23, జనవరి 2024, మంగళవారం

కె.ప్రభాకర్ హృదయభాష

~~ కవి ప్రభాకర్ హృదయభాష~~ ప్రతీకవి సమకాలీన ప్రభావాలకు లోబడకుండా ఉండలేడు.ముఖ్యమైన సామాజిక పరిణామాలకు ప్రతిస్పందించకుండా ఉండలేకపోవటం స్పందించే హృదయం లక్షణం. సమాజం దర్శనంలో ఎన్నుకున్న ఒక వస్తువును కవిత్వీకరించే క్రమంలో శిల్పం,కవిత్వరూపం అమరుతాయి.అది కవి ప్రతిభ పై ఆధారపడ్తాయి కవిత్వమంటే ప్రేమా,కవులంటే ఆరాధనా ఉన్న కె.ప్రభాకర్ గారు గత అయిదు దశాబ్దాలుగా సాహిత్య రంగంలోనే ఉన్నారు.కానీ సమాజం పట్ల స్పష్టమైన దృక్పథం, సాహిత్య సృజన పట్ల అభినివేశం ఉన్నా తనకి ఉన్న సాహిత్యాభిరుచితోనూ, సాహిత్య సంస్థల జోలికి పోకుండానే స్వయంగా తరుచూ కవిసమ్మేళనాలు,సదస్సులు ఏర్పాటు చేయటంపై దృష్టి పెట్టటంతోను, ఇతరేతర ఆసక్తులతోనూ కవిత్వం తక్కువగానే రాసారు. చాలా కాలం తర్వాత కె.ప్రభాకర్ గారు వెలువరించిన కవితా సంపుటి ఆదిత్యహృదయం.సంస్కృతభాష పట్ల గల ప్రేమ, తన పేరుకు పర్యాయ పదమైన ఆదిత్యుని కలిపి తన మనోరథాల, అభిప్రాయాల కవిత్వరూపంగా ఈ సంపుటిని చెప్పవచ్చు. పీడిత జనం ఎంత ఆక్రోశించినా ప్రయోజనం లేదని వాళ్ళకన్నీరు బూడిదలో పోసిన పన్నీరేనని కవి అంటారు.కవితావామనుడిని,బుల్లిబుడుగుని అని అంటూనే- " పరుగెడుతున్న కావ్యం కన్య కాళ్ళను కన్నీళ్ళతో కడగను" అనేంతవరకూ చెప్పే కవి. " రాళ్ళలో బియ్యం కల్తీ అడవి పప్పులో కందిపప్పు కల్తీ" మొదలుకొని జగమంతా కల్తీయేనని నిర్థారణచేసి ప్రజల మనసులో మార్పు వచ్చేదాకా "రూపాయి కాముకుని చేతిలో సిపాయి" గా ప్రపంచంలో జరుగుతోన్న మోసాలు, ఘోరాలు గురించి దిగులు పడుతుంటారు. నాడూ నేడూ మారిపోతున్న గ్రామాలు గురించి చెప్పే క్రమంలో-- " దేశానికి ఊరు చక్కని పరికిణీ" అని కొత్తగా రూపించారు. అదే విధంగా మహానగరాన్ని దృశ్యాలు గా చూపిస్తూ- " నవనాగరిక ముసుగులో జాతి సంస్కృతి మూసీనది కాలవలో కాశ్మీరు శాలువను ముంచి ఆరేసినట్లుంది" - అని వ్యంగ్యంగా అక్షరీకరిస్తాడు కవి. నగరం,గ్రామం, జాతి సంస్కృతి ధ్వంసం అయిపోతున్నాయని అభ్యుదయ కవిగా ఆక్రోశిస్తారు. మరోచోట ప్రేమపిపాసిగా నీలిమేఘాల్ని పలకరిస్తారు.ప్రేమసందేశాలు పంపుతూ జీవనరాగాలు శృతి చేస్తారు. ఇంకోచోట పారే నెత్తురులో నల్లజెండా ఎగరేసి పోరాటం చేయక తప్పదంటారు. అంతలోనే-- " జీవితం కావ్యమైతే దాని పరిమళం వృద్ధాప్యం" అంటూ చక్కగా వృద్ధాప్యాన్ని నిర్వచించారు.వృద్ధాప్యాన్ని కవులు పలువిధాల అక్షరాలుగా చిత్రించారు.ప్రభాకర్ ఒక ఆశావహ దృక్పథంతో చెప్పటం హర్షణీయం. " హృదయాంతరాళాలు కదలాలి జీవనరహస్య పేటిక తెరవాలి కవితానాద మృదంగ సమ్మేళనం అయితీరాలి " అంటూ తనదైన హృదయభాషని నినదించిన కె.ప్రభాకర్ గారికి అభినందనలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి