21, అక్టోబర్ 2017, శనివారం

      రెప్ప ముడవని రాత్రి

బంగారుసంకెళ్ళు వేసినట్లుగా
ఇంటిచుట్టూనే కాకుండా
మనసుచుట్టూ కూడా
ఎటూ కదలనీకుండా చేసిన
జరీజలతారు తెరలవాన
ఏమీ తోచనీయని సోమరితనం
పరన్నభుక్కులా మనసులోని చైతన్యాన్ని పీల్చేసి
నిలువెల్లా అల్లుకుపోతోంది
అంతవరకూ కంటిరెప్పల్ని పట్టుకు వేలాడుతోన్న
కన్నీటీబిందువు జారుతూ జారుతూ 
నిద్రని కూడా తనతోబాటూగా లాక్కెళ్ళీ
ఎక్కడ జార్చేసిందో ఏమో కనిపించకుండా పోయింది

ఇంకేం చేయాలి?
ఏదో ఒకటి చేయకా తప్పదు
నాలోకి నేనే లోలోతుగ
మనసుచీకటి గుహలలోకి
ఆలోచన్లు వెలిగించుకొంటూ
అరవై ఏళ్ళకు పైగానే ఎదిగిన గతం తీగను
కొసలాక్కుంటూ నాకునేనే చుట్టుకుంటూ
భారంగ అడుగులు కొలుస్తున్నాను
ఇంక డొంకంతా కదిలింది
నిద్రాణం లో వున్న గాయాలతుట్ట రేగింది
అంతే
ఝుమ్మంటూ బాధలతేనెటీగలు
నిలువెల్ల అమాంతం దాడీచేసాయ్
వాటినుండి తప్పించుకునేందుకు
జీవితాన పూసిన చిరుజ్ఞాపకాలతో  
వెలిగించిన కాగడాని విదిలించాను
కాళ్ళముందు వెలుగుచాప పరచుకుంది
అంతవరకు పాదాల కింద నిప్పులు రాజేసిన 
మంటల్ని వూదుకుంటూ
కాలినగాయాల్ని మాంపుకున్నాను
ఇంకా  ఇంకా ఆరిపోతోన్న ఆలోచనల కాంతిరేఖల్తోనే
చీకట్లని  చీల్చుకుంటూ
లోలోపలికి చొచ్చుకు పోతునే వున్నాను
అంతలోనే  ఏమూలనుండో   కళ్ళకు మిరుమిట్లుగొలుపుతూ
దూసుకువచ్చిన  సూర్యకిరణం తాకేసరికి   
జలదరించిన శరీరాన్ని
వెచ్చని వెలుగుతో స్నానించి
తెరల్ని చీల్చుకుంటూ
వెలుతురు పిట్టనై ఒక్కసరిగా
ఎగిరేను