19, ఏప్రిల్ 2015, ఆదివారం


‘’నా ఆకాశం నాదే ‘’
ఆకాశం లో సగం స్త్రీ మూర్తిదే .అందుకని ‘’నా ఆకాశం నాదే ‘’అనే హక్కు అమెకున్నది .ఈ హక్కుల పత్రమే శ్రీమతి శీలా సుభద్రా దేవిగారి ‘’నా ఆకాశం నాదే ‘’కవితాసంపుటి . సుభాద్రాదేవిగారి కవిత్వం పై  స్పందించిన సుప్రసిద్ధ రచయిత్రి విశ్లేషకురాలు డా .కాత్యాయనీ విద్మహే ‘’నా కృషి కురుతే కావ్యం ‘’ అనే భావాన్ని ఎక్కించుకొని కొత్తజన్మ ఎత్తని వాళ్ళు హేతువాదిగా ,సమతా వాదిగా కాలేరు .సుభద్రా దేవిగారిది కులమతాలకు అతీతమైన భావన .బాల్యం కోల్పోయినవారిని ,బతుకును క్రీడగానో ,కలగానో మార్చుకొన్న వాళ్ళను ,ఆర్ధిక దౌర్భాగ్యాలకు విలవిల లాడే మధ్య తరగతి వాళ్ళ ఆరాట ,పోరాటాలకు దిగిన వాళ్ళను గురించి రాశారు ‘’అన్నమాటలు ఇక వేరెవరూ అదనంగా చెప్పాల్సిన అవసరం లేదనిపించేవే .కనుక నా పని చాలా తేలికయినది .ఈ సంపుటిలో 34 కవితలు వివిధ శీర్షికలతో ఉన్నాయి ఇవి వివిధ పత్రికలో ముద్రణ పొందినవే ..అన్నీ అర్ధ వంతమైనవే నని పిస్తాయి చదువుతూ పోతుంటే .ఒక విహంగ వీక్షణం వేద్దాం .
తల్లి ‘’తులసి కోట దగ్గరే కొడి గట్టిన దీపమయ్యింది ‘’ఇక ఇంటి బాధ్యతా ఈమెదే .కొత్తబిచ్చగాడు పొద్దేరగడన్న సామెతగా ఆశాకిరణాలతో అంతా అలంకరించింది .’’ముళ్ళకు తాకిన పాద ముద్రల్ని అద్ది ‘’ అరుణారుణ రంగ వల్లికలతో’’ముంగిలి అలంకరిం చింది .మరి ‘’ఆశే కదా జీవితానికి పునాది !’’అని వేదాంతమూ వచ్చింది .’’రూపాంతరాలు చెందుతున్న మహిళల వెతల్ని విసిరిపారేయటానికి  ‘’పూనుకొని కొత్తతరాన్ని స్వాగతి౦చ టానికి సిద్ధమైంది .’’ఇక తూర్పువాకిలి తెరవటమే తరువాయి ‘’గా మిగిలింది అంటారు ‘’కొత్త పొద్దు ‘’అనే మొదటికవితలో .
naa aakasham nade 2 001 naa akasham nade -1 001

మగాళ్ళు ‘’మృగాళ్ళు ‘’గా చెలామణి అవుతూ విర్రవీగి వీధుల్లో తిరుగుతుంటే ‘’తల్లినీ సోదరినీ కూడా గుర్తించని కామం పొగమంచు ‘’ప్రపంచ దేశాల మీదుగా కప్పేసి౦దన్నారు .ఈ మృగాలు గ్రామాలు దాటి నగర ప్రవేశం చేస్తుంటే సుభద్రా దేవిగారికి ‘’యుగాంతం వచ్చినట్లే ‘’అనిపించింది ఇది సహజం .మాదక ద్రవ్యాలు ,కాలుష్యాలు ,సోదరిభావనే లేని కర్కోటక కీచకులు పెట్రేగి పోతున్నప్పుడు యుగాంతం వచ్చిందనే అనుకోవాలి .’’అనేకానేక బందురూపాలన్నీ కలగలసిపోయి –ఒకే ఒక్క మగాడిగా మాత్రమే తనను తానూ మలచుకోన్నప్పుడు ‘’ఆడది అనేది సుఖానికే కాని దేనికీ కాదనే భావం ప్రబలమై గర్భం లోనే చిదిమేస్తున్న వికృత పోకడలు పెరిగిపోయినప్పుడు ,రేపటి కాలం లో ‘’అద్దెకి కూడా గర్భం దొరకని కార్యేషు దాసుల ‘’గూర్చి ఆలోచించాల్సిన అవసరం వచ్చింది అన్నారు .ఇవన్నీ యుగా౦తా నికి సూచనలే అని తెలియ జెప్పారు .యుగా౦తా నికి గ్రహగతులు తప్పనక్కర లేదు  ,భూకంపాలు రానక్కరలేదు .’’రేపు కాకపొతే మరో రోజు పునరుత్పత్తి ఆగిపోతే –‘’అదే యుగాంతం కాదా ?అని ప్రశ్నించారు .నిజమే మిలియన్ డాలర్ల ప్రశ్న ఇది .దీనికి మనమందరం సమాధానం ఆలోచించాలి .బాధ్యతా వహించాలి .మౌలిక ప్రశ్న ఇదే ఇప్పుడు .
‘’ రేపటి తోలి వేకువ కోసం  నవ చైతన్యం తో ఆహ్వాన గీతికల్ని ‘’ఆలపించి స్వాగతి౦చటానికి పూనుకొంటే ‘’నిద్ర అమ్మైతన ఒడిలోకి –పొదుగు కొని తననీ తన ఆలోచనలను జోకోడుతుందోనని  ఒక ‘’ఉదయం కోసం ‘’ ఎదురు చూసే భావ చిత్రం గీశారు .’’స్పందన జీవ లక్షణం ‘’అని తెలియ జేస్తూ ‘’కనబడని రాతి గుండెని శరీరం లో దాచి –రాతి ముఖానికి మొసలి తొడుగు తగిలించి –జనాల మధ్య తిరిగి కార్చే కన్నీళ్లు ‘’ఉత్త ఉప్పు  నీళ్ళే కాని తన కోసం చెమర్చేవి కావు ‘’ అని హెచ్చరిస్తారు .’’నీకు నువ్వే ఆసరావై –మరొకరి చేతికి కర్రవై బతుకు, బతికించు –‘’అని సలహా చెప్పి రాతి మొకాన్ని మాత్రం తగిలించుకొని కనపడవద్దన్నారు .క్రికెట్ ఆటల్లో మజా అనుభవిస్తూ ,ఉద్రేకం తో నరాలు తె౦పు కొంటూ ఊగిపోతూ  డబ్బూ సమయం వ్యర్ధం చేసుకొనే వ్యసన పరులకు కూడా గాఢ హెచ్చరిక జారీచేసి ‘’గెలుపోటములు ముందే నిర్ణయమై పోయి –ఎవరు గెలిచినా ఎవరు ఓడినా –లాభ పడేది వాళ్ళే ‘’అంటే మాచ్ ఫిక్సింగ్ మాన్స్ ఫీల్డ్ లే బెట్టింగ్ అప్పారావు లే  అన్న నవీన క్రికెట్ సత్యాన్ని తెలియ జెప్పారు .ఇవన్నీ ‘’మెత్తటి ఉరి తాళ్ళు ‘’అని సార్ధక నామధేయం తగిలించారు .’’మాచ్ ఫిక్సిం గ్  రాజకీయ క్రీడలో –వెర్రిబాగుల  ప్రేక్షకులమై పొతే –మన మెడలకు కూడా క౦డువాలే ఉరి తాళ్లై మెత్తగా బిగుసుకొంటాయ్’’కనుక తస్మాత్ జాగ్రత్త –జాగ్రతోం జాగ్రత  . ‘’కవిత పేపరు మీద వాలితెకాని –నిద్రా దేవి రెప్పల పాన్పు పై విశ్రమించదు’’అని ‘’ఆలోచనకీ అక్షరానికి మధ్య’’ సంబంధం తెలుపుతూ ‘’అక్షరాలు మూటకడితేకాని అంతరాత్మ శాంతించదు’’అన్న ‘’కవి సత్యాన్ని’’ చెప్పారు .రాచకీయ నాయకమ్మన్యుల ప్రలోభాలకు వాగ్దానాలకు మెరమెచ్చులకు లొంగిపోయి చేతనున్న ఆయుధాన్ని విసిరిపారేసే ‘’నిరాయుదులం కాము ‘’అంటూ ‘’గోటి తోనో ఓటు తోనో ‘’వారి వాగ్దానాల బుడగల్ని ‘’టుప్’’మనిపించే సమర్ధులం అని  వార్నింగ్ ఇచ్చారు .
తనకు ఏ భావననైనా ప్రకటించుకొనే సావకాశం లేదట .లోపల సముద్రాలు గర్జిస్తాయి .అగ్నిపర్వతాలు బద్దలవుతూ ఉంటాయి .లావా ఎగసి పడుతూనే ఉంటుంది .కాని వీటిని తెలుసుకోవాలంటే  గుండె  మీద వాలి వినాలి లేకపోతె అక్షరీకరించుకోవాలి .అంతేకాని మొగానికి ఆ భావాలను అతికి౦చు కోలేదట .అందుకే ‘’వేదనో నిర్వేదమో అంటూ చిక్కని ‘’మోనాలిసా చిరునవ్వు’’ లోని చిదంబర రహస్యాన్ని నేను ‘’అని చాలా భావ గర్భితం గా చెప్పారు .
‘’పుస్తకం శీర్షిక కవితాశీర్శికయే ‘’నాఆకాశం నాదే ‘’లో తన ధోరణిలో తనను నడవనిమ్మని ,ఏ దృష్టి కోణాన్ని ఏ రంగటద్దాలని తగిలించవద్దని ఏ ఛట్రం లోనూ బంధించవద్దని  వేడుకొంటారు సుభద్రాదేవి .’’రాత్రి పొడువునా సాహితీ బయళ్ళలో స్వేచ్చావిహారం చేయాలను ‘’కొంటారు .’’నాచేతనైనట్లు నాకోసం నేను –అచ్చంగా నాది అనుకొనే స్వంత గడ్డపై ‘’విహరిస్తుంటే తన వెనక పరుగేమిటి? అని నిలదీస్తారు .’’చెమ్మగిల్లిన గింజల్ని ఏరుకోన్నట్లు –పదాల్నియేరు కోవటమే ‘’తానూ చేస్తున్నాని నిజాయితీగా ప్రకటించారు .బక్క రైతు వేదన ,అహంకార బలదర్పాలకు బలి అయిన మూగ జీవి వేదన, స్వార్ధపు పెనుకోరల్లో చిక్కి విలవిల లాడే అభాగ్యునికి ఊరట తన కవితా వస్తువులని ‘’ఈ దృశ్యాల్ని సాహిత్యం లో అల్లుకొనే గూటి పక్షిని ‘’అనీ అంటారు .గూటి పక్క ఆకుపచ్చని కొమ్మపై కూర్చుని తానూ ఆలోచల్ని ఆలాపిస్తుంటే ‘’ఏ పంజరం లోనో బంధించి –ఏ చూరుకో వేలాడ దీయాలని ‘’చూడవద్దంటారు. తన స్వేచ్చ తనకు కావాలనిదానికి హద్దులు పెట్టవద్దని ‘’ కరాఖండీగా చెప్పిన తెగువ సుభద్రా దేవిగారిది .ఏ ఇజం ముద్ర తనకు తగిలించవద్దని కోరిన మనస్తత్వం ఆమెది  .తనకు అందరూకావాలి అందరికీ తానుకావాలనే విశాల హృదయ .
‘’కాలుష్య సంస్కృతిని ఎలాకాల్చాలో –అక్షరాల్లోనైనా అస్తిత్వ పోరాటాల్లోనైనా  ‘’కలిసి నడుద్దాం అంటూ ‘’కాసింత కలం అందివ్వండి ‘’అని సాయం కోరారు. అక్షర జీవుల్ని ఆసరాగా నిలవమని ప్రబోధమే అది .’’ఒక వర్షం లో మూడు దృశ్యాలు ‘’చూశారు సుభద్రా దేవి .ఏసీ రూమ్ లో బతుకు కోసం ఆడే అమ్మాయి శరీరాన్ని తలపోస్తూ ‘’రాక్ సంగీతం లో వంపులు తిరుగుతోందట వర్షాధార .అద్దాల్లోంచి చూస్తె త్రీడీ ఫోటోగ్రాఫ్ గా మనసుకు ఆహ్లాదమిస్తోంది . రెండో సీన్ లో చెట్టు నీడలోనో  చూరుకిందో గడిపే అమ్మాయి –‘’వర్ష ధార చుర కత్తి అయి చల్లగా శరీరాన్ని కోస్తోంది –బతుకు బట్ట చాటున గుండె కుంపటి రగిల్చి –కళ్ళ దీపాలని వెలిగించుకొంటూ ‘’ జీవన యానాన్ని ఆపకుండా ‘’జొన్న పొత్తుల చిటపటలతో చలిని తరిమి కొడుతోంది ‘’ఒక ముసలిది .ఉరమబోయిన మేఘం ‘’కళ్ళనిండా మెరుపుతో –ఓ నిమిషం విస్తుబోతూ ఆగిపోయింది .’’శ్రీశ్రీ భిక్షు వర్షీయసి మనకిక్కడ జ్ఞాపక మోస్తుంది .
మూడో దృశ్యం –నట్టిళ్ళలోకి కాలనాగై జరజరా పాకి అర్ధ రాత్రి ఆక్రమి౦చుకోటానికి  వస్తున్న వర్షపునీరు కూడా ‘’అతలాకుతలం అవుతున్న కుటుంబాల్ని చూసి కంట తడిపెట్టుకొన్న ఇళ్ళు సైతం  జలజలా నీటిని కురిపిస్తున్నాయి .ఈ మూడు దృశ్యాలను వైవిధ్యం తో కళ్ళకు కట్టించి రూపకాలంకారానికి పట్టం కట్టి కనువిందు మనసుకు విందు కవిత్వపు పసందు కూర్చారు .తన ప్రతిభా వ్యుత్పత్తులు బహుమతులు తెచ్చిపెట్టాయి .ఇవి వ్యక్తిగతం కాకుండా తన సామాజిక వర్గానికే చేసిన మతలబు ఏమిటో అర్ధం కాలేదట సుభద్రా దేవిగారికి .అందుకే శీర్షిక ‘’!’’అయింది వింతగా విశేషంగా .వార్ధక్యానికి కూడా వార్నింగ్ ఇచ్చారు –‘’నిస్త్రాణగా సొమ్మసిల్లిన శరీరానికి సైతం –ఉత్తేజాన్ని డయాలిసిస్ చేసినట్లు –మనసూ శరీరమూ ఉరకల లెత్తుతున్నాయ’’ట .అందుకే అక్షరాలతో ఆడుకొనే ,సాహిత్యం తో సరాగాలు పాడుకొనే తమ జోలికి వార్ధ్యక్యాన్ని  రావద్దన్నారు .తమవద్ద దాని పప్పులేమీ ఉడకవని తెలిపారు .
‘’అస్తిత్వం కోసం ఆరాటపడటం మంచిదే –‘’కాని దానినే పైకి ఎక్కే మెట్లుగా మార్చుకోవద్దని మంచి సలహా చెప్పారు .ఆ సోపానం ఎక్కి ‘’అడ్డ దార్లు తోక్కితేనే తంటా’’అనీ హెచ్చరించారు. లోకం పోకడ గమనించి చేసిన హెక్చరికేఇది .’’పరిమళ ప్రస్తారం ‘’కవితలో సుభద్రా దేవి ‘’ఆడ దాన్నో ఈడ దాన్నో మాత్రమె కాదు –సాహిత్య సుగంధాన్ని దోసిట్లో తీసుకొని –హృదయాలకు హత్తుకొనే అన్ని ప్రాంతాల దాన్నీ ‘’అని తాను  అందరకు చెందిన దానినని చాటి చెప్పుకొన్నారు ‘’ఈ నేల మీదికి పాకే భూ గంధాన్ని –పరిమళించే కవితా పుష్పాన్ని –శిలగా కాదు –శబ్దించే శిలాక్షరాన్ని –(శీలా క్షరం ?)ఎప్పటికీ అలానే ఉంటాను ‘’అని వాగ్దానమూ చేశారు .తన ప్రయాణం ఎటో అనే సందేహం లో ఊగిపోయారు ‘’ప్రయాణం ‘’కవితలో. తాను  వెతుకుతున్నది తనలోని తాత్విక చి౦తననా లేక చింతనకు దూరమౌతున్న తాత్వికతనా?అని మధన పడ్డారు .ఇది పక్వ దశకు సూచనగా మనం బావించాలి .సాహిత్య యానం లో మరిన్ని మైలు రాళ్ళను ప్రతిస్టించు కోవాలని ఆకాంక్ష ఉంది ఆమెగారికి .అందుకోసం రెండవ బాల్యం లాగా ‘’మళ్ళీ మొదలుపెట్టాల్సిందే‘’అని చెప్పి ‘’నిరంతర నిర్విరామ చైతన్య శీలత్వం కలిగిన వాడే మనిషి ‘’అని గొప్ప నిర్వచనం చేశారు .
