11, ఫిబ్రవరి 2021, గురువారం

దేవుడి బండ కథ- నా విశ్లేషణ

 దేవుడిబండ కథ 1987 లో విపుల మాస పత్రిక వారు నిర్వహించిన కథల పోటీలో బహుమతి పొందింది.

మేము1985లో హైదరాబాద్ లో మలక్ పేట లోని ఇంటికి మారిన తర్వాత నేను రోజూ స్కూల్ కి వెళ్ళేటప్పుడు సూపర్ బజార్ బస్ స్టాప్  లో బస్ కోసం  ఎదురు చూసే దాన్ని. బస్ స్టాప్ వెనుక రోళ్ళుకొట్టి అమ్మే వలసజీవులు తాత్కాలికంగా ఇళ్ళు కట్టుకొని ఉండేవారు.ఆ వెనుక అంతా ప్రభుత్వ ఉద్యోగుల క్వార్టర్స్ ఉంటాయి.

బస్ వచ్చేవరకూ వారి జీవనవిధానం గమనించటం నా నిత్యకృత్యం.సాయంత్రం వచ్చేక వాళ్ళ ఇళ్ళ మధ్యనుండే మా ఇంటికి తిరిగి   వెళ్తూ గమనించే దాన్ని.

      ఈ కథలో బాలయ్య అనే బాలుడు పొత్రాలకు గంట్లు కొడుతూ బాస్ స్టాండ్ ముందునుండి యూనిఫాం వేసుకుని వెళ్తున్న స్కూల్ పిల్లల్ని చూసి తాను కూడా అలా వెళ్ళాలని కలలు కనటం కథలో ప్రస్తావించటం లో చదువుకోవాలనే కోరిక ఉన్నా  చదువుకు దూరమౌతోన్న వలసజీవులు,పేదల చితికిన కలల్ని చెప్పాను.

      వివిధ యంత్రాలు వంటింట్లో కి రావటం వలన రోళ్ళు అమ్ముడు కాకపోవటంతో బతుకు బండలైన జీవితాల్ని చూపించడానికి ప్రయత్నించాను.

      పాడైపోయిన పొత్రం యాదృచ్ఛికంగా గ్రామ దేవత గా మారిందని వ్యంగ్యంగా చెప్పటంలో ప్రజల్లో గూడుకట్టుకున్న మూఢనమ్మకాలు బట్టబయలు చేయటానికి ప్రయత్నించాను.

        అమీర్ ఖాన్ ' పీకే' చిత్రంలో చూపిన  ఇటువంటి దృశ్యం నా కథలోని సంఘటనతో సాదృశ్యం గా ఉండటం సినిమా చూసినప్పుడు ఆశ్చర్యం కలిగించింది.

        ఈ కథ తెలంగాణా మాండలికంలో రాసిన నా తొలి కథ.ఆ తర్వాత చాలా కథలు ఈ మాండలికం లోనే రాసాను.

        1989 లో అనుకుంటా డి.రామలింగం గారు కేంద్ర సాహిత్య అకాడమీ కోసం యువతరం రచయితలు రాసిన కథల సంపుటి గా "ఒకతరం తెలుగు కథ" పేరున సంకలనం చేసి ప్రచురించిన సంపుటి లో దేవుడు బండ కథ కూడా చేర్చ బడింది.అప్పట్లో ఆ కథ చాలా మంది ప్రశంసలు అందుకుంది.

        1990 లో నేను ప్రచురించుకున్న మొట్టమొదటి కథలసంపుటీ లో ఈ కథ చేర్చడమే కాక సంపుటిని దేవుడిబండ  పేరుతోనే వెలుగు లోకి తెచ్చాను.ఇదీ నేను ఈ కథ గురించి చెప్పదలచుకున్నది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి