24, అక్టోబర్ 2013, గురువారం

swechchaalankaraNa

మెత్తని ఉరిత్రాళ్ళు








రంగుల చొక్కాలు వెలిగిపోతుండగా

బరిలోకి పదమూడుమంది ఆటగాళ్ళ్ళు ప్రవేసించారు

అది క్రీడాస్థలి-

కానీ-

బీరువాల్లో దాచిన రంగురంగుల కండువాల్లోంచి

అవకాసాన్ని బట్టి అవసరాన్ని బట్టి

ఒకటి ఎంచుకొని మెడకి వేలాడేసుకొని

దేశం నిండా వందలాది ఆటగాళ్ళు తిరుగు తున్నారు!

ఇది వూరువాడాల్లోని స్థితి



మనం గాలరీల్లోనూ మహాసభల్లోనే కాదు

ఇంట్లోనే కుర్చీలకు అతుక్కొని

కేరింతలు కొడ్తూ జయజయ ధ్వానాలు చేస్తూ

వుద్రేక పద్తూ ఆవేశపడ్తూ

భయకంపితలమౌతూ

నవరసాల్నీ ముఖం పై పులుముకుంటున్నాం



అక్కడ వికెట్లు పద్తుంటే

మనం సంసారాల్లో బొక్క బోర్లా పడ్తున్నాం

అక్కడెవరో పరుగులు తీస్తుంటే

మనం బాధల్నుండి దూరం గా పరుగులు పెడ్తున్నాం

మొన్నటి వరకూ రంధ్రా న్వేషణలతో చేసిన

దుర్భాషాదుర్గంధాల్ని కడిగేసుకొని

అక్కడికక్కడే కండువా మార్పిడులతో

ప్రశంసాపతాకాల్ని ఎగరేస్తుంటే

బిత్తరపోయి గుడ్లు మిటకరిస్తున్నాం



చిరకాలంగా మనసుల్ని కలబోసుకొన్న మిత్రులు

ఏ దార్లోనో ఎదురౌతే

ఒకరి సొత్తొకరం దోచుకున్నామేమోనని

ఒకరి భూమి ఒకరం కబ్జా చేసేసుకున్నామేమోనని

మనసులు మూసుకొని

ఒకరినొకరం అనుమానం గాచూసుకుంటున్నాం

ముఖాలకు మాస్కులు తొడుక్కొని

ప్లాస్టిక్ పలకరింపుల్ని చిలకరిస్తూ గడిపేస్తున్నాం



ప్రాణమిత్రుల మధ్యా ఆప్తబంధువుల మధ్యా

నిప్పులగుండాల్ని పరచి

మనసుల మధ్యా అనుబంధాల మధ్యా

పచ్చగడ్డిని రగిలించి

ఏ మనిషికామనిషిని ఏకాకిని చేస్తూ

సాగుతోన్న రాజకీయక్రీడలో

ముక్కూమొఖం తెలియని ఆటగాళ్ళ మీదా

ప్రజల్ని పట్టించుకోని ప్రజానాయకుల మీదా

బెట్టింగురెక్కల్ని తగిలించి

కష్టార్జితాల్ని ఎగరేస్తున్నాం



అంతే కానీ

అదంతా గారడీయేననీ

గెలుపోటములు ముందుగానే నిర్ణయమైనవేననీ

ఎవరు గెలిచినా ఎవరు ఓడినా

మనకు ఒరిగేది ఏమీ లేదనీ

లాభపడేది మాత్రం వాళ్ళే ననీ ఎరగం

సమయానుకూలంగా కండువాలు మార్చుకొంటూ

కప్పలతక్కిట్లో కూచొని

మన కోసమే బతుకుతున్నట్లు జరిగే

అవకాశవాద రాజనీతి నాటకం లో

మనం కూడా అమాయకపాత్రలమైపోతే

మాచిఫిక్సింగ్ రాజకీయక్రీడలో

వెర్రిబాగుల ప్రేక్షకులమైపోతే

మన మెడలకు కూడా

కండువాలే ఉరితాళ్ళై మెత్తగా బిగుసుకుంటాయ్





--శీలా సుభద్రా దేవి


 

1 కామెంట్‌:

  1. a powerful comparison of cricket game and political game.
    at present applies to different political parties now talking about undivided andhra and telengana.

    రిప్లయితొలగించండి