3, డిసెంబర్ 2021, శుక్రవారం
అలకలకొలికి
అలకల కొలికి
ఎందుకో మరి
నామీద అలిగింది.
ఉదయం లేచిన దగ్గర నుంచి
డమ ఢమ లాడే డక్కుల బండికి
దారం కట్టి చప్పుడు చేసుకుంటూ
నా వెనకెనకే తిరిగి
నాకు తోచనీకుండా వెంట బడేది
ఆ దారాన్ని నా కొంగు కు తగిలించి
తాను పక్కకు తొలిగేసరికి
చప్పుడు చేయని డక్కులబండి
ఏమూలో ఉందో కానీ
బండి లేని దారం
నాకు భారం అయ్యింది
ఇలా నిశ్శబ్ధం నా కొంగు కి మూటగట్టి
మరి ఎందుకో నామీద అలిగింది
స్నానానికి వెళ్తే తలుపు దగ్గర నిలబడి
తొందరగా జలకాలాడి రమ్మని
కాపలా కాసి వేధించేది
అటువంటిది స్నానాలగది తలుపుకి
నిశ్శబ్దాన్ని తగిలించి
నామీద అలిగి
ఎక్కడికి వెళ్ళిందో మరి
ఎంత వెతికినా కనిపించలేదు
భోజనం చేస్తున్నప్పుడు కూడా
అన్నం ముద్ద పెట్టుకున్న నా వేళ్ళను
పట్టి బలవంతంగా లాక్కెళ్ళి
చేతులు కడుక్కునేవరకూ సతాయించి
కలం కాగితం అందించేది
ఇప్పుడెందుకో
నామీద అలిగి మూతి ముడుచుకు కూర్చుంది
కాసేపు ఏపుస్తకమో పట్టుకుని
మంచి రసపట్టు లో సాహిత్యం లో
మునిగి తేలుతుంటే
చాలులే చదివింది అని
మధ్యలో నన్ను వేధించేది కాస్తా
ఎక్కడో నిశ్శబ్దంగా దాక్కుండిపోయింది
కాసేపు విశ్రాంతి గా కూచోనీకుండా
వీపుమీద వాలి గూగూలు ఊగుతూ
జుట్టును జడలల్లుతూ ఆలోచనల్లోకి చొరబడి
తలపుల్ని అల్లుకోమని అల్లరి చేసేది
ఎందుకో మరి అలిగి కూచుంది.
రోజంతా అలసిసొలసి
పక్కమీద వాలి గాఢనిద్రలోకి వెళ్ళిపోతానా
నెమ్మదిగా పక్కన చేరి
బలవంతాన కనురెప్పలు విప్పి
కలల్ని దోచుకొన్నదే కాక
చాలులే నిద్ర రారమ్మని
కథలూ కవితలూ చెప్పుకునే
సమయమైందని చెయ్యి పట్టుకుని
లాక్కెళ్ళే అక్షరం
ఏమైందో ఏమో మరి
నామీద అలిగి ఏ మూలో నక్కీంది.
ఇప్పుడు ఎలాగైనా
నా అక్షరాల్ని వెతికి పట్టుకుని
లాలించి హృదయానికి హత్తుకుని
అలకతీర్చి కవితతో ముద్దాడాలి.
నడక దారిలో-- 9
* నడక దారిలో--9 *
నా స్కూల్ ఫైనల్ చదువు పూర్తిఅయ్యేలోపున మా అన్నయ్య ఎమ్మే ఎమ్ ఫిల్ పూర్తి చేసి మహారాజా కాలేజీ లో ఇంగ్లీష్ లెక్చరర్ గా ఉద్యోగం లో చేరాడు.మా స్కూల్ లోనే పనిచేసే మా అన్నయ్య సహోద్యోగి ఉపాధ్యాయుల అప్పల నరసింహమూర్తి గారు కూడా పై చదువు పూర్తి చేసుకుని కాలేజీలో తెలుగు లెక్చరర్ గా చేరారు.మా చిన్నన్నయ్య కూడా బీయిడీ పూర్తిచేసుకుని హైస్కూల్ లోనికి ప్రమోట్ అయ్యాడు.
ఇంత దూరం లో ఎందుకని పుత్సలవీధి చివర తూర్పు బలిజ వీథిలో ఇల్లు చూసుకుని మారిపోయాము.
మా తాత గారి ఇంటి పేరైన పుత్సలవీథి ఆ చివర నుండి ఈ చివరివరకూ దగ్గరా, దూరపు బంధువులే.మా అయిదుగురు మేనమామలూ,మా పెద్ద నాన్నగారు,వారి అమ్మాయి ఉండేది ఆ వీథి లోనే,ఆ వీథిలో రోడ్డుకి ఇరువైపులా నేత పని చేసేందుకు సరి అమర్చబడి ఉంటుండేది.కొన్ని ఇళ్ళల్లోంచి మగ్గం నేస్తున్న శబ్దం వినిపించేది.
నేను స్కూల్ ఫైనల్ పాసయ్యానని తెలిసి మా పెదనాన్న గారు మా చిన్నన్నయ్య తో "మా మనవరాలు వచ్చింది.ఇక్కడ ఆంధ్రా మెట్రిక్ పరీక్ష కట్టింది.మీచెల్లిని రేపు మా ఇంటికి ఒకసారి రమ్మని చెప్పు." అన్నారు.
ఇంతవరకూ ఆయనను ముఖాముఖి కలిసింది లేదు.మర్నాడు మొదటిసారి వెళ్ళాను.కుశల ప్రశ్నలు, నా అభిరుచులు,కాలేజీలో చేరిన విషయాలు అడిగారు ఆయన.అడిగిన వాటికి స్పష్టం గానూ, ముక్తసరిగా సమాధానం చెప్పి ఆయన మనవరాలి తో కాసేపు కబుర్లు చెప్పి, భోజనం చేసాను.
తిరిగి ఇంటికి వెళ్తానని చెప్పి బయలుదేరుతుంటే నాకు వాళ్ళు అమ్మాయి చేత చీర ఇప్పించారు.నాకు చాలా ఆశ్చర్యం కలిగింది.ఎందుకంటే ఏనాడూ ఏ సందర్భం లోనూ ఇలా ఎవరి నుండీ బట్టలు తీసుకోలేదు."ఎందుకండీ"అని వెనుకంజ వేస్తే "పరీక్షపాసయ్యావుకదా"అన్నారు పెద్దనాన్న గారు.పెద్దవారి మాటను కాదనలేక మరి మాట్లాడకుండా తీసుకుని ఇంటికి వచ్చేసాను.
అంతకు ముందు ఉన్న కంటోన్మెంట్ లోని ఇల్లయితే కుమారీ తో కలిసి కబుర్లు చెప్పుకుంటూ కాలేజీ కి వెళ్ళే దాన్ని.ఇప్పుడు నేనొక్కదాన్నే పుత్సలవీథిలో రోజూ నా వెనకే శల్యపరీక్ష చేస్తున్న ఎన్నెన్నో చూపులబాణాలు నిలువెల్లా నన్ను గాయాలు చేస్తుంటే రోజూ అగ్నిప్రవేశం చేస్తున్న సీతలా అయిపోయేదాన్ని.
అదే వీథి లో ఉన్న ఒక మామయ్య కూతురు ఆ ఏడాది బాలికల పాఠశాల లో ఆరో తరగతి లో చేరింది.ఆ స్కూలు మా కాలేజీ ఉన్న మాన్సాస్ ఆవరణలోనే ఉండేది.మరి ఆ పిల్ల కి తోడు కోసమేమో నన్ను పిలిచి మా రిక్షా లోనే కాలేజీకి వెళ్ళమని అన్నారు.సరే అని రోజూ వాళ్ళింటికి వెళ్ళి ఇద్దరం కలిసి రిక్షాలో వెళ్ళే వాళ్ళం.
తిరిగి వచ్చేటప్పుడు మాత్రం ఆ అమ్మాయి వెళ్ళిపోయేది.నాకు ప్రాక్టికల్స్ ఉంటాయి కనుక ఒక సమయం అంటూ ఉండదు.అదీ గాక కాలేజీ అయిపోయిన తర్వాత మహారాజా సంగీత కళాశాలలో కర్నాటక గాత్ర సంగీతం క్లాసులో చేరాను.అందువలన నేను ఇంటికి వెళ్ళటానికి ఆలస్యం అయ్యేది.
ఒకరోజు ఎప్పటి లాగే మామయ్య వాళ్ళింటికి వెళ్ళి మామయ్య కూతురు నేనూ వాళ్ళ రిక్షాలో కాలేజీకి బయలుదేరాము.దారిలో "నువ్వు ఇంకా ఎన్నాళ్ళు చదువుతావు వదినా" అని ప్రశ్నించింది ఆపిల్ల.
"పీయూసి అయ్యాక ఇంకా చాలా ఏళ్ళు చదవాలి.మూడేళ్ళ డిగ్రీ చేయాలి. టీచర్ అయ్యేటట్లైతే ట్రైనింగ్ చేయాలి. తర్వాత ఉద్యోగం చేయాలి".కలలో తేలి పోతూనే అన్నాను.
" ఆడపిల్లలు ఎక్కువ చదువుకుంటే పెళ్ళిళ్ళు అవ్వటం కష్టం అంట కదా?"అన్న ఆ పిల్ల మాట వినగానే దబ్బున కలలలోంచి ఇల పైకి పడినట్లైంది.
"ఎవరన్నారు?"కొంచెం తీవ్రం గానే నాగొంతు ధ్వనించి నట్లుంది.ఆరవతరగతి చదువుతున్న ఆ అమ్మాయి "ఏమో అందరంటున్నారు "బిక్కమొఖం తో నెమ్మదిగా అంది.
ఇంట్లో బహుశా నా చదువు గురించి జరిగిన చర్చ లో పెద్దవాళ్ళ మాటల్ని చిలకలా పలికిన ఆ పిల్ల వైపు జాలిగా చూసాను." నీతో వస్తుంటే నాకు కాలేజీ లో క్లాసుకు లేటవుతుంది.రేపటి నుండి నేను విడిగా ముందు వెళ్ళిపోతాను.నీతో రాను "అన్నాను.మరి వాళ్ళింటికి వెళ్ళలేదు.
ఆ అమ్మాయి పదోతరగతి వరకైనా చదివిందో లేదో తెలియదు.తొందరగానే ఒక పనికిరాని వెధవకిచ్చి పెళ్ళిచేసారనీ,నలుగురినో ఐదుగురినో కని పిల్లలతో ఆర్థికంగా చాలా అవస్థలు పడిందనీ, ఇప్పుడు చిన్నచిన్న ఉద్యోగాలతో ఆడపిల్లలే కుటుంబాన్ని అందుకుంటున్నారని విన్నాను.
ఆ రోజుల్లోనే మా ఇంకో పెదనాన్న కొడుకు వివాహానికి మా పెద్ద మామయ్య సుందరరావు గారితో కలిసి మానాన్నగారి జన్మస్థలం అయిన ధర్మవరం గ్రామానికి వెళ్ళాను.అక్కడే ఉన్న కొంత పొలం ఇంటిలో చిన్నపాటి భాగం మా నాన్నగారి ఆస్తి ఉందట.
పెళ్ళికి వచ్చిన మరో బంధువు నుండి కూడా మళ్ళీ ప్రశ్న ఎదుర్కొన్నాను." కాలేజీలో చేరావట కదా? ఇంతకీ ఏం గ్రూప్ తీసుకున్నావు?" అని.నా సమాధానం విన్నాక " ఏం లెక్కలు నీకు అంత బాగా వచ్చేమిటి?" అని వెటకారంగా మరో ప్రశ్న.
