ఇన్నేళ్ళ
మన జీవనప్రయాణం లో
ఆశ నిరాశలూ
జయాపజయాలూ
సుఖదుఖాలూ ఒకటేమిటి
ఎన్నెన్నో విభిన్న అనుభూతులూ పడుగుపెకలై
మనచుట్టూ జమిలి గా అల్లుకున్నట్ట్లే
వెండి తీగాలతో అల్లిన కలనేతవస్త్రమై
తలవెంట్రుకలు మన తలలపైనుండి మెరుస్తూజాలువారుతున్నాయి
పరుగులు తీసేకోరికలగుర్రాల్ని కళ్ళేలూ వేసి
పొగరుగా ఎగురుతున్న వోణి కొంగులకి ముడేసి
తల దించుకొని ఒద్దికగా నడచిపోయిన రోజుల్ని మరిచావా
కళ్ళనిండా ఎగిరే కళల సీతాకోకచిలుకల్ని
దోసిట్లోకి ఒడిసిపట్టి గోరింటగా పండించి
బళ్ళో ఒకరికొకరం చూపుకొని మురిసిపోవడం గుర్తులేదా
ఎప్పటికప్పుడు నియంత్రించే పులుష్టాపు చుక్కల్ని
చిత్తుపుస్తకాలనిండా నువ్వుతుదిచిపారేసావేమోగాని
నా మనసుముంగిలి నిండా నేటికీ రంగులీనుతూనే వున్నాయి
ఫ్లోపైన సినీమాకి టికట్లు తీసుకొని వెనకసీట్లో కూర్చొని
వలపుతలపులగాధల్ని కలబోసుకొన్న జ్ఞాపకాల్ని
నువ్వు గుండె లోతుల్లో పాతర వేసేసావేమోగాని
నా హృదయం లో మాత్రం అల్లిబిల్లిగా తిరుగుతూనే వున్నై
ఆంక్షల స్తంభాల్ని మన చుట్టూ పాతి
అదుపాజ్ఞాల ముళ్ళ కంచేల్ని అల్లిన వాళ్ళు ఏనాడో గతించిపోయారు కదా
నేటికీ నీకు నువ్వే లక్ష్మనరేకల్ని
నీచుట్టూగీసుకొని యోగనిద్రలో మునిగిన ఊర్మిళవైపోతూ
నిర్దయగా బాల్యస్మృతుల్ని
నీనుండి దూరంగా పావురాల్లా ఎగరేసేసావ్
జ్ఞాపకాలు మనల్ని బాల్యపుతోడుగులోకి పరకాయప్రవేశం
నిత్యనూతన చైతన్యాన్ని గుండెల్లో ఆవిష్కరిస్తాయో తెలియక
నువ్వు నేటికీ నీ తపస్సమాధిని పగలగోట్టుకొని రాలేకపోతున్నావు గానీ
నువ్వు నిర్దయగా ఎగరేసిన బాల్య పావురం
భుజాల మీదే వాలి ఆనాటి చిన్ననాటిముచ్చట్లు
కువకువ లాడుతూ ఇప్పటికీ గుర్తు చేస్తూనే వున్నాయి.
4, ఆగస్టు 2010, బుధవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి