24, జనవరి 2014, శుక్రవారం

      
    నీలాటి ఒకరు

  నన్ను "ఆడ"దాన్నని అనకు
  నేను ఎక్కడి దాన్ని కావాలను కోవడం లేదు
  అంతటా నిండి వుండే దాన్ని కావాలి
  నన్ను "లలనా" అని పిలవకు
  ఎండ కన్నెరగ కుండా
  ఇంట్లో బంధీనై సుకుమారిని కాదలచుకోలేదు
  నన్ను "వనితా" అని వలపులు విసరకు
  అంగాంగ వర్ణనలు చేయించుకుని
  కవితాసుందరినికావాలని లేదు
  నన్ను "స్త్రీ " అని అక్షరీకరించకు
  అన్ని మెలికలు తిరిగి
  సిగ్గుల మొగ్గను కాబోవటం లేదు
  నన్ను "నారీ" అని మురిపించకు
  ఆదర్శాలకిరీటం ధరించి
  సిరోభారం తో నీ ముందు తల వంచుకొని నిలుచోదలచుకొలేదు
  నన్ను నన్ను గానే చూడు
  సంపూర్ణమైన  వ్యక్తిగా మాత్రమే గుర్తించు
 
  (1988)