16, ఆగస్టు 2024, శుక్రవారం

నాకు నచ్చిన నా రచన - యుద్ధం ఒక గుండె కోత

నాకు నచ్చిన నా రచన – యుద్ధం ఒక గుండెకోత - నేపథ్యం ఆధునిక కథానికకు ఆద్యుడైన గురజాడ అడుగుజాడలు విజయనగరంలో జన్మించడం వలన కావచ్చు, నా తోబుట్టువులు పి. సరళాదేవి, కొడవంటి కాశీపతిరావులు కథకులు కావటం వలన కావచ్చు, అప్పట్లో వచన సాహిత్య పఠనం వలన కావచ్చు. 1970లో కథారచనతోనే నా సాహిత్య ప్రవేశం జరిగింది. శీలావీర్రాజుగారితో వివాహానంతరం భాగ్యనగరంలో అడుగుపెట్టాక ముఖచిత్రాల కోసం ఇంటికి కవులు ఎక్కువగా రావడం, ఇంట్లో కవిత్వ పుస్తకాలే ఎక్కువగా ఉండడంతో కవిత్వ పఠనం ఎక్కువైంది. రానురాను ఉమ్మడి కుటుంబ బాధ్యతలు, పిల్లలూ, ఆర్థిక సంక్షోభం వీటన్నిటితో సమయం, సావకాశం లేని పరిస్థితుల్లో మనసులోని సంఘర్షణ, ఆలోచనలు పేపరుమీద పెట్టేందుకు కవిత్వ రచనవైపు మొగ్గుచూపాను. ఆ విధంగా కవితారంగంలోకి వచ్చినా కథారచనని పూర్తిగా వదిలేయలేదు. 1975లో మొదటి కవిత ప్రచురితమైన నాటి నుండి అవిశ్రాంతంగా రాస్తూనే ఉన్నాను. ఈ 50 ఏళ్ళ కాలంలో ఏడు కవితాఖండికల సంపుటులు, రెండు దీర్ఘ కావ్యగ్రంథాలు, మూడు కథానికా సంపుటాలు, వ్యాససంపుటి, రెండు మోనోగ్రాఫ్ లు, ఒక నవల వెలుగుచూసాయి. నా రచనలన్నీ నాకిష్టమైనవే అయినా పలువురు ప్రముఖుల ప్రశంసలు పొందిన 'యుద్ధం ఒక గుండె కోత' పట్ల నాకు మరింత మక్కువ. 2001 సెప్టెంబరు 11న అమెరికాలోని జంట టవర్లను ఉగ్రవాదులు కూల్చిన దుర్ఘటనతో ఈ దీర్ఘ కావ్యం మొదలౌతుంది. తదనంతరం అమెరికా, ఆఫ్ఘన్ యుద్ధ నేపథ్యంలో జరిగిన అనేకానేక సంఘటనలు జన జీవితంలో కలిగించిన ప్రకంపనలు, కవిత అంతటాపరచుకుంటాయి. రెండు నెలల వ్యవధిలోనే రాసి డిసెంబరు నాటికి గ్రంథ రూపంలోకి తీసుకువచ్చాను. ఇందులో యుద్ధమూలాలు అన్వేషించటమేకాక, మత విద్వేషాలు యుద్ధానికెలా దోహదమౌతాయో, ఎన్ని కుటుంబాలు, సంక్షోభాలలో ఇరుక్కుంటాయో, యుద్ధ పరిణామాల నేపథ్యంలో ఎందరు తల్లులు గర్భశోకంలో గుండెకోతను అనుభవిస్తారో, వీటన్నిటికీ నా దృష్టి కోణంలో కార్యకారణాలను అక్షరీకరించాను. యుద్ధం ఒక గుండెకోతను ముప్ఫై అధ్యాయాలుగా రాసాను. ప్రతీ అధ్యాయంలో యుద్ధం ఏ విధంగా జనజీవనాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తుందో తెలియజేశాను. యుద్ధోన్మాదులైన నాయకుల మనస్తత్వానికి కారణాలూ, అమాయక ప్రజల ధన మాన ప్రాణాల్ని కొల్లగొట్టే మత విద్వేష రాక్షస ప్రవృత్తికి మూలాలూ, బాల్యంలోనే హింసా ప్రవృత్తికి బీజం వేస్తున్న పరిస్థితులూ అక్షరీకరించాను. “బాధ/సన్నటి సూదిములుకై / రక్తంలో ప్రవేశించింది/నరాల్ని కుట్టుకుంటూ/ శరీరమంతటా / ప్రవహించటం మొదలైంది" అంటూ ఈ కావ్యాన్ని ప్రారంభించాను. ఆకాశం నిండా లోహ విహంగాలు పెనుబాంబులుగా రూపాంతరం చెంది పెఠేల్ మంటే ఎక్కడో ఏ మూలో తల్లిపేగు ఎలా ఖణేల్ మంటుందో, యుద్ధం చేసే గాయాల చారికల్ని తల్లి గర్భంపై చూపాను. యుద్ధాలకు ప్రధాన కారణంగా మారుతోన్న మతాల్ని నిరసించాను. "నిజానికి మనం మతాల్ని కడుపులో మోయం కదా తల్లులారా మీరన్నా చెప్పండి / మీరెవరైనా మతాన్ని గర్భంలో దాచుకున్నారా” అని ప్రశ్నించి గర్భాన పుట్టిన వాళ్ళని అనామికలుగా పెంచుదాం. పుట్టాక వారి పేరు వారే సంపాదించుకుంటారని నివేదించాను. అసలైన యుద్ధం మొదలైంది గుండె కేన్వాసుపై కన్నీటితో లిఖిస్తున్న స్త్రీల ఆలోచనల్లోనే అని ప్రతిపాదించాను.“ఎక్కడ ఏ యుద్ధం జరిగినా / పరిజన సమేతంగా దిగుడు బావుల్లో దూకాల్సిందే / అంతఃపురాలు ఆహుతి కావల్సిందే కదా” అని అనాదిగా జరిగిన చారిత్రక యుద్ధ పరిణామాల్ని అక్షరబద్ధం చేశాను. “ఆయుధాలతో బిళ్ళంగోడి ఆడుతూ / అక్షరాలు దిద్దాల్సిన వయసులో / అమ్ముల పొదులౌతోన్న బాల్యం” గూర్చి కన్నీరు కార్చాను. పసితనంలోనే హింసాయుత క్రీడల్ని మనమే అలవాటు చేస్తున్నామా అని మథనపడ్డాను. “ప్రపంచాన్ని పాలిస్తున్నది ఇప్పుడు మతమే / ప్రజలిప్పుడు అనకొండ గర్భంలో ఉన్నారు" అని కళవళపడ్డాను. “ఎక్కడో మసీదులు కూలినా/ ఇంకెక్కడో శిలువ విరిగిపడినా/మరోచోట విగ్రహాలు శకలాలైపోయినా/ ఇన్నివేల మైళ్ళదూరాన/ శిరస్సులు తెగిపడడమేమిటో / భయం గుప్పిట్లో దేశాలు ఉండటమేమిటో అర్థంకాక అయోమయంలో మునిగిపోయాను. "తల్లులారా/ మనదుఃఖాన్ని, మన ఆగ్రహాన్ని, మన ఔదార్యాన్ని ముప్పేటలుగా అల్లి / త్రివేణీ సంగమ ప్రవాహం చేసి/ క్షుభిత హృదయాల్ని చల్లార్చుదాం రండి / ఓ మహా యుద్ధానలమా / చల్లని నవనీతం పూసి / సేదతీర్చటం తెలిసిన తల్లులం/ మాకు సోకుతున్న సెగని తట్టుకొనైనా / నిన్ను ఉపశమింపజేయటమే మాలక్షణం” అంటూ నా నిర్ణయాన్నీ ప్రకటించాను. మనం ప్రేమించిన మానవ విలువల అద్భుత కట్టడాన్ని / ఎనిమిదో వింతగా / ఏ మసీదు ముంగిట్లోనైనా కడదామా/ గుండె గాయాల్ని స్రవిస్తున్న రక్తాశ్రువులలో / ఏమందిర దైవాన్నైనా అభిషేకించుదామా / మన హృదయాల్ని పిండి కొవ్వొత్తిని చేసి/ ఏ చర్చి ముందైనా వెలిగించి వేలాడదీద్దామా / పంచభూతాల సాక్షిగా / యుద్ధమైకంతో ఊగుతోన్న దేశాల్నిండా / అమ్మతనాన్ని వర్షిద్దాం రండి” అని ఆక్రోసించాను. ముగింపులో “ఒక సంపూర్ణ మానవాంకురాన్ని పొదిగేందుకు / ఒక తల్లి గర్భం కావాలి / శాపగ్రస్తులై రాతిగా మారిన అహల్యలారా / మళ్ళీ ఈ భూగోళాన్ని / మానవీయ స్పర్శతో పునీతం చేసే / మనుషులతో నింపుదాం” అంటూ మాతృ హృదయాన్ని పరచి ఆహ్వానించాను. ఈ విధంగా 56 పేజీల దీర్ఘకావ్యంగా 'యుద్ధం ఒక గుండెకోత' ఆవిష్కరించాను. ఈ పుస్తకం అన్నివాదాల వారితో, అన్ని వర్గాల వారితో మమేకం అయ్యేలా చేసింది. ఎందుకంటే ప్రతీ యింటి నుండీ రెక్కలు కట్టుకొని ఎగిరిపోతోన్న వలస పక్షులున్నారు. ఆనాడు 2001లో అమెరికా ఆఫ్ఘన్ యుద్ధ పరిణామాల నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ వారి వారి పిల్లల కోసం గుండె చెరువులై సప్తసముద్రాలు దాటి భూమి రెండో వైపుకు వెళ్ళలేక గుబులుగా ఉన్నారు. కావ్యంలో నేను ప్రతిపాదించిన అనేకానేక విషయాలపట్ల అందరూ సానుకూలంగా స్పందించారు. నేను ఇది రాసినపుడు కూడా నా గుండె తడితో రాశాను. ఆ విధంగా కూడా ఈ రచన నాకు చాలా ఇష్టమైంది. ఆఫ్ఘన్ లో దాడికి గురైన మలాలా బాలికా విద్యపట్ల అంకితభావానికి నోబుల్ శాంతి బహుమతి అందుకోవడం అందరికీ తెలిసిందే. 2001 నాటికి బహుశా మలాలా రెండేళ్ళ పాప అయి ఉండొచ్చు. నేను 2001లో రాసిన ఈ గ్రంథంలో సూచనప్రాయంగా ఆఫ్ఘన్ లో చదువుకునే హక్కులేని బాలికల స్థితిని తెలిపే వాక్యాలు "అక్షరం ఆకారం తెలియని పసిది / సిగ్గుతో మెలికలు తిరుగుతూ వేళ్ళని గుండెల్లో దాచుకొని / జనానాలోకి పారిపోతోంది” అని దిగులుపడ్డాను. యుద్ధ నేపథ్యంలో తెలుగులో అప్పటికి ఎవరూ కావ్యాలు రాసినట్లు లేదు. ఆ విధంగా కూడా దీనికి ప్రత్యేకత లభించింది. 2002లోనే డా. పి. భార్గవీరావు, డా. పోపూరి జయలక్ష్మిగారు ఆంగ్లానువాదం చేశారు. అది కూడా అప్పుడే గ్రంథరూపం సంతరించుకుంది. "WAR, A Hearts' Ravage' నిర్మలానంద వాత్సాయన్ గారు 'యుద్ధ ఏక్ దిల్ కి వ్యధ' పేరున హిందీలోకి అనువదించినది కూడా గ్రంథరూపంలోకి వచ్చింది.'ఉళ్ళక్ కుమురల్' పేరిట రాజేశ్వరి కోథండం గారు చేసిన తమిళానువాదం పుస్తకంగా వచ్చింది. డా. ఆవంత్స సోమసుందర్ గారు ప్రతీ ఏటా దీర్ఘ కవితల ప్రక్రియలో ఇచ్చే దేవులపల్లి రాజహంస కృష్ణశాస్త్రి రాజహంస పురస్కారం 2011లో నేను అందుకున్నాను.యుద్ధం ఒక గుండె కోత మీద మథుర కామరాజు విశ్వవిద్యాలయం నుండి ఎమ్.ఫిల్ పరిశోధన జరిగింది. 2001లో ఈ దీర్ఘ కావ్యం రాసే నాటికి కవులలో కొందరు మాత్రమే దీర్ఘకావ్యాలు రాశారు. కవయిత్రులలో నుండి వచ్చిన మొదటి దీర్ఘకావ్యంగా విమర్శకులు గుర్తించారు. తర్వాత ఏడేళ్ళకు 'బతుకు పాటలో అస్తిత్వరాగం' పేరుతో మరో దీర్ఘకావ్యాన్ని కూడా రాశాను. ఆ గ్రంథంలో ఆడబిడ్డ పిండంగా ఏర్పడినది మొదలు వృద్ధాప్యం వరకూ ఏడు అధ్యాయాలుగా రాశాను. ప్రతీ అధ్యాయంలో తొలి సూర్యకిరణం వెలుగు చూసినది మొదలు సూర్యస్తమయం వరకు, విత్తనం మొలకగా విచ్చుకున్నది మొదలు మోడుగా మారేవరకూ స్త్రీ జీవితంతో పోలిక చెప్తూ రాశాను. కవిత్వ రంగంలో పేరున్న కవులందరూ దీర్ఘకావ్యాలు రాయటంలో ఆసక్తి చూపారు. కానీ కవయిత్రులు ఎందుకనో దీర్ఘ కావ్య ప్రక్రియ పట్ల సుముఖత చూపటం లేదు. నేను కాకుండా మరో అయిదారు మంది తప్ప రాసిన వారు లేరు. మత విద్వేషాలపై దేశవ్యాప్తంగా జరుగుతోన్న చర్చలు, దుర్ఘటనలు, హింసల నేపథ్యంలో కూడా నా 'యుద్ధం ఒక గుండె కోత' అనుకున్నంతగా ప్రాచుర్యం చేసుకోలేకపోయాను. బహుశా అందుకనే అంతర్జాతీయ సమస్యని చర్చించిన గ్రంథమే అయినా సాహిత్య రాజకీయాలతో మరుగునపడిపోతోంది. ఏది ఏమైనా దీర్ఘకావ్యంగా 'యుద్ధం ఒక గుండెకోత' మనసుతో రాసినదిగా నాకు చాలా ఇష్టమైన రచన. (పెనుగొండలో జరిగిన 'ప్రరవే' సదస్సులో చదివిన ప్రసంగ వ్యాసం) సృజన క్రాంతి లో ప్రచురితమైనది

