30, సెప్టెంబర్ 2020, బుధవారం

జీవితసత్యం

 జీవన సత్యం

ఊహ విచ్చుకోక ముందు
అమ్మతో నాగులచవితి కి
పుట్టలో పాలు పొయ్యటానికి వెళ్ళినప్పుడు
భూమండలం బరువంతా మోసేది
ఆదిశేషుడు తన పడగ మీదే అంటే
నిజమే అనుకుని
సుతిమెత్తగా నేలపై అడుగులేసిన జ్ణాపకం_

గరిమనాభి గురించి
బళ్ళో మాష్టారు పాఠం చెప్తుంటే
పాఠ్యపుస్తకం లో
హెర్క్యూలస్ కర్రమొనపై
భూగోళాన్ని నిలిపిన చిత్రాన్ని
కళ్ళు విప్పార్చుకుని విస్తుపోతూనే
వస్తుభారమంతా
ఒక బిందువు వద్దే
కేంద్రీకృతం అవుతుందని నేర్చుకున్న గుర్తు--

తర్వాత్తర్వాత
మితృలు హితులు సన్నిహితులు
వివిధ మతవిశ్వాసులు
విభిన్న గురు అనుయాయులు
ఓకే ఒక్క మహత్తర అద్భుతశక్తి అంటూనే
వారి వారి గ్రంథాల్ని
భక్తి గా కళ్ళకద్దుకుంటుంటే
ఏ పేరైతేనేం సత్యమొక్కటేనని
మూల్యాంకనం చేసుకున్న అవగాహన--

కానీ
ఇదేమిటి!
కంటికి కనపడని
పరమాణువు కన్నా సూక్ష్మ జీవి
ఇలా తన టెంటికల్స్ పై
భూప్రపంచాన్ని గిరగిరా తిప్పుతూ
అహంభావుల్నీ  మదాంధుల్నీ సైతం
భయకంపితుల్ని చేస్తూ
ఆడుకుంటున్నట్లుగానే
విస్ఫోటనం చేస్తున్న వైనం!
ఒకరినొకరు హత్తుకొని
ఓదార్చుకోనివ్వని చిత్రం!!
అంతకంతకూ విశ్వరూపం దాలుస్తూ
అదృశ్యశతృవై
ప్రాణాలపై స్వారీ చేస్తున్న దృశ్యం!!!

ఇప్పుడు ఖచ్చితంగా
మనిషి జీవన విధానాన్నీ
మానవ మేధస్సునీ శాసిస్తున్నదీ అదే
భౌతిక దూరాల్నే కాదు
మానసిక దూరాల్నీ సృష్టి స్తున్నదీ
ఈ అదృశ్యజీవే సుమా

ఇక పైనైనా
మనిషిని నిలబెట్టేది
కులమో మతమో కాదనీ
ఆస్తులో అంతస్తులో కాదనీ
విలువైనది ప్రాణమేనన్న సత్యాన్నీ
ఎప్పటికైనా నిలిచేదిక
మానవత్వమేనన్న ధర్మాన్నీ
ఇప్పటికైనా
మనిషి గుర్తించకా తప్పదు
మనిషిగా మారకా తప్పదు.

__ శీలా సుభద్రా దేవి