21, అక్టోబర్ 2017, శనివారం

      రెప్ప ముడవని రాత్రి

బంగారుసంకెళ్ళు వేసినట్లుగా
ఇంటిచుట్టూనే కాకుండా
మనసుచుట్టూ కూడా
ఎటూ కదలనీకుండా చేసిన
జరీజలతారు తెరలవాన
ఏమీ తోచనీయని సోమరితనం
పరన్నభుక్కులా మనసులోని చైతన్యాన్ని పీల్చేసి
నిలువెల్లా అల్లుకుపోతోంది
అంతవరకూ కంటిరెప్పల్ని పట్టుకు వేలాడుతోన్న
కన్నీటీబిందువు జారుతూ జారుతూ 
నిద్రని కూడా తనతోబాటూగా లాక్కెళ్ళీ
ఎక్కడ జార్చేసిందో ఏమో కనిపించకుండా పోయింది

ఇంకేం చేయాలి?
ఏదో ఒకటి చేయకా తప్పదు
నాలోకి నేనే లోలోతుగ
మనసుచీకటి గుహలలోకి
ఆలోచన్లు వెలిగించుకొంటూ
అరవై ఏళ్ళకు పైగానే ఎదిగిన గతం తీగను
కొసలాక్కుంటూ నాకునేనే చుట్టుకుంటూ
భారంగ అడుగులు కొలుస్తున్నాను
ఇంక డొంకంతా కదిలింది
నిద్రాణం లో వున్న గాయాలతుట్ట రేగింది
అంతే
ఝుమ్మంటూ బాధలతేనెటీగలు
నిలువెల్ల అమాంతం దాడీచేసాయ్
వాటినుండి తప్పించుకునేందుకు
జీవితాన పూసిన చిరుజ్ఞాపకాలతో  
వెలిగించిన కాగడాని విదిలించాను
కాళ్ళముందు వెలుగుచాప పరచుకుంది
అంతవరకు పాదాల కింద నిప్పులు రాజేసిన 
మంటల్ని వూదుకుంటూ
కాలినగాయాల్ని మాంపుకున్నాను
ఇంకా  ఇంకా ఆరిపోతోన్న ఆలోచనల కాంతిరేఖల్తోనే
చీకట్లని  చీల్చుకుంటూ
లోలోపలికి చొచ్చుకు పోతునే వున్నాను
అంతలోనే  ఏమూలనుండో   కళ్ళకు మిరుమిట్లుగొలుపుతూ
దూసుకువచ్చిన  సూర్యకిరణం తాకేసరికి   
జలదరించిన శరీరాన్ని
వెచ్చని వెలుగుతో స్నానించి
తెరల్ని చీల్చుకుంటూ
వెలుతురు పిట్టనై ఒక్కసరిగా
ఎగిరేను
      
 

20, ఏప్రిల్ 2017, గురువారం

kathakudu

ఒక విస్మృత కథకుడు -కొడవంటి కాశీపతి రావు
చాసో,రోణంకి అప్పారావు వంటి సాహిత్యప్రముఖుల సన్నిహితత్వం తో సాహిత్యస్ఫూర్తి నిఅందుకుని ,రావిశాస్త్రి ఏ కలవ్య శిష్యరికం తో క్లుప్తత, గాఢతకలిగి పదునైన వాక్యానిర్మాణం తో సమాజం పై వ్యంగ్య బాణాలు సంధిస్తూ కథానిక ఎలా ఉండాలో తెలియజేసేలా వుండే కథల్ని 1964 నుండి పాతికేళ్ళపాటు ఆనాటి అన్నిమాస,వార పత్రికలలో పుంఖానుపుంఖాలుగా వందకు పైగా  రచనలు సాగించిన కథకుడు కొడవంటి కాశీ పతి  రావు .
     కాశీపతి  రావు వెంట వెంటే తిరుగుతూ సాహిత్యసమావేశాలు జరుపుతూ  తదనంతరం సాహిత్యరంగం లో మీసాలు మెలి తిప్పేంతగా ప్రముఖ సాహితి వేత్తలు గా రూపొందిన వాళ్ళు చాలా మందే  వున్నారు. అందులో కొందరు భౌతికం గా లేరు .
   ఇంకా కథలలో మాండలికం రాయటం అంతగా లేని కాలంలో రావిశాస్త్రి ప్రభావం తో అనేక కథలు రాశారు స్వీయరచనల్ని ముగ్ధ ,వెలుగు తుప్పర్లు ,బొంకుల దిబ్బ కథలు గా మూడు సంపుటాల్ని కాక విజయనగరం లోని తోలి తరం కథకుల మొదలు తరాల వారీగా కథలవాకిలి,కథా నగరం వంటి మూడు సంకలనాలు వెలువరించారు
     తరవాత తర్వాత సాహిత్యరంగం లో పెల్లుబుకుతున్న అనేకానేక వివక్షతలకి నివ్వెర పోయి ,స్వార్ధప్రయోజనాల్ని ఆ శించే విధానాల్ని చూసి అసహ్యించుకుని తానూ సేకరించిన అమూల్య మైన కథకుల సంపుటాల్ని కథానిలయానికి అందజేసి,అస్త్ర సన్యాసం చేసి   సాహిత్య సంస్థలకి ,సాహిత్యరంగానికి,పత్రికలకి దూరంగా వుండిపోయాడు.
    ఇప్పుడు  చాలా మంది కి కొడవంటి కాశీపతిరావు  తెలియదు. విజయనగరం లో పుట్టి పెరిగి ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగిన కాశీపతి రావుకి విజయనగ రం పట్ల గాఢమైన  అనురక్తి విజయనగరాన్ని అమితం గా ప్రేమిస్తూ ,విజయనగరాన్ని శ్వాసిస్తూ వుండే కాశీపతిరావు విజయనగరానికి దూరంగా హైదరాబాద్ నగరం లో కుమారుల ఇంట   తన 72 వ ఏట  నిన్న( ఏప్రిల్ 19 గురువారం )రోజున భౌతికం గా కూడా దూరం అయ్యారు. ఈయన భార్య శిలా వీర్రాజు గారి సోదరి ,ఆమె రెండేళ్ల క్రితం చని పోయారు 
        ఈ  కథకుడి తో రక్తం పంచుకు జన్మించటమేకాకుండా ,సాహిత్య వారసత్వాన్ని కూడా పంచుకున్నందుకు సోదరిగా ముఖపుస్తకం ద్వారా ఆయన్ని పరిచయం చేస్తూ అశృనివాళి అర్పిస్తున్నాను .