27, నవంబర్ 2014, గురువారం

atalu saaganivvam

       ఆటలు సాగనివ్వం
 నాలుగ్గోడల మధ్యా
 అలంకార వస్తువుగా మిగిలిపోకూడదని
 అక్షరపతాకాన్ని పట్టుకొని
 నిర్విరామంగా ప్రయాణం చేస్తూ
 కాలచక్రాన్ని తోసుకోంటూ ఒక పరిభ్రమణాన్నిపూర్తి చేసి
 మరో ప్రభవ నుండి ఇంకో పరిభ్రమణం కొనసాగిస్తూ 
 అడుగులు వేస్తూ వేస్తూ
 గుండెలనిండా అచంచల నిబ్బరాన్ని నింపుకొని
 అలసినా తడబడని పాదముద్రల్ని పరచుకుంటు
 ముందుకే సాగుతుంటాం
 అయినా అప్పుడప్పుడు
 శరిరం లో వయస్సు గుర్తు చేస్తు
 ఎక్కడో ఒక చోట
 కలుక్కు మంటూ గుచ్చుకుంటూనే వుంటుంది
 అంతలోనే నిత్య వసంత కోయిల్లా
 కుహూ రాగాలాపనల్తో మనస్సు
 నొప్పులకు మందు పూస్తూ
 చైతన్య పరుస్తూనే వుంటుంది
 అక్షర కణాలు
 నరాలపంక్తుల నిండా
 నవకవనాల్ని అల్లుకొని ప్రవహిస్తున్నంత కాలం
 హృదయం మూగపోనంతకాలం
 కొత్త వుస్తాహాన్ని తొదుక్కోని
 దేహం కొత్తపుస్తకమౌతూనే వుంటుంది

 ఈ అక్షరయానానికి
 ఎప్పుదైనా ఒక గుర్తింపు
 పావురమై ఎగిరొచ్చి చేతిపై వాలిందా
 ఇంకేముంది
 నిస్త్రాణగా సొమ్మసిల్లిన శరీరానికి సైతం
 వుత్తేజాన్ని దయాలసిస్ చేసినట్లు
 మనసూ శరీరమూ వురకలెత్తుతై

 అందుకే వార్ధక్యమా!
 అక్షరాల్తో ఆడుకుంటున్న వాళ్ళం
 సాహిత్యం తో సరాగాలు పాడుకునే వాళ్ళం
 మా దగ్గర నీ ఆటలేవీ సాగవు సుమా!!