26, నవంబర్ 2023, ఆదివారం

నడక దారిలో -34

నడక దారిలో -34 ఓ రాత్రి మా బాత్రూమ్ పక్కనే పెరటిగోడ కూలిపోయింది.గోడని ఆనుకొని క్షత్రియ హాస్టల్ ఉండటం వలన మాకు ఇబ్బంది మొదలైంది.అక్కడే మా బాత్ రూం ఉంటుంది కనుక నాకూ,పల్లవికీ స్నానాలకు ఇబ్బంది కలిగేది. ఇంటి ఓనర్ తో చెప్తే విసురుగా మాట్లాడింది.దాంతో వేరే ఇల్లు వెతుక్కోవాలని నిర్ణయించుకున్నాం. పాత నల్లకుంటలో రామడుగు రాధాకృష్ణ మూర్తి గారి ఇంటికి రెండు సందులు ఇవతల ఇల్లు దొరికింది.ముందువైపు ఇంటి వాళ్ళు ఉంటారు వెనుకవైపు రెండు చిన్నచిన్న రూములు, చిన్న వంటగది.మాకు చాలా ఇరుకుగా ఉండేది. పల్లవికి తన వయసు అమ్మాయిలు చాలా మంది స్నేహితులు అయ్యారు.అక్కడే ఉన్న రామాలయంలో ఒక ఆయన సంగీతం నేర్పిస్తారని తెలిసి అక్కడ చేర్చాను.ఈ ఇంటికి స్కూలు కొంచం దగ్గర అయ్యింది.నడిచే వెళ్ళిపోతుండేది. అక్కడకు ఫర్లాంగు దూరంలోనే ఉన్న ఇంటిలో నా చిన్ననాటి స్నేహితురాలు జానకి వాళ్ళు ఉంటారని తెలిసింది.నాకు చాలా సంతోషం కలిగింది.మేము తరుచూ కలుసుకునే వాళ్ళం.కుమారికి ఈ విషయం చెప్తే ఆమె కూడా అప్పుడప్పుడు వస్తుండేది.చిన్ననాటి కబుర్లు కలబోసుకునేవాళ్ళం. రాగలత చెల్లెలు హైదరాబాద్ లోనే డిగ్రీలో చేరింది.అందుచేత రాగలత కూడా తన చెల్లెలుతో కలిసి మా ఇంటికి దగ్గరలోనే రూం తీసుకొని ఉండేది. ఒకరోజు నాకు ఉద్యోగానికి కాల్ లెటర్ వచ్చింది.ఇంకా రిజల్ట్ రాలేదు.నేను అప్లై చేయలేదు.ఎలా వచ్చిందా అనుకున్నాను.అంతలో రాగలత కూడా వచ్చి తనకు కూడా అదే స్కూల్ నుండి కార్డు వచ్చిందని చెప్పింది.ఇద్దరం నారాయణగూడ చౌరాస్తాలోని సెయింట్ పాల్ హైస్కూల్ కి వెళ్ళాము.మా ఇద్దరినీ ఇంటర్వ్యూ చేసి మేము చదివిన బియ్యీడీ కాలేజి ప్రిన్సిపల్ మా పేర్లు రికమెండ్ చేసారని చెప్పారు.ప్రస్తుతం నెలకు అయిదు వందలు ఇస్తామని, రిజల్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ క్లాస్ వస్తే పెంచుతామని అన్నారు.సర్లే అని ఇద్దరం చేరిపోయాము. అయితే ఆ స్కూల్ లో రోజంతా అన్ని పీరియడ్స్ క్లాసుల్తో,క్రమశిక్షణ లేని పిల్లలతో చాలా కష్టం అయ్యేది. అంతలో మా రిజల్ట్ వచ్చింది .నేనూ,రాగలత కూడా ఫస్ట్ క్లాసులో పాసయ్యాము.నా సంతోషానికి అవధుల్లేవు. సెయింట్ పాల్ హైస్కూల్ యాజమాన్యం కి రిజల్ట్ గురించి చెప్పి ఫస్ట్ క్లాస్ వస్తే జీతం పెంచుతామని అన్న విషయం గుర్తు చేసాం.కానీ ఆరునెలలు దాటాక జీతం పెంచుతామన్నారు.చెప్పిన మాట తప్పిన యాజమాన్యం ప్రవర్తనకి రాగలతా,నేను కొంత అసంతృప్తికి లోనయ్యాము. కాంగ్రెసేతర పార్టీ ప్రభుత్వం ఏర్పడటం తో రాష్ట్రంలో కూడా చాలా సంచలనాలు కలగటం మొదలైంది. చిరకాల కాంగ్రెసు ప్రభుత్వాన్ని త్రోసిరాజని తొలిప్రాంతీయపార్టీ రాష్టపగ్గాలు చేపట్టటం భరించరానిదయింది.రాష్ట్రంలో అందులోనూ హైదరాబాద్ లో మత కల్లోలాలు రాజుకొనేలా ప్రత్యర్థులు చేసారు. ఈ లోగా మాకు ఈసారి ఇద్దరికీ వేర్వేరు స్కూల్స్ నుండి కాల్ లెటర్ వచ్చింది.ఒక రోజు సెలవు పెట్టి వెళ్ళాం.నేను న్యూ ప్రొగ్రసివ్ స్కూల్ కి వెళ్ళాను.నేనేకాక నాతో చదివిన భాగ్యలక్ష్మి,మరో అమ్మాయి ఆంధ్రావాణీ కూడా వచ్చారు. అందర్నీ తీసుకున్నారు.అయితే SGBT స్కేల్ ప్రకారమే జీతం ఇచ్చేవారు. నాకు ప్రాధమిక తరగతులకు రెండవభాష తెలుగు,గణితం ఇచ్చారు.ఆ స్కూలు పేరుకు ఇంగ్లీష్ మీడియం.కానీ పిల్లలంతా 98 శాతం ముస్లింలు.టీచర్లలో మేం ముగ్గురం కాక హైస్కూల్ లెక్కలకు, తెలుగు టీచర్లు మాత్రమే హిందువులం. పిల్లలకు ఇంగ్లీషు రాదు, తెలుగు రాదు.వచ్చినా ఉర్దూ కలిసిన తెలంగాణా భాష.నాకు అంతంతమాత్రం ఇంగ్లీష్,ఉర్దూ అసలు రాదు.ఇంక నా అవస్థలు చూడాలి.ఆ ఏడాది లో నాకు మాత్రం ఉర్దూ కాస్తంత వచ్చేసింది. ఒకవైపు మాటిమాటికీ కర్ఫ్యూలతో హైదరాబాద్ అతలాకుతలం అయిపోయింది.మా స్కూల్ టీచర్స్, విద్యార్థులు కూడా చాలా మంది పాతబస్తీకి, ముస్లిం ప్రాంతాలకూ చెందిన వాళ్లు.ఏమూలో నిప్పురవ్వపడి మతకల్లోలాలు గుప్పుమనేవి.పిల్లలకోసం తల్లిదండ్రులు బడికి పరిగెత్తుకుని వచ్చేవారు.హడావుడిగా పిల్లల్ని వదిలేసి బడి మూసేసేవారు.మేము గుండె దడదడ లాడుతుండగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఏరిక్షానో మాట్లాడుకొని ఇంటికి చేరే వాళ్ళం.అదృష్టవశాత్తు లెక్కలటీచర్ ఇల్లు కూడా శంకరమఠం దగ్గరే కావటంతో ఇద్దరం కలిసి ఇంటికి వచ్చేవాళ్ళం. ఆ ఏడాదంతా స్కూలుకి వెళ్ళిన రోజులు తక్కువే అయ్యాయి.అయితే ఏప్రిల్ లో స్కూల్ ఆఖరి పనిదినం రోజున మమ్మల్ని పిలిచి సెలవుల్లో జీతం ఇవ్వమని చెప్పి,తిరిగి స్కూల్ తెరిచాక రమ్మన్నారు. ఇంకా మళ్ళీ ఉద్యోగం వేట మొదలెట్టాలి అనుకున్నాను. వీర్రాజు గారు ఎన్టీఆర్ ప్రభుత్వం వచ్చిన దగ్గర్నుంచి బిజీ అయి పోయారు.అంతకుముందు ముఖ్యమంత్రులకు కూడా ఈయనే ప్రసంగాలు రాసేవారు.అయితే వాళ్ళు ఏది రాస్తే అది చదివేవారు కనుక ఇబ్బంది కలుగలేదు కానీ తెలుగు దేశం వచ్చాక సినిమా డైలాగుల్లా వచ్చేవరకూ తిరిగి తిరిగి రాయవలసి వచ్చి విసుక్కునేవారు.అందువలన ఆయన ఇంట్లో ఉండటం తగ్గిపోయింది ఒకరోజు రాగలత టీచర్లకోసం అడ్వర్టైజ్మెంట్ తీసుకుని వచ్చింది.సరే అని నేనూ,రాగలతా ఆ స్కూలుకు వెళ్ళి అప్లికేషన్ రాసి ఇచ్చాము.ఇంటర్వ్యూకి ఫలానా రోజు రమ్మని చెప్పారు. వాళ్ళు చెప్పిన రోజుకు వెళ్దామని రాగలతని పిలుస్తే తెలుగు మీడియం స్కూల్ నేను చెప్పలేనని చెప్పి రాలేదు.నేను ఒక్కదాన్నే వెళ్ళాను. ఇంటర్వ్యూకి ఒక్క పోష్ట్ కి నలభై మందికి పైగా వచ్చారు.నాతో ప్రోగ్రసివ్ స్కూల్ లో పనిచేసిన ఆంధ్రవాణి కూడా వచ్చింది.ఎందుకో నాతో ఆమె ఏడాదిపాటు కలిసి ఉద్యోగం చేసినా పరిచయం గానే మిగిలిపోయింది.స్నేహితురాలు కాలేదు.ఆ అమ్మాయి డామినేటింగ్ ప్రవర్తన మామధ్య దూరాన్ని పెంచింది. ఆ అమ్మాయి చాలా మాటకారి వచ్చిన దగ్గర్నుంచి డీయీవో, డెప్యూటీ డీఈవో తనకు బాగా తెలుసును అన్నట్లుగా మాట్లాడుతూనే ఉంది.తీరా ఆరోజు మమ్మల్ని ఇంటర్వ్యూ చేసేందుకు వాళ్ళు రాక పోవటంతో వాయిదావేసి వారంతర్వాత రమ్మన్నారు. వారం తర్వాత మళ్ళా వెళ్ళాను.ఈసారి ఇంటర్వ్యూకి అంతకు ముందు వచ్చినవారిలో సగం ముందే వచ్చారు.ఆంధ్రవాణి వచ్చి ఈ సారి కూడా తనకు డిప్యూటీ డీఈవో ఎంతబాగా తెలుసో జనఆంతఇకంగఆ వైనాలు వైనాలుగా చెప్తోంది.మాటిమాటికీ మమ్మల్ని కూర్చోబెట్టిన గది ద్వారం దగ్గరకు వెళ్ళి "రామచంద్రరావు గారి కారు ఇంకా రాలేదేమిటీ"అంటూ తనలో తాను అనుకున్నట్లుగా అనటమే కాక "ఈ స్కూల్లో ఎవరిని తీసుకోవాలో ముందే నిర్ణయం ఐపోయింది.ఇది కేవలం నామినల్ గా చేసే ఇంటర్వ్యూ మాత్రమే" అనటం మొదలెట్టింది.దాంతో మా అందరికీ నిరాశ కమ్మేసింది.అంతలో అటెండర్ వచ్చి "డీయీవోగారికి వేరే పని పడింది.రేపు ఇదే సమయానికి రమ్మ"ని చెప్పాడు. ఒకవైపు ఆంధ్రవాణి మాటలు వింటుంటే మళ్ళా మర్నాడు హాజరు కావాలనిపించలేదు.నీరసంగా ఇల్లు చేరాను.రాగలత వస్తే విషయం చెప్పాను."ఆంధ్రవాణి కావాలని అలా చెప్తుందేమో" అని అనుమానంగా అంది రాగలత. వీర్రాజు గారు కూడా అదే అన్నారు. సరే మర్నాడు కూడా వెళ్ళాను.ఆరోజు ఓ పదిమంది మాత్రమే వచ్చారు.యథాతథంగా ఒక్కొక్కరిని పిలిచి అక్కడ ఉన్న ఆరుమంది ఇంటర్వ్యూ చేసారు.ఇంటర్వ్యూ చేసాక భౌతిక రసాయన శాస్త్రం లో ఒక పాఠం రేపు వచ్చి చెప్పమన్నారు.నమస్కారం చేసి బయటకు రాగానే ఆంధ్రవాణి ఏమన్నారని అడిగింది.సమాధానం చెప్పి ఇంటికి వెళ్ళిపోయాను. పదవతరగతి భౌతికశాస్త్రం లో ఒక అంశం తీసుకుని బియ్యీడీ ట్రైనింగ్ లో నేర్చుకున్న పద్ధతిలో లెసన్ ప్లాన్ తయారు చేసుకుని ,ఒక చార్ట్ కూడా వేసుకుని మర్నాడు వెళ్ళాను. ఆంధ్రవాణి కాక మరొక అబ్బాయి కూడా వచ్చాడు.అంటే ముగ్గురిని పిలిచారన్నమాట అనుకున్నాను. నా చేతిలో లెసన్ ప్లాన్ చూసి ఆంధ్రవాణి "అయ్యో నేను లెసన్ ప్లాన్ రాయలేదు" అంటూ పక్కనే ఆ స్కూల్ ఆఫీసు రూమ్ లోకి వెళ్ళి రెండు తెల్ల కాగితాలు తీసుకుని రాయటం మొదలుపెట్టింది. అంతలోనే పదో తరగతి లో లెసన్ చెప్పమని పిలిచారు.ముగ్గురి పాఠం విని పంపించేసారు. ఆంధ్రవాణి నాతో మాఇంటికి వస్తానని వచ్చింది.నాకు ఇష్టం లేకపోయినా మొగమాటంతో మౌనం వహించాను.దారిలో " డిప్యూటీ తనకు తెలుసని తనకే వస్తుందని "ఖచ్చితంగా చెప్పింది.నేనేం మాట్లాడలేదు. మళ్ళా మర్నాడు చీకటి పడుతున్నా వేళ ఆంధ్రవాణి మాఇంటికి వచ్చింది.వీర్రాజుగారు ఇంట్లో ఉంటం వలన లోపలికి రాకుండా నాతో మాటలు మొదలుపెట్టింది. "సుభద్రా డెప్యూటీ రామచంద్రరావు కి 2000/-రూపాయలు ఇస్తే నీకు ఉద్యోగం వచ్చేలా చేస్తారు.నీకు ఈ ఏడాది లో ప్రభుత్వ ఉద్యోగం వయసు దాటిపోతుంది.గవర్నమెంటు జాబ్ రాదు.డబ్బు నాకు ఇవ్వక్కరలేదు.నువ్వే నాతో వచ్చి ఇవ్వొచ్చు."అంది. "పరిస్థితులరీత్యా నాకు ఉద్యోగం అవసరమే కానీ ఇలా లంచాలు ఇచ్చి తెచ్చుకోవటం ఇష్టం లేదు.ఇది కాకపోతే ప్రైవేటు స్కూల్లో చెప్పుకుంటాను.అంతేకానీ ఇటువంటి వాటికి మేం విరుద్ధం "అన్నాను. " సుభద్రా ఆలోచించు.మంచి అవకాశం.మీవారికి కూడా చెప్పు .పోనీ నేను ఆయనతో మాట్లాడనా" అని నన్ను ఒప్పించాలని చాలా చూసింది. "మా ఆయన ఇంట్లోనే ఉన్నారు.ఆయనతో చెప్తే నన్నే కాదు నీకు కూడా తిట్లు పడతాయి.ఇలాంటివన్నీ నాకు చెప్పకు వెళ్ళు" అని కాస్త సీరియస్ గా అన్నాను. నన్ను చూపించటానికి ఎంత ప్రయత్నించినా నేను లొంగలేదు. అలా ఓ వారం గడిచాక ఒకరోజు పదకొండు గంటలకి నాకు ఒక కార్డు వచ్చింది. ఆ కార్డు లో "ఫలానా తేదీ రెండుగంటల లోగా జాయిన్ కావాలని లేకపోతే తర్వాత వారికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తామ"ని ఉంది.ఆరోజే రెండుగంటల లోపునే వెళ్ళాలి.పల్లవికి వాళ్ళు తెలియని జ్వరం.వీర్రాజు గారు ఆఫీసుకి వెళ్ళిపోయారు.నాకు ఏంచెయ్యాలో తోచలేదు.పల్లవికి కొంచెం జావ చేసి ఇచ్చి తలుపు దగ్గరకు వేసి గొళ్ళెం నొక్కి పక్కసందులోనే ఉంటున్న రాగలత ఇంటికి వెళ్ళాను.అదృష్టం కొద్దీ ఇంట్లోనే ఉంది.విషయం చెప్పి నేను వచ్చేవరకు పల్లవికి తోడుగా ఉండమని అడుగుతే రాగలత వచ్చింది.నేను హడావుడిగా చీర మార్చుకుని రిక్షా ఎక్కి ఆర్టీసి హైస్కూల్ కు వెళ్ళాను. స్కూల్ కి వెళ్ళి ప్రధానోపాధ్యాయుల గదిలో ప్రవేశించి నమస్కరించగానే ప్రధానోపాధ్యాయులు శిరోమణి థామస్ గారూ, రాజ్యలక్ష్మి గారూ మరో ఇద్దరు టీచర్లూ ఆత్మీయంగా ఆహ్వానించారు.చేతికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి మరునాటి నుంచి తొమ్మిది కల్లా స్కూల్ లో ఉండాలని చెప్పారు. ఆత్మీయంగా ప్రేమపూర్వకమైన వాళ్ళ పలకరింపుతో నా హృదయం గాలిలో తేలినట్లు గా పరవశించింది. నేను తిరిగి ఇంటికి వెళ్ళటానికి గేటు దగ్గరకి వచ్చేసరికి ఆంధ్రవాణి ఎదురైంది.ఆర్డరు ఇచ్చారా ఏదీ చూపించు అని అడిగింది.నేను చూపించగానే అందులోని టెంపరర్లీ అన్ని పదాన్ని చూపి "నిన్ను టెంపరర్లీ తీసుకున్నారు.నన్ను పెర్మనెంట్ గా తీసుకుంటారట"అంది. అంతకుముందు రెండు స్కూల్స్ లో అలాగే పనిచేసాను కనుక నేనేమీ సమాధానం ఇవ్వకుండానే వచ్చేసాను. వీర్రాజు గారు వచ్చాక ఆర్డర్ చూపించి ఇది టెంపరర్లీ ఇచ్చినదా అని అడిగాను."మొదటి ఆర్డర్ ఇచ్చినప్పుడు అలాగే ఇస్తారు.తర్వాత అప్రూవల్ వస్తుంది.ఆంధ్రవాణి మాటలు పట్టించుకోకు తీసేస్తే మరోటి వెతుక్కుంటావు.అంతేకదా" అన్నారు. అప్పటికి మనసు కుదుట పడింది.

16, నవంబర్ 2023, గురువారం

పి.సరళాదేవి నవలిక- కొమ్మా- బొమ్మా

పి.సరళాదేవి-- "కొమ్మా-బొమ్మా" యువ1989లో తర్వాత పుస్తకంగా వచ్చింది. జగన్నాథం చిరుద్యోగి పెద్దకూతురు నాలుగో కాన్పుకు వస్తుంది.తర్వాతకూతురు మంగ, కొడుకు గోపి.ఇక్కడే ఉండే జగన్నాథం చెల్లెలు మీనాక్షమ్మ బాలవితంతువు తన బంధువుల అబ్బాయి తో పద్నాలుగేళ్ళ ఐనా లేని మంగకి పెళ్ళికుదురుస్తుంది.అయితే మందమతి అయిన పెళ్ళికొడుకు ఆ రాత్రే పారిపోయాడు.పెద్దకూతురు పాపని కని చనిపోతుంది.అల్లుడు పెద్ద పిల్లలిద్దర్నీ తీసుకుని వెళ్ళిపోయాడు.గోపి పదోతరగతి కాగానే డబ్బున్న స్నేహితుడి తండ్రి చదివించి కూతుర్ని ఇచ్చి పెళ్ళి చేస్తానంటే ఇల్లొదిలి వాళ్ళింటికి పోతాడు. మంగతల్లి బెంగ పెట్టుకొని చనిపోతుంది.అందరూ పిచ్చివాడి సంబంధం తెచ్చినందుకు మాటలంటున్నారని మీనాక్షమ్మ బంధువు ల ఇంటికి వెళ్ళిపోతుంది. అక్క పిల్లలిద్దర్నీ, రిటైరైన తండ్రి తో కాలం గడుపుతుంది మంగ. పక్క వాళ్ళ సలహాతో పదొతరగతి పరిక్షకట్టి టీచర్ ట్రైనింగ్ చేసి ఉద్యోగం సంపాదిస్తుంది.అలా పదిహేను ఏళ్ళు గడుస్తాయి.తండ్రి చనిపోతాడు.సహోద్యోగి మణి అన్న ఆనందరావు ,మంగ పట్ల ఆకర్షితుడయ్యాడు.కాని మంగ ఒప్పుకుంటుందో లేదో అని సంశయిస్తాడు. ఎలాగో మంగని పెళ్ళికి ఒప్పిస్తాడు. ఈ లోగా మంగ బావ వచ్చి తనవెంట వచ్చి పిల్లలను చూసుకోమని బలవంతం పెడతుంటాడు. అంతలో ఒక ముసలామె ఒకడ్ని మంగ భర్త అని తీసుకొస్తుంది. చుట్టూ పట్ల వాళ్ళందరూ భర్తనే నమ్ముకోమని ఉపదేశాలు ఇస్తారు.ఆనందరావు వస్తే అందరూ నిరసనగా చూస్తారు. చివరి కొన్నిపేజీలలో ఆమె సంఘర్షణ ఉంటుంది.భర్త అని వచ్చినవాళ్ళు తమ ప్రయత్నం ఆ ఇంట్లో సాగదని పక్క దుప్పట్లతో సహా ఎత్తుకు పోతారు. మంగ తండ్రి స్నేహితుడు వచ్చి" నువ్వు అదృష్టవంతురాలివి.నీ నెత్తిన మరో బండ పడకుండా తప్పించుకున్నావు." అంటాడు. మంగ బొమ్మలా ఉండిపోయింది.అని ముగించారు. నవలలో స్త్రీ జీవితాలగురించి, వైవాహిక బంధాలగురించి, మానవస్వభావాల గురించి మంచి విశ్లేషణలు ఉంటాయి.

5, నవంబర్ 2023, ఆదివారం

సిథారెడ్డి కావ్యం -అనిమేష

~~ భయంకర స్వప్న చరిత్ర - అనిమేష~~ " ఖండిక గానీ, దీర్ఘకవిత గాని ఒక ప్రధానవస్తువును దోహదకరమైన భావపరంపరతో,చిన్న చిన్న గొలుసు ముక్కలను ఒక దానిలో ఒకటి అమర్చి పెద్దగొలుసు తయారు చేసినట్లు,ఒకదానినుండి ఒకటి ఆవిష్కరింపజేస్తూ పాఠకులహృదయాలను క్రమేణా ఆకట్టు కొనగలిగినప్పుడే కావ్యం రాణిస్తుంది.ఏ మాత్రం తోవ తప్పినా లయభంగమౌతుంది.రసభంగమౌతుంది." అంటారు కుందుర్తి ఆంజనేయులు. కరోనాసంక్షోభం పెనుపిడుగులా పడేసరికి అల్లాడిపోయిన జనం,బిత్తర పోయిన జనం, భయకంపితులైన జనం,మౌనంలోకి కూరుకు పోయిన జనం,ఆవేదనతో గుండెలు బాదుకొన్న జనం,కన్నీళ్ళతో చిత్తడైన జనం,నేలకూలిన జనం ఇలా..ఇలా రెండు శిశిరాలు ప్రపంచ వ్యాప్తంగా కలచి వేసిన దృశ్యాల్ని ఎన్నింటినో ఆవేశం,ఆవేదన, ఆక్రందనలతో అనేక మంది సృజనకారులు తమ తమ మనోచింతనను అక్షరీకరించారు. అయితే అవన్నీ ఒక ఎత్తు.ఆయా చిత్రాలన్నింటినీ ఒడిసిపట్టి నందిని సిధారెడ్డి అక్షరంగా వెలువరించిన "అనిమేష" ఉపద్రవం కావ్యం మరోఎత్తు. ఆ రాయటం కూడా పైపైన రాయలేదు.ఆ దృశ్యాల్నీ,ఆ దుఃఖాల్నీ, తనలోకి ఆవాహన చేసుకుని కంఠంలో ఉండకట్టి గిరికీలు కొడ్తూ గరళంలా కాల్చేస్తున్న ఆ మృత్యు ఘోషల్ని సంబాళించుకుంటూ కవి అక్షరంగా ప్రవహింప చేసాడు. సిధారెడ్డి కవిత్వాన్నంతటినీ చదివిన వారు ఆయన నిజాయితీని శంకించలేరు.కవిత్వం రాయటం ఆయనకి సరదా కాదు.అక్షరాల్లో పద చిత్రాలగారడీలలో దాక్కోవడం తెలియదు.అందుకే సిద్ధిపేట దాటి ,తెలంగాణా దాటి,తెలుగు రాష్ట్రాలు దాటి,దేశం ఎల్లలు దాటి కనిపించని శత్రువు చేసిన వీరవిహారానికి గజగజలాడుతోన్న జీవితాల్నీ ప్రపంచదుంఖాన్నీ దాటుకుంటూ చరిత్రమూలల్లో జరిగిన మృత్యుబీభత్సాల్ని తవ్వి తలెత్తుకుని అక్షరమై ప్రవహించిన అనిమేషుడైనాడు. " నిశ్శబ్దం నివ్వెరపోయింది "తో అనిమేషని మొదలు పెట్టిన నందిని సిధారెడ్డి " గొళ్ళేలు భద్రమే/ మనుషులే ఛిద్రం / అందుకే జీవితం జీవకళ పోయింది" అంటూ ఊహాన్ పురావైభవం నుండి లేచి జనం పైకి ఉరికిన కనిపించని శత్రువు ప్రపంచాన్ని ఏవిధంగా ప్రమాదంలోకి నెట్టివేస్తుందనే వైనాన్నిచెప్తూ చదువరులను పంక్తులు వెంట పరిగెత్తించారు. " ఆలింగనం లేకుండా జననం లేదు జీవనం లేదు ఆలింగనమొక ఉద్వేగమే" కవిత మొదలైన దగ్గర నుంచి ఒక లయతో కవాతు చేస్తున్నట్లుగా సాగుతుంది.ఒకసారి గాయాలతో తడిసినట్లుగా ఆర్ద్రంగా దుఃఖాన్ని మోసుకుంటూ మరోసారి ఆవేశంతోనూ పంక్తులు పంక్తులుగా ప్రవహిస్తుంది. " మనిషి అడుగులన్నీ అలంకారాలన్నీ ప్రకృతే ప్రకృతి నయగారాలన్నీ మనిషే" అది తెలియని మనిషి రంగురాళ్ల కోసమో సౌఖ్యాలు కోసమో అడవుల్ని నరికి నేలతల్లి గర్భం లోకి గొట్టాలుదించి గుండెల్ని పెకిలిస్తుంటే-- "మనిషి విజృంభించేది ప్రకృతి మీదే ప్రకృతి విజృంభించేది మనిషి మీదే" కదా ధ్వంసపడిన ప్రకృతికి మిగిలింది ఏముంటుంది అందుకే దాని ఫలితాన్ని మనిషి అనుభవించక తప్పదు. పొట్టకూటికోసం ఉన్నవూరు వదిలి వలసపోయిన కార్మికులు, శ్రామికులు కరోనా సంక్షోభంలో తిరిగి తమతమ గ్రామాల బాట పట్టినప్పటి దృశ్యాలు - " ఒడవని వలపోత/వలసకూలీ రాత"అంటూ ముసలి తల్లిని ఎత్తుకొని నడుస్తున్న కొడుకు వెంట,తింటూ తింటూనే కూలిపోయిన కొడుకుని చూసి తల్లి దుఃఖం,భార్యాబిడ్డల్ని దారిలో చేజార్చుకోక తప్పని వైనం,పట్టాల వెంబడే నడుస్తూ శవాల వెతుకులాట,గ్రామాల్లో పంటహామీ లేని వ్యవసాయం తండ్లాట ఇలా వలసకార్మికుల పాదాలపగుళ్ళలో, కళ్ళల్లో ఎండిపోయిన కన్నీళ్ళలో కవి మమేకమై పోతాడు. ఎన్నెన్నో దృశ్యపరంపరలు ఒక ఏనిమేషన్ పిక్చర్ లా ఒక్కొక్క దగ్గర దృశ్యాలుగా కథాకథనాలుగా గొలుసులు గొలుసులుగా కవిత్వీకరించుకుంటూ నడుస్తుంది. ప్రాణాలకు తెగించిన వైద్యసిబ్బందికి మొక్కారు. కనిపించని శత్రువు ఎలా, ఎప్పుడు,ఎక్కడ ప్రవేశించగలుగుతుందోనని అచ్చెరువొందారు. " ప్రపంచం ప్రయోగశాల/ జీవితం చిక్కుల వల"అంటూ " గుడి అయినా/ చర్చ్ అయినా మసీదు అయినా/మఠమైనా ఆరామమైనా వైరస్ కు వ్యత్యాసం లేనేలేదు కాపలా కాయమా కరోనా ప్రవేశం ఖాయం" మనిషికే ఎక్కడలేని వ్యత్యాసాలు .అందుకే ఇన్ని విపత్కరాలు .కానీ తెలియకుండానే నరాల్లో నాటుకున్న భయం జాతి మెడ మీద వాలే కత్తి అంటాడు.అయినా రాజకీయ వైరస్ అనే దానికన్నా మతం వైరస్ భయంకరమైనదా అనే చింతనలో మునిగి పోతాడు కవి. వేల సంవత్సరాల నాటి ,రాతి యుగాలనాటి చరిత్ర అందించిన బీభత్సాలను తవ్వుకుంటూ కవి పోతాడు.ఎన్ని రకాల వైరస్సులను జనం ఎదుర్కొన్నారు.ఎన్నింటిని తట్టుకొని బయట పడ్డారు.లెక్కలూ,చిట్టాలూ తిరగేసుకుంటూపోయిన కవి చివరికి ఒక విషయం అవగాహనకి వచ్చాడు.-- "ప్రాణాలు గాల్లో వేలాడుతున్న వేళ పరస్పర సహకారం విజ్ణత ప్రపంచ సంరక్షణ ప్రపంచ దేశాల బాధ్యత" చివరికి వచ్చేసరికి కవి వేదాంతిగా మారి సత్యాన్వేషకుడయ్యాడు.కాలం మాయాజాలాన్ని దేహం,ఆత్మ,ప్రాణం,జీవితం, మృత్యువు,దుఃఖం వీటన్నింటినీ తెరిచి తరిచి తవ్వి తండ్లాడి మనిషి మనుగడలో దాగిన సత్యాన్ని వెలికి తీయటానికి సర్వవిధాలా ఆలోచనలతో,త్యాగియై,విరాగియై,తాత్వికుడై,దుఃఖితుడై కన్నీళ్ళతో కలంతో అంతరంగాన్ని శోధించి ఒక కనిపించని శత్రువు చేసిన మాయాజాలంలో చిక్కి విలవిలలాడుతోన్న ప్రపంచాన్నీ,మనిషినీ,మనిషిలోని అహంకారాన్ని ఒక భ్రాంతి లోకి వెళ్ళిపోయి దర్శించాడు కవి. " ప్రకృతి నిరంతర మనిషి పరంపర ప్రయోగశాల రెప్ప వేయదు ప్రకృతి ప్రేమ వీడదు మనిషి బతుక్కి కాలం పూచీ సహజీవనానికి పూచీ పడాల్సింది మనిషి ఈ తరానికేనా రాబోయే తరాలకు అదే హామీ " అంటూ ఒక ఆశావహ దృక్పథాన్ని ప్రకటిస్తూ ముక్తాయింపు ఇచ్చి ముగించారు కవి సిధారెడ్డి. చదువుతున్న పాఠకులు కూడా క్రమంగా ఆ దృశ్యాల్లో మమేకమై ఒక కవిత్వావరణలో చిక్కుకుంటారు. దీర్ఘ కవిత మొదలు పెట్టిన దగ్గర నుంచి అర్థవంతమైన కవిత్వపంక్తులతో ఒక సామాజిక సంక్షోభసమయాన్ని ఆలోచనాత్మకంగా మార్చి ఒక కంపనను కలిగిస్తాడు. సిధారెడ్డి ఈ కావ్య ప్రస్థానం లో ప్రస్తావించిన విషయాలు ప్రధానంగా సామాన్యుల జీవితాన్నే ప్రతిబింబించింది.