎలా బతికి వు న్నాను.”వెక్కిళ్ళు పెట్టింది.
"ఈ పేపర్లవాళ్ళకీ మీడియా వాళ్ళకీ వాస్తవాన్ని వాస్తవంగా చెప్పడం కన్నా ఆ వార్తని ఆసక్తికరం గా,ఆకర్షణీయం గా చెప్పాలన్న తాపత్రయం ఎక్కువ. ఆ ప్రయత్నం లో అతిగా మషాలా గుప్పించి చెప్పడం ,రాయడం చేస్తుంటారు. అందువలన ఎంతమందికి బాధ కలిగిస్తున్నామన్న ఆలోచన వుండదు. ఇదీ అలాంటిదే కావచ్చు”అంటూ కరుణని కోప్పడింది రాధ.
ఇంకా కరుణ ఏడుస్తూనే వుంది .
” కరుణా నీకు మతి ఉందా లేదా? ఎవరో సైకిక్ పేషెంటు ఆత్మహత్య చేసుకుంటే అది భర్త మీద ప్రేమ వున్నట్లునిర్ణయించుకోవటమేనా?వార్తల్ని వినే జనం మనసుల్ని విషభరితం చేయడం కాదా? ఒక్కసారి ఆలోచించు ఇద్దరూ పోవటంతో ఆ పిల్లలు అనాధలై ఆ ఇంటా ఈ ఇంటా దేవిరించుకొని వీధులు పట్టేలా చేయటం గొప్పా? మొన్న బాబుకి అంత అనారోగ్యం చేస్తే తల్లివి నువ్వు వున్నావు కనుక కంటిపాపలా కాచుకున్నావు.లేకపోతే …..”పూర్తి చేయలేకపోయింది రాధ
అప్పుడే లోపలికి వచ్చి తల్లి కొంగు పట్టుకొని దిగులు ముఖాలతో నిలబడ్డ పిల్లలిద్దరిని చటుక్కున కౌగిలిలోకి తీసుకుని “అవును నేనున్నాను కనుకే…”
ఆర్తిగా హత్తుకుంది పిల్లలు ఇద్దరూ ఆమె మెడ చుట్టూ చేతులు వేసి కావలించుకున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)