8, ఆగస్టు 2024, గురువారం

బాలల నేస్తం సుజాతా దేవితో నేను

~ బాలల నేస్తం: డి.సుజాతాదేవితో నేను ~ మాట మలయానిలయం, పాట తేనెల సోన, గేయం వెన్నెల వాక. మరికథో సమాజం మారుమూలలోకి దృష్టి సారించి పరిశీలించి నివ్వెరపోయేలారాసిన అపురూపకథలు.నేలమీద సాము చేయని, నిబద్ధతతో కూడిన కథలు.బాలలనేస్తం, స్నేహపూరితరూపం ఆమే రచయిత్రి డి. సుజాతాదేవి. డి. సుజాతాదేవి పేరు వింటే సాహిత్యరంగంలో కొందరు 'ఆమె బాల సాహిత్య రచయిత్రి ' అంటారు. మరికొందరు 'గేయం రాస్తుంది' అంటారు. తమ రచనలు తప్ప ఇతరుల రచనలు చదివే అలవాటు లేని వాళ్ళు 'ఎవరామె? ఏమిటి రాసింది? ఎప్పుడూ పేరు విన్నట్లు లేదే?' అని బోలెడు ఆశ్చర్యంతో చూసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సుజాత ఎంత రాసింది? ఏమి రాసింది? అనేది అటువంటివారికోసం బయోడాటా చెప్పాల్సిన అవసరం కూడా వుంది అనుకుంటున్నాను. 1970లో సాహిత్యరంగంలోకి అడుగుపెట్టి మూడు కథాసంపుటాలు, మూడు పాటల పుస్తకాలు, ఒక గేయకావ్యం, మూడు నవలలు, ఒక వ్యాసాల పుస్తకం, ప్రముఖులతో చేసిన ముఖాముఖీల సంకలనంతో పాటు రెండు పాటలు కేసెట్లు వెలువరించారని చాలా మందికి తెలియదు. NCERT వాళ్ళ పురస్కారం, బాలల నవలకి జాతీయ పురస్కారం, బాలల లఘుచిత్రానికి ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారం అందుకున్నారన్న విషయం అనేక మందికి తెలియదు. బహుశా 2013 లో కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం అందుకున్నారనే విషయం కొందరికైనా తెలిసే వుంటుంది అనుకుంటాను మరి. ఇంత కృషిచేసి కూడా ప్రచార పటాటోపం చేసుకోవటం తెలియని సుజాతాదేవి కొంతకాలంగా అంతర్ముఖీనమై, అనేక కారణాలవలన, అనారోగ్యం వలన బాహ్యసమాజానికి దూరమై పోయింది. సుమారు యాభై ఏళ్ళక్రితం సుజాతతోటి నా పరిచయం రాను రాను స్నేహబంధంగా గాఢమైంది. అనేక సభలలో సమావేశాల్లో కలిసిన మేము తర్వాత తర్వాత మూడునాలుగేళ్ళ క్రితం వరకూ ఫోనులో సాహిత్యం గురించి చర్చలూ, ఒక్కొకప్పుడు ఫోనులోనే పాటలూ,కథలూ రాగరంజితంగా మాట్లాడుకునే వారం. పద్దెనిమిది ఏళ్ళక్రితం భార్గవీ రావు, ఇంద్రగంటి జానకీబాల, అత్తలూరి విజయలక్ష్మి, నేనూ పాపికొండలకు ప్రయాణం కట్టాము . రాజమండ్రిలో సుజాత కూతురు కమల ఇంట్లోనే దిగాము. పడుకోటానికి వేసుకున్నపక్కలమీద చేరి ఆరాత్రి రెండుగంటల వరకూ పోటా పోటీలుగా పాటలు పాడుకుంటూనే వున్నాము. ఏదో ఒక పాట గురించి చర్చ మొదలు పెట్టి పాట పాడుకుంటూ గడిపిన ఆరాత్రి ఈనాటికీ నామనసులో తాజాగానే రాగాలు తీస్తుంది. తర్వాత ఏడాది నేను పదవీ విరమణ అయ్యాక వీర్రాజుగారూ, నేనూ ఒక అవార్డు మొదలు పెట్టాలనుకుని ఆ ప్రయత్నం కాకుండా ఎవరైనా ఏదైనా కారణం చేత పుస్తకాలు వేసుకోని రచయితల ఒక పుస్తకం 500 కాపీలు వేసి వాళ్ళకే ఇవ్వాలని నిర్ణయించుకున్నాం .ఆ కోవలో మొట్ట మొదటగా అంతకు ముందు ఈనాడు పత్రికలో ధారావాహికంగా వచ్చిన డి. సుజాతాదేవి' ఆటలో అరటి పండు' పిల్లలకథల్ని పుస్తకరూపంలో వేసి సుజాతకు ఇచ్చాము . బందరులో గుత్తికొండసుబ్బారావుగారు వారి స్పందన సాహితి తరపున ఆ పుస్తకానికి ఆవిష్కరణ ఏర్పాటు చేసారు. ఆ సభలో నేను ఆవిష్కర్తగా, ఇంద్రగంటి జానకీబాల వక్తగా పాల్గొన టానికోసం ముగ్గురం కలసి ట్రైన్ లో వెళ్ళాం సుబ్బారావుగారి ఇంట్లోనే మాకు వసతి ఏర్పాటు చేసారు. ప్రయాణమంతానే కాక ఆరెండురోజులు మా ముగ్గురికీ సాహిత్యసంబరమే. ఆ ప్రయాణం మా ముగ్గురినీ మరింత దగ్గర చేసింది. సుజాత ఆంధ్రమహిళాసభ లిటరసీ హౌస్ లో ఉద్యోగంచేరినరోజుల్లోనూ, బ్రౌను అకాడమీలో పనిచేసినపుడూ కూడా తరుచూ మేము ముగ్గురం కలిసే వాళ్లం.ఒక్కొక్కప్పుడు అత్తలూరి విజయలక్ష్మీ,భార్గవీరావూ కలిసేవారు.కొత్తగా రాసుకున్న కవితో,కథో చదువుకునే వాళ్ళం,పాటలు పాడుకునేవాళ్ళం.అయితే అందరం కలిసి ఒకగొలుసు కథ రాయాలనుకున్న మా ప్రయత్నం మాత్రం కార్యరూపం దాల్చలేదు. అకస్మాత్తుగా ఒక రోజు రాంకోఠీ కిమ్స్ హాస్పిటల్ లో హార్ట్ ఆపరేషన్ జరిగిందని తెలిసి నేను హాస్పిటల్లో కలిసాను. వాళ్ళ అమ్మాయి "ఆమెను ఉద్యోగం రాజీనామా చేయించి నల్గొండ తన దగ్గరకు తీసుకు వెళ్ళిపోతున్నానని, హైదరాబాద్ లో మరి ఉంచదలచుకోలేద"ని చెప్పినప్పుడు నేను బాధ పడ్డాను . "ఆఫీసు దగ్గరగా ఇల్లు తీసుకొని ఇక్కడవుంటేనే సుజాతకు బాగుంటుందేమో. నువ్వు ఎలాగూ నల్గొండలోనే వుంటావుకనుక తరుచుగారావచ్చు "అని సలహా ఇవ్వ బోయాను. కానీ నల్గొండ తీసుకు వెళ్ళిపోయారు. అప్పుడప్పుడు సభల కోసమో, ఏదైనా అవసరార్థమో హైదరాబాదు వచ్చినపుడు కలుస్తూనే ఉన్నాను. సుజాత పెద్దమ్మాయి కొడుకు పెళ్లిలో జానకీ బాలతో సహా మేము ముగ్గురం కలిసి కబుర్లు చెప్పుకున్నాం. మాడభూషి రంగాచార్యులు స్మారక పురస్కారం సుజాతాదేవి రాసిన 'చేపలు' కథల సంపుటికి వచ్చినప్పుడూ, మాడభూషి రంగాచార్యుల పురస్కారాల పదేళ్ళ వేడుక సందర్భంగా కూడా మేము కలుసుకున్నాము. అప్పుడే అనుకుంటాను వీర్రాజుగారిని ఇంటర్వ్యూ చేస్తానని వచ్చి రోజంతా మా యింట్లో గడిపింది. ఇలా ఎంతమంది ప్రముఖులనో ఇంటర్వ్యూలను చేసి " ముఖాముఖే సరస్వతి " అనే పేరుతో సుజాత సంకలనంగా వేసింది. సుజాతాదేవి సాహిత్యం గురించి చెప్పుకుంటే బాలసాహిత్యంలో ఎంత కృషి చేసిందో, కథారచనలోనూ అంతటి కృషి చేసింది. ఈమె రాసిన చేపలు కథగానీ, సవరాలు కట్టి జీవించే వారి కధ ' ఎటు చూస్తే అటు', వెట్టిచాకిరీ చేసే బాబ్జీ కథ 'మలుపు', షాపుల ముందు వూడ్చే పనివారి జీవితం 'ఇంతేలే', ఆర్థికంగా వెసులు బాటులేని జీవితాల కథ 'వృత్తం' ఇలా ఏ కథ తీసుకున్నా సుజాత స్వీకరించిన పలు కథాంశాలు అప్పట్లో రచయిత్రులే కాక రచయితలు కూడా సాహిత్యంలోకి తీసుకు రాలేదు - ఏవో గాలి కబుర్లతో రచనలు చేయటం కాకుండా, సాహిత్యవిలువలు, సామాజిక బాధ్యత తెలిసినది కావటాక ఏ ప్రక్రియ చేపట్టినా నిబద్ధతతో ప్రతిభావంతంగా రాస్తుంది సుజాతాదేవి, మాకు ఎంతో సంతోషం, సంతృప్తి కలిగించినది ఒకటి వుంది.అదేమిటంటే మేము ప్రచురించి ఇచ్చిన 'ఆటలో అరటిపండు' పుస్తకానికే సుజాతాదేవికి కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం రావటం మాకే వచ్చినంతగా సంబరపడ్డాము నేను, వీర్రాజుగారు. రెండు మూడేళ్ళుగా సుజాత ఫోన్లు చేస్తున్నా ఆమె మాటలు కొంత అసంబద్ధంగా ఉండటం గమనించి ఆమె పిల్లలతో మాట్లాడాను. "అల్జీమర్ ' లక్షణాలు అప్పట్లోనే గమనించాను. కాని నేను సాహిత్యం గురించి,పాత రచయిత్రుల గురించి మాట్లాడినప్పుడు మామూలు గానే తన అభిప్రాయాలు చెప్తూనే వుంది. భగవద్గీత అంశాలను పాటలుగా రాస్తున్నానని ఫోన్ చేసినపుడు పాడి వినిపించేది. ఫోను చేసినపుడల్లా ఆమెతో " మొత్తం పాటలు తొందరగా రాయటం పూర్తి చేసి పుస్తకంగానో, కేసెట్ గానో చేయమని ప్రోత్సహిస్తూ మాట్లాడేదాన్ని. అప్పటికి అదే ప్రయత్నంలో వున్నానని చెప్తుండేది. 2022 మార్చిలో వీర్రాజుగారి పెయింటింగ్స్ దామెర్ల కళానికేతన్ కి వితరణ చేసిన సందర్భంలో వెళ్ళినప్పుడు కమల వాళ్ళు అమ్మ సుజాతని మేమున్న హోటలుకు తీసుకు వచ్చింది. సుజాత నన్ను గుర్తుపట్టి మాట్లాడిందికాని మధ్య మధ్యలో మౌనంలోకి జారిపోవటం చూసి నేను దిగులు పడ్డాను. అదే నేను ఆమెను ఆఖరు సారి చూడటం. సుజాతకు ఫోను అందుబాటులో లేకుండా అయిపోవటం వలన అమ్మూయికి సందేశాలు పంపి ఆమెగురించి తెలుసుకునేదాన్ని. మాడభూషి లలితా దేవీ,నేనూ సుజాత ను చూడటానికి రాజమండ్రివెళ్ళాలని చాలా సార్లు అనుకున్నాము.కానీ కార్యరూపం దాల్చలేదు. మూడు నెలల క్రితం ఏప్రిల్ లో సుజాత పుట్టినరోజుకి అమ్మాయి కమల నెంబరుకి శుభాకాంక్షలు పంపాను. కమల తన ఫోన్ నుండి నాకు ఫోను చేసి సుజాతకి అందించింది. సుజాత ఫోను చేసి నప్పుడల్లా " ఏమేమి చూసారు? ఇంకేమేమి రాసారు.ఎవరితో సరదాలు తీర్చుకున్నారు " అంటూ పాటతో పలకరించటం అలవాటు, ఎప్పట్లాగే ఆరోజు కూడా అలాగే పలకరించింది. సుజాత అలా పాటతో పలకరించటం, నేను ఫక్కున నవ్వి సమాధానం చెప్పటం ఎన్నేళ్ళుగానో మామధ్యజరుగుతూనే వుండేది. ఇప్పుడు ఆ నవ్వూ తరలిపోయింది.పాటా కరిగిపోయింది. ఎప్పుడో ఒకసారి కాకపోతే ఒకసారైనా ఫోను చేస్తావని ఎదురుచూస్తూ వుండేదాన్ని. "ఆ చిన్నినవ్వుతో ఆ చిలిపి నవ్వుతో ఇంక నన్ను అలా పలకరించేవారు ఎవరు సుజాతా" (స్నేహితులదినోత్సవం రోజున అల్జీమర్స్ తో బాధపడుతూ ఆగష్టు నాలుగో తేదీన కన్నుమూసిన ఆత్మీయ స్నేహితురాలు, రచయిత్రి డి.సుజాతాదేవికి కన్నీళ్ళతో రాసిన అక్షరాంజలి.)

ఇస్కూలు కతలు సమీక్ష

శీలా శుభద్రాదేవిగారి "ఇస్కూలు కతలు" ప్రభుత్వోపాధ్యాయులకెదురయ్యే మొట్టమొదటి సమస్య-అదనపు బాధ్యతలు. పేద పిల్లల కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ మొదలు జనగణన దాకా అన్నింటిలోనూ అయ్యవార్ల పాత్ర ఉండాల్సిందే. ఒక్క మనిషి అన్ని పాత్రలు ఏకకాలంలో ఎలా పోషించగలడనే విషయం ఈ ప్రభుత్వాలకు తెలియదా? మేమేం మనుషులం కాదా? అంటూ ప్రశ్నించడం మొదలుపెడితే అది హక్కుల సాధన వైపుగా నడిపిస్తుంది. ప్రభుత్వాలని బోనులో నిలబెడుతుంది. ఒకవేళ ఆ అయ్యవార్లకే సామాజిక అభివృద్ధిలో తమవంతు పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నామనే ఎరుక కలిగితే? అది బాధ్యతలని మరింత ప్రభావయుతంగా నడిపేవైపుగా ముందడుగు వేయిస్తుంది. అప్పుడు విద్యార్థి అంటే కేవలం విద్యార్థి మాత్రమే కాదనీ అతని కుటుంబ నేపథ్యం కూడా అతనిలోంచీ విడదీయరాని ప్రధానాంశమనే అవగాహన కలుగుతుంది. అది కలిగాలేగానీ అయ్యవార్లకీ పిల్లకాయలకీ మధ్య ఒకానొక బాంధవ్యం పెనవేసుకుపోతుంది. అప్పుడు వారి పట్ల జాలి కలగదు. వారినా పరిస్థితుల్లోంచీ బయట పడెయ్యడం ఎలా? అనే ఆలోచన కలుగుతుంది. అలాంటి ఆలోచనలు రేకెత్తించే కథల పుస్తకమే,"ఇస్కూలు కతలు" పిల్లలకీ తల్లిదండ్రులకీ ఎలాంటి అనుబంధం ఉంటుందో అలాంటి సంబంధమే ఉపాధ్యాయులకీ విద్యార్థులకీ మధ్య కూడా ఉండాలి. అది ఉన్నప్పుడు విద్యార్థుల ప్రశ్నలకి సమాధానాలు మాత్రమే కాదు, వారి సమస్యలకి పరిష్కారాలు కూడా లభిస్తాయి. అలాంటి పరిష్కారాలు కనుగొన్నప్పుడు కలిగే ఆనందాన్ని జీతాలుగానీ, పదోన్నతులుగానీ, హంసతూలికా తల్పాలవంటి సవాలక్ష సుఖాలుగానీ ఇవ్వలేవు. సుఖాల సరిహద్దుల్ని చెరపడానికీ ఆనందపుటంచులు తాకడానికీ తేడా తెలుసుకోవలసిన మొట్టమొదటి బుద్ధిజీవి అయ్యవారే. ఆ తేడా తెలియజేసేవి ఉపాధ్యాయులకు పనిభారాన్ని పెంచే అదనపు బాధ్యతలే. ఆ అదనపు బాధ్యతలు వారికి సమాజంతో నేరుగా"ముఖా-ముఖీ"ని ఏర్పాటు చేస్తాయి. అందుకే ప్రజల సమస్యలు అందరికంటే ఎక్కువగానూ ముందుగానూ అయ్యవార్లకే తెలుస్తాయి. అందుకే ముందు తరాల్ని ఉన్నతీకరించే సాహిత్య సృజనకారుల్లో అధికశాతం ఉపాధ్యాయులే అయివుంటారు. అది అయ్యవార్లకీ అమ్మయ్యలకీ గర్వకారణం. ఒకవేళ సృజనకారులు ఉపాధ్యాయ వృత్తిలో లేకపోయినా వారిలో బోధనా సామర్థ్యం అధికంగా ఉంటుంది. ఎందుకంటే విద్యాబోధనని మించిన సృజనాత్మక కళ మరొకటి లేదు. ఉపాధ్యాయులకు బోధన-విద్యార్థులకు సాధన. ఈ రెండూ అర్థ పూర్ణాలు. వాటిని పరిపూర్ణంగా చెయ్యడం మార్కులు, ర్యాంకులవల్ల కాని పని. ఈ విషయం దాదాపు నాలుగైదు దశాబ్దాలుగా నిరూపితం అవుతూనే ఉంది. దాన్ని అందరికీ తెలియజేసే బాధ్యతని తలకెత్తుకున్న అరుదైన ఉపాధ్యాయిని అరుంధతి. ఆవిడకి సంబంధించిన ముప్ఫై కథలున్నాయిందులో. ఇందులోని కథలన్నీ చిన్నవి. నాలుగు పుటలకి మించవు. కాబట్టీ ఏ కథా చదువరినించీ ఎక్కువ సమయాన్ని తీసుకోదు. వస్తుపరిధిని దాటి ఒక్కవిషయం కూడా ఉండదు. కథకి అవసరంలేని మాట ఒక్కటికూడా కనపడదు. దేనికదే క్లుప్తంగా సూటిగా స్పష్టంగా చెప్పాల్సింది మాత్రమే చెబుతుంది. కనుక చదవడంలో ఎటువంటి ఇబ్బందీ ఉండదు. చాలా సరళమైన భాష. సుభద్రాదేవిగారు స్వతహాగా కవయిత్రి కాబట్టీ కథలన్నీ కవితామయంగానూ తరచి చూస్తే తప్ప కనపడని భావాలతోనూ నిండి ఉంటాయేమోనని సందేహించాల్సిన అవసరం లేదు. కథ చెప్పేటప్పుడు కవయిత్రిలా వర్తించకుండా నిగ్రహం పాటించడం వల్లనే ఇది సాధ్యపడింది. అందుకే అరటిపండు వలిచిపెట్టినంత చులాగ్గా సాగుతుంది పఠనం. ఇందులో కథలన్నీ అయ్యవార్లందరికీ అనుభవంలోకి వచ్చేవే. కనుక ఆయా సందర్భాలెదురైనప్పుడు ఎలా ప్రవర్తించాలో ఎలాటి నిర్ణయాలు తీసుకోవాలో తెలుసుకోవడానికైనా ఉపాధ్యాయులందరూ ఈ కథలు చదవాలి. అందుకే ఈ కథలన్నింటినీ "తెలుగు విద్యార్థి" ధారావాహికంగా ప్రచురించింది. మహారాష్ట్రలోని ఏడవ తరగతి తెలుగు విద్యార్థులకి "ఒకే తాను ముక్కలం"పాఠ్యాంశం. ఇంక కథల గురించి: ఇవి "బాధ్యతల్ని గుర్తు చేసే కతలు"అంటూ కథల తూకం వేశారు గంటేడ గౌరునాయుడు. తరవాత "నామాట"మీదుగా వచ్చి ఉపాధ్యాయులకి "అందరం ఒకేతాను ముక్కలం" అని తెలియజెప్పడం ద్వారా అందరి మనసూ గెలుచుకుంటుంది అరుంధతి. ఆ తరువాతే ఆత్మీయంగా ఆరంభమౌతుంది ఆమె పయనం. ఎవరికైనా నడక ఆరంభించగానే ఎదురయ్యే మొదటి ప్రశ్న..,"ఈ దారి ఎక్కడికి?" దానికి సమాధానమిచ్చే క్రమంలో కొందరు "పరాన్న భుక్కులు"ఎలా ఉంటారో పరిచయం చేసి, విద్యార్థులతో"నువ్వు నేర్పిన విద్యయే"అనిపిస్తారు. ఒకవేళ ఏదైనా "మూఢనమ్మకం"మీద "ఆరాధన" పెంచుకుంటే ఏం జరుగుతుంది? అది "బాధ్యత"లనుండి తప్పించి "పరిస్థితులకు బానిసలు"గా మార్చి "పనిదొంగలు"గా తీర్చి చివరికి "అవును, ఇది సర్కారు బడి మరి!"అనే నైరాశ్యానికి దారితీస్తుంది. "లేత మనసులపై మలిన ముద్రలు" వేస్తుంది. అలాంటప్పుడు పూలబాలలు పెంచిన మంచిని చూపిస్తూ,"ఆమాత్రం చాలు, మనసు పులకించడానికి"అని బుజ్జగిస్తుంది. అంతలోనే కొందరి "మరుగుజ్జు బుద్ధులు"తమ చుట్టూ ఉన్న "పరిసరాలు-పక్కదారులు" తొక్కించే "పందికొక్కులు"ఎలా ఉంటాయో చూపిస్తుంది. వాటినించీ తప్పించుకోవాలనుకునే"లేతమనసులకు, ధైర్యమే లేపనం"అని చెబుతాయి. ఇంతకీ అసలు "తప్పెవరిది?"అని "చేజారిపోతున్న బాల్యం" దీనంగా చూస్తూ"పేదరికపు అంచున"నిరాశా నిస్పృహలతో కర్తవ్య విమూఢంగా నిలబడిపోతుంది. అలాంటప్పుడు ఎవరైనా"లోగుట్టు"కనిపెట్టే ప్రయత్నం చేస్తే"కదిలిన అధికార పీఠం" స్వామికార్యం-స్వకార్యాలని" ఏకకాలంలో చక్కబెట్టగల "భోక్తలు"ఎక్కడ దొరుకుతారా అని గాలించడం మొదలుపెడుతుంది. "సినిక్ సెన్స్" ఎక్కువైతే "కక్కూర్తి కూడా జాడ్యమే"అవుతుందని చెబుతుంది అరుంధతి. అంతేకాదు "ఆఫీసు జలగలు" పట్టుకుంటే "బకాసురుడు" తినడానికి ఎముకలు తప్ప ఏమీ మిగలదని వివరిస్తుంది. అయితే"చాణక్య రాజకీయం"విసిరే "మోహవలయాలు" ఎంత ఆకర్షిస్తున్నా లొంగకుండా ఏమాత్రం లౌల్యానికి లోనుకాకుండా తన జీవితంలో "తృప్తి"ని కలిగివుండి సమాజాన్ని సేవించుకోవడమే ఉపాధ్యాయ వృత్తికి పరమార్థమని నిరూపిస్తూ శీలా సుభద్రాదేవి పరిచయంతో ముగిస్తుంది. శ్రద్ధగా చదివిన ఉపాధ్యాయునికి మాత్రం భవిష్యత్కార్యాచరణకు సంబంధించిన ప్రణాళికా రచనకు తగిన స్ఫూర్తినిస్తుంది. ఏ పుస్తకానికైనా ఇంతకంటే కాగల కార్యం ఏముంటుంది-గంధర్వులు తీర్చడానికి? - jsr Murthy

ఛాయాదేవి గారితో నా అనుబంధం

ఛాయాదేవి గారితో నా అనుబంధం అబ్బూరి ఛాయాదేవిగారు 1994లో అబ్బూరి వరదరాజేశ్వరరావుగారి ఛాయాచిత్రాలు, రచనలు, జ్ఞాపకాలు అన్నింటినీ ‘వరద స్మృతి పేరిట ఒక బృహద్ గ్రంథంగా వెలువరించే సంకల్పంతో శీలా వీర్రాజుగారినీ, కుందుర్తి సత్యమూర్తి గారినీ దాని రూపకల్పనకు సహకరించాల్సిందిగా కోరారు. ఆ సందర్భంలో ఫోన్ల ద్వారా ఛాయాదేవిగారు నాకు పరిచయం అయ్యారు. కుందుర్తి ఆంజనేయులుగారి పెద్దమ్మాయీ, ఛాయాదేవి గారలు తోడికోడళ్ళు. మా కుటుంబానికి కుందుర్తి కుటుంబమంతా ఆత్మీయ బంధుమిత్రులు. అందువలన కుందుర్తి గారి నలుగురు కుమార్తెలు, కుమారుడు సత్యమూర్తి కుటుంబాలలో జరిగే సంతోష సందర్భాలలోనూ, విషాద సన్నివేశాలలోనూ కూడా ఛాయాదేవిగారు నేను కలుసుకోవటంలో నాకు ఆమె మరింత సన్నిహితులయ్యారు. వాసిరెడ్డి సీతాదేవిగారి ఆధ్వర్యంలో సీనియర్ రచయిత్రులందరితో ఏర్పాటైన సఖ్య సాహితి సమావేశాలు ఒక ఏడాదిపాటు రచయిత్రుల ఇళ్ళల్లోనే జరిగేవి. వాటికి చాలాసార్లు ఛాయాదేవిగారితోనే వెళ్ళేదాన్ని. అదేవిధంగా భూమిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రచయిత్రుల సమావేశాలకు బాగ్‌లింగంపల్లికి దగ్గర్లోనే ఉన్న మా పాఠశాల పూర్తయిన తర్వాత ఛాయాదేవిగారింటికి వెళ్ళేదాన్ని. అక్కడ కాస్త సేదతీర్చుకొని సమావేశాలకు కలిసివెళ్ళేవాళ్ళం. ఆ సందర్భంలో ఆమెకు నాకు మధ్య అనేకానేక అంశాలు కలబోసుకునే అవకాశం కలిగింది. నాకు కూడా బొమ్మల తయారీపట్ల ఆసక్తీ, అభిరుచి ఉండడం వలన ఛాయాదేవిగారు తాను చేసిన ప్రతీ బొమ్మనీ చూపి, దాని తయారీని వివరించేవారు. పనికిరావనుకునే వస్తువులను అద్భుత కళాఖండాలుగా మార్చే వారి సృజనాత్మకశక్తికి అబ్బురపడి ఆమెపై మరింత ప్రేమ పెంచుకున్నాను. ‘బొమ్మలు చేయటం ఎలా’ పుస్తకాన్ని, శీలా వీర్రాజుగారికి అంకితం చేసారు ఛాయాదేవిగారు. ఛాయాదేవిగారి మరో సుగుణం ప్రచురితమైన రచన చదవగానే ఫోను చేసి మాట్లాడేవారు. నా ఎనిమిది కవితా సంపుటాలనూ కలిపి ప్రచురించిన సమగ్ర కవితాసంపుటి ‘శీలా సుభద్రాదేవి కవిత్వం’ సంపూర్తిగా చదవటమే కాకుండా అందులోని 195 కవితలకూ, రెండు దీర్ఘకావ్యాలకూ ప్రతీ ఒక్క దానికీ విడివిడిగా వ్యాఖ్యానం రాసి పంపించారు. ‘‘ఎవరైనా పరిశోధకులకు పనికి వస్తుందని రాసాను’’ అని చెప్పిన వారి ఓపిక, సహృదయత నన్ను కదలించింది. అందుకని ఆమెపై గౌరవంతో నా రచనలపై వచ్చిన వ్యాససంపుటి ‘గీటురాయిపై అక్షరదర్శనం’ పుస్తకంలో ఆమె రాసిన అభిప్రాయ మాలికను పొందుపరిచాను. అతి సౌమ్యురాలు, స్నేహశీలి, మృదుభాషిణి కావటాన ఛాయాదేవిగారు అనేకమందికి ఆత్మీయులయ్యారు. పుస్తకం చదివి అభిప్రాయం తెలియజేసే లక్షణం అరుదు. ఆ లక్షణం కూడా ఛాయాదేవి గారిని రచయితలకు దగ్గర చేసింది. బాగ్ లింగంపల్లిలో ఉన్నప్పుడు తరచూ కలిసేదాన్ని. సి.ఆర్. ఫౌండేషన్ కి వెళ్ళాక అయిదుసార్లకన్నా ఎక్కువ కలవలేకపోయాను. ఎనిమిదో తరగతిలో మా మనవరాలు ఛాయాదేవిగారి బోన్సాయి బతుకులు పాఠం చదివి ఆమె గురించి అడిగితే మా అమ్మాయినీ, మనవరాలినీ తీసుకొని వెళ్ళాను. మా మనవరాలు ఆశ్లేషని పరిచయం చేస్తే ‘నా నక్షత్రం కూడా ఆశ్లేషే’ అని ముచ్చటపడిపోయారు. ‘బొమ్మలు తయారుచేయటం ఎలా?’ అన్న పుస్తకాన్నే కాక వారి బంధువులెవరో ఆమె కోసం విదేశాల నుండి తెచ్చి యిచ్చిన కలరింగ్ పుస్తకం, కలర్స్ మా ‘ఆశ్లేషకు ప్రేమతో అమ్మమ్మ’ అని సంతకంతో ఇచ్చారు. ఫోను చేసినప్పుడల్లా పాప గురించి అడిగేవారు. పాలపిట్టలో నేను రాసిన ఇల్లిందల సరస్వతి కథలపై వ్యాసం చదివి నెలరోజుల కిందటే ఫోను చేసి చాలాసేపు మాట్లాడారు. ‘ఎండలు తగ్గాక పిల్లల్ని తీసుకువస్తానని’ అంటే ‘ఇంతదూరం అంత శ్రమపడి రావద్దండీ ఫోనులో మాట్లాడుకుంటున్నాం కదా’ అన్నారు. ఒక సోదరిలా, ఒక ఆత్మీయబంధువులా హృదయానికి దగ్గరగా వచ్చిన సౌజన్యమూర్తి అబ్బూరి ఛాయాదేవిగారు. ఎటువంటి క్లిష్ట సందర్భాన్ని సైతం ఒక చమత్కారంతో తేలికగా తీసుకునే లక్షణం బహుశా జిడ్డు కృష్ణమూర్తి గారి రచనల ద్వారానే వారికి సాధ్యమై వుంటుంది. చివరి రోజున మా యింటికి దగ్గర్లోని డా. సూర్యప్రకాష్ గారి యింట్లోనే ఉన్నారని మొదట్లో తెలియకపోవటంతో కలవలేకపోయాను. జిడ్డు కృష్ణమూర్తిగారి తాత్త్వికతను మనోవాక్కాయకర్మలా నమ్మినవారు, ఆచరించినవారు కనుకనే తన జీవితం ఎలా నడవాలో, ఎలా ముగించాలో నిర్ధారించుకున్నారు. అదే పద్ధతిలో జీవించారు. అదే విధంగా నిష్క్రమించారు. భౌతికంగా దూరమైన తర్వాత నిత్యచైతన్యమూర్తిని, ప్రతీ విషయాన్ని పోజిటివ్ గానే తీసుకునే మనస్వినిని నిర్జీవంగా చూడలేక వెళ్ళలేదు. కానీ ఆమె జ్ఞాపకాలు, మాటలూ స్నేహానుభూతులూ నా మనసులో పదిలంగా ఉన్నంతకాలం నాలో ఆమె చిరంజీవిగానే ఉంటారు. - శీలా సుభద్రాదేవి

2, ఆగస్టు 2024, శుక్రవారం

తాంబూలం పుచ్చుకుందమ సుదతిరో

~ తాంబూలం పుచ్చుకుందమ సుదతిరో ~ డా.జి.వి. పూర్ణ చంద్ గారి " తాంబూలం " పుస్తకం తెరిచేలోపునే ఆంధ్ర కవితాపితామహుడు అల్లసాని పెద్దనగారు 'కవిత్వం రాయడమంటే మాటలా దానికెంత కావాలి' అంటూ చెప్పిన పద్యంలో "నిరుపహతి స్థలంబు రమణీ ప్రియదూతిక తెచ్చియిచ్చు కప్పురవిడెం .... " అంటూ ఇచ్చిన పట్టిక కూడా ఒకసారి గుర్తు చేసుకోక తప్పదు. "తాంబూలాలు ఇచ్చేశాను తన్నుకు చావండీ" అంటాడు అగ్నిహోత్రావధాన్లు కన్యాశుల్కంలో. అయితే తాంబూలాల గురించి మాట్లాడటం తాంబూలాలు ఇచ్చేసినంత సులభం కాదని పూర్ణచంద్ గారి పుస్తకం చదివితే తెలుస్తుంది. ఎందుకంటే అనేకానేక కావ్యాలు ప్రబంధాల దగ్గర నుండి ఆధునిక సాహిత్యం వరకు ఎన్నెన్ని ఉటంకింపులో చదువుతోంటే పూర్ణచంద్ గారి విషయ సేకరణ జిజ్ఞాసకు ఆశ్చర్యం కలుగుతుంది. దానశీలత గల రాయన భాస్కరమంత్రి "జలక మాడుటకింట జల సృష్టి సత్రంబు" 'తాంబూల సత్రంబు ధన్యులకును..' అంటూ పూర్ణచంద్ గారి ఉటంకింపుతో ఒకప్పుడు తాంబూలసత్రాలు వుండేవని తెలుస్తోంది. మరోవిషయం జరుక్ శాస్త్రి పేరడీగా చెప్పిన - వైజాగ్ కారాకిళ్ళీకి -అంతకుముందు పెద్దనగారి పద్యానికి సారూప్యం చెప్పటం కూడా గమనించవచ్చును. పూర్ణచంద్ గారి తాంబూలం పుస్తకంలో తాంబూలానికీ, కవిత్వానికీ, రసికతకూ గల దగ్గర సంబంధాల్ని అనేకానేక ఉదాహరణలతో వివరించారు. మంచికంటి రాజారావు రాసిన కారాకిళ్ళీ ఆత్మకథని మచ్చుకు చెప్పారు.చేమకూర కవి వర్ణించిన తాంబూలనగరాన్ని చూపించారు. శ్రీకృష్ణదేవరాయలు అల్లసాని పెద్దనగారిని ప్రబంధం రాయమని కోరితే కావల్సిన సామాగ్రి ఉంటేనే రాయగలం.కానీ ఎప్పుడంటే అప్పుడెలా రాస్తానని విసుక్కున్నాడంటూనే, నాటి కవులకు కిక్కు యిచ్చేది తాంబూలం అయితే 'నేటి కవులకు కిక్కు నిచ్చేది మరొకటి' అంటూ వ్యంగ్యీకరించారు రచయిత. హిమశైల పుత్రిక పార్వతీదేవి వేసుకున్న తాంబూలపు రసంతో నాకవిత్వాన్ని గుర్రంలా కదను తొక్కించమని కాళిదాసు ప్రార్థించాడట - తాంబూలంతో ఎర్రబడిన దంతాల కెంపుల్నీ వర్ణించిన అన్నమయ్య, శ్యామశాస్త్రి వివరించిన తాంబూల సేవనం , సదాశివ బ్రహ్మేంద్రకవి పూజాస్తుతి శ్లోకంలో కృష్ణుడి తాంబూల రాసలీలను వర్ణించిన తీరునూ తెలియజేసారు తన రచనలో పూర్ణచంద్ గారు . రుక్మాంగద చరిత్రలోని హితవులు-- తమలపాకు చిలకల గురించి ఉత్తరరామాయణంలోని ఉదంతాన్ని-- ఏనుగు లక్ష్మణకవి రచనలోని తాంబూలవిశేషాల్ని చాటిన చాటుకవి పద్యాన్నీ-- హంస వింశతి కావ్యంలో అయ్యల రాజు నారాయణామత్యుల ఉటంకింపుల్ని-- శ్రీనాధుడి చాటువులో కప్పురభోగి వంటకం ప్రసక్తి-- క్షేత్రయ్య పదముల్లో దొంతెరవిడెము-- క్షేత్రాభిరామంలో కిళ్ళీ నమిలే స్టైలు గురించి-- ఆముక్త మాల్యద కావ్యంలో కృష్ణదేవరాయల తాంబూలసేవన వర్ణన-- "పొలుపు దరిగిన నిన్నునభ్యుద్ధరింప రాజ రాజుల సభ గప్పురంబు తోడ నందుకున్నాడు తాంబూలమాంధ్రవాణి శబ్దశాసన కవిలోక చక్రవర్తి " అని జాషువా మహాకవి నన్నయగారిపై పద్యం చెప్పాడనీ వివరించారు రచయిత. ఇలా ఇలా ఎన్నెన్నో కావ్యాలూ, ప్రబంధాలలోంచి తాంబూలానికి సంబంధించిన ఉటంకింపుల గూర్చి చెప్పుకోవాలంటే ముందుగా పూర్ణచంద్ గారి పరిశోధనాత్మక రచనని చదివి అభినందించాల్సిందే. ఇంతవరకూ తాంబూలప్రసక్తి ఉన్న సాహిత్యం గురించి తెలుసుకున్నాం. పూర్ణచంద్ గారు అంతటితో ఆగలేదు. ఆయన ఆయుర్వేద డాక్టరు కదా! ఆ దృష్టి కోణంలో ఎలా రాసారో కూడా తెలుసుకుందాం-- తాంబూలానికి వాడిన తమలపాకులు ప్రపంచ వ్యాప్తంగా 90 రకాలు ఉంటే భారతదేశంలోనే 40 రకాలు పండుతాయట . ఇంక ఆకులలో రకాలూ, వాటి రుచులూ, ఉపయోగాలు సరేసరి. తాంబూలంలో వాడే సున్నం రకాలు-- నత్తగుల్లభస్మం, పగడాలభస్మం, సువర్ణ భస్మం దేనిని ఏ హాదా వారు వాడుతారో తెలిపారు. 20 రకాల బనారసీ పాన్ల గురించి నోరూరేలా చెప్తూ,తాంబూలాలు ఇవ్వటానికి కూడా ప్రోటోకాల్ వుంటుందంటారు పూర్ణచంద్ గారు. తాంబూలాన్ని ఏహోదా కలిగిన వ్యక్తికి ఇస్తున్నారో ఆ స్వీకర్త హోదాని బట్టి ఎన్ని ఆకులు వేయాలి, ఎన్ని వక్కలు వేయాలి అనే నియమాలు ఉన్నాయట చాలా ఆశ్చర్యం కదా!! దేవాలయం సిబ్బందిలో శుభ్రపరిచేవారికీ, పూజారులకు, మంగళవాద్య కళాకారులకు ఇలా ప్రతి ఒక్కరికీ ఎన్నెన్ని ఆకులు ఉండాలి? ఎన్ని వక్కలు పెట్టాలి అన్నది నిర్దేశిస్తూ శాసనాలు ఉన్నాయని చెప్పారు పూర్ణచంద్ . అది మరీ ఆశ్చర్యకరం!!! ఇంతేకాదు వశీకరణకి పనికొచ్చే తాంబూలాల నోములు కూడా తెలియజేసారు. తాంబూలం నమిలే తీరుని బట్టి ఆ వ్యక్తి గుణగుణాలు తెలుసుకోవచ్చని క్రీడాభిరామంలో ఉందంటారు పూర్ణచంద్ . 1939 లో మంచికంటి రాజారావు అనే కవి 'కారాకిళ్ళీ మహోపన్యాసము' అనే పుస్తకంలో కారాకిళ్ళీ ఆత్మకథని, కారా కిళ్ళీ దండకాన్ని, కారా కిళ్ళీ నవరత్నాల్నీ రాశాడట. జానపదులు తాంబూలాలపై పొడుపుకథలు కూడా చెప్పారని సోదాహరణంగా చెప్పారు రచయిత. కాశీయాత్ర చరిత్ర రాసిన ఏనుగుల వీరాస్వామయ్యగారు "మద్రాసు తమలపాకుల కన్నా హైదరాబాద్ ఆకులు రుచికరం" అని రాసారుట. రకరకాల తాంబూలాలతో పాటూ పాన్ స్వీట్ గురించి కూడా చెప్పారు. దాంతో పాటూ 20 రకాల బనారస్ పాన్ స్వీట్ లతో నోరు తీపి చేసారు పూర్ణచంద్ . చివరగా అయిదు పేజీలలో పాఠకుల సౌలభ్యం కోసం తాంబూల నిఘంటువు ప్రచురించి ఈపుస్తకంలో ఉటంకించిన పద్యాలు, శ్లోకాలలో వచ్చిన పదాలకు అర్థాలు తెలియజేయటం ఈ పుస్తకానికి కొసమెరుపు.