19, ఫిబ్రవరి 2016, శుక్రవారం

yuddham oka gunde kota---8th chaptar


 యుద్ధం ఒక గుండె కోత---8వ  చాప్టర్


మనిషికి మనిషికీ మధ్య
మతం కత్తుల వంతెన నిర్మిస్తోంది
ఆత్మీయం గా హృదయాల్ని పెనవేసుకునే
స్నేహ ఆలింగనాల్ని మర్చిపోతున్నాం
మనసుని మైమరపింపజేయాల్సిన
వెన్నెలరాత్రులలో సైతం
యుద్ధసెగ స్నేహపరిమళాల్ని కాల్చేస్తోంది
ఇక పై జీవనయానమంతా
ఎర్రని క్రోధాగ్నులతో కాలే
ఎడారిభూముల మీదేనేమో
మనసుతెరచి అభిప్రాయప్రకటన చేయటానికి
అనుమానం బురఖాలో
ముఖాన్ని దాచుకోవాల్సిన పరిస్థితి!
జనాలమధ్య అంతరం
అగాథం గా మారిపోతున్న దుస్థితి!
ప్రశాంత సాగరాన్ని కల్లోల పరుస్తోన్న
మరిగె బడబానలం ప్రతి గుండె లో-
కడుపు లో ఆందోళన వాయుగుండాలూ-
కనుకొలకుల్లోంచి భావప్రకంపనలు
ఎక్కడ కన్నీరై జారిపోతాయోనని
అందరం ఒకే మాదిరి నల్లద్దాలు ధరించేస్తాం
నిజానికి
అందరం రాజకీయ పరిస్థితుల్ని
కాలక్షేపం బఠణీల్ని చేసి
నోట్లోంచి చెవుల్లోకి ఎగరేస్తూనే వుంటాం
చెప్తున్న మాటలకి
గుండెలో అభిప్రాయ ప్రతిబింబం వుండదు
కెలిడో స్కోపులో లాగ మాటలు గింగిరాలు తిరుగుతూ
చిత్ర విచిత్రరూపాల్ని సంతరించుకుంటూనే వుంటాయ్
మాటల్లో భయం ప్రకంపిస్తూ వుంటుంది
మనం మనలాగ బ్రతకడం మర్చిపోతుంటాం
మతం వైపు ముఖం తిప్పాలో
ఆధిపత్యానికి చెయ్యి అందించాలో
అర్ధం కాని అయోమయం లో మునిగిపోతూ వుంటాం
గుండె మానవత్వాన్ని కొట్టుకుంటూ
మనసులోకి లాక్కొస్తూ వుంటుంది
మాటమాత్రం  పంటి కింద నలిగి
నాలుక అడుగునే దాగి పోతుంది 
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి