30, నవంబర్ 2015, సోమవారం

     సెప్టెంబర్ 11 దుర్ఘటన   ఎంతమంది తల్లులకు నైట్ మేర్ గా మారిందొ చూద్దాం 

 యుద్ధం  ఒక గుండె కోత--3వ చాప్టర్

అర్ధరాత్రి వుండుండి  వులిక్కి పడ్తాం 
నిద్రలొ కూలిపోతున్న కలలపంటల్ని
ఆర్తితో వెతుక్కుంటాం
తల్లడిల్లుతున్న  పసివాళ్ళప్రాణాల్ని
నిద్రలోనే కొంగులు పట్టి ఆపుకోవాలనుకుంటాం 
మృత్యువు తీసుకెళ్ళి పోతున్న ప్రాణాల్నుండి
ప్రశ్నలు జారిపడ్తున్నాయి
ఒక్కో ప్రశ్నా ఒక్కో కత్తి కోత
నిజానికి మనం మతాల్ని
తొమ్మిది నెలలూ కడుపులో మోయం కదా!
తల్లులారా!  మీరన్నా చెప్పండి
మీరెవరైనా మీ గర్భం లో మతాన్ని దాచుకున్నారా
మనఒడి లోకి చేరాకే కదా
వాళ్ళు రాముళ్ళో,రహీం లో
బుష్ లో ,లాడీన్ లో
గాంధీలో .గాడ్సెలో అవుతున్నారు
మన గర్భం లోనే కదా
తల్లిథెరీస్సా కళ్ళు విప్పింది
మన గర్భం లోంచే కదా
కుష్టురోగులకు సెవలు చేస్తున్న బాబా ఆంటే జన్మించాడు
మనకి తెలియకుండా
రాక్షసులెప్పుడు వూపిరి పోసుకున్నరో
గర్భస్థశిశువులకైనా,పుట్టాకైనా
ఇక నుండి మనం అనామికలు గానే పెంచుదాం
పెరిగాక వారి  పేరు వాళ్ళే సంపదించుకుంటారు
వాళ్ళ భవిష్యత్ వాళ్ళే నిర్మించుకుంటారు
ఎక్కడో సున్నితమైన కదలిక
పూరేకు మీద పడిన మంచుబిందువు
అసహాయం గా చిట్లిపోయిన సవ్వడి
దాక్కోవాలని ప్రయత్నించిన కన్నీటి బిందువు
ఆవిరి అయిపోతున్న శబ్దం
అలసి పోయిన తల్లి గర్భం లో
మెత్తని మృత్యు కత్తి పేగు తెంచిన చప్పుడు
కూలిపోతున్న బహుళ అంతస్తుల సౌధల క్రింద
నలిగి పోతున్న ఆక్రందన
ఎక్కడో వృద్ధుల వడలిన కన్రెప్పల అడుగున
కన్నీరు ఇగిరి పోయిన ఎడారి మైదానలు
పంచభుజి కోణం లొ గుచ్చుకున్న
కొత్త పెళ్ళి కొడుకు గుండె
సప్తసముద్రాల అవతల
రంగుల కలల్లొ తేలిపోతున్న అమ్మాయి
ముచ్హటగా పెళ్ళికి వేయించుకున్న మెరుపు గాజుల మధ్య
చివరిసారిగ కొట్టుకున్న అలజడి
విచ్చుకున్న క్లష్తర్ నేత్రం విరజిమ్మిన నిప్పురవ్వలు
జనానాలో నిద్రిస్తున్న తల్లి గుండెని కాల్చిన వాసన
శరణార్ధ శిబిరాలలోని అనాథ బాలల్ని
ఆవరిస్తున్న పెనుచలి
రాత్రి తాగిన తల్లి పాల నురుగు
వెక్కివెక్కి నిద్రలోనే కనుమూసిన పసిపాప పెదాలపై
రక్తపు డాగు తో మమేకం అయిన ప్రకంపనం
ప్రార్ధనలో మునిగి పొవాలని
మూసిన కన్రెప్పల కింద దూరిన మృత్యువు
రెపటి తొలి వెలుగు చూడనీకుండానే
మందిరలముందె శిలువలకు వేలాడాదీసి
ఆర్పేసిన హృదయ దీపాలు
భవంతులు కృర మృగాలు  దాగిన కొండగుహలై
జనావరణాలు నిర్జీవ సముద్రాలై
వూపిర్లు విషసర్పాల బుసలై
ప్రాణాలు భయం కలుగులోదాగిన మూషికాలైన భయానక ఆలోచనలు
అంతరంగాన్ని మెలిపెడుతుంటే
కంఠానికి గుచ్చుకున్న సూదిమొన చేస్తున్న గాయం బాథ!
సమర శంఖం లోంచి
చుక్క చుక్కై ఒక్కొక్క చినుకై
రాలుతోన్న రక్త బిందువులు
సహస్రాబ్ధికై కొన్న కొత్త చీర మీద
మాయని అసహజ చిత్రాల్ని లిఖిస్తున్నాయి .
 

yuddham oka gunDe kOta

    యుద్ధం ఒక గుండె కోత -2వ చాప్టర్

 
తాకట్టు గా మారి ఇనప్పెట్టి లో చేరిన ఇంటిని
విడిపించటానికి డబ్బు పంపుతానని బాసలు చేసి
ఇకమీదట మన జీవితాలు పూలతేరు మీదే నని
రాత్రి చెవిలో ఒలికించిన తేనె సోనలు
ఏ మేఘాల అంచుల్లో ఒదిగిపోయాయొ

ఆఘమేఘాల మీద ఒడిలో చేరటానికి వస్తున్నానంటూ
క్షణాల్లో హృదయాల్తో వూసులాదు తానని
గుసగుసగా చేసిన వాగ్దానాలు
ఏ గాలి తెరల్లో చితికి పోయాయో

మృత్యువు వెనకనే తరుము తుంటే
ప్రాణాల్ని గుప్పిట్లో బంధించే లోపునే
కాళ్ళు లిఫ్టులౌ తూ జరిపోతా యి
మెట్లు స్కేటర్లై కదిలి పోతూనేవుంటాయి

భయం వెనకే తల్లి పిలుపు వెంటాడు తుంది
తండ్రి చేసిన అప్పులు తరుము తాయి
నిస్సహాయత్వం మైకం లా కమ్మేస్తుంది
ఒకే ఒక్క క్షణం
మృత్యువుకి దొరికి పోతారు
ఎటువెళ్ళాలొ తోచని  పరి స్థితి
విజయగర్వం తో మృత్యువు పోగై 
వూపిర్ని బంధించటానికి పైకి వురుకుతుంది
ఒకే ఒక్క దారి ముందున్న కిటికి !
ముందు వెనుకలు చూసే ఆలోచన మూసుకు పోతుంది
అంతే
ఇక అటువైపే పరుగు
అది ఏ అంతస్తో గుర్తు రాదు
కళ్ళకి కనిపించేది
భ్రాన్తిలా మైమరపింప  జేస్తుంది
ఆ క్షణం లో
అమ్మ ఒడిలోకి దుముకుతుననంత  ఆర్తి తో
ఒకే ఒక్క గంతు
తల కిన్డులగా మృత్యుకుహరమ్ లోకి
సాగిపోతూ సోలిపోతూ ....!
ఒకే ఒక్క క్షణం అమ్మ గుర్తుకొస్తుంది
నేలని తాకుతున్న తలలో ఆశలు చిట్లుతాయి
అనంత దూరమ్ లోని అమ్మ పొట్టలో
అప్పుడే రక్తం తో పాటూ
ప్రవహిస్తూ వస్తున్నా సూది మొన
చురుక్కు మనిపిస్తుంది

సవాలు కాల్తున్న వాసనలో
ఏ దేశపు ఆచూకీ తెలియదు
ప్రవహిస్తున్న  ఆ రక్తధారలలోకి ఏ బిందువూ 
వర్ణవిభేధాల్ని విక్షేపమ్ చేసి చూపదు
కుళ్ళి పోతున్న శవాల్ని ఆక్రమిస్తున్న  క్రిములు
ఏ వూఓ ఏ దేసమో చిరునామాల్ని తెలుసుకొని
రంగూ రుచీ వాసనల్ని ఆ స్వాదించవు 

ఏనాడో గతించిపోయిన కణాల్ని
మనలోకి మనమే ఆవాహన చేసుకొంటున్నాము
రూపురేఖలు తీర్చిదిద్దుతున్నామ్
ఒక  గొప్ప ఆవిష్కారం చేస్తున్నామని గర్వపడుతున్నాం
ప్రపంచాన్ని జురాసిక్ పార్క్ చేసుకుంటున్నాం
ఈనాడు  భూగోళాన్నిశాసిస్తున్నవి
పురాతనశిధిలాల   నుండి బయటకు వస్తున్నా
నరభాక్షకాలైన భయంకర డై నొసార్లే

వాటిని మనమే కదా
దీర్ఘ  నిద్ర   నుండి మేల్కొలుపుతున్నామ్
స్వయంకృతాపరాదానికి
ప్రపంచమంతా జరిమానా కట్టాల్సిందే
మృత్యువు కారుమబ్బుల్లా
మనజీవితాలపైన పరచుకొంటుంటే
ఇన్ని రోజులుగా సమకుర్చుకుంటున్న
శ్రమఫలితాన్ని దోచేస్తుంటే
నిర్జన ఎడారి లో దిక్కులేనివారమౌ తున్నాము
మనకోసం మనకో తోడు ని
తక్షణం వెతుక్కోవలసిందే
 
 
   


 
 

25, నవంబర్ 2015, బుధవారం

yuddham oka gunde kOta



యుద్ధం ఒక గుండె కోత --1 వ చాప్టర్

బాధ
సన్నటి సూది ములుకై
రక్తం లో ప్రవేశించింది
నరాల్ని కుట్టుకుంటూ రక్తం  తో బాటు గా
శరీరమంత టా ప్రవహించటం మొదలైంది
శరీరం   లో ఎక్కడో ఒక చోట
ఉండుండి  ప్రవాహమార్గం లో
సున్నితమైన నరాల గోడల్ని తాకుతూ
స్పందనల్ని మీటుతూ
చురుకు చురుకు మనిపిస్తూనే  వుంది
హహాకారాల్ని ఆహ్లాదం గా పరిగణీంచలేం  కదా
ఆక్రందల్ని ఆనందం గా ఆస్వాదించలేమ్  కదా
చాటున మాటేసి పంజా విసిరినా
పంజా దెబ్బ పడేది అమాయకులమీదే
గాయం అయ్యేది తల్లి గర్భం పైనే

ఆకాశం పిడుగై వర్షించినా
పక్షులకు ఆశ్రయమైన ఏ మహావృక్షమో
కాలి  బూడిద కావలసిందే కదా       
అనాధ పక్షులు కకావికలై పోవలసిందే కదా
పెనుబాంబులు  గా రూపాంతరం చెందిన
లోహవిహంగాలు పెఠెలు మంటే
ఎక్కడో ఏమూలో
ఒక తల్లిపేగు ఖణేల్ మంటుంది
ఏ పరిస్థితులు ఆకాశం నిండా
యుద్ధమేఘమై అలముకొన్నా
దుఃఖం భూగోళం అంతా వర్షిస్తుంది
వేలు ఎవరిదైతేనేం
కన్నుమాత్రం మనందరిదీని
కాలుస్తున్నది మనిల్లు కాదని
మూడంకే వేసి ముడుచుకు పడుకున్నా
మంట సెగ మనచుట్టురా ఆవరించక మానదు
చేతులు మొదలంటా  కాలేవరకూ
బాధని సహించాల్సిందేనా?
ఎవరికీ వాళ్ళమే ఆకుల్ని వెతుక్కొంటూ
మంటల్ని చల్లార్చుకోవల్సిందేనా?
చేతిగాయాల్నైతే  చూపగల్గుతాం
కడుపులో జ్వలిస్తున్న దుఃఖపు మంటని
ఎలా చల్లార్చుకోగలం?
కనిపించకుండా రక్తంలో ప్రవహిస్తూ
నిలువెల్లా గాయాల్ని చేస్తున్న
ములుకుల్ని ఎలాతొలిగించుకోగలం ?