25, జనవరి 2022, మంగళవారం
లేఖ
ప్రియమైన రాజీ
ఎలా ఉన్నావు?
ఈమధ్య ఫోనుల్లోనో, చాటింగ్ లోనో మనం ఎప్పటికప్పుడు కబుర్లు చెప్పేసుకుంటున్నాము కదా ఈ ఉత్తరం ఏమిటి అని ఆశ్చర్య పోతున్నావా?
నిజమే కానీ నిన్న చూసిన ఒక సంఘటన నన్ను నిలవనీయటంలేదు.నా బాధను అక్షరాల్లో పొదిగే వరకూ మనసుకు ప్రశాంతత చేకూరదనిపించి నీతో మనసు విప్పి పంచుకుందామని మనమధ్య యంత్రం మధ్యవర్తీత్వం లేకుండా ఉత్తరమే రాస్తున్నాను.
నిన్న ఉదయం నా కజిన్ సంధ్య భర్త మాసివ్ హార్ట్ ఎటాక్ తో చనిపోయారు.సంధ్య స్వంత చెల్లెలు ఉషా క్రితంనెల పిల్లల దగ్గరికి యూఎస్ వెళ్ళింది.సంధ్యచిన్నకూతురు ఇటీవలే యూఎస్ లో ఉద్యోగంలో జాయిన్ కావటంతో రావటానికి పర్మిషన్ లేక రాలేక పోయింది.దానికి తోడు కరోనా పరిస్థితులు.పెద్ద అల్లుడూ,కూతురు అదృష్టవశాత్తూ బదిలీ మీద ఢిల్లీ నుండి హైదరాబాద్ కి ఇటీవలే వచ్చారు.అందువల్ల వాళ్ళే అన్నీ చూసుకున్నారు.
అయితే ఫోనులో అంతా ప్రత్యక్షంగా చూడటానికి వీలుగా వీడియో ఆన్ చేసి ఒక అమ్మాయి పట్టుకుని కూర్చుంది.అందులోనే విదేశాల్లో ఉన్న సంధ్యచిన్నమ్మాయి,సంధ్య చెల్లెలు కళ్ళనీళ్ళతో చూస్తున్నారు.మనిషికి మనిషికీ మధ్య ఒక యంత్రమే ఈనాడు అనుసంధానం అవుతోంది.
ఇటువంటి సంఘటనే కరోనా సెకెండ్ వేవ్ లో మా అపార్ట్మెంట్ లోనూ జరిగింది.ఒకామె విజయవాడ నుండి కూతురు డెలివరీ కోసం వచ్చింది.ఆమె కొడుకులు ఇద్దరూ విదేశాల్లో ఉన్నారు.కూతురు ఉద్యోగస్తురాలు కావటం వలన డెలివరి అయ్యాక మరికొన్నాళ్లు సాయంకోసం ఇక్కడే ఉండి పోవాల్సివచ్చింది.అంతలో తల్లీ కూతురూ కరోనా బారిన పడ్డారు.తల్లికి సీరియస్ అయ్యి దురదృష్టవశాత్తు మృతి చెందింది.కొడుకులకు రావటానికి కుదరలేదు.కూతురు కోవిడ్ పేషెంట్.ఆమె అనాధప్రేతంలా అయ్యింది.ఆ కార్యక్రమం కూడా అలాగే వీడియో తీసి పంపారట.ఇటీవల ఈ కరోనా పరిస్థితుల్లో ఇటువంటి దృశ్యాలు ఎన్నో.ఆత్మీయులైనవారిని దగ్గరకు తీసుకుని ఓదార్చటానికి కరోనా స్పర్శకు దూరం చేసింది.దూరంగా ఉన్నవారు రావటానికి లేకుండా పోయింది. చివరి రోజుల్లో సంతానం రాల్చే రెండు కన్నీటి బొట్లను కూడా నోచుకోని స్థితి. దాపురించింది.
పూర్వం ఉమ్మడి కుటుంబాల వలన ఒకరికొకరు సాయం ఉండేవారేమో.ఇప్పుడు న్యూక్లియర్ కుటుంబాలు కావటం రెక్కలొచ్చిన పిల్లలు వారి భవిష్యత్తు దిశగా ఎగిరిపోవటంతో తల్లిదండ్రులు ఒంటరి వాళ్ళయిపోతున్నారు.
పిల్లలకోసం ,వాళ్ళు అభివృద్ధి కోసం తల్లిదండ్రులు తమ జీవితమంతా వెచ్చిస్తారు. పిల్లలంతా చదువులకోసమో,ఉద్యోగాలకోసమో విదేశీ బాట పడుతున్నారు.అందులో వాళ్ళనీ తప్పు పట్టటానికి లేదు.వారి భవిష్యత్తు వారిదే కదా.వాళ్ళ అభివృద్ధికి పెద్దలు అవరోధం కాకూడదు కదా.
ఎటొచ్చీ ముఖ్యంగా తెలుగు ప్రాంతాలలోని చాలాఇళ్ళు వృధ్ధాశ్రమాలలా వృధ్ధులతో మిగిలిపోతున్నాయి.ఎంత దురదృష్టం కదా?మాటిమాటికీ పిల్లలు లేరని చివరి రోజులు ఎలా గడుస్తాయోనని నువ్వు బాధ పడుతుంటావు. ఉన్నవాళ్ళపరిస్థితి చూస్తున్నావు కదా రాజీ.
మనచుట్టూ వున్నవారు,మనం ప్రేమించిన వాళ్ళు, మనని ప్రేమించినవాళ్ళే మనవాళ్ళు.
రాజీ ఇప్పటి ఈ కరోనా కాలంలో ఈ స్థితి మరింత దారుణంగా అనిపిస్తోంది.మనుషులమధ్య భౌతికంగానే కాదు రానురాను మానసికంగానూ దూరం పెరిగి పోతుందేమో అనిపిస్తుంది.
నువ్వు కూడా ఇటువంటి దృశ్యాల్ని మరెన్నో చూసే ఉంటావు.నీ అభిప్రాయం కూడా తెలియజేస్తావు కదూ.
మరిక ఉండనా
ప్రేమతో
సుభద్ర.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)