27, జూన్ 2023, మంగళవారం

కవన శర్మ గారి " ఆమెయిల్లు" కథపై నా స్పందన

కవనశర్మ గారి కథ "ఆమె యిల్లు" ఈ కథ నిజానికి రచయిత్రుల కలం నుంచి రావాల్సిన కథ.ఒక రచయిత స్త్రీ మనసులోని అంతర్మధనాన్ని పట్టి చూపిన కథ. పాతికేళ్ళకు పైగా కాపురం చేసి కొడుకు వివాహం కూడా అయ్యాక ఉద్యోగం చెయ్యాలనుకోవటమే కాక తనకంటూ ఒక ఇల్లు కేవలం నాయిల్లు అని చెప్పుకోవాలనీ ఆ ఇల్లు అద్దె యిల్లైనా సరే కావాలని అభిలషించటమే కాక పట్టు పట్టి భర్త ,కొడుకూ, తమ్ముళ్ళ మాటలను పెడచెవిన పెట్టి అనుకున్నది సాధించిన కమల కథ. అలా ఆ వయస్సులో ఎందుకు అనుకుంది? ఎప్పటి నుండి పుట్టిల్లు అయిన తండ్రి ఇల్లు కానీ, తండ్రి తదనంతరం ఆయింటికి హక్కుదారుడైన తమ్ముడి ఇల్లు కానీ,పాతికేళ్ళకు పైగా భర్తతో కాపురం చేసి భర్తకే కాక చాకిరి చేసిన ఆయింటిని గానీ,తొమ్మిదినెలలు మోసి కనిపెంచిన కొడుకు ఇంటిని గాని తన ఇల్లు గా కమల ఎందుకు భావించలేక పోయింది. ఆమె మనసు నొచ్చుకున్న కారణం ఏమిటి అనేది ఆమెయిల్లు కథ. ఈ కథలో కమల చిన్నప్పటినుండి ఒక్కొక్కపొరనే విప్పుతున్నట్లుగా చెప్పిన విషయాలూ,చెప్పిన విధానమూ కథని చదివినప్పుడు,లేదా విన్నప్పుడు పాఠకులకు మనసులోకి సూటిగా బాణంలా దూసుకుపోతాయి. నిజానికి ప్రతీ మహిళా తన జీవితకాలంలో కమల చెప్పినటువంటి సంఘటనలు తప్పక ఎదుర్కొనే ఉంటుంది.అందులో మనం కూడా మినహాయింపేమీ కాదు.మనం కూడా ఒక్కొక్కప్పుడు నొచ్చుకున్న అనుభవాలూ మనసులో మెదులుతాయి.పెళ్ళి కాకముందు కొంతవరకూ మనయిల్లు అనే భావించినవాళ్ళం పెళ్ళైయ్యాక పుట్టింటికి అతిథులం అయిపోతాం.అదే విధంగా ఉద్యోగం చేస్తున్నవాళ్ళు కూడా డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు నీడబ్బూ,నాడబ్బూ అనే లెక్కలే తప్ప భార్యాభర్తల మధ్ర్య కూడా మనడబ్బు అనుకోలేకపోవటం,తద్వారా వచ్చే భేదాభిప్రాయాలు మనకి తెలుసు.ఇలా ఎన్నో మనల్ని కథలో మమేకం చేస్తాయి. అయితే కమలలా నిర్ణయం తీసుకోకపోవటానికి కారణం ఏమిటి? మనవారి మీద ప్రేమా? భద్రజీవితం మీద మోహమా? అభద్రతా భావమా?కథ నేను చెప్పను. మిత్రులారా కథ విని మీరు కూడా ఆలోచించండి.

నడక దారిలో -- 30

నడక దారిలో -30 సభలకు గానీ సినిమాలకు గానీ ఎక్కడకీ వెళ్ళాలనే ఉత్సాహం తగ్గిపోయింది.ఇంటికి దగ్గరగా ఉన్న పరిషత్తు భవనంలో జరిగే యువభారతి మీటింగులకు కూడా వెళ్ళటం లేదు.వీర్రాజుగారు ఒక వైపు తన స్వంత కార్యాలయం వికాస్ కి వెళ్ళటం, వచ్చినతరువాత కవులు రచయితల పుస్తకం ముఖచిత్రాలు, కుదిరినప్పుడు యథావిధిగా సభలూ , సమావేశాలతో బిజీగా ఉంటున్నారు. ఒకసారి తప్పని పరిస్థితుల్లో బంధువుల ఇంటికి ఏదో ఫంక్షన్ కి వెళ్ళాల్సి వచ్చింది."ఇలాంటి అనారోగ్యపు మగపిల్లాడి కన్నా ఆడపిల్లలుండటం నయం"అని అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్న తోడికోడలు అంది.ఆమెమాటలు నిజానికి ఉన్న మాటలే అయినా మనసు బాధగా మూల్గింది.దాంతో నేను పూర్తిగా ఎక్కడికీ ఎవ్వరి ఇంటికీ వెళ్ళటం మానేసాను.మాయింటికి కూడా ఏడాదికో రెండేళ్ళకో నెలరోజులపాటు వచ్చి ఉండే మా పెద్దాడబడుచు కుటుంబం రావటంలేదు.మా మరదులకుటుంబాలూ రావటం మానేసారు.పెద్దమరిది మాత్రం అవసరమైనప్పుడు పిల్లల ఫీజులకనో, ఇంట్లో ఎవరికో ఒంట్లో బాగాలేదనో అన్నగారిని డబ్బు అడగటానికి వస్తుంటాడు. పల్లవి బడికి వెళ్ళేక నేను వంటా,ఇతరపనులు పూర్తి చేసుకునే వరకూ బాబును ఆయన చూసుకునేవారు. ఆయన వికాస్ ఆఫీసుకు వెళ్ళాక టేప్ రికార్డర్ లో లలితసంగీతం కేసెట్ లు పెట్టుకుని వచ్చిన పాటల్ని దానితో పాటూ మెల్లగా రాగాలు తీసుకుంటూ,విషాద పాటలు మనసుని మరింత భారం చేస్తే సజలాలైన కళ్ళతో బాబుని చూసుకుంటూ మౌనంలోకి జారిపోయే దాన్ని. వీర్రాజు గారి దగ్గరకు ముఖచిత్రాలు వేయించుకోవాలని వచ్చే కవులతోనో ,వారి మిత్రులతోనో ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న కొత్తగా రాస్తున్న కవులు కూడా వచ్చేవారు.వాళ్ళని చూస్తే నాకు చదువుకోవాలనే కోరిక మళ్ళా తొలచటం మొదలైంది. ఒకరోజు ఆయనతో "నేను దూరవిద్య ద్వారా ఎమ్మే చదువుకోనా" అని అడిగాను.ఆయన ఆశ్చర్యపోయి "ఈ స్థితిలో బాబుతో....అయినా..కవిత్వం రాయటం తగ్గి పోతుందేమో"అన్నారు. "అందుకే చదవాలని ఉంది.చదువులో పెడితే ఈ డిప్రెషన్ తగ్గుతుందేమో.తెలుగు ఎమ్మే అయితే ఎక్కువ కష్టం పడక్కర్లేదు కదా"అన్నాను. ఆయన ఏమీ మాట్లాడలేదు. తన దగ్గరకు వస్తున్న చదువుతున్న కుర్రాళ్ళను అడిగారు.బహుశా వాళ్ళలో సిధారెడ్డి,శంకరం మొదలైన వారు ఉండేఉంటారు నేను ఆ పరిస్థితుల్లో ఎవరితోనూ మాట్లాడేటంత వెసులుబాటు లేదు,మనసూ లేదు. ఏమైతేనేం వాళ్ళు అప్లికేషన్ తీసుకువస్తే నింపిన తర్వాత ఆయనవెళ్ళి ఫీజు కట్టి వచ్చారు.