20, ఏప్రిల్ 2021, మంగళవారం

నడక దారిలో-4

  నడక దారిలో--4


   మా నాన్నగారు పోయిన తర్వాత ఏడాదికి 1961 లో మా పెద్ద అన్నయ్య కు శ్రీకాకుళం జిల్లా లోని కోటబొమ్మాళి అనే ఊరు లోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల లో టీచర్ గా ఉద్యోగం వచ్చింది.మా రెండో అన్నయ్య  వైజాగ్ లో  హాస్టల్ లో ఉండి చదువుకునే వాడు.

           అమ్మా,మా రెండో అక్కా నేను విజయనగరం నుండీ రైల్లో బయలుదేరి రామచంద్రాపురమో, హరిశ్చంద్రాపురమో గుర్తు లేదు,అక్కడ దిగి ఎడ్లబండి లో కోటబొమ్మాళికి బయలుదేరి వెళ్ళాం.అప్పటికి కోటబొమ్మాళి కి బస్సు కూడా లేదు.దారంతా గతుకుల రోడ్డు మీద ప్రయాణించి వెళ్ళాం.ఊర్లోకి అడుగు పెట్టగానే ఎడ్లబండి తిరగబడి నాకు పెదవి చిట్లి రక్తం ముఖం అంతా అలుక్కుపోయింది.నన్ను రెండు చేతులమీదుగా ఎత్తుకుని ఆ పక్కనే డాక్టర్ దగ్గరకు తీసుకు వెళ్ళారు.నొప్పి తగ్గటానికి డాక్టరుగారు ఇంజెక్షన్ ఇవ్వబోతే కళ్ళు తిరిగి పడిపోయాను.ఆ  డాక్టరుగారి అబ్బాయి నా క్లాస్ మేట్.అతని అక్క నాకు పాటలమేట్.అందువల్ల అప్పుడప్పుడు ఆ అమ్మాయి దగ్గర కు పాటలసాధనకు వెళ్ళేదాన్ని.నన్ను చూసి డాక్టర్ గారు ఇంజెక్షన్ ఇవ్వాలా అంటూ వేళాకోళం చేసేవారు.

           ఆ ఊరులో అప్పట్లో రెండే సమాంతరంగా ఉండే వీధులు.ఒకటి బ్రాహ్మణ వీథి.రెండోది కోమట్లవీథి.ఇతర కులాల వారు మరి ఎక్కడ నివసించేవారో నాకు తెలియదు.బ్రాహ్మణ వీథిలో మాకు ఇల్లు అద్దెకి  ఇవ్వరు కనుక కోమట్లవీధీ లోనే మరి మాకు ఎలా ఇచ్చారో తెలియదు గానీ ఒకేగది ఇల్లు అద్దెకు తీసుకుని అందులో ఉండే వాళ్ళం.గది వెనుక ఒక వసారా ఉండేది అక్కడే వంట చేసుకునే వాళ్ళం.తర్వాత పెద్ద తోట అందులో పంపర పనాస,జామ వంటి పళ్ళ చెట్లు ఉండేవి కానీ వాటి మీద చెయ్యి వెయ్యటానికి వీల్లేదని వార్నింగ్ ఇచ్చారు ఇంటి వాళ్ళు.ఆ యింటి వీధి తలుపు నిండా ఇత్తడి గుండ్లు అలంకారంగా పొదిగి ఉండి రాజులకోట గుమ్మంలా బహు దర్జాగా అందంగా ఉండేది.

              ఇంటి గది పైన సరంబీ ఉండేది.దానికి చిన్న తలుపు ఉండేది.ఇంటివాళ్ళసామాన్లు ఇత్తడి అండాలూ,పెద్ద పెద్ద గిన్నెలు వంటివి అందులో ఉంచేవారు.అవసరమైనప్పుడు నిచ్చెన సాయంతో సామాను దించేవారు.

        నాన్నగారు పోయిన తర్వాత నన్ను ఆరో తరగతి తో చదువు మానిపించారు కదా ఇక్కడ అన్నయ్య పని చేసే జిల్లా పరిషత్ స్కూలు లో ఏడో తరగతి లో జాయిన్ చేశారు.

        కోటబొమ్మాళి ఊరులో ఎవరింట్లోనూ  మరుగుదొడ్లు లేవు.దూరంగా ప్రహారీ కట్టిన బహిరంగ ప్రదేశం మహిళల కోసం ఉండేది.చిన్నబకెట్ తో నీళ్ళు పట్టుకుని వెళ్ళాల్సిందే.స్నానం మాత్రం పెరట్లోనే చేసేవాళ్ళం.ఇప్పటి కైనా ఆ వూర్లో అందరి ఇళ్ళకీ మరుగు దొడ్లు వచ్చాయో లేదో మరి.

       ఊరికి చుట్టూ కొండలు ఉండటంవల్ల ఎలుగు బంట్లు రాత్రిపూట ఊర్లోకి వచ్చేసేవి. అందుకని రాత్రంతా డప్పులు వాయిస్తూ కాగడాలతో కాపలా ఉండేవారు.పాములు సరేసరి రాత్రీ పగలూ తిరుగు తూనే ఉండేవి.ఒక్కొక్కప్పుడు సరంబీ లోకి కూడా ఎలుకలు కోసం పాములు కూడా  వచ్చేవి.

       ఊరులోని ఆడవాళ్ళు రోజంతా రకరకాల అప్పడాలు, వడియాలు, సకినాలు వంటివి తయారుచేయటం, (శ్రీకాకుళం జిల్లాలో రకరకాల అప్పడాలు ముఖ్యంగా పేలాలు అప్పడాలకు ప్రసిద్ధి) వంటి ఇంటిపనులు చేస్తూ ఉండే వారు.పెద్దగా బయటకు కనిపించే వారు కూడా కాదు.బడిలో ఏ క్లాసులోనూ అయిదారు మందికన్నా ఆడపిల్లలు ఉండేవారు కాదు.వారు కూడా అగ్ర వర్ణాల పిల్లలే.

           కొన్నాళ్ళ క్రితం  HJ దొర అనే ఐ.పీ.ఎస్ ఉండే వారు కదా.అతను నాకు జూనియర్  క్లాసులోనూ, అతని సోదరి నాకు సీనియర్ క్లాసులో ఉండేవారు.బడికి రోజూ టాంగా మీద వచ్చే వారు.దొరగారి అమ్మాయి అంటూ ఆమెని స్కూల్ లో అందరూ అపురూపంగా చూసేవారు.

        ఒకసారి బళ్ళో పాటలు పోటీ  పెట్టారు. పాటల పోటీలో నాకు ఫస్ట్,ఆమెకు సెకెండ్ అని అనౌన్స్ చేసి , తర్వాత స్కూలు డే రోజున ప్రైజులు తారుమారు చేసారు.

       ఒకే గది ఇల్లు కావటాన   మా అన్నయ్య రాత్రి భోజనం చేసి బడి లోనే పడుకోటానికి వెళ్ళిపోయే వాడు.అప్పుడప్పుడు స్కూలు లైబ్రరీ నుంచి మునిమాణిక్యం కాంతం కథలు, శ్రీపాద కథలు వంటివి కాక ప్రభ, పత్రిక తీసుకువచ్చే వాడు.అప్పటికే పుస్తకాలు చదవటం అలవాటు కనుక చదువుతూ ఉండేదాన్ని ప్రభలోని రంగనాయకమ్మ గారి కూలిన గోడలు సీరియల్ వచ్చేది అది అమ్మకి చదివి వినిపించే దాన్ని.అందులోని కొన్ని సంఘటనలు మా జీవితానికి దగ్గరగా అనిపించేవి.అది చదువు తున్నప్పుడు అమ్మ కూడా మా కుటుంబాలలో జరిగిన ఎన్నెన్నో సంఘటనలు చెప్పేది.

     1962 లో అమ్మ పెద్దక్కయ్య పురిటి కోసం సాయానికి అనకాపల్లి వెళ్ళింది.

     మా చిన్నక్కకూ, నాకూ సాయంగా షణ్ముఖ రావు అనే అబ్బాయిని రాత్రి పూట అన్నయ్య ఏర్పాటు చేసాడు షణ్ముఖ రావు తొమ్మిదో,పదో తరగతి చదివేవాడు.భోజనం అయ్యాక కిరోసిన్ దీపం చుట్టూ చిన్నక్క, షణ్ముఖ రావు, నేను చదువు కునేవాళ్ళం.చదువయ్యాక షణ్ముఖ రావు రాజు-పేదా సినీమా కథ సీరియల్ లా చెప్పే వాడు.రాత్రి అయ్యింది పడుకోమని చిన్నక్క కోప్పడితే పడుకునే వాళ్ళం.ఆ రోజుల్లో కనుక ఒక అబ్బాయి ని ఇద్దరు ఆడపిల్లలకు సాయంగా రాత్రి పూట పంపించ గలిగారు.ఈ రోజుల్లో అది సాధ్యమా.తలంచుకుంటే ఆశ్చర్యం కలిగిస్తుంది.

     అప్పట్లోనే అష్టగ్రహకూటమి ఏర్పడి భూగోళం అంతమౌతుందని ఒక పెద్ద సంచలనం.తేదీ గుర్తు లేదు కానీ స్కూలు కూడా రెండురోజులు సెలవు ఇచ్చేసారు.షణ్ముఖరావు మా ఇంటికి ఆరెండు రోజులూ సాయానికి రాననీ పోతే మాయింట్లోనే పోతాననీ ఏమీ జరగకపోతే ఆ తర్వాత నుండీ వస్తానన్నాడు.ఆ రెండు రోజులుగడిచాక అంతా మామూలే.అష్టగ్రహ కూటమీ లేదు ఏమీ లేదు. ఇప్పుడు షణ్ముఖ రావు ఎక్కడ ఉన్నాడో. 

     1962 లో చైనా భారత్ పై యుద్ధానికి దిగింది.ఆ సందర్భం లో రేడియోలో ప్రజల్ని ఉద్దేశించి ప్రధాని నెహ్రూ గారు గద్గద కంఠంతో మాట్లాడారని చెప్పుకునేవారు.  స్కూలు లో మాష్టార్లు రోజూ దినపత్రిక లో యుద్ధం విశేషాలు ప్రార్థన సమావేశంలో చెప్పేవారు.ఆ యుద్ధంలో చైనా ఆక్సాస్ చిన్ అనే ప్రాంతాన్ని ఆక్రమించిందట.చైనాకూ భారత్ సరిహద్దు ప్రాంతాలైన సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ లలో చాలాకాలం పాటూ ఘర్షణలు చెలరేగేయని రోజూ చెప్పేవారు. దేశభక్తిని రగుల్కొల్పే ఎన్నో పాటలు నేర్చుకున్న జ్ణాపకం.

          శ్రీకాకుళం ప్రాంతాలలో మాత్రమే "నేస్తం కట్టడం" అనేది పధ్ధతో,సాంప్రదాయమో మరి చూసాను.మా తరగతిలోని నా స్నేహితురాలు ఒకరోజు మనం నేస్తం కడదామా అని అడిగింది.అంటే స్నేహం గా ఉందామని అడిగింది అనుకుని సరే అన్నాను.నన్ను ఆ పక్కనే ఉన్న చిన్న గుడి కి తీసుకెళ్ళి నాకు ఇప్పుడు గుర్తు లేదు కానీ  ప్రమాణం వంటిది చేయించింది.నేస్తం కట్టిన వాళ్ళు ఒకరినొకరు జీవితాంతం స్నేహబంధం కి కట్టుబడి ఉండాలి.ఒకరినొకరు మీరు అని మన్నించు కోవాలి.ఒకరిపేరు ఒకరు ఉఛ్ఛరించకూడదు.ఇలా ఏవో చాలా నిబంధనలు ఉన్నాయి.ఐతే  రెండేళ్ళు మాత్రమే అనుబంధం ఉన్న కోటబొమ్మాళి వదిలిన తర్వాత   కుటుంబంలో వచ్చిన ఆటుపోట్లతో ఆ విషయమే మర్చిపోయాను.

       ఇటీవల వ్యాసం రాయటానికి నిడదవోలు మాలతి గారి కథలూ చదువుతుంటే ఒక కథలో ఈ ప్రస్తావన ఉంది.దాంతో అవన్నీ గుర్తు వచ్చాయి .ఇంతకీ నా నేస్తం ఎలా ఉందో!!? మళ్ళీ ఒకసారి కోటబొమ్మాళి వెళ్ళి రావాలని ఉంది.


---- శీలా సుభద్రాదేవి