12, సెప్టెంబర్ 2019, గురువారం

వార్షిక కళ

అద్భుతమైన నైపుణ్యంతో జీవత్వం ఉట్టిపడే వినాయకప్రతిమల్ని నిమజ్జనం చేస్తూ న్నప్పుడు వాటిముఖాలమీద నిలబడిమరీ తొక్కుతుంటేనాకెందుకో బాధ కలుగుతుంది.కాని అవినిమజ్జనం చేస్తేనే కదావాటిని తయారుచేసేవారికిమళ్లా పనిదొరుకుతుంది. ఎప్పుడో 1980 లలో రాసిన నా కవిత మీకోసం.

వార్షిక కళ

పుట్టినదగ్గరనుండీ
జీవితాంతం వరకూ
జీడిమరకలా
పట్టుకుని వదలని దారిద్ర్యం లాంటి
బంకమన్నుతో
ఒంటిమురికి నలిచి
చెమటతో తడిపి
ఏడాది పొడుగునా
రెక్కలు ముక్కలు చేసుకుంటూ
ఆ కొననెక్కడో మిణుకుమనే
మిణుగురు లాంటి ఆశనే ఆధారం చేసుకుని
దానితో ఓపికను కొని తెచ్చుకొని
ఆశలరంగులను అద్ది
అందమైన నిలువెత్తు బొజ్జగణపతులను
తీర్చిదిద్దే అతను కూడా బ్రహ్మే
అయితే
అతనుండేది నాభికమలమేం కాదు
గరిమనాభిపై నిలిచి
ఏపాటి గాలివీచినా
స్థానం తప్పి పడుతుందేమోబనిపించె
ఒంటి నిట్రాడి పాక
వినాయకచవితి ముందే
పాక మీద కన్నాల కిటికీల గుండా
బొమ్మలబ్రహ్మ సృష్టి చూద్దామని
వానదేముడు గానీ ముచ్చట పడితే
ఏడాది కష్టమూ మట్టి పాలే

అందుకే దూరాన నల్లమబ్బు
వాని పాలిటికి ముంచుకు వచ్చే మృత్యువు
దాని బారినపడి
అతని చేతులలో అందాలు దిద్దుకున్న
సజీవప్రతీమలు జీవఛ్చవాలైతే
అతనూ అతన్ని నమ్ముకున్నవాళ్లూ
శవాలౌతారు

వినాయకచవితి నాడే
అతని కళా సృష్టి
ప్రజలకళ్ల ఎదుట పడుతుంది
రంగుదీపాలకాంతులతో
వన్నెలుదిద్దుకుని
మరింతగా మెరిసిపొతాడు రంగులవినాయకుడు
ఆ రోజునైనా
 తనను సృష్టించిన వానికి కడుపు నింపకపోయినా
రకరకాలనైవేద్యాలవిందులు
తనచుట్టూ పరివేష్టించగా
సినీమా సంగీతం ఏనుగుచెవులతో ఆస్వాదిస్తూ
ఈ వైభవమంతా
నవరాత్రుల ముచ్చటేనని తెలిసికూడా
మురిసిపోతుంటాడు

తర్వాత
ఆనవాలైనా మిగుల్చుకోకుండా
నీళ్లలో తోసివేయబడి
నామరూపాలు లేకుండాపోతాడు
మళ్లీ ఎలక్షన్లవరకూ
నాయకులకు ప్రజలు గుర్తుకు రానట్లే
మళ్లి ఏడాది వరకూ
వినాయకుని అందాలూ
వాటిని సృష్టించిన కళాకారుని ప్రతిభా
మందులోకైనా లేకుండా
కనుమరుగైపోతాయి!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి