27, మే 2013, సోమవారం

oka vudayam kosam

ఒక వుదయం కోసం



కొత్తగా రెక్కలు విప్పుకొన్న పక్షులై ఆలోచనలన్నీ

జీవన వౄక్షమంతా ఎగురుతూదూకుతూ

కొమ్మకొమ్మనీ తడుముతూ

పత్రావిష్కారాల్ని చేస్తున్నాయ్

అప్పుడప్పుడే

విచ్చుకొంటున్న చిగురాశల్ని

రెక్కల్తో విసుర్తూ రెపరెపలాడిస్తున్నాయ్

కొత్తగా తొడిగిన మొగ్గల్ని ముద్దాడుతూ

ఫలించిన స్వప్నఫలాల్ని అబ్బురంగా చూస్తూ

వసివాడి రాల్తోన్న పండుటాకులకి

చెమ్మగిల్లిన హృదయం తో వీడ్కోలు పలుకుతూ

రాత్రంతా కలయతిరుగుతూనే వున్నాయ్



పొద్దంతా అలసి పోయిన శరీరం

విశ్రాంతిని కలవరిస్తూ

అస్తిరంగా పక్క మీద మెలికల పామై

లుంగలు చుట్టుకొంటోంది

ఎంతకీ రాని నిద్ర కోసం

ఎదురుచూసి ఎదురుచూసి

విసిగి వేసారి డస్సిపోయిన

విరహోత్కంటితలా కంటిపాప

రెప్పలతలుపుల్ని బార్లాతెరచి

చూపుకి చేరబడి గుమ్మం దగ్గరే కూలబడింది



రేపటి తొలి వేకువకి

నవచైతన్యం తో ఆహ్వానగీతికల్ని

ఆలపించిస్వాగతించడానికి

తగినశక్తిని సమకూర్చమనినిద్రని వేడుకొంటూ

మనసు మౌనముద్రని ధరించి

వుండుండి గుండె షహనాయ్ ని వూదుతూ

సావేరీరాగాలాపన సాగిస్తోంది

నన్నూ నా ఆలోచనల్నీ జోకొడ్తూ

నిద్ర అమ్మై తన ఒడిలోకి

ఎప్పుడు పొదువుకొంటుందో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి