23, డిసెంబర్ 2012, ఆదివారం

ద్రుశ్యాలు అద్రుశ్యాలు


ఈదార్లో ఎన్నిసార్లు నడిచానో

గతుకులు గతుకులుగా

జీవితసమస్యల్లా మొనతేలినరాళ్ళమీదుగా

ఎన్నెన్నిసార్లు నడుచుకుంటూ వెళ్ళానో

సర్కారువారికి దయకలిగినప్పుడు

మట్టిమలాములు పూయడం

వర్షాకాలం రాగానే రళ్ళు మొలకలెత్తి

నడిచేవారి పాదాల్ని చీరుతూ పలకరించటం

ఏ అయిదేళ్ళకో కాపోతే రెండేళ్ళకో

వాగ్ధానాల తారుపూతలు పూయటం

తీరా అయిదువారాలన్నా ఆగక గుంతలు కళ్ళిప్పటం మామూలే



ఈదారి మీదుగా నడిచినా బస్సులో పోయినా

ఏ గుంత ఎక్కడ వుందో రెప్పలు మూసుకున్నా

కళ్ళు కొలిచి తెలిపేవి

ఇరువైపులా ఎక్కడ ఏ వస్తువు దొరుకుతుందో

బొమ్మగీసినట్లో ఫొటో తీసినట్లో చెప్పేదాన్ని

ఈ దార్ని చదువుతూనే

పేరు వెనక పట్టాలు తగిలించుకున్నాను

ఈ దార్ని మడతబెడ్తూనే

అంచెలంచెల వుద్యోగపు మెట్లు ఎక్కాను

దార్లోని సందు మొదట్లో మిఠాయిదుఖానం కొండగుర్తుతో

స్నేహితురాల్ని కలిసేదాన్ని

మారిపోతోన్న కాలాన్ని పంచుకొనేదాన్ని

చాలా కాలానికి మళ్ళా ఈ రోడ్డెక్కాను

ఇప్పుడు బస్సైనా ఆటో అయినా

వుద్తోగ విరమణాంతరం

భాద్యతలేని సుఖమయ జీవితం లా

ఈదారి మీదుగా సాఫీగానే పోతున్నాను

కనీ ఈ రోడ్డే అప్పటిలా లేదు

దుఖానాలన్నీ అంతస్తులమాల్స్ అయ్యాయి

చిట్టి పొట్టి అరకొర షాపులన్నీ

నోరుతిరగని కొత్తభాషల షాపీలయ్యాయి

సందు మొదట్లోని కొండగుర్తు మిఠాయి దుఖాణం

గుర్తుపట్టగలననుకున్నాను కాని

బాంకెట్ హాలుతో కూడిన బార్ ఎండ్ రెష్టారెంటై

మెరిసే రంగుటద్దాల అల్మారాల్లోంచి

మెరుపు చీరలు చుట్టుకొని విదేశీచాక్లేట్లు కవ్విస్తున్నాయ్



చాలాకాలంగా ఇటొచ్చే అవసరం కలగ లేదు

ఇప్పుడాసందులోని ఇంట్లో స్నేహితురాలు వుందో లేదో

తెల్లారు జాము కలలోకి వచ్చి వుండకపోతే

ఆమెని వెతుక్కుంటూ ఇలా వచ్చి వుండే దాన్ని కాదు



అపరిచితం గా మారిన ఈదారిలో

తెలిసినవేవీ కనిపించటం లేదు

ఇక సేద తీర్చుకోడానికి స్నేహమైనా మిగిలిందో లేదో

నేనిప్పుడు మార్పుకు లోనౌతోన్న కూడలిలో

నాకు గుర్తున్న జాడల్ని వెతుక్కొంటున్న

అపరిచితురాల్ని

2 కామెంట్‌లు: