20, మార్చి 2025, గురువారం

కథలు లోగిలి సంకలనం ముందు మాట

~ కథలలోగిలిలోని రంగవల్లులూ,రంగులూ ~ " ఒక కథకుడికి రచనా సామర్థ్యం లేకపోయినా సరిచేయవచ్చును గాని, జీవితం తెలియకపోతే సరిచెయ్యడం ఎవ్వరి వల్లా కాదు. శిల్పం, భాష, రచనకు ముఖ్యం కావని కాదు; అవి చాలా ముఖ్యం. అవి కథారచనకు మూల పరికరాలు; ముడి పదార్థం మాత్రం జీవితం" అంటారు కొడవటిగంటి కుటుంబరావు ఆధునిక తెలుగుసాహిత్య ప్రక్రియలలో కథ క్లిష్టమైనది మాత్రమే కాదు, సంక్లిష్ట సామాజిక జీవన పరిస్థితులను కథ ప్రతిబింబించినంత స్పష్టంగా, సూటిగా మరే ప్రక్రియా ప్రతిబింబించలేదనే చెప్పాలి. అందుకే కథారచన ఉన్నతశిఖరాలందుకుందని చెప్పుకోవచ్చును . సాహిత్యం సమాజహితం కోసం మాత్రమేకాదు. సమాజ మూల మూలాల్ని,లోతుల్నీ,జీవనరీతుల్ని, ప్రతిబింబించేదిగా వుండాలి. సమాజంలోని వ్యక్తుల జీవితాన్ని దృశ్యమానం చేసేదిగా వుండాలి. కథ పుట్టిన దగ్గర నుండి ఇటీవల కాలం వరకూ ఎక్కువశాతం మధ్యతరగతి జీవిత చిత్రణకే కథ పరిమితమై పోయింది. తర్వాత్తర్వాత ప్రపంచీకరణ నేపథ్యంలో మారుతున్న విలువల వలన కొంత వరకు దిగువ మధ్యతరగతి కథలేకాక, ఉన్నత తరగతుల జీవితం కూడా ఎక్కువగానే కథల లోనికి అక్షరబద్ధమౌతోంది. కథకు ప్రధానంగా క్లుప్తత, గాఢత ముఖ్యం, పరిమిత పాత్రలతో ఆత్మ సంయమనస్వభావ లక్షణం, వస్తువునకు తగిన కథనాన్ని, పాత్రల జీవన స్వభావానికి తగిన సంభాషణలు ఉండటం మంచి లక్షణం. ఇక శైలి వ్యక్తిగతమైనది ఎవరి ధోరణి వారిదే. వారివారి అభిరుచులు, నమ్మకాలను అనుసరించి కథారచనలో మొదటినుండి చివరివరకూ అంతర్లీనంగా ప్రవాహంలా కలగలిసి అల్లిన అల్లికే వారి రచనా పద్ధతిగా శైలిగా చెప్తాము సార్వజనీనమైన వస్తువుతో ఐక్యతచెంది కథకులు కథని నడిపించాలి.అప్పుడే ఆ కథ మంచి కథగా గుర్తించబడుతుంది. తెలుగులో కథాసంకలనాలు వందకి పైగానే వెలువడి వుంటాయి. చాలా వరకూ సంపాదకుల అభిరుచికి, కథకులసాహిత్య విలువల కేంద్రకంగా ఏర్చి కూర్చినవి. అయితే ఆ పద్ధతికి భిన్నంగా జాతి,కుల,మత,ప్రాంతీయ, సమస్యాప్రాధాన్యత, పోరాటం నేపథ్యంగా అనేక సంకలనాలు వెలువడ్డాయి.వెలువడుతూనే వున్నాయి. కేవలం మహిళా చైతన్యానికి ప్రాధాన్యతనిస్తూ కేవలం రచయిత్రుల సంకలనాలుగా స్త్రీవాద కథలు సంపుటి కాక సఖ్యసాహితి రచయిత్రుల సంస్థ ప్రచురించిన కదంబం (1996), డా. భార్గవీరావు వందమంది రచయిత్రులతో వెలువరించిన నూరేళ్ళ పంట(2001),లేఖిని రచయిత్రుల సంస్థ ద్వారానే వెలువరించిన దీపతోరణం(2013) ప్రధానంగా చెప్పుకోదగినవి. ఇటీవల రచయిత్రుల సంపాదకత్వంలో కూడా కథాసంకలనాలు విరివిగానే వస్తున్నాయి. ఆ కోవలోనే లేఖిని రచయిత్రుల సంస్థ ద్వారా ఒకేసారి " కథలలోగిలి " పేరిట కథలసంకలనాలను రెండు భాగాలుగా వెలువరించటం హర్షణీయం. అందులో ఇది రెండవ సంకలనం. ఇందులో ముప్పై అయిదుమంది వరకూ రచయిత్రుల కథలు వున్నాయి. సుమారు నలభై ఏభై ఏళ్ళుగా సాహిత్యసృజన చేస్తున్నరచయిత్రుల కథల నుండి ఇటీవల కొత్తగా రాస్తున్న వారి కథలవరకూ ఇందులో వున్నాయి. ఇందులో కథలగురించో,రచయిత్రులగురించో చెప్పదలచుకోలేదు.ఈ పుస్తకం అందరూ చదివి విభిన్న రచయిత్రుల రచనలను ఎవరికి వారే తెలుసుకోవాల్సినవి. చాలాకాలం నుంచీ రాస్తున్న తరం రచయిత్రుల చేయితిరిగిన శైలి, రచనా విధానం ఎప్పటిలా రచనానుభవం వలన అలవోకగా ఒక ప్రవాహంలా సాగిపోయాయి. వారి తర్వాత తరంగా చెప్పదగిన ఎక్కువగా ఉద్యోగినులైన రచయిత్రుల కథాంశాలలో కొత్తదనం వుంది.కుటుంబాలకు పరిమితం కాకుండా విభిన్న నేపధ్యాలలో జరిగినట్లుగా కథల్ని రాయటం బాగుంది. గత పదేళ్ళలోపునే కలం పట్టిన ఔత్సాహికులైన వారు కూడా సమాజహితాన్ని గమనింపులోకి తెచ్చుకునే కథాంశం ఎంచుకోవడంలో,కథనం చేయటంలో నేర్పు చూపటం గమనార్హం. అయితే కథ ఎంత క్లుప్తంగా రాయగలిగితే అంతగాఢత కలిగి వుంటుంది అనేది కథకులు గుర్తించాలి. పాఠకులు కథకుల కంటే తెలివైనవారు. కథని పూర్తిగా విడమరచి చెప్పనవసరం లేదు. ఆలోచింప జేసేదిగా వుండాలి. కొన్ని కథలు నవల రాయగలిగేంత విస్తృతమైన వస్తువును తీసుకునిరాయటం వలన కూడా సుదీర్ఘంగా వున్నాయి. 50-70 ల మధ్యనాటి కథకులు చాలా మంది సుదీర్ఘంగా కథలు రాసేవారు. ఈనాడు క్లుప్తకథలకు ప్రాధాన్యత పెరిగింది. దానిని పరిగణలోనికి రచయిత్రులు తీసుకోవాల్సిన అవసరం వుంది. కథకు ఎత్తుగడ ఎంత ముఖ్యమో కొసమెరుపుతో ముగింపు అంతే ముఖ్యం.కథ చదవటం పూర్తిచేసాక దాని గురించి ఆలోచింపజేయాలి.కథలోని స్టోరీ లైన్ స్పష్టంగా వుండాలి.కొత్తగా రాస్తోన్న కథకులు గ్రహించాల్సిన విషయం ఇది. ఇంచుమించుగా ఇందులోని చాలావరకూ కథలన్నీ సమకాలీన సమాజంలో జీవితం, కుటుంబ సంబంధాలు, కౌటుంబిక విలువలు, మానవ సంబంధాలు, సమాజహితం చిత్రితమయ్యయి. నేటికాలంలో పిల్లల పెంపకం, పెద్దల బాధ్యతల్ని చర్చించారు. సగానికి పైగా కథలు మంచి పఠనీయతతో రాసిన కథలే కావటం సంతోషం కలిగించాయి. కథారచనలో అనుభవం వున్న సీనియర్ రచయిత్రులతో పోటీపడుతూ ఔత్సాహికులు కూడా కథలు రాయటం మంచి పరిణామం. సన్నగా వర్షం పడుతున్నప్పుడు బాల్కనీలో కూర్చొని పక్కన పకోడీలో,బఠాణీలో ప్లేటులో పెట్టుకొని చిరుగాలిలో హాయిగా ఆస్వాదిస్తూ చదువుకునే కథలివి.అందరూ చదవాల్సిన కథలు. ఈ విధంగా కథలసంకలనం తీసుకురావాలని అత్తలూరి విజయలక్ష్మి అధ్యక్షత లోని లేఖిని రచయిత్రుల సంస్థలోని సభ్యులంతా సంకల్పించి, వెలువరించిన కథలలోగిలిని స్వాగతిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.