6, ఫిబ్రవరి 2024, మంగళవారం
నడక దారిలో -37
నడక దారిలో -37
స్కూల్ లో జాయిన్ అయ్యాక ఒకరోజు ఆంధ్రవాణి నాతో "నీకు చీరలు లేవా ఈ నాలుగు చీరలే కట్టుకుంటున్నావు" అన్నప్పుడు చీరలు గురించి ఆలోచించాను.నిజమె స్కూల్ కి కట్టుకోవటానికి పనికొచ్చేవి తక్కువే ఉన్నాయి.
వీర్రాజు గారికి ఖర్చులు పోను మిగతాది ఆదివారం సెకెండ్ హ్యాండ్ పుస్తకాలు షాపుల్లో ఆర్ట్ కి సంభందించిన పుస్తకాలు కొనటానికో, అప్పటి డబ్బు నిబట్టి కళాకృతులు కొనటానికో,మావేకాక ఇతరుల పుస్తకాలు ప్రచురించు కోటానికో వాడేవారు.
అయితే పెళ్ళి అయిన దగ్గర్నుంచి తనకు ఆర్ట్ మీద వచ్చే డబ్బు మీద రెండు శాతం నాకు ఇచ్చేవారు.దానినే నాకోసమో,పల్లవి కోసమో వాడుకునేదాన్ని.
మా ఆడబడుచులు వచ్చినప్పుడు వాళ్ళకీ,వాళ్ళు పిల్లలకీ కొనమని నాకు డబ్బులు ఇచ్చేటప్పుడు మాత్రమె మాకు కొనాలని గుర్తుకువచ్చేది ఏమో మాకు కొనుక్కోమని ఇచ్చేవారు.వాళ్ళెవ్వరూ రాని ఏడాది మాకు కొనాలని గుర్తు రాక పోవటం నాకు కోపం వచ్చేది.దాంతో మాకు అక్కర్లేదని వాళ్ళకి మాత్రమె కొనేదాన్ని.అందుచేత నాకు చీరలు తక్కువే ఉండేవి.
పల్లవికి పుట్టినరోజుకి ఆయనకి బాధ్యత తెలియడానికి డబ్బులు అడిగి కొనేదాన్ని.నా దగ్గర కూడబెట్టుకున్న డబ్బులతో చవకగా వచ్చే బట్టి కొని ఏవో ఇంగ్లీష్ మాగజైన్స్ లో చూసి రకరకాల డిజైన్లలో నేనే గౌన్లు కుట్టేదాన్ని.నాకు ఉద్యోగం చేసే అవకాశం ఉంటుందనే ఆశ లేక ఒక దశలో నేను కుట్టిన డిజైనర్ గౌన్లు తీసుకొని ఒక రెడీ మేడ్ షాపులో చూపించి ఫ్యాషనబుల్ గా కుడతానని వర్క్ ఇవ్వగలరా అని అడిగాను.కాని వాళ్ళషాపుకి బొంబాయి నుండి వస్తాయని వస్తాయని చెప్పారు.నిస్పృహగా వెనుతిరిగాను.
ఇక నేను ఉద్యోగంలో చేరాక ఆంధ్రవాణి మాటలతో చీరలు కొనుక్కోవాల్సిన అవసరం తెల్సింది.అంతకుముందు అప్పట్లో కట్ పీస్ చీరల్ని వచ్చేవి అవే చాలా తక్కువ ధరకు కొనుక్కుని ఇంట్లో వాడే దాన్ని. ఇప్పుడు స్కూలుకు వెళ్ళటానికి అప్పుడప్పుడు ఒకటిరెండు చీరలు కొనుక్కోక తప్పలేదు.అంతే కాకుండా నా సహోద్యోగులతో బాటూ కబళవాయి నగలషాపులో ప్రతినెలా వందరూపాయలు కట్టటం మొదలెట్టాను.
రోజు బస్సులో రానూ పోనూ ఓగంటకఉ పైగా ప్రయాణం చేస్తుండటం వలన దారిలో జనాలను పరిశీలించటం అలవాటు అయ్యింది.తరుచుగా నేను చూస్తున్నదృశ్యాలూ,వింటున్న మాటలు నాకు కవితలు రాయటానికి దోహదం చేసేవి.స్కూల్లో పిల్లల్ని కదిపితే వారి నేపథ్యాలు,జీవితాలను ఉండీ ఎన్నోకథలు రాలేవి.ఉద్యోగంలో చేరాక నాకు ఒక కొత్తచూపు వచ్చినట్లయింది.ఒక్కోసారి ఆ పిల్లలో నా బాల్యం దోబూచులాడేది.అందువల్ల తరుచూ రాత్రి పడుకున్నప్పుడో,లేకపోతే మధ్యరాత్రి మెలకువ వచ్చినప్పుడో కాగితం నిండా అక్షరాలు కవితలను తీర్చేవి.
అందుచేత తరుచూ కవితలు రాస్తుండేదాన్ని.
తొందరలోనే నారెండు కవితాసంపుటి మోళీ పేరుతో ప్రచురితమైంది.నేను దీనికి కూడా ఆవిష్కరణసభ పెట్టలేదు . ఈ సంపుటికి కూడా పత్రికల్లో సమీక్షలు బాగా వచ్చాయి. కడియాల రామ్మోహనరాయ్ గారు ప్రత్యేకంగా అభినందించారు.అంతేకాక ఇంతవరకూ దొమ్మరిఆట చేసేవాళ్ళ గురించి ,సర్కస్ వాళ్ళు గురించి కవితలు రాలేదు అని మోళీ కవిత గురించి తాను చాలా చోట్ల ప్రస్తావించానని తెలియజేసారు.
నేను ఎంతగానో సంబరపడ్డాను.
ముఖ్యంగా ప్రభలో టి.ఎల్.కాంతారావుగారు కొత్తకలాలు శీర్షికన శీలావీర్రాజు ,కె.శివారెడ్డి,ఎన్.గోపీ,దేవీప్రియల సరసన నన్నూ పరిచయం చేయటం మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది.
ఆ ఏడాది చివర్లో మా మేడంతో " ప్రతీ సంవత్సరం ఆరో తరగతి నుండి పదో తరగతి వరకూ ఫైనల్ పరీక్షలలో మొదటి స్థానంలో వచ్చిన పిల్లలకు బహుమతులు ఇస్తాన"ని చెప్పాను.మా మేడం ఆశ్చర్యంగా చూసారు.నాకు డబ్బు బాగా ఉందేమో అనే అనుమానం మా స్కూల్ లో వాళ్ళందరికీకలిగింది.కానీ నేను చిన్నప్పటినుండి చదువుకోడానికి ఎదుర్కొన్న అవాంతరాలు,తరగతి పుస్తకం లేకుండా స్నేహితులపుస్తకాలు చూసి నోట్సులు తయారుచేసుకొని చదివిన పరిస్థితులు నన్ను వెంటాడుతూ ఉండటం వలనా,వాళ్ళముఖాలలో నా బాల్యం కనబడుతుండటం వలనా ఆ నిర్ణయం తీసుకున్నాననేది తర్వాత్తర్వాత నా స్నేహితులకు మాత్రమే తెలుసు.నేను ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకూ ఫస్ట్ వచ్చినవారికి వాళ్ళ తరగతి పుస్తకాలు ఇచ్చేదాన్ని.తొమ్మిది,పది తరగతుల వారికి నగదు రూపంలో ఇచ్చేదాన్ని.అయితే ఆ తరువాత ప్రభుత్వం పాఠ్యపుస్తకాల పంపిణీ చేస్తుండటంతో అవి కాకుండా తెలుగు, ఇంగ్లీష్, గ్రామర్ పుస్తకాలు, అట్లాస్,పరీక్షలకు అవసరమయ్యే తెలుగు వ్యాసాల పుస్తకాలు ఇవ్వటమే కాకుండా ఆయా క్లాసులకు తగినట్లుగా కథలపుస్తకాలూ బహుమతి గా ఇచ్చేదాన్ని.ఈ కార్యక్రమం ఆగష్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం రోజున జరిపేదాన్ని.దాంతో ఫస్ట్ రావటానికి పోటిపడి చదివేవారు.స్కూలు పిల్లలకే కాక టీచర్ల పిల్లలకు కూడా పిల్లల కథలపుస్తకాలు బహుమతిగా ఇస్తుండటం అలవాటు అయ్యింది .ఈ బహుమతి ప్రధానాలు నేను రిటైర్ అయ్యాక కూడా రెండుమూడు ఏళ్ళకు పైగానే కొనసాగించాను.కానీ తర్వాత అవి సక్రమంగా పిల్లలకు అందటం లేదని తెలిసి మానేసాను.
స్కూల్ లో నేను చెప్పాల్సినవి హైస్కూల్ తరగతులే కావటం,పదేళ్ళ తర్వాత పాఠాలు చెప్పటం వీటివలన పని వత్తిడి ఎక్కువ గానే ఉండేది.అంతేగాక ఆ ఏడాదే పదోతరగతి సిలబస్ మారి కొత్తపుస్తకాలు వచ్చాయి.స్టాండర్డు ఎక్కువ కావటం వలన అన్ని స్కూళ్ళకీ సబ్జెక్టు వారీ టీచర్లకు కూడా ట్రైనింగ్ లు ఉండేవి.నాపోష్ట సెకండరీ గ్రేడ్ పోష్టు.నేను పాఠాలు చెప్పేది హైస్కూల్ కు.అందువలన విద్యాశాఖ ఎవరికి ఏ కార్యక్రమాలు ఏర్పాటు చేసినా నేను వెళ్ళాక తప్పని పరిస్థితి.
ఒకరోజు మేడం నన్ను పిలిచి వాళ్ళ అమ్మాయి పదోతరగతి చదువుతుందనీ,తెలుగులో ఛందస్సూ,లెక్కల్లో ట్రిగొనోమెట్రి చెప్పటానికి వాళ్ళింటికి రమ్మని కోరారు.స్కూల్లో తెలుగు,లెక్కలకి సీనియర్ టీచర్లు ఉండగా నన్ను రమ్మనడం ఆశ్చర్యం కలిగినా నేనేమీ మాట్లాడలేదు.ఆ అమ్మాయి ఇంగ్లీష్ మీడియం కదా నేను తెలుగు లో చెప్తే అర్థం చేసుకోగలదో లేదో అని సందేహం వెలిబుచ్చినా కూడా మళ్ళీ ఆమే 'స్కూల్ అయ్యాక ఇంటికి వెళ్ళి మీ పాపని కూడా తీసుకొని రమ్మ'నన్నారు. సరే అని ఆ సాయంత్రం పల్లవిని తీసుకుని మేడం ఇంటికి వెళ్ళాను.మాకు టిఫిన్ ,టీ ఇచ్చి పల్లవితో మేడం కబుర్లు చెప్తుంటే నేను వాళ్ళమ్మాయి ప్రేమకు పాఠాలు చెప్పాను.
వీర్రాజు గారు ఎప్పట్లా ఉద్యోగం లో బిజీగానే ఉన్నారు.1985లో తిరిగి ముఖ్య మంత్రి అయ్యాక రామారావు కొన్ని వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నాడు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుండి, 55 సంవత్సరాలకు తగ్గించడం, గ్రామసేవకుల వ్యవస్థ రద్దు, పూజారి వ్యవస్థ రద్దు, శాసనమండలి రద్దు మొదలైనవి.
ఇంకొక ముఖ్యమైనది సంగీతం అకాడమీ, సాహిత్యం అకాడమీ,నాటక అకాడమీ రద్దుచేయటం. పొట్టిి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నాంపల్లి లో 1985 డిసెంబరు రెండోతేదీని స్థాపించి అకాడమీలన్నింటినీ అందులో కలిపేయటం సంచలనాత్మక నిర్ణయం.
అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం లో ఆస్థానకవిగా దాశరథి, ఆస్థాన గాయకుడిగా మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఉండేవారు.వాటిని కూడా రద్దు చేయటంతో కోపించి బాలమురళీకృష్ణ ఆంధ్రాలో కచ్చేరీలు చేయనని మద్రాసు వెళ్ళిపోయాడు.
ఉద్యోగుల పదవీవిరమణ వయస్సు తగ్గించడంతో అక్కయ్యవాళ్ళు విజయనగరం వెళ్ళిపోయారు.అయితే సుప్రీం కోర్టు అది చెల్లదని తీర్పు ఇవ్వటంతో ప్రభుత్వం వాళ్ళందరికీ కూర్చోబెట్టి మొత్తం డబ్బు ఇవ్వాల్సి వచ్చింది.
ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారాల ఎంపిక ,పుస్తక ప్రచురణ మొదలైన చర్చల గురించి ఆదివారం రోజుల్లో ఇంటికి వచ్చేవారు కుందుర్తి సత్యమూర్తి.
వీర్రాజు గారు వారం అంతా ప్రభుత్వ సేవలో ఉండటం చేత సెలవురోజుల్లో ఇంటికి వచ్చే కవులు రచయితల తాకిడి ఎక్కువగా ఉండేది.ఉదయం తొందరగా తయారై కూర్చుంటే రాత్రి పదివేలకు ఎవరో ఒకరు రావటం సాహిత్య చర్చలు జరుగుతూనే ఉండేవి.మాయింటికి తరుచుగా ఇంట్లో మనిషిలా అయిన వ్యక్తి నాళేశ్వరం శంకరం.ఆయన ఒక్క వారం కలవకపఓతఏ వీర్రాజు గారే ఉదయమే వాకింగ్ లా ముసారాం బ్లాగ్ లోని ఆయన ఇంటికి వెళ్ళేవారు.వాళ్ళిద్దరూ కలిసి తిరిగి గోపీగారి ఇంటికో శివారెడ్డి గారింటికో వెళ్ళేవారు.ఆ విధంగా ఇంట్లో వారికి మాత్రం వీర్రాజు గారితో మాట్లాడే అవకాశమే ఒక్కొక్కప్పుడు దొరికేది కాదు.అందుచేత పల్లవి బాధ్యత నాదే కావటంతో మేమిద్దరం స్నేహితుల్లా పాటలు పాడుకోవటం కబుర్లు చెప్పుకోవటమైనా మేమిద్దరమే.
ఫ్రీవర్స్ ఫ్రంట్ తరుపున అవార్డు వచ్చిన వారితో బాటు అభ్యుదయ దృక్పథంతో రాస్తున్న కవులతో ఒకసారి కవిసమ్మేళనం నిర్వహించారు.అందులో నేనూ పాల్గొన్నాను.ఆ తర్వాత ఆ కవితలన్నింటినీ "పెన్గన్" పేరుతో ఫ్రీవర్స్ ఫ్రంట్ ప్రచురణ లో పుస్తకం గా ప్రచురించింది.
నడక దారిలో -36
నడక దారిలో - 36
రాజమండ్రిలో పిత్రార్జితమైన ఇల్లు ఉంది.అది అమ్మేస్తే ఇక్కడ ఇల్లు సమకూర్చు కోవచ్చు అనే ఆలోచన అన్నదమ్ములకు ఉంది.ఆఖరుకు ఆ సమయం రానే వచ్చింది.
ఇల్లు అమ్మకంలో రాతకోతలకోసం ముగ్గురు అన్నదమ్ములు రాజమండ్రి బయలుదేరి ఆ పని పూర్తి చేసుకుని వచ్చారు.
వీర్రాజు గారు ఆడపిల్లలకు కూడా పంచాలని అనుకుంటే మా మరుదులు పడనీయలేదు.సరికదా 'వదినకు వాళ్ళన్నయ్యలు పొలం అమ్మినప్పుడు ఇవ్వలేదు కదా' అంటూ లాపాయంట్లు లాగారు.పోనీ అందరం అయిదు వేల చొప్పున వేసుకుని ఇద్దరికీ ఏడున్నర చొప్పున ఆ ఇద్దామన్నారు.దానికి కూడా గొణుక్కుంటూ,సణుక్కుంటూ ఇద్దరూ కలిసి అయిదు వేలిచ్చారు వీర్రాజు గారు పది కలిపి ఇద్దరు ఆడబడుచులకూ ఏడున్నర వేల చొప్పున ఇచ్చారు.
పెద్దమరిది కృష్ణతో "నీ వాటా సొమ్ము ఫిక్సిడ్ డిపాజిట్ చేస్తాను.ఇల్లుఏదైనా కొనుక్కుందూ గానీ,లేకపోతే విలాసాలకు ఖర్చుపెట్టేస్తావని "అన్నారు.దాంతో అతనికి కోపం వచ్చి అన్నగారి మీద "నన్ను చాతకాని వెధవలా మీరంతా చూస్తున్నారు"అంటూ మీద మీదకి వచ్చి ఫైర్ అయ్యాడు.దాంతో కోపం వచ్చి అతని వాటా డబ్బు అతనికి ఇచ్చేసారు.
చిన్నమరిది అంతకు ముందు ఎప్పుడో కొన్న స్థలంలో ఇల్లు కట్టుకోవటం మొదలు పెట్టాడు.పెద్దమరిది ఇంట్లోకి కావలసిన ఫర్నీచర్ కొనేసి మిగిలినదంతా ఖర్చు పెట్టేసాడు.
అక్కయ్య వాళ్ళ పక్కనే ఉన్న అపార్ట్మెంట్ అంతకు ముందు ఎప్పుడో అమ్మకానికి ఉందంటే డబ్బు లేక వదిలేసాము.అది ఇంకా ఉందా అమ్మకం అయిపోయిందా అని కనుక్కోమని అక్కయ్యతో చెప్పాము. వాళ్ళు మంచి బేరం కోసం చూస్తూ ఇంకా అమ్మలేదని తెలిసింది.వెంటనే ఇవ్వవలసినది
యాభైఅయిదువేలనీ మిగతాది కోపరేటివ్ సొసైటీకి ప్రతీ ఏడాదీ కట్టాలని తెలిసింది.ఇల్లమ్మగా వచ్చిన దాంట్లో ఆడబడుచులకూ పదివేలు తీయగా మిగిలిన దానికి ఇంకా మరో ఇరవైవేలకు పైనే కావాలి,మా పేరుకి సేల్ డీడ్ డాక్యుమెంట్ లకు మరికొంతకావాలి.మిగతా డబ్బుకి ఏంచెయ్యాలని తర్జనభర్జన లో పడ్డాము.
అనుకోకుండా అప్పుడే నా ఉద్యోగం అప్రూవల్ అయ్యి పదినెలల జీతం ఒకేసారి వచ్చింది.నా బంగారం ఎక్కడో పెట్టి కొంత తెచ్చారు.మా మామయ్య కొంత ఇస్తానన్నాడు.స్వాతి బలరాంకి ఈ విషయం తెలిసి అతనూ ఇస్తానని చెప్పాడు.కానీ వీర్రాజు గారు బలరాంతో "మీరు అప్పుగా ఇస్తేనే తీసుకుంటాన"ని తన షరతుని ఖచ్చితంగా చెప్పారు.
అన్నీ కలిసి వచ్చి ఎలా అయితేనేం మలక్ పేట బ్రహ్మానందం నగర్ కాలనీలో మా కొరకు గూడు ఏర్పాటు చేసుకోగలిగాము.అదే 2/C అపార్ట్మెంట్.
వేసవి సెలవులు రావటంతో పక్కనే అక్కయ్య వాళ్ళు ఉండటం,వాళ్ళ పనిఅమ్మాయి సాయంతో ఇల్లు శుభ్రం చేయించి,కడిగించాము.
మామరుదుల కుటుంబాలు ,అక్కయ్య కుటుంబం మాత్రమే పిలిచాము.
అంతకు ముందు ఎప్పుడూ మా ఇంట్లో పూజలు చేసేవాళ్ళం కాదు కనుక పూజాసామగ్రీ,దేవుడి బొమ్మలు లేవు. వీర్రాజు గారికి గల కళాకృతుల సేకరణ అభిలాష వల్ల ఏవో చిన్న చిన్న విగ్రహాలు ఉండేవి.కానీ మేమున్న ఇంట్లోనుంచి సామాను మార్చినట్లుగా ఏదయినా బొమ్మని తీసుకొని వెళ్ళి పాలు పొంగించుదాం అనుకున్నాం.ఏది తీసుకు వెళ్దామా అని ఆలోచించి బుద్దుడు విగ్రహం తీసుకు వెళ్ళి అక్కయ్య ఇంట్లోంచి కిరోసిన్ స్టౌ తీసుకొచ్చి పాలు పొంగించి కాఫీ చేసి ,బిస్కెట్లుతో పాటు ఇచ్చాము.ఆరోజు మేము నిలిచినది మా పెద్దక్క కుటుంబాన్ని,మా మరుదులు కుటుంబాల్ని మాత్రమే.
వాళ్ళంతా వెళ్ళాక ఆ రాత్రి అక్కడే పడుకున్నాము.
రెండు రోజుల తర్వాత బయలుదేరి విజయనగరం వెళ్ళాము,అక్కడ ఓ వారం ఉండి భువనేశ్వర్ పెద్దాడబడుచు ఇంటికి వెళ్ళాము.భువనేశ్వర్ లో ఒకవారం పాటు పర్యాటక ప్రాంతాలన్నీ తిరిగి చూసాము. మా ఇద్దరు ఆడబడుచులకు మేము ఇల్లు కొనుక్కున్న సందర్భంగా బట్టలు పెట్టాము.
హైదరాబాద్ తిరిగి వచ్చాక కొత్త ఇంటికి సామాను షిఫ్ట్ చేసి వచ్చేసాము.సామాన్ల షిఫ్ట్ చేయటంలో పెద్దమరిది కృష్ణ,మల్లేష్,బాలాజీ ప్రెస్ బాలప్రసాద్,శంకరం మొదలైనవారు సహకారం అందించారు.
అనుకోనివిధంగా వీర్రాజు గారికి ఒక ప్రభుత్వ సంస్థకు వేసిన చిత్రాలు తాలూకు సొమ్ము అందటంతో చాలా తొందరగానే మా మామయ్యకు, బలరాంకూ అప్పులు తీర్చేయగలిగాము.అప్పుడు మాకు ప్రశాంతత లభించింది.
అక్కయ్య చిన్నమ్మాయి శర్వాణి డిగ్రీ చదువుతుంది, పెద్దమ్మాయి శ్రీదేవి డిగ్రీ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటుంది.పక్కనే అక్కయ్య వాళ్ళు ఉన్నారని ఎంత సంతోషించింది ,అంతా బాధా కలిగింది.ఎందుకంటే అక్కయ్యకు గత రెండు మూడేళ్ళుగా కొంత న్యూరో సమస్యతో బాధపడుతుంది.సరియైన సమయంలో చికిత్స మొదలుపెట్టటం వలన తొందరగానే కోలుకుంది. మా ఇంటికి ఎదురు లైను నుండి బీబ్లాక్స్ అంతా గవర్నమెంట్ క్వార్టర్లు.1956 లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగుల కోసం కట్టిన ఇళ్ళు.కాలనీ లోని ఆఫీసు సమయంలో ఉద్యోగులకోసం రెండు మూడు బస్సులు వస్తాయి.వీర్రాజుగారు ఆఫీసు బస్సులో వెళ్ళేవారు.
బీబ్లాక్స్ లోకి రావటానికి ముందు మెయిన్ రోడ్డుకు దగ్గరలోనే కుందుర్తి గారి క్వార్టర్ ఉంది.కుందుర్తి గారి అబ్బాయి సత్యమూర్తి అదే ఇంట్లో ఉండేవాడు.అందువలన ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారాల ఎంపిక ,పుస్తక ప్రచురణ మొదలైన చర్చల గురించి సెలవు రోజుల్లో ఇంటికి వచ్చేవారు ఆయనతో బాటు అతని పిల్లలు సమతా,కవితా , ఒక్కొక్కసారి సత్యమూర్తి మేనకోడళ్ళు వచ్చేవారు.ఆవిధంగా సమతా,కవితా మా ఇంట్లో పిల్లల్లాగే అయిపోయారు.
పల్లవికి స్కూలుమార్చలేదు.తిలక్ నగర్ లోని శ్రీవిద్యా సెకెండరీ స్కూల్ కే ముసారాం బాగ్ వరకూ వెళ్ళి అక్కడనుంచి బస్సులో వెళ్తుంది.మా పైకి బిల్డింగ్ లో సంగీతం టీచర్ ఉందని తెలిసి పల్లవిని సంగీతం క్లాసులకు పంపేదాన్ని.మరో రెండేళ్లకే వాళ్ళు మా కింద అపార్ట్మెంట్ కొనుక్కుని వచ్చేసారు.ఆమెపేరు యజ్ణప్రభ.యజ్ణప్రభగారి అన్నయ్య శ్రీపాద పట్టాభి రాజమండ్రిలో బాగానే పేరున్న నాటకనటుడు.ఆమెతమ్ముడు జిత్ మోహన్ మిత్ర విశ్వనాథ,బాపూ మొదలగువారి చిత్రాల్లో తరుచుగా నటిస్తాడు.యజ్ణప్రభగారికి ఇద్దరూ మగపిల్లలు కావటం వలన కావచ్చు పల్లవిని స్వంతకూతురులాగే ప్రేమించేవారు.పల్లవి చేత ఢిల్లీ గంధర్వ విద్యాలయం సంగీతకాలేజీ సర్టిఫికేషన్ చేయించారు.పాటలపోటీలకు కూడా తీసుకువెళ్తాడు ఉండేవారు. ఆ తర్వాత ఆకాశవాణి లో బిగ్రేడ్ లో కూడా ఎంపిక అయ్యి పల్లవి రేడియో లో లలితసంగీతం కార్యక్రమాల్లో పాల్గొనేది.
మళ్ళీ నాకబుర్లకు వస్తే నేను పనిచేస్తున్న స్కూల్ ఆర్టీసి హైస్కూల్ కనుక నాకు స్టాఫ్ బస్ పాసు ఇచ్చారు.వేసవి సెలవులు అనంతరం స్కూలు మొదలైంది.స్కూల్లో మరో ముగ్గురు కొత్త టీచర్లు వచ్చారు.అందులో ఉమారాణి నాకన్నా ఏడేళ్ళు చిన్నది.తర్వాత్తర్వాత నాకు మంచి స్నేహితురాలు అయ్యింది.మరొకరు గంటి వెంకటరమణ అప్పటికే పేరున్న రచయిత్రి.వాళ్ళిద్దరూ సంతోష్ నగర్ లో నివాసం కనుక ముగ్గురం కలిసే స్కూల్ కి వెళ్ళి వస్తూ ఉండటం తో మాకు స్నేహం పెరిగింది.