కరోనా క్రమపరిణామాల్లో సంభవించిన పరిస్థితులు అందరికీ తెలిసినవే అయినా వచనాన్ని కవిత్వాన్ని సరియైన పాళ్ళలో రంగరించి దారితప్పనీకుండా ఒక పెద్ద కేన్వాస్ మీద అక్షరచిత్రంగా మార్చారు. ఒక ప్రధాన వస్తువును తీసుకుని ఒక తాత్విక చింతన తో ఒక సందేశంతో,తగినంత విస్తారంగా అనేక భావచిత్రాలతో కథలేకుండానే కథనం కలిగి వున్న అనిమేష దీర్ఘ కావ్యాన్ని రాసారు. నాలుగు దశాబ్దాలకు పైగా కవిత్వసృజనలో వచనకవిత్వదక్షులుగా పేర్కొనబడిన కవి కావటాన కవిత్వపు మూలతత్వం అవగాహన కలిగినవారు కావటాన దీర్ఘకావ్యం పరిధిని పెంచుకునేక్రమంలో అక్కడక్కడా సాంప్రదాయకమైన విశ్వాసాలు,భావాలూ,ప్రేమలు, తాత్విక చింతనా మొదలైనవి చోటుచేసుకున్నాయి. ప్రజాజీవనంలో కరోనా తీసుకువచ్చిన కొత్తజీవనపరిస్థితులు ప్రతిబింబింపచేసినప్పుడు కొంతమేరకు భావతీవ్రతతో రాసారు. సామాజిక దృష్టి, సమాజం,ప్రజలూ,మారాల్సిన దృక్పథం, ప్రభుత్వ పాలనలో రావాల్సిన, తీసుకోవాల్సిన మార్పులు మొదలైనవి కవితలో ప్రదర్శించటం గమనించదగ్గది. ఒక్కొక్కసారి తనచుట్టూ నిరాశ, అసంతృప్తి అలుముకున్న దేశంలో చీకటి జీవితాల్లో వచ్చిన అపజయాలు,స్వీయ అనుభవాలు నుండి పుట్టిన మనో వేదనలు అక్షరీకరించే టప్పుడు కూడా తన చుట్టూ పరుచుకున్న,ఇతరుల జీవితాలను పరిశీలించగలిగే నిశితదృష్టి తొలగి పోతుందేమో జీవితాలలో మారిపోతున్న వైవిధ్యాలను చూడగలిగే శక్తి నశించి పోతుందేమోనని కవి అసహాయతకు లోను కాలేదు.తన అనుభవాల్ని ప్రపంచములో అనుభవాలతో మేళవించి రాయటం వలన శైలికి,కవితా రీతికి మధ్య అభేదం లేకుండా ఈ దీర్ఘకావ్యం రాయటంలో ఘనవిజయం సాధించారు. అనిమేషులు అని రెప్ప కదపని దేవతల్ని అంటారు.ఇక్కడ అనిమేష జనాన్ని రెప్పవాల్చకుండా దాడి చేసిన కరోనా వైరస్సా? రెప్పవాల్చకుండా గజగజ లాడిన ప్రపంచమా?అని పాఠకులకు సందేహం రాకుండా -- " మృత్యుదేవత గమనిస్తూనే వుంది ప్రకృతి రెప్పవాల్చదు ప్రకృతి అనిమేష వైరస్ ఒక మిష"అంటూ కవి తన కావ్యానికి అనిమేష పేరును అర్థవంతం చేసారు. " ఆధునిక సంక్లిష్ట వచనకవితాస్వరూపాన్ని పరిపూర్ణంగానూ,సారవంతంగానూ,తాత్వికంగానూ పట్టుకున్న కవి సిధారెడ్డి" అని శివారెడ్డి గారు భూమిస్వప్నం సంపుటికి ముందుమాటలో రాసారు.ఆ మాట ఈ 'అనిమేష' కు కూడా వర్తిస్తుంది. సిధారెడ్డి నిజాయితీతో నిక్కచ్చిగా రాసే కవిత్వాన్ని చదివిన పాఠకులు సిధారెడ్డి కవిత్వాన్ని ప్రేమించకుండా ఉండలేరు.

2, నవంబర్ 2023, గురువారం

శ్రీసుధమోదుగ- అంతర్హిత

శ్రీసుధామోదుగు నవల- అంతర్హిత నేను నవలలు చదవటానికి కొంచెం బధ్ధకిస్తాను. కానీ జమైకా లో వైద్యవృత్తిలో ఉంటున్న శ్రీసుధామోదుగ రాసిన తొలినవల అంతర్హిత అందుకున్నాక ఊరికే పుస్తకం ఒకపేజీ చదివి తిరగేయాలనుకొన్న దాన్ని ఆపకుండా పూర్తిచేసాను. చదువుతున్నంతసేపూ ఒకింత ఆశ్చర్యం,ఉద్వేగం పొందాను.నేను కథ చెప్పదలచుకోలేదు.ఎందుకంటే ఎవరికి వారు చదువుతుంటేనే అనుభూతి బావుంటుంది. ఒకప్పటి జమైకా వలసజీవితం గురించి- అక్కడే ఉండటం,ఉద్యోగరీత్యా డాక్టర్ కావటం చికిత్స కోసం వచ్చే అనేక మందితో మాట్లాడే అవకాశం వీటి వలన చాలా విషయాలు రచయిత్రికి తెలుసుకోవటానికి అవకాశం ఉండే ఉంటుంది. ఉద్యమాల్లో తిరిగి అడవి దారి పట్టిన వారి గురించి రచనల్లోని, వార్తా విశేషాలు వలన కొంత ఊహించి రాయవచ్చునేమో. కానీ రూట్స్ నవలలోలాగ ఈ నవలలో ఒక అమ్మాయి తనమూలాల్ని తెలుసు కోవటానికి, అనేకానేక ఆటుపోట్లు ఎదుర్కొంటూ,తన అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ చేసిన ప్రయాణం కథనం చేయటం అద్భుతంగా ఉంది. ఈ ప్రయాణంలో తగిలిన అనేక పాత్రల్ని చివరకు వచ్చేసరికి ఒకే కుటుంబదారానికి కూర్చిన పూసల్లా అల్లటం సామాన్యమైన విషయం కాదు.ఒక్కొక్కప్పుడు ఎక్కువ పాత్రలవలన కొంత కన్‌ఫ్యూజన్ వచ్చే అవకాశం కూడా ఉంది.కానీ నవలారచనలో రచయిత్రి చాలా మెలకువతో, చాలా సామర్థ్యంతో ఎక్కడా టెంపో సడలకుండా చివరివరకూ కొనసాగించింది. ఈ నవల నడిపించే అనేక అంశాల కూర్పులో సామాజిక సమస్యలైన జోగినివ్యవస్థనీ,గడీలలోని అకృత్యాల్నీ,చెరుకు తోటల్లో పనిచేయటానికి పోయిన వలసకూలీల గాయాల్ని, యూనివర్సిటీల లోని డ్రగ్ కల్చర్ లనీ,వాటిమూలాల్ని తెలుసుకోవాలనుకున్న పరిశోధనాత్మక జర్నలిజాన్నీ, వివాహ వ్యవస్థని,యువతరంపై అనేకానేక ప్రభావాల్నీ గుదిగుచ్చి నవలగా రాయటంలో పాఠకులకు ఆసక్తి సడలనీకుండా మొదటినుంచీ చివరివరకు కొనసాగించటంలో చెయ్యి తిరిగిన రచయిత్రిలాగే రచనా నైపుణ్యం ఈ నవలలోఆసాంతం సంపూర్ణంగా వ్యక్తమౌతుంది. అయితే తెలుగు సినిమాలాగే చివరికి వచ్చేసరికి నాయికానాయకులు ఇద్దరూ మేనత్తామేనమామ పిల్లలుగా ముగింపు చేయకపోయినా కథకు వచ్చే నష్టం ఏమీ ఉండేదికాదనిపించింది. నవలలో కాలనిర్ణయం ఎక్కడికక్కడ నమోదు చేస్తూ ప్రకటించటం కూడా చాలా బాగుంది.వైద్యవృత్తిలో, కుటుంబ బాధ్యతలలో తీరిక సమకూర్చుకొని ఇంత విషయసేకరణ ఏవిధంగా చేసి రాసారనేది ఆశ్చర్యంగానూ,ఆనందంగానూ ఉంది. ఈ నవలను చదవటంలో పాఠకులు నవలలోని అంశాలతో మమేకం అవుతూ సందర్భానుసారంగా ప్రతిస్పందిస్తూ రసానుభూతి పొందుతారన్నది ఖచ్చితంగా చెప్పొచ్చు.ఆ విషయంలో యువరచయిత్రి శ్రీసుధామోదుగ రచయిత్రిగా విజయవంతం అయ్యింది. ఈ నవలలో పాత్ర చే రచయిత్రి రాసిన సంభాషణ లో భాగం తో దీనిని ముగిస్తాను. ".....పక్షుల్లో మౌల్టింగ్ అనేది ఉంటుంది. కాలానుగుణంగా పాత ఈకలు ఊడి కొత్త ఈకలు వస్తాయి. పక్షి ఎగరడానికి కొత్త శక్తి ఇవ్వడానికి అది ఉపయోగపడుతుంది. ఇదంతా సహజంగా జరగాల్సిన విషయం. బలవంతంగా పీకేస్తే ఈకలు రావు. అవి ఇక ఎప్పటికీ ఎగరలేవు. ఏదైనా సాధారణంగా జరిగినప్పుడే వాటికి రెట్టింపు శక్తి వస్తుంది. ఆ సమయం కోసం ఎదురుచూడాలి. దానికి మానసికంగా మనల్ని సిద్ధం చేసుకోవాలి." ఎంత బాగా చెప్పింది శ్రీసుధ.