27, నవంబర్ 2014, గురువారం

atalu saaganivvam

       ఆటలు సాగనివ్వం
 నాలుగ్గోడల మధ్యా
 అలంకార వస్తువుగా మిగిలిపోకూడదని
 అక్షరపతాకాన్ని పట్టుకొని
 నిర్విరామంగా ప్రయాణం చేస్తూ
 కాలచక్రాన్ని తోసుకోంటూ ఒక పరిభ్రమణాన్నిపూర్తి చేసి
 మరో ప్రభవ నుండి ఇంకో పరిభ్రమణం కొనసాగిస్తూ 
 అడుగులు వేస్తూ వేస్తూ
 గుండెలనిండా అచంచల నిబ్బరాన్ని నింపుకొని
 అలసినా తడబడని పాదముద్రల్ని పరచుకుంటు
 ముందుకే సాగుతుంటాం
 అయినా అప్పుడప్పుడు
 శరిరం లో వయస్సు గుర్తు చేస్తు
 ఎక్కడో ఒక చోట
 కలుక్కు మంటూ గుచ్చుకుంటూనే వుంటుంది
 అంతలోనే నిత్య వసంత కోయిల్లా
 కుహూ రాగాలాపనల్తో మనస్సు
 నొప్పులకు మందు పూస్తూ
 చైతన్య పరుస్తూనే వుంటుంది
 అక్షర కణాలు
 నరాలపంక్తుల నిండా
 నవకవనాల్ని అల్లుకొని ప్రవహిస్తున్నంత కాలం
 హృదయం మూగపోనంతకాలం
 కొత్త వుస్తాహాన్ని తొదుక్కోని
 దేహం కొత్తపుస్తకమౌతూనే వుంటుంది

 ఈ అక్షరయానానికి
 ఎప్పుదైనా ఒక గుర్తింపు
 పావురమై ఎగిరొచ్చి చేతిపై వాలిందా
 ఇంకేముంది
 నిస్త్రాణగా సొమ్మసిల్లిన శరీరానికి సైతం
 వుత్తేజాన్ని దయాలసిస్ చేసినట్లు
 మనసూ శరీరమూ వురకలెత్తుతై

 అందుకే వార్ధక్యమా!
 అక్షరాల్తో ఆడుకుంటున్న వాళ్ళం
 సాహిత్యం తో సరాగాలు పాడుకునే వాళ్ళం
 మా దగ్గర నీ ఆటలేవీ సాగవు సుమా!!
  
   
 

9, సెప్టెంబర్ 2014, మంగళవారం

aatma bandhuvu

      ఆత్మబంధువు
నాతోనేవుంటూ నాతోనే పెరుగుతూ
నన్నొదలని తోబుట్టువే అది
చిన్న వెలుతురు పువ్వు పూసినా
నిద్రలోనూ నన్ను కావలించుకొని వుంటుంది
పొద్దున్నె
తల్లిలేవగానే కెవ్వుమనే పొత్తిళ్ళ పాపాయిలా
లేచి వెంటబడుతుంది
ఇంట్లో వున్నంతసేపూ తెరచాటూనే
దాగుడుమూత లాడుతుంది
ఏ వెలుతురు తీగ నన్ను చుట్టినా
క్షణంలో దూకి నా కొంగు పట్టుకొంతుంది
స్కూలుకి వెళ్తుంటాన
బుద్ధిమంతురాలై నా వెనకెనకే అడుగులొ అదుగేస్తుంది
వుందుంది కొంటెపిల్లై
నన్ను లాక్కుంటూ ముందుకి సాగిపొతుంది
అంతలొనె నేను చిన్నబుచ్చుకుంటానేమొనని
పక్కనే వూసులు చెబుతూ జతకడుతుంది
ఏ మండే మిట్టమధ్యాహ్నవేళో బయటకెళ్తే
 ఒంటరిగా వెళ్ళనీదు సరికదా
పాదాలు కందిపోతున్నందుకు
బాధతో ముడుచుకొని ముద్దై
కొద్దిపాటి చల్లదనమైనా ఇవ్వాలని
పాదాలకింద నడిచే తివాచీ అవుతుంది
వాననీటీలొ ముక్కలౌతూ వణికి పోతూ కూడా
నాకు తోడూ గానే వుంటుంది
చిలిపితనంతో ఏ చీకటీ వేళో
ఒంటరిని చేసి ఏడిపిస్తుంది
మండే అగ్గిపుల్ల వెల్తుర్లొ
వెనకేదాగి భూతంలా భయపెడ్తుంది
అయితేనేం క్షనమైనా నన్ను వీడని
ఆత్మబంధువే నా నీడ!!  

26, ఏప్రిల్ 2014, శనివారం

baalyamlOki

     బాల్యంలోకి


రెక్కల గుర్రం ఎక్కి విశ్వమంతా తిరిగి
మబ్బుపింజల్ని ఏరుకొచ్చి పరుపేసుకోవడం-
ఆకాశమంతా చుట్టి
చుక్కల్ని కోసుకొచ్చి ఇల్లంతా వెలుగు నింపుకోవడం
కౄరమృగాల్ని సైతం చిటికలో లొంగదీసుకుని
వీధిగుమ్మంలో కాపలా పెట్టుకోవడం-
చెట్లకున్న రూపాయి ఆకుల్ని తెంచి తోరణాలు కట్టడం-
కాయల్లో మెరిసే ముత్యాల్ని ఒలుచుకొని మాలల్ని కట్టడం-
కలల్లో కబుర్లే కావచ్చు
తలచుకొన్నప్పుడు గిలిగింతలు పెట్టక తప్పవు
ఏడేడు సముద్రాల్ని  దాటి
మర్రిచెట్టు తొర్రలోని చిలకలో దాగిన రాక్షసుడి ప్రాణం తీసి
రాకుమార్తెను చేపట్టె వీరుని సాహసాలు
పాతాళభైరవి కోసం మాంత్రికుడి పాట్లు
మాయాబజారు ఘటోత్కచుని మాయలు
అవాస్తవికాలే కావచ్చు
నిజజీవితంలో సమస్యల్ని కాసేపు మడతపెట్టి
చూస్తున్నంతసేపూ తనివితీరా కేరింతలు కొట్టడం కోసమైనా
ఒక్కసారి మన శరీరాల్ని విప్పేసుకొని
బాల్యం తొడుగులోకి దూరాలనిపించడం తప్పేం కాదు
  (24-4-1 996) 

24, జనవరి 2014, శుక్రవారం

      
    నీలాటి ఒకరు

  నన్ను "ఆడ"దాన్నని అనకు
  నేను ఎక్కడి దాన్ని కావాలను కోవడం లేదు
  అంతటా నిండి వుండే దాన్ని కావాలి
  నన్ను "లలనా" అని పిలవకు
  ఎండ కన్నెరగ కుండా
  ఇంట్లో బంధీనై సుకుమారిని కాదలచుకోలేదు
  నన్ను "వనితా" అని వలపులు విసరకు
  అంగాంగ వర్ణనలు చేయించుకుని
  కవితాసుందరినికావాలని లేదు
  నన్ను "స్త్రీ " అని అక్షరీకరించకు
  అన్ని మెలికలు తిరిగి
  సిగ్గుల మొగ్గను కాబోవటం లేదు
  నన్ను "నారీ" అని మురిపించకు
  ఆదర్శాలకిరీటం ధరించి
  సిరోభారం తో నీ ముందు తల వంచుకొని నిలుచోదలచుకొలేదు
  నన్ను నన్ను గానే చూడు
  సంపూర్ణమైన  వ్యక్తిగా మాత్రమే గుర్తించు
 
  (1988)