‘’ చీడ పీడలు పట్టిన సమాజం చెట్టుని –ధర్మాగ్రహం తో సమూలంగా పెకలించేందుకు ‘’నాలుగు చేతులూకలిసి గునపం గా మారాల్సి౦దేనంటారు .చిరుకదలిక కోసం పాళీకి మరింత పదును పెట్టాల్సిందే –కలిసి నడవాల్సిందే ‘’అంటారు ‘’ధర్మాగ్రహం ‘’లో .’’మాట’’ఎన్నిరూపాలు చెందుతుందో చెబుతూ ‘’సమస్యల చిక్కుల్లో చిక్కుకున్నప్పుడు ముడులు విప్పి బయట పడేస్తుంది మాట .జీవిత నౌక తుఫానులో చిక్కుకోన్నప్పుడు తెరచాపై వాలుకు తీసుకొని వెడుతుంది .దుఖం తో తడిసి ముద్ద అయినప్పుడు చల్లని హృదయమై సేద తీరుస్తుంది .బాధల ఎర్రటి ఎండకు గొడుగై నీడనిస్తుంది .మనుషుల మధ్య వంతెనై కలుపుతుంది.అల్లు కున్న స్నేహలతకు విచ్చుకొన్న పరిమళ మవుతుంది .మనసుని మైమరపించే వెన్నెల సోన అవుతు౦ది .మాట.ఒక్కో సారి గుండెల్ని ముక్కలు చేసే తప్పుడు మాట అవుతుంది .హృదయాన్ని మధించే కవ్వమవుతుంది .పచ్చని బతుకుల్ని బుగ్గి చేస్తుంది. కనుక మాటను జాగ్రత్తగా వాడాలి .
‘’పరాయీకరణ ‘’ను గురించి బాధ పడుతూ ‘’నేనెక్కడో తప్పిపోయాను ‘’అని చెంప దెబ్బ కొడతారు .’’నాలోంచి నేను తప్పి పోతూనే ఉన్నాను .శూన్యం ఆవరించింది దాన్ని. నింపే ప్రయత్నం లో ‘’నాలోకి నేను నా ప్రయత్నం లేకుండానే చొచ్చుకు పోతున్నాను ‘’అని కలవర పడ్డారు .చివరికి ‘’ఈ కొత్త మేనుతో –నేను మనిషిని కాకుండా పోతున్నానా ?’’అని ఆవేదన వ్యక్తం చేస్తారు .ఆమె ఆరాటం మన౦దరిఆరటమే.మనమనసుని ఆమె అక్షరాల్లో ఆవిష్కరించారు అంతే .    ఈ రెండు సంపుటులలోని కవిత్వం ఒకే నాణానికి బొమ్మా బొరుసూ తప్ప వేరేమీకాదు అంతటి సన్నిహిత్వమున్నకవితలు .సుభద్రా దేవిగారి పరిపక్వ కవిత్వానికి ప్రతిదీ ఉదాహరణగానే చెప్పచ్చు .అద్భుత భావనకు అవసరమైన పదాల కూర్పు నేర్పు గా కనిపిస్తుంది .విషయం సూటిగా గుండెలోకి చొచ్చుకు పోతుంది .పదబంధాలూ ,పద చిత్రాలూ ఆకర్షణీయంగా ఉంటాయి .ఏదీ కృత్రిమంగా ఉండదు .సహజ సౌందర్యమే కనిపిస్తుంది  సుభద్రా దేవిగారికి కావాల్సింది వనితకు అభద్రతా భావం తొలగి సుభద్రత కలిగించటం .అబలకాదు సబల అని నిరూపించుకోవటం .స్త్రీ అస్తిత్వాన్ని కాపాడుకోవటం .వాళ్ళ అస్తిత్వానికే పెద్ద పీట వేశారు .ఆడపిల్లల జీవితాలతో ఏ దశలోనూ ఆడుకోవద్దని ,ఏ దశలోనూ అడ్డుకోవద్దని మగజాతికి  హెచ్చరిక ఉంది .వ్యామోహాల వెంట పడి ‘’మబ్బు లోని నీళ్ళు చూసి ముంత వలక బోసుకో వద్దు ‘’అన్న ముందు చూపూ ఉంది .మహిళ అన్నిరంగాలలో తన సామర్ధ్యాన్ని నిరూపించుకోవాలి స్వయం వ్యక్తిత్వం తో భాసించాలి .ఎవరి దయా దాక్షిణ్యాలపై సానుభూతి పై  జీవించ రాదు .పరిస్తితిని తన చేతికి చిక్కించుకొని నిలబడి వాలుప్రవాహమైనా ఎదురు ప్రవాహమైనా ధైర్యం తో సాగాలి .పరిస్థితులకు బానిస కారాదు .రెండు సంపుటాలలోనూ స్త్రీయే కధా వస్తువు ఎక్కువ కవితలలో . మొదటిదైన ‘’అస్తిత్వ రాగం ‘’చూస్తె నాకు మాత్రం ఆధునిక భారతం లో ‘’స్త్రీ పర్వం ‘’అని పించింది . రెండవదైన ‘’నా ఆకాశం ‘’లో సుభాద్రాదేవిగారు ఒక తల్లిగా సోదరిగా హితైషిగా, సమాజ శ్రేయస్సుకోరే మానవీయ మూర్తిగా దర్శన మిస్తారు .ఈ రెండూ కలిస్తే శీలా సుభద్రా దేవి గారి ఆంతర్యమే ఆవిష్కరింప బడిందని అర్ధమవుతుంది .ఆమె కున్న సౌజన్యం, సహనం  ,సంయమనం కవితలలో వ్యక్తమవటం గొప్ప విషయం .
వీర్రాజు గారి కవిత్వం లోను ,సుభద్రా దేవిగారి కవిత్వం లోను ‘’కోటబుల్ కోట్స్ ‘’కోసం వెతుక్కోనక్కర లేదు .అంతేకాదు ఇద్దరి పుస్తకాలకు ఎవరి ము౦దు మాటలూ ,పరిచయాలు ఉండవు .అదొక ప్రత్యేకత కూడా .నిజంగా వారికీ ఆ అవసరమూ లేదు అని చదివితే మనకు తెలిసి పోయే విషయం .చదవాలి అనుభవించాలి .ఆనుభూతిని అందరితో పంచుకోవాలి అంతే .
ఈరెండు పుస్తకాలను నాకు అందజేసినందుకు శ్రీమతి  సుభద్రా దేవి గారికి కృతజ్ఞతలు తెలుపుకొంటూ  వాటిని పరిచయం చేసే అదృష్టం సాహితీ బంధువులకు కలిగించినందుకు ధన్యవాదాలు తెలియ జేస్తున్నాను .
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -17-4-15-ఉయ్యూరు

 

  నాకు శ్రీమతి సుభద్రాదేవి గారి రచనలమీద మీ విశ్లేష ణా త్మ క
వ్యాసాలు ఏంతో ఉత్తెజపరచినై.
శ్రీమతి శీలా సుభాద్రాదేవిగారికి నా గౌరకపూర్వకమైన ధన్యవాదాలు , నా
తరఫున, నా శ్రీమతి సత్యవతి తరఫున ,తెలియజేయ ప్రార్ధన .
నా భావ , భాషా సంబంధించిన తప్పులకు మన్నిo చ ప్రార్ధన.–ఇట్లు, మీ
విధేయుడు, మైనేని గోపాలకృష్ణ

  1.