21, జూన్ 2021, సోమవారం

బొమ్మ జెముళ్ళు

   బొమ్మజెముళ్ళు


వాకిట్లో అందం కోసం వేసిన బొమ్మజెముళ్ళు

ఎప్పుడు వ్యాపించేసాయో

ఎలా ఆక్రమించేసాయో

చడీ చప్పుడూ లేకుండా ఇల్లంతా అల్లుకుపోయాయి


అంతటా ఇరుకుతనం

మూలమూలల్లోనూ రక్కసిపొదలే

రాగాలు ప్రసరించనీయని రక్కసిపొదలే

ఏ ముళ్ళకో తగులుకొని ఊహ చీరుకు పోతోంది

ఏ పొదల్లోనో చిక్కుకుని మాట ఆగిపోతుంది

మనసు నిశ్శబ్దంగా ఆవిరైపోయి

గుండె అవయవంగా మాత్రమే మిగిలి పోతోంది

మౌనం యాంత్రికంగా రాజ్యమేలుతోంది


ఆత్మీయగాలి కూడా చొరబడలేని ఇరుకు తనం

గాలాడ్డానికి మైదానాల్లోకి

పారిపోవాలనిపించేంత ఇరుకుతనం


మైదానాల్లో మాత్రం ఏముంది

స్నేహాన్ని పరిమళించుతూ

తలలుపుతూ పిలిచే పూలచెట్లేవీ

ఆప్యాయంగా తీగలు చాస్తూ

ఒళ్ళో చేర్చుకొనే పొదరిళ్ళేవీ


సమస్త ప్రపంచాన్నీ గడ్డిపోచలా చూస్తూ

నెత్తిన కళ్ళు పెట్టుకొని ఆకాశంలోకి చేతులు చాచే

అశోకచెట్లో టేకు చెట్లో తప్ప

పచ్చికలో దొర్లి దొర్లి

మనసారా ఏడవాలనుకుంటే

కాళ్ళలోనే కాదు కళ్ళల్లోనూ పుళ్ళు చేసే పల్లేర్లే


మైదానాల్నిండా జనమే

నగరాల్ని సైతం నట్టడవుల్ని చేసేస్తూ

స్పర్శకి కూడా ఇష్టపడనితనంతో

ముళ్ళు మొలిపించుకున్న దేహాల్తో

నిలువెల్లా బొమ్మజెముళ్ళైన జనాలే

ఇంటా బయటా గాలాడని ఇరుకు తనం

ఊహాడని పరాయి తనం

జీవం లేని ఇసుకపర్రల జీవితాలు

కాలుచాచి పారిపోవాలని చూస్తాం

ఆశ్చర్యంగా కాళ్ళూవేళ్ళూ కదల్చలేం

మనల్ని మనం చూసుకొంటే

ఆసాంతం మనమే బొమ్మజెముళ్ళం!!


9, జూన్ 2021, బుధవారం

నడక దారిలో--3

 ఇంటి పెద్దదిక్కు నాన్నగారు వెళ్ళిపోయాక కుటుంబం లో మార్పు వచ్చింది.వీథివరండా లో ఉన్న బల్ల ఖాళీ ఐపోయింది.బల్లే కాదు ఇల్లంతా కూడా ఖాళీయే.పెద్ద మామయ్య అమ్మచేతిలో పెట్టిన కొద్ది పాటి సొమ్ము కూడా ఖాళీయే.

     ఆరో తరగతి చదువుతున్న నేను మళ్ళీ బడికి వెళ్ళలేదు.  ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం ఐనప్పుడో, కుటుంబం సంక్షోభంలో ఉన్నప్పుడో ముందుగా మాన్పించేది ఆడపిల్లల చదువులే కదా.ఇంక నాకు అన్నీ సెలవులే.

     అప్పట్లో పెళ్ళో, పేరంటమో ఏవి జరిగినా లౌడ్ స్పీకర్లు పెట్టి పాటలు వేసేవారు.ఉదయమే ' నమోవేంకటేశా' అంటూ స్పీకర్లో ఘంటశాల కంఠం నుండి రాగం వినిపించే సరికే నాకు ఎంత సంబరంగా ఉండేదో! వీధి వరండా లో తాడు తో ఉయ్యాల ఉండేది అందులో ఒక తలగడా వేసుకొని ఊగుతూ లౌడ్ స్పీకర్లు లోంచి గాలి తరంగాల మీదుగా నా దగ్గరికి చేరిన చెంచులక్ష్మి సినిమా లో 'పాలకడలిపై' మొదలుకొని, భలేరాముడు,భూకైలాస్, సువర్ణ సుందరి ఒకటేమిటి ఆనాటి  పాటలతో గొంతు కలుపుతూ పాడుకుంటుండేదాన్ని .పాట ఆగుతే చేతిలోని బొమ్మల కథల పుస్తకాలను చేతిలోకి తీసుకుని చదవడం రోజంతా అదేపని.

