23, జనవరి 2024, మంగళవారం

కె.ప్రభాకర్ హృదయభాష

~~ కవి ప్రభాకర్ హృదయభాష~~ ప్రతీకవి సమకాలీన ప్రభావాలకు లోబడకుండా ఉండలేడు.ముఖ్యమైన సామాజిక పరిణామాలకు ప్రతిస్పందించకుండా ఉండలేకపోవటం స్పందించే హృదయం లక్షణం. సమాజం దర్శనంలో ఎన్నుకున్న ఒక వస్తువును కవిత్వీకరించే క్రమంలో శిల్పం,కవిత్వరూపం అమరుతాయి.అది కవి ప్రతిభ పై ఆధారపడ్తాయి కవిత్వమంటే ప్రేమా,కవులంటే ఆరాధనా ఉన్న కె.ప్రభాకర్ గారు గత అయిదు దశాబ్దాలుగా సాహిత్య రంగంలోనే ఉన్నారు.కానీ సమాజం పట్ల స్పష్టమైన దృక్పథం, సాహిత్య సృజన పట్ల అభినివేశం ఉన్నా తనకి ఉన్న సాహిత్యాభిరుచితోనూ, సాహిత్య సంస్థల జోలికి పోకుండానే స్వయంగా తరుచూ కవిసమ్మేళనాలు,సదస్సులు ఏర్పాటు చేయటంపై దృష్టి పెట్టటంతోను, ఇతరేతర ఆసక్తులతోనూ కవిత్వం తక్కువగానే రాసారు. చాలా కాలం తర్వాత కె.ప్రభాకర్ గారు వెలువరించిన కవితా సంపుటి ఆదిత్యహృదయం.సంస్కృతభాష పట్ల గల ప్రేమ, తన పేరుకు పర్యాయ పదమైన ఆదిత్యుని కలిపి తన మనోరథాల, అభిప్రాయాల కవిత్వరూపంగా ఈ సంపుటిని చెప్పవచ్చు. పీడిత జనం ఎంత ఆక్రోశించినా ప్రయోజనం లేదని వాళ్ళకన్నీరు బూడిదలో పోసిన పన్నీరేనని కవి అంటారు.కవితావామనుడిని,బుల్లిబుడుగుని అని అంటూనే- " పరుగెడుతున్న కావ్యం కన్య కాళ్ళను కన్నీళ్ళతో కడగను" అనేంతవరకూ చెప్పే కవి. " రాళ్ళలో బియ్యం కల్తీ అడవి పప్పులో కందిపప్పు కల్తీ" మొదలుకొని జగమంతా కల్తీయేనని నిర్థారణచేసి ప్రజల మనసులో మార్పు వచ్చేదాకా "రూపాయి కాముకుని చేతిలో సిపాయి" గా ప్రపంచంలో జరుగుతోన్న మోసాలు, ఘోరాలు గురించి దిగులు పడుతుంటారు. నాడూ నేడూ మారిపోతున్న గ్రామాలు గురించి చెప్పే క్రమంలో-- " దేశానికి ఊరు చక్కని పరికిణీ" అని కొత్తగా రూపించారు. అదే విధంగా మహానగరాన్ని దృశ్యాలు గా చూపిస్తూ- " నవనాగరిక ముసుగులో జాతి సంస్కృతి మూసీనది కాలవలో కాశ్మీరు శాలువను ముంచి ఆరేసినట్లుంది" - అని వ్యంగ్యంగా అక్షరీకరిస్తాడు కవి. నగరం,గ్రామం, జాతి సంస్కృతి ధ్వంసం అయిపోతున్నాయని అభ్యుదయ కవిగా ఆక్రోశిస్తారు. మరోచోట ప్రేమపిపాసిగా నీలిమేఘాల్ని పలకరిస్తారు.ప్రేమసందేశాలు పంపుతూ జీవనరాగాలు శృతి చేస్తారు. ఇంకోచోట పారే నెత్తురులో నల్లజెండా ఎగరేసి పోరాటం చేయక తప్పదంటారు. అంతలోనే-- " జీవితం కావ్యమైతే దాని పరిమళం వృద్ధాప్యం" అంటూ చక్కగా వృద్ధాప్యాన్ని నిర్వచించారు.వృద్ధాప్యాన్ని కవులు పలువిధాల అక్షరాలుగా చిత్రించారు.ప్రభాకర్ ఒక ఆశావహ దృక్పథంతో చెప్పటం హర్షణీయం. " హృదయాంతరాళాలు కదలాలి జీవనరహస్య పేటిక తెరవాలి కవితానాద మృదంగ సమ్మేళనం అయితీరాలి " అంటూ తనదైన హృదయభాషని నినదించిన కె.ప్రభాకర్ గారికి అభినందనలు.

సంగీత సాహిత్య సవ్యసాచి -జానకీబాల

~సంగీత సాహిత్య సవ్యసాచి- జానకీబాల ~~ ఎనభయ్యో దశకంలో ఆధునిక సమాజంలోనూ, సాహిత్యరంగంలోనూ అనేకానేక మార్పులు వచ్చాయి.అనేక ఉద్యమాలకారణంగా సాహిత్యరంగం ప్రతిస్పందించటం వలన కవిత్వంలోనూ,వచనసాహిత్యంలోనూ ఆయా ఉద్యమ ప్రభావాలు తొంగిచూసాయి. ఆర్థికంగా కాలానుగుణమార్పులకు, సాహిత్యఉద్యమాల వలన సాహిత్య పరమైన ప్రభావాలకు లోనై రచనలు చేసిన వారిలో ఇంద్రగంటి జానకీబాల కూడా ఉన్నారని ఖచ్చితంగా చెప్పొచ్చు. 1970లో కథారచనతో సాహిత్య రంగంలోకి వచ్చిన జానకీ బాల పన్నెండు నవలలు,ఏడు కథలసంపుటాలు,ఒక కవితాసంపుటి సృజనాత్మక రచనలుగా జానకీబాల సాహిత్య ఖాతాలో చేర్చుకున్నారు.అవి కాకుండా సినీ నేపధ్యగాయనీల అంతరంగపరిశోధనగా రాసిన కొమ్మా కొమ్మా కోకిలమ్మ అనేపుస్తకమేకాక," యశస్విని" శీర్షిక తో భానుమతి," నాయిక"శీర్షిక తో జయలలిత, శ్రీరంగం గోపాలరత్నం, దుర్గాబాయి దేశముఖ్ ల జీవితగాథాచిత్రాలను రచించారు.సంగీతరాగాల ఆధారంగా వచ్చిన సినిమాపాటల విశ్లేషణలను "రాగరంజితం" పుస్తకంగా వెలువరించారు.గాథాతారావళిగా ఒకప్పటి పాతతరం కథకుల అపురూప కథలను తెలుగు విద్యార్థి మాసపత్రిక లో ధారావాహికగా పరిచయం చేసారు.అప్పుడప్పుడు వివిధపత్రికల్లో సమకాలీన సమస్యలపై రాసిన వ్యాసాల్ని "అన్యస్వరం" పేరిట పుస్తకరూపంలో తెచ్చారు. ఈ విధంగా ఇంద్రగంటి జానకీబాల గత యాభై ఏళ్లకు పైగా నిరంతరాయంగా సాహితీసృజన చేస్తూనే ఉన్నారు. జానకీబాల కథలలో 1970 -90 వరకూ వచ్చి నవి ఎక్కువగా ఆర్థికంగా,సామాజికంగాబలహీన వర్గాల జీవితాలను,ఉద్యోగం, కార్యాలయావరణంలో ఎదుర్కొన్న ఆటుపోట్లను బలి,దేవమ్మ,వెలుగును మింగిన చీకటి వంటి కథల్లో చిత్రించారు. " బలమైన లక్ష్యం , మంచి వస్తువు ఎన్నుకుంటే టెక్నిక్కు,శిల్పం ఆ ఊపున అవే వచ్చి కూర్చుంటాయి . ఇందులో మంచి లక్షణాలున్న కథలు చాలా ఉన్నాయి కథల్లో రచయిత్రి అర్థవంతమైన ఆలోచనలు తెలుస్తున్నాయి " అని 1980లో వచ్చిన తొలి సంపుటికి ముందుమాట రాసిన ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారు అభినందించారు. చదివించాల న్నా,చదువుకోవాలనే ఆశ ఉన్నా అవకాశం దక్కనివ్వని పందికొక్కుల ఉదంతాల్ని, అందని ద్రాక్షలుగా మారిన ప్రభుత్వ పథకాల్ని కథల్లో ప్రస్తావించారు. అగ్గిపెట్టెల్లాంటి ఇళ్ళతో కూడిన కాంపౌండుల్లో భిన్నభిన్న మనస్తత్వాలు,విభిన్న జీవనవిధానాలు కలిగిన బతుకులను కొన్ని కథల్లో అక్షరీకరించారు.అటువంటికథల్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గ మంచికథ 'పక్షి ఎగిరిపోయింది'.ఇందులో ఒక్కొక్క కుటుంబం గురించి రచయిత్రి చెప్పిన తీరు, ఆ యిళ్ళ సమాహారం ఒక సమాజవ్యవస్థని రూపుకడుతుంది. ఎనభై దశకానికి ముందు రచయిత్రుల్లో ఉద్యోగినులు తక్కువ.అప్పట్లో వచ్చిన కథలు కూడా ఎక్కువగా సహోద్యోగులతో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల అంశాలతోనే వచ్చాయి.జానకీబాల కొంతకాలం రోడ్డు రవాణా సంస్థలో పనిచేయటం వలన అనేక కథల్లో బస్సు ప్రయాణం నేపధ్యంలోనే కాక సంస్థలోని అనేక లొసుగులు కథలరూపంలోకి తీసుకు వచ్చారు.అవి చాలా వరకు సాధారణ ప్రజలకు తెలియనివి.తెలుసుకోవలసినవి. 1990 ల తర్వాత ఒక స్త్రీవాద సంస్థలో కొంతకాలం ఉద్యోగం చేయడంతో జానకీబాలపై ప్రభావం కలిగించడం వలన ఆమె దృక్పథంలో వచ్చిన మార్పు ఆమె రచనలపై కూడా పడింది. అందువలన 90ల తర్వాత రాసిన రచనల్లో కుటుంబపరంగా, సమాజపరంగా ఎదుర్కొన్న వివక్షలకు స్త్రీ పడే సంఘర్షణ ఎత్తి చూపే విధానం కనిపిస్తుంది. మధ్యతరగతి కుటుంబాల్లోని కుటుంబ అనుబంధాల్ని,అనురాగాల్ని ,దిగువ తరగతి చిరుద్యోగుల జీవితాల్ని విచ్ఛిన్నం చేస్తున్న సామాజిక అంశాల్ని స్పృశిస్తూ ,మారుతున్న తరాలలోని ఆలోచనల్ని క్రమపరిణామాల్నీ చర్చించేలా కథల్నైనా నవలల్నైనా జానకీబాల రాయటం గమనార్హం. అయితే ఈ రచయిత్రి రచనల్లో పాఠకుల్లో ఆవేశం కానీ,ద్వేషాలు రగుల్కొల్పే విధానం కానీ లేకుండా హాస్యాస్పదంగానూ,ఒక్కచోట వ్యంగ్యంగానూ చెప్పినా సరే సున్నితమైన అనుభూతిని మాత్రమే అందించేలా ఉంటాయి ఈ రచయిత్రి రచనలు. "కనిపించే గతం " పేరుతో రాసిన నవల కొంతవరకూ ఆత్మకథాత్మకమే అయినా చాలా సంయమనంతో చదువుతున్నంతసేపూ పాఠకులను అందులో మమేకం అయ్యేలా చేస్తుంది. 'స్త్రీ పురుషులు ఒకరిపట్ల ఒకరికి కలిగిన అనురాగాన్ని,ప్రేమని పదిలంగా దాచుకుని భౌతికంగా దూరమైనా జీవితాంతం ఒకరినొకరు ఆరాధిస్తూనే గడిపే ప్రేమే నీలిరాగం' అంటారని ఒకసారి ఉషశ్రీ గారు చెప్పగా విని ఆ నీలిరాగం అనే మాటకు ప్రభావితురాలై "నీలిరాగం " నవల రాసేనంటారు జానకీబాల. జానకీబాల రచనావిధానంలో ఒకప్రత్యేకత-- ఏదైనా ఒక విషయాన్ని సూటిగా చెప్పుకుండా సింబాలిక్ గా చెప్పేవిధానం ఒకటైతే రచనల్లో ఉపయోగించే మరొక విధానం సామాన్య విషయంగానే ముగింపులో గాని, మధ్యలో గానీ, సంభాషణా వాక్యాలుగా లేదా స్వగతంగా పాత్రల ద్వారానే అంతరార్థం చెప్పిస్తారు. రచయిత్రి వివిధ అంశాల్ని ప్రస్తావించినా,తరిచి చూస్తే దాదాపు ఆమె రచనలన్నింటా స్త్రీపురుషుల మధ్య ఉండవలసిన సున్నితమైన అనుబంధం, అనురాగం అనేవి వర్తమాన సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక పరిస్థితుల్లో ఎన్నిరకాలుగా విడిపోతున్నాయో,ఎలా చీలిపోయి ఉన్నాయో,కనపడనితెరలు వారిమధ్య ఎలాంటి మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయి అనేది అంతర్లీనంగా,అంతరప్రవాహంగా ఉంటాయి. "స్త్రీకి అవసరమైన స్వతంత్ర ప్రవృత్తిని గాఢంగా వాంఛిస్తూనే ఆమెని బంధించి వుంచే స్వభావాన్ని విశ్లేషించగల రచయిత్రి జానకీబాల " అంటూ ప్రశంసించే శ్రీకాంతశర్మ గారి మాటలు ఆమెరచనలు చదివిన వారికి అక్షరాలా నిజమనిపిస్తాయి జానకీబాల రచనల్లో కూచోబెట్టి వినిపించే నీతిబోధలుండవు.సమాజాన్ని ఆదర్శాలతో బాగుచేసేస్తానన్న ధోరణి ఉండదు.మానవ మనస్తత్వాల్ని,ప్రజాజీవన విధానాల్ని,సంఘర్షణల్నీ ,సమస్యల్ని ఎత్తి చూపిస్తారు.ఆ క్రమంలో కొన్నిచోట్ల హాస్య,వ్యంగ్య ధోరణిలో చురకల్లా తగుల్తాయి.మరి కొన్నింటిలో గుండెని ఆర్తిగా తడుముతాయి. ఇంద్రగంటి జానకీబాల గారు కవయిత్రి అని చాలామందికి తెలియదు .1992 లోనే "మనశ్శల్యాలు" అనేపేరిట కవితాసంపుటి వేశారు. మనశ్శల్యాలు పేరున రాసిన కవిత చాలు ఆమె కవితాసబలత తెలియడానికి - " మెత్తని కుషన్ లాంటి మనసులోకి దిగిపోతాయి ఎన్నో సూదుల్లాంటి బాధలు జ్ణాపకాలు గుచ్చిన ప్రతి గుండుసూదీ తల మాత్రం పైకి పెట్టి అదును కోసం చూస్తుంది కొనగోరు తగిలితే చాలు కోటి గతాల వ్యథల ప్రతినిధిగా చప్పుడు లేకుండా పైకి వస్తుంది " అంటూ జానకీ బాల రాసిన ఈ కవిత స్త్రీవాద చైతన్యానికి ఒకమచ్చుతునక . 'ఎప్పుడూ అనుకోలేదు' అనే కవితలో 'నిన్ను తలచి విలపించటం మాత్రమే మిగిలినప్పుడు- "జ్ఞాపకానివై మిగిలిన / ఓ నా బాల్యమా / వెళతానని ఎందుకు /ఒక్కమాట చెప్పావుకాదు " అంటూ కవితలో ఆసాంతం కోల్పోయిన బాల్యక్రీడల్నీ తలపోసు కుంటారు . మరో కవిత "నిద్ర"లో_ "మూసిన కనురెప్పల వెనుక కాటుక కన్నీళ్ళు ఘనీభవించిన చీకటిలో- నిద్రాసముద్రాన్ని ఈదుతున్నానం"టారు ఈ కవయిత్రి. ఇటువంటి మంచి కవితలను రాసిన జానకీ బాల ఎందుచేతనో తర్వాత కవిత్వంజోలికి పోకుండా కథలు,నవలలూ సంగీతప్రాధాన్య రచనలు వైపు మళ్ళిపోయారు. ఇంద్రగంటి జానకీబాల తన నిర్విరామ సాహిత్య ప్రస్థానం లో అనేక ప్రక్రియల్లో ఒకఛాయగా కాక తనకంటూ ఒక ముద్రను సాధించటానికి కృషి చేసారు.సాధించారు కూడా. రచయిత్రులు అందరూ తమకు రావాలని అభిలషించే శ్రీమతి సుశీలానారాయణరెడ్డి పురస్కారం ఈ నెల 22 వతేదీన అందుకోబోతున్న ఇంద్రగంటి జానకీబాలగారికి ఆత్మీయంగా అభినందనలు.