3, డిసెంబర్ 2021, శుక్రవారం

అలకలకొలికి

అలకల కొలికి ఎందుకో మరి నామీద అలిగింది. ఉదయం లేచిన దగ్గర నుంచి డమ ఢమ లాడే డక్కుల బండికి దారం కట్టి చప్పుడు చేసుకుంటూ నా వెనకెనకే తిరిగి నాకు తోచనీకుండా వెంట బడేది ఆ దారాన్ని నా కొంగు కు తగిలించి తాను పక్కకు తొలిగేసరికి చప్పుడు చేయని డక్కులబండి ఏమూలో ఉందో కానీ బండి లేని దారం నాకు భారం అయ్యింది ఇలా నిశ్శబ్ధం నా కొంగు కి మూటగట్టి మరి ఎందుకో నామీద అలిగింది స్నానానికి వెళ్తే తలుపు దగ్గర నిలబడి తొందరగా జలకాలాడి రమ్మని కాపలా కాసి వేధించేది అటువంటిది స్నానాలగది తలుపుకి నిశ్శబ్దాన్ని తగిలించి నామీద అలిగి ఎక్కడికి వెళ్ళిందో మరి ఎంత వెతికినా కనిపించలేదు భోజనం చేస్తున్నప్పుడు కూడా అన్నం ముద్ద పెట్టుకున్న నా వేళ్ళను పట్టి బలవంతంగా లాక్కెళ్ళి చేతులు కడుక్కునేవరకూ సతాయించి కలం కాగితం అందించేది ఇప్పుడెందుకో నామీద అలిగి మూతి ముడుచుకు కూర్చుంది కాసేపు ఏపుస్తకమో పట్టుకుని మంచి రసపట్టు లో సాహిత్యం లో మునిగి తేలుతుంటే చాలులే చదివింది అని మధ్యలో నన్ను వేధించేది కాస్తా ఎక్కడో నిశ్శబ్దంగా దాక్కుండిపోయింది కాసేపు విశ్రాంతి గా కూచోనీకుండా వీపుమీద వాలి గూగూలు ఊగుతూ జుట్టును జడలల్లుతూ ఆలోచనల్లోకి చొరబడి తలపుల్ని అల్లుకోమని అల్లరి చేసేది ఎందుకో మరి అలిగి కూచుంది. రోజంతా అలసిసొలసి పక్కమీద వాలి గాఢనిద్రలోకి వెళ్ళిపోతానా నెమ్మదిగా పక్కన చేరి బలవంతాన కనురెప్పలు విప్పి కలల్ని దోచుకొన్నదే కాక చాలులే నిద్ర రారమ్మని కథలూ కవితలూ చెప్పుకునే సమయమైందని చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళే అక్షరం ఏమైందో ఏమో మరి నామీద అలిగి ఏ మూలో నక్కీంది. ఇప్పుడు ఎలాగైనా నా అక్షరాల్ని వెతికి పట్టుకుని లాలించి హృదయానికి హత్తుకుని అలకతీర్చి కవితతో ముద్దాడాలి.

నడక దారిలో-- 9

* నడక దారిలో--9 * నా స్కూల్ ఫైనల్ చదువు పూర్తిఅయ్యేలోపున మా అన్నయ్య ఎమ్మే ఎమ్ ఫిల్ పూర్తి చేసి మహారాజా కాలేజీ లో ఇంగ్లీష్ లెక్చరర్ గా ఉద్యోగం లో చేరాడు.మా స్కూల్ లోనే పనిచేసే మా అన్నయ్య సహోద్యోగి ఉపాధ్యాయుల అప్పల నరసింహమూర్తి గారు కూడా పై చదువు పూర్తి చేసుకుని కాలేజీలో తెలుగు లెక్చరర్ గా చేరారు.మా చిన్నన్నయ్య కూడా బీయిడీ పూర్తిచేసుకుని హైస్కూల్ లోనికి ప్రమోట్ అయ్యాడు. ఇంత దూరం లో ఎందుకని పుత్సలవీధి చివర తూర్పు బలిజ వీథిలో ఇల్లు చూసుకుని మారిపోయాము. మా తాత గారి ఇంటి పేరైన పుత్సలవీథి ఆ చివర నుండి ఈ చివరివరకూ దగ్గరా, దూరపు బంధువులే.మా అయిదుగురు మేనమామలూ,మా పెద్ద నాన్నగారు,వారి అమ్మాయి ఉండేది ఆ వీథి లోనే,ఆ వీథిలో రోడ్డుకి ఇరువైపులా నేత పని చేసేందుకు సరి అమర్చబడి ఉంటుండేది.కొన్ని ఇళ్ళల్లోంచి మగ్గం నేస్తున్న శబ్దం వినిపించేది. నేను స్కూల్ ఫైనల్ పాసయ్యానని తెలిసి మా పెదనాన్న గారు మా చిన్నన్నయ్య తో "మా మనవరాలు వచ్చింది.ఇక్కడ ఆంధ్రా మెట్రిక్ పరీక్ష కట్టింది.మీచెల్లిని రేపు మా ఇంటికి ఒకసారి రమ్మని చెప్పు." అన్నారు. ఇంతవరకూ ఆయనను ముఖాముఖి కలిసింది లేదు.మర్నాడు మొదటిసారి వెళ్ళాను.కుశల ప్రశ్నలు, నా అభిరుచులు,కాలేజీలో చేరిన విషయాలు అడిగారు ఆయన.అడిగిన వాటికి స్పష్టం గానూ, ముక్తసరిగా సమాధానం చెప్పి ఆయన మనవరాలి తో కాసేపు కబుర్లు చెప్పి, భోజనం చేసాను. తిరిగి ఇంటికి వెళ్తానని చెప్పి బయలుదేరుతుంటే నాకు వాళ్ళు అమ్మాయి చేత చీర ఇప్పించారు.నాకు చాలా ఆశ్చర్యం కలిగింది.ఎందుకంటే ఏనాడూ ఏ సందర్భం లోనూ ఇలా ఎవరి నుండీ బట్టలు తీసుకోలేదు."ఎందుకండీ"అని వెనుకంజ వేస్తే "పరీక్షపాసయ్యావుకదా"అన్నారు పెద్దనాన్న గారు.పెద్దవారి మాటను కాదనలేక మరి మాట్లాడకుండా తీసుకుని ఇంటికి వచ్చేసాను. అంతకు ముందు ఉన్న కంటోన్మెంట్ లోని ఇల్లయితే కుమారీ తో కలిసి కబుర్లు చెప్పుకుంటూ కాలేజీ కి వెళ్ళే దాన్ని.ఇప్పుడు నేనొక్కదాన్నే పుత్సలవీథిలో రోజూ నా వెనకే శల్యపరీక్ష చేస్తున్న ఎన్నెన్నో చూపులబాణాలు నిలువెల్లా నన్ను గాయాలు చేస్తుంటే రోజూ అగ్నిప్రవేశం చేస్తున్న సీతలా అయిపోయేదాన్ని. అదే వీథి లో ఉన్న ఒక మామయ్య కూతురు ఆ ఏడాది బాలికల పాఠశాల లో ఆరో తరగతి లో చేరింది.ఆ స్కూలు మా కాలేజీ ఉన్న మాన్సాస్ ఆవరణలోనే ఉండేది.మరి ఆ పిల్ల కి తోడు కోసమేమో నన్ను పిలిచి మా రిక్షా లోనే కాలేజీకి వెళ్ళమని అన్నారు.సరే అని రోజూ వాళ్ళింటికి వెళ్ళి ఇద్దరం కలిసి రిక్షాలో వెళ్ళే వాళ్ళం. తిరిగి వచ్చేటప్పుడు మాత్రం ఆ అమ్మాయి వెళ్ళిపోయేది.నాకు ప్రాక్టికల్స్ ఉంటాయి కనుక ఒక సమయం అంటూ ఉండదు.అదీ గాక కాలేజీ అయిపోయిన తర్వాత మహారాజా సంగీత కళాశాలలో కర్నాటక గాత్ర సంగీతం క్లాసులో చేరాను.అందువలన నేను ఇంటికి వెళ్ళటానికి ఆలస్యం అయ్యేది. ఒకరోజు ఎప్పటి లాగే మామయ్య వాళ్ళింటికి వెళ్ళి మామయ్య కూతురు నేనూ వాళ్ళ రిక్షాలో కాలేజీకి బయలుదేరాము.దారిలో "నువ్వు ఇంకా ఎన్నాళ్ళు చదువుతావు వదినా" అని ప్రశ్నించింది ఆపిల్ల. "పీయూసి అయ్యాక ఇంకా చాలా ఏళ్ళు చదవాలి.మూడేళ్ళ డిగ్రీ చేయాలి. టీచర్ అయ్యేటట్లైతే ట్రైనింగ్ చేయాలి. తర్వాత ఉద్యోగం చేయాలి".కలలో తేలి పోతూనే అన్నాను. " ఆడపిల్లలు ఎక్కువ చదువుకుంటే పెళ్ళిళ్ళు అవ్వటం కష్టం అంట కదా?"అన్న ఆ పిల్ల మాట వినగానే దబ్బున కలలలోంచి ఇల పైకి పడినట్లైంది. "ఎవరన్నారు?"కొంచెం తీవ్రం గానే నాగొంతు ధ్వనించి నట్లుంది.ఆరవతరగతి చదువుతున్న ఆ అమ్మాయి "ఏమో అందరంటున్నారు "బిక్కమొఖం తో నెమ్మదిగా అంది. ఇంట్లో బహుశా నా చదువు గురించి జరిగిన చర్చ లో పెద్దవాళ్ళ మాటల్ని చిలకలా పలికిన ఆ పిల్ల వైపు జాలిగా చూసాను." నీతో వస్తుంటే నాకు కాలేజీ లో క్లాసుకు లేటవుతుంది.రేపటి నుండి నేను విడిగా ముందు వెళ్ళిపోతాను.నీతో రాను "అన్నాను.మరి వాళ్ళింటికి వెళ్ళలేదు. ఆ అమ్మాయి పదోతరగతి వరకైనా చదివిందో లేదో తెలియదు.తొందరగానే ఒక పనికిరాని వెధవకిచ్చి పెళ్ళిచేసారనీ,నలుగురినో ఐదుగురినో కని పిల్లలతో ఆర్థికంగా చాలా అవస్థలు పడిందనీ, ఇప్పుడు చిన్నచిన్న ఉద్యోగాలతో ఆడపిల్లలే కుటుంబాన్ని అందుకుంటున్నారని విన్నాను. ఆ రోజుల్లోనే మా ఇంకో పెదనాన్న కొడుకు వివాహానికి మా పెద్ద మామయ్య సుందరరావు గారితో కలిసి మానాన్నగారి జన్మస్థలం అయిన ధర్మవరం గ్రామానికి వెళ్ళాను.అక్కడే ఉన్న కొంత పొలం ఇంటిలో చిన్నపాటి భాగం మా నాన్నగారి ఆస్తి ఉందట. పెళ్ళికి వచ్చిన మరో బంధువు నుండి కూడా మళ్ళీ ప్రశ్న ఎదుర్కొన్నాను." కాలేజీలో చేరావట కదా? ఇంతకీ ఏం గ్రూప్ తీసుకున్నావు?" అని.నా సమాధానం విన్నాక " ఏం లెక్కలు నీకు అంత బాగా వచ్చేమిటి?" అని వెటకారంగా మరో ప్రశ్న. అంటే ఆడవాళ్ళు సైన్స్, లెక్కలు చదవకూడదా? లేకపోతే అవి చదివేటంత తెలివి తేటలు ఆడవాళ్ళకి ఉండవనా? నాకు అర్థం కాలేదు.బహుశా అందుకేనేమో కాలేజీలో MPC క్లాస్ లో పది లోపునే విద్యార్ధినులు ఉండేవాళ్ళం.ఇప్పుడు ఆలోచిస్తుంటే నేను హైస్కూల్లో చదివేటప్పుడు ఒక్క మహిళా టీచరూ లేరు.ఇక మా మహిళా కాలేజీ లో లెక్చరర్లు కూడా చాలావరకూ అగ్రవర్ణాలకు చెందిన వారూ,లేదా తమిళ, మళయాళీ వాళ్ళే.లెక్చరర్లే కాదు విద్యార్ధినులు కూడా అంతే.అప్పట్లోదళిత,బహుజన బాలికలకు రిజర్వేషన్లు లేవా? ఏమో తెలియదు.కుటుంబ కట్టుబాట్లు వల్లనే ఉన్నత విద్య చదువుకునే వారు కాదేమో.నిజానికి ఇప్పటికీ అటువంటి పరిస్థితులవలనే కొన్ని ప్రాంతాల్లో,కొన్ని దళిత, ఆదివాసీ కుటుంబాల్లో బాలికలకు విద్య ఎండమావి గానే ఉంది. అరవై ఏళ్ళ క్రితం పరిస్థితి అది అనుకోవాలేమో.ఈనాడు చాలా మంది ఆడపిల్లలు టెక్నికల్ చదువులు ఇక్కడే కాక దేశవిదేశాల్లోకి కూడా వెళ్ళి చదవటం చూస్తుంటే నాకు ఎంత అబ్బురంగా ఉంటుందో! తమాషా ఏమిటంటే అరవై ఏళ్ళ క్రితం లెక్కలు నీకు అంత బాగా వచ్చేమిటి అని వెటకారంగా అన్న వ్యక్తే ముఫ్ఫై ఏళ్ళకిందట నా కూతురునీ అలాగే ప్రశ్నించటం ఇంకా ఆశ్చర్యం. ఆ గ్రామంలో మరొక అనుభవం ఏమిటంటే పెళ్ళికి వచ్చినవారు చుట్టు పక్కల వాళ్ళూ నన్ను ఉమా అని పిలవటం నేను ఉమని కానంటే బుగ్గలు నొక్కుకుంటూ అచ్చం ఉమ లాగే ఉన్నావే అని బోల్డంత ఆశ్చర్యపోవటం ఇప్పటికీ గుర్తు. ఆ ఉమ అన్న అమ్మాయి మా నాన్నగారి దూరపు బంధువుల అమ్మాయి అచ్చంగా నా వయసే.ఆ అమ్మాయి కూడా ఈ విషయం తెలిసి నన్ను చూడటానికి కుతూహలంగా వచ్చింది.మా ఇద్దరినీ చూసిన వాళ్ళు కూడా ఎంత పోలిక ఉందో అంటూ ఆశ్చర్యపోయారు.డబుల్ ఏక్షన్ సినిమాలోలా మన లాంటి వ్యక్తి ని దగ్గర గా చూడటం గొప్ప అనుభవం కదా! పెళ్ళినుండి తిరిగి వచ్చాక కొంతకాలం మా ఇద్దరి మధ్యా ఉత్తరాలు నడిచి ఆగిపోయాయి.ఇప్పుడు ఆ ఉమా ఎక్కడ ఉందో ఏమో తెలియదు.ఒక్కొక్కప్పుడు గుర్తు వేస్తే ఈ వయసులో కూడా నాలాగే ఉందా,మారిందా అనుకుంటాను. --- శీలా సుభద్రాదేవి.

నడక దారిలో-- 11

నడక దారిలో-- 11 ఒక్కసారిగా మళ్ళా నా చదువుకు విరామం వచ్చింది.సెప్టెంబర్ లో గానీ తిరిగి సప్లిమెంటరీ పరీక్ష ఉండదు.ఒకవేళ చదివిస్తే మే-జూన్ లో గానీ కాలేజీ ఉండదు. నా అభిరుచులను సానపెట్టటానికి మళ్ళీ పూనుకున్నాను.లేకపోతే మానసికంగా కుంగిపోతానుకదా! ఆ అవకాశాన్ని నా మనసుకీ,నా మెదడుకీ ఎప్పుడూ ఇవ్వటం నాకు ఇష్టం లేదు. ఈరోజుల్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకూ , నిరక్షరాస్యులు, విద్యావంతులు కూడా అనేకమంది అతి చిన్న విషయాలకు కూడా కుంగిపోయి అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటారు.అలా ఐతే నేను ఎన్నిసార్లు కుంగిపోవాలో ఎన్నిసార్లు అవాంఛిత నిర్ణయాలు తీసుకోవాల్సివచ్చేదో.ఎప్పటికప్పుడు నాకు నేనే ,నన్ను నేనే స్పూర్తి కలిగించుకోవటం నావిధానం. ఇప్పుడు మళ్ళా కథలోకి వెళ్తాను. సాయంత్రం సంగీతం కాలేజీకి నాలుగుగంటలకి వెళ్తే ఆరువరకూ నా క్లాస్ సమయం. మా కాలేజీ ప్రిన్సిపాల్ గా అప్పట్లో ద్వారం భావనారాయణ గారుఉన్నారు.మా గాత్రం గురువు గారు బురిడి లక్ష్మీనారాయణ గారు.ద్వారం మంగతాయారు గారు వయోలీన్ గురువు గారు గా ఉండే వాళ్ళు. సంగీత కళాశాలకు గొప్ప చరిత్ర ఉంది.విజయనగరం సంస్థానాథిపతి పూసపాటి విజయరామ గజపతిరాజు తన ఆస్థానంలోని ఉద్యోగి చాగంటి జోగారావుగారి అంధ కుమారుడు బాబు కోసం 1919 ఫిబ్రవరి 5న గాన పాఠశాలను ఏర్పాటు చేశారు. ఆనాడు ఈ పాఠశాలకు హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు అధ్యక్షులు. అనంతరం వయోలిన్‌ వాద్యంలో మేటి అయిన పద్మశ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు విద్యార్థిగా చేరటానికి రాగా ఆయననే అధ్యక్షులుగా నియమించారు. ఈ కళాశాలలో వీణ, గాత్రం, వయోలిన్‌, మృదంగం, సన్నాయి, డోలు వాద్యాలతో బాటూ నృత్యంలో కూడా శిక్షణ ఇస్తారు. మా గురువు గారు నా గ్రూప్ వాళ్ళకి పాఠం చెప్పి బయట చెట్లు కింద ప్రాక్టీస్ చేసుకోమనేవారు.మేము సరీగా పాడుతున్నామోలేదో చూడటానికి మాచేత ప్రాక్టీస్ చేయించటానికి మాకు సీనియర్ విద్యార్థినులైన ద్వారం లక్ష్మీ, ద్వారం పద్మ లకు అప్పగించేవారు.అప్పటికి లక్ష్మీ,పద్మా పది,పన్నెండేళ్ళ పిల్లలు.వాళ్ళు తమ కన్నా వయసులో పెద్దవారిమైన మాచేత ప్రాక్టీస్ చేయిస్తుంటే తమాషాగానే కాక ముద్దుగా ఉండేది.వాళ్ళు మా చేత పాడించటమే కాక వాళ్ళూ తమ పాఠాన్నీ ప్రాక్టీస్ చేస్తుంటే వినటం నాకు ఇష్టం గా ఉండేది. సంగీతకళాశాల ఆవరణలో చెట్లకింద ఒకచోట వీణమీద కృతులు ప్రాక్టీస్ చేస్తున్నవాళ్ళూ,మరోచోట ఫిఢేలురాగాలూ, ఇంకోచోట మృదంగ దరువులూ వినిపిస్తుంటే మనసంతా రాగమయం అయిపోతుండేది.ఏమూలో సన్నగా వినిపించే మువ్వలసవ్వడి మరోలోకంలోకి తీసుకుపోతుండేది.నాకు ఎప్పుడోఏదో పుస్తకంలో కలకత్తా లోని శాంతినికేతన్ గురించి చదివిన దగ్గర నుండి అక్కడ చదవకపోయినా పర్వాలేదు కానీ ఒకసారి చూడాలని చాలా కోరికగా ఉండేది.సంగీత కళాశాలలో సంగీతం నేర్చుకున్నంతకాలం అది గుర్తు వచ్చేది.అందుకే పాఠం నేర్చుకున్న తరువాత కూడా చాలా సేపు అక్కడే ఉండేదాన్ని. 1969లోనే సంగీత కళాశాల స్వర్ణోత్సవాలు జరగటం ఒక మరువలేని జ్ణాపకం.వారం పదిరోజుల పాటు కళాశాల పూర్వ విద్యార్ధులు అయిన శ్రీరంగం గోపాలరత్నం,మంగళంపల్లి, ఘంటశాల, సుశీల,నూకల చిన సత్యనారాయణ,నేదునూరి కృష్ణమూర్తి వంటి మహామహుల కచ్చేరీలు ప్రత్యక్షంగా వినటం ఎంతో అపురూపమైన గొప్ప జ్ణాపకం. నిజానికి నేను సంగీతం కళాశాల లో చేరింది.సంగీతం పూర్తిగా నేర్చుకొని కచ్చేరీలు చేసేందుకు కాదు.నాకు లలిత సంగీతం పాడటం ఇష్టం.అపశృతులు రాకుండా పాడటానికి స్వరజ్ణానం ఉంటే కంఠం ఒకే పిచ్ లో సాగి శృతిపక్వంగా ఉంటుంది.మరొకటి కళాశాల ఆవరణలోని సంగీత సాగరంలో ఓలలాడుతూ మానసికంగా సేదతీర్చకోటానికి. అంతేకాకుండా అమ్మకు సంగీతం అంటే ఇష్టం.అమ్మ చిన్నప్పుడు వాళ్ళ బంధువు అమ్మవయసుదే హార్మొనీ తో పాడుతుంటే అమ్మ వెళ్ళి వినేదట‌.ఒకసారి పని చేసుకుంటూ ఉత్సాహం తో స్వరాలు కూనిరాగాలు తీస్తుంటే మాతాతగారు "ఆ సాని పాటలు పాడేవంటే నాలుగు వాయిస్తాను"అని తిట్టాడని చెప్పింది అమ్మ ఓ సందర్భంలో. అమ్మ పనులు చేసుకుంటూ భూకైలాస్ సినిమాలోని ' దేవదేవ ధవళాచల మందిర గంగాధరా' భీష్మ లోని 'మహాదేవ శంభో' పాటల్ని సన్నటి కంఠంతో పాడటం చాలా సార్లు విన్నాను.అందుకేనేమో ఇంట్లో ఎవరూ లేనప్పుడు నేను గొంతెత్తి చిన్నప్పటి నుండి పాటల్ని పాడుతుంటే సంభ్రమం గా వినేది. నేను సంగీత కళాశాల లో చేరటానికి వెనకదన్ను అమ్మే.పగలంతా సంగీతం పాఠాలే కాక ఎప్పటిలా లలిత సంగీతం కూడా పాడుకునే దాన్ని. నాకున్న సంగీతం అభిరుచి గుర్తించో మరేమో తెలియదు కానీ అన్నయ్య విజయనగరంలోని న్యూపూర్ణా థియేటర్ లో ఇంగ్లీష్ సినీమా " సౌండ్ ఆఫ్ మ్యూజిక్" కు తీసుకు వెళ్ళాడు.అదే కాక ఎవరో ఒకర్ని సాయంగా పంపి జూలియస్ సీజర్, క్లియోపాత్రా,గన్స్ ఆఫ్ నౌరోన్,బెన్ హర్ ఇలా చాలా సినిమాలకు పంపించాడు.ఆంతమాత్రాన నాతో ఆత్మీయంగా మాట్లాడాడని కాదు.తన చుట్టూ పరిధి చుట్టుకునే ఉండేవాడు. అంత ఇష్టంగా సంగీత కళాశాల లో చేరినా డిగ్రీ రెండవ సంవత్సరం లో చదువు ఒత్తిడీ,ఇతర ఆసక్తులు వైపు మనసు పరిగెత్తటం తో సంగీతానికి స్వస్తి చెప్పేసాను.రోజూ గంటలు గంటలు పాటలు పాడుకోవడమే కాకుండా అమ్మకి సాయం చేస్తున్నా, ఎంబ్రాయిడరీ చేస్తున్నా,, బొమ్మలు వేస్తున్నా నా కంఠం నుండి రాగం తీగలు తీగలు గా సాగుతూనే ఉండేది. అటువంటిది వివాహానంతరం హైదరాబాద్ వచ్చాక ఉమ్మడి కుటుంబం లో అలవాటు ప్రకారం రాగాల తీగలు గొంతులు లోంచి సాగబోయి వెక్కిరింతని తాకి ముడుచుకుని తిరిగి కంఠం చుట్టూ బిగుసుకున్నాయి.అంతే మళ్ళీ ఎప్పుడు అందరూ ఉన్న ఆ ఇంట్లో గొంతు విప్పలేదు.ఏ రాత్రి పూటో పాపాయిని నిద్రపుచ్చటానికి సన్నటి జోలపాటగా మిగిలి పోయింది.అప్పుడే రంగనాయకమ్మ రాసిన నవల "కళ ఎందుకు" గుర్తొచ్చి కళ్ళు చెమ్మగిల్లేవి. తిరిగి పదేళ్ళకి బియిడీ చదివేటప్పుడు జాతీయ పండుగ ప్రోగ్రాము కోసం కొంతమంది తో ప్రాక్టీస్ చేయిస్తుంటే అక్కడే వింటున్న నా కంఠం నుండి అనుకోకుండా ఆ పాట వెలువడింది.నా సహవిద్యార్థినులతో పాడిస్తున్న మేడం ఆశ్చర్యం గా చూసి మంచి కంఠం అని పొగిడి ఏదైనా దేశభక్తి పాట నన్ను పాడమన్నారు.ఆరోజు గొంతెత్తి పాడాను.కానీ ప్రాక్టీస్ లేని కంఠం పొడిబారి పోవటం తో పాటు సరిగా రాలేదనిపించి దిగులు వేసింది. తర్వాత ఉద్యోగంలో చేరాక స్కూల్లో జాతీయ కార్యక్రమాలకోసం పిల్లలకు పాటలు,డాన్సులూ నేర్పించటమే కాక మా ప్రధానోపాధ్యాయురాలు బడిలో ఉపాధ్యాయ సమావేశాలు జరిగినప్పుడల్లా నాచేత లలిత గీతాలు పాడించేవారు. రేడియోలో వింటూ నేను సేకరించి రికార్డ్ చేసుకున్న కృష్ణశాస్త్రిగేయాలూ,సాలూరూ, బాలసరస్వతి పాడినగీతాలూ వందలాది పాటలు కేసెట్లు ప్రాక్టీస్ చేయటం లేదేమని నావైపు జాలిగా చూస్తున్నట్లనిపిస్తుంటుంది.పాట పాడాలనిపించి పాట ఎత్తకుంటే గొంతు సాగక రాగం విరిగి పోతుంటే దిగులు వేసింది.ఆ దిగులు నాలో సుడులు తిరిగి కొన్నాళ్ళు తర్వాత 2002లో "ఎగిరిపోయిన కోయిల"అనే కవిత రాసాను. అందుకే మా అమ్మాయికి చిన్నప్పట్నుంచీ సంగీతం నేర్పించాను. ‌ రేడియో ఆడిషన్ లో కూడా ఎంపికై యువవాణిలో కొన్ని లలిత గీతాలు కూడా పాడింది.ఆమెకూడా ఉద్యోగం వల్లా బాధ్యతలవల్లా సంగీతాన్ని అశ్రద్ధ చేస్తుంటే నాలాగే ఆమెకంఠం కూడా ఎక్కడ మూగపోతుందోనని విలవిలలాడిపోతాను.ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తుంటాను.సంగీతం, నృత్యం వంటివి జీవితాంతం కొనసాగించటానికి, ప్రోత్సాహం అందటానికి కేవలం ఆసక్తీ, అభిరుచి మాత్రమే చాలదు.తగిన వారసత్వం కూడా ఉండాలేమో. మూడుతరాలుగా ముందుకు అడుగువేయని సంగీత కథా కమామీషు ఇది.

6, నవంబర్ 2021, శనివారం

నడక దారిలో--1

నడక దారిలో-1 -శీలా సుభద్రా దేవి -నా నుండి బాల్యం ఎప్పుడు జారిపోయిందో తెలియదు.అందరూ బాల్యం జ్ణాపకాలు అపురూపంగా చెప్పుకుంటుంటే నేను గుర్తు తెచ్చుకోటానికి మెదడు పొరల్ని తిరగేస్తూ వెతుక్కుంటాను. -నేను ప్రాధమిక పాఠశాలకి వెళ్ళానో లేదో తెలియదు.నాకన్నా పెద్దవాళ్ళైన తోబుట్టువులను అడగాలన్న ఆలోచన వాళ్ళున్నపుడు గుర్తు రాలేదు .అయిదో క్లాసు మాత్రం విజయనగరంలోని పాతబస్టేండుకు దగ్గర ఉన్న ఆశపువీథి లోని పాఠశాలకు వెళ్ళిన గుర్తు.. - వినాయక చవితి కి స్కూల్లో పిల్లలచేత పూజ చేయించిన జ్ణాపకం.అలాగే దసరాకి బడిపిల్లలు అందరికీ విల్లూ, బాణాలు,ధరింప జేసి - ” సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు - సిరిమల్లె చెట్టేమో విరగ బూసింది - కొమ్మ విరగా కుండా పూలు కోయండి.” - ” పావలా ఇస్తే ను పట్టేది లేదు - అర్థ రూపాయిస్తే అంటేది లేదు - ఇచ్చురూపాయిస్తే పుచ్చుకుంటాము” - అని పాడుతూ విద్యార్థుల ఇళ్ళకు వెళ్తే వారివారి స్థోమత ను బట్టి పిల్లలకు పప్పు బెల్లాలు,గురువులకు తాంబూలాలు దక్షిణ ఇచ్చేవారు. ఆవిధంగా కొత్తపేట లోని మా ఇంటికి కూడా తీసుకువెళ్ళి పిల్లలకు పప్పు బెల్లాలు, మాష్టారు కి దక్షిణ ఇచ్చిిన గుర్తు మసకగా మనసులో మెదిలింది.ఇంతకన్నా  బడి ముచ్చట్లు గుర్తు లేదు. 
            నేను అమ్మ పొట్టలో ఉన్నప్పుడు మా ఇంట్లో మా చిన్నాన్న టీబీ జబ్బుతో బాధపడి చనిపోయాడట.మరణించిన సమయం మంచిది కాదని ఇల్లు విడిచి  సూర్యారావు మామయ్యా ఇంట్లో ఆరునెలలు ఉన్నారట.అక్కడే నేను పుట్టానని అమ్మ చెప్పేది.తర్వాత మళ్ళీ ఆశపువీథి ఇంటికి వచ్చేసాము. ఆవిధంగానేను మరీ చిన్నగా ఉన్నప్పుడు విజయనగరం లోని ఆశపువీథిలోనే రోణంకి అప్పలస్వామి గారి పొరుగింటి లో ఉండే వాళ్ళము.
     నేను  రోణంకి గారి గురించి నేను పెద్దగా అయిన తర్వాతే చాలా తెలుసు కున్నాను.    ఆయన బహుభాషా వేత్త.ఆరు విదేశీ భాషల్లో సైతం అనువాదాలు చేయడమే కాకుండా కవిత్వం రాసేటంతటి గొప్ప పండితులు.కేంద్ర సాహిత్య అకాడమీ తరుపున మాకియవల్లీ ప్రిన్స్ రాజనీతి గ్రంధాన్ని ఇటాలియన్ భాష నుండి ఆంధ్రీకరించారు.మన ప్రాచీన ప్రబంధాలలో సొంపయిన పద్యాలు ఎన్నిటినో బహురమ్యంగా రోణంకి వారు ఆంగ్లీకరించారు. వీరి ఆంగ్ల రచనలు “SONGS AND LYRICS, INDIAN LOVE POEMS” అనే రెండు సంపుటాలుగా వెలువడ్డాయి. స్థానిక మహారాజా కళాశాలలో ఆంగ్ల ఆచార్యులు గా పని చేసారు. ఆరుద్ర, శ్రీశ్రీ, నారాయణబాబులకు స్పూర్తి ఇచ్చినవారు. - మానేపల్లి, చిత్రభాను, మోహనప్రసాద్‌, చాగంటి తులసి – మొ||వారి పుస్తకాలకు ముందుమాటలు రాశారు. ఆరుద్ర తన తొలి కావ్యం -‘త్వమేవాహం’నూ, మానేపల్లి తన తొలి కవితా సంపుటినీ రోణంకి వారికి అంకితం చేసారు. - రోణంకి వారింటికి ఆనాటి ప్రముఖ కవులూ,రచయితలు అందరి రాకపోకలు ఉండేవట.వారందరూ సాహిత్య చర్చలూ, సాహిత్య గోష్టులూ జరిపేవారని విన్నాను.అల్లసాని పెద్దన, భట్టుమూర్తి,క్షేత్రయ్య మొదలూ శ్రీశ్రీ, నారాయణబాబు కవితల్నే కాక చావలి బంగారమ్మ , చాసో రచనల్ని సైతం ఆంగ్లం లోకి అనువాదం చేసినవి కూడా దేశవిదేశీి పత్రికల్లో ప్రచురితమయ్యాయి.ఇలా ఎన్నో ఆసక్తి కరమైన విషయాలు కర్ణాకర్ణిగా విన్నాను.  వారి గురించి చెబుతుంటే అదో పెద్ద వ్యాసం ఔతుంది.
          ఆరోజుల్లో పోలియో ప్రభావం ఎంత ఎక్కువ గా ఉండేదో అనేది రోణంకి వారి కుటుంబం చూస్తే తెలుస్తుంది.అప్పలస్వామి గారి చెల్లెలు బాలవితంతువు వీరింట్లోనే ఉండేది ఆమె,అప్పల స్వామి గారి పిల్లలు ముగ్గురు పోలియో బాధితులు. - నా తోబుట్టువులు అందరకూ కూడా రోణంకి వారింటిలోని సమ వయస్కులైన పిల్లలతో మంచి స్నేహం ఉండేది.వారి ఆఖరు అబ్బాయి నా క్లాసుమేట్ అయిన రోణంకి నారాయణరావు నాకన్న కాస్త చిన్నవాడు కావటం మొగపిల్లాడు కావటం వలన వారి నాలుగో అమ్మాయి, అతని కన్నా పెద్దదైన లలిత తో నాకు స్నేహం . - లలిత అప్పట్లో డాన్స్ నేర్చుకునేదనుకుంటాను. సాయంత్రం నేను వాళ్ళింటికి లలితతో ఆడుకోవటానికి వెళ్ళినప్పుడు డాబా మీద లలిత డేన్స్ ముద్రలు నేర్పించేది. ఒక్కొక్కరోజు లలితా వాళ్ళ అమ్మా,మేనత్తా నన్ను పాటలు పాడమనేవారు.పెద్దక్కయ్య దగ్గర నేర్చుకున్న పాటలు,ఆ రోజులనాటి సినీమా పాటలూ పాడేదాన్ని.ఒకరోజు అలా పాటలు పాడుతుంటే అప్పుడే వచ్చిన రోణంకి వారు ” ఏం పిల్లా నీకు పుత్తడి బొమ్మా పూర్ణమ్మ పాట వచ్చా?” అన్నారు. నేర్చుకుని ఈ సారి వచ్చినప్పుడు పాడతానన్నాను.ఆ తర్వాత పంతంగా నేర్చుకుని మరీ పాడితే ఆయన మెచ్చుకుంటూ తలపంకించటం మరువలేని జ్ణాపకం.తర్వాత మాత్రం మళ్ళీ ఏం పాడమంటారో అని ఆయనకు కనపడకుండా దాక్కుంటూ డాబా పైకి పరిగెత్తే దాన్ని. -
        రోణంకి అప్పలస్వామి గారు అంత విద్యావంతులు.మేథావి అయినా ఇతరభాష పండితులతో అనర్గళంగా మాట్లాడినా తెలుగు లో మాట్లాడినప్పుడు అచ్చమైన శ్రీకాకుళం పల్లె మాండలికం లోనే మాట్లాడేవారు.అదీ మర్చిపోలేను.వారికి వారి ప్రాంత మాండలికం పైన ఎంత మమకారం ఉందో తలచుకున్నప్పుడల్లా గుర్తు వస్తూనే ఉంటుంది.అందుకే పదవీ విరమణ అనంతరం వారి స్వగ్రామం టెక్కలి వెళ్ళి స్థిరపడ్డారు. 
      నేటి తరానికి ఆయనెవరో తెలియక పోయినా, ముంజేతిలో చేతికర్ర వేలాడ దీసి, దొర టోపీ పెట్టుకొని తిరిగే రోణంకి అప్పలస్వామి గారు టెక్కలిని అంతర్జాతీయ సాహితీ ప్రపంచానికి పరిచయం చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. అందుకే వారి మరణానంతరం టెక్కలిలో వారి విగ్రహాన్ని కూడా స్థాపించి వారిని గౌరవించుకున్నారు అక్కడి ప్రజలు. 
        నేను హైస్కూల్లో చదువుతున్న రోజుల్లో ఒక సారి వాళ్ళింటికి వెళ్ళినప్పుడు.అప్పలస్వామి గారి చిన్న తమ్ముడు లక్ష్మణ రావు అనే ఆయన జర్మనీ నుంచి వచ్చాడని లలిత చెప్పింది.లోపలి గదిలోకి వెళ్ళి ఒక షర్ట్ తీసుకొచ్చి ” చిన్నా ( నన్ను చిన్న అని పిలిచేవారు)ఇది చూడు.ఎంత బాగుందో.చిన్నాయన జర్మనీ నుండి తెచ్చాడు .ఈ చొక్కాని ఉతికి ఆరేసేయటమే.నిముషంలో ఆరిపోతుంది.ఇస్త్రీ కూడా అక్కర్లేదు తెలుసా.దీనిని వాష్ ఎండ్ వేర్ అంటారట.”అబ్బురంగా చూపించింది.నేను కళ్ళు పెద్దవి చేసుకుని ఆశ్చర్యంగా చూసాను.ఆ రోజుల్లో చేనేత తప్ప మరొకటి ఎరుగని రోజులు.పేదవారు, మధ్యతరగత వారు చీటీ గుడ్డలు అని ముతకబట్ట తానులుగా వచ్చేది దానినే కొని పిల్లలకు లంగాలు కుట్టించేవారు.నైలాన్ మధ్యతరగతి వారికి తెలియని రోజులవి. 
       రోణంకివారి భార్య మహాలక్ష్మీ గారూ మా అమ్మ స్నేహితులు.సినీమాలకు కూడా కలిసి వెళ్ళేవారు.వారివెంట నేనూ,లలితబయలు దేరేవారం. మేము వారి పొరుగిల్లు ఖాళీ చేసినా నేను పెద్దయ్యేవరకూ ఆ కుటుంబంతో స్నేహాలు కొనసాగాయి..  వీర్రాజు గారి తో నా వివాహం రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యం లోనే చప్పట్ల తాళాలతో సభావివాహం గా జరిగింది. - నేను వివాహానంతరం హైదరాబాద్ వచ్చేక ఆ కుటుంబం తో కాంటాక్ట్ ఆగిపోయింది. .రోణంకి నారాయణరావు ఆంధ్రా యూనివర్సిటీ మెడికల్ కాలేజీ లో ప్రొఫెసర్ గా చేసారని విన్నాను.అతని దగ్గరకే డాక్టర్ సలహాకి వెళ్ళే మా పెదనాన్న కొడుకుని మా గురించి క్షేమసమాచారం కనుక్కునే వాడని చెప్పేవారు.నారాయణరావు పెళ్ళి చేసుకోలేదనీ ఇటీవలే చనిపోయాడని తెలిసి చాలా బాధపడ్డాను.
       పదేళ్ళ తర్వాత నేను ఎమ్మే తెలుగు చేసినప్పుడు ఫైనల్ పరీక్ష కోసం వెళ్ళినప్పుడు లలిత కూడా పరీక్ష రాయటానికి వచ్చింది.కొత్తగూడెంలో స్కూలు లో టీచర్ గా పని చేస్తున్నట్లు చెప్పింది.అడ్రస్ ఇస్తే ఒకటి రెండు ఉత్తరాలు మా మధ్య నడిచాయి.తర్వాత మెంటల్లీ డిజేబుల్ అయిన మా అబ్బాయి చనిపోవటం .నేను కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళి నన్ను నేను సముదాయించుకునే దిశలో బియ్యీడీ ఎంట్రెన్స్ రాసి మళ్ళా చదువులోపడటం,ఉద్యోగం, సాహిత్యం వీటితో లలితకు దూరమయ్యాను.అంతే మళ్ళీ కలవలేదు. - విజయనగరం వెళ్ళినప్పుడో, శ్రీకాకుళం జిల్లా కు చెందినవారు కలిసినప్పుడో రోణంకి కుటుంబం వారెవరైనా తెలుసేమోనని అడుగుతుంటాను. - అంతటి నిరాడంబర మేథావి కుటుంబంతో మాకున్న ఆత్మీయబంధం మరువరానిది.
       కానీ ఇది రాసిన అనంతరం అనుకోకుండా అప్పలస్వామి గారి మనవరాలు అంతర్జాలంలో నేను రాసినది చదివి తన గురించి తెలిపింది.వెంటనే ఆమెను సంప్రదించి లలిత చిరునామా తెలుసుకొని ఫోన్ ద్వారా కలిసాను.ఇప్పుడు లలిత,ఆమెకన్నా పెద్దవాళ్ళైన శారదా, కళావతి ని కూడా ముఖాముఖి కలుసుకో లేక పోయినా ఫోను ద్వారా స్నేహం కొనసాగటం సంతోషం కలిగించింది. నన్ను 

3, నవంబర్ 2021, బుధవారం

శ్రీదేవి మోనోగ్రాఫ్ పై తెలుగు తూలిక లో ని.మాలతి సమీక్ష

డా. పి. శ్రీదేవి. రచన శీలా సుభద్రాదేవి సాహిత్య ఎకాడమీ ఆధ్వర్యంలో డా. పి. శ్రీదేవిగారి సాహిత్యవ్యాసంగం క్షుణ్ణంగా పరిశీలించి ప్రముఖ కవయిత్రీ రచయిత్రీ శీలా సుభద్రాదేవి రచించిన పుస్తకం ఇది. పి. శ్రీదేవి అంటే కాలాతీతవ్యక్తులు, కాలాతీతవ్యక్తులు అంటే పి. శ్రీదేవి అని తెలుగులోకంలో సుప్రసిద్ధం. కొంతమందికి ఆమె తెలుగు స్వతంత్రలో ఉపసంపాదకులుగా పని చేసేరని తెలిసిఉండొచ్చు. కానీ శ్రీదేవి చిన్నకథలు, కవితలు కూడా రాసేరనీ, విమర్శలు, సమీక్షలు కూడా ప్రచురించేరనీ, ఆమెకి చిత్రలేఖనంలో పరిచయం ఉందనీ తెలిసినవారు లేరేమో. ఉంటే చాలా తక్కువ అనుకోవాలి. ఈ మోనోగ్రాఫ్‌లో లభ్యమైనంతవరకూ శ్రీదేవి జీవితచరిత్ర, తెలుగు సాహిత్యంలో వివిధశాఖలలో ఆమె చేసిన కృషిని సూక్ష్మదృష్టితో పరిశీలించి, విశ్లేషణాత్మకంగా వివరించేరు సుభద్రాదేవి. సుమారు పది సంవత్సరాలలో వృత్తిరీత్యా వైద్యరంగంలో పని చేస్తూనే సాహిత్యంలో ఇంత కృషి చేసేరా అని ఆశ్చర్యం కలుగుతుంది సుభద్రాదేవి సమకూర్చిన సమాచారం చూస్తే. ఒక్క కాలాతీతవ్యక్తులు నవల 38 పేజీలలో విశ్లేషించేరు రచయిత్రి. ఇతివృత్తం, పాత్రచిత్రణ, ఆనాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులనేపథ్యంలో శ్రీదేవి ఈనవలను ఎంత సమర్థవంతంగా నిర్వహించేరో గ్రంథస్థం చేయడం ఎంతైనా మెచ్చుకోదగ్గ విషయం. శ్రీదేవిగారి తాత్వికచింతనగురించిన విశ్లేషణ ప్రత్యేకంగా బాగుంది. కవయిత్రి సుభద్రాదేవి శ్రీదేవి కవితలను సాటికవయిత్రిగా విశ్లేషించినతీరు మనసుకి హత్తుకునేలా ఉంది. అలాగే శ్రీదేవి ఉపసంపాదకురాలిగా పని చేస్తున్న రోజులలో చేసిన విమర్శలూ, సమీక్షలూ కూడా ప్రతిభావంతంగా చేసేరంటారు సుభద్రాదేవి. తెలుగు సాహిత్యచరిత్రలో చెప్పుకోదగ్గ రచయిత్రి డా. పి. శ్రీదేవి. స్త్రీల సాహిత్యచరిత్ర, కాల్పనికసాహిత్యచరిత్రలలో ఆసక్తి గలవారు తప్పక చదవవలసిన పుస్తకం.

1, నవంబర్ 2021, సోమవారం

నడక దారిలో-- 10

నడక దారిలో--10 మహారాజా మహిళా కళాశాల మెట్లు ఎక్కిన రోజు ఎవరెస్ట్ ఎక్కినంత ఉద్వేగం పొందాను.అందులో ఒక్కదాన్నే కాలేజీ కి వెళ్ళటం.పెద్దగా వెడల్పాటి కారిడార్.సింహాచలం లోని కప్పస్తంభాల్లాంటి స్తంభాలు.పూసపాటి రాజుల రాజభవనం కావటాన ఎత్తైన సీలింగు.భవనానికి నాలుగు వైపులా మెట్లుఉండేవి.రెండు మూలల్లోని మెట్లు బయటకు పోయేందుకు.రెండు మూలల్లోని మెట్లు బిల్డింగ్ వెనుక ఉన్న హాస్టల్ రూమ్ లకూ,గార్డెన్ లోకీ వెళ్ళేందుకు ఉంటాయి. వెళ్ళగానే ఏ రూం లోకి వెళ్ళాలో తెలియలేదు.దారిలో కనిపించిన అమ్మాయిని పి.యూసి ఎంపీసీ క్లాసులు ఏ రూమ్ లో జరుగుతాయని అడిగాను‌. ఆ అమ్మాయి చెప్పిన వైపు వెళ్తే పెద్ద హాలు ఉంది.గుమ్మందగ్గర నిలబడ్డాను.అదృష్ట వశాత్తూ ఆ క్లాసులో ఉన్న కుమారి లెక్చరర్ నుంచి పర్మిషన్ అడిగి బయట కొచ్చింది.ఆ క్లాస్ లో హిస్టరీ జరుగుతుందిట.ఆ హాలు కి పక్కనే చిన్న పార్టిషన్ గది ఉంది.అక్కడ మేథ్స్ క్లాస్ అని చెప్పింది. ఇక ఆ ప్రక్కనే గది ద్వారం దగ్గర నిలబడితే అప్పటికే పాఠం చెప్తున్న లెక్చరర్ నన్ను చూసి ఇంగ్లీష్ లో ప్రశ్నించారు.అప్పుడు గుర్తు వచ్చింది.ఇప్పటివరకూ తెలుగు మీడియం లో చదివాను.ఇప్పుడు కాలేజీ విద్య తెలుగు మాధ్యమం కాదనీ, ఇంగ్లీష్ లోనే అని.ఒక్కసారి భయం నన్ను అలుముకుంది."న్యూస్టూడెంట్ నండి "అని చెప్తే లోపలికి రమ్మన్నారు.క్లాసులో నాతో కలిపి తొమ్మిది మంది మాత్రమే అమ్మాయిలు ఉన్నారు సీట్లో కూర్చుంటూ బోర్డు వైపు చూసాను.Radian అని హెడ్డింగ్ రాసి,వృత్తం లో గుర్తించి ఉంది.అంతలోనే బోర్డు చెరిపి రేడియన్ అంటే ఏమిటో వివరించమని పరీక్ష పెట్టారు. పేపరు మీద అంతకుముందు బోర్డు మీద చూసిన పటం వేసి రేడియన్ అని రాసాను.లెక్చరర్ ఉమాకుమారిగారు అందరిదగ్గరా పేపర్లు తీసుకుని దిద్ది ఇచ్చేసారు."క్లాసుకి టైముకి రావాలి.ఇలాచదువుతే లాభం లేదు"అని నావైపు చూసి కోపంగా అన్నారు. మొదటిక్లాసులోనే తిట్లు తిన్నానని దిగులు వేసింది.క్లాసులో అందరూ కొత్త వాళ్ళు నేనేమో తొందరగా స్నేహం చేయలేను.అందులోను ఇంగ్లీష్ లో చదవగలనా అని ఒక భయంవేసింది. పీయూసీ లో గణితం లో కేవలం తొమ్మిది మంది విద్యార్థినులే ఉండేవాళ్ళం కదా .మాకు ఆ చిన్న పార్టిషన్ రూమ్ లోనే క్లాసులు జరిగేవి.ఫిజిక్స్, కెమిస్ట్రీ క్లాసులు ఆయా లేబ్ లను ఆనుకొని ఉన్న రూమ్ లో జరిగేవి. కెమిస్ట్రీ క్లాసులో BZC వాళ్ళుకూడా కలవటం వలన ముప్పై మందివరకూ ఉండేవాళ్ళం.ఇంగ్లీషు, తెలుగు క్లాసులకు అన్ని గ్రూపులు వాళ్ళూ కలుస్తారు కనుక వందకి పైగా ఉండేవాళ్ళం.అదే హాలు లో బియ్యే వాళ్ళకు క్లాసులు జరుగుతాయి.అందువలన మేము ఎంత పరుగున వచ్చినా వెనుక బెంచీలలోనే కూర్చోవలసి వచ్చేది. నా బడి మిత్రులు కుమారీ ,కమలా అదే క్లాసులో ఉన్నా వాళ్ళు ముందు సీట్లో కూర్చోవటం వలన వాళ్ళతో మాట్లాడటానికే కుదిరేది కాదు.అందుచేత సెలవు రోజుల్లోనే ఒకరింటికి ఒకరు వెళ్ళి కబుర్లు చేప్పుకునే వారం. ఒకరోజు NCC లో చేరేవాళ్ళకోసం సర్కులర్ వచ్చింది.చిన్నక్క ఇంటికి కోరుకొండ సైనిక స్కూల్ కి వెళ్ళినప్పుడు అక్కడ విద్యార్థులు మార్చ్ పాష్ట్ ప్రాక్టీస్ చేస్తుంటే చూసి ప్రభావితురాలిని కావటం చేత చేరేందుకు NCC ఇన్చార్జి సంజీవి మేడం కి పేరు ఇచ్చాను.సంజీవిమేడం సన్నగా చిన్నగా ఉన్నా మంచి కమేండింగ్ వాయిస్ కలిగి ఉంటారు. ముఖంలో దృఢమైన ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది.ఒక రెండు రోజులు కాలేజీ ఐన తర్వాత ఫిట్నెస్ టెస్ట్ కోసం నడిపించేసరికి కళ్ళు తిరిగి పడిపోయాను." నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు.NCC కి పనికిరావు" అన్నారు సంజీవి మేడం. తర్వాత కాలేజీలో సంగీతం లో డిగ్రీ చేస్తున్న అమ్మాయి కాలేజీ అయ్యాక మహారాజా సంగీత నృత్య కళాశాల కు వెళ్తుందని తెలిసి ఆ అమ్మాయి తో కలిసి వెళ్ళి కర్నాటక సంగీతం గాత్రం నేర్చుకోడానికి చేరిపోయాను.రోజూ కాలేజీ పూర్తి అయ్యాక అటునుంచి అటే సంగీత కళాశాల కి వెళ్ళి ఇంటికి వచ్చేదాన్ని. అన్నట్లు మా కాలేజీ లో విద్యార్థినులకు యూనిఫాం ఉండేది.తెల్లచీర,తెల్లజాకెట్టు.ఒకరిద్దరు తెల్లవే లంగా వోణి వేసుకునేవారు.ఇక నా సంగతికి వస్తే మా పెద్ద మామయ్య మా నాన్నగారు పోయిన తర్వాత అమ్మకి ఏ రెండేళ్ళకో ఒకసారి అరవై కౌంట్ వో, ఎనభై కౌంట్ వో నేతచీరలు మగ్గం మీద ఒక సరి మీద వచ్చే ఆరు చీరలు నేయించి ఇచ్చేవారు.అందులో రెండు తనకోసం అమ్మ ఉంచుకోగా మిగతా నాలుగు చీరలూ నాకు పెట్టీకోట్లూ, పరికిణీలకూ, గలేబులకూ వాడేవాళ్ళం.కాలేజీకి చీరలు కావాలి కనుక బోర్డర్ లేని ఆ ముతక చీరలకు రకరకాల ఎంబ్రైడరీ బోర్డర్లు కుట్టు కొన్నాను.నాలుగేళ్ళ కాలేజీ చదువూ వాటితోనే గడిచిపోయింది. కాలేజీలో చేరిన తర్వాత పెద్దక్కయ్య ఒకసారి తెల్లని మెత్తని గ్లాస్కో చీర ఇచ్చింది.కానీ ఎంతో ముచ్చటగా కట్టుకున్న రోజునే కెమిస్ట్రీ ప్రాక్టికల్ క్లాసులో ప్రయోగం చేసే సమయంలో నా పక్కనే ప్రయోగం చేస్తున్న అమ్మాయి ఎవరో పిలిచారని గభాలున తిరగటం లో పరీక్షనాళిక లోని సల్ప్యురిక్ ఆమ్లం మొత్తం నాచీర మీద పడింది.వెంటనే నీళ్ళు చల్లుకున్నాను.మా మేడం రిక్షా పిలిపించి ఇంటికి పంపారు.ఇంటికి వెళ్ళగానే చల్లనీళ్ళతో స్నానం చేసి చీర బకెట్టు లో వేసేసరికి అప్పటికే చీర పీలికలు ఐపోయింది.నాకు అక్కడక్కడా చిన్న పొక్కులు వచ్చాయి తప్పా ప్రమాదం జరగలేదు. మొత్తం మీద చిన్న చిన్న అవాంతరాలతో ఏడాది గడచి పోయింది.కాలేజీ వార్షికోత్సవానికి నాకు సాయంగా మామయ్య కూతుర్లను తీసుకొని వెళ్ళాను.మొదట అందరి ఉపన్యాసాలు అనంతరం బహుమతుల ప్రదానం మొదలయ్యింది.ఇంకా సాంస్కృతిక కార్యక్రమాల మొదలు కాకపోవటంతో నా బడి మిత్రులం కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం.అంతలో నాపేరు వినిపించింది.పొరపాటున పిలిచారేమోనని నేను చూస్తుంటే 'సుభద్రా నిన్నే' అని మిత్రులు తోసారు.ఆశ్చర్య పోతూనే వేదిక వైపు వెళ్ళాను. మా మేథ్స్ మేడం ఉమాకుమారి గారు ఆ ఏడాదంతా పెట్టిన మేథ్స్ పరీక్షల్లో అత్యథిక మార్కులు సాధించినందుకు ప్రొఫీషియన్సీ ఇన్ మేథ్స్ అని నాకు ట్రిగొనామెట్రి విదేశీ ఎడిషన్ పుస్తకం ఇచ్చారు.మొదటిక్లాసులో కోప్పడిన లెక్చరర్ చేతిమీదుగా బహుమతి అందుకోవటం నాకు పట్టరాని సంతోషం కలిగించింది.ఇంటికి వెళ్ళాక మా అన్నయ్యలకు చూపిస్తే వాళ్ళ ముఖాల్లో కూడా ఆనందం కనిపించింది. ఉమాకుమారిగారి ప్రభావం వలనే నేను ఉద్యోగం చేసిన పాతికేళ్ళూ ఆరవ తరగతి నుండి పదో తరగతి వరకు మొదటి రేంక్ వచ్చిన పిల్లలకు పుస్తకాలే కాక నగదు బహుమతి కూడా ఇచ్చేదాన్ని. పరీక్షలు పూర్తి చేసాను.రిజల్ట్స్ కూడా వచ్చాయి.పేపర్లో నెంబర్ ఎక్కడా కనబడకపోవడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాను.దుఃఖ సముద్రం నిలువెల్లా ముంచెత్తింది.మధ్యాహ్నం రిజల్ట్ చూసుకుని కుమారి మా ఇంటి కి వచ్చి విషయం తెలిసి "అదేమిటి సుభద్రా నీది పోవటమేంటి ?" అని తెల్లబోయింది.ఏదో పొరపాటై ఉంటుంది.మార్కులు వచ్చాక తెలుస్తాయి అని ఓదార్చింది. మార్కులు కూడా వచ్చాయి.లెక్కలు149/150 వచ్చి మిగతావాటిలో70/ పైనే వచ్చి ఇంగ్లీష్ లో మాత్రం 34/ వచ్చి పరీక్షపోయింది.ఇప్పటిలా ఇన్స్టెంట్ పరీక్షలు లేనందున సెప్టెంబర్ లోనే రాయాలి. ఒక ఏడాది వృథా అయినట్లే. మళ్ళా నేను డిగ్రీ చదవగలనా? మళ్ళీనా చదువు కథ మొదటి కే వచ్చింది .నా చదువుకి ఇన్ని అవాంతరాలు ఏమిటో???

29, అక్టోబర్ 2021, శుక్రవారం

శీలావీ వేసిన తైలవర్ణ చిత్రాల గురించి

మిత్రులారా.మీతో ఓ విషయం పంచుకోవాలనుకుంటున్నాను. శీలా వీర్రాజు గారు తన జీవితకాలంలో ఇన్నేళ్ళుగా వేసిన నూట ఇరవైకి పైగా తైలవర్ణ చిత్రాలలో మిత్రులకు, బంధువులకూ ఇచ్చి వేయగా మిగిలిన సుమారు ఎనభై వరకూ చిత్రాలను రాజమండ్రి లోని దామెర్ల రామారావు స్మారక ప్రభుత్వ ఆర్ట్ గ్యాలరీ కి ఇచ్చేస్తున్నాము.అంతకు ముందు ఈ చిత్రాలను హైదరాబాద్,విజయవాడ, రాజమండ్రి, కావలి, యానాం, వైజాగ్ లలో ప్రదర్శనలు నిర్వహించాము.ఆ సమయం లో కొందరు చిత్రాలను కొనాలని అభిలషించారు.ఈమని శివనాగిరెడ్డి గారు విజయవాడ లో కన్వెన్షన్ సెంటర్ కోసం లక్షకు ఒక నాలుగు చిత్రాలను కొంటానన్నారు.కానీ డబ్బుకోసం అమ్మటానికి ఇష్టపడక వారికి ఒక చిత్రాన్ని బహుమతి గా ఇచ్చారు వీర్రాజు గారు. మేమిద్దరం వయసు రీత్యా బాగా పెద్దవారిమయ్యాము.మా తదనంతరం అన్ని పెయింటింగ్స్ మా అమ్మాయి ఒక్కతే సంరక్షించటం చాలా కష్ట మౌతుంది.ఇంకా ఇంట్లో ఉన్న అపారమైన సాహిత్య సంపద, కళాకృతులు ఇవన్నిటినీ నిర్వహించే బాధ్యత కూడా ఆమెపై ఉంది. అందుకే అన్నీ ఆలోచించి మేమిద్దరం ఉంటున్నప్పుడే ఈ పెయింటింగులు అన్నీ వీర్రాజు గారి జన్మస్థలం,అంతే కాకుండా వారు చిత్రకళని అభ్యసించిన దామెర్ల రామారావు స్మారక ప్రభుత్వ ఆర్ట్స్ గ్యాలరీ లోనే కనుక అక్కడే ఇవ్వటానికి నిర్ణయించాము.ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏకైక ఆర్ట్ గ్యాలరీ. ఇంతకాలం అపురూపంగా చూసుకున్న అమూల్యమైన పెయింటింగ్స్ ఇచ్చేయడం కొంత బాధగానే ఉన్నా తరతరాలుగా ఆయన పేరుతో గ్యాలరీలో ప్రదర్శింపబడుతూ ఉండటం, వీర్రాజు గారు జీవితకాలంలో చిత్రకళలో చేసిన కృషి,ప్రతిభ చిరస్థాయిగా నిలవటం మాకు సంతోషమే కదా.అందుకనే చిత్రకళాభిమానులకు అంకితంగా ఉచితంగా చిత్రకళా పరిషత్ కి ఇచ్చేస్తున్నాము. ఆ పనిలో గత నెలరోజులుగా అక్కడ ప్రిన్సిపాల్,ఇతర పెద్దలనుండి శాస్వత అనుమతి కోసం దరఖాస్తు చేసాము. చివరకు సరియైన పద్ధతిలో అనుమతి దొరికింది. ఈ పెయింటింగులు గ్యాలరీ లో అమర్చి ప్రారంభోత్సవం చేయటం బహుశా నవంబర్ నెలాఖరుకు జరుగుతుందనుకుంటాను.అప్పుడు మళ్ళా తెలియజేస్తాను. ఆ తర్వాత మీరు ఎప్పుడైనా రాజమండ్రి వైపు వెళ్తే తప్పకుండా దామెర్ల రామారావు స్మారక ప్రభుత్వ చిత్రకళా పరిషత్ లో ఉన్న శీలా వీర్రాజు గారు వేసిన తైలవర్ణ చిత్రాలు చూసి ఆనందించితే మా సంకల్పం నెరవేరుతుంది.

25, అక్టోబర్ 2021, సోమవారం

నడక దారిలో--8

నడక దారిలో----8 ఎస్సెల్సీ పరీక్షలు రాసిన తర్వాత అక్కయ్య కి డెలివరీ సమయం అని అమ్మా నేనూ సామర్లకోట వెళ్ళాం. అన్నట్లు అప్పట్లో పురుళ్ళకి హాస్పటల్ కి వెళ్ళటం తక్కువే అనుకుంటాను. ఇంట్లోనే మంత్రసాని తన చేతులమీదుగా డెలివరీలు చేసేదనుకుంటాను.ఏదైన క్లిష్టపరిస్థితుల్లో మాత్రమే హాస్పటల్ లో చేరేవారేమో.ఇవన్నీ అప్పటికి నాకు అంతగా తెలిసే విషయం కాదు. మంత్రసాని వచ్చింది.ఆ రాత్రంతా అక్కయ్య మూలుగులూ అరుపులూ, హడావుడి నాకు గాభరాగా బెంగగా అనిపించింది.అక్కయ్య ఎప్పుడూ గంభీరంగా,ధైర్యంగా,ఉండేది. స్పష్టంగా నిర్భయంగా మాట్లాడుతుందనీ ఆమెతో మాట్లాడాలంటే అందరూ జంకుతారు.అటువంటిది ఇలా బేలగా మూలుగుతుంటే నాకు దిగులుగా అనిపించింది. అక్కయ్య పెద్ద కూతురుని దగ్గరకు తీసుకుని కలత నిద్రలోనే ఆడవాళ్ళ అవస్థలు గురించి, స్త్రీల జీవితాల గురించి ఆలోచనలతో వేగిపోతూ రాత్రంతా గడిపి తెల్లవారుజామున కను రెప్పల్ని వాల్చాను. ఉదయం లేచేసరికి అక్కయ్య పక్కనే బుజ్జి పాపాయి ని చూసేసరికి రాత్రి ఆలోచనలన్నీ మటుమాయం అయ్యాయి. ఆరోజే నా ఎస్సెల్సీ రిజల్ట్ రావటం మంచి మార్కులు తో పాసవటం తో ఎంతో మరింత సంబరం కలిగింది.అనుకున్నది సాధించానన్న తృప్తితో మనసు ఉప్పొంగి పోయింది. ఆ తర్వాతరోజులు గడుస్తున్నా కొద్దీ కొంచెం కొంచెం గా బెంగ నన్ను ఆవరించటం మొదలైంది.తర్వాత ఏం చెయ్యాలి,చదివిస్తారా? సెకెండరీ గ్రేడ్ ట్రైనింగ్ చేయనా? చేస్తే ఉద్యోగం చేయనిస్తారా? ఎస్సెల్సీ పరీక్షకి ఫారం నింపేటప్పుడు జన్మతేదీ,తండ్రి పేరు అవీ తప్పులు సరిచేసుకోమని క్లాసులో అందరికీ ఫారాలు ఇచ్చి మాష్టారు చెప్పినప్పుడు నా జన్మతేదీ తప్పు ఉండటం చూసి అన్నయ్యను అడిగాను."ఫర్వాలేదులే ఉద్యోగాలు చేయాలా ఊళ్ళేలాలా ? అలా ఉండనీ పర్వాలేదులే " అన్నాడు.మారుమాటాడకుండా మాష్టారుకి నింపి తిరిగి ఇచ్చేసాను. అది గుర్తు వచ్చి చదివిస్తారోలేదో అనే దిగులు మనసుని ముంచెత్తింది. మాకుటుంబాలలో స్కూలు చదువు పూర్తి చేసినవారూ,ఉద్యోగాలు చేస్తున్న వారూ ఎవరున్నారా అని ఆలోచిస్తే మెడిసిన్ లో చేరిన మా మామయ్య కూతురు తప్పా ఎవరూ కనిపించలేదు.స్కూల్ ఫైనల్ వరకూ చదివిన వారు కూడా తక్కువే.మా అక్క చెల్లెళ్ళు మాత్రమే అంతవరకూ చదివాము.దాంతో మరింత దిగులు కలిగింది. మరేం చేయాలి.మా నాన్న గారి మరణానంతరం మా అమ్మ ఆర్థిక అస్తవ్యస్తల వలన ఎవరి ముందూ అసహాయంగా చేయి చాపటం లేదనే కోపంతో " అందం ,ఆస్తులూ ఉన్నవాళ్ళకే పెళ్ళిళ్ళు కావటం లేదు.అంత బింకంగా ఉంటుంది.రేప్పొద్దుట ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు ఎలా చేస్తుందో చూడాలి"అని నలుగురి ముందూ అన్నమాటలూ గుర్తు వచ్చాయి.చిన్నక్క పెళ్ళి ఐతే అయిపోయింది.ఇక నా పరిస్థితి ఏమిటి? చదువుకి పులుష్టాప్ పెట్టేసి ఏం చెయ్యాలి?ఇంట్లో గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవలసిందేనా? ఇంట్లో పరిస్థితులు ఊహ తెలిసిన దగ్గర నుంచి చూస్తుండటం వలన ఎలాగైనా చదువుకోవాలి నా కాళ్ళమీద నేను నిలబడేలా ఏదైనా ఉద్యోగం చేసి తీరాలి అనుకున్న నా సంకల్పం ఏమౌతుంది!? మనసంతా అయోమయంగా అయిపోయింది. లెక్కలు క్లాస్ లో మాష్టారు లెక్క వివరించి మేము చేయడానికి ఒక రెండు లెక్కలు బోర్డు మీద రాసి కూర్చునేసరికి నేను చేసేసానని నిలబడేదాన్ని.అప్పడే చేసావా అని ఆశ్చర్యపోయి శకుంతలా దేవి అంతటి దానివౌతావు అనే వారు.అప్పుడప్పుడే గణితశాస్త్ర వేత్త శకుంతలా దేవి ప్రతిభ వార్తలు గా కథనాలు గా వస్తుండేవి.అదివిని నాకు నేనే భుజాలు చరచుకునేదాన్ని.మరి ఇప్పుడు? నేను నోటు పుస్తకాల్లో చివరి పేజీల్లో KSDevi MSc(Maths) అని మురిసి పోతూ రాసుకున్న అక్షరాలు నా కళ్ళ ముందు వెక్కిరిస్తున్నట్లుగా మనసులో మెదులుతుంటే ఊరికూరికే కళ్ళు చెమ్మగిల్లసాగాయి. అక్కయ్య చంటిపిల్లల్తో చేసుకోలేదని ఇక్కడే ఉండాల్సి వస్తుందేమోనని మరో బెంగ పెట్టుకొన్నాను.కానీ పాపకి నెలదాటిన తర్వాత అమ్మా నేను విజయనగరం వచ్చేసాము. ఒక రెండు రోజులయ్యాక మా ఇంటికి పది పన్నెండు ఇళ్ళు అవతల ఉన్న కుమారి ఇంటికి వెళ్ళాను.కుమారీ,కమలా,రాజీ మహారాజా మహిళా కళాశాల లో పీయూసీ హ్యుమానిటీ గ్రూపు లో చేరారట.కాసేపు కుమారీ కాలేజీ కబుర్లు చెప్తుంటే మౌనంగా విన్నాను." నీ మార్కులకు కళ్ళకద్దుకుని కాలేజీలో సీటు ఇస్తారులే.నువ్వు కాలేజీలో చేరుతున్నావా? "అని ప్రశ్నించిన కుమారికి ఏమో అని మాత్రమే సమాధానం చెప్పి ఇంటికి తిరిగి వచ్చాను. నాకు నోరు తెరిచి ఇది కావాలి అని అడిగే అలవాటు ఎప్పుడూ లేదు.పెద్దన్నయ్య ఇంట్లో ఎవరితోనూ మాట్లాడడు.పేయింగ్ గెస్ట్ లా వీథి గదిలోనే ఉంటాడు.చిన్నన్నయ్య మాట్లాడుతాడు.కానీ మనసులో మాటలు చెప్పుకోలేను.ఏం చెప్పుకోవాలన్నా అమ్మకే.కానీ ఆమె కూడా అస్వతంత్రురాలు.మనసులోనే మధన పడ్డాను. ఇంటికి వచ్చాక రాత్రి వంటకు కూరగాయలను తీసుకుని అమ్మ పక్కనే తరుగుతూ నెమ్మదిగా ,"కుమారీ వాళ్ళూ కాలేజీలో చేరారు" అని చెప్పాను.ఉల్లిపాయలు కోస్తున్నందుకో చదువుకోలేక పోతున్నందుకో తెలియని విధంగా కళ్ళనుండి జలజలా నీళ్ళు రాలాయి. "ఇందాక మామయ్య వచ్చాడు.చిన్నాకి స్కూల్ ఫైనల్ ఐపోయింది కదా మావాడికిచ్చి పెళ్ళి చేయకూడదా"అని అన్నాడు.అప్పుడే ఇంట్లోకి వచ్చిన అన్నయ్య "మా చెల్లిని చదివిస్తాం.ఇలాపెళ్ళి మాటలు మాట్లాడేటట్లైతే రావద్దు "అని గసిరాడు"అంది. అంతవరకు మనసంతా కారుమబ్బులు నిండి ముసురు పట్టినట్లు ఉన్నది కాస్తా మబ్బులన్నీ గుప్పున చెదిరి ఎగిరి పోయినట్లుగా ఆ మాట వినేసరికి నా ముఖం వెలిగిపోయింది. ."నిజమేనా? !!"అయినా అప్పుడే ఆగష్టు వచ్చేసింది.కాలేజీలో సీటు దొరుకుతుందా అనుమానం. మర్నాడు అన్నయ్య దగ్గర కు వెళ్ళి నెమ్మది గా కాలేజీకి వెళ్ళి అప్లికేషన్ తెచ్చుకోనా అని వినిపించీ వినిపించినట్లు అడిగాను.మనసులో ఇంకా జంకు పోలేదు."బాబ్జి( చిన్నన్నయ్య) ని కాలేజీకి వెళ్ళి అప్లికేషన్ తీసుకుని రమ్మని చెప్పు" అన్నాడు ప్రశాంతంగానే. .ఇక్కడ ఇంకో మాట చెప్పాలి.పేపర్లూ,పెన్నులూ,ఆఖరుకు బట్టలు కూడా చిన్నన్నయ్య వెళ్ళి తీసుకు రావాల్సిందే. స్నేహితుల ఇళ్ళకి తప్ప ఆడపిల్లలు బజార్లు తిరిగి కొనుక్కునే అవకాశం మా ఇళ్ళల్లో ఉండేది కాదు.అప్పుడు ఇంకు పెన్నులే కనుక ఇంకు బాటిల్ కొంటే అదే బోల్డు రోజులు వచ్చేది. ఆ మర్నాడు చిన్నన్నయ్య కాలేజీ కి వెళ్ళి అప్లికేషన్ తేవటం, MPC గ్రూప్ తో పీయూసి లో చేరటానికి ఫీజు కట్టటం చకచకా జరిగిపోయింది. మొత్తం మీద కాలేజీలో చేరాను.మా కుటుంబంలో నేను మొదటిసారి కాలేజీ మెట్లు ఎక్కబోతున్నాను.మనసు సీతాకోకచిలుక లా రెక్కలు విప్పుకున్నట్లు గా గాలిలో తేలిపోయాను.

26, సెప్టెంబర్ 2021, ఆదివారం

బుల్లెట్టు బండి పాట గురించి

నేను ఎక్కువగా పాల్గొనే ఒక వాట్సప్ గ్రూప్ లో రమణి అనే స్నేహితురాలు పంచుకొన్న విషయం.ఇది ముఖ్యం గా మహిళలందరూ ఆలోచించవలసినది గా అనిపించింది.అందుకే ఫేస్బుక్ లో కూడా పంచుకుంటున్నాను. నేను మీతో పంచుకోవాలి అనుకున్న విషయం ఒక పాట గురించి. అలాంటి పాటలు ఏ విధంగా మనకు తెలియకుండానే మన మెదడును ఎలా పితృ స్వామ్య భావజాలం తో నింపేస్తున్నాయి అని నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో పంచుకుంటున్న. బుల్లెట్ బండి పాట ఏ భావజాలం కు ప్రతీక?? గత కొన్ని రోజులు గా బుల్లెట్ బండి పాట వాట్సాప్ లలో, ఫేస్బుక్ లోను ప్రతిధ్వనిస్తుంది. పాట అనేది మనుషులను ఆకట్టు కుంటుంది. అందులోను జానపద బానీ లో వుండే పాట సామాన్య ప్రజలను కుడా కట్టి పడేస్తుంది. శాస్ట్రీయ సంగీతం కొంతమంది ని ఆకట్టుకుంటే, శ్రమ జీవులను, నిరక్షారాస్యులను సైతం ఆకట్టు కునేది జానపదం. అందుకే విప్లవ కారులు చాలా మంది జానపద బానీ లోనే పాటలు రాసి, పాడిఈ దోపిడీ వ్యవస్థ గురించి, అసమానతల తో కూడిన సమాజం గురించి అందరికి అర్థం అయేలా చేసే ప్రయత్నం చేశారు. ఈ బుల్లెట్ బండి పాట కుడా ఇంతలా ప్రజాదరణ పొందడానికి మూడు ముఖ్యం ఐన కారణాలు వున్నాయి. 1. ఈ పాట లో సాహిత్యం, అంటే పాట లో వుండే ప్రతి పదం అందరికి సులభంగా అర్థం అయ్యే బాష లో ఉండటం. 2. ఈ పాట లో సంగీతం జానపద బానీ లో హుషారుగా ఉండటం. 3. పాట పాడిన వారు చక్కగా పాడటం. అయితే మరి లక్షల మంది ఇష్టపడిన ఈ పాట ఎలాంటి భావజాలం ను మన బుర్రలోకి ఎక్కిస్తుందో ఇప్పుడు నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకుంటున్న. ఈ పాట ను ఇప్పటికి చాలా మంది వినే వుంటారు కనుక పాట ను నేను పోస్ట్ చేయడం లేదు. ఈ పాటలో సాహిత్యం ను గమనిస్తే 1. మొదట ఆమె అంటే పెళ్లికూతురు ఏమేమి ముస్తాబు చేసుకుంది అనేది ఉంటుంది. ఈ ముస్తాబు అంత ఎవరికోసం? పెళ్లికుమారుని కోసం. అంటే పెళ్లికూతురు (స్త్రీ ) చేసుకునే ముస్తాబు అంత పెళ్లి కుమారుడు (పురుషుడు ) కోసమే అనే పితృస్వామ్య భావజాలం ను మనకు తెలియకుండానే మన బుర్రలోకి పంపిస్తుంది. 2. నా చేతిని, నీ చేతికి ఇచ్చి, నీ అడుగులో అడుగు వేసుకుంటూ వస్తాను అని చెప్పడం ఆమెకు అంటే భార్య కాబోయే స్త్రీ కి స్వంత వ్యక్తిత్వం లేదు, అతని అడుగుజాడల్లో నడవడమే ఆమె పని అని సూచన ఇస్తుంది 3. మంచి మర్యాదలు తెలిసిన దాన్ని, మట్టి మనుషుల్లో పెరిగిన దాన్ని అని చెప్పడం పల్లెల్లో మనుషులు పట్టణాలలో మనుషుల కన్నా అంత చాలా మంచి వారు అనే అర్థం ఇస్తుంది. కానీ మన పల్లెల్లో కుల పరమైన, లింగ పరమైన అణచివేత, అసమానతలు నగ్నంగా కనిపిస్తాయి. అంటే పట్టణాలలో ఈ అణచివేత లు లేవు అని కాదు, కానీ పల్లెల్లో వాటి విశ్వ రూపం కనిపిస్తుంది. ఈ విధంగా ఈ మాటలు పట్టణాలలో వున్న ఎంతో కొంత ఆధునిక భావాలు కల మనుషులకన్నా పల్లెల్లో ని సాంప్రదాయ భావాలు కల మనుషులు మంచివారు అనే ఒక అభిప్రాయం ను పెంచుతుంది. 4.ఇంక అవ్వ సాటు ఆడపిల్లను అని మొదలు పెట్టి చెప్పేది అంత ఆడపిల్లలు ఎవరో ఒకరి సాటుగా ఉండాలి, ముఖ్యంగా పెళ్లి అయ్యేంత వరకు తల్లి తండ్రులు, అన్నదమ్ముల చాటుగా, పెళ్లి ఐన తరువాత భర్త చాటుగా ఉండాలి అనే భావాన్ని పెంచి పోషిస్తుంది. అంతే కాక పెళ్లి అయ్యేంత వరకు తల్లి తండ్రులు, అన్న తమ్ములు జాగ్రత్తగా చూసుకొని, పెళ్లి అప్పుడు ఆమె ను చూసుకోవాల్సిన బాధ్యత ను భర్త కు అప్పగించడం అంటే ఆమె నిరంతరం ఎవరో ఒకరి బాధ్యత గా ఉంటుంది. ఆమె బాధ్యత ను ఆమెనే నిర్వహించగల ఒక స్వతంత్ర మైన మనిషి గా ఉండదు. 5. ఇంక చివరగా పెళ్లి తరువాత  ఎలా ఉంటుందో చెప్తుంది. ఆమె కుడికాలు పెట్టిన వెంటనే సిరి సంపదలు కల్గుతాయి. అంటే ఎలా? ఆమె తెచ్చే కట్న కానుకల వల్లనా? పెళ్లి తరువాత సంప్రదాయం పేరుతో ఎదో ఒక వంకన, ఆమె తల్లి తండ్రుల నుండి డబ్బులు గుంజడం వల్లనా? అంతే కాక ఈ వాక్యం కోడలు కుడి కాలు పెట్టి గృహప్రవేశం చేసిన తరువాత అంతే మంచి జరుగుతుంది అనే మూఢనమ్మకం ను కల్గిస్తుంది. దీని వలన ఒక వేల ఆమె అత్త వారింట్లో అడుగు పెట్టిన తరువాత ఆ ఇంట్లో ఏ అనర్ధాలు, నష్టాలు జరిగినా ఆమెనే బాధ్యురాలును చేసే అవకాశం వుంది. 6.పెళ్లి తరువాత ఆమె ఎలా ఉంటుంది అనేది తరువాత చెప్తుంది. చుక్కపొద్దుతో నిద్ర లేచి వాకిట్లో  ముగ్గులు పెట్టడం నుండి ఇంక అన్ని పనులు చేస్తుంది. ఇంకా పెళ్లి తరువాత భర్తను కన్న వాళ్లనే, తన కన్నవాళ్లుగా భావిస్తుంది. మరి ఇన్ని రోజులు ఆమె మాటల్లోనే అంత అపురూపం గా పెంచిన తల్లి తండ్రుల బదులుగా తన అత్త, మామ లనే తల్లి తండ్రులు గా భావిస్తుంది. పెళ్లి తరువాత అత్త వారిల్లె ఆడపిల్లకు సర్వస్వం అనే పితృ స్వామ్య భావజాలం కు నిలువెత్తు నిదర్శనం కాదా ఇది. ఈ విధంగా ఒక జన్మ కాదు ఏడు జన్మలు అతనితోనే కలిసి జీవిస్తాను అని చెప్తుంది ఆమె. పెళ్లి అంటే ఏడు జన్మల బంధం అనే హిందూ సాంప్రదాయ భావనకు ప్రతీక ఇది. కనుక ఆ నాటి "ఆలయన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లలే ఈ జగతికి జీవన జ్యోతి " పాట నుండి ఈ నాటి "బుల్లెట్ బండి " పాట వరకు స్త్రీ లను తమకంటూ ఒక స్వంత ఆస్తిత్వం లేకుండ, నిరంతరం భర్త కు, అతని కుటుంబానికి సేవ చేయాలి అననే ,పెళ్లి ఐన తరువాత ఇంకా పుట్టిన ఇంటికన్నా మెట్టింటికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే పితృస్వామ్య  భావజాలం ను పెంచి పోషిస్తున్నాయి. ఈ విషయాలు ప్రజాస్వామిక, అభ్యుదయ వాదులు ముఖ్యం గా స్త్రీలు గుర్తించాలి. చివరిగా తమ బానిసత్వాన్ని గురించిన పాటలు తామే సంతోషం గా పాడి, డాన్సులు చేసి వాటికి ప్రచారం కల్పించకుండా స్త్రీ లు జాగ్రత్త వహించాలి. తాము కుడా మనుషులమే, తమకు స్వంత వ్వక్తిత్వం, అభిప్రాయాలూ ఉంటాయి అని, తమ గురించి తామే బాధ్యత వహించగలం అనే చైతన్యం ను పెంచుకుని, ఆత్మగౌరవం తో తమ హక్కుల కొరకు, ఈ సమాజం లో గౌరవప్రదం ఐన జీవితం కొరకు పోరాటం చేయాలి అని కోరుకుంటూ, ఇంతసేపు చదివిన మీకు అందరికి ధన్యవాదములు. మీరు మీ అభిప్రాయాలను పంచుకొని, ఈ చర్చను ముందుకు తీసుకొని పోతారని ఆశిస్తున్నాను.

12, సెప్టెంబర్ 2021, ఆదివారం

వేదుల మీనాక్షీ దేవి కథలు

విస్మృత కథారచయిత్రి – వేదుల మీనాక్షీదేవి శీలా సుభద్రాదేవి Posted on December 8, 2020 by భూమిక ఆధునిక సాహిత్యరంగంలో స్వాతంత్య్రానంతరం అధిక సంఖ్యలోనే మహిళలు సాహిత్య రంగంలోకి వచ్చారు. స్వాతంత్య్రోద్యమ కాలంలోనే దానికి సమాంతరంగా స్త్రీ విద్యపై కూడా మహిళలు కొంత ఉద్యమస్ఫూర్తితో రచనలు చేయటం కావచ్చు, స్త్రీల కోసం ప్రత్యేక పాఠశాలలు కొన్ని ప్రాంతాలలో ఏర్పాటు కావటం వలన కావచ్చు, సాంస్కృతికంగా, ఆర్థికపరంగా వెసులుబాటుగల కుటుంబాలలోని స్త్రీలకు విద్యావంతులయ్యే అవకాశం లభించింది. విద్యతోపాటుగా సాహిత్యంతో అనుబంధం గల కుటుంబంలోని ఆడపిల్లలకు తెలుగు, సంస్కృత గ్రంథపఠనం చేయించటం వలన కూడా ఆనాటి సామాజికంగా ఉన్నతస్థాయి కుటుంబ స్త్రీలు సాహిత్య రచనారంగంవైపు దృష్టి సారించారు. అయితే రచనా రంగంలోకి వచ్చిన వారందరూ గుర్తింపు పొందే అవకాశం కూడా లభించలేదు. అందుకు కొంత కారణం రచనలు చేయడమైతే చేస్తున్నారు కానీ కుటుంబ భారం వలన కావచ్చు, ఆర్థికపరమైన వెసులుబాటు లేకపోవచ్చు, కుటుంబ ప్రోత్సాహం దొరకక కావచ్చు, గ్రంథస్తం కాకుండా మరుగున పడినవి కూడా ఎక్కువే. విస్తృతంగా కథలు రాసిన వాళ్ళు సైతం కాలక్రమేణా సాహిత్య చరిత్రలో అనామకంగా మిగిలిపోయారు. ఆ విధంగా విస్మృతులైన రచయిత్రులను గురించి ఏ విధమైన సమాచారమూ లభించే అవకాశం లేకపోవడం శోచనీయం. ఆ విధంగా మరుగునపడిన రచయిత్రులలో వేదుల మీనాక్షీదేవి ఒకరు… ఆమె కాకినాడలో 27 జూన్‌, 1917లో జన్మించినట్లు తెలుస్తోంది. చిలకమర్తి లక్ష్మీనరసింహంగారి మనవరాలు కావటాన బాల్యం నుండి సంస్కృతాంధ్ర రచనలు బాగా చదివారు. భర్త ఉద్యోగరీత్యా రాజమండ్రిలో నివసించారు. సభావేదిక, అష్టమహిషీ కళ్యాణం, రాగరేఖలు వీరి రచనలు. నలభైకి పైగా కథలు కథానిలయంలో లభ్యమైనప్పుడు అన్ని కథలు రాసినా వేదుల మీనాక్షీదేవి కథలు ఏ సంకలనంలోనూ చోటుచేసుకోకపోవడం, ఏ సందర్భంలోనూ సాహిత్యంలో ఆమె ప్రస్తావన కనిపించకపోవడం ఆశ్చర్యకరమైన విషయం. 1968లో కె.రామలక్ష్మిగారు ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ కొరకు పొందుపరచిన ‘రచయిత్రుల సమాచార సూచిక’లో లభ్యమైన అతి తక్కువ వివరాలను బట్టి 1933 నుండి మీనాక్షీదేవి రచనలు చేసేవారని తెలుస్తోంది. కానీ కథానిలయంలో లభ్యమైన కథలను బట్టి 1950 సంవత్సరంలో గృహలక్ష్మి పత్రికలో ప్రచురితమైన ‘దినదినగండం’ కథతో ఆధునిక కథారచనకు స్వీకారం చుట్టారని భావించాలి. 1950 నుండి 1983 వరకు విస్తృతంగా కథలు రాశారు. మరీ ముఖ్యంగా యాభయ్యవ దశకంలో ఎక్కువగా అన్ని పత్రికలలోను మీనాక్షీదేవి కథలు ప్రచురితమయ్యాయి. తర్వాత బహుశా కుటుంబ బాధ్యతల వలన రచనలు చేయటం తగ్గినా, తిరిగి డెబ్బయ్యవ దశకంలో ఎక్కువగా రాశారు. యాభయ్యవ దశకం నాటికి కుటుంబ నియంత్రణ అమలు లేకపోవడం వలన మీనాక్షీదేవి రాసిన కుటుంబ కథల్లో చాలావాటిలో అయిదు మందికి తక్కువ కాకుండా బహుసంతానం, చిరుద్యోగాలు, ఆర్థిక ఇబ్బందుల వలన లోటు బడ్జెటులతో అవస్థలు, పొదుపుగా సంసారాలు చేసుకునే కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగినులైన స్త్రీ పాత్రలు గల కథలు చాలా తక్కువ. అంతమాత్రాన కేవలం కుటుంబ కథలు మాత్రమే రాయలేదు. కుటుంబాల చుట్టూ ఆవరించుకున్న సామాజిక పరిస్థితులు, ఆర్థిక రాజకీయాలూ, సమాజంలో ఎదురయ్యే భిన్న ప్రవృత్తుల మానవదృక్పథాల్ని గురించిన కథలూ ఎక్కువగానే ఉన్నాయి. చదువూ, విద్యార్థులూ, పరీక్షా విధానాల గురించిన కథలు కూడా చాలానే ఉన్నాయి. వేదుల మీనాక్షీదేవి కథలు రాసిన కాలంలో స్వాతంత్య్రానంతర యుద్ధ పరిస్థితుల వలన కరువు కాటకాలు ఏర్పడడం, పనులు తక్కువై, నిరుద్యోగ పరిస్థితుల వలన దొంగతనాలు పెరగడం, గుడులూ, బడులూ కడతామనో, పిల్లకి పెళ్ళి చేయాలనో చందాల పేరిట అడుక్కునే ఘరానా దొంగల మోసాల మీద కథలు రాశారు. ప్రజలలోని మూక మనస్తత్వాన్ని గురించి మొదలుపెట్టిన రచయిత్రి వాస్తవాన్ని తెలియజేసే సంస్కారానికీ, కృత్రిమమైన నాగరికతకూ గల వైరుధ్యాలను వివరిస్తూనే, డబ్బూ హోదా వలన మనిషిలో పెరిగే అహం బాల్యస్నేహితులలో సైతం ఏ విధంగా మానసిక దూరాన్ని పెంచుతాయో తెలియజేసిన కథ ‘నీ ఋణం తీర్చుకోలేను’ (1968). ఎన్నో ఏళ్ళ తర్వాత బాల్యస్నేహితురాలు అరవిందను కలుసుకోవడానికి వెళ్ళిన విశాలకు డబ్బు తెచ్చిన అహంతో అరవింద, తన పిల్లలకు నేర్పుతున్న నాగరికత ఏ విధంగా సంస్కారాలను అవహేళన చేసేలా ఉందో తెలుసుకుని బాధ కలుగుతుంది. తానున్న రెండు, మూడు రోజులైనా పిల్లలకి ప్రాచీన గ్రంథాలలోని మంచి విషయాలు నేర్పబోయి తిరస్కారానికి గురవుతుంది. చివరికి వారిని అసహాయంగా చూసి జాలిపడుతూ తిరుగు ప్రయాణం కడుతుంది. ఈ కథలో విశాల పాత్రతో అనేక ప్రాచీన కావ్య విశేషాల్ని అపురూపమైన విధంగా, పిల్లలకు అర్థమయ్యేలా రచయిత్రి చెప్పించడం మీనాక్షీదేవికి ప్రాచీన కావ్యాలైన పెద్దన మనుచరిత్ర, శ్రీనాధుని కాశీఖండం వంటి గ్రంథాల పట్ల గల అభినివేశం స్పష్టమౌతుంది. ఎలా అయినా కొడుకుని ఎమ్మే చదివించాలనే ఆశయంతో రాత్రీ పగలూ ట్యూషన్లు చెప్పి, షాపుల్లో లెక్కలు రాసి కష్టపడిన తండ్రి తన కోర్కె తీరకుండానే పరీక్షలకు ముందు చనిపోతాడు. పరీక్ష హాలులో కూర్చొని తండ్రి తన కోసం పడిన కష్టాల్ని తలపోసి కన్నీళ్ళ పర్యంతమైన కొడుకు పరీక్ష రాయలేక ఖాళీ పేపరు ఇచ్చేస్తాడు. చదువుకునే అవకాశాలు లేని తండ్రికి కొడుకునైనా చదివించాలనే తపన, నిజాయితీగా బతికే చిరుద్యోగి ఆర్థిక పరిస్థితుల జీవన చిత్రాన్ని రచయిత్రి 1952లో రాసిన ‘బ్లాంక్‌ పేపర్‌’ కథలో చూపుతారు. ఢిల్లీ ప్రాంతంలో మహేంద్రగడ్‌ పరిసరాల్లో ‘బాలచరిత్ర నిర్మాణ్‌’ అనే ఆదర్శ సంస్థను చూసి, ఆ సంస్థ పాటించే పద్ధతులూ, ఆదర్శాలూ, అక్కడి విద్యార్థులనూ గమనించారు రచయిత్రి. ‘ఆచరించు, ఆలోచించు, ప్రచారం చేయి’ అనే సిద్ధాంతంతో పనిచేసే ఆ సంస్థ స్థాపకుడు విశ్వనాథ్‌ కనోడియా యొక్క స్వప్న సంస్థను చూసి ప్రభావితురాలైన రచయిత్రి మీనాక్షీదేవి రాసిన కథ ‘జాతీయం’. ఇది 1955లో ‘గృహలక్ష్మి’ పత్రికలో ప్రచురితమైంది. ఉద్యోగాలు సమకూర్చలేని ప్రభుత్వాలను నిందిస్తూ కూర్చోకుండా విద్యావంతుడైన రాజారాం ఏ విధంగా గ్రామప్రజల్ని జాగృతపరచి పాఠశాలని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాడో తెలియచేస్తుంది. పాఠశాల ప్రారంభోత్సవానికి రావటానికి తిరస్కరించిన ప్రభుత్వ ప్రతినిధులు ఆ పాఠశాల క్రమక్రమంగా అభివృద్ధి పొందిన తర్వాత ఆ పాఠశాలకు దాతల ద్వారా వస్తోన్న ఆదాయం తెలుసుకుని, ఆ పాఠశాల పురోభివృద్ధికి తామే కారకులుగా ప్రచారం చేసుకుని, దాన్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడం కొసమెరుపు. ‘గృహలక్ష్మి’ స్త్రీల పత్రిక కదా ఏవో వంటింటి కథలే ఉంటాయేమో అనుకునేవారికి ప్రభుత్వ వైఫల్యాల్నీ, రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాల్నీ ఎండగడుతూ చెప్పిన కథలూ, సమాజ దర్పణాలుగా ఉండే కథలూ ఉంటాయనేది ఈ కథని బట్టి తెలుసుకోవచ్చు. చిరుద్యోగి అయిన మూర్తి పెద్ద సంసారాన్ని నడపలేక ఒత్తిడికి గురై దాని నుండి తట్టుకోలేక తాగుబోతవుతాడు. అతన్ని చూసి బాధపడిన స్నేహితుడు డాక్టర్‌ మధు సైకియాట్రిక్‌ ట్రీట్‌మెంట్‌లో భాగంగా ‘లాటరీ’లో లక్ష రూపాయలు వస్తే ఏం చేస్తావో ఆలోచించి చెప్పమంటాడు. మెదడుకి తీరకలేని పని కల్పిస్తే తాగుడు మీద మనసు పోదని అనుకుంటాడు. కానీ ‘లాటరీ’ వచ్చిన భ్రమలోకి వెళ్ళిపోయి రాత్రీ పగలూ లెక్కలు వేస్తూ పూర్తిగా అనారోగ్యం పాలై మరణిస్తాడు మూర్తి. తాను చెప్పినది వికటించినందుకు దుఃఖపడతాడు స్నేహితుడు మధు. స్థూలంగా కథ ఇదే కానీ ఇందులో బహు కుటుంబీకుడు ఆర్థిక ఒత్తిడికి గురైన విధమూ, బీదవారి పాలిట లాటరీలు కల్పవృక్షంలా భ్రమ కల్పించి జీవితాల్ని మరింత ఛిద్రం చేయటం మరో పార్శ్వంగా చిత్రించారు రచయిత్రి. 1955 నాటికి ‘గృహలక్ష్మి’లో ప్రచురితమైన ‘జగమెరిగిన త్యాగి’ స్వలాభాపేక్ష లేకుండా పరోపకారిగా క్విట్‌ ఇండియా ఉద్యమంలోనూ, స్వాతంత్య్రోద్యమంలోనూ నిస్వార్థంగా పనిచేసే రంగయ్య తాత కథ. మనోవాక్కాయ కర్మలా అవసరమున్న వారికి సేవ చేయటం, మశూచికం వంటి భయంకర వ్యాధిగ్రస్తులకు సైతం సేవ చేస్తూ ఉండటమే కాకుండా జబ్బులు ఎవరికైనా రావచ్చుననే సందేశంతో పనిచేసే వ్యక్తి రంగయ్య తాత. తన భార్య పోయినప్పుడు తనకు మాత్రమే లోటు అని భావించిన వ్యక్తి, గాంధీ మహాత్ముడు మరణం మాత్రం దేశానికే లోటని కన్నీరు మున్నీరవుతాడు. ఆంధ్రరాష్ట్రం సిద్ధించినప్పుడు పొట్టి శ్రీరాములు ఆత్మార్పణకు నీరాజనాలిస్తాడు. సరిహద్దు గాంధీ మొదలైన వారి సేవానిరతి గురించి నలుగురికీ తెలియచేస్తాడు. ఈ విధంగా ప్రభుత్వం గుర్తించని ఒక త్యాగమూర్తి గురించి రచయిత్రి చెప్పిన ఈ కథలో దేశ చరిత్రలోని మూలఘట్టాలను స్పృశిస్తూ, ఆనాటి ప్రజల మనస్తత్వాలను, తర్వాత్తర్వాత మారిపోయిన సమాజపు తీరుతెన్నులను సాదృశ్యం చేస్తూ చెప్పిన కథ. మీనాక్షీదేవి రాసిన ‘మరలరాని మమత’ (1965) కథ గుర్తించదగిన వాటిలో ఒకటి. మనవసేవే మాధవసేవ అని భావించే సత్యానందం అనాధాశ్రమంలో పెరిగిన రాజేశ్వరిని వివాహం చేసుకుని ఒక సేవా సంస్థ స్థాపించి భార్యతో, మిత్రులతో కలిసి సమాజసేవ చేస్తుంటాడు. కొడుకు పుట్టాక కూడా భార్యాభర్తలిద్దరూ అనాధలు, అభాగ్యులకు సంస్థ ద్వారా విద్య, ఉపాధికి సహాయ సహకారాలందిస్తుంటారు. ఒకసారి అకస్మాత్తుగా ఇల్లు విడిచి వెళ్ళిపోయిన సత్యానందం సన్యాసిగా తిరిగివచ్చి ఆ సంస్థలోనే మఠం ఏర్పాటు చేసుకుంటాడు. రాజేశ్వరి ఒంటరిగా కొడుకుని పెంచి సంస్థ సహకారంతోనే చదివిస్తుంది. తననీ, కొడుకునీ అనాథల్ని చేయవద్దని భర్తను వేడుకున్నా అతను ఆమె మాటలను తిరస్కరిస్తాడు. ‘ముక్కు మూసుకుని మోక్షం కోసం సన్యసించిన వ్యక్తికి రెండు ప్రాణాల్ని గాలికి వదిలేస్తే మోక్షం వస్తుందా?’ అని ప్రశ్నించిన రాజేశ్వరి ఆగ్రహం, ఆవేదన, ఆక్రోశం పాఠకులను ఆలోచింపచేస్తుంది. కాలేజీలో డిగ్రీ చదువుకుని స్కాలర్‌షిప్‌ కోసం ప్రయత్నిస్తే తండ్రిగా సత్యానందం నుండి ఉత్తరం ఇవ్వాలి అని అడిగితే సత్యానందం అంగీకరించడు. భార్యా పిల్లలు అక్కరలేనప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి అని భార్య నిలదీస్తుంది. ఆఖరుకి కాలేజీవాళ్ళే స్కాలర్‌షిప్‌కు అంగీకరిస్తారు. ఈ కథలో యశోధరని, రాహులుడిని, వదిలివెళ్ళిన సిద్ధార్థుడితో రచయిత్రి పోల్చిన విధం చదివినప్పుడు సిద్దార్ధుడిపైన కూడా నిందాగర్భితంగా ఉండడం బుద్ధుడి మీద రచయిత్రికి గల నిరసన వ్యక్తమవుతుంది. రచయిత్రి రచనలలో సందర్భోచితంగా ఆంధ్రాంగ్ల భాషా రచనలోని ఆయా విశేషాలతో పాటు బెర్నార్డ్‌ షా, క్రానిన్‌, వేల్స్‌ వంటి ఆంగ్ల కవులను ఉటంకించి తన అభిప్రాయ ప్రకటన చేస్తుండటం చదివినప్పుడు పాఠకలకు మీనాక్షీదేవికి గల సారస్వతాభిరుచి, భాషమీద గల పట్టు తెలుస్తుంది. తాను చెప్పదలచుకున్న దానిని సారూప్యత గల మరో రచనలోని సంఘటనతో పోల్చడం కొన్ని కథలలో గమనించవచ్చు. ఉద్యోగాల వలనా, పెళ్ళిళ్ళై సంసారాలతోనూ దూరమైపోయిన తోబుట్టువులందరూ తల్లి కోరిక మేరకు పుట్టినింటిలో కలవాలనుకుంటారు… ‘ఉత్తమ పురుష’లో రాసిన ‘సంక్రాంతికి సంకెళ్ళు’ (1958) కథలో. ఆ సందర్భంలో కథానాయిక తమ్ముడు ‘సంకెళ్ళు వదిలించుకొని అందరూ రావాలి’ అంటాడు. తన కూతురు అల్లుడు పండగకి వస్తుంటే తాను పుట్టింటికి వెళ్ళడం ఎట్లా అని బాధపడుతుంది. అంతేకాక మిగతా పిల్లలు, భర్త అందరూ కలిసి వెళ్ళడానికి ఇబ్బందే. ఆ ఆలోచనతో సతమతమవుతున్న భార్యకి పిల్లల్ని తాను చూసుకుంటానని, చిన్నపిల్లను తీసుకెళ్ళమని ప్రోత్సహిస్తాడు భర్త. భోగి రోజు ఉదయమే వెళ్ళి మర్నాడు చీకటినే తిరిగి వచ్చేయాలనుకొని బయల్దేరుతుంది. తోబుట్టువుల కుటుంబాలతో ఎంతటి ఆత్మీయతలు పంచుకున్నా, తల్లి ప్రేమ మనసును కట్టేస్తున్నా, భర్తనీ పిల్లల్నీ వదిలి వచ్చినందుకు బాధపడుతుంది. దానికి తోడు చుట్టుపక్కల బంధువులు పలకరించడానికి వచ్చి ‘కూతురూ అల్లుడూ వస్తుంటే, పిల్లల్నీ, భర్తనూ వదిలేసి పుట్టింటికి ఎలా వచ్చేసిందో’ అని గుసగుసలు పోవడమే కాకుండా, దారిలో బస్సు ప్రయాణంలో కూడా పక్కన కూర్చున్న ఆమె కూడా అదే మాట అని బుగ్గలు నొక్కుకోవడం గుర్తుకువస్తుంది. మర్నాడు ఉదయం బయల్దేరదామనుకున్నది మరదలు కట్టి ఇచ్చిన తినుబండారాలు మోసుకుని రాత్రికి రాత్రే తిరుగు ప్రయాణమై బస్సు దిగాక ఆ రాత్రిలో రిక్షా దొరకక అవస్థ పడుతుంది. తెల్లవారుఝామున భర్త ‘బస్సుకు తొందరగా బయల్దేరాలి లేచి తయారవ్వమని’ లేపడంతో మెలకువ వస్తుంది. అదంతా కలే కదా అని నిట్టూరుస్తుంది. ఇంతమందిని వదిలి నేనెక్కడికి పోతాననీ, పెళ్ళయ్యాక స్త్రీకి అన్నీ బంధనాలే అనుకోవడంతో కథ ముగుస్తుంది. ఈ కథలో సంక్రాంతి పండుగ తోబుట్టువులతో కలిసి జరుపుకునే సంబరాలూ, ఆత్మీయ మానవ సంబంధాలూ, పిల్లల ఆటలూ వీటన్నింటితో పాటు స్త్రీలకు గల కుటుంబ బాధ్యతలు, బరువులు ఎంతగా జీవితంతో పెనవేసుకుంటాయో, వాటినుండి విడిపించుకుని బతకాలన్నా బతకలేనితనం కథంటతా పరుచుకుని ఉంటుంది. మరొక తమాషా ఏమిటంటే ఇవే పాత్రలతో దీనికి ముందు కథలా మరొకటి కూడా రాశారు రచయిత్రి. మీనాక్షీదేవి కథల్లో మరొక విశేషం రెండు కథలు ఒకదానికొకటి కొనసాగింపులా, ఒకే కథాంశంతో భిన్న దృక్కోణాలలో నడిపించడం చాలా కథల్లో గమనించవచ్చు. రచయిత్రి రాస్తున్న ‘మానివేసిన కత’ (1958) కథలోంచి పాత్ర వచ్చి తన పాత్ర ఎలా ఉండాలో చెప్తూ, ‘పాశ్చాత్య పోకడలు మన సాహిత్యానికి పనికిరాదనీ, అస్వాభావికమైన ఇలాంటి కథలు రాయకపోతేనేం?’ అని రచయిత్రిని దబాయించటం ఉంటుంది. ఆ కోవలోనే సమకాలీన కథలు ఎలా ఉన్నాయో, అవకాశం కోసమని నిజాయితీ లేకుండా రచనలు చేస్తున్న విధానాన్ని ఇలా సాహిత్య సృజన గురించి కథలోని పాత్ర వచ్చి చర్చించినట్లుగా రాసినా అవన్నీ సమకాలీన సాహిత్యం మీద రచయిత్రికి గల అభిప్రాయాలుగానే గుర్తించాలి. అరవైఏళ్ళ కిందటి కథలో ఆనాటి సాహిత్యంలో అవకాశవాద సాహితీవేత్తల గురించి చెప్పినా ఆ మాటలు నేటికి కూడా అన్వయిస్తాయంటే రచయిత్రికి గల క్రాంతదర్శిత్వం అర్థమవుతోంది. ఈ కథ రాస్తూ రాస్తూ నిద్రపోయిన రచయిత్రి కలలో కథంతా జరిగినట్లుగా, కళ్ళు తెరిచేసరికి పిల్లలు రచయిత్రి రాసిన కథా కాగితాలను పడవలు చేసుకుంటూ కేకలు వేస్తుంటే మెలకువ వచ్చినట్లుగా ముగిస్తారు ‘మానివేసిన కథ’ (1952)ని మీనాక్షీదేవి. ఇంచుమించుగా కథ రాయటం గురించే రాసిన మరో కథ ‘మంచికథ’ (1955). రచయిత్రికి కథా నిర్మాణం, కథన పద్ధతిలోని ప్రత్యేకతని పట్టి చూపే మరో కథ ‘కాలాతీత వ్యక్తి’ (1955). హాస్టల్‌లో చదువుతోన్న పార్వతీశం కోసం ఎవరో వచ్చారంటే, పరీక్షల కోసం దీక్షగా చదువుతోన్న పార్వతీశం విసుక్కుంటూనే వెళ్తాడు. తిరిగి వచ్చాక ఎవరితోనూ మాట్లాడకుండా మౌనిలా ఉండిపోతాడు. వచ్చినతను ఏమైనా విషాదవార్త మోసుకొచ్చాడేమోనని ఇతర విద్యార్థులు అడిగినా సమాధానం ఇవ్వడు. మర్నాడు పరీక్ష కష్టంగా ఉందని విద్యార్థులంతా బాధపడుతుంటే పార్వతీశం వంచిన తల ఎత్తకుండా పరీక్ష రాసి ‘తేలిగ్గా ఉంద’ని అంటాడు. తర్వాతి రోజు వార్తాపత్రికలో పిచ్చాసుపత్రి నుంచి ఒక వ్యక్తి పారిపోయాడని, అంతకుముందు అతను కాలేజీలో పనిచేసి, విద్యార్థులు చేసిన ఘోర అవమానంతో మతి చలించిన వ్యక్తి అనీ, పరీక్షలో వస్తాయంటూ అందరికీ ప్రశ్నలు చెప్తుంటాడనీ, ఆ వ్యక్తిని వర్ణిస్తూ వార్త వస్తుంది. ఆ వర్ణనతో సరిపోలిన వ్యక్తే తనను కలిసి ప్రశ్నలు చెప్పడం, సరిగ్గా పరీక్షలో అవే ప్రశ్నలు రావటం గుర్తుకువచ్చి పార్వతీశం నివ్వెరపోతాడు. ఇదే కథని ప్రారంభం నుండి పార్వతీశం చుట్టూ నడిపి, హాస్టల్లో విద్యార్థుల అల్లరి, పరీక్ష వాతావరణాన్నీ వివరిస్తూ పాఠకులను కథలోకి మమేకం చేస్తూ చెప్పడంలో రచయిత్రికి కథన నిర్మాణం పట్ల గల ఖచ్చితత్వం తెలుస్తుంది. ముగ్గురు కొడుకుల తర్వాత పుట్టిన జానకికి వివాహం చేయాలని పన్నెండో ఏట నుండీ ప్రయత్నించిన తండ్రి, ఏవో అవాంతరాలతో, ఫస్టున పాసవుతున్న కూతురి చదువుని ఎమ్మే వరకూ కొనసాగించే ఇతివృత్తంతో సాగిన కథలో స్త్రీల వివాహ సమస్య ఆనాటి సమాజంలో ఎన్ని విధాలుగా రూపాంతరం చెందుతోందో, జీవితంలో ఎదురీదుతున్న స్త్రీలను అసహాయులుగా చేయటానికి ఎలాంటి అభాండాలకు, అవమానాలకు గురిచేస్తోందో తెలియచెప్పే కథ ‘ఎదురీత’. ఒక సందర్భంలో తండ్రి ”ఎంత ఉన్నతస్థాయికి ఎదిగినా స్త్రీ పట్ల గౌరవం చూపించలేకపోతుంది సంఘం. బాహ్యమైన నాగరికతలో జాతి ఎంత పురోగమించినా సంఘం స్త్రీల పట్ల మానసికంగా వీసమెత్తు ప్రగతిని చూపలేకపోతోంది” అని అంటాడు. ఈ మాట నేటికీ వర్తిస్తుంది. ఇది ఆ పాత్ర అభిప్రాయం మాత్రమే కాదు, మీనాక్షీదేవి అభిప్రాయం కూడా. ”మతాంతర వివాహం చేసుకుంటే ప్రభుత్వం అయిదు వేలు ప్రోత్సాహకంగా ఇస్తుందనీ, డబ్బు అవసరం మన ఇద్దరికీ ఉంది కనుక రిజిస్టర్‌ ఆఫీసులో పెళ్ళి చేసుకుని ఆ డబ్బును చెరిసగం పంచుకుని, ఎవరింట్లో వారు ఉండి ఏడాది దాటాక విడాకులు తీసుకుందామని” రామశాస్త్రి తన సహోద్యోగి మేరీని అడుగుతాడు. అత్యవసర స్థితిలో ఉన్న మేరీ అందుకు అంగీకరిస్తుంది. ఏడాది అయ్యాక ”ఒకసారి వివాహం అయ్యాక తెంచుకుపోలేను” అని మేరీ కోర్టుకు రావడానికి ఇష్టపడదు. ఆర్థికావసరాలు ఎటువంటి ‘వంచన’కైనా పురిగొల్పుతాయని తెలియజేసే కథ ఇది. తరాల అంతరాలలో తల్లికి ఏమీ తెలియదు అనే భావాన్ని ప్రకటించే పిల్లల తీరుకి చిన్నబుచ్చుకునే తల్లి ఆవేదన ”ఔటాఫ్‌ డేట్‌” కథ. ఇదే అంశంలో నేటికీ చాలా కథలు వస్తూనే ఉన్నాయి. డబ్బు వెనక పరిగెత్తే స్వభావాన్ని పెంచుకుంటే అది ఎన్ని అనర్థాలకు దారి తీస్తుందో తెలిపే కథ ‘ఆర్జన’. కొడుకుల చదువుకి అప్పిచ్చానని ప్రోనోటు రాయించుకునే తండ్రులు ఉంటారా అంటే ఉండొచ్చు. ఖర్చు పెట్టిన దాన్ని కొడుకు పెళ్ళిలో కట్నంగా రాబట్టడానికి ఎత్తుగా రాసిన కథ ‘కన్నబిడ్డల చదువుకు మధువు’. బ్యాంకు ఉద్యోగి చెక్కు నుండి వస్తున్న ‘కునేగా’ పరిమళానికి పరవశించి ఆ చెక్కు తాలూకు వ్యక్తిని గురించి ఊహించుకొని భంగపడిన కథ ‘కునేగా’. వంద ఏళ్ళకు ముందు జన్మించిన వేదుల మీనాక్షీదేవి కథలలో ఉన్న ఆధునిక భావజాలం, స్త్రీల కుటుంబ జీవితాల పట్ల స్పష్టమైన అవగాహన, విద్యావిధానం పట్ల గల చింతన, సమాజ కౌటుంబిక జీవనంలో మారాల్సిన దృక్కోణం మొదలైనవి రచయిత్రికి గల నిబద్ధతను తెలియచేస్తుంది. మీనాక్షీదేవి కథల్లో మూడొంతులకు పైగా ఈనాడు చదివినా నేటి సమాజానికీ సమకాలీన కథల్లాగే పాఠకులను ఆకర్షిస్తాయి. అంతేకాదు ఈ రచయిత్రి రాసిన కథాంశాలతో ఏవో చిన్న చిన్న మార్పులతో ఇప్పటికీ కథలు వస్తూనే ఉన్నాయంటే రచయిత్రి సృజనాశక్తిని గుర్తించాల్సిందే కదా! కానీ నేటితరం పాఠకుల విమర్శకులకే కాదు సాహితీరంగంలో ఉన్నవారికి కూడా తెలియకుండా మిగిలిపోయిన విస్మృత రచయిత్రి వేదుల మీనాక్షీదేవి.

8, ఆగస్టు 2021, ఆదివారం

నా పని-నా ఆనందం

 నాపని-నాఆనందం 

                             పనిఅంటే ఇంటి పనా,పిల్లల పనా,ఉద్యోగమా,రచనారంగమా దేని గురించి చెప్పాలి.గొప్ప డైలమాలో పడ్డాను.

       నిజానికి   work is worship అనేది నాసిద్ధాంతం.ఏ పని ఐనా అంకితం భావం తోనే చేస్తాను.ఎందుకొచ్చిన బాధరా బాబూ అనుకునే మనిషిని కాదు.ఏదైనా పని నాకు అప్పగించినప్పుడు నేను చేయగలిగినది ఐతే వప్పుకొని ఆనందంగానే చేస్తాను.నచ్చకపోతే ముందే ఖచ్చితంగా చేయనని చెప్పేస్తాను.

       ఇంటిపనీ,పిల్లలపనీ ఇవి ప్రతీ స్త్రీ కి తప్పని, తప్పించుకోలేని బాధ్యత.అయినా ప్రతీ మహిళా తన ఆరోగ్యం కూడా పట్టించుకోకుండా బాధ్యతంతా భుజాన వేసుకుని ఇష్టపూర్వకంగా చేస్తుంది. ఇది చేయటంలో సంతోషమూ ఉంటుంది.ఒకింత స్వార్థమూ ఉంటుంది.అలాగే నేనూ చేసాను.

       అమ్మకి ఆర్ధిక స్వావలంబన లేక చిన్నప్పుడు ఎదుర్కొన్న ఇబ్బందులు చూడటం, అనుభవించటం వలన చదువుకొని ఉద్యోగం చేయాలనే గాఢమైన పట్టుదలని వివాహానంతరం పదేళ్ళకి గాని సాకారం చేసుకోలేకపోయాను.అందుకని టీచరు ఉద్యోగంలో పిల్లలతో మమేకం అవుతూ పాఠాలు చెప్పటం లోనూ, స్కూలు కి సంబంధించిన విజ్ఞాన ప్రదర్శనలూ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించటం లో సంతోషం పొందాను. స్కూల్ లో ఉన్నంతసేపూ ఇంకేం విషయాలూ గుర్తు రానంతగా ఆనందం పొందాను.

           కొందరు టీచర్లు ఎప్పుడు రిటైర్ అవుతామో అని సంవత్సరాలు,నెలలూ లెక్కబెట్టుకుంటుంటే అంత బాధ పడి బడికి రావటం మెందుకు? ఎందుకు వాలంటరీ రిటైర్మెంట్ పెట్టుకోవచ్చు కదా మరొకరికి ఉద్యోగం అన్నా వస్తుంది అనుకునేదాన్ని.

           నేను ఫ్రెండ్ అనుకున్న ఆమె అప్పట్లో హెడ్ మిస్ట్రెస్ గా ఉంది.ఆమె ప్రమోషన్  నాకు రాకుండా  నన్ను టార్చర్ పెట్టటానికీ,నాకై నేను ఉద్యోగం మానేసేలా  ప్రయత్నం చేసినా ఎదుర్కొని నిలదొక్కుకున్నానే కానీ ఉద్యోగం వదిలి పారిపోలేదు. నిబద్ధతతో పాఠాలు చెప్తూ విద్యార్ధులతో కలిసి మెలిసి ఉండటం లోని ఆనందాన్ని కోల్పోలేదు.

        ఇక నా ప్రవృత్తి రచనా రంగం .1970 లో కథాప్రచురణతో మొదలై యాభై ఏళ్ళు దాటిన నా రచనా ప్రస్ధానం ఇప్పటికీ నిర్విరామంగా కొనసాగుతూనే వుంది.ఉద్యోగవిరమణ అనంతరం నాకు సంతోషం కలిగించే లలిత సంగీతం, చిత్రలేఖనంలో కూడా సాధనచేయాలనుకున్నా అంతగా కుదరలేదు.అందుకే  మరింతగా రచనా వ్యాసంగం లోనే నా ఆనందాన్ని నింపుకున్నాను.

      చిన్నప్పటి నుంచి నన్ను నేను తీర్చిదిద్దుకున్నది పుస్తక పఠనం వలనే.  ఎప్పుడైనా మనసు నొచ్చుకున్నా,చికాకుగా ఉన్నా కాసేపు ఏ పుస్తకమైనా చదువుకుంటే స్నేహితురాలి వలన ఓదార్పు పొందినట్లు మనసు తేలికైపోతుంది.అందుకే ఎంత పని ఒత్తిడిలో తీరికలేకుండా ఉన్నా,అనారోగ్యంగా ఉన్నా   రాత్రి తప్పని సరిగా ఓ నాలుగైదు కవితలో ఓ రెండు కథలో చదివిన తర్వాతే నిద్రకు ఉపక్రమించటం చిన్నప్పటి నుంచీ అలవాటు.

        నా ఆవేదన,నా ఆవేశం,నా దుఃఖం,నా ఆక్రోశం,నన్ను కలవరపరిచే అన్ని అనుభూతులను మరిపించి ఆనందాన్నీ, సంతృప్తినీ కలిగించి మనసుతేలికపరచేది నా సాహిత్య పఠనమూ,రచనలే.ఎన్ని ఒడుదుడుకుల్ని నా జీవితపర్యంతమూ  ఎదుర్కొన్నా నా ముఖంలో చిరునవ్వు చెక్కు చెదరకుండా సంయమనంతో ఉండేలా చేసినవి నాకు తోడుగా ఉన్న నా అక్షరాలే.

3, ఆగస్టు 2021, మంగళవారం

భయం భయం

 



    "భయం భయం "
          
ఎందుకో తెలియదు
ఏనాడూ ఎరుగను 
ఎప్పుడు ఎలా
నా మనసులో దూరిందో తెలియదు
ఆకాశం నుండి ఉల్కై రాలిపడిందో
మొన్న రాత్రి ఎక్కడో వానకి పడిన పిడుగు
ఎటునుండో వచ్చి గుండెల్ని కాల్చేసిందో
తోచనీయనితనం
ఏపనీ చేయనీయదూ
మనసు ఒకటే ఊగిసలాట

మనసుని ఒక రాటకి కట్టేయడానికి
వార్తాపత్రిక తెచ్చి తెరిచాను
చెమ్మచెమ్మగా ఉన్న పేజీలు తిప్పుతుంటే 
వేళ్ళ కొసలు తడితడిగా ఎర్రబడే సరికి
మనసు పుంజీలు తెంపుకొని
ఇంకావేగాన్ని పెంచుకు ఊగుతోంది

హృదయాన్ని మడిచి
మెదడు పెట్టిలో దాచి
ఇడియట్ బాక్స్ మూత విప్పాను
తూటాల పేలుళ్ళ పొగ
మాటల దుర్గంధం
మరణమృదంగ ధ్వని
బాధితుల ఆర్తనాదాలు
ఇల్లంతా వ్యాపించేస్తున్నాయి
మళ్ళీ అదే తోచనితనం
మళ్ళా మళ్ళా మనసు అదే ఊగిసలాట

 ఏ ద్వారాలనుండైనా ఎగిరొచ్చే
ఓఆత్మీయ పలకరింపు కోసం
వాకిట్లోకెళ్ళి నిల్చున్నాను
ఎక్కడా ఏ అలికిడీలేదు
అన్ని గుమ్మాలకు మరణభయం 
తాళం కప్పలా వేలాడుతోంది
మళ్ళీ అదే మనసు ఊగిసలాట

 స్నేహహస్తాన్ని అందుకుందామని
 చేతియంత్రాన్ని ప్రేమగా నిమిరాను
 ఎవరిని పలకరించినా
 అటుతిరిగీ ఇటు తిరిగీ
 ప్రతీ ఒక్కరి కంఠంలోనూ
 గుండెల్లోంచి పాకి వస్తున్న 
 భయం ప్రతిధ్వనే ఠంగున మోగుతుంది

ఇప్పుడు అర్థమైంది
ఈ తోచనితనం
ఈ మనసు ఊగిసలాట
నా ఒక్కదానిదే కాదని
మరణభయం గుప్పిట్లో చిక్కిన
ప్రపంచానిదని.

22, జులై 2021, గురువారం

కారా మాస్టారు కు నివాళులు

 తెలుగు కథా ప్రస్థానం వయసుఎంతో కొంచెం తక్కువగా కారా మాస్టారు జీవితం అంతే.కథ గుర్తు వస్తే కారా మాస్టారు గుర్తు వస్తారు,ఆయన గుర్తు వస్తే కథానిలయం నిలువెత్తున కళ్ళ ముందుకు వస్తుంది.తెలుగు కథాసాహిత్యం లో విడదీయలేని బంధం అది.

 కారా మాస్టారి నవతి సందర్భంగా సావనీర్ కోసం వ్యాసం రాయమని అట్టాడ గారు అడిగినప్పుడు ఎంతోమంది వారి సాహిత్యం గురించి రాసారు ఇంకా నేనేమి రాస్తాను అని వారి కథలు పుస్తకం తీసి చదవటం మొదలెట్టేసరికి పేజీ పేజీకీ నాలో ఉద్వేగం కలిగింది.ఎన్ని జాతీయాలో,ఎన్ని నానుడు లో, ఇంకెన్ని సామెతలో ఉత్తరాంధ్ర మాండలీకం నింపుకుని పరిమళాలు నా మనసు చుట్టేసాయి.ఇక అంతే అవి నోట్ చేసుకుంటూ "సామెతలు,నానుడుల పరిమళం" అనే వ్యాసం రాసాను.

    అంతకు ముందు తెలుగు కథలు సరళ గ్రాంథికంలోనే ఎక్కువమంది రాసేవారు.కారా గారూ, రావిశాస్త్రి,బీనాదేవీ ఉత్తరాంధ్ర ప్రాంతం ప్రజలజీవనశైలినీ, సంస్కృతి నీ,కడగండ్లనూ,వారి మనోభావాలను కళ్ళకు కట్టేలా మాండలికసొబగుతో రచనలు చేసి తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసారు.

          ఇక వారు స్థాపించిన కథానిలయం కథా పరిశోధకులకు కల్పవృక్షం, సాహిత్య గని.నేను శ్రీదేవి మోనోగ్రాఫ్ రాసినప్పుడు గానీ,తదనంతరం రచయిత్రుల కథలు గురించి వ్యాసాలు రాసినప్పుడు గానీ కథానిలయం ద్వారా ఎందరో కథకులు కథలను చదవ గలిగాను.కథానిలయం వలనే సమగ్రమైన వ్యాసాలు రాయగలిగాను.అందువలన కథా సాహిత్యానికి కారా మాస్టారి కృషి విలువ కట్టలేనిది.

                హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన తప్పకుండా మాఇంటికి వచ్చేవారు.తెలంగాణా ప్రభుత్వం నిర్వహించిన ప్రపంచ మహాసభలలో ప్రత్యేక పురస్కారానికి  వచ్చినప్పుడు సభా ప్రాంగణం లో కలిసినప్పుడు అప్పటికే వారికి కొంత మరుపు మొదలైనా నన్ను గుర్తు పట్టి మా అక్కయ్య నీ,అన్నయ్య నీ, వీర్రాజు గారి గురించి అడిగారు.నా వ్యాసాలు పుస్తకం పంపినప్పుడు వారు ఆ పుస్తకం చేతిలోకి తీసుకుని ఆశీర్వదించారు.

                      మరొక రెండేళ్ళలో శతవసంతాలు పూర్తి చేసుకోవాల్సిన తరుణం లో వారు వెళ్ళిపోవటం శోచనీయం.ఐతే ఈ కరోనా కష్టకాలంలో ఏమీ బాధ పడకుండా ఈవిధంగా కుమార్తె చేతిలో అనాయాసమరణం ప్రాప్తించినందుకు కొంత ఊరట.

                            ఏది ఏమైనా ఒక తెలుగుకథా మహా వృక్షం నేలకి ఒరిగింది.ఇది సాహిత్య రంగానికి తీరని లోటు.ఈ రెండు మాటలు చెప్పే అవకాశం  నాకు కలిగించిన మనలో మనం అడ్మిన్ లకు ధన్యవాదాలు.

                                   కారా మాష్టారు కి నా బాష్పాంజలులు.

సంకలన సంపాదకులు

 సంపాదకత్వం గురించి గంగిశెట్టిగారు అందించిన వ్యాసం సమగ్ర సమాచారాన్ని అవగాహననీ కల్పించేలా ఉంది.ఆ విషయం మీద సభ్యులు కూడా మంచి చర్చను ఆసక్తి కరంగా కొనసాగించుతున్నారు.

పనిలో పనిగా వివిధ సమకాలీన సంచలనాలు మీద  పుంఖానుపుంఖాలుగా కథా,కవితా సంపుటాలు వెలువరుస్తున్నారు.ఉదాహరణకు యుద్ధం మీద ఒకరు సంకలనం వేయసంకల్పించి సంపాదకత్వం వహించినవారు యుద్ధం మీద కవితల్ని ఆహ్వానిస్తూ పేపరు ప్రకటన ఇచ్చారు.అంతే అప్పటివరకూ రానివారు కూడా రాసి పంపించేసారు.యుధ్ధంమీద కవితా సంకలనం వేసేసారు సదరు సంపాదకులు.అంతే తప్ప అంతకు ముందు ఎవరైనా పాతతరం నుండీ రాసారేమో ననే వెతుకులాట లేదు.ఎంత సులభం అయిపోయింది కదా సంకలనం సంపాదకత్వం?!.నిజానికి యుద్ధం మీద నేనొక దీర్ఘ కవితే రాసాను.దాని ప్రస్తావన కూడా లేదు.

  అదేవిధంగా బియాస్ నదిలో ప్రమాదవశాత్తూ కొట్టుకు పోయిన ఇరవై అయిదు మంది విద్యార్ధుల మీద ఒక సంకలనం వచ్చింది.అందులోనూ నా కవిత రాలేదు.అంటే ప్రకటన కు స్పందించి వచ్చిన కవితల్ని వేసేయటమే తప్ప చిత్తశుద్ధి తో నిజాయితీగా, నిబద్ధతతో సంకలనకర్తలు గా , సంపాదకులుగా పేరు సాధించటం ఎక్కువైపోయింది.

    మరికొందరు కథో,కవితతో పాటూ డబ్బు కూడా ఇవ్వమంటున్నారు.అంటే మనమే,కథో,కవితో ఇవ్వటమే కాకుండా మనడబ్బు తోటే సంకలనం వేసి పనిలో పనిగా డబ్బు మిగిల్చి వాళ్ళదో పుస్తకం కూడా ప్రచురించేసుకుంటున్నారు.ఇదీ ఈ నాటి సంకలనాలకు సంపాదకత్వం వహిస్తున్న వ్యాపార కళ.

    ఏదైనా అవాంఛనీయం,అక్రమం, అన్యాయం, దుర్మార్గం,ఇలా,ఇలా.....ప్రముఖులమీదా,దినాలమీదా కాదేదీ సంకలనకనర్హం అన్నట్లు ఇటువంటి సంపాదకుల పంట పండిస్తున్నాయి.ఇంతకూ వీరూ సంపాదకులే కదా 

    గం.లా.నా. గారి వ్యాసం చూడగానే ఉండలేక రాసాను.ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యురాలిని.

విద్యార్థులతో అరకు యాత్ర

 నేను పనిచేసిన స్కూల్ ఆర్టీసీ హైస్కూల్.ప్రతీ ఏడాది దసరా సెలవుల్లో ఒక్కో సారి ఒక్కో రాష్ట్రంకు విజ్ఞాన యాత్ర కోసం మాకు రెండు బస్సులు, నలుగురు డ్రైవర్లను ఉచితంగా  ఇచ్చేవారు.

ఒకసారి అరకు వెళ్ళాము ఆడపిల్లలకు ఒక బస్సు,మగపిల్లలకు ఒక బస్సు.అరకుపైకి వెళ్ళినప్పుడే ఒక బస్సు కొంచెం ప్రోబ్లం ఉన్నట్లు అనిపించింది.మళ్ళీ కిందకు దిగేముందు డ్రైవర్లు నాకు,మరో టీచర్ కు విషయం చెప్పి చిన్న మగపిల్లలను అందరు టీచర్లను ఒక బస్సులో ఎక్కించి,8,9,10 తరగతుల పిల్లలను కొంత దూరం ఘాట్ రోడ్డు దాటేవరకూ నడిచి రమ్మని చెప్పారు.అందరూ భయపడతారని అందరికీ చెప్పలేదు.అన్నారు.

 మేము కూడా చెప్పలేదు.ఖాళీ బాస్ ముందూ,దానివెనుక మా బాస్ వెళ్ళటానికి ప్లాన్.బస్సులు బయలు దేరాక ఒక పది పదిహేను మంది పిల్లలు ఖాళీ బస్ టాప్ ఎక్కి ఛయ్య ఛయ్యా అంటూ డాన్స్ మొదలెట్టారు.బస్సు రొదలో ఆఫీస్ డ్రైవర్ గమనించలేదు .వెనక బస్ లోని ఆడపిల్లలు కూడా  డాన్స్ మొదలెట్టారు.ఘాట్ రోడ్డు లో బస్ ఆపటానికి లేదు.మా బస్ లో డ్రైవర్లు భయపడసాగారు.నాకు మరో టీచర్ కూ భయంతో చెమట్లు పట్టేసాయి. 

  కొంత దూరం అలాగే జాగ్రత్తగా నడిపి సేఫ్ ప్లేస్ చూసి ఆపారు. ఇంకా అప్పుడు టాప్ మీదున్న పిల్లలను కిందకు దింపి బాస్ పాడైన విషయం చెప్పి" మీకు ఏమైనా జరిగితే మీ పేరెంట్స్ కి ఏంచెప్పుకుంటాం" అని మొట్ట మొదటి సారి నేను కోపంతో వాళ్ళని బెత్తం తో బాది బావురుమని నేను కూడా ఏడ్చేసాను.అప్పుడు అందరూ భయంతో దుఃఖంతో గండం తప్పిందని అనుకున్నారు.

  మిమ్మల్ని విశాఖ బస్ స్టేషన్ వెయిటింగ్ రూం కి చేర్చి బాస్ రిపైర్ కి తీసుకు వెళ్ళారు.ఈ సంఘటననా నా ఇస్కూలు కథల్లో కూడా రాసాను.

 వచన కవితా ప్రక్రియ లోకి అడుగు పెట్టి క్లిష్టమైన సంస్కృత పదబంధాలూ భాషాడంబరాలతో రాస్తేనే కావ్య రూపం పొందుతుందని భావించిన ఆధునిక కవులేకాక సీనియర్ కవులు సైతం నిజాయితీగా నిర్భీతిగా చెప్పిన కుందుర్తి సరళవచనా శైలికి లొంగిపోయారు.

 ఇక తిలక్ కవిత్వంలో భావకవుల సౌందర్యకాంక్ష, అభ్యుదయ కవుల సామాజిక కర్తవ్యం రెండూ కలసి నడుస్తాయి. అందుకనే ఆయన కవిత కళాత్మకమే కాదు, కరవాలమంత పదునైనది అనే భావన పాఠకులకు కలుగుతుంది.తిలక్ నిజాయితీగా చెప్పిన

'నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు

నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు

నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు'

మూడు పంక్తులు ఆయన కవిత్వ తత్వాన్ని తెలిజేసే మూడు సిద్ధాంతాలు.

 శ్రీ శ్రీ తొలి రోజుల్లో రాసిన కొన్ని కవితలలో సంస్కృత భాషాడంబరం,సమాసాలూ కనిపించినా "మెట్లు" కవిత సభలో చదవగా విన్న ఒక పిల్లవాడు "ఇంతేనా కవిత్వమంటే నేనూ రాయగలను " అన్నాడని , సామాన్యుడికీ అర్థమయ్యేలా కవిత ఉండాలని శ్రీశ్రీ ఓ సందర్భంలో చెప్పాడు.

    నిజానికి ఏ సాహిత్య ప్రక్రియ ఐనా సరే దానికి తగిన భాష అదే సమకూర్చుకుంటుంది.

    సామాజిక స్పృహ కవిత్వాన్ని మింగేసిందనటం,సామాజిక స్పృహ ఒక జాడ్యం గా భావించటం అనటం నేను ఒప్పుకోను.

    ఇంకా వెన్నెలా,పూవులూ,ఆమనీ,ప్రేమా,ప్రేయసీ అంటూ కవిత్వం రాయటం ప్రపంచంలో జరుగుతోన్న అనేకానేక సందర్భాలూ, సంఘటనలూ,సంక్షోభాలనుండి పలాయనవాదంగా భావించాలి.

    కవిత్వం ఎప్పుడూ ఆత్మాశ్రయంగా మొదలైనా నేను నుండి మనం లోకీ మనం నుండి జనంలోకీ మమేకం కావాలి.

    పదచిత్రాల్ని ఇబ్బడి ముబ్బడిగా ప్రయోగించితే ఒక్కొక్కసారి వ్యతిరేకార్థం లో కి వచ్చే ప్రమాదం కూడా ఉంది.అందుకని రాసిన వెంటనే మాధ్యమాల్లోనో పత్రికలకో పంపకుండా ఎవరికి వారు తిరిగి సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది.

    ఏ సాహితీవేత్త కైనా వారి సాహిత్యమే వారి వ్యక్తిత్వం కావాలి,వారి వ్యక్తిత్వమే వారి జీవితం కావాలని నేను నమ్ముతాను.

14, జులై 2021, బుధవారం

నడక దారిలో--6

 నడక దారిలో-6


         ఆ ఏడాది గడిచాక తిరిగి విజయనగరం లోని కంటోన్మెంట్  మున్సిపల్ హైస్కూలులో ఫోర్త్ ఫాం (తొమ్మిదో తరగతి)లో చేరాను. స్కూలు కు అయిదారు ఇళ్ళు అవతల మా ఇల్లు ఉండేది.అదే స్కూలులో అన్నయ్య ఇంగ్లీష్ మాష్టారు.అప్పుడే చిన్నన్నయ్యకి ట్రైనింగ్ పూర్తి కావటంతో వెంటనే ప్రాధమిక పాఠశాల లో మాష్టారుగా ఉద్యోగం వచ్చింది.మామయ్య యూఎస్ కి వెళ్ళటం వలన పెద్దక్కకూడా మాతోనే కలిసి  ఉంది.
     ఏడాది పాటు సాహిత్య పఠనం వల్ల కావచ్చు.క్లాసులో తెలుగు మాధ్యమంలోని అన్ని సబ్జెక్టులలోనూ బాగా రాణించేదాన్ని. ముఖ్యంగా తెలుగులో కొత్తగా చందస్సు బోధించారు.ఆటవెలదిలో గణాలు కూర్చుకొని మా తెలుగు మాస్టారు రామకృష్ణమాచార్లులుగారి మీదే మొదటి పద్యం రాసి చూపించుతే మా మాష్టారు పొంగిపోయారు."నువ్వు కవయిత్రి వి అవుతావు తల్లీ" అని దీవించారు.మాష్టారి యిల్లు విజయనగరం కొత్తపేట మంటపం దగ్గర ఉండేది.1980 లో నా మొదటి కవితా సంపుటి " ఆకలినృత్యం" వారి ఇంటికి వెళ్ళి ఇచ్చి వచ్చాను.
              1965లో భారత్ పాకిస్తాన్‌ల మధ్య జరిగిన యుద్దాన్ని రెండవ కాశ్మీర్ యుద్దం అని కూడా అంటారుట.భారత వాయు సేన, పాకిస్తాన్ వాయు సేనలు స్వాతంత్ర్యం తర్వాత తొలిసారిగా ఈ యుద్ధంలోనే పాల్గొన్నాయిట.ఆ సమయం లో ఆకాశంలో చాలా కిందనుండి విమానాలు తిరుగుతూ ఉండేవి.నౌకాశ్రయాలపై దాడి జరుగే అవకాశం ఉందని కూడా వార్తలు వచ్చేవి.రాత్రి సమయంలో  " బ్లాకౌట్" చేయాలని అనేవారు.ఆ బ్లాకౌట్ అనేమాట మొదటిసారి వినటం.ఇంట్లోని వెలుతురు బయటకు కనబడకుండా కిటికి అద్దాలకు నల్లకాగితం అంటించాలి అని అనేవారు.మరి వైజాగ్ లో అది పాటించారో లేదో నాకైతే తెలియదు.
1965 జులైలో పాకిస్తాన్ సైన్యం, భారత పాలిత కశ్మీర్‌ను భారత్ నుంచి దూరం చేయడానికి ఒక గొరిల్లా ఆపరేషన్ ప్రారంభించింది. దానికి ‘జిబ్రాల్టర్’ అనే పేరు పెట్టారుట.ఆ యుద్ధం విశేషాల్ని తేదీ వారీగా ఒక పాత డైరీ లో కూడా రాసుకునే దాన్ని. 
              ఐదు వారాల పాటు జరిగిన యుద్దంలో ఇరు వైపుల వేలాది మంది సైనికులు చనిపోయారు. చివరికి ఐక్యరాజ్య సమితి నిర్ణయించిన కాల్పుల విరమణ ఒప్పందంతో యుద్దం ముగిసింది.ఆ యుద్ధం సందర్భాన్ని, పౌరుల బాధ్యత తెలిపేలా నా రెండవ ఆటవెలది పద్యం రాసాను.బహుశా నేను ఇరవై ఏళ్ళ క్రితం "యుద్ధం ఒక గుండె కోత" దీర్ఘ కవిత ను రాసేందుకు మూలం ఆనాడు నా మనసులోనే బీజం పడిందేమో అనిపిస్తుంది.
              మా మాష్టారు అప్పట్లో  ఒక లిఖిత పత్రికను ప్రారంభించారు.దానికోసం రాయమని నన్ను ప్రోత్సహించారు.ఆ విషయాలు మరొక సందర్భం లో తెలియజేస్తాను.
             తొమ్మిదో తరగతి ఏ సెక్షన్ లో పదిమంది అమ్మాయిలం.ఆ ఏడాది నుండి గణితంలో కాంపోజిట్,జనరల్ అని రెండు కేటగిరీ లు ఉండేవి.కాంపోజిట్ లెక్కలు క్లాస్ లో  నేనూ,రాజీ తప్ప మిగతా అందరూ అబ్బాయిలే.అందువల్ల ఆ మూడేళ్ళలో రాజీ నాకు మంచి స్నేహితురాలైంది.               
            హిందీ సినిమాలు ఆడే ధియేటర్లలో ప్రేక్షకులు తక్కువగా ఉంటారు.అందుకని మేమిద్దరం హిందీ సినిమాకే వెళ్ళి ఆ సినిమా నడుస్తున్నంత సేపు బోల్డు కబుర్లతో పాటూ మనసులోని మాటలన్నీ కలబోసుకునేవాళ్ళం.ఆ స్నేహం నా చదువై నేను హైదరాబాదు వచ్చాక కూడా కొనసాగింది.రాజీ ఇంటర్మీడియట్ ప్రశ్నపత్రాలు దిద్దడానికి హైదరాబాద్ వచ్చినప్పుడు కలిసే వాళ్ళం.ఐతే నేను ఆమెని సాంప్రదాయ ఆంక్షల లక్ష్మణ రేఖ దాటేందుకు చేయందిస్తున్నానని వాళ్ళింట్లో అపోహపడి మా స్నేహానికి మరొక లక్ష్మణ రేఖ గీసారు ఆమె పెద్దలు.ఐతే ఆ పెద్దలు వెళ్ళిపోయినా కూడా ఆమె ఉన్నత ఉద్యోగాలకు ఎదిగినప్పటికీ మరెందుచేతో పెద్దలు గీసిన లక్ష్మణరేఖలు దాటటానికి బదులుగా ఆ రెండు రేఖలకూ అదనంగా మరో రేఖను తనచుట్టూ తానే చుట్టుకుని ముడుచుకుపోయింది.ఆనాటి స్నేహం అలనాటి హిందీ పాటల్లో సుడులు తిరుగుతూ నా గుండెల్లో ఇంకా గుస గుస లాడుతూనే ఉన్నాయి.రాజీకి గుర్తు వస్తున్నాయో లేదో.
           పోలీస్ బారెక్స్  నుండి జానకీ, మేరీ రాజ్యలక్ష్మి కలిసి మా ఇంటికి వస్తే ముగ్గురం కలిసి రోజూ బడికి వెళ్ళే వాళ్ళం.జానకీ వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత రెండో పెళ్ళి చేసుకున్న తండ్రి జానకిని పెద్దమ్మ ఇంట్లోనే ఉంచి చదివించేవారు.పెద్దమ్మకూతుళ్ళు ముగ్గురు ఉన్నా మానసికంగా ఒంటరి తనం అనుభవించేది జానకీ.
           తండ్రి పోయి ఆర్థిక స్వావలంబన లేని తల్లిదగ్గర పెరిగే ఆడపిల్లల గాధ నాదైతే,తల్లి పోయి తండ్రి మరో పెళ్ళి చేసుకుంటే పరాయి పంచన పెరిగిన బాధ జానకిది.అప్పటికి నేను చిన్నదాన్నే ఐనా నేను చదివిన సాహిత్యం లో అనేక జీవితాలు గురించి చదవటం వల్లనేమో నాకు తెలిసిన వారి జీవితాలనూ,వారి కుటుంబ పరిస్థితులను అవగాహన చేసుకోవటానికి ప్రయత్నం చేసేదాన్ని. అందువలనే కాబోలు జానకి నా మనసుకు చాలా దగ్గర అయ్యింది.టిఫిన్ బాక్స్ మా ఇంట్లోనే ఉంచి మధ్యాహ్నం బెల్ అయ్యాక నాతో ఇంటికి వచ్చి రోజూ అందులోని ఎర్రని ఆవకాయ అన్నం తింటూ ఉండేది. నేను కూరగానీ, పప్పు గానీ ఇవ్వనా అని అడిగినా తీసుకునేది కాదు.పదో తరగతి తర్వాత వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోయిన జానకీ  హైదరాబాద్ లో మంచి ఉద్యోగస్తుని భార్యగా తిరిగీ కలిసింది.సుమారు ఇరవై ఏళ్ళ క్రితం వరకూ మా స్నేహం కొనసాగింది.అమాయకత్వం నిండిన పెద్ద పెద్ద కళ్ళూ,ఒత్తైన తాచుపాము లాంటి బారు జెడ తో బాపూ బొమ్మ లాంటి జానకి మాత్రమే "ఒసేవ్ సుభద్రా ఎన్నాళ్ళైందే చూసి ఎలా ఉన్నావే?" అంటూ నన్ను ఆలింగనం చేసుకుని  ఆత్మీయంగా సంభోదించే ఒకే ఒక్క  స్నేహితురాలు.నాకున్న ఇంటాబయటా తీరికలేని జీవితం తో జానకి ని మళ్ళీ కలుసుకోలేక పోయాను.పాత లేండ్ లైన్  నెంబర్ కు ఫోన్ చేస్తే బాగుండును అనుకొని కూడా ఏ వార్త వినాల్సి వస్తుందోనని నా జ్ణాపకాల లోనే జానకిని భద్రపరచుకొని గుర్తు వచ్చినప్పుడు ఆత్మీయంగా తడుముకుంటాను.
               మేరీ రాజ్యలక్ష్మి కూడా ఫిఫ్త్ ఫాం(పదోతరగతి) తర్వాత స్కూలు ఫైనల్ కి గుంటూరు వెళ్ళి పోయింది.మళ్ళీ ఎనభైలలో అనుకుంటా కవి దేవీప్రియ భార్య గా పరిచయం అయ్యింది.కానీ అప్పుడప్పుడు కలిసినా ఎందుచేతనో స్నేహం బలపడలేదు.రెండేళ్ళక్రితం ఆమె భౌతికంగా కూడా దూరమయ్యింది.
                  మరో మంచి స్నేహితురాలు కృష్ణకుమారితో స్నేహం ఆ నాటి నుండి నేటి వరకూ కొనసాగుతూనే ఉంది. కృష్ణకుమారి ,ఆర్థికపరమైన, సామాజిక పరమైన ఏ విధమైన బాదరబందీలు గానీ ఏమీలేని మధ్య తరగతి కుటుంబానికి చెందినది.బహుశా అందువలనే కావచ్చు ఎప్పుడూ సరదాగా,జోవియల్ గా కలుపుగోలుగా నిష్కల్మషంగా ఉంటుంది.కుమారితో కబుర్లకు కూచుంటే కాలం ఇట్టే కరిగిపోయే ది.మరో స్నేహితురాలు కమల,నేనూ కుమారీ తో కలిసి ఒకసారి శివరాత్రి జాగారం కబుర్లు చెప్పుకుంటూనే పూర్తి చేయగలిగాము.అప్పుడప్పుడు నేనూ కుమారీ సినిమాలకు వెళ్ళే వాళ్ళం.
                  సినిమా అంటే గుర్తొచ్చింది.సినీమాహాల్లో  కుర్చీ టికెట్టు ఆరు అణాలో, అర్థ రూపాయో ఉండేది.చిన్నన్నయ్య ప్రతీ నెలా తీసుకు వచ్చే వెచ్చాలషాపులో ఆరోజుల్లో వార్తా పత్రికలలోనే ఆరోజుల్లో వెచ్చాలు పొట్లం కట్టి ఇచ్చేవారు.వాటిని డబ్బాల్లో వేసాక అమ్మ ఆ పేపర్లను సాపుగా చేసి దొంతు పెట్టేది.చిన్నన్నయ్య ప్రభా, ఆంధ్రజ్యోతి వారపత్రిక లు కొనే వాడు.అందులో నాకు నచ్చిన సీరియల్స్ కట్ చేయగా మిగిలిన పత్రికల్ని, దొంతి పెట్టిన పేపర్లను కలిపి  ఇంటి పక్కనే ఉన్న చిల్లర దుకాణంలో అమ్మితే రెండో మూడో రూపాయలు వచ్చేవి అందులోంచే నాకు అమ్మ సినిమాకు డబ్బులు ఇచ్చేది.
                  మా ఇద్దరికీ కాస్త బోర్ కొట్టే క్లాస్ హిందీ.కుమారీ పత్రిక ఒకటి తెచ్చేది వెనకబెంచీలో కూర్చుని జోకులు చదువుకొనేవాళ్ళం.ఒకసారి హిందీ టీచర్ కంటబడ్డాము."కూసే గాడిద మేసే గాడిదని చెడగొట్టినట్లు  సుభద్రని చదవనీకుండా చేస్తున్నావా" అని కుమారినే ఎక్కువ తిట్టేవారు." "పెద్దయ్యాక ఏ హైదరాబాద్ లాంటి ఊళ్ళోనో ఉండాల్సి వస్తే అప్పుడు హిందీ నేర్చుకోనందుకు బాధ పడతారు" అని టీచర్ తిడితే "మేము విజయనగరం దాటి వెళ్ళమండీ"అని కుమారి గొణిగేది.టీచర్ అన్నట్లు గానే కుమారీ నేనూ కూడా వివాహానంతరం ఒకేసారి హైదరాబాద్ చేరాం.అప్పట్లోఅంటే 1972 లో బజార్లో, కూరగాయలు కొనేటప్పుడూ,రిక్షావాలా తోటీ బేరం ఆడాలన్నా హిందీ రాక ఇద్దరం చాలా ఇబ్బంది పడేవాళ్ళం."హిందీ టీచర్ మనల్ని శపించేసారు సుభద్రా "అనేది కుమారీ.
                  నేను రాంకోటీ లో, కుమారి చిక్కడపల్లి లో ఉండటం వల్ల కలుసు కునే వాళ్ళం.తర్వాత మేమిద్దరం తరుచూ కలుసు కోకపోయినా, ఇప్పుడు  సింగపూర్ లో కొడుకు ఇంట్లో ఉన్నా ఏ ఏడాదికో ఫోన్ చేసుకున్నా మాస్నేహం పచ్చదనం అలాగే ఉంది.అందుకే  నేను2006 లో ప్రచురించిన నా కథలసంపుటి "రెక్కలు చూపు" ఆమెకి  అంకితం చేసాను.
                  నా చిన్ననాటి స్నేహితురాళ్ళ జ్ణాపకాలు తలచు కున్నప్పుడల్లా పెదాలమీద చిన్న చిరునవ్వు,గుండెల్లో సన్నని గిలిగింతా కలగలిసి నాచుట్టూ సురభిళాలు వెదజల్లుతూనే ఉంటాయి.మనసులోని మాట చెప్పుకో గలిగే స్నేహితులను మించిన సంపద లేదు కదా!అందుకేనేమో ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారు " సృష్టి లో తీయనిది స్నేహమేనోయీ" అన్నారు.

నడక దారిలో--7

 

నడక దారిలో--7

       1965-66 సంవత్సరాలలో దేశంలోనూ, రాష్ట్రంలోనూ,మా ఇంట్లోనూ కూడా అనేక మార్పులు,సంఘటనలూ మైలురాళ్ళలా పాతుకున్నాయి.
          1965 ఇండో-పాకిస్థాన్ యుద్ధకాలంలో దేశాన్ని ప్రధాని గా నడిపించారు లాల్ బహదూర్ శాస్త్రి .  1966 జనవరి 10న తాష్కెంట్ ఒప్పందం ద్వారా యుద్ధం పూర్తి అయింది. ఒప్పందం జరిగిన తరువాత రాత్రే తాష్కెంట్లో లాల్ బహదూర్ శాస్త్రి గుండెపోటుతో మరణించినట్లు వార్త. కానీ ఈ మరణానికి అనేక కారణాలు చెప్పబడినప్పటికీ అది సి.ఐ.ఎ ద్వారా జరిగిన ప్రణాళికాబద్ధమైన హత్యే ఆనే కథనాలు విన్నాము.
          ఆ సందర్భంగా నెలకొన్న రాజకీయ సమీకరణాల్లో ఇందిరాగాంధీని ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు. ఆ రోజు స్కూల్ లో ప్రార్థన   సమావేశం లో మొట్టమొదటి మహిళా ప్రధాని గా ఇందిరా గాంధీ గురించి చెప్పారు.తరగతి గదిలో కూడా క్లాసు కి వచ్చిన మాష్టార్లు ఆడపిల్లల కి ప్రత్యేకం గా అభినందించారు.అప్పడు ఆడపిల్లలమంతా మేమే ఆ పదవిని పొందినట్లు పొంగిపోయాము.ఆమె పాలనలో మహిళలకే మైనా ఒనగూడిందా అని ఇప్పుడు ఆలోచిస్తే నేతిబీరకాయలో నెయ్యి చెందమే.
          ఇక రాష్ట్రంలో 1966 అక్టోబర్, నవంబర్ నెలల్లో . 'విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు' నినాదంతో ప్రజలు ఉద్యమించారు.ఈ ఉద్యమాన్ని అప్పటి నాయకుడు తెన్నేటి విశ్వనాథం ముందుండి నడిపించాడనీ,టి. అమృతరావు, ప్రత్తి శేషయ్య లాంటిే నాయకులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారనీ విశాఖ జిల్లా అంతటా ఎన్నెన్నో వార్తలూ,ఎన్నో సంచలనాలు.
           గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన టి.అమృతరావు 1966 అక్టోబరు 15న విశాఖపట్నంలో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారనీ జిల్లా అంతటా ఓ విధంగా అట్టుడికి పోయిందని చెప్పొచ్చు.
       ఈ  సందర్భంలో  జరిగిన బందుల్లో( అప్పటికీ విజయనగరం విశాఖ జిల్లా లోనే ఉంది) స్కూలు మూయించటానికి వచ్చిన ఉద్యమకారులతో పాటూ సంఘీభావం గా మేము కూడా మావంతుగా కాసేపు నినాదాలు చేసాము.ఉద్యమంలో భాగంగా 32 మంది ప్రాణాలర్పించి సాధించిన విశాఖ ఉక్కు మాత్రం ఈ నాటి పరిస్థితులు చూస్తుంటే ఇప్పుడు తుప్పు పట్టేలా ఉంది.
       నిజానికి నాకు రాజకీయాలు పట్ల ఆసక్తి ఉండేది కాదు.అయినప్పటికీ దేశంలో కానీ , రాష్ట్రంలో కానీ ఏ సంచలనాలు ఉన్నా డైరీ లో రాసుకునే అలవాటు ఉండటం ఆశ్చర్యమే .అసలు సోషల్ స్టడీస్ పుస్తకం చదివినప్పుడల్లా
        " ఆ రాణీ ప్రేమ పురాణం/
       ఈ ముట్టడి కైన ఖర్చులూ /
       తారీఖు లు దస్తావేజులు /
       ఇవి కాదోయ్ చరిత్ర సారం,"
    అనుకునేదాన్ని.అయినా ఏమాటకామాటే సోషల్ లో చాలా మంచి మార్కులే వచ్చేవి.
          ఇక మా ఇంట్లో మా చిన్నన్నయ్య  కథలు అప్పటికే  ప్రచురితం అవుతున్నా ఆ ఏడాది ఆంధ్రప్రభ దీపావళి కథలపోటీలో    బహుమతి వచ్చేసరికి ఆ ఊరులో కథకుడు గా గుర్తింపు వచ్చింది.ఆబహుమతి డబ్బు తో రేడియో కొన్నాడు.ఇంక నాకెంత సంబరమో.ఆ రోజుల్లో సాయంత్రం 5-30 కి లలిత సంగీతం ప్రసారం అయ్యేది.అవి తప్పక వింటూ ఆ పాటలు రాసుకుంటూ నేర్చుకునేదాన్ని.అప్పట్లోనే సంగీతం నేర్చుకోవాలని కోరిక మనసుని తొలిచేసింది.
          అన్నయ్య కథలు ప్రచురితం అవుతున్నప్పుడల్లా నాకూ కథలు రాయాలని అనిపించేది.రావిశాస్త్రికి ఏకలవ్య శిష్యుడిగా రాసే అన్నయ్యకథలే కాక,అతను సేకరించే రావిశాస్త్రి,కారా,చాసో,బీనాదేవి పుస్తకాలూ నేను కూడా చదవటం వలన నా ఆలోచనల్లో,నా దృక్పథం లో బాగా మార్పు రావటం నాకే తెలుస్తోంది. మళ్ళా ఇప్పుడిప్పుడే చదువులో కుదురు కున్నాను కదా మళ్ళా ఆగిపోతుందేమోనని భయపడ్డాను.కానీ నాకు తోచిన ఆలోచనల్ని కాగితాల మీద పెట్టి పుస్తకాలు అడుగున దాచేసేదాన్ని.
          ఆరోజుల్లోనే జరిగిన చిన్నక్క వివాహం మరో సంచలనం.కోటబొమ్మాళిలో మా స్కూల్లో మాష్టారు వాసుదేవరావు గారు అప్పటి నుండి అక్కని ఇష్టపడ్డారు.విజయనగరానికి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కోరుకొండ లో 1962 లో సైనిక్ స్కూలు స్థాపించినప్పుడు ఆయనకి అందులో ఉద్యోగం వచ్చింది.మొదటి నుండి ఆయన హార్దికంగా,ఆర్థికంగా అమ్మకి ఆసరాగా ఉన్నారు.పెద్దక్కయ్య తాను మా ఇంట్లో ఉన్నప్పుడే వారి వివాహం నిశ్చయం చేసింది. విశాఖ పట్నం లో రిజిష్టర్ కార్యాలయం లో వివాహం జరిగింది.వాసుదేవరావుగారి తరపున ఆయన సహోద్యోగులు,మా కుటుంబం మాత్రమే హాజరయ్యాము.ఆ వెంటనే చిన్నక్క కోరుకొండ వెళ్ళిపోయింది.  వర్ణాంతర వివాహం కావటాన కుటుంబ పెద్ద ఒకరు మావంశవృక్షం రాస్తూ తులసివనం  లో గంజాయి మొక్కగా అభివర్ణించారు కానీ తదనంతరం ఆయన కుటుంబంలోనే  వర్ణాంతరమేకాదు మతాంతరం, రాష్ట్రాంతరం ,దేశాంతరం వివాహాలు కూడా జరిగాయి.ముఖ్యంగా మా నాన్నగారి తరపు బంధువులు మా చిన్నక్క కుటుంబాన్ని సంపూర్ణంగా,మాకుటుంబాన్ని పాక్షికంగా దూరం పెట్టారు. ఈ సంఘటన వలన కుటుంబ వ్యవస్థపై ముఖ్యంగా మహిళలపై సంప్రదాయాలు,సమాజం వేసే సంకెళ్ళ ప్రభావం గురించి నన్ను ఆలోచింపచేయటం మొదలు పెట్టింది.
          నా వ్యక్తిత్వాన్ని సానపెట్టటం మొదలు పెట్టింది అప్పుడే.కోటబొమ్మాళి లో ఉన్నప్పుడూ నేను మాష్టారి చెల్లెలుగా గుర్తింపబడినా నన్ను బాధించలేదు.బహుశా అప్పటికి చిన్నపిల్లనేకావటంవలనకావచ్చు.                                                                     .      ఓ ఇద్దరు ముగ్గురు అన్నయ్య మిత్రులైన స్కూలు మాస్టర్లు మధ్యాహ్నం టిఫిన్ డబ్బాలు తీసుకొని మా ఇంటికి వచ్చి తినేవారు.స్కూలులో నాకు మంచి మార్కులు రావటానికి నేను మాష్టారి చెల్లెల్ని కావటం వల్లే అని కొందరు గుసగుసలు మొదలు పెట్టారు. అది నన్ను చాలా బాధ పెట్టింది.ఇప్పుడు హైస్కూలు చదువు కు వచ్చాను కనుక వయసుతో పాటూ మనసు,ఆలోచన పరిణితి చెందటం నాకే తెలుస్తోంది  .SSLC లో ఫైనల్ పరీక్ష పేపర్లు బయట వేల్యుయేషన్ కి ఎక్కడికో పంపుతే ఎవరో దిద్దుతారుకదా అందులోఎలా అయినా నా తెలివితేటల్ని నిరూపించు కోవాలనే పంతం వచ్చింది.
      అప్పట్లో SSLC లో మార్కులు హిందీలో కలిపి,హిందీ కలప కుండా అని రెండు విధాలుగా  ఫైనల్ లోమార్కులు ఇచ్చేవారు.     ఆ విధంగానే పరీక్షల్లో స్కూలు ఫైనల్లో హిందీ కలిపి ఐతే మూడవ స్థానంలో, హిందీ మార్కులు కలప కుండా ఐతే మొదటి  స్థానం  లో  వచ్చాను.
      అప్పటి నుండే నన్ను నేను నిరూపించుకోవడానికి,నన్ను నేను నిలబెట్టుకోవడానికి  అస్తిత్వ పోరాటానికి బీజం పడింది.

3, జులై 2021, శనివారం

సిరికోనభారతి లో ప్రచురితం

 వచన కవితా ప్రక్రియ లోకి అడుగు పెట్టి క్లిష్టమైన సంస్కృత పదబంధాలూ భాషాడంబరాలతో రాస్తేనే కావ్య రూపం పొందుతుందని భావించిన ఆధునిక కవులేకాక సీనియర్ కవులు సైతం నిజాయితీగా నిర్భీతిగా చెప్పిన కుందుర్తి సరళవచనా శైలికి లొంగిపోయారు.

 ఇక తిలక్ కవిత్వంలో భావకవుల సౌందర్యకాంక్ష, అభ్యుదయ కవుల సామాజిక కర్తవ్యం రెండూ కలసి నడుస్తాయి. అందుకనే ఆయన కవిత కళాత్మకమే కాదు, కరవాలమంత పదునైనది అనే భావన పాఠకులకు కలుగుతుంది.తిలక్ నిజాయితీగా చెప్పిన

'నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు

నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు

నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు'

మూడు పంక్తులు ఆయన కవిత్వ తత్వాన్ని తెలిజేసే మూడు సిద్ధాంతాలు.

 శ్రీ శ్రీ తొలి రోజుల్లో రాసిన కొన్ని కవితలలో సంస్కృత భాషాడంబరం,సమాసాలూ కనిపించినా "మెట్లు" కవిత సభలో చదవగా విన్న ఒక పిల్లవాడు "ఇంతేనా కవిత్వమంటే నేనూ రాయగలను " అన్నాడని , సామాన్యుడికీ అర్థమయ్యేలా కవిత ఉండాలని శ్రీశ్రీ ఓ సందర్భంలో చెప్పాడు.

    నిజానికి ఏ సాహిత్య ప్రక్రియ ఐనా సరే దానికి తగిన భాష అదే సమకూర్చుకుంటుంది.

    సామాజిక స్పృహ కవిత్వాన్ని మింగేసిందనటం,సామాజిక స్పృహ ఒక జాడ్యం గా భావించటం అనటం నేను ఒప్పుకోను.

    ఇంకా వెన్నెలా,పూవులూ,ఆమనీ,ప్రేమా,ప్రేయసీ అంటూ కవిత్వం రాయటం ప్రపంచంలో జరుగుతోన్న అనేకానేక సందర్భాలూ, సంఘటనలూ,సంక్షోభాలనుండి పలాయనవాదంగా భావించాలి.

    కవిత్వం ఎప్పుడూ ఆత్మాశ్రయంగా మొదలైనా నేను నుండి మనం లోకీ మనం నుండి జనంలోకీ మమేకం కావాలి.

    పదచిత్రాల్ని ఇబ్బడి ముబ్బడిగా ప్రయోగించితే ఒక్కొక్కసారి వ్యతిరేకార్థం లో కి వచ్చే ప్రమాదం కూడా ఉంది.అందుకని రాసిన వెంటనే మాధ్యమాల్లోనో పత్రికలకో పంపకుండా ఎవరికి వారు తిరిగి సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది.

    ఏ సాహితీవేత్త కైనా వారి సాహిత్యమే వారి వ్యక్తిత్వం కావాలి,వారి వ్యక్తిత్వమే వారి జీవితం కావాలని నేను నమ్ముతాను.

    

21, జూన్ 2021, సోమవారం

బొమ్మ జెముళ్ళు

   బొమ్మజెముళ్ళు


వాకిట్లో అందం కోసం వేసిన బొమ్మజెముళ్ళు

ఎప్పుడు వ్యాపించేసాయో

ఎలా ఆక్రమించేసాయో

చడీ చప్పుడూ లేకుండా ఇల్లంతా అల్లుకుపోయాయి


అంతటా ఇరుకుతనం

మూలమూలల్లోనూ రక్కసిపొదలే

రాగాలు ప్రసరించనీయని రక్కసిపొదలే

ఏ ముళ్ళకో తగులుకొని ఊహ చీరుకు పోతోంది

ఏ పొదల్లోనో చిక్కుకుని మాట ఆగిపోతుంది

మనసు నిశ్శబ్దంగా ఆవిరైపోయి

గుండె అవయవంగా మాత్రమే మిగిలి పోతోంది

మౌనం యాంత్రికంగా రాజ్యమేలుతోంది


ఆత్మీయగాలి కూడా చొరబడలేని ఇరుకు తనం

గాలాడ్డానికి మైదానాల్లోకి

పారిపోవాలనిపించేంత ఇరుకుతనం


మైదానాల్లో మాత్రం ఏముంది

స్నేహాన్ని పరిమళించుతూ

తలలుపుతూ పిలిచే పూలచెట్లేవీ

ఆప్యాయంగా తీగలు చాస్తూ

ఒళ్ళో చేర్చుకొనే పొదరిళ్ళేవీ


సమస్త ప్రపంచాన్నీ గడ్డిపోచలా చూస్తూ

నెత్తిన కళ్ళు పెట్టుకొని ఆకాశంలోకి చేతులు చాచే

అశోకచెట్లో టేకు చెట్లో తప్ప

పచ్చికలో దొర్లి దొర్లి

మనసారా ఏడవాలనుకుంటే

కాళ్ళలోనే కాదు కళ్ళల్లోనూ పుళ్ళు చేసే పల్లేర్లే


మైదానాల్నిండా జనమే

నగరాల్ని సైతం నట్టడవుల్ని చేసేస్తూ

స్పర్శకి కూడా ఇష్టపడనితనంతో

ముళ్ళు మొలిపించుకున్న దేహాల్తో

నిలువెల్లా బొమ్మజెముళ్ళైన జనాలే

ఇంటా బయటా గాలాడని ఇరుకు తనం

ఊహాడని పరాయి తనం

జీవం లేని ఇసుకపర్రల జీవితాలు

కాలుచాచి పారిపోవాలని చూస్తాం

ఆశ్చర్యంగా కాళ్ళూవేళ్ళూ కదల్చలేం

మనల్ని మనం చూసుకొంటే

ఆసాంతం మనమే బొమ్మజెముళ్ళం!!


9, జూన్ 2021, బుధవారం

నడక దారిలో--3

 ఇంటి పెద్దదిక్కు నాన్నగారు వెళ్ళిపోయాక కుటుంబం లో మార్పు వచ్చింది.వీథివరండా లో ఉన్న బల్ల ఖాళీ ఐపోయింది.బల్లే కాదు ఇల్లంతా కూడా ఖాళీయే.పెద్ద మామయ్య అమ్మచేతిలో పెట్టిన కొద్ది పాటి సొమ్ము కూడా ఖాళీయే.

     ఆరో తరగతి చదువుతున్న నేను మళ్ళీ బడికి వెళ్ళలేదు.  ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం ఐనప్పుడో, కుటుంబం సంక్షోభంలో ఉన్నప్పుడో ముందుగా మాన్పించేది ఆడపిల్లల చదువులే కదా.ఇంక నాకు అన్నీ సెలవులే.

     అప్పట్లో పెళ్ళో, పేరంటమో ఏవి జరిగినా లౌడ్ స్పీకర్లు పెట్టి పాటలు వేసేవారు.ఉదయమే ' నమోవేంకటేశా' అంటూ స్పీకర్లో ఘంటశాల కంఠం నుండి రాగం వినిపించే సరికే నాకు ఎంత సంబరంగా ఉండేదో! వీధి వరండా లో తాడు తో ఉయ్యాల ఉండేది అందులో ఒక తలగడా వేసుకొని ఊగుతూ లౌడ్ స్పీకర్లు లోంచి గాలి తరంగాల మీదుగా నా దగ్గరికి చేరిన చెంచులక్ష్మి సినిమా లో 'పాలకడలిపై' మొదలుకొని, భలేరాముడు,భూకైలాస్, సువర్ణ సుందరి ఒకటేమిటి ఆనాటి  పాటలతో గొంతు కలుపుతూ పాడుకుంటుండేదాన్ని .పాట ఆగుతే చేతిలోని బొమ్మల కథల పుస్తకాలను చేతిలోకి తీసుకుని చదవడం రోజంతా అదేపని.

           మా ఇంటి ఎదురుగా గుప్తావారి ఎర్ర పళ్ళపొడి తయారు చేసి అమ్మే కుటుంబం ఉండేది.వాళ్ళింట్లో అమ్మాయి కూడా నన్ను చూసి ఉయ్యాల కట్టించుకుని రాగాలు తీసేది.

           మా ఇంటికి దగ్గర్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి ఇల్లు ఉండేది.వాళ్ళకి నలుగురు ఆడపిల్లలు.ఇద్దరు అమ్మాయిలు నా తోటి వాళ్ళు. వాళ్ళు ఎక్కడికి ఎవరింటికీ  వచ్చేవారు కాదు.నన్ను వాళ్ళ ఇంటికి రమ్మని జవాన్ ని పంపి పిలిచేవారు.బొమ్మలపెళ్ళిళ్ళు చేసేవారు.వాళ్ళురాకుండా నన్ను రమ్మని మాటిమాటికీ పిలుస్తూ ఉండటం తో అమ్మ నన్ను కూడా మాటిమాటికీ వెళ్ళొద్దని కోప్పడింది.అంతే ఇక వెళ్ళటం మానేసాను.

            ఒకరోజు మధ్యాహ్నం మూడో నాలుగో అయ్యుంటుంది,  యథావిధిగా కథల పుస్తకం చదువుతుంటుంటే అకస్మాత్తుగా చిమ్మచీకటి ఏర్పడి హోరున పెద్దగా చప్పుడు. వర్షం పడుతుందేమో అని బయటికి వస్తే  ఏమిలేదు.చుట్టుపట్ల అందరూ ఆ శబ్దానికి ఇళ్ళల్లో నుండి బయటకు వచ్చారు.ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. ఒక్కసారిగా నేను కెవ్వున కేక వేసాను నామీద ఏదో పడిందని అన్నాను.అంతలో చూస్తూ చూస్తుండగానే ఆ  నల్లని మేఘం జారుకుంటూ వెళ్ళి పోతే 

      తెలతెల్లని వెలుగు తెరలు తొలగించుకున్నట్లు మెలమెల్లగా వచ్చింది.నామీదపడిన దాన్ని చిన్నన్నయ్య తీసుకు వచ్చాడు అరచేయి అంత ఉన్న మిడత.అంటే అంత హోరు తో నల్లమేఘం లా వచ్చినది మిడతలదండు అన్నమాట.ఇటీవల మిడతలదండు రాష్ట్రాలలోకి వచ్చిందని మీడియా లో ఊదరగొడుతుంటే ఆనాటి అనుభవం గుర్తు వచ్చి అందరికీ చెప్పాను.మరి తర్వాత ఈ అరవై ఏళ్ళలో మిడతలదండు ఎప్పుడైనా వచ్చిందో లేదో గుర్తు లేదు.

          ఆ రోజుల్లోనే ఒకరోజు మా ఇంట్లో అప్పుడప్పుడు ఇంట్లో సాయానికి వచ్చే అన్నపూర్ణ ని నాకు తోడుగా బియ్యం పిండి పట్టించటానికి నన్ను అమ్మ కొత్తపేట లోని పిండిమరకు పంపింది.పలుమార్లు జాగ్రత్తలు చెప్పి పంపింది.అన్నపూర్ణ మేదకురాలు.బండ పనిచేయడమే తప్ప ఏమీ రాదు ఏమీ తెలియదు.సరే పిండి పట్టించి తిరిగి మా ఇంటి బాటకు వచ్చే టప్పటికి ఒక ఆమె పలకరించి ' ఇక్కడే పూల్ బాగ్ రోడ్లో  బాలపేరంటాలు గుడికి వెళ్దాం.రా పాపా.అంతా మంచి జరుగుతుందని" అంది . అన్నపూర్ణ ఆవిడ వెనకే వెళ్ళిపోవటం మొదలు పెట్టింది.అన్నపూర్ణని పిలుస్తూ నేనూ వెంటబడ్డాను.

        "భయపడకు పాపా  మీ గురించి తెలుసు మీ నాన్న గారు పోయారు కదా.డబ్బుకి ఇబ్బంది పడుతున్నారు కదా.మీ అన్నయ్య కి వచ్చే ఏడాది కల్లా  ఉద్యోగం వస్తుంది. మీకష్టాలన్నీతీరి పోతాయి.నువ్వు కూడా బాగా చదువు కుంటావు.

     శ్రీ వీర బాల పార్వతమ్మ పేరంటాలు నీలాంటి పాపే.రెండేళ్ళ కిందట కుక్క కాటుకుగురై  చనిపోయింది.తర్వాత అమ్మానాన్నలకు కలలో కనబడి రోడ్డు పక్కన గుడి కట్టించమంది.అలాగే 1958 లో పూల్ బాగ్ రోడ్ లోగుడి కట్టి పూజలు చేస్తున్నారు.ఆ దారెంట రాజాం పోయే వాహనాల వారంతా తప్పకుండా ఆ గుడికి వెళ్ళి మొక్కుబడులు చెల్లిస్తుంటారు.ప్రతీ ఏడాది ఫిబ్రవరి లో అయిదు రోజుల పాటు ఉత్సవాలు కూడా జరుగుతాయి.గుడికి దగ్గర లోనే మన విజయనగరం రాజు లైన పూసపాటి రాజులభవనం ఉంది తెలుసా." ఈ విధంగా నా చెయ్యి పట్టుకుని  స్థల పురాణం  చెప్తూ నడుస్తుందామె.

        మధ్యమధ్యలో భయపడకు "మీ అమ్మ ఏమీ అనదులే" అంటోంది ఆమె.పళ్ళికిలించుకుంటూ ఆవిడ వెనకే నడుస్తున్న అన్నపూర్ణని చూస్తుంటే ఒకవైపు కోపం, ముసురు కుంటున్న చీకటిని చూస్తుంటే భయం.ఇంటికి వెళ్ళాక అమ్మ ఏమంటుందో అని దుఃఖం ముప్పిరిగొన్నాయి.ఆమె చెప్తున్న దేదీ నాచెవికి ఎక్కడం లేదు.

        చిన్న పందిరి మాత్రమే ఉన్న ఆ గుడిని చూస్తే నాకు గుడిలా అనిపించలేదు.కనీసం నమస్కారం ఐనా చేసానో లేదో తెలియదు.తిరుగు ముఖం పట్టి మా వీథి మొగలో ఎక్కడైతే ఆవిడ కలిసిందో అక్కడ వరకూ వచ్చి ఎటో వెళ్ళి పోయింది.

        ఇంటి దగ్గర వాకిట్లో అమ్మా, చిన్నక్క , అన్నయ్యా ఆందోళన నిండిన ముఖాలతో నా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.అన్నపూర్ణ నుండి పిండి పట్టించిన  గిన్నే తీసుకుని పంపించేసింది అమ్మ.

        లోపలికి వెళ్ళాక ఏడుస్తూనే నేను చెప్పిన  విషయం అంతా విని ఎవరు పిలిస్తే వాళ్ళ వెంట వెళ్ళి పోవటమేనా అని అందరి చేతా చీవాట్లే కాక,చెంపలు బూరెలు అయ్యాయని వేరే చెప్పక్కర్లేదు అనుకుంటా.

        అంతే కాక ఆ సంఘటన నన్ను ఈ నాటికీ వెంటాడుతూనే ఉంది.

        చిన్నప్పుడు చూసిన శ్రీ వీర బాల పార్వతమ్మ పేరంటాలు గుడి ఈ అరవై ఏళ్ళలో బహుశా బాగా బ్రహ్మాండం గా విస్తరించే ఉంటుంది.ప్రభుత్వ బడులు ఏన్నేళ్ళైనా అభివృద్ధి లోకి రావు కానీ గుడులు అంతకంతకూ పెరుగుతూనే ఉంటాయి కదా.అందుకే ఆ  జ్ణాపకాన్ని ఈ సారి విజయనగరం  వెళ్ళినప్పుడు కొంతైనా వెతుక్కోవాలి.  ఒకసారి వెళ్ళి తప్పక చూసి రావాలి. 

-- శీలా సుభద్రా దేవి.

    

11, మే 2021, మంగళవారం

నడక దారిలో--5

 నడక దారిలో--5


    కోటబొమ్మాళిలో ఒకసారి స్నేహితులతోఅన్నయ్య ఊరి పొలిమేరలో సరదాగా వెళ్ళినప్పుడు  ఒక ఎలుగుబంటిని దగ్గర లో చూసి అందరూ పుంతల్లోంచి పరిగెత్తటం లో ఒళ్ళంతా ముళ్ళు గీరుకున్నాయి  .దాంతో కోటబొమ్మాళి లో నచ్చకపోవడంతో   అన్నయ్య బదిలీకి ప్రయత్నాలు చేయటంతో  విజయనగరం కి తిరిగి వచ్చేసాం.కానీ వేరే ఇల్లు తీసుకోకుండా ఒక మేనమామ ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది.వాళ్ళు పదే పదే అన్నయ్య తో బాధ్యతలన్నీ మోయాల్సివచ్చిందని అనటంతో అతను మా మీద ద్వేషం పెంచుకున్నాడు.ఫలితం అమ్మ,చిన్నక్క ఆ ఇంట్లో జీతం బత్తెం లేని పనిమనుషులు అయ్యారు.రోజురోజు కీ దాష్టికం భరించలేక అమ్మ చిన్నక్క నీ , నన్ను తీసుకుని రోడ్డున పడింది.

    చిన్నన్నయ్య అందరి దయాదాక్షిణ్యాలతో మాటలు పడుతూ యూనివర్సిటీ చదువు చదవటం ఇష్టం లేక వదిలిపెట్టి ఎవరికీ చెప్పకుండా శ్రీకాకుళం లో టీచర్ ట్రైనింగ్ లో జాయిన్ అయిపోయాడు.అతని దగ్గర కు మేము వెళ్తే మమ్మల్ని ఏలూరు దగ్గర గోపన్న పాలెం లో ఉన్న పెద్దక్కదగ్గరకు చేర్చాడు.ఆ విధంగా ఆ ఏడాది మళ్ళా చదువు ఆగిపోయి అక్క ఇంటికి చేరాను.

               మా పెద్దక్కయ్య పి.సరళాదేవి .ఆమె 

డా. పి.శ్రీదేవి స్నేహప్రభావంతో 1955 నుండీ తెలుగు స్వతంత్ర లో విస్తృతంగా కథలు రాసేది.వాళ్ళు పుంగనూరు లో ఉన్నప్పటి నుండి  ఎమ్.రాజేంద్ర( జర్నలిస్టు),మధురాంతకం రాజారాం గార్లు  కుటుంబ స్నేహితులు.అక్కయ్యవి మూడు కథల సంపుటాలు,రెండు నవలికలు, తెలుగు వారి సామెతలు పై విశ్లేషణాత్మక గ్రంథం ' సామెత' ప్రచురింపబడ్డాయి.1975 తర్వాత రచనలు చేయటం మానేసింది.

                నాకు ఊహ తెలియక ముందే అక్కకి పెళ్ళి ఐపోయింది.ఆమె ఎప్పుడు విజయనగరం వచ్చినా నాకోసం బొమ్మలో మిఠాయి లో కాకుండా చిన్న చిన్న రష్యన్ బొమ్మల పుస్తకాలు తెచ్చేది.అందువలన కూడబలుక్కుని చదివే దాన్ని . సోవియట్ లేండ్ వాళ్ళ పిల్లల బొమ్మల పుస్తకాల తెలుగు అనువాదాలు ఇచ్చేది.ఆ విధంగా చాలా చిన్నతనం నుండి కథలపుస్తకాలు చదవటం అలవాటైంది.

            అక్క భర్త మా చిన్నమామయ్యే. వాళ్ళు ఉద్యోగరీత్యా ఏ వూరు వెళ్ళినా అక్కడ పిల్లలందరినీ చేర్చి బాలానందం నడిపేది.వాళ్ళకి పాటలు, డేన్స్ లే కాకుండా కథలు చదివించే ది.సెలవుల్లో వెళ్ళినప్పుడు నేను కూడా వాళ్ళ జత చేరేదాన్ని.

  1963_64లో ఈ విధంగా బడిచదువు ఆగిపోవటంతో అక్కయ్య ఇంట్లో ఉండక తప్పలేదు.

       మామయ్య సహఉద్యోగుల పిల్లలు లత,సుభ  నా వయసు వాళ్ళు.వాళ్ళతో నాకు స్నేహం కలిసింది.మా కన్నా చిన్నపిల్ల షహనాజ్ మాతో చేరేది.వాళ్ళు స్కూలు నుంచి వచ్చాక సాయంత్రం కలిసి కబుర్లు చెప్పుకునే వాళ్ళం. లతతో నా స్నేహం నేను హైదరాబాద్ వచ్చేక కూడా చాలా కాలం కొనసాగింది.లత నాన్నగారు రిటైర్మెంట్ అయ్యాక హైదరాబాద్ వారాసిగుడాలో సెటిల్ అయ్యారు.కానీ ఇప్పుడు లత ఎక్కడుందో తెలియదు.

          పగలంతా అక్కయ్య వాళ్ళింట్లో లైబ్రరీ లోనివే కాక దగ్గర లోని లైబ్రరీ కి వెళ్ళి కొంతసేపు చదువుకొని మరి రెండు పుస్తకాలు తెచ్చుకునేదాన్ని.అలా ఒక్క ఏడాది లో ఎంతోమంది ప్రముఖరచయితల రచనలే కాక శరత్  అనువాదగ్రంథాలు కూడా చదివాను.బడికి వెళ్ళి చదువుకునే అవకాశం కోల్పోయిన బాధని పుస్తకాలు చదవటం లో మర్చిపోయేదాన్ని. అప్పటినుండీ నాకు ప్రాణ మిత్రులు పుస్తకాలే.

           ఒకసారి ఏలూరులో ఆవంత్స సోమసుందర్ గారికి పెద్ద ఎత్తున ఘనసన్మానం జరుగుతుంటే  నన్ను అక్క ఆ సభకు తీసుకెళ్ళింది.సభానంతరం ఒక సాహిత్య మిత్రుని ఇంటిడాబా మీద రాత్రివెన్నెల్లో కవితా గోష్ఠి జరిగింది.ఎంతమందో కవులు కావ్యగానం చేస్తుంటే అద్భుతంగా అనిపించింది.అంతవరకూ కథలూ నవల్లే  చదివే దాన్ని.మర్నాడు అక్కని కవిత్వం పుస్తకాలు అడుగుతే వైతాళికులు, మహాప్రస్థానం, కృష్ణపక్షం, ముత్యాల సరాలు ఇచ్చింది.అందులోని నాకు నచ్చిన వన్నీ ఒక పాతడైరీలో రాసుకున్నాను.అది ఇప్పటికీ నా దగ్గరే  ఉంది.అప్పటి నుండి కృష్ణశాస్త్రి కవితలోని లాలిత్యం ఎంత ఇష్టమో, శ్రీ శ్రీ కవిత్వం లోని లయ, పదును అంతే ఇష్టం.

           పుస్తకపఠనమే  కాకుండా అక్క ఎంబ్రైయిడరీ,పూసల బొమ్మలు తయారు చేయటం, లలిత సంగీతం నేర్పించేది.నేను బొమ్మలు బాగా వేస్తున్నానని నా చేత  మంచి చిత్రం వేయించీ ఢిల్లీ శంకర్స్ వీక్లీ వారు కండక్ట్ చేసే బాలల చిత్రలేఖనం పోటీ కి పంపింది.బహుమతి రాలేదు కానీ సర్టిఫికెట్ వచ్చింది.

           గోపన్న పాలెంలో మామయ్య వాళ్ళ ఇన్స్టిట్యూట్ లో ఒకసారి యువజనోత్సవాలు జరిగాయి.అందులో చిన్నక్క కూడా పాల్గొంది.ఒక గ్రూపువాళ్ళు గురజాడ కన్యక గేయ కథని నాటకం గా ప్రదర్శించారు.అందులో కన్యక పాత్ర షహనాజ్ వేసింది.ఆ మేకప్ లో షహనాజ్ ఎంత బాగుందో!కానీ కొన్ని ఏళ్ళకు ఆ అమ్మాయి కాల్చుకుని చనిపోయిందని లత ద్వారా విని చాలా బాధ పడ్డాను.నేను టీచర్ గా పని చేస్తున్న సమయంలో నా తరగతి పిల్లలతో కన్యక నాటకం వేయించాను.అందులో కన్యక గా వేసిన అమ్మాయి వివాహం అయ్యాక కాల్చుకుని చనిపోయింది.ఈ రెండు సంఘటనలూ కాకతాళీయం కావచ్చు కానీ గురజాడ కన్యక లో ఆత్మాహుతి చేసుకున్నట్లు రాయటం ఆ పాత్ర వేసిన వాళ్ళ మనసు పై ప్రభావం చూపిందేమో అని నా భావన.

           1964 మే 24 న జవహర్ లాల్ నెహ్రూ దివంగతులు ఐతే సంతాపం సభ కూడా పెట్టారు. సోవియట్‌ యూనియన్‌తో స్నేహం, ఆపత్కాలంలో అమెరికా వైఖరితో కుంగిపోయిన నెహ్రూ ఆ దిగులుతోనే మంచానపడ్డారని చెప్పారు.యుద్ధం తర్వాతి కాలంలో శత్రువు శత్రువు మిత్రులంటూ పాక్‌, చైనా మధ్య మైత్రి నెహ్రూను కలవరపెట్టింది. ఫలితంగా యుద్ధం ముగిసిన రెండేళ్లకే అకాలం మరణం పాలయ్యారని వక్తలు మాట్లాడారు.మర్నాడు వార్తా పత్రికలో వచ్చిన బాల్యం నుండి  నెహ్రూ ఫొటోలన్నిటినీ కత్తిరించి ఆల్బం లా తయారు చేసాను.

           కొన్నిరోజుల కి అనుకోకుండా నాన్న ఆఫీసునుండి డబ్బు లేవో వస్తాయని ఉత్తరం వస్తే అమ్మ, అక్కయ్య వెళ్ళారు.ఆ డబ్బు తో చిన్నక్కకు రెండో మూడో చీరలు,నాకు ఒక మూడు వోణీలు కొని తెచ్చారు.అక్కయ్య తన దగ్గరి ఒక చీర కత్తిరించి పరికిణీలు కుట్టింది.విజయనగరం వెళ్ళినప్పుడు అన్నయ్య తో మాట్లాడి కుటుంబ పరిస్థితులు చక్కబరచి అక్కయ్య వాళ్ళు వచ్చారు.మామయ్యకి యూఎస్ లో ఒక ఏడాది పరిశోధన కు వెళ్ళవలసి రావటం  వలన అందరం విజయనగరం బయలుదేరాం.అప్పుడు మొట్టమొదటిసారిగా లంగా వోణి వేసుకొని బయలుదేరాను.కొత్త లంగా వోణీలో నన్ను చూసుకొని  నాలో నేను ఎంత మురిసి పోయానో.అక్కడితో అక్కయ్యతో కలిసి నా ఏడాది జీవనప్రయాణమైతే  ముగిసింది.కాని నేను ఈనాడు రచయిత్రిగా, కవయిత్రి గా ఎదగటానికి గల కారణం అక్క దగ్గర ఉన్న ఏడాది కాలమే అని నా అభిప్రాయం.

          అందుకే సాహిత్యం_బాల్యం-ప్రేరణ అంటూ ఇంటర్వ్యూ లలో ఎవరు ప్రశ్నించినా ఆ ఏడాది జీవితాన్ని తడుముకోకుండా ఉండలేను.నా రచనల్లో అక్కయ్యను చూసుకుంటూనే ఉంటాను. సాహిత్య పరంగా  నేను రాసిన రచనలకి అక్కయ్య స్పందించి ఉత్తరం రాసేది.

          ఎలక్షన్స్ బేనర్ల పై రాసిన ' వానా వానా కన్నీరు' కథ చదివి అక్కయ్య పెద్ద ఉత్తరం రాసింది."కుటుంబ పరిథి లోనే రాయకుండా సమాజం లోని  ఇతర సమస్యలతో రాయటం బాగుంది.ఆలోచనా పరిధి విస్తృతంచేసుకుంటున్నావు.ఇలానే రాస్తుండు"అన్న తర్వాత నా రచనా పరిథి పెంచుకున్నాను.

       1996 లో కేవలం స్త్రీ చైతన్యంతో రాసిన కవితా సంపుటి" ఆవిష్కారం" అక్కయ్యకి అంకితం ఇచ్చాను.

  కేంద్ర సాహిత్య అకాడమీ వారు డా.శ్రీదేవి గురించి మోనోగ్రాఫ్ రాయమన్నప్పుడు పాత తెలుగు స్వతంత్రలు వెతుకు తుంటే  అక్కరాసిన సంపుటీకరింపబడని  కథలు  కొన్ని దొరుకుతే వాటిని నేను అక్కయ్యకి ప్రేమ పూర్వక నివాళి గా పుస్తకరూపంలో తెచ్చాను.

  అందుకే  నేను అక్కయ్య కి సాహితీ వారసురాలినని ఎప్పుడూ చెప్తునే ఉంటాను. మొదటినుంచీ నన్ను సాహిత్యం వైపు మళ్ళించిన మా పెద్దక్కయ్య పి.సరళాదేవి నాకు సాహిత్యస్పూర్తిని ఇచ్చిన వ్యక్తిగా భావిస్తాను.