           మా ఇంటి ఎదురుగా గుప్తావారి ఎర్ర పళ్ళపొడి తయారు చేసి అమ్మే కుటుంబం ఉండేది.వాళ్ళింట్లో అమ్మాయి కూడా నన్ను చూసి ఉయ్యాల కట్టించుకుని రాగాలు తీసేది.

           మా ఇంటికి దగ్గర్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి ఇల్లు ఉండేది.వాళ్ళకి నలుగురు ఆడపిల్లలు.ఇద్దరు అమ్మాయిలు నా తోటి వాళ్ళు. వాళ్ళు ఎక్కడికి ఎవరింటికీ  వచ్చేవారు కాదు.నన్ను వాళ్ళ ఇంటికి రమ్మని జవాన్ ని పంపి పిలిచేవారు.బొమ్మలపెళ్ళిళ్ళు చేసేవారు.వాళ్ళురాకుండా నన్ను రమ్మని మాటిమాటికీ పిలుస్తూ ఉండటం తో అమ్మ నన్ను కూడా మాటిమాటికీ వెళ్ళొద్దని కోప్పడింది.అంతే ఇక వెళ్ళటం మానేసాను.

            ఒకరోజు మధ్యాహ్నం మూడో నాలుగో అయ్యుంటుంది,  యథావిధిగా కథల పుస్తకం చదువుతుంటుంటే అకస్మాత్తుగా చిమ్మచీకటి ఏర్పడి హోరున పెద్దగా చప్పుడు. వర్షం పడుతుందేమో అని బయటికి వస్తే  ఏమిలేదు.చుట్టుపట్ల అందరూ ఆ శబ్దానికి ఇళ్ళల్లో నుండి బయటకు వచ్చారు.ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. ఒక్కసారిగా నేను కెవ్వున కేక వేసాను నామీద ఏదో పడిందని అన్నాను.అంతలో చూస్తూ చూస్తుండగానే ఆ  నల్లని మేఘం జారుకుంటూ వెళ్ళి పోతే 

      తెలతెల్లని వెలుగు తెరలు తొలగించుకున్నట్లు మెలమెల్లగా వచ్చింది.నామీదపడిన దాన్ని చిన్నన్నయ్య తీసుకు వచ్చాడు అరచేయి అంత ఉన్న మిడత.అంటే అంత హోరు తో నల్లమేఘం లా వచ్చినది మిడతలదండు అన్నమాట.ఇటీవల మిడతలదండు రాష్ట్రాలలోకి వచ్చిందని మీడియా లో ఊదరగొడుతుంటే ఆనాటి అనుభవం గుర్తు వచ్చి అందరికీ చెప్పాను.మరి తర్వాత ఈ అరవై ఏళ్ళలో మిడతలదండు ఎప్పుడైనా వచ్చిందో లేదో గుర్తు లేదు.

          ఆ రోజుల్లోనే ఒకరోజు మా ఇంట్లో అప్పుడప్పుడు ఇంట్లో సాయానికి వచ్చే అన్నపూర్ణ ని నాకు తోడుగా బియ్యం పిండి పట్టించటానికి నన్ను అమ్మ కొత్తపేట లోని పిండిమరకు పంపింది.పలుమార్లు జాగ్రత్తలు చెప్పి పంపింది.అన్నపూర్ణ మేదకురాలు.బండ పనిచేయడమే తప్ప ఏమీ రాదు ఏమీ తెలియదు.సరే పిండి పట్టించి తిరిగి మా ఇంటి బాటకు వచ్చే టప్పటికి ఒక ఆమె పలకరించి ' ఇక్కడే పూల్ బాగ్ రోడ్లో  బాలపేరంటాలు గుడికి వెళ్దాం.రా పాపా.అంతా మంచి జరుగుతుందని" అంది . అన్నపూర్ణ ఆవిడ వెనకే వెళ్ళిపోవటం మొదలు పెట్టింది.అన్నపూర్ణని పిలుస్తూ నేనూ వెంటబడ్డాను.

        "భయపడకు పాపా  మీ గురించి తెలుసు మీ నాన్న గారు పోయారు కదా.డబ్బుకి ఇబ్బంది పడుతున్నారు కదా.మీ అన్నయ్య కి వచ్చే ఏడాది కల్లా  ఉద్యోగం వస్తుంది. మీకష్టాలన్నీతీరి పోతాయి.నువ్వు కూడా బాగా చదువు కుంటావు.

     శ్రీ వీర బాల పార్వతమ్మ పేరంటాలు నీలాంటి పాపే.రెండేళ్ళ కిందట కుక్క కాటుకుగురై  చనిపోయింది.తర్వాత అమ్మానాన్నలకు కలలో కనబడి రోడ్డు పక్కన గుడి కట్టించమంది.అలాగే 1958 లో పూల్ బాగ్ రోడ్ లోగుడి కట్టి పూజలు చేస్తున్నారు.ఆ దారెంట రాజాం పోయే వాహనాల వారంతా తప్పకుండా ఆ గుడికి వెళ్ళి మొక్కుబడులు చెల్లిస్తుంటారు.ప్రతీ ఏడాది ఫిబ్రవరి లో అయిదు రోజుల పాటు ఉత్సవాలు కూడా జరుగుతాయి.గుడికి దగ్గర లోనే మన విజయనగరం రాజు లైన పూసపాటి రాజులభవనం ఉంది తెలుసా." ఈ విధంగా నా చెయ్యి పట్టుకుని  స్థల పురాణం  చెప్తూ నడుస్తుందామె.

        మధ్యమధ్యలో భయపడకు "మీ అమ్మ ఏమీ అనదులే" అంటోంది ఆమె.పళ్ళికిలించుకుంటూ ఆవిడ వెనకే నడుస్తున్న అన్నపూర్ణని చూస్తుంటే ఒకవైపు కోపం, ముసురు కుంటున్న చీకటిని చూస్తుంటే భయం.ఇంటికి వెళ్ళాక అమ్మ ఏమంటుందో అని దుఃఖం ముప్పిరిగొన్నాయి.ఆమె చెప్తున్న దేదీ నాచెవికి ఎక్కడం లేదు.

        చిన్న పందిరి మాత్రమే ఉన్న ఆ గుడిని చూస్తే నాకు గుడిలా అనిపించలేదు.కనీసం నమస్కారం ఐనా చేసానో లేదో తెలియదు.తిరుగు ముఖం పట్టి మా వీథి మొగలో ఎక్కడైతే ఆవిడ కలిసిందో అక్కడ వరకూ వచ్చి ఎటో వెళ్ళి పోయింది.

        ఇంటి దగ్గర వాకిట్లో అమ్మా, చిన్నక్క , అన్నయ్యా ఆందోళన నిండిన ముఖాలతో నా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.అన్నపూర్ణ నుండి పిండి పట్టించిన  గిన్నే తీసుకుని పంపించేసింది అమ్మ.

        లోపలికి వెళ్ళాక ఏడుస్తూనే నేను చెప్పిన  విషయం అంతా విని ఎవరు పిలిస్తే వాళ్ళ వెంట వెళ్ళి పోవటమేనా అని అందరి చేతా చీవాట్లే కాక,చెంపలు బూరెలు అయ్యాయని వేరే చెప్పక్కర్లేదు అనుకుంటా.

        అంతే కాక ఆ సంఘటన నన్ను ఈ నాటికీ వెంటాడుతూనే ఉంది.

        చిన్నప్పుడు చూసిన శ్రీ వీర బాల పార్వతమ్మ పేరంటాలు గుడి ఈ అరవై ఏళ్ళలో బహుశా బాగా బ్రహ్మాండం గా విస్తరించే ఉంటుంది.ప్రభుత్వ బడులు ఏన్నేళ్ళైనా అభివృద్ధి లోకి రావు కానీ గుడులు అంతకంతకూ పెరుగుతూనే ఉంటాయి కదా.అందుకే ఆ  జ్ణాపకాన్ని ఈ సారి విజయనగరం  వెళ్ళినప్పుడు కొంతైనా వెతుక్కోవాలి.  ఒకసారి వెళ్ళి తప్పక చూసి రావాలి. 

-- శీలా సుభద్రా దేవి.