అంటే ఆడవాళ్ళు సైన్స్, లెక్కలు చదవకూడదా? లేకపోతే అవి చదివేటంత తెలివి తేటలు ఆడవాళ్ళకి ఉండవనా? నాకు అర్థం కాలేదు.బహుశా అందుకేనేమో కాలేజీలో MPC క్లాస్ లో పది లోపునే విద్యార్ధినులు ఉండేవాళ్ళం.ఇప్పుడు ఆలోచిస్తుంటే నేను హైస్కూల్లో చదివేటప్పుడు ఒక్క మహిళా టీచరూ లేరు.ఇక మా మహిళా కాలేజీ లో లెక్చరర్లు కూడా చాలావరకూ అగ్రవర్ణాలకు చెందిన వారూ,లేదా తమిళ, మళయాళీ వాళ్ళే.లెక్చరర్లే కాదు విద్యార్ధినులు కూడా అంతే.అప్పట్లోదళిత,బహుజన బాలికలకు రిజర్వేషన్లు లేవా? ఏమో తెలియదు.కుటుంబ కట్టుబాట్లు వల్లనే ఉన్నత విద్య చదువుకునే వారు కాదేమో.నిజానికి ఇప్పటికీ అటువంటి పరిస్థితులవలనే కొన్ని ప్రాంతాల్లో,కొన్ని దళిత, ఆదివాసీ కుటుంబాల్లో బాలికలకు విద్య ఎండమావి గానే ఉంది.
అరవై ఏళ్ళ క్రితం పరిస్థితి అది అనుకోవాలేమో.ఈనాడు చాలా మంది ఆడపిల్లలు టెక్నికల్ చదువులు ఇక్కడే కాక దేశవిదేశాల్లోకి కూడా వెళ్ళి చదవటం చూస్తుంటే నాకు ఎంత అబ్బురంగా ఉంటుందో!
తమాషా ఏమిటంటే అరవై ఏళ్ళ క్రితం లెక్కలు నీకు అంత బాగా వచ్చేమిటి అని వెటకారంగా అన్న వ్యక్తే ముఫ్ఫై ఏళ్ళకిందట నా కూతురునీ అలాగే ప్రశ్నించటం ఇంకా ఆశ్చర్యం.
ఆ గ్రామంలో మరొక అనుభవం ఏమిటంటే పెళ్ళికి వచ్చినవారు చుట్టు పక్కల వాళ్ళూ నన్ను ఉమా అని పిలవటం నేను ఉమని కానంటే బుగ్గలు నొక్కుకుంటూ అచ్చం ఉమ లాగే ఉన్నావే అని బోల్డంత ఆశ్చర్యపోవటం ఇప్పటికీ గుర్తు.
ఆ ఉమ అన్న అమ్మాయి మా నాన్నగారి దూరపు బంధువుల అమ్మాయి అచ్చంగా నా వయసే.ఆ అమ్మాయి కూడా ఈ విషయం తెలిసి నన్ను చూడటానికి కుతూహలంగా వచ్చింది.మా ఇద్దరినీ చూసిన వాళ్ళు కూడా ఎంత పోలిక ఉందో అంటూ ఆశ్చర్యపోయారు.డబుల్ ఏక్షన్ సినిమాలోలా మన లాంటి వ్యక్తి ని దగ్గర గా చూడటం గొప్ప అనుభవం కదా!
పెళ్ళినుండి తిరిగి వచ్చాక కొంతకాలం మా ఇద్దరి మధ్యా ఉత్తరాలు నడిచి ఆగిపోయాయి.ఇప్పుడు ఆ ఉమా ఎక్కడ ఉందో ఏమో తెలియదు.ఒక్కొక్కప్పుడు గుర్తు వేస్తే ఈ వయసులో కూడా నాలాగే ఉందా,మారిందా అనుకుంటాను.
--- శీలా సుభద్రాదేవి.
నడక దారిలో-- 11
నడక దారిలో-- 11
ఒక్కసారిగా మళ్ళా నా చదువుకు విరామం వచ్చింది.సెప్టెంబర్ లో గానీ తిరిగి సప్లిమెంటరీ పరీక్ష ఉండదు.ఒకవేళ చదివిస్తే మే-జూన్ లో గానీ కాలేజీ ఉండదు.
నా అభిరుచులను సానపెట్టటానికి మళ్ళీ పూనుకున్నాను.లేకపోతే మానసికంగా కుంగిపోతానుకదా! ఆ అవకాశాన్ని నా మనసుకీ,నా మెదడుకీ ఎప్పుడూ ఇవ్వటం నాకు ఇష్టం లేదు.
ఈరోజుల్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకూ , నిరక్షరాస్యులు, విద్యావంతులు కూడా అనేకమంది అతి చిన్న విషయాలకు కూడా కుంగిపోయి అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటారు.అలా ఐతే నేను ఎన్నిసార్లు కుంగిపోవాలో ఎన్నిసార్లు అవాంఛిత నిర్ణయాలు తీసుకోవాల్సివచ్చేదో.ఎప్పటికప్పుడు నాకు నేనే ,నన్ను నేనే స్పూర్తి కలిగించుకోవటం నావిధానం.
ఇప్పుడు మళ్ళా కథలోకి వెళ్తాను.
సాయంత్రం సంగీతం కాలేజీకి నాలుగుగంటలకి వెళ్తే ఆరువరకూ నా క్లాస్ సమయం. మా కాలేజీ ప్రిన్సిపాల్ గా అప్పట్లో ద్వారం భావనారాయణ గారుఉన్నారు.మా గాత్రం గురువు గారు బురిడి లక్ష్మీనారాయణ గారు.ద్వారం మంగతాయారు గారు వయోలీన్ గురువు గారు గా ఉండే వాళ్ళు.
సంగీత కళాశాలకు గొప్ప చరిత్ర ఉంది.విజయనగరం సంస్థానాథిపతి పూసపాటి విజయరామ గజపతిరాజు తన ఆస్థానంలోని ఉద్యోగి చాగంటి జోగారావుగారి అంధ కుమారుడు బాబు కోసం 1919 ఫిబ్రవరి 5న గాన పాఠశాలను ఏర్పాటు చేశారు. ఆనాడు ఈ పాఠశాలకు హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు అధ్యక్షులు. అనంతరం వయోలిన్ వాద్యంలో మేటి అయిన పద్మశ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు విద్యార్థిగా చేరటానికి రాగా ఆయననే అధ్యక్షులుగా నియమించారు. ఈ కళాశాలలో వీణ, గాత్రం, వయోలిన్, మృదంగం, సన్నాయి, డోలు వాద్యాలతో బాటూ నృత్యంలో కూడా శిక్షణ ఇస్తారు.
మా గురువు గారు నా గ్రూప్ వాళ్ళకి పాఠం చెప్పి బయట చెట్లు కింద ప్రాక్టీస్ చేసుకోమనేవారు.మేము సరీగా పాడుతున్నామోలేదో చూడటానికి మాచేత ప్రాక్టీస్ చేయించటానికి మాకు సీనియర్ విద్యార్థినులైన ద్వారం లక్ష్మీ, ద్వారం పద్మ లకు అప్పగించేవారు.అప్పటికి లక్ష్మీ,పద్మా పది,పన్నెండేళ్ళ పిల్లలు.వాళ్ళు తమ కన్నా వయసులో పెద్దవారిమైన మాచేత ప్రాక్టీస్ చేయిస్తుంటే తమాషాగానే కాక ముద్దుగా ఉండేది.వాళ్ళు మా చేత పాడించటమే కాక వాళ్ళూ తమ పాఠాన్నీ ప్రాక్టీస్ చేస్తుంటే వినటం నాకు ఇష్టం గా ఉండేది.
సంగీతకళాశాల ఆవరణలో చెట్లకింద ఒకచోట వీణమీద కృతులు ప్రాక్టీస్ చేస్తున్నవాళ్ళూ,మరోచోట ఫిఢేలురాగాలూ, ఇంకోచోట మృదంగ దరువులూ వినిపిస్తుంటే మనసంతా రాగమయం అయిపోతుండేది.ఏమూలో సన్నగా వినిపించే మువ్వలసవ్వడి మరోలోకంలోకి తీసుకుపోతుండేది.నాకు ఎప్పుడోఏదో పుస్తకంలో కలకత్తా లోని శాంతినికేతన్ గురించి చదివిన దగ్గర నుండి అక్కడ చదవకపోయినా పర్వాలేదు కానీ ఒకసారి చూడాలని చాలా కోరికగా ఉండేది.సంగీత కళాశాలలో సంగీతం నేర్చుకున్నంతకాలం అది గుర్తు వచ్చేది.అందుకే పాఠం నేర్చుకున్న తరువాత కూడా చాలా సేపు అక్కడే ఉండేదాన్ని.