కానీ స్టడీ మెటీరియల్స్ తేలేదు.సిలబస్ మాత్రమే ఉంది.ఇంట్లో యువభారతి ప్రచురణలు ఉన్నాయి.ఆరుద్ర సమగ్రాంధ్ర సంపుటాలు ఉన్నాయి.బాబు పడుకున్న సమయంలో నాకు కావలసిన విధంగా సిలబస్ ని బట్టి నోట్సులు తయారు చేసుకున్నాను. కానీ తరుచూ అనారోగ్యం పాలు అవుతున్న బాబుతో చదవటం ఇబ్బందిగా ఉన్నా నేను సమయం దొరికినప్పుడల్లా పుస్తకం తిరగేస్తూనే ఉన్నాను. నాలుగింటికి పల్లవి స్కూలునుంచి వచ్చాక ఏదో తినటానికి ఇచ్చి హోంవర్క్ చేయించటం,చదివించడం చేసేదాన్ని. బాబుని పడుకోబెట్టేటప్పుడు నేను లలితగీతాలు పాడుకుంటూ రాగాలు తీస్తుంటే పల్లవి కూడా గొంతు కలిపేది.ఎక్కడా అపశృతి లేకుండా పాడుతున్న పల్లవిని చూసి సంగీతం నేర్పిస్తే బాగుండును అనుకునేదాన్ని.ఇంటికి దగ్గరలోనే సంగీత కళాశాల ఉన్నా తీసుకెళ్ళటం,తీసుకురావటం నాకు కష్టం అని ఊరుకున్నాను. దూరవిద్య లో ఎమ్మే పరీక్షలు రాసేవాళ్ళ కోసం యూనివర్సిటీ వాళ్ళు పరీక్షలకు ముందు పదిహేను రోజులు ఓరియంటేషన్ క్లాసులు ఏర్పాటు చేశారు.కాని పదిహేను రోజులపాటు పిల్లాడిని వదిలి రోజంతా క్లాసులకి వెళ్ళే పరిస్థితి లేదు కనుక వెళ్ళలేదు. పరీక్షలు సమయానికి అమ్మని సాయానికి రమ్మన్నాను.ఇంటికి దగ్గరలోనే ఉన్న రెడ్డి కాలేజీ లోనే సెంటర్ పడింది.బాబుకి అన్నం తినిపించి నేను పరీక్షకు వెళ్ళాను. పరీక్ష హాలుకు వెళ్ళటానికి మెట్లు ఎక్కుతుంటే "చిన్నపాపాయీ నువ్వేనా" మెట్లపైన ఒక ఆమె పలకరించింది. నన్ను చిన్నపాపాయీ అని పిలిచేదెవరాఅని ఆశ్చర్యంగా చూసాను.నాచిన్ననాటి స్నేహితురాలు రోణంకి అప్పలస్వామి గారి చిన్నమ్మాయి లలిత. ఇద్దరం సంబరంగా చేతులు కలుపుకొని పరీక్ష సమయం అయిపోతుందని పరీక్ష అయ్యాక కలుద్దామనుకున్నాము. పరీక్ష రాసిన తర్వాత కాసేపు ఇన్నాళ్ళ కబుర్లు చెప్పుకొని మర్నాడు తొందరగా వచ్చి మాట్లాడు కుందామని వీడ్కోలు చెప్పుకున్నాము. లలిత కొత్తగూడెంలో ఉంటుందట.వాళ్ళాయన చిన్నప్పటినుండి అనుకున్న మేనత్త కొడుకూ, అప్పట్లో మాకందరకూతెలిసిన పెద్దబాబే.అతను రామగుండం లో ఇంజనీరుగా పనిచేస్తున్నాడనీ,లలిత కూడా అక్కడే స్కూల్ లో టీచరుగా పనిచేస్తున్నానని చెప్పింది.మా బాబు సంగతి తెలిసి బాధపడింది. మొత్తం మీద ఎమ్మే మొదటి సంవత్సరం పరీక్షలు నిర్విఘ్నంగా పూర్తి చేసాను.పరీక్షలు అయ్యాక అమ్మ అక్కయ్య వాళ్ళింట్లో ఓ వారంరోజులు ఉండి విజయనగరం వెళ్ళిపోయింది. స్వాతి పత్రిక వాళ్ళు విజయవాడ వెళ్ళిపోవటంతో మా కాంపౌండ్ లోనే ఉన్న రంగారావు గారు ఆ గదిని తీసుకున్నారు.అయితే రంగారావు గారి మిత్రుడు భక్తవత్సలం అనే స్వర్గం నరకం ఫేం మోహన్ బాబు,అతని సహనటి అయిన సరోజ వగైరాలతో సహా ఆ గదిలో రాత్రి అయ్యేసరికి చేరి రాత్రంతా పార్టీలు చేసుకుని రచ్చరచ్చ చేసేవారు.ఆ గది మాకు పక్కనే ఉండటాన రాత్రంతా ఆ వాసనలు,ఆ గందరగోళాలూ మాకు న్యూసెన్స్ గా మారింది. ఒకరోజు సినిమాకు వెళ్ళొచ్చి "సినీమా చాలా బాగుంది.మంచిపాటలూ,డాన్సులు నీకు ఇష్టం కదా రేపు మనం వెళ్దామా" అన్నారు.బాబును తీసుకొని వెళ్ళటానికి నేను వెనకా ముందు అయ్యాను.కానీ పర్వాలేదంటూ తీసుకువెళ్ళారు.ఆ సినీమా శంకరాభరణం. కూనిరాగాలకే పరిమితమైన నా కంఠానికి ఒక ఊపును ఇచ్చింది శంకరాభరణం చిత్రం.బాబుని పడుకోబెడుతూ అందులో పాటలన్నీ పాడుకునే దాన్ని.నేను పాడగా విని పల్లవి కూడా ఆ పాటలన్నీ చక్కగా పాడేది.ఒకవిధమైన దిగులు, నిస్తేజం అలుముకున్న ఇంటిలో మా రాగాలు సీతాకోకచిలుకల్లా అప్పుడప్పుడు ఎగురుతున్నాయి. అంతకుముందు రాసిన కథలు ప్రచురితం అయిన రోజు ఉత్సాహం మనసునిండా ఊపిరులూదుతుంది.నెలలు గడుస్తున్నా,ఏడాదులు దొర్లుతున్నా ఎదుగు బొదుగూరెండేళ్ళు దాటినా బోర్లా పడటం తప్ప మరేమీ చేయ లేని బాబుని చూసేసరికి దుఃఖం గుండెనిండా మబ్బులా కమ్మేస్తుంది. కవిత్వరంగంలో ఒకవైపు విరసం ప్రభావంతో ఉరకలెత్తే ఉత్సాహంతో రాస్తున్న కవులకు కుందుర్తి పిలుపు అందుకొని వచన కవిత్వం కలగలిసి ఉవ్వెత్తున కవిత్వం వస్తోంది. వీర్రాజు గారు వేస్తున్న వచనకవిత సంపుటాల ముఖచిత్రాలు చూస్తుంటే మనసు మూగపోతోంది. నేను రాయటం మొదలు పెట్టిన రోజుల్లోనే సాహిత్యం లోకి వచ్చినవాళ్ళంతా చకచకా ఎదిగిపోతున్నారు.నేను అంతకంతకూ నాలోకి నేను కూరుకు పోయి కకూన్ ను అయిపోతున్నానన్న భావం నన్ను కుంగదీస్తోంది. వీర్రాజు గారికి తనని తాను ఉత్సాహం పరచుకోటానికి తన పుస్తకాలు ప్రచురించుకోవటం ఒక అలవాటు.ఆ రకంగా నా లోకి నేను ముడుచుకు పోవటం చూసి నా కథలను పుస్తకంగా వేయాలని తలపెట్టారు.కథలన్నీ ఒకచోట చేర్చి అందులో అంతగా పరిణితిలేని కథలుగా అనిపించినవి తీసివేసాము.రంగు వెలిసిన బొమ్మ అని శీర్షికతో ఫైల్ చేసాము. ఈలోగా మేము ఆ ఇంట్లోకి వచ్చి పదేళ్ళు దాటిపోవటంతో ఇల్లుగల ఆయన మమ్మల్ని ఖాళీ చేయమని ఒత్తిడి తేవటం మొదలెట్టాడు.ముందు అద్దె ఇవ్వటం లేదని కోర్టుకు వెళ్తానని బెదిరించబోయాడు.తర్వాత ఎదురు డబ్బు ఇస్తానని కాళ్ళబేరంకి వచ్చాడు.కానీ వీర్రాజు గారు వికాస్ ఆఫీస్ దగ్గరలో ఉండటం,బాబు అనారోగ్య కారణాలవలన ఇల్లు దొరుకుతే ఏడాది లోపునే ఖాళీ చేస్తామని చెప్తే అంగీకరించాడు.