నడక దారిలో—14
జూన్ నెల 1970 లో ఒకరోజు మాచిన్నన్నయ్య కొత్తగా విడుదల అయిన స్వాతి మాసపత్రిక ప్రారంభ సంచిక తీసుకు వచ్చాడు.అంతకు ముందు, జ్యోతి,యువ మాసపత్రిక లో మాదిరిగా అదే సైజు లో అందమైన బాపు ముఖచిత్రంతో ఆకర్షణీయంగా ఉంది. తర్వాత ఆ చిత్రాన్నే స్వాతి లోగో లా వాడుతున్నారు.అందులో అప్పట్లోని సాహితీ ప్రముఖులరచనలతో సాహిత్యం పట్ల ఇష్టం ఉన్న వారికి ఆనందం కలిగించి హృదయానికి హత్తుకునేలా రచనలు ఉన్నాయి.
కుమారీ వాళ్ళఅన్నయ్య ఇంటింటి గ్రంథాలయం కోసం తెచ్చిన పుస్తకాల్లో శీలా వీర్రాజు గారు రాసిన “ కాంతిపూలు” నవల కనిపెంచితే తీసుకు వచ్చి ఏకబిగిన చదివేసాననీ ఆ నవలపై అభిప్రాయం రాసుకున్నానని ఒకసారి చెప్పాను కదా. .అక్కయ్య ఇంట్లో మబ్బుతెరలూ, సమాధి పుస్తకాలు చదివినప్పటి నోట్స్ ఒకసారి తీసాను.
స్వాతిలో గౌరవసంపాదకునిగా శీలా వీర్రాజు పేరు చూసి ఆయన రచనలపై నా అభిప్రాయం రాస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించాను.మర్నాడు కాలేజీకీ వెళ్ళినప్పుడు ఉషని సలహా అడిగాను”పాఠకురాలిగా రాయటంలో తప్పేముంది?” అంది.
“తప్పులేదు కానీ శీలా వీర్రాజు నా మేనత్త కొడుకు.నేనని తెలుస్తే బాగుండదేమో”అన్నాను ఆలోచిస్తూనే.
“అలాగా ఐతే వేరే పేరుతో రాయు” ఆశ్చర్యపోతూనే అంది.
“ అన్నయ్య పేరు ,ఊరూ చూసి గుర్తు పట్టొచ్చుకదా”
“మా ఇంటి అడ్రస్ ఇవ్వు” .
“సరే చాలా చాలా థేంక్స్ ఉషా “అని సంతోషంతో పొంగిపోతూ KS దేవి పేరు తో ఉత్తరం రాసి పోస్టు చేసాను.అంతకు ముందు ఎందరివో ఎన్నో రచనలు చదివాను.చదివిన వాటికి నోట్స్ రాసుకున్నాను.కానీ ఎప్పుడూ ఎవరికీ ఉత్తరం రాయలేదు.ఇప్పుడే ఎందుకు రాయాలనిపించిందో కూడా చెప్పలేను.
నేను కాలేజీలో చదువుతున్నరోజుల్లోనే యద్దనపూడి సులోచనారాణి నవలలు జ్యోతి మాసపత్రిక లోనూ , ఆంధ్రజ్యోతి వారపత్రికలో సీరియల్స్ గా వచ్చేవి.గురువారం వచ్చే వారపత్రికలో సులోచనారాణి జీవన తరంగాలు కోసం లైబ్రరీ కి అమ్మాయిలంతా క్యూ కట్టేవారు.గార్డెన్ లోనో,హాస్టల్ రూమ్స్ లోనో అంతకుముందే చదివినవారిదగ్గర చేరి కథ వినేవారు.ఆరోజుల్లో కాలేజీ అమ్మాయిలు సులోచనారాణిని ఆరాధించేవారు.ఆనాటి అమ్మాయిల కలలరాణి సులోచనారాణి తో నేను తర్వాత రోజుల్లో కలిసి సమావేశాల్లో పాల్గొన్నాను.
ఒకరోజు కాలేజీ నుండివచ్చి పుస్తకం చదువుకుంటుంటే ఉషా వచ్చింది”రోజంతా కాలేజీలో కలిసే ఉంటారు.మళ్ళా కబుర్లు ఏమిటో” అన్నయ్య బైటికి వెళ్తూ అన్నాడు.
ఎప్పటి లాగె ఉషాని తీసుకుని డాబా మీదకి దారితీసాను.
శీలా వీర్రాజు గారి “హృదయం దొరికింది” అందుకున్నాను.దాంతో బాటు సమాధానం కూడా.
ఎంత ఆశ్చర్యం కలిగిందో! కాసేపు ఆవిషయమే మాట్లాడుకున్నాం.”నా ఉత్తరాలు మీ అడ్రస్ కి రావటం నీకేమీ ఇబ్బంది లేదుకదా”అని అడిగాను.ఉషాఅన్నయ్య వేరే ఊర్లో చదువుతున్నాడు.వాళ్ళనాన్న ఇల్లుపట్టించుకోడు.వాళ్ళమ్మకి నా విషయం చెప్పిందట.అందుకే ఉత్తరాన్నిఆమె తీసి జాగ్రత్తచేసి ఉష కాలేజీ నుండి రాగానే ఇచ్చింది.
ఆ రాత్రి లోపున హృదయం దొరికింది పూర్తి చేసాను.కవిత్వం లో కథ రాయటం వింతగా ఆసక్తికరంగా అనిపించింది.అంతకుముందు గురజాడ కన్యకా,పూర్ణమ్మ,లవణరాజు కాలం గేయకథలు తెలుసు. శ్రీశ్రీ ముసలమ్మ మరణం కథాత్మక శైలిలో రాసినకవితా చదివాను.కానీ ఆధునిక జీవితాన్ని ఇలా వచనకవితా కథగా రాసినది చదవటం కొత్తగా అనిపించింది.
మాస్కూలు లిఖిత పత్రికకు పది ద్విపద ఛందస్సుపద్యాలతో ‘ నాబొమ్మే నా చెల్లి” అని రాసినది కూడా కథాత్మక పద్యమే అన్నమాట అని నాలో నేను భుజాన్ని తట్టుకున్నాను.
బహుశా అప్పుడే నాకు తెలియకుండానే నా మెదడులో దీర్ఘ కవితలు రాయాలనే బీజం పడిందేమో మరి.
వెంటనే నామనసులో కదిలిన ఈ ఆలోచనలనన్నింటినీ వీర్రాజు గారికి ఉత్తరంగా రాసాను. మళ్ళా ఓవారానికే ఉత్తరం తో పాటూ” కొడిగట్టిన సూర్యుడు”నాదోసిట్లో ఉదయించాడు.
నేను చదివిన పుస్తకాలు గురించి,నాకు ఇష్టమైన లలిత సంగీతం గురించి,నేను వేసే బాపూ బొమ్మల గురించి కూడా రాసేదాన్ని.సాహిత్యం గురించి నా ఆలోచనలు పంచుకునే మిత్రునిగా ఎంచి రాస్తుండే దాన్ని.నా ‘ఉత్తరాలు తన స్నేహితులు చదివి చాలా బాగా రాస్తుంది ఆ అమ్మాయి అని మెచ్చుకున్నారు' అని రాస్తే నాకు కోపం వచ్చింది.పర్సనల్ గా వచ్చిన ఉత్తరాలు ఎంత ఆత్మీయ మిత్రులు అయినావాళ్ళు ఎలా చదువుతున్నారు అని.
ఒక సారి “వైజాగ్ వైపు రావాల్సిన పని ఉందని’’ రాసారు.
“ఇక్కడ బంధువులు ఉన్నారా,”అన్న నా ప్రశ్నకు “ఉన్నారు కానీ వాళ్ళకీ మాకూ సంబంధాలు లేవు”అని రాసారు. “అప్పుడు నేను ఇంకా ఊరుకోలేక నేను “ లీలా మోహనరావు చెల్లెల్ని” అని బయట పెట్టాను.
“ నిజమా.ఇంత చిన్న చెల్లెలు ఉందని నాకు తెలియదు” అని బోల్డంత ఆశ్చర్యం వెల్లడించారు.
తర్వాత తన ఫొటో పంపి “నీకు ఇష్టమైతే వివాహం చేసుకుందాం”అని రాసారు.
నేను వెంటనే సమాధానం రాయలేదు.నాకు వివాహం కన్నా చదువు ముఖ్యం అని. అనుకున్నాను.
ఆయన మళ్ళీ మరో ఉత్తరం రాసారు.నేను అదే చెప్పాను”వివాహం అయినా నువ్వు అక్కడే ఉండి చదువు పూర్తి చేసుకుని హైదరాబాద్ రావచ్చు” అన్నారు.
నేను ఆలోచనలో పడ్డాను.
అమ్మకు మెల్లగా విషయం చెప్పాను.
అమ్మ “నీకు చెప్పలేదు కానీ ఆ మధ్య వాళ్ళమ్మ పోయినప్పుడు పెద్ద మామయ్య వాళ్ళని పరామర్శించడానికి హైదరాబాద్ కి వెళ్ళినప్పుడు అతని పెద్దచెల్లెలితో నీవిషయం ప్రస్తావించారు.అయితే ఆమె సానుకూలంగా మాట్లాడక పోవటమే కాక తన చెల్లెలిని చిన్నన్నయ్యకి చేసుకోమని అడిగిందట.నేను ఒకటి ఆడుగుతే దాని గురించి మాట్లాడక మరొకటి అడుగుతుందని మామయ్యకి కోపం వచ్చి మాట్లాడకుండా వచ్చేసాడు.నువ్వు ఆలోచించుకుని మరీ ముందుకి వెళ్ళు” అంది.
పెద్దక్కయ్యకు ఉత్తరం రాసి సలహా అడిగాను.
“సాహిత్యం మీద మోజుతో మాత్రం నిర్ణయం తీసుకోకు.అతని తోబుట్టువులంతా నీకంటే పెద్దవాళ్ళే.వాళ్ళందరినీ మెప్పించి సమర్థవంతంగా నీ వ్యక్తిత్వం నిలుపుకోగలవా ఆలోచించి అడుగెయ్యు.మీ ఇద్దరికీ పది పదకొండేళ్ళ వయసు తేడా ఉంటుందనుకుఃటాను.చూచి అన్ని విధాలుగా ఆలోచించుకుని చేసుకోవాలనే అనుకుంటే అతన్ని ఒకసారి రమ్మను. , ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకోకుండా మాత్రం నిర్ణయించు కోవద్దు. ” అని ఉత్తరం రాసింది అక్కయ్య.
ఈ లోగా అమ్మ అన్నయ్య లకు కూడా చెప్పింది.
నాకు ఏంచెయ్యాలో తోచలేదు.పెళ్ళి జరిగాక చదువు కొనసాగించేదెలా?చదువూ,ఉద్యోగం,నా కాళ్ళమీద నేను నిలబడాలి అని మిత్రులతో అన్ని కబుర్లు చెప్పినదాన్ని ఇలా తొందరపడుతున్నానా?అక్కయ్య అన్నట్లు ఆ యింట్లో నా ఆశలూ,ఆశయాలూ సాకారంచేసుకోగలనా? సాహిత్యం మీద నాకున్న ఆసక్తి నన్ను ఈవిధంగా బలహీనపరుస్తుందా?అన్నయ్యలు మీద నా బరువు బాధ్యతలు ఎన్నాళ్ళు మోపాలి? ఆయనే నన్ను చేసుకుంటానంటే ఒప్పుకోవటం మంచీదేకదా.ఎడతెగని ప్రశ్నలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.రోజులు గడిచి పోతున్నాయి.నేను సమాధానం ఇవ్వలేదు.
అమ్మ ఒకరోజు మళ్ళా ప్రశ్నించింది.”రమ్మని రాస్తున్నావా,ఏమిటి నిర్ణయించుకున్నావు అని.
మర్నాడు కాలేజీలో ఉషకి ఈ విషయాలన్నీ చెప్పి తనని కూడా సలహా అడిగాను.కాలేజీనుండి వస్తున్నప్పుడు దార్లో పోస్టాఫీసు కు వెళ్ళి ఒక కవరు కొనుక్కున్నా