మా స్కూలు ఆర్టీసీ మేనేజ్మెంట్ లో నడుస్తున్నది కావటాన గతంలో ప్రతీ ఏడాదీ ఎక్సకర్షన్ కోసం బస్సులు, డ్రైవర్లు ఎరేంజ్ చేసేవారట.అది కొంతకాలంగా ఆగిపోయింది.మళ్ళా ఆ ఏడాది పునరుద్ధరించారు.దాంతో ఆ ఏడాది అజంతా, ఎల్లోరా, ఔరంగాబాద్ మొదలగు ప్రాంతాలకు విజ్ణానయాత్ర దసరా సెలవులకు నిర్ణయించారు.
హైస్కూల్ టీచర్లు అందరూ వారివారి కుటుంబసమస్యలతో ప్రయాణానికి ఇష్టపడలేదు.మా మేడం నన్ను వెళ్ళమన్నారు.పల్లవి ఇంకా తొమ్మిదో తరగతి పిల్ల వదిలి వెళ్ళటానికి నేను ఇష్టపడలేదు.కానీ మేడం "మీ అమ్మాయికి కూడా పెర్మిషన్ ఇస్తాను.తీసుకొని వెళ్ళు . హైస్కూల్ టీచర్లు ఒకరైనా ఉండక పోతే వాళ్ళని కంట్రోల్ చేయటం కష్టం"అన్నారు.కానీ మిగతా టీచర్లు ఏమనుకుంటారో అనీ,బాగుండదని పల్లవిని తీసుకు వెళ్ళలేదు.
నాకు చిన్నప్పటి నుంచి ఊళ్ళు తిరిగి అన్నీ చూడటం ఇష్టం.కానీ విజయనగరం చుట్టు పట్లవఏ చూడలేదు.కృష్ణశాస్త్రి పాట ' పుడమినల్లా లవలేశము విడువక తిరగాలి ' అని ఎన్ని సార్లు పాడుకునే దాన్నో.
సరే ఎలా అయితేనేం అయిదు రోజులు ఇల్లువదిలి ,పల్లవిని వదిలి బయలు దేరాను.
వీర్రాజు గారికి ఫోటోగ్రఫీ అంటే గల ఇష్టంతో కెమేరా కొంటూ ఉండేవారు.అటువంటి ఒక చిన్న కెమేరాలో అజంతా శిల్పాలను, ఎల్లోరా చిత్రాలన్నీ బంధించాను.నన్ను మగపిల్లల బస్సుకు ఇంఛార్జిగా డ్యూటీ వేయటం వలన నావెనుక తొమ్మిది,పది తరగతుల పిల్లలు తిరిగేవారు.వాళ్ళు కూడా ఫొటోలకు ఫోజులు పెట్టేవారు.ఆ విధంగా కుటుంబాన్ని మర్చిపోయి పిల్లలతో ఆరురోజులూ గడిచిపోయాయి.ఆరోజులలో ఫోన్లు లేనందున కాంటాక్ట్స్ కూడా ఉండదు.ఏమైతేనేం అందరం క్షేమంగా వచ్చేసాము.
ఇన్నాళ్ళూ అద్దెయిల్లు ఉండటం వలననే ఇంటిని మా అభిరుచి మేరకు అలంకరించుకుని అవకాశం లేదు.ఇప్పుడు మాకంటూ ఇల్లు ఉండటం ఎంతో ఆనందం కలిగింది.ఇంటికి అవసరమైన ఫర్నీచర్ ఒకటొకటిగా అమర్చుకున్నాము.వీర్రాజుగారు అవార్డులు వచ్చినా,ముఖచిత్రాలకు ఏవైనా ఎక్కువ సొమ్ము వచ్చినా కళాకృతులు కొనటం మొదలుపెట్టారు.
ఎన్టీఆర్ పాలనలో వారసత్వం మీద ఆధారపడిన పటేల్-పట్వారీ వ్యవస్థను రామారావు రద్దు చేయటం, హైదరాబాద్‌లో ఆసియాలోనే అతిపెద్ద బస్ స్టేషన్‌గా మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నిర్మించటం, బౌద్ధ వారసత్వాన్ని, చరిత్రను హైలైట్ చేయడానికి హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద బుద్ధ విగ్రహాన్ని హుస్సేన్ సాగర్ లో ఏర్పాటు చేయటం,
హైదరాబాదులోని ట్యాంక్ బండ్ పై తెలుగువారిలో మహనీయుల విగ్రహాలతో అలంకరించటం, విద్యావ్యవస్థలో మేలైన మార్పులు చేయటం జరిగింది.
కానీ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుండి 55కి తగ్గించారు. దాంతో ఇంకా బాధ్యతలు తీరని ఉద్యోగులకు మనస్థాపంతో గుండెలు పగిలాయి.
దీని ప్రభావం మామయ్య (పెద్దక్కయ్య భర్త)పై కూడా పడింది.యాభైఅయిదు నిండి పదవీవిరమణ చేయకతప్పలేదు.రెండోఅమ్మాయి శర్వాణి హెచ్.సి.యు లో తెలుగు ఎమ్మే లో చేరింది.పెద్దమ్మాయి శ్రీదేవికి సంబంధాలు చూస్తున్నారు.విజయనగరంలో వాళ్ళ ఇల్లు పూర్తిచేసుకొని వెళ్ళిపోవాలని నిర్ణయించుకుని సామాను పంపించేసారు.తీరా అప్పుడే పెళ్ళివారు శ్రీదేవిని చూడటానికి వస్తానంటే మా ఇంట్లోనే ఎరేంజ్ చేసాము.పెళ్ళి హైదరాబాద్ లోనే చేయాలని కోరటంతో అక్కయ్యవాళ్ళున్నఇల్లు ఓనర్స్ కి ఇవ్వకుండా అట్టే పెట్టుకోవాలను కుంటే ఇంటివాళ్ళు ఒప్పుకోక తాళాలు తీసుకోవటం కొంతబాధ,కోపం కలిగించింది.ఎందుకంటే ఏడేళ్ళుగా అద్దెకి ఉన్నవాళ్ళు అవసరం కోసం అడుగుతే మొండిగా అర్జంటుగా తాళాలు తీసుకు వెళ్ళిపోవటం ఒకటైతే,ఆ ఇంటివాళ్ళు అక్కయ్యకు స్నేహితులమని చెప్పుకునే సాహితీ దంపతులుకావటం మరోకారణం.
పక్కనే అక్కయ్య వాళ్ళు ఉంటారన్న సంబరం తీరకుండానే ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.మళ్ళా పెళ్ళికి ముందు వస్తాం అని వెళ్ళిపోయారు.మొత్తం మీద అక్కయ్యకూతురు శ్రీదేవి పెళ్ళికి అన్నదమ్ములు,అక్కచెల్లెళ్ళం అందరం మా ఇంట్లోనే కలవటం చాలా ఆనందంగా ఉంది
అక్కయ్య వాళ్ళు ఉన్న ఆ ఇంట్లోకి పల్లవి క్లాస్మేట్ సుధ వాళ్ళు రావటం కొంత మేలైంది.వాళ్ళతో మాకు మంచి స్నేహసంబంధాలు ఏర్పడ్డాయి.
నడక దారిలో -35
నడక దారిలో -- 35
ఒకరోజు అక్కయ్య దగ్గరనుండి ఉత్తరం వచ్చింది.అందులో విశేషాలు -- అన్నయ్య వాళ్ళు ధర్మవరం లోని పొలం అమ్ముతున్నారని తెలిసిందనీ, అన్నయ్యకు తాను రాసిన ఉత్తరంలో అది పిత్రార్జితం కనుక అందులో ఆడపిల్లలకు వాటా వుందనీ అమ్మకి కూడా కలిపి ఆరు వాటాలు వేయమన్నందుకు అన్నయ్య తనమీద నిప్పులు కురిపిస్తూ సమాధానం రాసాడనీ, తనకు నాన్నగారు ఉన్నప్పుడే పెళ్ళి అయింది కనుక తన వాటా మిగతా వారికి పంచమనీ అందట.చిన్నక్కకి పెళ్ళికి గానీ,చదువుకి గానీ ఏమి ఖర్చు పెట్టలేదు కనుక వాటా ఇవ్వవలసిందిగా చెప్పిందట.నీకు అన్నయ్య చదివించి పెళ్ళిచేసాడు కనుక నీయిష్టం తెలియజేయు-- అంటూ అక్కయ్య రాసినది
అయితే నేను ఈ విషయం లో ఏమీ కలుగ చేసుకోదలచుకోలేదు.మౌనంగా ఊరుకున్నాను.ఈ సంఘటన అన్నయ్యని మాకు మరింత దూరం చేసిందనేది మాత్రం నిజం.
నాకు ఎలాగూ ఓ చిన్న ఉద్యోగం దొరికింది. పుట్టింటి ఆస్తి మీద ఆశ పెంచుకోటం నాకు నచ్చలేదు.కలిసినపుడు ఆప్యాయంగా పలకరిస్తే అదే పదివేలు అనుకున్నాను.
చిన్నన్నయ్య, అన్నయ్యా పొలం అమ్మిన డబ్బు రావటంతో, హౌస్ లోను కూడా తీసుకోవటంతో ఇద్దరికీ స్వంత ఇళ్ళు ఏర్పడ్డాయి.ఇన్నాళ్ళకి కొడుకులకు ఒక స్వంత ఇల్లు ఏర్పడటం అమ్మకి చాలా సంతోషం కలిగించింది.
పల్లవికి జ్వరం తగ్గింది.కానీ నీరసంగా ఉందని ఆ రోజు కూడా బడి మాన్పించాను. వీర్రాజు గారు ఏవో ముఖచిత్రాలు వేయాల్సినవి ఉన్నాయి.ఆఫీసుకి వెళ్ళనన్నారు.
ఉదయమే లేచి టిఫిన్ ,వంటా చేసి నాకు బాక్స్ కట్టుకొని మొదటిరోజు స్కూలుకు వెళ్ళాను.
అప్పటికి హెచ్చెమ్ వచ్చారు.నేను నమస్కారం చేసాను .ప్రార్థన అనంతరం మేడం తన రూంలోకి నన్ను పిలిచి అక్కడే ఉన్న సీనియర్ లెక్కలటీచర్ ఇందిరకుమారిగారిని,సోషల్ టీచర్ కమలగారినీ పరిచయం చేసి వాళ్ళతోనే ఉండు అన్నారు.దాంతో మరి స్టాఫ్ రూంకి వెళ్ళకుండా ఆఫీసు రూం పక్కనే ఉన్న చిన్న పార్టిషన్ రూంలో వాళ్ళతో పాటు కూర్చున్నాను.
అంతలో అటెండర్ నాకు నా టైం టేబుల్ ఇచ్చాడు.మొదటి పీరియడ్ క్లాస్ టీచర్లు ఉంటారు.అందుచేత నాకు మొదటి పీరియడ్ ఖాళీ.నాకు ఎనిమిది,తొమ్మిది,పది క్లాసులకు ఫిజికల్ సైన్స్ ఆరు,ఏడు తరగతులు లెక్కలు ఇచ్చారు.
పదో తరగతిలో మగపిల్లలంతా ఎత్తుగా పెద్దగా అనిపించారు.వాళ్ళని నేను కంట్రోల్ చేయగలనా అని భయపడ్డాను.కానీ చక్కగా విన్నారు.ఆరూ ఏడు తరగతుల్లో పిల్లలను అంతకు ముందు లెక్కలటీచర్ బాగా కొట్టేవారుట.అందుకని నేను దగ్గరకు వస్తుంటే భయపడి వెనక్కి వెనక్కి పోయేవారు.కానీ వాళ్ళకి అర్థమయ్యేందుకు పదేపదే వివరిస్తుంటే నాకు బాగా మాలిమి అయిపోయారు.
ఆంధ్రవాణిని కూడా టీచర్ గా తీసుకున్నారు.ఆమెకి ప్రాధమిక క్లాసులు ఇచ్చారు.తర్వాత్తర్వాత ఆమెని డెప్యూటీ డీఈవో రికమండేషన్ మీద తాత్కాలికంగా తీసుకున్నారనే విషయం తెలిసింది.వచ్చిన దగ్గరనుండి టీచర్లందరితోనూ గలగలా మాట్లాడి వాళ్ళకి దగ్గర అయిపోయింది.
నేను స్వతహాగానే చొచ్చుకుపోయి స్నేహం చేయలేను.అందులో సుమారు పదేళ్ళుగా ఇంట్లోనే ఉండటం మరింత బెరుకుతనం వచ్చేసింది.
అయితే తరగతిలో అడుగు పెట్టగానే నేను పిల్లలతో కలిసిపోయి వాళ్ళకి అర్థమయ్యే వరకూ మరోసారి వివరించి చెప్పటంతో పిల్లలు నాకు బాగా దగ్గరయ్యారు.పదవ తరగతి మగపిల్లలు కూడా నన్ను అభిమానించటంతో నాకూ భయం తగ్గింది.
నేను ఆగష్టు మొదటివారంలో ఉద్యోగం లో చేరాను.వారం తిరిగే సరికి రాష్ట్రంలో సంక్షోభం.15 ఆగష్టు 1984న, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి NT రామారావు యునైటెడ్ స్టేట్స్లో గుండె శస్త్రచికిత్స చేయించుకోటానికి వెళ్ళినప్పుడు రాజ్యాంగ విరుద్ధంగా అధికారం నుండి తొలగించారు. తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో ఎన్టీఆర్ స్థాపించిన ప్రాంతీయ పార్టీ అధికారంలోకి వచ్చినందుకు మొదట్లో ముప్పుతిప్పలు పెట్టిన ఒకప్పటి కాంగ్రెస్ పార్టీ ఆర్థిక మంత్రి నాదెండ్ల భాస్కరరావును కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించి తిరుగుబాటుకు కాంగ్రెస్ పార్టీ తెర వెనుక నుండి పనిచేసింది.
ప్రతిపక్ష పార్టీలన్నిటినీ కలుపుకుని రామారావు చాలా సమర్ధవంతంగా వారిని ఎదుర్కొన్నాడు.పట్టుదలతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, ప్రజల మద్దతును కూడగట్టుకున్నాడు. ప్రజలందరికీ ఎన్టీఆర్ పట్ల అభిమానమే కాక కేంద్రం పట్ల వ్యతిరేకతను గమనించి కేంద్రం రాష్ట్ర గవర్నర్ గా వున్న రాంలాల్ ని తొలగించి,శంకర్ దయాళ్ శర్మ ని గవర్నరుగా నియమించింది.సెప్టెంబర్ 16 న ఎన్టీఆర్ ను తిరిగి ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి మార్గం సుగమం చేసింది. తొలగించబడిన ఒక ముఖ్యమంత్రి తిరిగి నియమించటం అనేది
భారత దేశ రాజకీయ చరిత్రలో బహుశా అదే మొదటిసారి కావచ్చు.
ఆ విధంగా 1984 ఆగస్టు-సెప్టెంబర్‌లో ఎన్టీఆర్‌ని తొలగించటం తిరిగి ఇందిరాగాంధీ ఎన్టీఆర్ నే నియమించటం అనేది రాష్ట్రంలో రసవత్తర రాజకీయ నాటకంగా చెప్పొచ్చు. ఆఖరికి రాష్ట్రం తిరిగి ప్రశాంతంగా మారింది.
తిరిగి ఎన్టీఆర్ పేదవారికి రెండు రూపాయలకే కిలో బియ్యం పధకం,ఆడవాళ్ళకు సమాన ఆస్థి హక్కు చట్టం వలన ప్రజల అభిమానం చూరగొన్నాడు.
అక్టోబర్ లో మాడపాటి హైస్కూల్ లో పాఠశాలలో విజ్ణానప్రదర్శనకు మా స్కూల్ తరపున సైన్స్ ఎగ్జిబిషన్ ఏదైనా తయారు చేయమని మా మేడం నన్ను పిలిచి చెప్పారు.రెండు నమూనాలు తయారుచేసి నలుగురు విద్యార్థులను తీసుకొని,నాకు సాయంగా ఉషా, విజయలక్ష్మి అనే టీచర్లతో కలసి మాడపాటి స్కూలుకి వెళ్ళాను.సైన్సువిభాగంలో ఎగ్జిబిట్లు ఏర్పాటు చేసే హడావుడి లో ఉండగా ఒక సంచలన వార్త. అది నిజమా కాదా అని స్కూలుకు దగ్గర్లో ఒకరి ఇంటికి టీవిలో వార్తలు చూడటానికి వెళ్ళాము.
అదే ఆ ఏడాది సంచలనం కలిగించిన దిగ్భ్రాంతికరమైన మరో సంఘటన అక్టోబర్ నెల చివరలో ఇందిరాగాంధీ హత్య .
విజ్ణాన ప్రదర్శన నిరవధికంగా వాయిదా వేసారు.ఏవైనా గొడవలు అవుతాయేమోనని పిల్లల్ని స్కూలు దగ్గర దింపి మేము ఇళ్ళకి వెళ్ళిపోయాం.
ఆ సంఘటన ఢిల్లీలో సిక్కుల అల్లర్లకు దారితీయటం ఆ తర్వాత హింస, అల్లర్లు, కర్ఫ్యూ మరియు కాల్పులతో దేశం అంతా అల్లకల్లోలమైంది.
1984లో, ఇందిరా గాంధీ హత్య అనంతరం జరిగిన లోక్‌సభ ఎన్నికలలోకాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ నేతృత్వంలో విజయదుందుభి మోగించింది.మొదట్లో రాజకీయాలపట్ల అంతగా ఆసక్తి లేకపోయినా రాజీవ్ గాంధీ తదనంతరం యువతరాన్ని దృష్టిలో ఉంచుకుని తన పాలనలో అనేక సంస్కరణలు చేయటంతో దేశంలో కొత్తమార్పులు వచ్చాయి.
అక్కయ్య వాళ్ళ పక్కనే ఉన్న అపార్ట్మెంట్ లో శారదా శ్రీనివాసన్ గారి చెల్లెలు ఉంటారు.వాళ్ళ అపార్ట్మెంట్ అమ్మకానికి ఉందని మామయ్య ఒకరోజు వచ్చి చెప్పారు. కొనుక్కోవాలనే కోరిక వున్నా ఆ సమయంలో డబ్బు లేక వదిలేసాము. రాజమండ్రి ఇల్లు అమ్మేస్తే కొనుక్కోవచ్చు అనే ఆలోచనతో వీర్రాజు గారు తన సోదరులను సంప్రదించి రాజమండ్రిలో నా స్నేహితులకు ఆ బాధ్యత అప్పగించారు.
స్కూల్ లో నలభై మందికి పైగా ఉపాధ్యాయినుల సిబ్బంది, తెలుగు మాధ్యమం,ఆంగ్లమాధ్యమం కలిపి ఇరవై మూడు తరగతులు,పదిహేను వందలకు పైగా విద్యార్థులతో స్కూలంతా కళకళలాడుతూ ఉండేది. స్కూల్ లో వారివారి ఆలోచనా విధానాన్ని బట్టి గ్రూపులుగా ఉన్నా బయటకు అంతగా తెలిసేది కాదు.అంతేకాక ప్రధానోపాధ్యాయినితో కలిపి ఎక్కువ మంది క్రిష్టియన్ మతానికి చెందినవారు.అయినా మతపరంగా వాదనలు జరిగేవి కాదు.
స్కూల్లో ఏవైనా గొడవలు రావటానికి ముఖ్యకారణం మాత్రం హైస్కూల్ సోషల్ టీచర్ అయిన కృష్ణకుమారిగారు.ఆమె క్లాసులకు వెళ్ళగా నేను చూడలేదు.స్టాఫ్ రూం లోనే కూర్చుంటుంది.ఆమె బేగ్ మాత్రమే రామపాదుకల్లా క్లాసులు తిరుగుతుంది.క్లాసు లీడర్ గైడ్ లోంచి నోట్స్ రాయిస్తాడు.క్లాసు కంట్రోల్ లో ఉంచుతాడు.కృష్ణకుమారి నోటికి భయపడి మేడం కూడా మాట్లాడరు.నాకు ఆ పరిస్థితి చూసి ఆశ్చర్యం వేస్తుండేది.
నాకు అన్నీ హైస్కూల్ క్లాసుల ఫిజికల్ సైన్స్,ఏడవతరగతి మాత్రమే గణితం ఉండటం వలన హైస్కూల్ టీచరుగా గుర్తింపబడటం కొందరు ప్రైమరీ టీచర్లకు కంటకింపుగా ఉండేది.కానీ బయటకు ఏమీ అనేవారు కాదు.అదీకాక నేను ఎక్కువగా స్కూలు విషయాల్లో పట్టించుకోకుండా నా పనేదో చూసుకునేదాన్ని .అందుకని క్లాసులోకి వెళ్ళటం,నోట్సులు దిద్దటం వీటితోనే సమయం గడిచి పోయేది.కొత్త కనుక పాఠాలు ప్రిపేర్ అయ్యి క్లాసుకు వెళ్ళవలసి ఉండేది.ఉషా అనే ఆమె మాత్రమే కలుపుగోలుగా మాట్లాడుతూ ఉండేది.
మరో ముఖ్యమైన విషయం 1984లో జనరల్ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా మధ్యంతర ఎన్నికలు జరగటంతో తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీ సాధించి రెండవ సారి ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ప్రమాణస్వీకారం చేశారు.
ఈసారి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక వీర్రాజు గారిని ఆయన పేషీలో స్క్రిప్ట్ రైటర్ గా పోస్ట్ క్రియేట్ చేసి అపాయింట్ చేసారు.జీతం మాత్రం పూర్వపు ఎల్డీసీ జీతమే కానీ పనిమాత్రం మూడింతలు పెరిగింది.ఉదయం నాలుగు గంటలకే కారు వచ్చేది.తిన్నగా సిఎమ్ ఇంటికే తీసుకెళ్ళే వారు.వీర్రాజు గారు ఆ రోజు పేపర్లన్నీ చదివి ముఖ్యమైన వార్తల్ని కట్ చేసి పేపరు మీదే అతికించి ఆయన స్నానపానాదులు అయ్యి వచ్చేసరికి అందజేయాలి.వీర్రాజుగారికి మాత్రం టీనీళ్ళయినా ఉండేవి కాదట.
ఎక్కడైనా ప్రసంగాలు చేయాల్సినవి ఉంటే అవి తయారు చేయాలి.అయితే ఎన్టీఆర్ కి ఒకంతట అది నచ్చేది కాదు.హావభావ ప్రకటనలతో ప్రసంగించటానికి వీలుగా అనేక మార్పులు చేయించేవారు. అటువంటప్పుడు వీర్రాజు గారు ఎక్కడ,ఏమి తింటారో తెలియదు.ఇంటికి ఎప్పుడొస్తారో కూడా తెలియదు.ఆఖరుకు ఏ ఆదివారమో తీరిగ్గా హెయిర్ కటింగ్ కోసం సెలూన్ కి వెళ్తే కూడా అక్కడికే కారు వెళ్ళి వీర్రాజు గారిని పికప్ చేసుకుని ఆఫీసుకు పట్టుకెళ్ళి పోవటం కూడా జరుగుతుండేది.
అంత బిజీలో కూడా ఏ రాత్రి పూటో ముఖ్యమైన వాళ్ళకు ,మిత్రులకూ ముఖచిత్రాలు వేస్తుండేవారు.అప్పట్లోనే అంతకుముందు యువభారతి సంస్థలో ఉన్న రోజుల్లో సూర్యనారాయణ తో కలిపి కవిత్వసంపుటి వేసుకున్న జయప్రభ నాకు తన స్వీయకవితల సంపుటికి కవితలు ఎంపిక చేయమని , వీర్రాజు గారిని ముఖచిత్రం వేయమనీ స్క్రిప్ట్ తీసుకొచ్చి ఇచ్చింది.ఆ సంపుటికి ముందుమాటలో నా పేరు కూడా ఆత్మీయంగా ప్రస్తావించింది.ఇప్పుడు ఆమె అంచెలంచెలుగా ఎదిగి అంతర్జాతీయ కవయిత్రిగా అయిపోవటం సంతోషంగా ఉంటుంది.
వీర్రాజు గారు రచనలు చేయటం తగ్గిపోయింది.సభలూ, సమావేశాలు తగ్గి పోయాయి.మిత్రులతో కలయికలు తగ్గిపోయాయి.
ఇంట్లో కలిసి ఉన్నరోజు పండుగలా ఉండేది.
మేమున్న అద్దెయిల్లు చాలా చిన్నది కావటం, వీర్రాజుగారు రాత్రనకా,పగలనకా ఉద్యోగంలో తీరిక లేకుండా ఉండటం, నేనుకూడా ఉద్యోగంలో చేరటం కారణాలవలన పై వూళ్ళనుండి మాఇంటికి వచ్చే బంధువుల రాకపోకలు తగ్గిపోయాయి.ప్రస్తుత పరిస్థితుల్లో అది కూడా మేలే అనుకున్నాము.
పల్లవి తరుచూ ఇంటి వాళ్ళ ఇంటికి టీవీ చూడటం కోసం వెళ్ళాలని సరదా పడటంతో టీవీ కొనుక్కుంటే బాగుండునని ఆలోచన వచ్చింది.ఎప్పుడో యువభారతికి వేసిన చిత్రాలు తాలూకు డబ్బులు రావటంతో వాయిదాపద్దతిలో కొనటానికి సిద్ధపడ్డారు.
ఆ విధంగా మా ఇంట్లోకి నలుపు తెలుపుల టీవీ వచ్చి ఠీవిగా కూర్చుంది.
4, ఫిబ్రవరి 2024, ఆదివారం
హైమవతి చేసిన ముఖాముఖి
1).హైమవతి గారూ నమస్కారం.
రచయితలైనా,రచయిత్రులైనా ఇంటాబయటా బాధ్యతలు,ఒత్తిడి వలన కావచ్చు,ఆరోగ్యరీత్యా కావచ్చు ఇంకేదైనా కారణాలు కావచ్చు కలంసన్యాసం చేసి ఉండొచ్చు.
నా వరకూ నేను సాహిత్య అధ్యయనం బాల్యంలోనే మొదలు పెట్టి నాతోబాటు గా నా అధ్యయనం కూడా నడుస్తోంది.పాఠశాలచదువులో మాతెలుగు మాష్టారు నడిపిన లిఖిత పత్రికల్లో రాసాను.దానిని పెద్దగా నేను చెప్పుకోవటంలేదు. 1970లో పొలికేక వారపత్రికలో నా తొలి కథ "పరాజిత" ప్రచురితమైంది.వెంటవెంటనే మరో మూడు కథలు ప్రచురితం అయ్యాయి.తర్వాత కుటుంబ బాధ్యతలతో నాలుగైదు ఏళ్ళు విరామం,1975 లో తొలికవిత "ఆకలినృత్యం" ఎక్స్ రే లో ప్రచురితం అయ్యింది.అప్పుడప్పుడు రాస్తున్న కవితలతో 1980 లో "ఆకలినృత్యం " పేరిట తొలి కవితా సంపుటి వెలువరించాము.అప్పటినుండి నేను అవిశ్రాంతంగా రాస్తూనే వున్నాను.సాహిత్య అధ్యయనం ఏవిధంగా తీరనిదాహమో అదేవిధంగా సమాజంలో నేను చూస్తున్న,గమనిస్తున్న,పరిశీలిస్తున్న ఆలోచనల్ని నా ఆందోళనల్ని,ఆవేదనల్ని అక్షరరూపం లో పెట్టకుండా ఉండలేనితనం, నాకోసం సమయాన్ని సమకూర్చుకుని మరీ నిర్విరామంగా రాసేవరకూ నండూరి వారన్నట్లు గుండె గొంతుకలో కొట్లాడి నన్ను నిర్విరామంగా రాసేలా చేస్తోంది.
2).నేను బాగా చిన్నగా ఉన్నప్పుడే మా పెద్దక్కయ్య పి.సరళాదేవి కి వివాహం జరిగింది.అక్క సోవియట్ లాండ్ ప్రచురించే పిల్లలబొమ్మలపుస్తకాలు నాకోసం తేవటం వలన వాటిని చదువుతూ బొమ్మలు వేయటం అలవాటైంది. 1956 నుండి ఆమె తెలుగు స్వతంత్రలో విరివిగా రచనలు చేసేది.మాలతీచందూర్, పి.శ్రీదేవి, రామలక్ష్మిల సమకాలీనురాలు. డా.శ్రీదేవి మాఅక్కకు మంచి మిత్రురాలు.నేను కుటుంబ పరిస్థితులవలన ఎనిమిదవతరగతితో చదువు మానేసి ఏడాది పాటు అక్క ఇంట్లో ఉన్నాను. అక్క ఇంట్లోని గ్రంథాలయంలో శ్రీపాద, చలం, కొడవటిగంటి కుటుంబరావు వంటి ప్రముఖుల రచనలేకాక అనేక అనువాద గ్రంథాలు కూడా అర్థం అయినా కాకపోయినా విరివిగా చదివాను.నేను రచయిత్రీగా మారటానికి దోహదం చేసింది అక్క వాళ్ళింట్లో ఉన్న సమయమే అనుకుంటాను. మా పెద్దన్నయ్య కొడవంటి లీలామోహనరావు భారతిలో వ్యాసాలు రాసేవాడు. నా కవితలు కూడా ఆంగ్లం లోకి అనువదించాడు. మా చిన్నన్నయ్య కొడవంటి కాశీపతిరావు కూడా కథకుడు 1965 నుండీ 85 లవరకు అన్ని పత్రికలలో విస్తృతం గా కథలు రాసేవాడు.కానీ చదువుకోకుండా కథలు రాస్తున్నానని మందలిస్తారని నేను కథలూ కవితలు రాసినా పుస్తకాల అడుగున పడేసేదాన్ని.వీర్రాజు గారు మొదటిసారి మాఇంటికి వచ్చినప్పుడు నేను రాసిన కథలు చూపిస్తే అందులో మూడు కథలు ఎంపిక చేసి పత్రికల అడ్రస్ లు ఇచ్చి పంపమన్నారు.ఆ విధంగా వివాహానికి ముందే 1970 లో నా మొదటి కథ కొడవంటి సుభద్రాదేవి పేరుతో ప్రచురితమైంది. వివాహనంతరం డిగ్రీ పూర్తిచేసాక 1972 లో హైదరాబాద్ లో అడుగు పెట్టాను. తర్వాత పదేళ్ళకు
MA (తెలుగు),BEd మరో పదేళ్ళకు M.Sc(Maths)
చేసాను.
3) మహిళలకు పెళ్ళయ్యాక సహజంగానే కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి.పిల్లలూ,వాళ్ళ చదువులు సంసారాలు వీటితో తలమునకలై పోతారు,ఉద్యోగినులు ఐతే ఆబాధ్యత కూడా ఉంటుంది. బాధ్యతలలో కొట్టుకు పోతున్నా తన కోసమంటూ కొంతసమయం సమకూర్చుకో గలిగిన వాళ్ళు,ఇంట్లో సహకారం కాస్తంతైనా అందించినప్పుడు రచనలు చేయగలుగుతారు. వీర్రాజుగారు కూడా సాహితీ వేత్త కావటం నా సాహిత్య కృషికి దోహదపడింది.
4)
నేను చాలా చిన్నప్పటినుండి అక్క ఇచ్చిన బొమ్మలకథల పుస్తకాలు చూసి చిత్రాలు వేసేదాన్ని.తర్వాత్తర్వాత పత్రికల్లో ధారావాహికలకు బాపు వేసిన చిత్రాలు చూసి వేసే దాన్ని.స్నేహితులకు పుట్టినరోజులకు నేను వేసిన చిత్రాలు గ్రీటింగ్ కార్డులుగా ఇచ్చేదాన్ని.బాల్యంలో అక్కయ్య దగ్గర ఉన్నప్పుడు ఢిల్లీ శంకర్స్ వీక్లీ వాళ్ళు నిర్వహించే కాంపిటీషన్ కి నాచేత రెండు చిత్రాలు వేయించి పంపించింది.
ఒకసారి 1970 ల్లో అన్నయ్య జయదేవుని గీతగోవిందం టీకాతాత్పర్యాల సహితంగా పుస్తకం తీసుకు వస్తే అందులో ఒక అష్టపదికి ఎనిమిది దారుణాలకు ఎనిమిది బొమ్మలు స్వంతంగా ఊహించి వేసాను.అవి ఇండియన్ ఇంక్ తో చేసాను గానీ ఈలోగా వివాహం కావటంతో అసంపూర్తిగా కొన్ని ఉండిపోయాయి.
వివాహానంతరం బాధ్యతలవలన ఉన్నసమయాన్ని కాస్తా సాహిత్యానికి కేటాయించి చిత్రాలు వదిలి పెట్టేసాను.ఉద్యోగ విరమణ తర్వాత మళ్ళా చిత్రాలు వేయటం మొదలు
పెట్టాలని స్కెచ్ బుక్ కొనుక్కున్నాను.కానీ కుదర్లేదు
5) 2001లో అమెరికాలో ఉగ్రవాద దాడిలో జంటటవర్లు కూలిపోవటం తదనంతరం అమెరికా ఆఫ్ఘన్ యుధ్ద నేపధ్యంలో ఒక్క నెలలోనే రాసిన దీర్ఘకావ్యం " యుద్దం ఒక గుండె కోత".ఆ సమయంలో మా అమ్మాయి అక్కడ ఉండటం తో కొంత ఆందోళనకు గురయ్యాను.ముఖ్యంగా భారతదేశం నుండి చదువుకున్న యువత చదువులకో , ఉపాధికో విదేశాలదారి పడ్తున్నారు.
ఇద్దరు యుధ్ధోన్మాదుల అహంకారం వలన,అధికారదాహం వలనా జరిగే యుద్ధం అనాదిగా ఎప్పుడు ఎక్కడ జరిగినా దాని పర్యవసానాలు మహిళలు మీదే పడ్తాయి.అటువంటి యుద్ధాలు ఎందరో తల్లులకు గుండెకోతే కదా? ఆ రకంగా యుధ్ధమూలాల్లోకి వెళ్ళి వాటినన్నింటినీ కవిత్వీకరించాను.
రెండవ దీర్ఘకవిత " బతుకుపాటలో అస్తిత్వరాగం" తల్లి గర్భం నుంచి శిశోదయం నుండి వృద్ధాప్యం వరకూ ఏడు చాప్టర్ లుగా స్త్రీ జీవితం చిత్రణం చేసాను .ప్రతీ చాప్టర్ ను విత్తనంనుండి మొలక తలెత్తిన దగ్గర నుంచి వృక్షం మోడుగా మారటం వరకూ,సూర్యోదయం నుండి సంధ్యవేళ వరకూ పోల్చుతూ చెప్పాను.చివర్లో చెట్టు మోడైనా విత్తనాలు తిరిగి మొలకెత్తుతాయనీ,సూర్యుడు అస్తమించినా తిరిగి ఉదయిస్తాడనీ, వృద్ధాప్యంలోని స్త్రీ అనుభవాలు తర్వాత తరానికి స్ఫూర్తి దాయకాలని ఆశావహ దృక్పథంతో ముగించాను.
నేను దీర్ఘకవిత రాసిన సమయానికి కొందరు కవులు మాత్రమే రాసారు.అందుకనే కాత్యాయనీ విద్మహే గారు నేనే తొలి దీర్ఘకావ్య కవయిత్రిగా నిర్థారించారు. యుద్ధం ఒక గుండె కోత దీర్ఘకావ్యం పై మధురకామరాజు విశ్వవిద్యాలయం లో ఎమ్ ఫిల్ పరిశోధన జరిగింది.
6)1970 లో కథారచనతోనే సాహిత్య రంగంలోకి అడుగు పెట్టినా కవిత్వం వైపే మొగ్గు చూపాను.నేలవిడిచి సాము చేసేవి రాయను. కథకి తగిన వస్తువు దొరికితేనే కానీ రాయలేను.అందుచేతే మూడు కథాసంపుటాలు మాత్రమే వెలువడ్డాయి.ప్రపంచీకరణ నేపధ్యంలో చిల్లర దుకాణాలు మూతపడటం ,రాళ్ళు కొట్టి రోళ్ళు తయారు చేసేవారి దుర్భర జీవితం,పేపర్లు ఏరుకునే పిల్లలు బేనర్లుగా కట్టిన గుడ్డ కోసం ఆశపడటం,పేద మహిళలు అద్దెగర్భాలకు పావులుగా కావటం,దాంపత్యాలలోని లొసుగులు,స్త్రీ అస్తిత్వ పోరాటాలు ఇలా స్త్రీ కేంద్రంగా కథలు రాసాను.ఉపాధ్యాయవృత్తిలో గమనించిన అనేక విషయాలగురించి " ఇస్కూలు కతలు " రాసాను.అవి తెలుగు విద్యార్థి మాసపత్రికలో రెండున్నర సంవత్సరాలు ధారావాహికగా వచ్చాయి.అందులో మొదటి కథ మహారాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో ఏడవతరగతి ద్వితీయ భాష తెలుగు వాచకం లో పాఠ్యాంశంగా చేర్చారు.మరొక కథ " మార్పులేని మనిషి" కథని SVU పరిధిలోని కాలేజీ డిగ్రీ మొదటి సెమిస్టర్ లో పాఠ్యాంశంగా చేర్చారు.
7)
2009 లో అప్పటి వరకూ వచ్చిన ఎనిమిది సంపుటాలను కలిపి "శీలా సుభద్రాదేవి కవిత్వం" పేరిట వీర్రాజు గారు నా అరవయ్యేళ్ళ జన్మదిన సందర్భంగా ప్రచురించారు.
8)
కుందుర్తి గారు 1950ల నుండీ వచన కవిత్వ వ్యాప్తికి చాలా కృషి చేశారు.అన్ని ప్రక్రియల్లో వచనకవిత్వం రావాలని అభిలషించి తాను స్వయంగా వచనకవిత్వంలో కావ్యం,నాటిక,నాటకం మొదలైన ప్రక్రియల్లో అనేక గ్రంథాలు ప్రచురించారు.ఆనాటి యువకవులను ప్రోత్సహించటానికి ఫ్రీవర్స్ ఫ్రంట్ స్థాపించి 1969 నుండి అవార్డులు ఇవ్వటం మొదలెట్టారు.ఆయన ప్రోత్సాహంతో 1967 లోనే వీర్రాజు గారు ఆరు కథలను వచనకవిత్వంలోరాసారు. తదనంతరం కావ్యం,నవల, ఆత్మకథ కూడా రాసారు.మిగతా ప్రక్రియలను ఇతరకవుల చేపట్టక పోయినా దీర్ఘ కవిత్వం మాత్రం చాలా ఎక్కువ గానే వస్తూనే ఉన్నాయి.
9)
నాకున్న సమయాభావం వల్ల కావచ్చు మొదటినుంచీ కవిత్వమే ఎక్కువ రాసాను.తొమ్మి సంపుటాలు ఇప్పటికే వెలువడ్డాయి.మరో కవితాసంపుటి,ఒక దీర్ఘకవితా ప్రచురణ కు సిద్ధంగా ఉన్నాయి.బహుశా అందుకే సాహిత్య రంగం నన్ను కవయిత్రి గానే గుర్తిస్తుంది.ఒక చిన్న సంఘటన,ఒక దృశ్యం,మనసును కలవరపరచినా,సంతోషపరచి నా అక్షరంగా ప్రవహించే నా స్వభావం కవయిత్రి గా గుర్తింపు వైపే మొగ్గు చూపుతుంది.
అలా అని ఇతరప్రక్రియలను అలక్ష్యం చేయలేదు. రెండున్నర సంవత్సరాలుగా నెచ్చెలి నా ఆత్మకథ " నడక దారిలో" రాస్తున్నాను.మూడు కథాసంపుటాలు,ఒక వ్యాససంపుటీ,డా.పి.శ్రీదేవిమీదా, నిడదవోలు మాలతి మీదా రెండు మోనోగ్రాఫ్ లు పుస్తక రూపంలో వచ్చాయి.అయిదు పుస్తకాలు నా సంపాదకత్వం లో వెలువడ్డాయి..ఒక నవల, కథల సంపుటి, కవితాసంపుటి ,వ్యాససంపుటీ ప్రచురించాల్సి ఉంది.
మీరు అన్నట్లుగా 2001 లో అనుకుంటాను వందమంది కవయిత్రుల కవితలను ముద్ర పేరిట నేనూ ,డా.పి.భార్గవీరావు కలిసి సంపాదకత్వంలో సంకలనం తీసుకు వచ్చాము.నిరంతర అధ్యయనం,రచనలు చేయటం నాకు ఇష్టమైన వ్యాపకాలు.
10)
ప్రపంచీకరణ ప్రభావం వలన రోళ్ళుమూలపడ్డాయి. ఎక్కువమంది ఉద్యోగినులు కావటం తో సౌలభ్యం కోసం మిషన్లు ఇంట్లోకి వచ్చాయి.దేవుడిబండ కథలో ఈ సందర్భం తో పాటు ఆర్థిక వెనకబాటుతో వలసపక్షులైన వృత్తిపనివారల పిల్లలకు చదువుదూరం కావటాన్ని చూపాను.పాడైపోయిన పొత్రం రోడ్లవిస్తరణలో గ్రామదేవతగా మారిన వైనంతో ప్రజల మూఢనమ్మకాలను అక్షరీకరించాను.
11) ఆధునిక జీవితంలో అలవాటు పడిన సౌకర్యాల వలన మనిషి అవి లేకపోతే ఉక్కపోత కు గురౌతున్నాడు.విదేశాలకు వెళ్ళిన పిల్లలు ఇక్కడకు వచ్చి ఇక్కడ ఉన్నన్ని రోజులూ వాతావరణకాలుష్యాలకూ ఇరుకుదనానికి ఇబ్బంది పడటం చూస్తూ విమర్శిస్తాం.కానీ నగరజీవితానికి అలవాటుపడిన మనం కూడా మనం పుట్టిపెరిగిన గ్రామాలకు వెళ్తే అక్కడ అసౌకర్యాలకు చికాకు పడతాం.దీనినే కథాంశంగా తీసుకుని రాసిన కథ " మార్పు వెనుక మనిషి"
12) గర్భధారణపు తొమ్మిది నెలలకాలమంతా ఆరోగ్యరీత్యా గడ్డుకాలమే.ప్రసవం మరో పునర్జన్మే.అయినా ఆ తర్వాత చేతిలోని బిడ్డతో తాదాత్మ్యం చెందుతుంది.
గత్యంతరం లేని ఆర్థిక పరిస్థితులవలన ఈనాడు ఎందరో పేద మహిళలు అద్దెకు గర్భాన్ని ఇస్తున్న వైనం తెలిసి రాసిన కథ "గోవుమాలచ్చిమి"
తనది కాని బిడ్డని తొమ్మిది నెలలు మోసి కన్న తర్వాత బిడ్డని ఎవరికో అందజేయాల్సి వచ్చినపుడు తల్లి పడే బాధని అక్షరీకరించాను.గోవు చూడి కట్టి పాలు ఇస్తున్నంతకాలం దాన్ని ప్రేమిస్తాం.అదేవిధంగా స్త్రీ కూడా భర్త దురాశతో మళ్ళీ మళ్ళీ గర్భాన్ని అద్దెకు ఇవ్వాల్సి వస్తే అలా ఆదాయవనరు గా మారిపోతున్న దుస్థితిని వివరించాను.
13)
ఇప్పటి కవులు చాలా వరకూ విద్యావంతులు కావటాన ఇతర విదేశీభాషా సాహిత్యాన్ని చదువుకునే అవకాశాలు ఎక్కువ.అందువలన కొత్త,కొత్త అంశాల్ని,కొత్త శైలి,కొత్త అభివ్యక్తుల్నీ సాహిత్యం లోనికి తెస్తున్నారు.అది మంచి పరిణామం.
అయితే కొందరిలో అధ్యయనం కొరవడిందని నా అభిప్రాయం.అంతేకాక రాసింది రాసినట్లుగా మాధ్యమాల్లో పంచేసి లైకులు కోసం ప్రశంసలు కోసం వెంపర్లాడటం కూడా పెరిగింది.విమర్శను ఏమాత్రం సహించలేకపోతున్నారు.ఒక పుస్తకం వేసుకోగానే అవార్డులకోసం ఎదురు చూస్తున్నారు.ఏ ప్రక్రియ లో రచనలు చేయాలనుకున్నా అధ్యయనం ఎక్కువగా ఉండాలి అని నా అభిప్రాయం.
హైమవతి గారూ మీరు ఈ విధంగా నన్ను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)