1969లోనే సంగీత కళాశాల స్వర్ణోత్సవాలు జరగటం ఒక మరువలేని జ్ణాపకం.వారం పదిరోజుల పాటు కళాశాల పూర్వ విద్యార్ధులు అయిన శ్రీరంగం గోపాలరత్నం,మంగళంపల్లి, ఘంటశాల, సుశీల,నూకల చిన సత్యనారాయణ,నేదునూరి కృష్ణమూర్తి వంటి మహామహుల కచ్చేరీలు ప్రత్యక్షంగా వినటం ఎంతో అపురూపమైన గొప్ప జ్ణాపకం.
నిజానికి నేను సంగీతం కళాశాల లో చేరింది.సంగీతం పూర్తిగా నేర్చుకొని కచ్చేరీలు చేసేందుకు కాదు.నాకు లలిత సంగీతం పాడటం ఇష్టం.అపశృతులు రాకుండా పాడటానికి స్వరజ్ణానం ఉంటే కంఠం ఒకే పిచ్ లో సాగి శృతిపక్వంగా ఉంటుంది.మరొకటి కళాశాల ఆవరణలోని సంగీత సాగరంలో ఓలలాడుతూ మానసికంగా సేదతీర్చకోటానికి.
అంతేకాకుండా అమ్మకు సంగీతం అంటే ఇష్టం.అమ్మ చిన్నప్పుడు వాళ్ళ బంధువు అమ్మవయసుదే హార్మొనీ తో పాడుతుంటే అమ్మ వెళ్ళి వినేదట.ఒకసారి పని చేసుకుంటూ ఉత్సాహం తో స్వరాలు కూనిరాగాలు తీస్తుంటే మాతాతగారు "ఆ సాని పాటలు పాడేవంటే నాలుగు వాయిస్తాను"అని తిట్టాడని చెప్పింది అమ్మ ఓ సందర్భంలో.
అమ్మ పనులు చేసుకుంటూ భూకైలాస్ సినిమాలోని ' దేవదేవ ధవళాచల మందిర గంగాధరా' భీష్మ లోని 'మహాదేవ శంభో' పాటల్ని సన్నటి కంఠంతో పాడటం చాలా సార్లు విన్నాను.అందుకేనేమో ఇంట్లో ఎవరూ లేనప్పుడు నేను గొంతెత్తి చిన్నప్పటి నుండి పాటల్ని పాడుతుంటే సంభ్రమం గా వినేది.
నేను సంగీత కళాశాల లో చేరటానికి వెనకదన్ను అమ్మే.పగలంతా సంగీతం పాఠాలే కాక ఎప్పటిలా లలిత సంగీతం కూడా పాడుకునే దాన్ని.
నాకున్న సంగీతం అభిరుచి గుర్తించో మరేమో తెలియదు కానీ అన్నయ్య విజయనగరంలోని న్యూపూర్ణా థియేటర్ లో ఇంగ్లీష్ సినీమా " సౌండ్ ఆఫ్ మ్యూజిక్" కు తీసుకు వెళ్ళాడు.అదే కాక ఎవరో ఒకర్ని సాయంగా పంపి జూలియస్ సీజర్, క్లియోపాత్రా,గన్స్ ఆఫ్ నౌరోన్,బెన్ హర్ ఇలా చాలా సినిమాలకు పంపించాడు.ఆంతమాత్రాన నాతో ఆత్మీయంగా మాట్లాడాడని కాదు.తన చుట్టూ పరిధి చుట్టుకునే ఉండేవాడు.
అంత ఇష్టంగా సంగీత కళాశాల లో చేరినా డిగ్రీ రెండవ సంవత్సరం లో చదువు ఒత్తిడీ,ఇతర ఆసక్తులు వైపు మనసు పరిగెత్తటం తో సంగీతానికి స్వస్తి చెప్పేసాను.రోజూ గంటలు గంటలు పాటలు పాడుకోవడమే కాకుండా అమ్మకి సాయం చేస్తున్నా, ఎంబ్రాయిడరీ చేస్తున్నా,, బొమ్మలు వేస్తున్నా నా కంఠం నుండి రాగం తీగలు తీగలు గా సాగుతూనే ఉండేది.
అటువంటిది వివాహానంతరం హైదరాబాద్ వచ్చాక ఉమ్మడి కుటుంబం లో అలవాటు ప్రకారం రాగాల తీగలు గొంతులు లోంచి సాగబోయి వెక్కిరింతని తాకి ముడుచుకుని తిరిగి కంఠం చుట్టూ బిగుసుకున్నాయి.అంతే మళ్ళీ ఎప్పుడు అందరూ ఉన్న ఆ ఇంట్లో గొంతు విప్పలేదు.ఏ రాత్రి పూటో పాపాయిని నిద్రపుచ్చటానికి సన్నటి జోలపాటగా మిగిలి పోయింది.అప్పుడే రంగనాయకమ్మ రాసిన నవల "కళ ఎందుకు" గుర్తొచ్చి కళ్ళు చెమ్మగిల్లేవి.
తిరిగి పదేళ్ళకి బియిడీ చదివేటప్పుడు జాతీయ పండుగ ప్రోగ్రాము కోసం కొంతమంది తో ప్రాక్టీస్ చేయిస్తుంటే అక్కడే వింటున్న నా కంఠం నుండి అనుకోకుండా ఆ పాట వెలువడింది.నా సహవిద్యార్థినులతో పాడిస్తున్న మేడం ఆశ్చర్యం గా చూసి మంచి కంఠం అని పొగిడి ఏదైనా దేశభక్తి పాట నన్ను పాడమన్నారు.ఆరోజు గొంతెత్తి పాడాను.కానీ ప్రాక్టీస్ లేని కంఠం పొడిబారి పోవటం తో పాటు సరిగా రాలేదనిపించి దిగులు వేసింది.
తర్వాత ఉద్యోగంలో చేరాక స్కూల్లో జాతీయ కార్యక్రమాలకోసం పిల్లలకు పాటలు,డాన్సులూ నేర్పించటమే కాక మా ప్రధానోపాధ్యాయురాలు బడిలో ఉపాధ్యాయ సమావేశాలు జరిగినప్పుడల్లా నాచేత లలిత గీతాలు పాడించేవారు.
రేడియోలో వింటూ నేను సేకరించి రికార్డ్ చేసుకున్న కృష్ణశాస్త్రిగేయాలూ,సాలూరూ, బాలసరస్వతి పాడినగీతాలూ వందలాది పాటలు కేసెట్లు ప్రాక్టీస్ చేయటం లేదేమని నావైపు జాలిగా చూస్తున్నట్లనిపిస్తుంటుంది.పాట పాడాలనిపించి పాట ఎత్తకుంటే గొంతు సాగక రాగం విరిగి పోతుంటే దిగులు వేసింది.ఆ దిగులు నాలో సుడులు తిరిగి కొన్నాళ్ళు తర్వాత 2002లో "ఎగిరిపోయిన కోయిల"అనే కవిత రాసాను.
అందుకే మా అమ్మాయికి చిన్నప్పట్నుంచీ సంగీతం నేర్పించాను. రేడియో ఆడిషన్ లో కూడా ఎంపికై యువవాణిలో కొన్ని లలిత గీతాలు కూడా పాడింది.ఆమెకూడా ఉద్యోగం వల్లా బాధ్యతలవల్లా సంగీతాన్ని అశ్రద్ధ చేస్తుంటే నాలాగే ఆమెకంఠం కూడా ఎక్కడ మూగపోతుందోనని విలవిలలాడిపోతాను.ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తుంటాను.సంగీతం, నృత్యం వంటివి జీవితాంతం కొనసాగించటానికి, ప్రోత్సాహం అందటానికి కేవలం ఆసక్తీ, అభిరుచి మాత్రమే చాలదు.తగిన వారసత్వం కూడా ఉండాలేమో.
మూడుతరాలుగా ముందుకు అడుగువేయని సంగీత కథా కమామీషు ఇది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)